Tuesday 15 March 2016

శంకరస్తోత్రాలు : గోవిన్దాష్టకమ్


 


॥ श्री शंकराचार्य कृतं गोविन्दाष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం గోవిన్దాష్టకమ్॥

సత్యం జ్ఞానమనన్తం నిత్యమనాకాశం పరమాకాశమ్ ।
గోష్ఠప్రాఙ్గణరిఙ్ఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ ।
క్ష్మాయా నాథమనాథం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 1 ॥

సత్యస్వరూపుడు , జ్ఞానరూపుడు , దేశకాలాదులచే అంతమనునది లేనివాడును , శాశ్వతుడును , అంతటనూ నిండియున్నవాడును , పరమాకాశమైనవాడునూ , గోశాలలముంగిళ్ళయందు ఆడుకొనుటయందు ఆసక్తి కలవాడును ( గోవులుండు చోటులందు గోవిందుడుండును) , బహు కష్టసాధ్యముల విషయమున కూడ ఆయాసమెరుగని వాడును , పరమ ప్రయత్నము చేతనే తెలిసికొనదగినవాడును , మాయచే కల్పింపబడిన బహువిధరూపములు కలవాడై జగములెల్ల తనయాకారములె అయినవాడును అయిన తాను నిరాకారుడై యుండువాడును , భూదేవికిని - లక్ష్మీదేవికిని భర్తయైనవాడును , తనకంటె పైవాడెవ్వడునూ లేనివాడును , పరమానంద స్వరూపుడును అగు గోవిందుని నమ్రులై కొలువుడు.


మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సన్త్రాసమ్ ।
వ్యదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ ।
లోకత్రయపురమూలస్తమ్భం లోకాలోకమనాలోకమ్ ।
లోకేశం పరమేశం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 2 ॥

ఇక్కడ మట్టి తినుచున్నావా , అని యశోదకొట్టుటయనెడి(తనను కొట్టును) అను చిన్నతనపు బెదిరింపు కలవాడై నేను తినలేదని తెలుపుటకు తెఱిచిన తననోటియందు లోకాలోక పర్వతముదాక నున్న సమస్తలోకములను తల్లికి చూపినవాడును , మూడు లోకములు అను గృహమునకు ఆధారస్తంభమైనవాడును , ఇంద్రియాతీతుడై లోకములకెల్ల సాక్షియైనవాడును, సర్వలోకేశ్వరుడును  , పరమేశ్వరుడును , పరమానంద స్వరూపుడునైన గోవిందుని నమ్రులై సేవింపుడు.


త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ ।
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ ।
శైవం కేవలశాన్తం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 3 ॥

సర్వవాసులకు శత్రువులైన రాక్షసవీరులను చంపువాడును , భూభారమును హరించువాడును, సంసారమనెడి రోగమును  పోగొట్టువాడూను , మోక్షస్వరూపుడును , వెన్నను తినువాడును , నిజమున కేయాహారమునక్కరలేనివాడును , లోకములనెల్ల ప్రళయకాలమున హరించువాడును , మాలిన్యము లేక చక్కనై యుండు మనోవృత్తికి బాగుగా తోచువాడును , చిత్తము నిర్మలముగా లేనిచో ఎంత ప్రయత్నించిననూ తెలియని వాడును , మంగళమయుడును , కేవలుడును , (నిత్యుడు) శాంతుడును , పరమానంద స్వరూపుడును అయిన గోవిందుని కొల్వుడు.


గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ ।
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ ।
గోభిర్నిగదిత గోవిన్దస్ఫుతనామానం బహునామానమ్ ।
గోపీగోచరపథికం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 4 ॥

గోలోక పాలకుడయి యుండియు(సర్వోన్నత లోకపాలకుడు), భూమియందు విలాసార్థము గ్రహించిన గోపాలరూపము కలవాడును , గోపాల కులముతో నిండిన వాడును , గోపికలతోనాడుట , గోవర్థన పర్వతమునెత్తుట , మొదలైన లీలలతో గోపాలసమూహములనెల్ల లాలించువాడును , గోవులు కూడ జపించునట్టి ప్రసిద్ధనామము కలవాడును , మరియు అనేక సహస్రనామములు కలవాడును , ఇంద్రియములకును , బుద్ధికిని తోచు వివిధ మార్గములకు కూడా అందనివాడును , పరమానంద స్వరూపుడును అయిన గోవిందుని నమ్రులై సేవింపుడు.


గోపీమణ్డలగోష్ఠిభేదం భేదావస్థమభేదాభమ్ ।
శశ్వద్గోఖురనిర్ఘూతోద్ధతధూలీధూసరసౌభాగ్యమ్ ।
శ్రద్ధాభక్తిగృహీతానన్దమచిన్త్యం చిన్తితసద్భావమ్ ।
చిన్తామణిమహిమానం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 5 ॥

గోపికలను గుండ్రముగా నిలిపి నానా రూపములను ధరించి క్రీడా విశేషములను కల్పించి వారితో వినోదించువాడును , భిన్న భిన్న రూపములతోను భిన్న భిన్న దశలలో కన్పించుచున్నప్పటికిని భేదమేమిలేని అఖండ తేజ స్వరూపమైన వాడును , ఆవుల గిట్టల తాకిడిచే పైకెగురునట్టి ధూళిచే కప్పబడియున్న శరీరసౌందర్యము కలవాడును , శ్రద్ధచేతనూ భక్తిచేతనూ గ్రహింపబడిన నిజానందము( పరమాత్మను తెలిసికొనుటవలన కలిగిన ఆనందము) కలవాడును , మనసు చేత కూడ ఆలోచింపశక్యము కానివాడును , బాగుగా ఆలోచించు భక్తులకును , యోగులకును సత్స్వరూపముతో కన్పించువాడును , చింతామణి వంటి దివ్యవస్తువులకున్న దివ్యశక్తులను మించిన మహిమ కలవాడును ( అన్నిటి యొక్క శక్తులకు ఆయనయే శక్తి దాయకుడు) పరమానంద స్వరూపుడును అయిన గోవిందునికి ప్రణమిల్లుడు.


స్నానవ్యాకులయోశిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ ।
వ్యదిత్సన్తిరథ దిగ్వస్త్రా హ్యుపుదాతుముపాకర్షన్తమ్ ।
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరన్తస్థమ్ ।
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 6 ॥

వస్త్రములను విడిచి యొడ్డున బెట్టి జలక్రీడలాడుచున్న గోపికల వస్త్రములనపహరించి , చెట్టెక్కి కూర్చున్నవాడై తనమాట ప్రకారము వారు దిగంబరలై , యావస్త్రములను తీసుకొనుటకు అంగీకరింపగా , ఇవిగో అందుకొనుడు అని వారికందియు నందనట్లు చేయుచూ వారిని దగ్గరగా రప్పించుకొనుచు , కామకుడు వలె తోచువాడైనను , శోకమోహములకు దూరుడై , జ్ఞానియై , బుద్ధిగోచరుడై , సత్స్వరూపుడై , పరమానందరూపుడైన గోవిందుని మ్రొక్కుడు.


కాన్తం కారణకారణమాదిమనాదిం కాలమనాభాసమ్ ।
కాలిన్దీగతకాలియశిరసి ముహుర్నృత్యన్తం నృత్యన్తమ్ ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ ।
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 7 ॥

దేవగణ బృందములచే నారాధింపబడుచు లోకములెల్ల నమస్కరింపదగు బృందావనమున మొల్ల పూలవలె తెల్లనై నిర్మలమైన చిరునవ్వుతో అమృతానందము చిందించుచు మహానంద స్వరూపుడై లోకముల వారందరూ నమస్కరించు మహామునులచేతనూ , మనస్సులలో ధ్యానింపబడుచు , నమస్కరింప బడుచున్నవై ఆనందసంధాయకములైన పాదద్వంద్వము కలవాడై , పరమానంద స్వరూపుడై మెచ్చుకొనదగిన సుగుణములకు నిధియైన గోవిందుని ప్రణమిల్లుడు.


వృన్దావనభువి వృన్దారకగణవృన్దారాధ్యం వన్దేఽహమ్ ।
కున్దాభామలమన్దస్మేరసుధానన్దం సుహృదానన్దమ్ ।
వన్ద్యాశేషమహామునిమానసవన్ద్యానన్దపదద్వన్ద్వమ్ ।
వన్ద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిన్దం పరమానన్దమ్ ॥ 8 ॥

అందమైనవాడును , మాయాది కారణములకు కారణమైనవాడును , లోకములకన్నిటికిని ఆదియైనవాడు , తనకు మాత్రము ఆదిలేనివాడును , నల్లని మబ్బు వంటి శరీరచ్ఛాయకలవాడును , కాళిందీనది(యమున) యందున్న కాళియ సర్పము యొక్క శిరస్సునందు మనోహరముగా నిరంతర నృత్యము చేయువాడును , కాలస్వరూపుడై కాలకళలకు(అంతర్భాగములకు) అతీతుడై సర్వవ్యాపకుడై కలిదోషములను హరించువాడై భూత భవిష్యత్ వర్తమాన కాలములకు తానే కారకుడై పరమానంద స్వరూపుడైన గోవిందుని నమ్రులై కొలువుడు.


గోవిన్దాష్టకమేతదధీతే గోవిన్దార్పితచేతా యో ।
గోవిన్దాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిన్దాఙ్ఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో ।
గోవిన్దం పరమానన్దామృతమన్తఃస్థం స తమభ్యేతి ॥ 9 ॥

గోవిందుని యందు మనస్సుని నిలిపి గోవిందా!అచ్యుతా! మాధవా! విష్ణూ! గోకులప్రభూ! కృష్ణా! అనుచు తదేకధ్యానముతో ఈ గోవిందాష్టకమును పఠించువాడు గోవింద పాదారవింద ధ్యానామృతముచేత సమస్త పాపములు క్షాళితములయి పరమానంద స్వరూపుడై ఆత్మ రూపమున తనలో నున్న పరమాత్మలో కలిసి ధన్యుడు కాగలడు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం గోవిన్దాష్టకమ్ సమ్పూర్ణమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.