పరమాచార్యుల అమృతవాణి : మాతృ ధర్మము
(జగద్గురువుల ఉపన్యాసాలనుండి)
(జగద్గురువుల ఉపన్యాసాలనుండి)
కీర్తిఃశ్రీ వాక్చనారీణాం.
అని గీతలో నిభూతియోగాధ్యాయమున కలది. ఒక ఉపనిషత్తులో నొకబాలకునిచూచి ఒకఋషి 'నీవుమంచి తల్లినికలవాడవు. మంచి తండ్రినికలవాడవు, మంచి గురువు కలవాడవు- అని నాకు తోచుచున్నది' అని చెప్పినట్లున్నది. అందులో మొదట 'మాతృమాన్' అనికలదు. అనగా కుటుంబము స్త్రీల అధీనము. కాబట్టి తల్లి సద్గుణములుకలది అగుచో బిడ్డగూడా అట్టి గుణములు గలవాడేయగును- గీతల్లో చెప్పినట్లు ఏస్త్రీవద్ద మంచిగుణములు; కుటంబ నిర్వహణశక్తి; అతిథి; అభ్యాగతుల చక్కగ విచారించి ఆదరించుట యుండునో ఆకుటుంబము దినదినమభివృద్ధిగాంచును- పిదప పితృమాన్;ఆచార్యవాన్; అని కలదు.
స్త్రీమూలం జగత్సర్వం, స్త్రీమూలః సర్వధర్మః.
అనికూడా శాస్త్రములు చెప్పుచున్నవి. కాబట్టి బిడ్డలను చదువు అను మిషతో గాని మరొక కారణముతో గాని దూరదేశములకంపక పది సంవత్సరములైనను తల్లిదగ్గరనే ఉంచుటమంచిది. ఈవిషయమున తల్లులు బిడ్డల కెక్కుడు సాయమొనర్పవలెను. అందుకు సాహిత్యమత్యవసరము. ప్రభుసమ్మితము, సుహృసమ్మితము, కాంతాసమ్మితమని సాహిత్యము ముత్తెఱంగులు. ఇంతవరకు జీవుడుత్తమగతి పొందుటకు చిన్నప్పుడు తల్లి చాలా ప్రయోజనకారి అని చెప్పినాను. తల్లులంతయూ అట్టి ఘనకార్యమునకు పూనవలెను. భక్తిగా స్త్రీలంతయు భగవంతుని నామోచ్చారణమొనర్చి పిల్లలచే చేయించవలెను- అది తరించడానికి సులభమార్గము- మఱియు పిల్లలను సాధ్యమైనంతవరకు అసత్య మాడకుండునట్లు చేయవలెను-
'అశ్వమేధసహస్రాచ్చ సత్యమేవగరీయః'
వేయి అశ్వమేథయాగముల ఫలము నొకతట్టును; సత్యము నొకతట్టును పెట్టి తూచినప్పుడు యాగఫలముల 'సిబ్బి' చివ్వున పైకిపోయినదట. తండ్రి సత్యముగానుండిన అది తనకొరకే అవును. తల్లి సత్యముగా నుండినపక్షమున బిడ్డలుకూడా తరించెదరు. స్త్రీలందరును ముఖ్యముగ భగవద్భక్తిని; సత్యమును బాలులకలవాటు చేయించవలెను. అదియేవారిధర్మము-అందుకు రామాయణాది గ్రన్థముల సాధనముగ నుంచుకొనవచ్చును. స్త్రీలకింతకుమించిన దేశసేవలేదు. భగవన్నామస్మరణకు బ్రాహ్మముహూర్తము శ్రేష్ఠమైనది. కాబట్టి స్త్రీలు తెల్లవారుఝూముననేలేచి భగవంతుని స్మరించుచుండినచో బిడ్డలుకూడా కొంతకాలమునకా యలవాటే కలవారగుదురు-ప్రాచీనకాలమునందిట్టి యాచారము స్త్రీలయందధికముగ నుండెడిది- సత్యమును స్త్రీలందరును పాటించవలెను- అప్పుడు బిడ్డలు తల్లులజూచి సత్యప్రతపాలనమున కుపక్రమింతురు- అప్పుడు స్త్రీలందరును అందరకు ఆదర్శప్రాయులు కాగలరు. ఇదియే స్త్రీలధర్మము.