Sunday 6 March 2016

శివస్తుతులు : మహామహిమాన్వితమైన సంధ్యాకృత శివ స్తుతి (శివపురాణం)




శివస్తుతులు : మహామహిమాన్వితమైన సంధ్యాకృత శివ స్తుతి
(శివపురాణం)


నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్‌ |
అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం
తస్మై తుభ్యం లోకకర్రై నమోస్తు ||
సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞాన గమ్యం స్వప్రకాశేవికారమ్‌ |
ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గా త్పరస్తా ద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నమ్‌ ||
ఏకం శుద్ధం దీప్యమానం తథా జం చిదానందం సహజం చావికారి |
నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే ||
గగనం భూర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవ చ | పునః కాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే ||


నీవు నిరాకారుడవు. నీ సర్వాతీతమగు తత్త్వము జ్ఞానము చేత మాత్రమే పొందదగును. నీ రూపము స్థూలము గాని, సూక్ష్మముగాని, ఉన్నతముకాని కాదు. యోగులు నీ రూపమును తమ హృదయములో ధ్యానించెదరు. లోకకర్తవగు నీకు నమస్కారము . సర్వవ్యాపకము, శాంతము, దోషరహితము, జ్ఞానముచే పొందదగినది, స్వప్రకాశమునందు వికారములు లేనిది, సంసారమనే తమో మార్గమున కతీతముగా చిదాకాశముందు యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపము గల, దయామయుడవగు నీకు నమస్కారము. అద్వయము, శుధ్ధము, ప్రకాశించునది, పుట్టుక లేనిది, చిద్ఘనము, ఆనందఘనము, వికారములు లేనిది, స్వరూప భూతము, శాశ్వతా నందరూపము, సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదలనిచ్చునది అగు రూపము గల నీకు నమస్కారము. ఆకాశము, భూమి, దిక్కులు, నీరు, అగ్ని , కాలము అనునవి నీ రూపములే . అట్టి నీకు నమస్కారము.

విద్యాకారో ద్భావనీయం ప్రభిన్నం సత్త్వచ్ఛందం ధ్యేయమాత్మ స్వరూపమ్‌ |
సారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే ||
యత్త్వాకారం శుద్ధ రూపం మనోజ్ఞం రత్నా కల్పం స్వచ్ఛ కర్పూర గౌరమ్‌ |
ఇష్టాభీతి శూలముండే దధానం హస్తైర్నమో యోగయుక్తాయ తుభ్యమ్‌ ||
ప్రధానపురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ | తస్మా దవ్యక్తరూపాయ శంకరాయ నమో నమః ||
యో బ్రహ్మా కురుతే సృష్టిం యో విష్ణుః కురుతే స్థితమ్‌ | సంహరిష్యతి యో రుద్రస్తస్మై తుభ్యం నమో నమః ||
త్వం పరః పరమాత్మా చ త్వం విద్యా వివిధా హరః | సద్బ్రహ్మ చ పరం బ్రహ్మ విచారణ పరాయణః ||


మిథ్యా జగత్తు కంటె భిన్నమైనది, సత్త్వగుణ ప్రధానమైనది, ప్రత్మగాత్మ కంటె అభిన్నమైనది అగు నీ రూపము జ్ఞానము చేత మాత్రమే తెలియబడును. భక్తులచే ధ్యానింపబడునది, సార భూతమైనది, అలౌకికమైనది, పావనము చేయు తీర్థాలను కూడ పావనము చేయునది అగు రూపముగల నీకు నమస్కారము. నీ రూపము శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమగు కర్పూరమువలె తెల్లనైనది. చేతులతో అభయవరదముద్రలను, శూలమును, కపాలమును ధరించిన యోగీశ్వరుడవగు నీకు నమస్కారము. ఎవని శరీరమునుండి ప్రధానము, పురుషుడు ఉద్భవించినవో, అట్టి ఇంద్రియ గోచరము కాని రూపము గల శంకరునకు అనేక నమస్కారములు. బ్రహ్మ రూపములో సృష్టిని, విష్ణు రూపములో స్థితిని, రుద్ర రూపములో సంహారమును చేయు నీకు అనేక నమస్కారములు. నీవు సర్వశ్రేష్ఠుడవు. పరమాత్మవు. వివిధ విద్యలు నీ స్వరూపమే నీవు హరుడవు. జ్ఞానముచేత మాత్రమే లభ్యమయ్యే సద్ఘనుడగు పరబ్రహ్మ నీవే,

నమో నమః కారణకారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ |
సమస్తలో కాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ ||
యస్యాపరం నో జగదు చ్యతే పదాత్‌ క్షితిర్దిశస్సూర్య ఇందు ర్మనోజః |
బహిర్ముఖా నాభితశ్చాంతరింక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోస్తు ||
యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః | కథం స్తోష్యామి తం దేవం వా ఙ్మనోగోచరం హరమ్‌ ||


సర్వకారణకారుణుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము. భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, మన్మథుడు ఇత్యాది జగత్తు శివుని కంటె భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే గాక, బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమమే. ఆయన నాభినుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో! అట్టి నీకు నా నమస్కారము. ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవని నుండి జగత్తు పుట్టినదో అట్టి, వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను?.

యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనాః | న విప్రణ్వంతి రూపాణి వర్ణ నీయాః కథాం సమే ||
స్త్రి యా మయా తే కింజ్ఞేయా నిర్గుణస్య గుణాః ప్రభో | నైవ జానంతి యద్రూపం సేంద్రా అపి సురాసురాః ||
నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ | ప్రసీద శంభో దేవేశ భూయో భూయో నమోస్తుతే ||


ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులగు మునులు కూడ వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను ?. హే ప్రభూ! ఎవని రూపమును ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడ తెలియ జాలరో, ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను?. ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. తపస్స్వరూపుడవగు హే శంభో! నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవా! నీకు అనేక నమస్కారములు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.