Monday 27 November 2017

అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము (1 - 5)



అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము
(1 - 5)

శ్రీ పార్వతీసుకుచకుఙ్కుమరాజమాన
వక్షస్థలాఞ్చితమమేయగుణప్రపఞ్చమ్ |
వన్దారుభక్తజనమఙ్గలదాయకం తం
వన్దే సదాశివమహం వరదమ్మహేశమ్ ||


శ్రీ పార్వతి వక్షస్థలమునందలి కుంకుమతో (పరస్పరాలింగనముద్వారా) శోభిల్లుతున్న వక్షస్థలము కలవాడూ, అనంతములైన గుణములు కలవాడూ , నమస్కరించు భక్తజనులకు శుభములను, వరములను ప్రసాదించువాడూ అగు మహైశ్వర్యములుగల సదాశివునకు నమస్కరించెదను.

నన్దన్నన్దనమిన్దిరాపతిమనోవన్ద్యం సుమన్దాకినీ
స్యన్దత్సున్దరశేఖరం ప్రభునుతమ్మన్దారపుష్పార్చితమ్ |
భాస్వన్తం సురయామినీచరనుతం భవ్యమ్మహో భావయే
హేరమ్బం హిమవత్సుతామతిమహానన్దావహం శ్రీవహమ్ ||


ఎల్లరనూ సంతోషింపచేయుకుమారుడూ  (లేదా ఎల్లరనూ సంతోషింపచేయు నందనవనమునే సంతోషింపచేయువాడూ), విష్ణువుచే మనస్సున నమస్కరింపబడువాడూ,  ఆకాశగంగను చిందించు సున్దరకేశపాశము గల వాడూ, మందారపుష్పములతో పూజింపబడువాడూ, రాజులచేత, దేవదానవులచేతనూ స్తుతింపబడువాడూ, గొప్ప తేజోమూర్తీ, పార్వతికి మహానన్దమును కలిగించువాడూ, జ్ఞానసూర్యుడై ప్రకాశించుచున్న వినాయకుడిని ధ్యానించుచున్నాను.

ఆలోక్య బాలకమచఞ్చలముచ్చలత్సు
కర్ణావిబోధితనిజాననలోకనం సః |
సామ్బస్స్వమౌలిసుభగాననపూత్కృతై స్త
మాలిఙ్గయన్నవతు మామలమాదరేణ ||


బాగుగా కదలుచున్న చెవులవలన తన ముఖము కనుబడకున్నా అచంచలుడైన వినాయకుని చూచి, ఆదరముతో తన శిరముపైనున్న గంగా తరంగములతో (అవియే చేతులుగా) ఆలింగనముచేసుకున్న శివుడు నన్ను రక్షించుగాక. ఇది చాలును.

కణ్ఠోత్పలం విమలకాయరుచిప్రవాహ
మర్థేన్దుకైరవమహం ప్రణమామి నిత్యమ్ |
హస్తామ్బుజం విమలభూతిపరాగరీతి
మీశహ్రదం చటులలోచనమీనజాలమ్ ||


దీక్షితులు శివుని ఒక మంచినీటి చెరువుతో పోల్చుచున్నారు. అతని కంఠం నల్ల కలువ. దేహకాంతి ప్రవాహము. శిరమునందలి అర్ధచంద్రుడు తెల్ల కలువ. చేతులు కమలములు(ఎర్రనివి). శరీరము నందలి తెల్లని విభూతి పూత పుప్పొడి. ఆయన కన్నులు చేపలు. కావున శివుడొక హ్రదమే అయి ఉన్నాడు. ఆయనకు ప్రతిదినమూ మ్రొక్కెదను.

రఙ్గత్తుఙ్గతరఙ్గసఙ్గతలసద్గఙ్గాఝరప్రస్ఫుర
ద్భస్మోద్ధూలితసర్వకాయమమలమ్మత్తేభకృత్యావృతమ్ |
ఆరూఢం వృషమద్భుతాకృతిమహం వీక్షే నితమ్బస్ఫుర
న్నీలాభ్రచ్ఛురితోరుశృఙ్గమహితం తం సన్తతమ్మానసే ||


భస్మోద్ధూళితమైన అయిన శివుని శరీరము ఉత్తుంగ తరంగముల గంగా ప్రవాహంచే ప్రకాశించుచున్నది.  అద్భుతాకారముగల వృషభమును అధిరోహించి, గజచర్మముచే చుట్టబడిన నితమ్బమూ, క్రిందిభాగమూ, నీలమేఘముచే ప్రకాశించు పర్వతమో అన్నట్లున్న ఆ శివుని ఎల్లప్పుడూ నా మనసున దర్శించుచున్నాను.




ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.