Tuesday 22 March 2016

పరమాచార్యుల అమృతవాణి : హిందువుల సామాన్యధర్మాలు : ధ్యానం, దానం, పరోపకారం


పరమాచార్యుల అమృతవాణి : హిందువుల సామాన్యధర్మాలు : ధ్యానం, దానం, పరోపకారం
(జగద్గురుబోధలనుండి)

మొట్టమొదటి విషయం ప్రతిహిందువూ తాను హిందువుగా జీవించడము నేర్చుకోవాలి. 'ఒకనికి తన మతంలో విశ్వాసమూ, భావమూ లేనపుడు వాడు మతంలో ఉన్నా లేనివాడే ఔతున్నాడు. ఇతర మతాల వారికంటే, మతంలోనే ఉంటూ విశ్వాసం లేకుండా ప్రవర్తించేవాడు మతానికి చేసే గొప్ప హాని.

ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది. 1937 లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి రాజాజీ. ఆరోజులలో ఈ విషయం జరిగింది. మనలో 18 ఏండ్ల లోపల ఉన్న పసిపిల్లలు నేరాలు చేస్తే వాళ్ళను పట్టుకొని స్కూళ్ళలాంటి జైళ్ళలో పెడతారు. వయస్సులో చిన్నవాళ్ళు కనుక పెద్దవాళ్ళయిన ఖయిదీల మాదిరికాక, వాళ్ళలో మానసిక పరివర్తన తెచ్చుటకు నీతివిషయాలు బోధిస్తూ వుంటారు. అది మొదటి నుంచీ వస్తున్న విషయమే కానీ అంతవరకు ఇంగ్లీషు వాళ్ళ పాలన వుండేది కనుక, ఈ నీతులను బోధించేవారు క్రైస్తవ మిషనరీలు ఆరోజులలో మనం ఏమీ అనేందుకు వీలు వుండేది కాదు. ఇక కాంగ్రెసు అధికారంలోకి రాగానే మనకు కొన్ని అధికారాలు లభించాయి.

రాజాజీ, ఆ బాలనేరస్థులకు నీతిబోధ చేసే విషయం గూర్చి బాగా ఆలోచించారు. సామాన్యంగా మనదేశంలో హిందువులు హెచ్చుకనుక, ఆ బాలనేరస్థులలోనూ హిందువుల సంఖ్య హెచ్చుగా ఉండేది. అందరికీ క్రైస్తవకథలూ, నీతులూ, ఉపదేశించడానికి బదులు, ఏ మతం వాళ్ళకు ఆ మతానికి చెందిన వారిచేత నీతిబోధ చేయిస్తే మంచిదని, వారానికి ఒక రోజు ఆ బాలనేరస్థులకు, నీతిబోధకై సెలవు ఇచ్చే ఏర్పాటు చేశారు. మహమ్మదీయబాలురు తమకు శుక్రవారం ముఖ్యం కనుక ఆ రోజు సెలవు ఇవ్వవలసినది కోరారు. ఆరోజు మసీదుకు వెళ్ళి నేర్చుకొంటామన్నారు. క్రైస్తవులు తమకు చర్చీకి వెళ్ళటానికి ఆదివారం సులువుగా వుంటుందని ఆరోజు సెలవు కోరారు. హిందువులను అడిగితే వారికి ఏ రోజు చెప్పడానికీ, తోచక, మాకూ ఆదివారమే ఇవ్వండి అని అడిగారు. సరే ముగ్గురినీ వదిలారు. మహమ్మదీయ మౌల్వీవచ్చి, వాళ్ళను మసీదుకు తీసుకొని వెళ్ళాడు. క్రైస్తవులేమో చర్చికి వెళ్ళారు. హిందూబాలురను తీసుకొని పోయిన పెద్దమనిషి హిందువుల ధర్మమువారితో బాటు సినిమాకు వెళ్ళాడట! ఇది చాల దయనీయమైన స్థితి.

దీని నుంచీ మనం బయటపడాలి. అందుకు మనమేమి చేయాలి? మనలోని లోపాలను ఆత్మపరీక్ష చేసుకొని పోగొట్టుకోవాలి. ఇది ఎట్లా సాథ్యం?

మన ధర్మశాస్త్రాలలో విశేష ధర్మాలనీ, సామాన్య ధర్మాలనీ రెండు రకములున్నవి. వర్ణాశ్రమవ్యవస్థను పాటించే వారికి విశేషధర్మాలున్నాయి. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలి. అధ్యయనం చేయాలి. ఇవి విశేషధర్మాలు. వర్ణాశ్రమ వివక్షతలేక, మానవమాత్రులందరూ అనుష్టించ దగినవి సామాన్య ధర్మాలు. ఇవి హిందువులకేకాక, మానవులందరికీ అనుప్ఠేయాలు. 'ఏతాన్‌ ధర్మాన్‌ సమాసేన' అంటూ సామూహికంగా వానిని జీవితంలో అనుష్ఠించవలసిన ఆవశ్యకత సూచింప బడినది. అవి మనం ముఖ్యంగా హిందువులు అనుష్ఠించాలి. భారతదేశంలోనే వీనిని మనం అనుష్ఠించకపోతే హిందూత్వం అంటూ ఇక్కడ ఉన్నదని చెప్పుకోలేము. అపుడు ఇతర దేశములలో ఉన్న హిందువులకు ఏవిధంగానైనా మనము సహాయపడలేము. విశ్వహిందూ పరిషత్తు లక్ష్యమే దెబ్బతింటుంది. కనుక, ఈ సామాన్యధర్మాలను మనం విధిగా అనుష్ఠించాలి.

ఈ సామాన్య ధర్మాలేవి? ప్రతిరోజూ ధ్యానంచేయాలి. కనీసం మూడునిముషాలైనా ఏకాగ్రతతో తమకు ఇష్టమైన దైవాన్ని గురించి ధ్యానం చేయాలి. ధ్యానం చిత్తశుద్ధికి తోడ్పడుతుంది. దానివలన మనస్సు నిర్మల మౌతుంది. మనస్సుకు చీకూచింత అంటూ వుండదు. ఒకవేళ సమస్యలు ఉన్నా అవి మనలను అంతగా కలవర పెట్టవు. ఇక రెండవ విషయం దానం. దానం చేయటం హిందువు ఐన వానికెల్లా సామాన్యధర్మం. దాన స్వరూపం అనేక విధాలుగా వుంటుంది. శరీరంతో, ధనంతో, బుద్ధివైభవంతో ఇతరులకు మనం సహాయపడవచ్చు.

అది అంతా దానమే ఔతుంది. దానం మానవుల కందరికీ సామాన్య ధర్మం. అది చేయడానకి తగిన యోగ్యత సంపాదించుకోవాలి. ఒక స్త్రీమీద ఆత్యాచారం జరుగుతుందని అనుకోండి. అపుడు చూస్తూ ఊరుకోరాదు. అత్యాచారం చేసే దుర్మార్గులను ఎదుర్కొనిపోరాడి ఆ స్త్రీని రక్షించాలి. ఇది ఒక విధమైన దానం. శరీరబలం ఇక్కడ వినియోగమౌతున్నది. మనకు బలసాహసాలున్నపుడే ఇతరులకు తోడ్పడగలం. అందుచేత చక్కగా వ్యాయాయం చేసి శరీరబలం పెంచుకోవాలి. ధ్యానంచేత మనోబలం, ఆత్మబలం పెంచుకోవాలి. కేవలం ధనబలమే చాలదు-ఉపయోగించదు. ఆత్యాచారం జరుగుతున్నపుడు శరీరబలం సహాయపడుతుంది. కానీ, ధనం వుంటే ఏమిచేయగలదు? కనుక మొదట ధ్యానం, తరువాత దానం. ఈ రెండూ చేయకలిగితే చాలు. ఇందుకోసం మనం అన్నిశక్తులనూ పెంచుకోవాలి. బుద్ధీ, బలమూ, ధైర్యమూ సంపాదించుకోవాలి.

ఇందులకు మనకు ఆదర్శ పురుషుడు ఆంజనేయస్వామి ఆయనను తలచుకొని, ఆయనను ఆదర్శంగా వుంచుకొని, ఆయనలాగు సర్వాంగ సుందరంగా జీవితాన్ని, సుందరకాండ చేసుకోవాలి. ఆయన జీవితమంతా ఇతరులకు సహాయం చేయటంలో గడిచిపోయింది. ఆయన్ను స్మరిస్తే మనకన్నీ సమకూరుతవి.

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా!
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమ త్స్మరణాద్భవేత్‌ ||

బుద్ధిబలం, శరీరబలం, కీర్తి, సాహసం, ధైర్యం, ఆరోగ్యము, నిర్భయత్వం, చురుకుదనం, వచన చాతుర్యం - ఇలాంటి సద్గుణములకు నెలవు ఆ మహావీరుడు. ఆయననే ఆదర్శంగా పెట్టుకొని ఆయనను ధ్యానం చేస్తూ వచ్చామంటే ఆగుణాలు అలవడుతాయి. అపుడు మనం ఎంతమందికైనా సాయపడవచ్చు. మనలో ప్రతిఒక్కరూ ఈ విధంగా నడచుకొంటే సామూహికంగా హిందుత్వం వృద్ధి పొందుతుంది.

ఈ సందర్భంలో ఒక సందేహం రావచ్చు అందరు ధనికులుగా ఉండరు. అందులో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్న ఈ రోజులలో ఎంతడబ్బు సంపాదించినా చాలటంలేదు కాబట్టి ఇతరులకు శక్తికొలది సహాయ పడదామనే సత్సంకల్పం కలిగి వున్నప్పటికీ అలా సహాయపడలేక పోతున్నారు. నిజమే. ఇందుకు మాకొక సమాధానం తోచింది. దానినే మేము మాట్లాడే ప్రతిచోటా ఆస్తికులయిన వారికి చెబుతున్నాం. మనకు ఉన్నదానిలోనే మనం ఇతరులకు మన కంటే దైన్యం అనుభవిస్తున్న వారలకు సహాయపడగలం. ఈ సహాయం ధనరూపంలోనే వుండ నక్కరలేదు. మనలో ప్రతి ఇంటిలోనూ ప్రతిగృహిణీ అన్నం వండేటందుకు ముందు ఒక పిడికెడు బియ్యం తీసి భగవదర్పణముగా పసుపుదారం కట్టిన ఒక చిన్న పాత్రలో వేయాలి. వీలయితే దానితోబాటు ఒక పైసాకూడ అందులోనే వేయవచ్చు. అది 'అన్నపూర్ణపాత్ర' 'ధాన్యలక్ష్మి పాత్ర'. ఇలా ఒక వారం రోజులలో పోగయిన బియ్యాన్ని అందుకు పాత్రుడు అని మనకు తోచిన బీదవానికి ఇచ్చివేయాలి. దగ్గరలో దేవాలయం ఏదైనావుంటే ఇలా సమకూడిన బియ్యం పైసలూ అక్కడ ఇచ్చి సద్వినియోగానికి ఏర్పాటు చేయాలి. ఆలయం లేనిచోట తమకు తామే నిజంగా కష్టపడుతున్న పేదవారికి ఇవ్వాలి.

ఈ పరోపకారం క్రొత్తకాదు. మనమతంలో అనాది నుంచీ వున్నది. అంతేకాదు..... ఈ పని తోటి మానవుల క్షేమం కోసమేకాక, ప్రతి ప్రాణికీ సహాయపడేటట్లు మన ధర్మ శాస్త్రాలు విధిస్తున్నవి. ఇప్పటికీ కొందరు పూర్వాచారాలు అనుష్ఠిస్తున్న బ్రాహ్మణ కుటుంబీకులు వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసేముందు బలిహరణం అని వేస్తారు. దాని అంతర్యం చాలాగొప్పది. ఈ విశ్వాంతరాళంలో ఎన్నో లోకాలు క్రిందా పైనా వున్నాయి. దానిలో ఎన్నో కోట్ల జీవరాసులు. వీనికన్నిటికీ తృప్తి కలగాలన్న సద్భావంతో వైశ్వదేవ బలిహరణాదులు ఇవ్వబడుతున్నవి. ఈ విధమైన భూత తృప్తి భోజనాత్పూర్వమే కాక భోజనానంతరం కూడా ఉత్తరాపోశన పట్టునపుడు ఇతర ప్రాణులను ఉద్దేశించి చేయబడుతున్నది.

ఆ ప్రాణులు రౌరవాది నరకాలలో ఉన్న వాళ్ళైనాసరే, పుణ్యలోకాలలో ఉండే వారైనా సరే కోట్లు, అర్బుదాల సంఖ్యలో వుండేవారందరూ కూడ భోజనానంతరం మనం తృప్తిపడినట్లు, ఈ ఉదకంతో తృప్తిపడాలనే జీవకళ్యాణ భావం, జీవ కారుణ్యభావం ఆమంత్రంలో ఇమిడివుంది. వారందరూ అమృతపానం చేసినట్లు ఆనందించాలి.

అమృతాఫిధాన మసి.
రౌరవేపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం
అర్థినాం ఉదకం దత్తం
అక్షయ్య ముపతిష్ఠతు||

ఇలాంటి మంత్రాలు భావాలు ఈనాడు లోపించినవి. కనుకనే. నేటి హిందువు ప్రపంచానికీ తనకూ పనికిరానివాడై పోతున్నాడు. అందుచేత హిందువు హిందువుగా రూపొందితే కానీ మనకు కృతకృత్యత లేదు. హిందూమతం అంటే ఒక్క భారతదేశానికే కాదు సంబంధించినది. అది విశ్వమతము.

కనుక ధ్యాన, దాన, పరోపకారాలనే సామాన్య సూత్రాలమీద ఆధారపడిన హిందూ మత నవనిర్మాణం నేడు జరగాలి, అపుడు అది విశ్వధర్మమే అవుతుంది.

నిజమైన హిందువు భీరువుగా వుండటానికి వీలులేదు. ఇదం బ్రాహ్మ్యం - ఇదం క్షాత్రం' అన్నట్లు అధ్యాత్మబలాన్నీ శరీరబలాన్నీ హిందువులు వృద్ధిపరుచుకోవాలి. ప్రతి ఒక్కరూ మనమతానికి 'క్షతి' గాయం తగులకుండా దానిని రక్షించుటకు క్షత్రియులం కావాలి. 'క్షతాత్‌ కిల త్రాయతే ఇతి క్షత్రియః' అన్నది క్షత్రియ నిర్వచనం. సర్వ మానవులకు ప్రాణులకూ తోడ్పడేటందుకు సిద్ధంగా వుండాలి. దానికి వలసిన సాధన సంపత్తి, ధ్యానబలం, శరీరబలం పరోపకారభావం అలవరుచుకోవాలి. అపుడే మనం నిజమైన హిందువులం కాగలం.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.