Saturday 29 April 2017

శంకరచరితామృతము : 8 : మండనమిశ్రులపై విజయం



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 8
మండనమిశ్రులపై విజయం

@ శంకరవాణి

వ్యాసులవారు ఆదేశించినట్లు శ్రీ శంకారాచార్యులవారు దిగ్విజయం గావించేరని వెనుక చెప్పేము. వారి దిగ్విజయాన్ని గూర్చి కొన్ని వివరాలు మనం గమనించాలి. దిగ్విజయానికై ఆచార్యులవారు మున్ముందు తూర్పుగా పయనించేరు. ఆచార్యులవారు దిగ్విజయానికై బయలుదేరి ప్రయాగకు వెళ్ళి అప్పటికే తుషాగ్నిప్రవేశం గావించి ఉన్న కుమారిలభట్టును కలిసికొన్నారని, కేవలకర్మమార్గాన్ని అనుసరించడంవల్ల ప్రయోజనం ఉండదని వారికి బోధించి వారిచే జ్ఞానమార్గం అంగీకరింపజేసెరని, కుమారిలభట్టు మండన మిశ్రులను జ్ఞానమార్గావలంబులుగా చేయడంవల్ల ఎక్కువ మేలు కలుగుతుందని ఆచార్యులకు చెప్పేరని వెనుక చెప్పుకొన్నాము.

కుమారిలభట్టు చెప్పిన మాటలు విని శంకరులు మండన మిశ్రులను వెదకుకొంటూ వారు నివసించే మాహిష్మతీ నగరానికి, చేరుకొన్నారు మండన మశ్రులవారి భర్య పేరు సరసవాణి. ఆ దంపతులు సరస్వతీ చతుర్ముఖుల అవతారములు. మండన మిశ్రులు, కుమారిలభట్టు, జైమిని - ఈ ముగ్గురు మన విషయంలో ఏకాభిప్రాయం కలవారు. ఈ ముగ్గురు మీమాంస మతానికి చెందినవారు. వేదంలోని కర్మకాండయే ముఖ్యమైనదని మీమాంస మత సిద్దాంతం.

కొంత స్థూలంగా మీమాంస మత సిద్దాంతం ఏమంటే? - భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన అనవసరం, ఉంటే ఉండనీయి. లేకుంటే లేకపోనీయి, అది ప్రయోజనంలేని ఆలోచన. వేదంలో చెప్పబడ్డ కర్మలను ఆచరించండం నీవు చేయవలసిన పని. ఆ కర్మలను ఆచరించు. అవి ఫలితాన్ని ప్రసాదిస్తాయి

ఇట్టి మత సిద్ధాంతాలలో విశ్వాసంకలవారై మండన మిశ్రులవారు మాహిష్మతీ నగరంలో నివసిస్తున్నారు. శ్రీ శంకరులు ఆ నగరానికి చేరుకొన్నారు. నిత్యమైన ఆనందమేదో తెలియక, కర్మనే నమ్ముకొని, అనవరతం కర్మాచరణంలోనే కొట్టుమిట్టాడుతూ, తత్ఫలితంగా అనిత్యమై అల్పమైన ఆనందాన్ని అనుభవిస్తూ, మరల మరల జన్మించుటయే జీవతపరమావధిగా భావించి యున్న మండన మిశ్రులను వారి అనుయాయులను ఏదో విధంగా తరింపజేయాలన్న అనుగ్రహబుద్ధితో శ్రీ శంకరులు అక్కడకు వచ్చేరు. చతుర్ముఖుని అంశతో జన్మించిన మండనులు, బౌద్ధులను వారి మతాన్ని నిరసించి ఖండించి క్రమంగా తాము మీమాంసకులై మతానికి ఆ కాలంలో వెన్నెముకగా ఉన్నారు.

మాహిష్మతిలో మండన మిశ్రుల గృహాన్ని వెదకుకొంటూ శ్రీ శంకరులు వస్తున్నారు. వారికి నది నుండి నీటి బిందెలతో వస్తూ ఉన్న పౌరపురంధ్రులు కాన వచ్చేరు. వారా వనితలను మండన మిశ్రుల యింటికి మార్గమేది? అని ప్రశ్నించేరు. అపుడు వారు

స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనా యత్ర గిరం గిరన్తి|
ద్వారస్థ నీడాంతర సం నిరుద్ధా జానీహి తన్మండన పండితౌకః||

ఏ గృహద్వారమందు పంజరబద్ధములైన చిలుకలు- 'వేదము స్వతః ప్రమాణమా? లేక పరతః ప్రమాణమా?' అని వల్లె వేస్తూ ఉంటాయో అదే మండనుల యిల్లు- అని సమాధానం యిచ్చేరు.

పంచదారనులేక దీపాన్ని చూచినపుడు 'ఇది పంచదార' 'ఇది దీపం' అన్న జ్ఞానం మొదట కలుగుతుంది. దానికి వెనువెంటనే 'అవును! ఇది నిజం' అని మరియొక జ్ఞానం కలుగుతుంది. ఇది అరటిచెట్టు' అని తెలియగానే 'అవును! ఇది నిజం!' అన్న రెండవ జ్ఞానంకూడా పుడుతోంది. అరటిచెట్టును చూడగానే కలిగిన యీ రెండవ జ్ఞానానికి అరటిచెట్టును చూచుటయే కారణమా లేక వేరొకదానివల్ల ఆ జ్ఞానం కలుగుతోందా? అంటే అరటిచెట్టు చూచుటయే యీ రెండవ జ్ఞానానికి కారణం అనేవారు స్వతః ప్రమాణం వాదులు, అలాకాదు, వేరొకదానివల్ల యీ రెండవ జ్ఞానమేర్పడుతోంది, అనేవారు పరతః ప్రమాణావాదులు. స్వతఃప్రమాణ - పరతః ప్రమాణాల స్థూల స్వరూపం ఇట్టిది.

మండనమిశ్రుల యింటి చిలుకలు 'స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం' అని వల్లె వేస్తూ ఉండేవట! ఆదిశంకరులు వారి యింటికి బయలుదేరేరు. ఆ రోజున మండనుల యింటిలో శ్రాద్ధము. మండనులు, మంచి ఐశ్వర్యం కలవారు. అనేక సోమయాగాలు వారు ఆచరించేరు. మండనులు మంచి ఐశ్వర్యం కలవరైనందున చక్కగా శ్రాద్ధం చేయడానికి ఉపక్రమించేరు. శంకరులు మండనుల యింటికి వచ్చేసరికి వారి గృహకవాటాలు మూయబడి ఉన్నాయి. అందుచే వారు యోగశక్తితో గృహంలో ప్రవేశించేరు. లోపల వ్యాసులవారు, జైమిని బ్రాహ్మణార్థమునకు వచ్చి ఉన్నారు. పరీక్ష్మిన్మహారాజు దగ్గరకు నిమ్మపండులో ప్రవేశించి తక్షకుడు వెళ్ళినట్లే ఎన్నోవిధాలుగా శ్రాద్ధక్రియా సక్రమ నిర్వహణానికి రక్షణలు ఏర్పాట్లు చేసుకొన్న మండనుల వద్దకు ఆచార్యులవారు చేరుకొన్నారు.

ఆచార్యులవారిని చూడగానే మండన మిశ్రులకు చాలా కోపం వచ్చింది. అపుడు శంకరులను మండనులకు వాగ్వాదం జరిగినట్లు కథలు జనశ్రుతిలోను గ్రంథాలలోనూ ఉన్నాయి.

మండనమిశ్రులవారు ఆచార్యులను చూచి ఎక్కడ నుండి ముండి? అని ప్రశ్నించేరట! ఆచార్యులవారు వేడుకగా 'కంఠము నుండి ముండివి' అని సమాధానం చెప్పేరట! ముండనం చేసుకొన్నవాడు ముండి. సన్యాసులు కంఠానికి దిగువ ముండనం చేసికొనకూడదు. ఇలా సాగుతూఉన్న వాదాన్ని ఆలకించి వ్యాసజైమినులు వారిని సమాధానపరచి మండన మిశ్రులతో - 'శ్రాద్ధమునకు సన్యాసిని పిలువాలని' శాస్త్రం చెపుతూ ఉన్నది. అందుచే విష్ణువునకు ఉద్ధేశించిన విస్తరలో ఆచార్యులవారిని కూర్చుండబెట్టి పూజించు అని చెప్పేరు.

మండన మిశ్రులకు ఏమీ పాలుపోలేదు. ఈ వ్యాసజైమినులు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు. బ్రాహ్మణార్థమునకు వచ్చినవారు చెప్పినట్లు చేయాలని శాస్త్రం. సన్యాసిని చూడడానికైనా అంగీకరించని తనను సన్యాసిని శ్రాద్ధసమయంలో పూజించవలసిందిగా వారు ఆదేశిస్తున్నారు. ఏం చేసేది? వారు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు, వారి మాట విని తీరాలి. వినకపోతే దోషం. అందుచే మండనులు శంకరులతో వాదం విరమించి భిక్షకు రావలసినదిగా అర్థించేరు. అపుడు శంకరులు నేను కోరేది వాదభిక్ష, సాధారణభిక్ష నాకు అక్కరలేదు, అన్నారట!

వాదం అంటే ఈ రోజులలో వివాదము లేక జగడం అనుకొనడం పరిపాటి అయింది. కాని అది సరికాదు. అది 'జల్పం' అనబడుతుంది. తెలియనిదానిని తెలిసికొనడానికి లేదా తత్త్వ గ్రహణానికి చేయబడే సమాలోచనకు వాదం అని పేరు. 'తనకు తెలిసినదే యథార్థమైనది, ఇతరులు చెప్పేది యధార్థం కాదు, అన్న నిశ్చయజ్ఞానంతో చేయబడేది 'జల్పం', ఈ రెండేకాక మూడవది మరియొకటి ఉన్నది అది 'వితండవాదం'. తనకు ఏ అభిప్రాయామూ లేకపోయినా ఎదుటివాడుచెప్పేది అంతా తప్పు అనడమే వితండవాదం.

ఆచార్యులవారు వాదభిక్ష కోరినంతనే మండనులు 'మొదట యీ భిక్ష స్వీకరించండి, తరువాత వాదభిక్షను గూర్చి గమనిద్దాం' అన్నారు.

శ్రాద్ధం సమాప్తం అయినంతనే ఇరువురూ వాదించుటకు ఆరంభించేరు. సరస్వతీదేవియొక్క అవతారమైన మండన మిశ్రులవారి భార్య సరసవాణిని ఇరువురి వాదాలను ఆలకించి తీర్పు చెప్పడానికి మధ్యస్థురాలుగా ఎన్నుకొన్నారు. ఆమె ఎవరిపక్షంలో మాటాడుతుంది! ఒక వంక సన్యాసి, ఒక వంక భర్త. వీరి వాదంలో తాను తీర్పు చెప్పడం ఎలాగు? ఇది ఆమెకు ధర్మసంకటంగా తోచింది. అందుచే ఆమె ఇరువురికి చెరియొక మాలను యిచ్చి ఎవరి మాల వాడిపోతే వారు పరాజితులైనట్లు అని నిర్దేశించింది.

వాదారంభానికి ముందు శంకరులు మండనులు ఒక నిబంధన ఏర్పరుచుకొన్నారు. వాదంలో శంకరులు జయిస్తే మండనులు సన్యాసం స్వీకరించాలి. మండనులే జయిస్తే శంకరులు ప్రాయాశ్చిత్తం చేసుకొని గృహప్రస్థాశ్రమం స్వీకరించాలి. వారి యీ నియమాన్ని సరసవాణి తెలిసికొన్నది. వాదం ఇరువదియొక్క రోజులు సాగింది. ఇరవై ఒకటవ రోజున మండనమిశ్రుల మెడలోని మాల వాడిపోయింది. వెంటనే సరసవాణి ఇద్దరిని భిక్షాగ్రహణానికి దయచేయండి అని ఆహ్వానించింది. నాటితో మండనులు సన్యాసులయ్యారు. సురేశ్వరాచార్యులు అన్నది ఆయన సన్యాసాశ్రమ నామధేయం. సురేశ్వరులవారు 'నైష్కర్మ్యసిద్ది' అనే గ్రంథాన్ని రచించేరు. అందులో వారు 'కర్మ ఫలాన్నే కాకుండా వేదం ఒక అత్యున్నతమైన ఆనందాన్ని సూచిస్తోంది' అని సిద్ధాంతీకరించారు.

అయితే మండనులను ఆచార్యులవారు ఏ విధంగా జయించేరు? అన్నది కూడా కొంత తెలిసికొందాం.

'శబ్డం కార్యాన్ని నిర్దేశించాలి' అనికదా మీమాంసకుల అభిప్రాయం. శంకురులు- 'అలాకాదు, శబ్దం కార్యప్రయోజనానికి సహాయకారిగా ఉండాలి' - అన్నారు. ఏమంటే కొన్ని చోట్ల కార్యము లేకపోవుటయే శబ్దానికి ప్రయోజనం అవుతుంది. 'సురాపానం చేయరాదు అన్నాము. ఈ శబ్దం వినగానే చేయవలసిన కార్యం ఏమీ ఉండడం లేదు కదా! అందుచే శబ్దానికి ఒక్క ప్రయోజనమే లక్షణం అని అంగీకరించడం తగినది కాని కార్యనిర్దేశర శబ్ద తాత్పర్యంగా ఉండాలి. అనుకొనడం తగదు'- అన్నారు.

'సురాపానం చేయరాదు' అన్నమాటకు ఏదో చేయుమని కాక ఏమీ చేయవద్దూ అన్నదే తాత్పర్యమై ఉన్నది. ఏమీ లేకపోవవడాన్ని అభావం అంటారు. నిషేధ వాక్యాలన్నీ కార్యాభావాన్ని బోధిస్తాయి. ఏదో ఒక కార్యము చేయకపోవుటయే ఒక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఏ కార్యమయినా చేయక పోవడం, ఏ కార్యము లేకుండా ఉండడం ఒక పెద్ద ప్రయోజనంగా ఉండాలి. ఏ కార్యము లేక పోవుటయే పరమ ప్రయోజనంగా కలవైనందున వేదాంతశబ్దాలు అన్నిటికి శిఖరాయమాణాలై ఉన్నాయి.

'సర్వం కర్మాఖిలం పార్ధ! జ్ఞానే పరి సమా ప్యతే' - అని గీతలో చెప్పబడిఉంది. అన్ని కర్మలూ పరమేశ్వరునియందు వినియోగం పొందాలి. కార్యము (చేయవలసినది లేకపోవుటయే) లేక పోవుటయే పరమప్రయోజనం అదియే బ్రహ్మానందం. దానిచే మరి జన్మ ఏర్పడదు. వేదానికి పరమతాత్పర్యం ఇదే! కర్మ కాండము సర్వాన్నీ జ్ఞానకాండలోనికి సమన్వయించు కోవాలి. అపుడే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అని శంకరులు మండన మిశ్రులవారికి బోధించేరు.

మండనులు ఆచార్యులవారికి శిష్యులైనంతనే సరస్వతి (అనగా సరసవాణి) ఇక నాకేమి పని ఉన్నదని బయలుదేరింది. అపుడు శంకరులు ఆమెను వారించి- 'నీవును ఇక్కడనే ఉండు, శారదా పీఠముగా నీవు ఉందువుగాక!' అని ఒక పీఠాన్ని స్థాపించి సరస్వతిని ఆ పీఠంలోనికి ఆహ్వానించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/8.html

Thursday 27 April 2017

శంకరచరితామృతము : 7 : మనీషాపంచకం, అంతరార్థం


పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 7
మనీషాపంచకం, అంతరార్థం

@ శంకరవాణి

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

వ్యాసులవారు చెప్పినట్లు శంకరులు ముమ్మారు దిగ్విజయం చేసేరు. మూడు సార్లు భారతదేశంలో ప్రదక్షిణ క్రమంగా పర్యటించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/7.html
 

శంకరచరితామృతము : 6 : బ్రహ్మసూత్రభాష్య రచన



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 6
బ్రహ్మసూత్రభాష్యరచన

@ శంకరవాణి

తల్లిని వదలి ఆచార్యులవారు సక్రమంగా సన్యాసం స్వీకరించడానికై గురువును అన్వేషిస్తూ బయలుదేరేరు. ఈశ్వరావతారమైన ఆచార్యమూర్తికి వేరొక గురువు అవసరం కాకపోయినా లోకంలో సంప్రదాయాన్ని నిబంధించడానికై వారు అట్లు చేయవలసి వచ్చింది. స్వయంగా శంకరులే గురువును ఆశ్రయింపకపోతే లోకంలోని ఇతరులు గురువును ఆశ్రయించే సంప్రదాయం లోపించవచ్చును. అందుచే వారు గురువును వెదుకుతూ బయలుదేరేరు. వారు నర్మదాతీరంలో గురువును కలసికొన్నట్లు గ్రంథాలలోను కనిపిస్తొంది.

ఆచార్యులవారు శ్రీ గోవిందభగవత్పాదుల సన్నిధిలో సక్రమంగా సన్యాసం స్వీకరించేరు. శ్రీ గోవిందభగవత్పాదులవారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయవలసినదిగా శంకరులను ఆజ్ఞాపించేరు. పిమ్మట ఆచార్యులవారు అచటనుండి వారణాసికి బయలుదేరేరు. అక్కడనే వారు భాష్యరచనకు ఉపక్రమించేరు. వారు కాశిలో మణికర్ణికాఘట్టంలో ముక్తి మంటపంలో నివసిస్తూ శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు.

కాశి ఒక మహాక్షేత్రం. అక్కడ దేహత్యాగం చేసిన ప్రతి ప్రాణికి విశ్వేశ్వరుడు జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తాడు, ఇది ఆక్షేత్రంయొక్క విశేషం, కాశీక్షేత్రానికి వేరొక విశేషం కూడా ఉంది. మనదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్నిమతాల ప్రతినిధులూ కాశీలో ఉండేవారు. ఆ కాలంలో కాశి అంటే పండితులుండే పట్టణం. యాత్రకై ఎందరో పండితులు అచటకు వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉండేవారు. మన దేశంలో ఎన్ని జాతులు ఎన్ని మతములు, ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ అక్కడ కనిపిస్తాయి. అందుచే ఏ విషయమైనా కాశిలో ప్రచారంచేస్తే లోకంలో అంతటా ప్రచారం చేసినట్లు అవుతుంది. ఆచార్యులు కాశిలో భాష్యం రచించడానికి ఇదికూడా ఒక హేతువు. దినదినము దేశవిదేశములనుండి వచ్చిన వేదపండితులు కొంత కొంత ఆలకించుచుండగా ఆచార్యులవా రొనరించిన భాష్యరచన లోకంలో అనతికాలంలో ప్రశస్తి వహించింది. ఆచార్యులవారు తమరచనలో కొన్ని మతముల సిద్ధాంతాలను నిరాకరించేరు, ఔపనిషదమైన మతాన్ని స్థాపించేరు.

ఒకనాడు వ్యాసమహరి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యం ప్రశస్తమైన దని నలుగురూ తొలిసికోవాలంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్యరచనపై ప్రచండమైన వాదం లేవనెత్తేరు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదాలు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులు కూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొనసాగేరు. వృద్ధబ్రాహ్మణరూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించేరు, వెంటనే వారు -

'శంకర శ్శంకర స్సాక్షాత్‌ వ్యాసో నారాయణ స్స్వయం|
తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'


శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించేరు.

అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికేరు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేడ్లు అనుగ్రహించుచున్నాను; భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను పలుదేశాలలో ప్రచారం చెయ్యాలి, కొందరు ఏవో ఆక్షేపణలు లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించేరు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయం గావించేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/6.html

Wednesday 26 April 2017

శంకరచరితామృతము : 5 బాల్యం - 2




పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 5
బాల్యం - 2


@ శంకరవాణి

ఒకనాడు వారి తల్లికి దేహం అస్వస్థంగా ఉంది. ఆమె కుమారునితో - 'నాయనా! నాకు నేడు నదికి వేళ్ళే ఓపిక లేదు- అన్నది. అపుడు వారు దూరంగా ఉన్న నది ఇంటికి చేరువగా రావాలని ప్రార్థించేరు. ఆయన ప్రార్థించినట్లు నది యింటికి దగ్గరగా వచ్చింది. దారిలో ఒక కృష్ణాలయం ఉంది. నదీవేగానికి ఆ ఆలయం కూలిపోయింది. కాలాంతరంలో ఆచార్యులవారు ఆజ్ఞాపించగా ఒక దేశపురాజు దానిని పునరుద్ధరించేడు.

ఆచార్యులవారు తమతల్లిని నదిలో స్నానం చేయించేరు. తరువాత తాము స్నానం చేయడానికై నదిలోకి దిగేరు. వారునీటిలో అడుగు పెట్టగానే ఒక మొసలి వారి పాదం పట్టుకొంది; అపుడు ఆయన తల్లితో - 'ఇదుగో! మొసలి పట్టుకొన్నది, ఇప్పుడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం మానసికంగా సంన్యాసం స్వీకరించానా నాకు వేరొక జన్మ వచ్చినట్లు అవుతుంది; నా ప్రారబ్ధము మారిపోతుంది, కాగా ప్రారబ్ధముచే వచ్చిన మరణంకూడా మారిపోవచ్చు; తల్లివి, నీవు ఆజ్ఞాపించకుండా నేను సంన్యాసం తీసికొనకూడదు, సంన్యాసం తీసికొంటే ఒకవేళ నేను బ్రతుకుతానేమో కాని, తీసికోకపోతే నాకు చావు తప్పదు; ఇది దుర్మరణం; నేను ఇలా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు; సంన్యాసము తీసికొంటే నాకు మోక్షము వస్తుంది; నీకు సద్గతి కలుగుతుంది; సంన్యసించినా నేను నీకు అంత్యక్రియలు చేస్తాను' అన్నారు.

ఆచార్యులవారు జలంలో ఉండియే సంన్యాసం స్వీకరించాలనుకొన్నారు. ఆయన అలా అనుకొనుటతోడెనే మొసలి ఆయన కాలిని విడిచిపెట్టింది. ఆ క్షణంలోనే ఆకాశంలో రథంమీద ఒక గంధర్వుడు ప్రత్యక్షం ఆయ్యేడు. అతడు ఆచార్యుల పాదాలమీదపడి నమస్కరించేడు. ఆచార్యుల వారికి ఆశ్చర్యం కలిగింది. తానొక గంధర్వుడనని అతడు చెప్పుకోన్నాడు.

ఆ గంధర్వుడు ఆచార్యులవారితోఅయ్యా! నేను ఒకప్పుడు బాగా మద్యం సేవించి గానలోలుడనై కదలకుండా పడిఉన్నాను. ఆసమయంలో దూర్వాసమహర్షి అలా వచ్చేరు. ఆయనకు మద్యము, సంగీతము రెండును కిట్టవు. ఆయనను చూచి నేను లేవలేదు; నా గానాన్ని విరమించలేదు. దానికి ఆ మహరి కోపించినీవు త్రాగి మొసలివలె పడి ఉన్నావు. అందుచే నీవు మొసలివై పడిఉండు! అని శపించేరు. అప్పుడు నేను వారిని ప్రార్ధించేను. 'ఈ శాపాన్ని అనుసరించి నీవు కొంతకాలం మొసలివై పడి ఉండక తప్పదు, ఈశ్వరుడు ఈ లోకంలో అవతరిస్తాడు, ఆయన కాలినిపట్టుకొన్నపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీవు కాలడిలో నివసించు, ఈశ్వరుడు అచ్చటనే అవతరిస్తారు, నిన్ను అనుగ్రహిస్తాడు' అని దుర్వాసమహర్షి నన్ను అనుగ్రహించారు అని తన విషయం తెలిపి ఆచార్యుల సెలవు పొంది ఆ గంధర్వుదు అంతర్హితుడయ్యేడు.

మొసలి నోటినుండి విడువడిన కుమారుని చూడగానే తల్లికి చాలా ఆనందం కలిగింది, ఆమెరా! నాయానా ! ఇక నీవు పెండ్లి చేసికొనవచ్చును, తగిన కన్యను చూస్తానుఅని ఆరంభించింది.

ఇది విని ఆచార్యులవారు- 'తల్లీ! నేటినుండి నేనొక యింటిక సంబంధించిన బిడ్డను కాను. అన్ని యిళ్లు నాకు సొంతమే. సంన్యాసము తీసుకొనడానికి నీవు నాకు అనుమతి ఇచ్చేవు; ఆ విషయం మరచితివేమో! నేనింక ఇచ్చటనుండి వెళ్లిపోవాలి' అని ఆమెకు నమస్కరించేరు.

'సర్వవంద్యేన యతినా ప్రసూ ర్వంద్యా హి పాదరం' అందరూ సంన్యాసికి నమస్కరిస్తే సంన్యాసి తల్లికి నమస్కరించాలి. పిమ్మట ఆచార్యులవారు ఇక తనకు తల్లి, తండ్రి, కుమారుడు ఎవరూ లేరని భావించేరు.

భిక్షప్రదా జనన్యః పితరొ గురవః కుమారకాః శిష్యాః|
ఏకాంతరమణ హేతుః శాంతి ర్దయితా విరక్తస్య||

- వైరాగ్య శతకము.

''సంన్యాసినైన నాకు భిక్షచేసేవారే తల్లులు. జ్ఞానోపదేష్టలైన గురువులే తండ్రులు; శిష్యులే కుమారులు. నేను ఈ విశ్వకుటుంబానికి చెందిన వాడను'' అని ఆచార్యులవారు తల్లితో చెపుతూ ఏమైనా నీవు నన్ను తలచగానే నేను నీ దగ్గరకు వస్తాను' అని ఆమెకు నచ్చజెప్పి సక్రమ సంన్యాసస్వీకారానికి యోగ్యగురువును అన్వేషిస్తూ బయలుదేరేరు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/5-2.html

శంకరచరితామృతము : 4 : బాల్యం - 1



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 4
బాల్యం - 1

@ శంకరవాణి

ఆచార్యులవారికి ఐదవయేట ఉపనయనం అయింది. ఉపనయనము 'కామ్యోపనయనము, నిత్యోపనయనము' అని రెండు రకాలు. ఏడవేట అనగా గర్భాష్టమమందు ఉపనయనం చేయాలి. బ్రహ్మతేజాన్ని అభ్యర్థించేవారు ఐదవయేటనే ఉపనయనం చేయాలి.

ఆచార్యులవారు మూడేండ్లువయసునాటికే దేశభాషలు నేర్చుకొన్నారు. ఐదేండ్లవయసు వచ్చేసరికి వారు సంస్కృత భాషను చక్కగా అభ్యసించేరు. ఉపనీతులైన తరువాత ఎనిమిదవ ఏడు వచ్చులోగా వేదశాస్త్రాలు అభ్యసించేరు. ఉపనీతులై వారు గురుకులవాసం చేసేరు. ఎనమిదవయేటికి ఇంటికి తిరిగి వచ్చేరు. అప్పటికి వారి తండ్రి దివంగతు లయ్యేరు. అపుడు ఆచార్యులవారు తాము కేవలం ఇంటిలో కూర్చుండుటకు కాక లోకాన్ని ఉద్ధరించుటకు వచ్చితిమని భావించేరు. ఈ లోకోద్ధరణకార్యాన్ని కొనసాగించడానికి సంన్యాసం స్వీకరించవలెనని వారు నిశ్చయించుకొన్నారు. అయితే వారి తల్లి తనకీయన ఒక్కడే కుమారుడు అయినందున వీరికి వివాహము చేయవలె నన్న ఆలోచనలో ఉన్నారు. అందుచే ఆచార్యులవారు తమ తల్లితో 'అమ్మా! నేను సంన్యాసము తీసికొంటాను, అని చెపితే ఆమెకు దుఃఖం కలుగుతుందని సంశయించసాగేరు.

ఆదిశంకరులు సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాన్నముతోడనే జీవించేవారు. ఆరోజులలో ఒక ద్వాదశినాడు వారు భిక్షాటనం చేస్తూ 'భవతి భిక్షాం దేహి!' అంటూ ఒక దరిద్రుని యింట అడుగు పెట్టేరు. ఆయన వారిని అనుగ్రహించాలన్న ఊహతోడనే అలా వారి యింటికి వెళ్ళేరు. ఆగృహస్థు పరమదరిద్రుడు. ఉంఛవృత్తితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆచార్యులవారు వెళ్ళిన వేళకు ఆబ్రాహ్మణుడు ఇంటిలో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. మహాతేజస్సంపన్నులైన ఆచార్యులవారిని చూడగానే ఈ తేజస్వికి భిక్షపెడితే మేలు కలుగుతుంది, అని ఆమె అనుకొన్నది. ఆచార్యులవారిని చూచీ చూడడంతోటే అందరకూ ఒక గౌరవభావం ఆయనపై ఏర్పడేది. ఆ బ్రాహ్మణుని భార్య భిక్షవేయడానికి ఇంటిలో ఏముంది? అని వెదుక సాగింది. ఇంటిలో ఏమీ లేదు. ద్వాదశిపారాణానికై ఆ బ్రాహ్మణుడు ఒక ఉసిరికాయను సంపాదించి ఉంచుకొన్నాడు. అది కూడా చెడిపోయింది. ఈ బ్రహ్మచారికి ఈ ఉసిరికాయ భిక్షగా ఎట్లు వేయను? అని ఆమె సంకోచిస్తోంది.

కాని ఆచార్యులవారు ఆమె భక్తిని గ్రహించి ఆ ఉసిరికను గ్రహించేరు. అపుడు వారి దారిద్య్రాన్ని పోగొట్టుమని లక్ష్మీదేవిని ఉద్దేశించి 'కనకధారాస్తవం' అనే ఒక స్తవాన్ని చదివేరు. వారికి ఐశ్వర్యం ప్రసాదింపుమంటూ లక్ష్మీదేవిని వేడుకొన్నారు.

అప్పుడొక ఆశరీరవాణి-'వీరు చేసిన పాపం చాలా ఉంది; చాలాకాలం వీరు దరిద్రులుగా బాధపడాలి, అలా కాకుంటే వీరి పాపం తొలగదు' అని వినిపించింది.

అంతట ఆచార్యులవారు - 'వీరీవిధంగా పరమప్రీతితో భిక్షం పెట్టినారుకదా! దీనివలన సంపాదితమైన పుణ్యం ఎంత అధికమైన పాపాన్ని అయినా పరిహరింపజాలి ఉంటుంది'- అన్నారు. వెంటనే ఆ దరిద్రబ్రాహ్మణుని యిల్లు సకల సంపదలకు ఆలవాలమై ఐశ్వర్యంతో నిండింది. ఇది ఆచార్యులవారు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా జరిగిన విషయం.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/4-1.html

వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత - 2




 వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత - 2

వైశాఖమాసమునందు సద్బ్రాహ్మణునకు శయ్యాదానమును ఇచ్చినచో దానమిచ్చినమనుజుడు స్వర్గనివాసియగును .

శరీరారోగ్యమునకుసౌఖ్యాలు ముఖ్యకారణములు కాబట్టి ఆకలిగొన్నవానికి భోజనమిడి, మెత్తని శయ్యనమర్చి విసనకఱ్ఱ చేతికిచ్చినచో అట్టి మానవునకు జరామరణములు కలుగవు.

బ్రాహ్మణ శ్రేష్ఠునకు శయ్యతోపాటు తలగడదిండు కూడా దానం చేయవలెను.

శయ్యనిదానమివ్వలేనివారు చాపనైనా దానమియ్యవలెను, దీనివలన అకాలమృత్యుభయం తొలగిపోవును.

బ్రాహ్మణునకు పలుచనివస్త్రదానముకూడ అతిప్రధానమైనది, అటుల వస్త్రదానం చేసినచో దీర్ఘాయువు కలవాడగును.

పోకచెక్కలుగాని, సుగంధద్రవ్యములుగాని , కొబ్బరికాయ లేక అరటిపండ్లుగాని దానంచేసిన యెడల  ఏడుజన్మలవరకు బ్రాహ్మణుడుగ జన్మించుటయేగాక వేదశాస్త్రపారంగతుడై రాణించును.

వైశాఖమాసము  ప్రారంభముకాగానే మల్లెపూలతో చేసినదండగాని , మొగలి లేక బొగడప్వ్వులతో నిర్మించిన దండనుగానీ విప్రుని మెడలోవేసినగాని చేతిమణికట్టుకు కట్టినచో విష్ణుమూర్తి తనను పూజించునటులే భావించి, అతనికి సర్వసంపదలు సమకూర్చును.

వైశాఖమాసంలో చల్లనినీడ నిచ్చునటువంటి చలివేంద్రములు కట్టుట రాజమార్గమునకిరుప్రక్కల చెట్లనునాటుట ,  జలములేనిచోట్ల తటాకములు త్రవ్వించుట, బావులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఏమానవుడుచేయునో అట్టి వానికి సంతానము లేనియడల సత్పుత్ర సంతానము, ఐశ్వర్యములేని యెడల అష్టైశ్వర్యములు కలుగును.

వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో యుండగా విప్రోత్తమునకు తమలపాకులు, పోకచెక్కలు, కర్పూరము, సుగంధద్రవ్యములు దానమిచ్చినయెడల తనకు, తనవంశీయులకూ శరీరారోగ్యము కలుగును. దప్పికతోనున్న బ్రాహ్మణునకు పెరుగుగాని, ఉప్పునిమ్మరసం కలిపిన మజ్జిగకాని సంతోషముగానివ్వవలెను. ఇది సకలపాపహరము, పూర్ణాయుర్దాయకరము, జన్మాంతమున విష్ణులోకప్రాప్తికి హేతువు,

తాపోపశమనమునకై విప్రునకు పండు, పానకము, బెల్లముకలిపిన దోసపండు, చెరకుముక్కలు, చక్కెరకలిపిన మామిడిపండ్లరసం, వడపప్పు, పనసతొనలు దానమిచ్చినవాడు తన పాపములనుండి విముక్తుడై గొప్ప పుణ్యశీలుడై చక్రవర్తివలె భోగముననుభవించును.

Tuesday 25 April 2017

శంకరచరితామృతము : 3 : శంకరుల జననము

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 3

శంకరుల జననము


ఆదిశంకరులు వైశాఖ శుద్ధ పంచమినాడు అవతరించారు. ఆనాడు నక్షత్రం ఆర్ద్ర లేక పునర్వసు అవుతుంది. అది ఒక మహోత్కృష్ట పుణ్యదివసంగా పరిగణించడం నాకు అలవాటు. శివరాత్రి, గోకులాష్టమి, శ్రీరామనవమి మొదలగున్నవి ఎన్నో పుణ్యదివసాలు ఉన్నాయి. అయినా ఈఅన్నిటికంటే ఆచార్యుల జన్మదివసానికి ఒక విశిష్టత ఉంది.

కలియుగం ఆరంభమై రెండు వేల సంవత్సరాలు గడచిన మీదట జనులకు వేదపురాణాదులపై అనాదిగా ఉంటూ ఉన్న విశ్వాసానికి లోపం ఏర్పడింది. జనం అంతా బౌద్ధమతానుకూలాలైన ఉపదేశాల ప్రభావనికి లోనయ్యారు. అందరి మనస్సులమీద బౌద్దులు ఉపదేశాలు పీట పెట్టుకు కూర్చున్నాయి. పరంపరగా వచ్చే వైదికానుష్ఠానం లోపించింది. ఆ సమయంలో ఆచార్యుల పవిత్ర జన్మదివసం ఏర్పడింది. ఆచార్యుల జన్మదివసం కారణంగానే శివరాత్రి, శ్రీరామనవమి మొదలైన పుణ్య దివసాలు విస్మృతాలు కాకుండా మనకు దక్కేయి. అందుచే అన్ని పుణ్యదివసములకంటె ఆచార్యుల జన్మదివసమునందు మనం ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉన్నది. ఈ భవ్యదివసం మళయాళదేశంలో కాలడి గ్రామంలో ఆర్యాంబా శివగురువుల మంగళగృహంలో ఏర్పడిన సంగతి అందరకూ తెలిసినదే.

మళయాళ దేశంలో 'వృషాచలం' అనే మహాశివక్షేత్రం ఒకటి ఉంది. వృషం అంటే నందికేశ్వరుడు. ఆ క్షేత్రంలో వృత్తాకారంగా ఒక కొండ ఉంది. దానిమీద శివాలయం నిర్మింపబడి ఉంది. ఆ క్షేత్రంలో భజన చేసి జనులు స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. భజన అంటే ఇక్కడ సేవ అని అర్ధం. ఆ స్వామి సన్నిధానంలో నెల లేక రెండు నెలలు ఉండి అచటి పుణ్యతీర్ధాలలో స్నానం చేసి స్వామిని సేవిస్తూ, స్వామి ప్రసాదం తింటూ, అచటనే నిద్రిస్తూ స్వామిని ఆరాధించడం ద్వారా పొందే వరప్రసాదాన్ని భజన అంటారు. నేడు కూడా ఆ విధంగా అక్కడ భజన చేస్తూ ఉంటారు. ఆ ఊరిపేరు శివపేరూరు. అరవభాషలో తిరుశబ్దానికి శ్రీ అని అర్ధం. ఆ కారణంగా ఆ ఊరిని 'తిరుశివపేరూరు' అని పిలిచేవారు. కాలక్రమేణ అది 'తిరుచ్చూరు'గా మారింది. ఆ క్షేత్రంలో వృషాచలస్వామికి ఆవునేతితో అభిషేకం చేస్తారు. స్వామికి అభిషేకం చేసిన ఘృతం ఎంతో నిలువ ఉంటుంది. ఆయుర్వేదంలో పురాతన ఘృతం చాలా వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. మళయాళంలో ఆయుర్వేదము, ఆయుర్వేద విద్యాభ్యాసము ఎక్కువ. ఈ నాడుకూడా పురాతన ఘృతం కావలసిన వైద్యులు ఈ ఆలయంనుండి ఘృతం తీసికొని వెడుతూ ఉంటారు. వేయియేండ్లకు వెనుకటి ఘృతం కూడా నేడు అక్కడ లభిస్తుంది.

మళయాళదేశంలో బ్రాహ్మణులను నంబూద్రీలు అంటారు. వారిలో వేదాధ్యయనం యెక్కువ. ఆచార్యులు ఈ బ్రాహ్మణశాఖయందే జన్మించేరు. వేదమతోద్ధారణకై అవతరించిన పరమశివుడు వేదాధ్యయన తత్పరులైన బ్రాహ్మణులయందే కదా జన్మించాలి.

శంకరవిజయంలో - దేవతలంతా పరమేశ్వరుని యొద్దకు పోయి పుడమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడిన దని, దానిని పునరుద్దరించాలని ప్రార్ధించగా, ఈశ్వరుడు తక్కిన అవతారములయందువలెనే ఫలానాదేవతలు ఫలానా మనుష్యులుగా అవతరించాలని ఆజ్ఞాపించినట్లు వ్రాయబడి ఉంది. అవతారాలు అన్నిటిలోనూ సాధారణంగా దేవతలు తమకు ఏర్పడిన రాక్షస బాధ తొలగించవలసినదిగా ప్రార్ధించినట్లు కానవస్తుంది. కాని ఈ అవతారంలో 'కర్మానుష్ఠానం తగ్గిపోయింది, దానిని పునరుద్దరించండి' అని ప్రార్ధించినట్లు చెప్పబడింది.

కర్మానుష్ఠానమే మనం దేవతలకు ఇచ్చే కప్పం. కోర్కెలు ఉన్నంతవరకు మనం దేవతలను అనుగమించాలి. లేకపోతే కష్టాలు కలుగుతాయి.

'దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకంగృహం'- అని వరుణ ప్రశ్నలో ఉంది. దేవతలకే కరవుకాటకాలు కాని, మనుష్యులకు ఏ లోపములేదు; అన్నీ వీరికి సమృద్ధిగా ఉన్నాయని అందులో చెప్పబడింది. ఏమంటే దేవతలకు ఆహారం ఇక్కడ నుండియే వెళ్ళాలి. మనము చేసే కర్మానుష్ఠానమే వారికి ఆహారం. దానిచేతనే వారు ఆనందిస్తారు. అందుచే భూమి మీద కర్మానుష్ఠానానికి లోపం ఏర్పడితే దేవతలంతా పరమేశ్వరుని దగ్గరకు పోయి ఆ దుస్థితిని తొలగించ వలసినదిగా ప్రార్ధిస్తారు.

పరమేశ్వరుడే అవతరించాలి అంటే ఆ సమయం సాధారణసమయంగా ఉండకూడదు. అది ఒక ఘనతరపుణ్య సమయంగా ఉండాలి. అవతరించే పరమేశ్వరుని సందర్శించదగిన పుణ్యాత్ములు ఆ సమయంలో ఉదయించాలి. అలా ఉదయించిన వారికి ఈశ్వర దర్శనభాగ్యం కలిగించేదిగా ఆ కాలం ఉండాలి. ఈ అందరకు సేవచేయడానికై పుణ్యాన్ని పండించుకొన్న భాగ్యవంతులుకూడా జన్మించడానికి వీలుగా ఆ కాలం ఉండాలి. ఇలా పరమేశ్వరావతార కాలం పరమపుణ్యముతో ఘనీభవించినదై ఉంటుందే కాని సాధారణంగా ఉండదు.

వృషాచలంలో శివగురువు ఆర్యాంబ పుత్ర ప్రాప్తిని కోరి స్వామికి భజన చేస్తూ వచ్చేరు. శివగురువు యొక్క తండ్రి పేరు విద్యాధిరాజు. ఒకనాడు స్వామి శివగురువునకు స్వప్నంలో దర్శనం యిచ్చేరు. అలా దర్శనం యిచ్చిస్వామి మీకు దీర్ఘయుష్కులు, మూర్ఖులు అయన నూరుగురు పుత్రులు కావాలా, లేక అల్పాయుష్కుడై, సర్వజ్ఞుడైన ఒక్క కుమారుడు కావాలా! అని ప్రశ్నించేరు. శివగురువుకు ఏమి కోరాలో తెలియలేదు. ''స్వామి! నేను ఈ విషయమై నా భార్యను అడిగి నిర్ణయించి మీకు విన్నవిస్తాను'' అన్నాడు శివగురువు. అంతే! కల చెదరింది. మెలుకువ వచ్చింది. ఆయన తన భార్య ఆర్యాంబతో తనకు కలిగిన స్వప్నం విషయం చెప్పగా ఆమే తనకు కూడా ఇట్టి స్వప్నమే వచ్చింది అని అన్నది. అపుడు భార్యాభర్తలు ఇద్దరూ స్వామికి నమస్కరించి - ''ప్రభూ! మమ్మెందుకు ఇలా పరీక్షిస్తావు. ఏది మాకు మేలని నీవు భావిస్తావో అదే చెయ్యి; ఆ వరమే ప్రసాదించు'' అని ప్రార్థించేరు. అపుడు పరమేశ్వరుడు తానే స్వయంగా వారి యింట అవతరిస్తానని, కొన్ని సంవత్సరాలు మాత్రం ఉంటానని వారికి తెలిపేడు.

ఆర్యాంబా శివగురువులు గ్రామానికి చేరుకొన్నారు. భజన పూర్తి కాగానే సమారాధన చేయడం ఒక ఆచారం. శివగురువు సమారాధన చేసేడు. బ్రాహ్మణులు తృప్తిగా భుజించేరు. అలా బ్రాహ్మణులు భుజించగా మిగిలిన ప్రసాదాన్ని ఆర్యాంబ స్వీకరించింది. అపుడు ఐశ్వర్యమైన (ఈశ్వరసంబంధమైన) తేజం ఆమే గర్భంలో ప్రవేశించింది. ఆమె గర్భవతియై తొమ్మిదినెలలు నిండగానే ఆచార్యులవారిని ప్రసవించింది. జాతకర్మ చేయబడింది. పుట్టిన పదునారవరోజున శిశువుకు నామకరణం చేయాలి అనుకొన్నారు. మళయాళదేశంలో జన్మ నక్షత్రమును జన్మతిథిని పేరుగా పెట్టుకొనే సంప్రదాయం ఒకటి ఉంది. తిరువాన్కూరు మహారాజులలో 'మూలతిరునాళ్‌, విశాఖ తిరునాళ్‌' అనే పేర్లు కలవారు ఉన్నారని చాలామంది ఎరుగుదురుకదా! ఆవిధంగానే శిశురూపంలో ఉన్న శివునకు నామకరణం చేయదలచేరు.

ఆచార్యులకు వారి జన్మదివసాన్ని అనుసరించి పేరు పెట్టవలె ననుకొన్నారు. ఆలోచించి 'శంకర' అని పేరు పెట్టేరు. వేదంలోని 'శంకర' పదం చూచి వారు ఈ పేరు పెట్టలేదు. భగవత్పాదుల అవతారదివసాన్ని బట్టియే ఈ పేరు పెట్టేరు. వారు వైశాఖ శుద్ద పంచమినాడు అవతరించేరు. అనగా ఐదవ తిథి, ఒకటవ పక్షం, రెండవమాసం అయినాయి. ఈ అంకెలను 'శంకర' అనే అక్షరాలు సూచిస్తాయి. 'యాద్యష్టౌ' అనే సూత్రాన్ని అనుసరించి 'శ' అంటే ఐదు. 'కాది నవ' అనే సూత్రాన్ని అనుసరించి 'క' అంటే ఒకటి తిరిగి 'యాద్యష్టౌ' అనే సూతప్రకారం 'ర' అంటే రెండు అవుతుంది. వీనిని తిరుగవేస్తే 'రెండవమాసం మొదటి పక్షం ఐదవ తిథి' అనే అర్ధం వస్తుంది. ఇలా తిథి పక్షమాసాలను సూచించే సంఖ్యాసంకేతంగా 'శంకర' నామధేయం వీరికి ఏర్పడింది. ఆచార్యులకు తల్లిదండ్రులు పెట్టినపేరు ఇదే.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/3.html
 

వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత


వైశాఖమాస మహాత్మ్యము : దానముల విశిష్టత

వైశాఖమాసములో జలదానము మిక్కిలి శ్రేష్ఠమైనది. అందువలన వైశాఖమాసమునందు చలివేంద్రములు కట్టించి ,దాహముగొన్నవారికి దాహము తీర్చిన యెడల సమస్తపాపములూ నశించును.

దప్పిక తీర్చుటకు జలంగానీ , ఎండకు గొడుగునుగానీ , పాదములకు పాదరక్షలుగానీ , శరీరతాపం తగ్గుటకు విసనకర్రనుగానీ దానమిచ్చినచో అట్టివారికి సమస్తపాపములూ నశించును.

వైశాఖమాసము ఆరంభము కాగానే ఒక బీదబ్రాహ్మణునకు కలశమునిండా జలంపోసి దానంచేసి నమస్కరించినయెడల అన్ని దానములకన్నా ఈ దానం వలన మిక్కిలి ఫలము పొందినవాడగును.

ఈ మాసములో ఒక బ్రాహ్మణునకు గొడుగును దానము చేసినచో విష్ణుమూర్తి సంతసించి సకలైశ్వర్యములూ ఇచ్చును.

కాలిజోళ్ళు ఎవరు దానమిచ్చెదరో అట్టి పుణ్యాత్ముడు తన అవసానకాలమున యమకింకరులు తనను తీసుకుని పోవుటకు వచ్చినపుడు ఆ యమకింకరులను నిర్భయంగా తరిమికొట్టి విష్ణుసాయుజ్యమును పొందవచ్చును.

ఉత్తమ బ్రాహ్మణునకు జలపాత్ర , విసనకర్ర , గొడుగు , కాలిజోళ్ళు దానమివ్వవలెను.

అన్ని దానములకంటే అన్నదానము గొప్పది. ఎండలో అలసి వచ్చిన విప్రునకు తనశక్తికొలదీ స్వల్పమైననూ భోజనము పెట్టినచో కోటిదానములు చేసిన పుణ్యఫలం కలుగును.

వైశాఖమాస మహాత్మ్యము : ఆరంభము



వైశాఖమాస మహాత్మ్యము : ఆరంభము

వైశాఖమాసమునందు చేసిన దానధర్మములు, యజ్ఞయాగములు, స్నానజపములు మొదలగు కర్మలన్నియు మానవుని సమస్తపాపములను నశింపజేయును.

ఈ మాసము గొప్ప తపోమహిమ కలిగి ఉన్నది.

వైశాఖమాసములో సూర్యుడు ఉదయించు వేళకుముందు మేషసంక్రమణ కాలములో ఏ మానవుడు స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించునో అట్టి మానవునియెడ శ్రీహరి పరిపూర్ణ కటాక్షము కలవాడు అగును.

శ్రీమన్నారాయణుని  ఆజ్ఞను అనుసరించి దేవతలు  వైశాఖమాసములో సూర్యోదయము అయిన ఆరుఘడియల వరకు మానవులమేలు కొరకు బహిర్జలముయందు సన్నిహితులై ఉందురు.

స్నానముచేయుటకు నది అందుబాటులో లేనుయెడల, తటాకమువద్దగానీ, బావివద్దగానీ స్నానము చేయవచ్చును. 

చైత్ర బహుళ అమావాస్యనాడు పానకముతో నింపిన కలశమును, మల్లెపూలనూ, సుగంధద్రవ్యములనూ బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల తీర్థస్థలములలో వంద మార్లు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేసినంత ఫలితమును పొందగలరు.


 

Monday 24 April 2017

పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి



పరమాచార్యుల అమృతవాణి : బంధాలు వదల్చుకోవాలంటే బంధంలో చిక్కుకోవాలి
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

అద్వైతం సర్వాన్నీ సమ్మతిస్తుంది. ఆ అద్వైతస్థితిని పొందాలంటే వేదాలు చెప్పినట్లు కర్మానుష్ఠానాలు చెయ్యాలి. కర్మాచరణంలో మనం ఎంత శ్రద్ధా విశ్వాసాలు చూపిస్తామో అద్వైతస్థితి అంతగా సన్నిహితం అవుతుంది. కర్మానుస్ఠానానికి భేదస్థితి అవసరం. దానివల్లనే అభేదస్థితి చేకూరుతుంది.

'అదేమిటి? భేదాన్ని పాటిస్తూ కర్మాచరణం చేసిన వానికి భేదస్థితే లభిస్తుంది కాని అభేదస్థితి లేక అద్వైతం ఎలా లభిస్తాయి? అద్వైతం ప్రాపించాలంటే ఉన్న నియమాలు నిబంధనలు అన్నీ తొలగాలి- ఈ నియమాలన్నీ ఎందుకు? ఇవన్నీ అద్వైతస్థితికి అభేదస్థితికి బాధకాలు కావా?' అని కొందఱు తలుస్తూ ఉంటారు.

కాని మనం చాలా పెద్దబంధంలో చిక్కి ఉన్నాము. కామక్రోధాలకు వశులమై మనము సంపాదించిన పాపాలమూట చాలా పెద్దిది. దాని నెలా వదల్చుకోగలం? అన్నది ముందు ఆలోచించాలి. వర్ణాశ్రమధర్మాలు అనే వేరొక బంధంలో చిక్కుకొంటే కామక్రోధాల బంధం సడలుతుంది. పాపాచరణానికి తావుండదు. క్రమంగా మానవుడు నిస్త్రైగుణ్యస్థితికి చేరుకొంటాడు. ఆ స్థితికి చేరుకొన్న వానికి విధి నిషేధాలు లేవు.

'నిస్త్రైగుణ్య పథి విచరతాం కోవిధిః కోనిషేదః'

కాగా త్రిగుణాలకు (సత్వరజస్తమోగుణాలు) కట్టుబడి ఉన్నంతవరకు వర్ణాశ్రమధర్మాలకట్టు తప్పనిదే. ఆ కట్టులేక పోయిననాడు ఈ కట్టు ఉండదు. దానికొరకే యీ అనుష్ఠానాలన్నీ ఆచరించడం.

దేహంలోని బాధను తొలగించుకొనడానికి ఆముదం త్రాగుతూ ఉన్నాం. ఆముదం త్రాగడం బాధగాని సుఖం కాదు కదా! అంటే ఒక బాధను తొలగించుకొనటానికి వేరొక బాధను ఆహ్వానిస్తున్నాం. అలాగే త్రైగుణ్యమైన బంధాన్ని వదల్చుకొనడంకోసం వర్ణాశ్రమధర్మాల బంధంలో చిక్కుకోవాలి. ఈ బంధాన్ని మనం ఎంతగా బిగిస్తే ఆ బంధం అంతగా సడలుతుంది. పూర్తిగా సడలిన మీదట రెండుబంధాలు తొలగుతాయి.

ఇలా కర్మానుష్ఠానాలు చేస్తూ క్రమంగా అద్వైతాన్ని పొందాలని ఆచార్యువారు చెప్పేరు.

http://jagadguru-vaibhavam.blogspot.com/2017/04/blog-post_24.html
 

Sunday 23 April 2017

శంకరచరితామృతము : 2 : అవతారకారణము



శంకరచరితామృతము : 2 : అవతారకారణము
పరమాచార్యుల అమృతవాణి

@ శంకరవాణి


యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత|
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం||


'ధర్మం క్షీణించి అధర్మం విజృంభించిన సమయంలో నేను పుడమిపై అవతరిస్తాను' అన్నారు శ్రీకృష్ణభగవానులు. అనగా వెనుక వివస్వానునకు దెల్పిన యోగం యిప్పుడు లోకంలో నశించింది. దానిని పునరుద్ధరించడానికే నా యీ అవతారం. నేను నారాయణుడను, నీవు నరుడవు. వెనుకటి అనేకములైన పుట్టుకలు నేనెరుగుదునే కాని నీ వెరుగవు అని అంటారు ఆయన. ఇలా శ్రీకృష్ణులు ఎన్నోసార్లు అవతరించేరు. ప్రతి అవతారములోనూ జ్ఞానోపదేశంచేశారు. ఎప్పుడు జ్ఞానోపదేశం చేసినా ఈశ్వరునితో అభేదంగా ఉండి విశ్వరూపం ప్రదర్శిస్తూ (భిన్న భిన్న విధాలుగా) వచ్చేరు.

జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిదే లభింపదు.

ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్‌ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్‌|
ఈశ్వరాత్‌ జ్ఞాన మన్విచ్ఛేత్‌ జ్ఞానదాతా మహేశ్వర:||


జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.

నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.

శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.

కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.

'అతికళ్యాణరూపత్వా న్నిత్యకల్యాణ సంశ్రయాత్‌'

శివము, కల్యాణము, మంగళము, శుభము అన్నీ శివుడే, ఆ శివుడే పరమ మంగళస్వరూపులైన మన ఆచార్యులు.

ఆదిలో ఉండే అద్వైతాన్ని ఉపదేశించడానికై ఈశ్వరాంశ మన ఆచార్యులుగా అవతరించింది. కలిలో అధర్మం ఎలాగూ ఉంటుంది. కాని ఆ అధర్మం పెరుగకుండా నిరోధించాలి .

మన ఆచార్యులు ప్రధానంగా అద్వైతాన్ని బోధిస్తూ దానికి దిగువ భిన్నమత సంప్రదాయాలకు నిలువనీడ నిచ్చారు. ఇలా ఎందుకు చేసేరు? అంటేపరమమైన మోక్షానికి అంతా అధికారులుకారు. కొందఱు మోక్షానికి అధికారులైతే మరికొందరు వారితో సమానమైన పక్వతలేని వారై సాధనపథంలో వారి కంటే దిగువ నిలువవలసినవారుగా ఉంటారు. ఆ మతం వారి వారి పక్వత ననుసరించి ఆయా మతాలు ఉపయోగిస్తాయి. కాని అన్నిటికి గమ్యం అద్వైతం కావాలి. అది మరుగున పడిపోకూడదు. అందుకే వారు ఎన్నిమతాలున్నా అన్నిటికి శిఖరంగా అద్వైతాన్ని బోధించారు.

నీరు అన్నిచోటులందు ఉంటుంది. కాని అన్నిచోటులందు నిర్మలంగా ఉండదు. బావినీరున్నది. అది నిర్మలంగానే ఉంటుంది. దానిలో మలినాలు కలియడానికి అవకాశం లేదు. అలాగే అద్వైతమూ- మిగిలిన మతాలు ఉన్నాయి. మిగిలినవి చిక్కుమార్గాలైతే అద్వైతం రాజమార్గం. వానిద్వారా మోక్షసిద్ది ఎప్పటికో! కాని అద్వైతం శ్రీఘ్ర సిద్ధి నిస్తుంది. 'సూతసంహిత, వైద్యనాధదీక్షితయము' అనే గ్రంథాలలో - ఈ విషయమే చెప్పబడ్డది.

శ్రీశంకరభగవత్పాదులు అవైదికమతాలను కూకటి వ్రేళ్లతో పెల్లగించడానికై అవతరించారు, ఉపాసనా, కర్మజ్ఞానమార్గాలను దాటిన అద్వైతాన్ని స్థాపించడానికి అవతరించారు. ఆయన దిగ్విజయం చేసేరు. వాస్తవానికి దిగ్విజయం చేసినది ఆచార్యలొక్కరే. వారు ఈలోకంలో ఉన్నది కేవలం ముప్పదిరెండు సంవత్సరాలు. బాల్యం పదిసంవత్సరాలు. బాల్య పదిసంవత్సరాలు అనుకొంటే మిగిలినది ఇరువదిరెండు సంవత్సరాలు, ఈ కాలంలో వారు ఆసేతుశీతాచలం మూడుసార్లు పర్యటించేరు, దిగ్విజయం చేసేరు. దీనికి నిదర్శనాలేమిటి? అని ఎవరైనా శంకించవచ్చు. బదరీనారాయణానికి ఆచార్యులు వెళ్లినట్లు నిదర్శనాలున్నాయి. అలాగే దక్షిణాన 'కాలడి'లో వారు జన్మించినట్లు నిదర్శనాలున్నాయి. వారు దేశంలో పలుచోటుల సంచరించినట్లు ఎన్నో సాక్ష్యాలున్నాయి. అన్వేషించేవారికి అవి దుర్లభాలు కావు. ఇలా అల్పకాలంలో విస్తారమైన దేశంలో పర్యటించి ఎన్నో మహాకార్యాలు నిర్వర్తించినవారు సామాన్యులు కారు వారు ఎవరో అవతారపురుషులు అని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది.

రామకృష్ణాదులు తాము అవతారాలైనప్పటికి ఇహలోకంలో తమ స్థానాలకు విహితములైన ధర్మాలను అనుసరిస్తూ వానికి అనుగుణంగానే నడచుకొంటూ వచ్చేరు. అట్లే శంకర భగవత్పాదులు కూడ తాము సాక్షాత్‌ పరమేశ్వరులే అయినప్పటికి పూజాద్యనుష్ఠానాలు యథావిధిగా ఆచరిస్తూ భక్తులవలె నడచుకొన్నారు. అందుచే అవతారం మొదలు సిద్ధిపర్యంతమై వీరిచరిత్ర పూర్తిగా శివరహస్యంలో భక్తుల చరిత్రకల నవాంశలో పదునారవ అధ్యాయంలో వర్ణింపబడింది.

కేరళే శశలగ్రామే విప్రపత్న్యాం మదంశజః|
భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో దిజోత్తమః||

- శివరహస్యము.

అని అందు ఉన్నది. అందులో శంకరుల కాలం కలి ఆదిలో రెండువేల సంవత్సరాలకు పిమ్మట అని కానవస్తుంది. ఇక వారి చరిత్రను గూర్చి 'శంకరులు కైలాసానికి వెళ్ళి భోగ లింగము, యోగలింగము, వరలింగము, ముక్తిలింగము, మోహలింగము అనే ఐదు లింగాలను తెచ్చారని, వానిని ఆరాధించియే ఇతరమతాలను ఖండించి దిగ్విజయం చేయగలిగేరని, ఇది అంతా ఆ లింగారాధనవల్ల కలిగిన బలమని'- ఆ గ్రంథంలో వ్రాయబడ్డది. అది శివమహాత్మ్యాన్ని తెలిపే గ్రంథం కదా! అందుచే ఆచార్యుల దిగ్విజయానికి కారణం పంచలింగారాధనం అని చెప్పినది.

శంకరవిజయ గ్రంథాలకు వ్యాఖ్యలు వ్రాసినవారు తమ వ్యాఖ్యలలో శివరహస్యంలోని శ్లోకాలను ఉదహరించేరు. శివ రహస్యం వాస్తవానికి ద్వైతగ్రంథం. శ్రీ శంకరులు పునరుద్ధరించినదీ అద్వైతసిద్దాంతం. ద్వైతమతావలంబకులు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు. అది వారికి సహజం. అయినా శివరహస్యంలో ఆచార్యులచరిత్ర ఉంది. ఇది విశేషం. మూడు వేళలా బిల్వదళాలతో శివార్చనం చేయుమని పరమేశ్వరుడు శంకరులకు ఆజ్ఞాపించేరని అందులో ఉన్నది.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/2.html

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1 : శంకరుల గురుపరంపర



పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 1

శంకరుల గురుపరంపర : గౌడపాదులు, గోవింద భగవత్పాదులు

@ శంకరవాణి

పతంజలి ఆదిశేషుని అవతారం. వ్యాకరణ మహాభాష్యం వ్రాసింది వీరే. వేయి జిహ్వలు కల ఆ పతంజలి చెప్పిన వ్యాకరణ భాష్య ప్రశస్తి విని దానిని చదువుకొనడానికి వేయిమంది శిష్యులు వచ్చారు. పతంజలి చిదంబరంలో వేగాళ్ల మంటపంలో ఉన్నారు. వేయిమందికి ఒకేమారు సందేహనివారణం చేయవలెనంటే ఒక నాలుక ఏం చాలుతుంది? అందు కోసం వారు ఆదిశేషునిరూపం తాల్చారు. అయితే శేష దృష్టి విష దృష్టి, నిట్టూర్పులు విషం కక్కుతూ వుంటై. అవి సోకితే ఎవరయినా సరే చిటికలో చిటికెడు భస్మమైపోతారు. అందువల్ల ఆయన తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టారు. తెరలోపల తామూ తెర వెలుపల శిష్యులూ పాఠం చెపుతూ వుండగా నడుమ ఎవరు లేచి పోయినా సరే వారు బ్రహ్మరాక్షసులయిపోతారని పతంజలి ఒక కట్టడి చేశారు.

ఆజ్ఞ తీసుకొనకుండా బయటికి పోయినవాడు బొమ్మరాకాసి అయిపోతాడని కట్టడి చేసి పతంజలి ఆదిశేషుడై తెరలోపల కూర్చుండి పాఠం చెప్పడానికి పూనుకొన్నాడు. ఆ శిష్యులలో ఒకనికి మాత్రం సందేహం తోచింది - 'మనమేమో వేయిమందిమి, ఒక్కడు ఈ వేయి మందికీ ఎట్లా సమాధానం చెపుతాడు?' అని ఇట్లా అతడు సందేహించి ఆజ్ఞోల్లంఘనం చేసి తెర తొలగించి చూచాడు. అట్లా చూచాడో లేదో విషదృష్టి వారందరిమీదా ప్రసరించింది. అక్కడున్న శిష్యులందరూ పిడికెడుబూడిద అయిపోయారు. బూడిద అయిపోయిన వారు తొమ్మన్నూట తొంబది తొమ్మిది మంది. ఒకడు మాత్రం ఎక్కడికో వెళ్లాడు. అతగాడు కొంచెం బండబ్బాయి. అతనికి పాఠం తిన్నగా తెలియడం లేదు. కొంతసేపు అటూ ఇటూ తిరిగి వస్తే బుద్ధి స్థిరపడి పాఠం సరిగా అర్ధం అవుతుందేమో అని అనుకొని అతడు బయటికి వెళ్లాడు. ఇక్కడ భస్మమయి పోయిన శిష్యులను చూచిన ఆదిశేషుడు మళ్లా పతంజలియై వారి దుర్మరణానికి దుఃఖిస్తూవుండగా, వెలికి వెళ్ళిన శిష్యుడు - ''గురువుగారి ఆజ్ఞ మీరి బయటికి వెళ్ళితినే, గురువేమి కోపం తెచ్చుకుంటాడో'' అని బితుకు బితుకుమంటూ వచ్చాడు. పతంజలికి అతనిని చూడగానే సంతోషం కలిగింది. బండబ్బాయి అయితే అయినాడుకాని ఒకడయినా మిగిలాడుగదా అని ఊరటచెందాడు. ఇక అతనికి పాఠం చెప్పేటంత వ్యవధి తనకు లేదు. కాబట్టి అతనిని ఎట్లాగయినా అనుగ్రహించాలని - 'నాకు తెలిసినదంతా నీకు తెలియాలి. అయినా నా ఆజ్ఞ దాఁటి నీవు ఆవలికి వెళ్ళావు. కాబట్టి బ్రహ్మరాక్షసుడ వవటం నీకు తప్పదు. కాని దాని కొక నివృత్త్యుపాయం ఉన్నది. నే నిచ్చిన విద్యను పాత్రమెరిగి నీ వెపుడుపదేశిస్తావో అపుడు నీకీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని అన్నాడు. అనుగృహీతుడయిన ఈ శిష్యుడే గౌడపాదులు. ఆయన గౌడదేశం నుంచి వచ్చారు. ఆయన గురుశాపంచేత బ్రహ్మరాక్షసుడై కూచున్నాడు.

బొమ్మరాకాసి ప్రతిదినమూ ఒక బ్రాహ్మణ్ణి వేదాధ్యయనం చేసినవాణ్ణి గుటకాయ స్వాహా చేస్తూ ఉంటాడు. ఒక శాఖను అధ్యయనం చేసిన వాణ్ణి దూరంగా ఎత్తుకొని పోయి పలు తీరుల ప్రశ్నలు వేయడమూ, వాళ్ళు ప్రత్యుత్తరించలేక పోవడమూ గుటకాయ స్వాహా చేయడమూ ఇది బొమ్మ రాకాసులకు మామూలు. బొమ్మరాకాసి అయిపోయిన గౌడుడు నర్మదాతీరంలో ఒక రావిచెట్టు మీద కూచున్నాడు. ఆ చోటు పంచగౌడ దేశాలకూ పంచద్రావిడ దేశాలకు నట్టనడుమ ఉన్నది. దక్షిణమునుండి ఉత్తరానికిన్నీ ఉత్తరము నుండి దక్షిణానికిన్నీ పోయేవారికి అది దారి. ఉత్తరదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు చదవబోయే దాక్షిణాత్యులున్నూ దక్షిణదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు నేర్వపోయే ఔత్తరాహులున్నూ అనుదినమూ ఆ దారిగుండానే రాకపోకలు చేస్తూవుండేవారు. గౌడులు ఆ వచ్చిపోయేవారిని వ్యాకరణంలో ఒక ప్రశ్న అడిగేది, వారు దానికి బదులు చెప్పలేకపోయేది, ఆ పళంగా వారిని చంపి ఫలాహారం చేసేది. ఇది వాడుక ఐపోయింది. పచ్‌ (డు పచష్‌ పాకే) అనే ధాతువొకటి ఉన్నది. దానికి నిష్ఠాప్రత్యయమైన క్త చేరిస్తే 'పక్వమ్‌' అని అవుతుంది. కాని 'పక్తమ్‌' అని మాత్రం కాదు. దీనికి ప్రత్యేకించి - 'పచో వః' (8-2-52) అని ఒక సూత్రమున్నది. దాని వల్ల 'పక్త' అని కాక 'పక్వ' అని అవుతుంది. గౌడ బ్రహ్మరాక్షసుడువైయాకరణుడు ఎవడయినా కనబడితే 'పచ' ధాతువుకు నిష్ఠలో రూపం ఏమిటి? అని ప్రశ్నించేవాడు. 'పక్తం' అని సమాధానం వచ్చేది. ఎంచేత నంటే అప్పటికింకా మహాభాష్యం అవతరించలేదు. 'పచ' అనే ధాతువుకు నిష్ఠలో వేరు రూపం కలుగుతుందని తెలియని కాలం అది. 'పక్తమ్‌' అని చెప్పగానే - 'పక్తం కాదు; పక్వమ్‌, అని ఔతుంది, నీవు కూడా పక్వమనే అని అంటూ ఆబొమ్మరాకాసి వానిని గుటుక్కున నోట్లో వేసికోనేవాడు. ఇది గౌడుల దినచర్య.

ఇట్లా ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆ తోవన వచ్చాడు. చాలా చక్కగా ఉన్నాడు. బొమ్మరాకాసి అతనిని చూడంగానే ఉప్పొంగిపోయాడు. ఎంచేత? నాటికి మంచి ఆహారం దొరికిందీ ఇంకేం తన అస్త్రం తీశాడు. అతడు మహాభాష్యం శాంతిచేయడానికి కాశ్మీరం నుంచి చిందంబరం వెళుతున్నాడు. అతన్ని నిలేసి ఆ బొమ్మరకాసి 'పచ' ధాతువుకు క్త ప్రత్యయం చేరిస్తే ఏమిటిరూపం? అని అడిగాడు. అతడు 'పక్వమ్‌' అని చెప్పాడు. గౌడునకు అపరిమితమయిన ఆనందం కలిగింది. 'ఎన్నో నాళ్ళుగా సరియయినవాడొకడయినా రాలేదు, నేటికి అట్టి వాడవు నీవు వచ్చావు, నీవు సరియయిన శిష్యుడవు. నా గురువు గారు నాకు చెప్పిన విద్యలన్నీ నీకు చెపుతాను, నీ వెక్కడికి వెళుతున్నావు' అని అడగాడు. అతడు వ్యాకరణం చదువు కోడానికి చిదంబంరం పోతున్నాను' అని చెప్పినాడు. 'నాయనా' అలాగా? చిదంబరం విషయం ఎపుడో కొండెక్కింది. అచట నీవు అభ్యసింపగోరే విద్యలను నేనే నీకు చెప్పగలను, నీ విక్కడ ఉండేం' అని గౌడు లన్నారు.

బ్రహ్మరాక్షసుని గురువునుగా వరించి ఎవరు నెగ్గగలరు? దయ్యాలముందు బిడ్డలా? ఎనాళ్ళా బ్రహ్మరాక్షసుడు పాఠం చెబుతాడో అన్నాళ్ళూ చెట్టుదిగరాదుగదా, నిద్రాహారాలుండవు గదా, పాఠాలు రాక్షసివేగంతో ముగించాలిగదా! ఇవన్నీ ఇలా తెలిసినన్నీ శిష్యుడు విని అన్నింటికీ తల ఒగ్గాడు.

పాఠాలు వ్రాసికొందామంటే తాటాకులూ లేవు, గంట మంతకంటే లేదు. పైగా చెట్టు చివరమెట్టు మీద పాఠశాల. చెట్టు దిగకూడదు. అంచేత ఆ శిష్యుడు తన తొడ చీరుకొని అందుండి కారే నెత్తురులో ఒక పుడక కలముగా ముంచి రావాకులమీద ఆ బొమ్మరాకాసి చెప్పేదంతా వ్రాసికోవడం సాగించాడు. ఇలా తొమ్మిది రోజులు నిద్రాహారాలు లేక గడచినవి. ఆ రావియాకులలో ఆ శిష్యుడు వ్రాసికొన్న పాఠమే మహాభాష్యం. ఆ శిష్యుని పేరు చంద్రశర్మ. ఈ కథ పతంజలి విజయం అనే పుస్తకంలో చూపబడుతుంది. పతంజలియే తన శిష్యుడయిన గౌడునికి శాపవిమోచనం చేయడానికి చంద్రశర్మగా వచ్చినటులు ఆ గ్రంథంలో చదువుతాం. ఈ చంద్రశర్మయే తరువాతి ఆశ్రమమున శ్రీ శంకరులకు గురువుగా గోవింద భగత్పాదులను పేర అవతరించారు. గౌడులు గౌడ పాదాచార్యులవారు అనే ప్రసిద్ధి పొందారు.

చంద్రశర్మ వ్యాకరణం పూర్తిగా అయింది. గౌడులకు శాపనివృత్తి అయింది. 'నాకిక వైరాగ్యం శరణ్యం, ఆత్మను ధ్యానించాలి. దానిని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలి' అని గౌడపాదులు ఆలోచించి ఆలోచించి సమకాలికులలో అట్టివారు, జన్మతోనే జీవన్ముక్తలయినవారు ఎవరా అని తఱచిచూడగా శుక్లాచార్యులు అని అనుకొన్నారు. శుకులు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. యత్నమే లేదు. యజ్ఞాద్యనుష్టానాలు అంతకు ముందే లేవు. 'అంతా మనమే' అని భావించినవారు శుకులు. అనగా అన్నిటిలోనూ నేను ఉన్నానని అర్థం. అట్టి శుకాచార్యుల అనుగ్రహం పొందాలని గౌడసాదులనుకొన్నారు. శ్రీ శుకాచార్యులవారు హిమాలయములో బదిరాకశ్రమంలో ఉన్నారని తెలిసికొన్నారు. తెలిసికొని వారి కడకు వెళ్లారు. వారి దగ్గర సన్న్యాసం పుచ్చుకొన్నారు. అపుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు.
గౌడపాదులు శ్రీ శుకులవద్ద సన్యాసం స్వీకరించి ఆత్మ నిష్ఠయందున్నారు.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కుమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. ఇట్టి చికిత్స మన వైద్య శాస్త్రాలలో చెప్పబడ్డది. నేడు 'ఇంజెక్షనుల' ద్వారా అన్నసారాన్ని శరీరంలోకి ఎక్కించే విధానం ఉన్నది. కాని ఇది హింసతో కూడినది. శరీరమున సూదితో క్రొత్తగా నొక రంధ్రము చేయనిదే యిది సాధ్యం కాదు. కాని పై చికిత్స సులభమైనది. సహజమైనది. కేరళదేశంలో నేటికిని దీనిని పోలిన చికిత్స ఆచరణలో ఉన్నది.

మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు. అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు. కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజు కదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లీడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది. అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు. ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు.

కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది. ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/1.html
 

Saturday 22 April 2017

పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది



పరమాచార్యుల అమృతవాణి : కలిలో ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువ, కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది
(జగద్గురుబోధల నుండి)

@ శంకరవాణి

కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.

జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.

మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.

కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ప్రయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.

ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.

అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.

'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు. 

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/blog-post.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.