Monday 31 October 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 51 - 55



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 51 - 55

భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహా(ఽ)సితవపుః పఞ్చేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనో(ఽ)వనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు: ॥ 51 ॥


శంకరులు శ్రీశైలేశుడైన శివుడు ఒక గండుతుమ్మెద అని చెబుతూ, ఆ తుమ్మెదను తన మనస్సు అనే పద్మములో‌ విహరించమని పిలుస్తున్నారు. శివునికి తుమ్మెద లక్షణాలను శంకరులు ఎలా ఆపాదించారో చూడండి.

గండుతుమ్మెద భృంగి (ఆడుతుమ్మెద) ఇచ్ఛానుసారముగా నాట్యముచేయునది. గజముయొక్క మదజలము గ్రహించునది. మాధవమాసము వలన (వసంతములోని వైశాఖము) ఆనందము పొందునది. ఝంకారనాదము కలిగినది. అసితవపుః - మహా నల్లని శరీరం కలది. మన్మధుడిచే తనకుసహాయముగా (తుమ్మెదలు మన్మధుని వింటినారి) నిశ్చయించబడినది. పూదోటలయందు ఆసక్తి ఉన్నది.

శివుడు భృంగి ఇచ్ఛానుసారముగా తాండవము చేయువాడు. గజాసురుని పీచమణచినవాడు. నారాయణుని వలన (మోహినీరూపములో) ఆనందమునొందినవాడు. ప్రణవనాదయుతుడు. సితవపుః - మహా తెల్లని శరీరం కలవాడు. మన్మధుడిచే తనలక్ష్యముగా నిశ్చయించబడినవాడు. సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి కలవాడు.

ఆ శ్రీశైలేశుడు, భ్రమరాంబా పతి, పరమేశ్వరుడు అయిన గండుతుమ్మెద నా మనస్సనే కమలములో‌ విహరించుగాక!


కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనఃసంసేవ్యమిచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్తమయూరమద్రినిలయం చఞ్చజ్జటామణ్డలం
శంభో వాఞ్ఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 ॥


శంకరులు శంభుడిని ఒక నీలి మేఘముతో‌ పోలుస్తూ, తన మనస్సనే చాతక పక్షి ఆ శంభుడనే‌ మేఘమును ఎప్పుడూ‌ కోరుకుంటున్నది అంటున్నారు.

నీలకంఠుడా ! కారుణ్యామృతవర్షము కురిపించువాడవూ, గ్రీష్మమనే గొప్ప ఆపదను పోగొట్టగలవాడవూ, సజ్జనులచేత (దేవతలచేత) విద్య అనే పంట పండుటకై ప్రార్థించబడువాడవూ, ఇష్టం వచ్చిన రూపము ధరించుచున్నవాడవూ, భక్తులనే మయూరములను నర్తింపజేయుచున్నవాడవూ, కొండపైనున్న వాడవూ, శోభించు జటాజూటము కలవాడవూ‌ అయిన ఓ శంభో ! (జలధరమైన మేఘము వంటి)‌ నిన్ను నా మనస్సనే‌ చాతకపక్షి ఎప్పుడూ‌ కోరుకుంటున్నది.



ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-
ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥


ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో‌ విహరించుటయందు అనురాగము కలదీ‌ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.

వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో‌ అనుగ్రహించువాడూ, పార్వతీ‌వల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.

సన్ధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక-
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చఞ్చలా ।
భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వలతాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ॥ 54 ॥


శివుడు మయూరమని చెప్పిన శంకరులు, ఆ మయూరనాట్యము జరుగు పరిస్థితులు ఏవో చెప్పుతున్నారు. ఇది శివుని ప్రదోషతాండవ చిత్రణము.

సంధ్యా సమయమే శరదాగమనము (శరదృతువు). ఆనకమనే వాయిద్యమును విష్ణుమూర్తి తన కరములతో‌ మ్రోగించగా వచ్చిన ధ్వనులే మేఘగర్జనలు. దేవతల దృష్టి పరంపరలే మెరుపులు. భక్తుల ఆనందాశ్రువుల ధారలే వృష్టి. పార్వతీదేవియే‌ ఆడునెమలి. ఇలా మహోజ్వలంగా నాట్యము చేయు (శివుడనే ) నెమలిని సేవించుచున్నాను.


ఆద్యాయామితతేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్దమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిలయోగిభిః సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 55 ॥

ఆదిదేవుడూ, జ్యోతిస్వరూపుడూ, వేదవాక్యములచేత తెలియబడేవాడూ, పొందదగినవాడూ, చిదానందమయమైన ఆత్మస్వరూపుడూ, ముల్లోకాలనూ‌ రక్షించువాడూ, సమస్త యోగులచేతనూ‌ ధ్యానింపదగువాడూ, సురగణములచేత కీర్తింపబడేవాడూ, మాయాశక్తియుతుడూ, చక్కని తాండవముచేయుచూ‌ ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే‌ నమస్కారము.






Saturday 29 October 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 46 - 50



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 46 - 50

ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవై-
రాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాఙ్ఘ్రిసౌధాన్తరే ॥ 46 ॥


పరమేశ్వరుని పాదపద్మములు ఒక భవంతిగానూ, ఆ భవంతిలో పరమహంసలు శాశ్వతవాసులై ఆ పాదపద్మములను సేవించుచున్నట్లుగానూ, మన మనస్సులనే హంసలుకూడా ఆ భవనములో‌ భక్తి భార్యతో కలిసి నివసించవలెననీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

పరమేశ్వరుని పాదపద్మములందలి నఖములు ధవళకాంతులీనుతున్నవి. (జటాజూటము నందలి) చంద్రునినుండి అమృతము స్రవించి ఆ పాదములను కడుగుచున్నది. ఆ పాదములు పద్మపువన్నె కలిగి మిక్కిలి అందముగానున్నవి. పరమహంసలు సమూహములుగా ఆ పాదములను సేవించుచున్నారు. ఓ మనస్సా! నీవునూ ఆ పరమేశ్వరుని పాదపద్మములను భక్తితో ఆశ్రయింపుము.

శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।
దీప్యన్తే గుణకోరకా జపవచఃపుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ॥ 47 ॥


సాధారణంగా వసంతకాలం రాగానే ఉద్యానవనములలో‌ ఎండుటాకులు రాలిపోతాయి. లతలు కొత్త చిగరులు ధరించి విస్తరిస్తాయి. మొగ్గలు తొడుగుతాయి. మొగ్గలు పూలై పూల సువాసనలు నలుదిశలా వ్యాపిస్తాయి. పూదేనె స్రవిస్తుంది. ఫలాలు పక్వానికి వస్తాయి.

శంకరులంటున్నారు - నా హృదయమనే ఉద్యానవనములో‌ శంభుని ధ్యానము అనే వసంతము రాగానే, పాపములనే ఎండుటాకులు రాలిపోతున్నాయి. భక్తిలతలు విలసిల్లుతున్నాయి. పుణ్యములనే చిగురుటాకులు మొలచినవి. గుణములనే మొగ్గలు తొడిగాయి. జప,తప పుష్పాలు పూచి సుసంస్కారాల సువాసనలు వెదజల్లుతున్నాయి. జ్ఞానానందమనే‌ మకరందం ప్రవహిస్తున్నది. సంవిత్తు (సమాధి, అనుభవం) అనే ఫలం వృద్ధి చెందుతున్నది.

నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తామ్బుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యానసరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ॥ 48 ॥


హంసలు తమ నివాసముగా ఎటువంటి సరస్సులు కోరుకుంటాయి ? ఆ సరస్సులలో‌ జలములు శాశ్వతంగా ఉండాలి. జలములు స్వచ్ఛమైనవిగా ఉండాలి. పద్మములతో‌ నిండి ఉండాలి. సువాసనలు వెదజల్లుతూ‌ఉండాలి. గొప్ప హంసలు ఆ సరోవరమును నివాసముగా పొంది ఉండాలి. శంకరులు మన మనస్సులను హంసలతో‌ పోల్చి, ఆ హంసలకు పై లక్షణములున్న ఒక గొప్ప సరస్సును ఆశ్రయించమని ఉపదేశిస్తున్నారు.

ఓ మానస హంస రాజమా! స్థిరమైన శంభుధ్యానమనే సరోవరమును చేరుము. అది శాశ్వతానందమనే జలముతో‌ నిండినది. దేవతల,మునులయొక్క మనోకమలాలకు ఆశ్రయమైనది. నిర్మలమైనది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతున్నది. పాపములు హరించునట్టిది. సుసంస్కారములనే పరిమళములు వెదజల్లునట్టిది. (ఇంత గొప్ప సరోవరము ఉండగా) ఎందుకని అల్పులను ఆశ్రయించటం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమ పడెదవు ?

ఆనన్దామృతపూరితా హరపదామ్భోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మసంవర్ధితా ॥ 49 ॥


ఒక లత బాగా పెరిగి ఫలించాలంటే మనం ఏమేమి చెయ్యవలసి ఉంటుంది ? మంచి పాదుచూసుకొని, అందులో‌ పుష్కలంగా జలం నింపాలి. లత పెరగటానికి ఆశ్రయంగా ఒక కొయ్య పాతాలి. లత విస్తరించటానికి ఒక పందిరి వెయ్యాలి. లతను ఏ కల్మషమూ ఆశ్రయించకుండా చూడాలి. ఆ లతను పోషించాలి. అప్పుడు అది ఫలాన్నిస్తుంది. శంకరులు శివభక్తిని ఒక లతగా పోల్చి, ఆ భక్తి ఎలా ఉండాలో, అది ఎలాంటి ఫలాన్నివ్వగలదో‌ ఉద్బోధిస్తున్నారు.

నా భక్తిలత శివునిపై ప్రేమ అనే జలముతో పూరింపబడినది, హరుని పాదములనే పాదునుండి పుట్టినది, స్థిరత్వమనే‌ గుంజను పట్టుకున్నది. శాఖోపశాఖలుగా విస్తరించి, మనస్సనే ఎత్తైన పందిరిని ఆక్రమించినది. నిష్కల్మషమైనది. పుణ్యకర్మలతో‌ చక్కగా వృద్ధిపొందినది. అలాంటి నా భక్తిలత నిత్యము (శాశ్వతము) అయిన అభీష్టఫలము ఇచ్చునది అగుగాక.


సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం ॥ 50 ॥


శంకరులు తాను శ్రీశైలేశుని సేవిస్తున్నానని చెబుతూ, ఆ శ్రీశైలేశుడు ఎలాంటివాడో వర్ణిస్తున్నారు.

సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో‌భ్రమరాంబాదేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.

శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పుతున్నారు (పరమాచార్యుల అమృతవాణిలో ...)

ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అందలిస్వామి మల్లికార్జునుడు. మద్దిచెట్టును మల్లెతీగ అల్లుకొన్న విధంగా మల్లికార్జునస్వామి ఉన్నాడట. ఈశ్వరుడు స్థాణువు స్థాణువైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నది అర్జునవృక్షం లేదా మద్దిచెట్టు. భ్రమరాంబికయే మల్లెతీవ. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే.

శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వెలసి ఉన్నాడు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు. శ్రుతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తులలో వాసం చేస్తున్నాడు. భ్రమరాంబికా యుక్తుడై, ఆనందమూర్తియై, ముముక్షు హృదయవాటికలలో పరవశుడై తాండవం చేస్తున్నాడు. అట్టి శివాలింగినమైనమల్లికార్జునమహాలింగమూర్తినిసేవిస్తున్నాను - అని భగవత్పాదులవారు అంటున్నారు.

ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది. సంధ్యారంభంలో తాండవంచేసే పరశివుని జటాజూటం విప్పుకొన్నట్లే మల్లెలూ, సాయంతసమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈశ్వరునికి శ్రుతిశిరస్థానాలు వాసమైతే, మల్లెలు నారీశిరస్థానాలను ఆక్రమించుకొంటున్నవి. భ్రమరాంబిక ఈశ్వరాన్వేషణం చేస్తే, భ్రమరములు మల్లెలను అన్వేషిస్తున్నవి. ఈశ్వరునికున్న సద్వాసన మల్లెలకున్నూ కద్దు. భోగీంద్రుడు అనగా సర్పం-శంకరునికి ఆభరణం. భోగీంద్రులకు మల్లెలు అలంకారాలు. ఈశ్వరుడు సుమనస్కులలో-దేవతలలోపూజ్యుడు. సుమనస్సులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేషస్థానం. ఈశ్వరుడు గుణావిష్కృతుడు, అనగా శుద్ధసత్త్వ గుణము కలవాడు. మల్లెలూ గుణావిష్కృతములై అనగా దారములో గ్రువ్వబడి, అందాన్నీ సౌరభాన్నీ వెదజల్లుతూ ఉంటై. ఈశ్వరుడే ఒక్క పెద్ద బొండుమల్లె!

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము




పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము
(జగద్గురుబోధల నుండి)

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ''ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!'- అని.

అనేక స్థలములలో విగ్రహములలో ఈశ్వరుని ఆవాహన చేయురీతినే ఈరోజు దీపములో దామోదరుడనే మూర్తినో లేక ఉమాదేవీ సహితుడైన త్య్రంబకునో- ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కేశవ, నారాయణ, మాధవ- అని చెప్పు నామములతో పండ్రెండవ నామము, దామోదరుడు, ఆయననో లేక ఉమాసహితుడైన త్య్రంబకునో ఆవాహన చేస్తారు.

గొప్ప తపస్వులైన మహర్షులు కొన్నిచోట్ల మహాలింగములలో తమ తపోబలముచే ఈశ్వరుని ఆవాహనచేసి, ఈ లింగములయందు ప్రతిష్ఠుడవై దర్శనార్థము వచ్చే భక్తకోటుల పాపాలను నివృత్తి చేయవలసినదని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయా స్థలాలలో ఉండే మూర్తులపై భక్త శేఖరులైన ఆళ్వారులు, నాయనమ్మారులు ఎన్నో భక్తి గీతాలు పాడి ఉన్నారు. అందుకే ఇట్టి క్షేత్రాలలో‌ఒక విశేషం ఉంటుంది.

ఇదే రీతిని కొన్ని తీర్థాలలో కూడ ఋషులు- ఈతీర్థములో స్నానము చేసినవారికి పాపనివృత్తి కావలెనని- సంకల్పించి ప్రార్థనలు చేసి ఉన్నారు. అందుచే ఈ తీర్థాలకు కూడ ఒక విశేషము ఉంది. వాగనుగ్రహము కలవారు ఇట్టి తీర్థములను కీర్తించారు. అట్లే కృత్తికా పూర్ణిమనాడు దీపములో ఈశ్వరుని ఆవాహనచేసి- ఈ దీపజ్వాలను చూచినను సరే- ఈ దీపజ్వాలపైబడిననుసరే, చూచుటకు శక్తికల జీవులు, శక్తిలేని జీవులు - ఏవి అయినను-వాని పాపములు నశించాలి అని ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి 'లోకా స్సమస్తా స్సుఖనో భవన్తు', అనే సంకల్పము ఋషులు వెలిబుచ్చారు. కృత్తికానక్షత్రము, పూర్ణిమతిథి-రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. నక్షత్రము ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చుటకూడ ఉంది. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము. తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెటతారు. దీపము వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తినో, దామోదరమూర్తినో ఆవాహనచేసి- 'కీటాః పతంగాః' అనే శ్లోకం చదువుతారు.

ఈ దీపదర్శనమువలన మనుష్యుల పాపములేకాదు. పశుపక్షి కీటకముల పాపములు సైతము నశిస్తాయి. మన మలి పుట్టుక ఏదో మనకు తెలియదు. మనము ఏమ్రాను అయినా కావచ్చు. మశకమయినా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణికోటికి పాపనివృత్తి - ప్రసాదించాలి - అని ప్రార్థన చేయుట.

చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై - అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా - దీపము వెలిగిస్తారు.

జ్వాలాదర్శనముచేసే జనుల పాపములేకాక కీటాః - పురుగులు, పతంగాః - పక్షులు, మశకాః - దోమలు, వృక్షాః - చెట్లు, వీని కన్నిటికీ జన్మనివృత్తి కావాలి. చెట్లు చేమలు లతలు కొన్ని రోజు నీరు పోయకపోతే వాడిపోతాయి. శోషిస్తాయి. ఇది మనము ఎఱిగిందే. వాని జన్మసైతము నివృత్తి కావాలి. జల్సేజలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థల్సేస్థావరాలైన జంతువులు- ''దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగినః''. త్ర్యంబకుని ఆవాహన చేసిన దీపము చూచినా, ఆ దీపజ్వాలయొక్క వెలుతురు వానిపైపడినా - పుష్టివర్థకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాపనివృత్తి కావలెనని కరుణాస్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు.

ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నిటికి పాదములే ఉండవు. వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేలకొలది కాళ్లు. అవి సహస్రపాదులు. 'తే ద్విపాద్‌ చతుష్పావ్‌' అని వేదములో చెప్పబడింది. 'సకలము క్షేమముగా ఉండాలి' అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. 'లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు' అని అన్ని లోకాల సుఖమూ కూడ కోరాలి.

కృత్తికా దీపమునాడు చెప్పవలసిన శ్లోకము

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||


పై శ్లోకమును విడివిడిగా భాగించి స్ఫుటంగా చెప్పడం. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు పశువులు పక్షులు కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అనియే. అదే ఈ శ్లోక తాత్పర్యము. ఇది పరంపరగా వస్తూ ఉంది. ఈశ్వరుని ఆవాహన చేసిన ఈ దీప ప్రకాశమే పరమేశ్వర స్వరూపము, పాపవిమోచకము.

కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని - జ్ఞాపకార్థమైఉంది. ఈ ఆరు నక్షత్రములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఆరు నక్షత్రములే షణ్మాతృకలైన సుబ్రహ్మణ్యస్వామియొక్క తల్లులుగా చెప్పబడుతూ ఉన్నవి.

మరొక విశేషం, ఏమంటే - శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము - కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క ఉత్సవము విశేషము. కాని అన్ని గుడులలో, అన్ని క్షేత్రములలో - ఒకే రోజున విశేషముగా - మూర్తి భేదములేక చేసే ఉత్సవం ఇదే 'లోకా స్సమస్తాస్సుఖినో భవన్తు' అనే వాక్యానికి వ్యాఖ్యానమా? అన్నట్లు - ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణికోటికి జన్మనివృత్తి ఔతోంది. అందుచే మనము కృత్తికా పూర్ణిమనాడు (కార్తికమాసమున పూర్ణిమనాడు) దీపదర్శనముచేసి- దామోదరుని ఉమాసహిత త్ర్యంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనచేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాపనివృత్తులమై లోకులక్షేమానికై ప్రార్థించుట కర్తవ్యము.

ఈ మనోభావము సార్వజనికము కావాలి. అప్పుడందరి ఆపదులు తొలుగుతాయి. అందరి సుఖమే మనసుఖము అందరి క్షేమమే మన క్షేమము. 'లోకాస్సమస్తా సుఖినోభవన్తు' అనే ప్రార్థనయే మనము అనవరతము చేయవలసినది.

Friday 28 October 2016

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?



పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ?
(జగద్గురుబోధలనుండి)

పండుగలలో దీపావళిని పరికింతాం. ఉపదేశగ్రంథాలలో భగవద్గీత కెట్టి ఖ్యాతియో, పండుగలలో దీపావళికట్టి ప్రఖ్యాతి ఏర్పడిఉన్నది. పండుగలలో ఎన్నో ఉన్నాయి. కొన్నిటికి దక్షిణ దేశంలో ప్రాథాన్యం. మరికొన్నిటికి ఉత్తర దేశంలో ప్రాధాన్యం. మలయాళీకులకు 'ఓణం' గొప్ప అయితే, ఔత్తరాహులకు 'హోళీ' ఎక్కువ. ఒకజాతి చేసుకొనే పండుగ మరొకజాతి చేసుకొదు. కాని ఈదీపావళిమాత్రం అందరూకలసి దేశవర్ణ వ్యవస్థలేకుండా ఆబాలగోపాలం సంతోషంగా జరుపుకొంటారు. ఇతర దేశాల నుండి వచ్చినవారుకాక. మనదేశంలోనే వుండే బౌద్ధులూ జైనులూ ఈ పండుగ పాటిస్తారు. మనదేశమంతా ఆసేతు హిమాచల పర్యంతం దీనిని జరుపుకోవడం మనం గమనించవచ్చు. మనవైపు బాణసంచా, పటాసులు, మందుసామానులు కాలుస్తుంటాము. కానీ ఔత్తరాహులువీనితో పాటు దీపావళి- వరుసగా ప్రమిదలలో చమురుపోసి జ్యోతులను వెలిగించడం ఏర్పాటుచేస్తారు. దాన్నిచూచే నేను మఠంలో అదేవిధంగా జ్యోతులను ఎక్కువగా వెలిగించుమని ఇరవై ముప్ఫై ఏళ్ళుగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఔత్తరాహులకు కార్తిక పౌర్ణమికి మరుసటిరోజు ఈ పండుగ. ఎట్లున్నా ఉత్తరాదివాళ్లకై తేనేమి దక్షిణాదివాళ్లకై తేనేమి దీపావళి ఒకరోజుననే, ఎన్నో పండుగలూ, కర్మలూ ఉన్నా తక్కినవానికిలేని ఖ్యాతి ఈదీపావళి కెందుకు ఏర్పడింది?

ప్రస్తుతం అస్సాం అనబడే దేశంలో ప్రాగ్జ్యోతిషమనే నగరంలో భౌముడనే రాజు పాలించేవాడు. అతనికే నరకాసురుడని పేరు. అతడు స్త్రీలను చెరపట్టి సాధువులను హింసించేవాడు. అతడు తపస్వియే. కాని తానుతపస్సుకు ప్రతిఫలంగా వరాలు పొంది ప్రజాహింస చేస్తుండేవాడు. వాడు చేస్తుండిన లోకహింస చెప్పరానిది. అతడు అజేయుడు. అభేద్యమైన దుర్గాలలో ఉండేవాడు. అందుచేత వాని సంహారానికి భగవంతుడే అవతరించవలసివచ్చింది. అవతరించి వానిని యుక్తిగా సంహారం చేశాడు. వాని సంహారకాలంలో వాని తల్లి భగవానుని ప్రార్థించినదట.

స్త్రీలను పుత్రశోకంకంటే గొప్ప శోకం వేరే లేదు. భర్తచనిపోతే మనకున్నరక్షణ పోయినదే, మన సౌకర్యాన్ని చూచేవా రెవరు? ముత్తైదువలమైన మాకు హేయమైన వైధవ్యం ప్రాప్తించినదే యని స్త్రీలు అధికంగా దుఃఖించవచ్చు. ఈ దుఃఖంలో కొంత స్వార్థం కనపడుతుంది. కాని పుత్రవిషయం వేరు. కొడుకువయస్సు చనిపోయేటపుడు ఎంత అధికమో తల్లి దుఃఖం అంతఅధికమౌతూ ఉంటుంది. నరకుడు లోకాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన ప్రభువు. అట్టి కొడుకు భగవానునిచేత హతుడైనాడు. కాని నరకుని తల్లి లోకానికి విరుద్ధంగా పుత్రశోకం పొందకుండా, భగవంతునిచేతిలో చచ్చిన తన కుమారుని మరణానికి దుఃఖించడానికి బదులు సంతోషించింది. తనకొమరునికి భగవద్దర్శనం కల్గింది. ఎంత అదృష్టం ఉంటే. ఎంత తపస్సుచేస్తే ఆభాగ్యం లభిస్తుంది! 'నాపుత్రుడు చనిపోతే పోనీ, నాకు పుత్రశోకంకల్గినా ఫరవాలేదు. లోకులకు ఏవిధమైన కష్టమూ ఉండరాదు. నా కొమారుడు చనిపోయిన రోజు లోకులకు పండుగకానీ, ఆరోజు వాళ్ళు అభ్యంగనం చేసుకొని, కొత్తబట్టలను కట్టుకొని, విందులు చేసుకొని సంతోషపడనీ' అని ఆ తల్లి భగవానుని ప్రార్థించినదట, అవసాన సమయంలో భగవద్దర్శనం మూలంగా కల్గిన జ్ఞానంతో నరకాసురుడే ఈవిధంగా తనస్మృతిచిహ్నంగా ప్రజలు పండుగ చేసుకోనీ అని భగవంతుని ప్రార్థించినట్లున్నూ ప్రతీతి.

ఆరోజు ఎవరెవరు అభ్యంగనస్నానం చేస్తారో వారికి గంగాస్నానఫలం, మహాలక్ష్మి అనుగ్రహం కలుగవలెననినరకాసురుడు ప్రార్థించాడట. పన్నెండు నెలలలో ప్రతినెలకున్నూ ఒక్కొక్క పురాణమున్నది. చైత్రమాహాత్మ్యం, వైశాఖ మాహాత్మ్యం అని ఒక్కొక్క నెలను ఉద్దేశించి చెప్పబడిన పురాణాలున్నవి. వానిలో తులామహాత్మ్యమొకటి. అది ముప్పది అధ్యాయాల గ్రంథం, దానిని ముప్ఫై రోజులూ చదువవచ్చు. అందులో దీపావళిని గూర్చిన అధ్యాయంలో 'తైలే లక్ష్మీః, జలే గంగా' అని ఉన్నది. ఆరోజు గంగ లేనిచోటునైనాసరే, తలంటుకొని. వేడినీటిలో స్నానంచేసినవారికి గంగాస్నానఫలం కల్గుతుందని చెప్పబడింది. అన్ని ఆశ్రమములవారున్నూ, వారాగులైన సన్యాసులతో సహా దీపావళినాడు స్నానంచేయవలెనని తులాపురాణం చెపుతున్నది.

ఈపండుగ వెనుక, పుత్రశోకం కల్గినా లోకక్షేమం కాంక్షించిన ఒకతల్లి ప్రార్థన ఉన్నది. ఇంతకంటే చిత్తశుద్ధిని మనం వేరే ఎక్కడ చూడగలం? మనమైతే ఈ విధంగా ప్రార్థించి ఉండేవాళ్ళమా? 'నాకొడుకుచనిపోయినాబాధలేదు. లోకం క్షేమంగా-ఉండాలి' అన్న కోరికలో ఎంతటి మహత్తర త్యాగం ఉంది? ఏదో పుక్కిటిపురాణమని త్రోసివేయకుండా తరతరాలుగా ఈపండుగ చేసుకుంటూఉన్నాము. మధ్యలో ఆపివేయబడక పెద్దలనుండి సంక్రమించినదీ పండుగ. దీనిని అనుసరించినందువల్ల, మనకు కల్గే ఆత్మలాభమేమిటి? ఈవిషయాన్నైనా స్థూలంగా పరిశీలిస్తే చాలదు. సూక్ష్మంగాకూడా మనం తరచి చూడాలి.

మనకు ఎన్నో ఆపదలూ, కష్టాలూ కలుగుతూఉంటవి. ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. దానికి తగినట్లే దుఃఖాన్నీ అనుభవిస్తుంటాము, 'మనం తప్పుచేసినాము. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాం' అని ఒక్కొక్కప్పుడు మనకే తోస్తూ ఉంటుంది. ఇంకాకొన్ని దుఃఖాలు, కష్టాలూ మనలను చుట్టుకొన్నప్పుడు 'అయ్యో! నేనేపాపమూ ఎరుగనే? నాకెందుకీకష్టం? దేనికీబాధ!' అనీ అనుకొంటాం. కారణం తెలుసుకొన్నప్పుడు మనలను మనమే ఓదార్చుకొంటాం. కారణం తెలియనప్పుడు మనకు మరింత దుఃఖం కలుగుతుంది. ఐతే అన్ని కార్యాలకున్నూ మనకు కారణం తెలిసియేతీరవలెనన్న నియమమా ఏమి? కారణం తెలియని కష్టాలూ ఎన్నో కలుగవచ్చును. కారణం తెలిసినవీ కలుగవచ్చు. ఏది ఎట్లున్నా మనకు కలుగ వలసిన కష్టం కలిగేతీరుతుంది. కలుగవలసిన దుఃఖం కలుగుతూనే ఉంటుంది. మనం కష్టపడుతున్నాం కదా ఇతరులూ దుఃఖించనీ, లోకమూ కష్టపడనీ అన్న మనోభావం మనకు ఉండరాదు. 'మనకు బాధకల్గినా ఫరవాలేదు. లోకం క్షేమంగా ఉండాలి' అన్న నీతిని దీపావళి బోధిస్తుంది.

మానవులముగా పుట్టినాము. దానివలన మనకు కష్టములే సంప్రాప్తమౌతూ ఉంటవి. సుఖం ఎప్పుడో ఒకప్పుడు లేశమాత్రంగా చేస్తుంటాము. పై పదవులలో ఉన్నవారికి కష్టాలు తక్కువ అని అనుకోరాదు. పదవి పైకిపోయేకొద్దీ కష్టమూ అధికమే. మేడమీదనుండి క్రిందపడితే ప్రాణానికే ఆపద. అరుగుమీదనుండి క్రిందకు జారితే ఏదో చిన్నగాయం మాత్రం కావచ్చు. ప్రతివారి జీవితంలోనూ దుఃఖం అంతర్వాహినిలా ఉండనే ఉంటుంది. మన దుఃఖాన్నే మనం గొప్ప చేసుకోరాదు. మన కష్టం నిజంగానే దుర్భరంగా ఉండవచ్చు. కానీ మన బాధలను మనం సహించుకొని లోకక్షేమం కాంక్షిస్తూ పాటుపడాలి! ఉపదేశ గ్రంథాలలో గీతకెంత ప్రఖ్యాతి ఉన్నదొ పండుగలలో అట్టి ప్రఖ్యాతి దీపావళి మనకు సూచిస్తుంది.

ఇంతేకాదు, ఈకథలో మరొక్క సత్యముంది. కొందరు భక్తితో ఉపాసిస్తారు. తపస్సుచేస్తారు. భగవత్సాన్నిధ్యం పొందుతారు. కొందరు అక్రమాలు చేస్తారు. అన్యాయాలు చేస్తారు. భగవద్దూషణచేస్తారు. వారిని సంహారంచేయడంకోసం భగవంతుడు అవతరిస్తాడు. సంహారవ్యాజంతో తన దర్శనాన్ని ఇచ్చి వారికి పాపవిముక్తిచేసి మోక్షాన్ని అనుగ్రహిస్తాడని దీనివల్ల మనం తెలుసుకొంటున్నాము. కంస, రావణ, శిశుపాలాదులు ద్వేషభావంతో భగవత్సాయుజ్యం పొందినవారు.

భవభూతి ఒకగొప్పకని, భవుడనగా ఈశ్వరుడు. భూతియనగా విభూతి. భవభూతి విభూతిపూసుకొని సదాశివస్మరణ చేస్తూ ఉండిన పరమభక్తుడు, ఆయన ఉత్తరరామచరిత్ర అనే ఒకనాటకం వ్రాశాడు. ఆ నాటకములో రాముడు కథానాయకుడు. శంబుకుడనేవాడొక శూద్రుడు. ఇతడు తన వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధమైన ఒకపనిచేశాడు. అది తపస్సు. ఆ కారణంచేత రామరాజ్యంలో ఒకశిశువు అకాలమరణం చెందినదని తలచి శంబుని వధించడానికి శ్రీరాముడు సన్నద్ధుడై వెడతాడు. కృపాణపాణియైన రాముడు అంటాడు.

రే హస్త దక్షిణ మృతస్య శిశో ర్ద్వజస్య జీవాతవే వీసృజ శూద్రమునౌ కృపాణమ్‌,
రామస్య బాహు రసి దుర్భర గర్భఖిన్న సీతావివాసనపటోః కరుణా కుత స్తే ?.


- ఉత్తర రామచరిత.

కరవాలముబూనిన దక్షిణహస్తాన్ని సంబోథిస్తూ శ్రీరాముడు అడుగుచున్నాడు. ''ఓ హస్తమా! ఈతడు చేసిన తప్పేమిటి? అది వధార్హమేనా? నీకు ఏమాత్రమైనా దయ ఉన్నదా? జాలి ఉన్నదా? ఏ జోక్యము లేకుండా ఒకమూల తపస్సు చేసుకొంటున్న ఈ మునిని నీవు చంపడానికి పాల్పడినావు కదా? చంపు! చంపు! నీవు రాముని చేతివి గదా? రామునిచేతికి కరుణ అనే దొకటున్నదా! పూర్ణగర్భిణి ఐన సీతను ఎవడో చాకలి దూషించినాడన్న నేరానికి అణుమాత్రమైనా జాలిలేక అంతఃపురంనుండి అరణ్యానికి పంపిన చేతివికదా! నీకు ఏమి కరుణ ఉంటుంది? వర్ణాశ్రమధర్మానికి విరుద్ధంగా నడచుకొన్నాడనేకదా! ఈతని వధించబోతున్నావు. ఇతడు ఏ పాపమూ ఎరుగడుకదా! ఊ, చంపు చంపు.

శంబుకుడు రాముని చూస్తాడు. ''రామా! నేను తప్పుచేశాననేకదా నీవు చంపడానికి వచ్చావు. నీవు వచ్చిన పని కొనసాగించు. కాని నేనుచేసిన పనిమాత్రం తప్పు అని చెప్పవద్దు. దేన్ని లక్షించి ఇంతకాలం తపస్సుచేశానో అది నాకు లభించింది. నేను తప్పు చేసిఉంటే నాకు నీ దర్శన భాగ్యం లభించిఉండేదేనా? నా తపస్సు నీ దర్శనంకోసం. అది లభించింది. ఇక నాతపస్సు తప్పు ఎట్లా ఔతుంది? అందరూ నీ దర్శనాన్ని అభిలషించేకదా తపోనిరతులౌతున్నారు? ఆభాగ్యం నాకు అనాయాసంగా కల్గింది.'' అని రామునితో అంటాడు.

ఇట్లాభగవంతుడుఅపరాథినీ అనుగ్రహిస్తున్నాడు, ఆరాధకులనూ అనుగ్రహిస్తున్నాడు. తపస్సుచేసేవారికే వేలకొలది సంవత్సరాలు శ్రమించినా భగవత్‌ జ్ఞానం కలగటంలేదు. కాని భగవానుని ద్వేషిస్తున్నవానికే. దూషిస్తున్నవానికే భగవచ్చింతన అవిరామంగా ఉంటూవుంటుంది. 'దేవుడు లేడు. దేవుడు లేడు' అని దేవుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు. అందుచేతనే భక్తునికంటె ద్వేషికి భగవద్దర్శనం శీఘ్రంగా కలుగుతుందని చెప్పుతుంటారు.

కొందరికి ద్వేషకారణంగానూకాక, భక్తి కారణంగానూ కాక భగవద్దర్శనం కలుగుతుంటుంది. అట్టి సన్నివేశం పద్మపాదుల జీవితంలో చూడగలం. పద్మపాదులు నరసింహ మంత్రాన్ని ఉపదేశంపొంది పురశ్చరణకోసం అహోబలక్షేత్రానికి వెళ్లి అక్కడ అడవిలో జపానికి కూర్చున్నారట. ఒక ఎరుకు ఆయనను సమీపించి ఎందుకోసంవచ్చారనిన్నీ తాను ఏదైనా చేయగలది ఉన్నదా యనిన్నీ పరామర్శించినాడట. తాను నరసింహాన్ని అన్వేషిస్తూ, ఆవనంలోకి వచ్చినట్లు పద్మపాదులు చెప్పినారు. అట్టి మృగం లేదని ఆ ఎరుకు అన్నాడు. ఉందని పద్మపాదులు. ధ్యానశ్లోకంలో ఉన్న వర్ణనను ఆ ఎరుకుకు చెప్పాడు. అంతటితో ఆఎరుకు నరసింహాన్ని వెదకటం సాగించాడు. మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా తాను ఆ మృగాన్ని తెచ్చి పద్మపాదులముందు నిలబెటతానని ప్రతిజ్ఞ చేశాడు. ఎంత వెదకినా మృగం కనబడదు. వెదకివెదకి ప్రతిజ్ఞాసమయం దాపురించేసరికి ప్రాణత్యాగం చేసికొందామని ఒక చెట్టుకుఉరిపోసుకుంటాడు. అంతటితో నరసింహుడు ఆ ఎరుకువానికి ప్రత్యక్షమౌతాడు. తనకోసం తయారుచేసుకొన్న ఉరిత్రాటితోనే నరసింహస్వామిని పద్మపాదులవద్దకు తీసికొని వెళతాడు. ఆ ఎరుకుధ్యానం రెండురోజులైనా, గాఢతలో చాలాగొప్పది. అందుచేత అతనికి స్వామి స్వరూపదర్శనం కల్గింది. పద్మపాదులకు ఇంకా జపసిద్ధి కాలేదు. అందుచేత అతనికి శబ్దబ్రహ్మస్వరూపంలో మాత్రం స్వామిగర్జిస్తూ అనుగ్రహించినారు. మరొకసమయంలో తన ఆవేశంలో లోకోత్తరమైన ఉపకారాన్ని చేస్తానని నరసింహస్వామి పద్మపాదులను అనుగ్రహిస్తారు. శ్రీశంకరులవారిని కాపాలికుడొకడు సంహరించడానికి పూనుకొన్నపుడు వారిని రక్షించే అవకాశంలో కాపాలికుని దేహాన్ని ఛిన్నాభిన్నం చేసినారట. ఈ ఆటవికునికి పద్మపాదుల మాటలలో ఒక గొప్ప విశ్వాసం కల్గింది. ఆ విశ్వాసంతో తానుచూడని నరసింహాన్ని వర్ణనప్రకారం వెదకుతూ అఖండమయిన ఏకాగ్రతతో ఎంతోకాలానికి లభించని ధ్యానసిద్ధిని పొందినాడు. ఆ అన్వేషణలో రాగమూ లేదు, భక్తీ లేదు, ద్వేషమూ లేదు. ఒక్క విశ్వాసమూ, ఉపకారచింతనా మాత్రమే. నరసింహము ఉన్నదని విశ్వసించాడు. ఆ సత్యం కోసం అన్వేషించాడు. సత్యాన్వేషణ అతనికి ధ్వేయమైంది. దానికోసం తన ప్రాణాలనుకూడా ఒడ్డటానికి సిద్ధపడినాడు. అందుచేతనే అతనికి భగవద్దర్శనం కల్గింది.

భక్తికంటె ద్వేషం పెద్దది. దానికంటె లక్ష్యమూ, సత్యమూ గొప్పది. సత్యమొక్కటే లక్ష్యంగా ఉంచుకొని దానిని ప్రాణాలకంటె గొప్పదిగాభావిస్తూ, దానిని ఈశ్వరార్పణ చేస్తే ఈశ్వరానుగ్రహం అతిశీఘ్రంగా కల్గుతుందనేటందుకు పై చెప్పినది నిదర్శనం.

మన సుఖదుఃఖాలు మనతో ఉంటవి. వానిని పెద్దగా తలచి వానితోనే సతమౌతూ కూర్చోకుండా మనవల్ల ఈ లోకానికి ఏమాత్రమైనా సుఖం కలుగనీ అన్న భావన ఉంటే, ఆ భావన రూఢికావాలని మనం ప్రార్థించకల్గితే అది ఎంతో విశేషం. దీపావళివంటి పండుగవల్ల మనం తెలుసుకోవలసిన పాఠం ఇదే. మన కష్టాలను ఒకవంకకు నెట్టి, మన దుఃఖాలను లెక్కించకుండా లోకక్షేమం కోసం పాటుపడదామని మనం ఎల్లపుడూ సర్వేశ్వరుని ప్రార్థిద్దాం.

పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి


పరమాచార్యుల అమృతవాణి :‌ దీపావళినాడు ఏంచేయాలి
(జగద్గురుబోధలనుండి)

ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.

ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||


సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం.

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||


దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం మొదలైన అభాగ్యం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు తన్నివారణకై దీనిని చేయాలి.

ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలాభ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది.

'ప్రాతః స్నానం తు యః కుర్యాత్‌ యమలోకం నపశ్యతి'

సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలకాలము అరుణోదయము ఆలోగా చేయాలి.

స్నాన మధ్యంలో ఉత్తరేణు, అనప, ప్రపున్నాటము (ఒక చెట్టు) శిరస్సుమీద త్రిప్పి స్నానం చేస్తే నరకంరాదు. అంటే తంటెస, (తుంటము, తుంటియము, తగిరిస, తగిరశ) అని దీనికి తెనుగులో పేర్లు. ఇది అంతటా దొరుకుతుంది. దీని పూవు. తంగేడు పువ్వులా ఉంటుంది కాని దానికంటే చిన్న పూవు. పిల్లలు ఈకాయలను కోస్తే చిటపటా పేలుతవి. ఉరణాక్షము అనికూడా దీనికి పేరు. ఉరణ మనగా పొట్టేలు. దీని ఆకులు పొట్టేలు కండ్లలాగా వుంటాయి.

పద్మంలో :-

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్‌ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై||


అని ఉన్నది.

ఈ త్రిప్పటం క్రింది మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||


దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.
యమతర్పణం
స్నానం చేసినవెంటనే యమతర్పణం చేయాలి. ఇపుడు యముని నామావళిగల ఈ క్రింది శ్లోకాలు చెప్పాలి.

యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ!
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ||

ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే|
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||


యమాయతర్పయామి, తర్పయామి, తర్పయామి. ని మూడుసార్లు నువ్వులతో (తిలాంజలులు) వదలవలెను.

యమునికి పితృత్వం దేవత్వం రెండూకద్దు. కావున ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ దక్షిణాభిముఖులై ఉభయథా తర్పణం చేయవచ్చును. తలిదండ్రులున్న వారు మాత్రం నివీతి గానే చేయవలెను. ఈనాడు మాషపత్రభోజనం చేయాలి. అంటే మినపాకు కూర తినాలి. ఈమాసంలో ఇవి లభిస్తాయి.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః|
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే||


దీపదానం

సాయంకాలం ప్రదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి. బ్రహ్మవిష్ణు శివాలయాలలోనూ, మఠము లందునూ ఇవి పెట్టవలెను.

అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|
యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||


ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే.

ఉల్కాదానం (దివిటీలు)

దక్షిణదిశగా (యమలోకంవైపు) మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినాలి.

లక్ష్మీపూజ

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. రాత్రి జాగరణం చేయాలి.

అర్థరాత్రి పౌరస్త్రీలు చేటలు, డిండిమలు, వాద్యములు వాయించుచు, అలక్ష్మిని తమయింటినుండి దూరంగా కొట్టివేయాలి. దీనిని అలక్ష్మీ నిస్సరణమని అంటారు.

విష్ణుమూర్తిని నరక చతుర్దశినాడూ, అమావాస్య మరునాడూ పాతాళంనుంచి వచ్చి తాను భూలోకాధికారం చేసేటట్లూ, ఈనాడు లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడట. కావున భగవత్సంకీర్తనతో రాత్రి జాగరణం చేయాలి.

అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, కాకరపువ్వువత్తులు, బాణసంచా కాల్చడమూ, ఆచారంగా, సంప్రదాయంగా ఏర్పడింది. వరఋతువులో తేమేర్పడగా అప్పుడు పుట్టిన క్రిమికీటకాదులు దీపం మీద వ్రాలి క్రిమిజన్మనుండి ముక్తిపొందుతాయి. తద్ద్వారా వానికి ముక్తి. అందుకనే కార్తికమాసం అంతా దీపదానానికి చెప్పబడింది. అకాశదీపంకూడా అప్పుడే.

'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. కాని తెలిసిచేయడం జ్ఞానంతో చేయడం దానితో మనకు ఆనందం కలుగుతుంది. కావున ఈ ఆచారాలన్నీ, సంప్రదాయాన్ని అందిస్తూ సచ్చిదానంద పరబ్రహ్మానుభవాన్ని సూచిస్తున్నవని మనం తెలుసుకోవాలి.

Wednesday 26 October 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 41 - 45




శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 41 - 45

పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్రధ్యాననతిప్రదక్షిణసపర్యాలోకనాకర్ణనే ।
జిహ్వాచిత్తశిరోఙ్ఘ్రిహస్తనయనశ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ॥ 41 ॥


ఓ మృత్యుంజయుడా! పాపములు బోయి యిష్టార్థము సిద్ధించుటకు గాను పరమేశ్వరుని స్తుతింపుమని నాలుకయు, ధ్యానింపుమని మనస్సును , నమస్కరింపుమని శిరస్సును, ప్రదక్షిణము చేయుమని పాదములును, పూజింపుమని చేతులును, చూడుమని కన్నులును, కథలు వినుమని చెవులును నన్ను కోరుచున్నవి. నీ ఆజ్ఞలేనిదే ఆ కోరికలు నేనెట్లు తీర్చగలను? నీవు నాకాజ్ఞయిచ్చి పలుమారట్లు చేయువిధముగా నన్ను అనుగ్రహింపుము. ఇందు మూగతనము, మతిలేనితనము, కుంటితనము, గ్రుడ్డితనము మొదలైన ప్రతిబంధకములు ఏమియూ రాకుండా చూడుము.

గామ్భీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ-
స్తోమశ్చాప్తబలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।
విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే సదా
దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 ॥


మిగుల దుర్గమంబగు కైలాసపర్వతమున ప్రీతితో నివసించుచున్న ఓదేవా! నా మనస్సనే దుర్గములో నివసించుము. అది గాంభీర్యమనే లోతైన అగడ్త కలది, గట్టి ధైర్యమనే ప్రాకారము కలది, గుణములనే విశ్వసనీయమైన సైన్యము కలది, శరీరమునందున్న ఇంద్రియములనే ద్వారములు కలది, విద్య మరియు వస్తుసమృద్ధి అనే సమస్త సామగ్రితో నిండి దుర్గలక్షణసమగ్రంబై ఉన్నది. దుర్గప్రియుడవు కావున నీవిందు నివసించుము.

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనఃకాన్తారసీమాన్తరే ।
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ-
స్తాన్ హత్వా మృగయావినోదరుచితాలాభం చ సమ్ప్రాప్స్యసి ॥ 43 ॥

ఓ కైలాసవాసా! నీవు అటు ఇటు పోకుము నాయందే నివసించుము. ఆదికిరాతమూర్తీ! దేవా! నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగములున్నవి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొందువు.


కరలగ్నమృగః కరీన్ద్రభఙ్గో
ఘనశార్దూలవిఖణ్డనోఽస్తజన్తుః ।
గిరిశో విశదాకృతిశ్చ చేతః-
కుహరే పఞ్చముఖోస్తి మే కుతో భీః ॥ 44 ॥


సింహమునకు మృగములు చేతచిక్కుచుండును, అదేవిధంగా పరమేశ్వరుడు చేతితో లేడిని పట్టుకున్నాడు. అది వ్యాఘ్రముల ఖండించును, పరమేశ్వరుడు కూడా వ్యాఘ్రాసురుని ఖండించెను. అది గజమును సంహరిస్తుంది, పరమేశ్వరుడు గజాసురుని సంహరించెను. దాన్ని చూసి జంతువులన్నియూ కనబడకుండా పారిపోవును, పరమేశ్వరుని యందే జంతుజాలమంతయూ లయించును. ఇరువురికినీ పర్వతమే నివాసస్థలము, శరీరకాంతి తెలుపు, పంచముఖత్వము ఉభయులకూ ఉన్నది. అట్టి మహాదేవుడు సింహములాగా నాచిత్తకుహరమునందు నివసించియున్నాడు. కనుక నాకు భయమెక్కడిది?
ఛన్దఃశాఖిశిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।
చేతఃపక్షిశిఖామణే త్యజ వృథాసంచారమన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ॥ 45 ॥


ఓ మనస్సనే పక్షిరాజమా! ఎందుకు అటూ ఇటూ తిరిగి వృధాగా శ్రమపడతావు? శంకరుని పాదపద్మములనే గూటిలో ఎల్లప్పుడూ విహరించుము. శాశ్వతమైన ఆ గూడు వేదములనే చెట్టుకొమ్మల చివర ఉన్న (వేదాంతము తెలిసిన) మంచి పక్షులచే (పండితులచే) ఆశ్రయించబడినది, సుఖమునిచ్చునది, దుఃఖమును పోగొట్టునది మరియూ అమృతసారం కల ఫలములతో శోభిల్లుచున్నది. అందువలన పరమేశ్వరుని పాదపద్మములవద్ద విహరించుము.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.