Wednesday 29 June 2016

శంకరస్తోత్రాలు : ప్రాతఃస్మరణ స్తోత్రము

శంకరస్తోత్రాలు : ప్రాతఃస్మరణ స్తోత్రము

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కలతమహం న చ భూతసంఘః ॥ 1 ॥

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ ॥ 2 ॥

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై ॥ 3 ॥

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ॥

 ॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం ప్రాతఃస్మరణ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Saturday 11 June 2016

సంగ్రహ ధర్మ విషయములు - నిత్యకర్మలు

నిత్యకర్మలు
నవావశ్యక కర్మాణి కార్యాణి ప్రతివాసరమ్|
స్నానం సంధ్యా జపో హోమో స్వాధ్యాయో దేవతార్చనమ్|
వైశ్వదేవం తథాతిథ్యం నవమం నిత్య తర్పణమ్||

 
స్నానం , సంధ్యావందనం , జపం , హోమం , బ్రహ్మయజ్ఞం , దేవతార్చనం , వైశ్వదేవం , ఆతిథ్యం , పితృతర్పణం అనే 9 కర్మలూ ప్రతిరోజూ తప్పక చేయాలి.

శ్రీ జయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 7

1 పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు సాయంత్రం సంధ్యావందనం చేయుటకు ముందు స్నానం చేయటం అవసరమా?
జ:  స్నానం చేయనవసరము లేదు. శుభ్రమైన వేరే బట్టలు కట్టుకుని సంధ్యావందనం చేయవచ్చును.

2  పరిషేచనం చేసిన తరువాత మధ్యలో లేవవచ్చునా? అందుకు ఏదైనా పరిహారం ఉన్నదా?
జ:  అలా లేవకూడదు. పరిహారం ఉండదు. ఆవిధంగా మధ్యలో లేస్తే ఆ ఆకు వదిలివేసి వేరే ఆకులో భోజనము చేయవలెను.

3 సంధ్యావందనమే కాకుండా మధ్యాహ్నికము కూడా చెయ్యవలెనా?
జ:  అవశ్యం చేయవలెను.

4 నిర్ణీత కాలములో సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఇవ్వవలెనా?
జ: నియమంగా సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఈయనవసరము లేదు. ఆచమనము, ప్రాణాయామము చేసి మొదట ప్రణవ వ్యాహృతి , తరువాత గాయత్రి , ఆతరువాత ప్రణవ వ్యాహృతి జపించవలెను.

5 సాయంత్రం అర్ఘ్యప్రదానం భూమి మీద చేయవలెనా? జలములో చేయవలెనా?
జ:  రెండూ చేయవచ్చును. నేలమీద కూర్చుంటే నేలమీద , నీటిలో నిలబడి ఉంటే నీటిలోనూ అర్ఘ్యప్రదానం చేయవలెను.

శ్రీ జయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 6


 
 శ్రీ జయేంద్రవాణి: ప్రశ్నోత్తరములు : 6

1. తులసిపూజ చేయు విధానమును తెలియగోరుచున్నాను?
జ: తులసి మొక్కలో ముందు నీరు పోయవలెను. తరువాత కుంకుమ పెట్టి పుష్పము సమర్పించవలెను. తరువాత పాలు , పళ్ళు నైవేద్యము పెట్టి కర్పూరము వెలిగించి హారతి ఇవ్వవలెను. పిమ్మట మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించవలెను.తులసి మన్నును ప్రసాదముగా నుదుట పెట్టుకొనవలెను. " తులసి పూజా విధానం" అనే పుస్తకం దొరుకుతుంది.

2. కొన్ని రోజులలో తులసి కోయకూడదు అంటారు. ఏ ఏ రోజులలో కోయకూడదు ? శ్రాద్ధము ఆరోజువస్తే కోయవచ్చునా ?
జ: శుక్రవారము, ఆదివారము, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటిరోజులలో తులసి కోయకూడదు అన్నది సాధారణ నియతి. శ్రాద్ధము ఏరోజు వచ్చినా తులసి కోయవచ్చును.

3. తులసిపూజను పురుషులు చేయవచ్చునా ?
జ: బాగా చేయవచ్చును.

4. పూజగదిలో సుద్దతో ముగ్గులు వేయవచ్చునా ?
జ: ఇంట్లో, ఇతరగదులలో సుద్దతో ముగ్గులు పెట్టవచ్చును. కానీ పూజగదిలో మాత్రం బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయవలెను.

5. బియ్యపుపిండితో ముగ్గు వేయటంలో ఏమైనా అంతరార్థం నిండి ఉన్నదా ?
జ : బియ్యపుపిండి తో ముగ్గు పెట్టిన ఇంట్లో శుభం జరుగుతుంది. ముగ్గు మంగళ చిహ్నం.

Friday 10 June 2016

పరమాచార్యుల అమృతవాణి : శాంతము



పరమాచార్యుల అమృతవాణి : శాంతము
(జగద్గురుబోధలనుండి)

లోకంలో ఉన్న ఏ ఆనందమయినా అందమయినా కామమయినా ఇట్టివన్నీ మన ఆత్మలోనే ఉన్నాయి. లోపల వెలసి వెలిగే అఖండాకార పరిపూర్ణ ఆనందచ్ఛాయలే బయటగోచరించే అందం. బయట ఒక్కటీలేదు, ఉన్నదంతా లోపల. గీతలో ఈ తత్త్వము ననుసరించే ఒక శ్లోకం ఉన్నది.

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం సముద్ర మావః ప్రవిశన్తి యద్వత్‌,
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాంతి మాప్నోతి న కామకామీ.


కామ మనేది వెలుపలి ఆశ. మనకు వెలుపలి వస్తువుల చేతనే సంతోషంగాని ఆనందంగాని కలుగుతుంది. వెలుపలి కామము కావాలని అనుకొనే వాడెన్నటికిని శాంతి పొందడు. ఎపుడూ వెలుపలి వస్తు సంచయం కోరుకొనే వానికి శాంతి ఎక్కడ? వెలుపల ఎన్నో వస్తువులు ఉన్నవి. అవివస్తే రానీ పోతే పోనీ, అని అన్నీ లోపలి వస్తువుతో కలియ వలసినవే. ప్రతి నిమిషమూ వేలాది నదులు వచ్చి పడుతున్నవి సముద్రంలో. ఒకపు డెపుడో అవన్నీ సముద్రంలోనుంచి బయటికి వెళ్ళినవేకదా! చూడబడే వస్తువులన్నీ లోపల ఉన్న ఆనందపు శాఖలే కదా! 'అది కావాలి ఇది కావాలి' అని సబ్బండు కోరికలతో మనము వస్తువులను తరుము కొంటూపోతే ఏమి ఫలం? అన్నీ లోపలనే ఉన్నవి. అని తలస్తే- 'స శాంతి మాప్నోతి' అతడు శాంతిని పొందుతాడు. ఏదో పెద్ద పదవో ఒక స్త్రీయో ఒక సంపదో ఒక గౌరవమో ఒక స్తోత్రమో ఇవి ఇట్టివి, సంప్రాప్తమైతేనే మన కానందం, సంతోషం, లేకపోతే దుఃఖం, లేక కొరత అని తలపోయడం శుద్ధ తెలివితక్కువ. వెలుపలి వస్తువుల వల్ల కలిగే ఆనందం లోన వుబికే ఆనందం యొక్క బిందువే.

'యత్సౌఖ్యాంబుధి లేశలేశత ఇమే శక్రాదయోనిర్వృతాః'

లోపల వెలసిన ఆనందపరమాత్మస్వరూపంయొక్క సౌఖ్య లేశమే ఇంద్రాదుల ఆనందమూ సంతోషమూ. వెలుపలి విషయములవల్ల కలిగే ఆనందం లోపలికి వెళ్ళి లయం కావలసినదే. అంతర్ముఖానందంతో ఓలలాడేవానికి-ఈశ్వరుని సాక్షాత్కారం కలవానికి వెలుపలి వస్తువులవల్ల కోరదగిన ఆనందంగాని సంతోషంగాని ఉండదు. అవి లేకపోతే అతనికి దుఃఖం ఏర్పడదు.

అలాకాక బహిర్ముఖంగా ఆనందం వెతకికొనేవాడు ఆనందం కలిగించే వస్తువులను పొంది సంతోషిస్తాడు. వియోగంచే దుఃఖిస్తాడు. అవిలేకపోతే ఏదో కొంత కలిగి నటులు క్షోభిస్తాడు. ఆయా వస్తువుల వెనువెంట అంటుకొని ఉంటాడు. అయ్యో చేతికందకపోయెనే అని చింతిల్లుతాడు. 'ఈ దుఃఖం ఎవరివల్ల కలిగింది?' అని తెలిసికొని అతనిపై దండెత్తుతాడు. కోపపడతాడు. గోలగోల చేసిపెడతాడు. ఇవీ వానిచర్యలు. వానికి శాంతి అనే మాట ఉండదు- 'స శాంతి మాప్నోతి న కామకామీ'. ఆతని కేనాటికీ శాంతి ఉండదు. వెలుపలి విషయాలు వస్తయ్‌, పోతయ్‌, వీనిని ఎవడయినా తన సుఖానికి ఆధారం గనుక చేసికొంటే అలవానికి ఏనాటికీ ఎడతెగని కొరతే. వానికి శాంతి సున్న. అని గీతలో భగవంతుడు ఒక అధ్యాయం చివర శ్లోకంలో చెప్పి ముగిస్తాడు.

వెలుపలి కామ్యాలు లెక్కలేనన్ని. వస్తే రానీ? నదులు సముద్రంలో ఎపుడూ వచ్చి పడుతున్నయ్‌. అపారమయిన సముద్రజలాలలో చేరిపోతున్నయ్‌. నదులు వచ్చి కలియకపోతే సముద్రాని కేమయినా దుఃఖమా కొరతా? దాని స్థితి ఎట్టిది?

అపూర్యమాణ మచల ప్రతిష్ఠం సముద్ర మాపః ప్రవిశన్తి యద్వద్‌.

ఆపూర్వమాణ మంటే అంతటా నిండినది. అచల ప్రతిష్ఠర్సకదలక మెదలక ఉండేది. అది రాలేదే, ఇది రాలేదే, ఇంకా నీరు చాలదే అని సముద్రం దుఃఖించదు. కొంచెమయినా చలనం లేనిది సముద్రం. 'అచలప్రతిష్ఠమ్‌'

రామేశ్వరం దగ్గర ఉండే సముద్రం 'రత్నాకరం, మహోదధి' అని రెండు భాగములుగా చెపుతారు. రత్నాకరంలో ఆరునెలలు అలలు లేస్తూవుంటయ్‌. మహోదధిలో దేవీపట్నం వంకకు వెళ్లిచూస్తే ఒక పెద్దకొలను మాదిరిగా అలలేమీ లేకుండా ఉంటుంది. అట్లే మనంకూడా వెలుపలి నుండి వచ్చే విషయాలవల్ల పుట్టే ఆనందనదులను ఆత్మానంద మహోదధి లోనికి ఇముడ్చికొని 'ఆ పూర్యమాణ మచల ప్రతిష్ఠము'గా కూచోవాలి. 'అట్లా ఉంటేనే శాంతి' అని గీతాశ్లోకం చెబుతూంది.

సర్వవ్యాపకమయిన ఒక ఆనందస్వరూపమే లోపల కూడా నిండి నిబిడమై ఉంది. వెలుపలి వస్తువులన్నీ లోపలి వస్తువులో ఐక్యం కావలసినవే 'అదిలేదు ఇది లేదు'. అన్న కొరతలతో మనం బాధపడవలసిన అవసరంలేదు. 'నాకు ఈ వస్తువు కావాలి' అంటే అది ఒక కొరతకు గుర్తు. నిండిన వస్తువు లోపలఉన్నప్పుడు వెలుపలివస్తువలకెక్కడి ఆవశ్యకత? 'వచ్చేది రానీ పోయేది పోనీ,' అని ఆ అఖండాకార పరమానంద వస్తు సాక్షాత్కారం కావలసిందే. లోపల వస్తులేశమే వెలుపలి విషయవిస్తారం అన్న జ్ఞానం ఉండాలి. సముద్రంలాగా అచలంగా ఉండాలి. అట్టివాడే - 'స శాంతి మాప్నోతి' శాంతి పొందుతాడు. అని అర్జునునికి భగవంతు డుపదేశించి-'అర్జునా! నీకు ఏకొరతా అక్కరలేదు. నీవు క్షత్రియుడవు' యుద్ధం చేయుట నీ ధర్మం 'నాధర్మం నేను చేస్తున్నాను' అనే మెలకువతో యుద్ధంచెయ్‌, కొరతలనే వానిని దాపులకు రానీయకు! 'వానికి కష్టం కలుగుతుందే, వీనికి కష్టం కలుగుతుందే' అనే ఉబుసు నీకు వద్దు, నీధర్మమేదో నీవు చేసి ముగించు' అని ఉపదేశపూర్తి చేశాడు.

పరమాచార్యుల అమృతవాణి : శివకేశవ అభేదం


పరమాచార్యుల అమృతవాణి : శివకేశవ అభేదం
(జగద్గురుబోధలనుండి)

''శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః'' అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినమూ సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల అభేదాన్ని ఈమంత్రం తెలుపుతున్నట్లే హరిహరుడూ రామలింగడూ రామేశ్వరుడూ శంకరనారాయణుడూ అనే పేరులుకూడా ఈ అభేదాన్ని చాటుతున్నవి.

పరతత్త్వం ఒకటంటే ఒకటికదా. శివుడు పరతత్త్వమా విష్ణువు పరతత్త్వమా? శైవులకుగాని వైష్ణువులకుగాని ఈలాటి సందేహమే ఉండదు. శైవులు శివుని వైష్ణవులు విష్ణువునూ గొప్పవానిగా తలపోస్తారు. అద్వైతులకే చిక్కు. సామరస్యపు ఆవశ్యకత వారికే.

ఉన్నది ఒకే ఒకవస్తువు. ఒకవస్తువు రెండెట్లా అవుతుంది? శివ విష్ణువుల భేదాలను అటుంచుదాం. రాముల వారున్నూ పరశురాములవారున్నూ విష్ణ్వంశలయిన రెండు అవతారాలు. వీరిమాటయేమిటి? వీరిలో ఎవరధికులు శివుని విల్లు విరిచాడని రాములవారిమీద పరశురాముల వారికి కోపంకలిగింది. క్షాత్రలోకాన్ని భస్మంచేసిన పరశురాముడు రామునిముందు నిర్వీర్యుడయిపోయాడుగదా ఈ సంగతి యేమిటి?

'ఇవన్నీ భగవల్లీలలు. ఇద్దరూ ఒకేఒక పరమాత్మ యొక్క అంశలుకదా!' అని ఒకరన్నారట. వాస్తవానికి అంతేగాక మఱేమిటి?

కయ్యమాడినంతమాత్రాన వీరు వేరుకాదు. ఒకే పరమాత్మ తన మాయాశక్తి చేత ఆయా యీ సమయాలలో ఒకొక్క రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చేమూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒకటే అన్న అభేదజ్ఞానం ఎప్పటికిన్నీ మరవరాదు, ఈ భేదాలన్నీ కార్యార్థం. సత్త్వముర జస్సు తమస్సు అనే త్రిగుణాలూ, మెలకువ కలనిద్ర అనే మూడవస్థలూ బ్రహ్మ విష్ణు శివులని త్రిమూర్తులూ ఇలా అన్నీ మూడు మూడుగా ఉన్నవి. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. సత్త్వం తెల్లరంగు, రజస్సు పసపు ఎఱుపుల కలపోత. తమస్సు నలుపు, చీకటి రంగు ఒకటి చీకటి ఒకటి, శాంతము మరొకటి వేగము అని చెప్పవచ్చు. తెలుపు నలుపుల నడుమనున్న స్థితి రజస్సు.

బ్రహ్మది రజోగుణం. ఇతనిది ఎరుపు పసపుల కలగలుపుగా ఉండే బంగారు రంగు, విష్ణువుది సత్త్వగుణం. ఆయన లోకపాలకుడు. శివుడు సంహారకుడు. తామస గుణం కలవాడు. 'శ్రేయాంసి త త్ర ఖలుసత్త్వతనో ర్నృణాంస్యు' అని భాగవతం చెపుతూంది.

జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వగుణాన్నే మనం ఆరాధించాలి. ఒకే పరమాత్మ మూడు విధాలయిన గుణాలు కల మూడు మూర్తులుగా ఉన్నా అనుగ్రహంకోసం సత్త్వగుణం కలమూర్తినే ఆరాధించాలి మనం ఏ యే గుణాలు కలవారితో సంపర్కం పెట్టుకొంటామో ఆయా గుణాలు మనకు తెలియకుండానే మనలో ప్రతిఫలిస్తూ ఉంటవి. కోపిష్ఠిని చూస్తే మనకున్నూ కోపమో లేక నిరుత్సాహమో కలుగుతున్నది. కార్యజయాన్ని ఉద్దేశించినప్పుడు మన కెవరి వల్ల కార్యం కావాలో వారుశాంతంగానూ సంతోషంగానూ ఉన్న సమయం చూచిమరీ వెళతాం. పరమ శాంతుడున్నూ కోపం లేనివాడున్నూ ఐన మాధవుడే విష్ణువే కొలవదగిన దైవం అని విష్ణుసంబంధాలయిన పురాణాలు చెపుతున్నవి.

స్కాందము శైవపురాణము, 'మాయ తొలగిపోవాలనే కోరిక గలవారు ఈశ్వరోపాసన చేయాలి. పశుపతి పాశమోచకుడు. ఆయన సాత్త్వికుడు. సాత్త్వికుని కొలిస్తేకదా సత్త్వగుణం ఏర్పడుతుంది.' అని స్కాందమూ సూతసంహిత చెపుతున్నవి. కొన్ని పురాణాలు శివునకు తమోగుణమును బ్రహ్మకు రజోగుణమును మాధవునకు సత్త్వగుణమును కలదని చెపుతున్నవి.

శివునిరంగు తెలుపు. ఆయన భస్తోద్ధూళితగాత్రుడు. ఉండేచోటో కైలాసం. అదీ పరమ తెలుపే. వాహనం తెలుపు. శుద్ధమయిన స్ఫటికంవలే ఉన్న శివునిచూడగానే ఆతడు సాత్త్వికమూర్తి అని తేటతెల్లంగా తెలుస్తుంది. విష్ణువు నలుపు. ఆయనస్థితి సతతనిద్ర. ఆయన వర్ణం తమోవర్ణం. గుణం తమోగుణం. అందుచేత విష్ణువుతామసి, శివుడు సాత్త్వికుడు అని కొన్ని పురాణాలు.

కొంచెం ఆలోచిస్తే శివునిస్వరూపమూ స్థితీ సత్త్వగుణ సూచకాలు. చేసే పనిమాత్రం జగత్‌ సంహారం. ఇది తమోగుణక్రియ. విష్ణువుయొక్క రూపమూ స్థితీ తమోగుణ సూచకం. కాని ఆయన చేసే లోకపరిపాలన అనే క్రియ సాత్త్వికక్రియ. ఇట్లా మాధవ-ఉమాధవులలో సత్త్వగుణ మిశ్రమం ఉన్నది.

బ్రహ్మనుగూర్చి వాదంలేదు. అందరున్నూ ఆయన గారిని రజోగుణవిశిష్టుడనే చెప్పారు. ఆయనకు గుళ్లుగాని గోపురాలుగాని ఆరాధనగాని లేదు. అందరూ ఆయనను మధ్యస్తంగా వదలివేశారు. వివాదాలన్నీ కామారినీ కంసారినీ గురించే.

ఆళువార్లలో ఒకరు పెరుమాళ్ళను వర్ణిస్తూ - 'నీవే మునివి, నీవే బ్రహ్మవు, మూడుకన్నుల తండ్రివిన్నీ నీవే' అని సరసమాడారు.

పాప పుణ్యాలనుబట్టి ఫలం ఇచ్చేవాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిచేసేవాడు. శివుడు ప్రయలం చేస్తాడు. ఆప్రలయ సమయంలో చరాచరాలను తనలో లీనం చేసికొంటాడు. ఈ సంహారక్రియ క్రౌర్యమా? భ్రమణచక్రంలో చిక్కుకొని సదా భ్రమణం చేస్తున్న జీవుడికి ఆడి ఆడి అలసిపోయిన బిడ్డను చూచి-'బిడ్డా! అలసిపోయావు. నేటికి ఈ యాటచాలు, కొంచెం నిద్రపో' అని ప్రేమతో బుజ్జగించే తండ్రిలాగా తల్లిలాగా విరామం ఇచ్చే ఆ మహానటుని ప్రీతినీ అనుగ్రహాన్నీ చూపే ప్రలయక్రియ తామసికమా?

నిత్యప్రలయం మహాప్రలయం ఆత్యంతికప్రలయం అని ప్రలయం మూడువిధాలు. పగలంతా విసిగి వేసారి కష్టాలూ సుఖాలూ అనుభవించి నానాబాధలూపడిన జీవి నిద్రలో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అది నిత్యప్రలయం. దానినిచ్చేదాత ఈశ్వరుడు. నిద్ర దుఃఖాలనన్నిటినీ పోగొట్టుతుంది. ఏదో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. 'హాయిగా నిద్ర పోయాను' అని పొద్దున్నే లేచి ఎంతో ఉత్సాహంగా అంటాం. ఆ నిద్రాసౌఖ్యం కలిగించే దాత ఈశ్వరుడే. మహాప్రలయంలో జగత్తు నిశ్శేషమౌతున్నది. మళ్ళా బ్రహ్మ సృష్టించాలి. ఈ పునస్‌ సృష్టిలో జీవులు పూర్వకర్మాను గుణంగా పుటతారు.

రెండు మూడు అని వేరువేరుగా తోచే భేదజ్ఞానాన్ని పొగొట్టి అద్వైతానుభవాన్ని మోక్షానందాన్ని ఇచ్చేదే ఆత్యంతికప్రలయం. నిద్రలో ప్రతిరోజూ సుఖం అనుభవించడూ, ఈశ్వరస్వరూపంలో లయమై విశ్రాంతి పొందటమూ అభేదదర్శనంచేస్తూ మోక్షానందం అనుభవించడమూ ఆ యీశ్వరుని కరుణ. ఈ కార్యాలు తామసాలవలె కనిపించినా తండ్రిచేయవలసినపని చేస్తేనే కదా ఆయన మూడుకనుల తండ్రి కాగలగడం?

విష్ణువుది యోగనిద్ర. 'నిద్రాముద్రాం నిఖిలజగనీ రక్షణే జాగరూకామ్‌'. నిద్రపోతూనే వుంటాడు, లోకరక్షణం చేస్తూనే వుంటాడు. పాలించడమూ సంహరించడమూ ఈ రెండున్నూ కారుణ్యాన్ని చూపే కార్యాలే. వీనిలో ఎక్కువ తక్కువలెంతమాత్రమూ లేవు. ఆలాగే ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యా లేమాత్రమూలేవు. పసిపిల్లలు సమేతూ అరవంలో, 'హరియుం శివనుం ఒండ్రు, అరి యాదవన్‌ వాయిలే మణ్ణు' 'హరిహరు లిద్దరూ ఒకటే, అది తెలియనివాని నోట్లో మన్ను' అని అంటారు. ఇది సామెత.

ఒకే ఒక తత్త్వం మాయచేత అనేకరూపాలతో మనకు గోచరిస్తుంది. భేదజ్ఞానం మనం అజ్ఞానంచేత పసిబిడ్డకు చెక్కతో చేసిన మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. ఈలాగే ఎన్నో వికారాలకులోనయిన ఈ ప్రపంచాన్నీ సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ భగవంతుడు మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. చీకట్లలో చూపుసరిగా అందక తాటిని చూచి పామని అనుకొంటాం. పిదప పాము భ్రాంతి అని తేలుతుంది. అట్లే వేదాంతశాస్త్రపఠనం వల్ల ఇదంతా మిథ్య అనే ఎరుక కలుగుతుంది. వట్టి ఎరుకయే కలిగినంత మాత్రాన సరిపోదు. ఈశ్వరుని అనుగ్రహంచే అది అనుభవంలోకి రావాలి.

కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఊరివారిని అడిగి తెలిసికొన్నా అపుడపుడు ఏదిక్కున పోయేదీ తెలియక భ్రమపడుతూ వుంటాం. అదే దిగ్‌ భ్రాంతి. అనుభవ పూర్వకమయిన ఎరుక సంపాదించు కొన్నవానికి శివ మాధవుల తేడా కనిపించదు. దానిచేత ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమంగా కొలిచేదైవతాలను పరదేవతగా ఎంచవలె. తక్కిన దేవతలున్నూ ఆపరదేవతయొక్క వేరువేరు అంశాలని అభేదానుభవంతో అచంచలమయిన శాంతితో మనం ఉండాలి.

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 5

1  జపము చెయ్యటానికి తగిన మాలలు ఏవి?
జ: రుద్రాక్షమాల , ముత్యాలమాల , పగడాలమాల , స్ఫటికమాల , శంఖుపూసలమాల , వెండిపూసలమాల , వేపగింజలమాల , తామరపూసలమాల.

2  నిమ్మకాయ డిప్పలో దీపం వెలిగించవచ్చునా?
జ: దుర్గా అమ్మవారి సన్నిధిలో రాహుకాలం ముందు వెలిగిస్తే మేలు జరుగును.


3  ఇంట్లో పావురములను పెంచవచ్చునా?
జ: ఇంట్లో పావురములను పెంచకూడదు. కాని దేవాలయములలోను , ఇతర బహిరంగ స్థలములలోనూ ఉన్న పెంపుడు పావురములకు ధాన్యపు గింజలు ఆహారముగా వేయవచ్చును.

4  పూజకు సంబంధించిన స్తోత్రములనన్నింటినీ పూజగదిలో కూర్చునే చదవవలెనా? లేక ఇంట్లో ఇతర గదులలో కూర్చుని కూడా చదువవచ్చునా?
జ: దేవుని ప్రార్థనా స్తోత్రములను ఇంట్లో శుభ్రముగా వున్న అన్ని గదులలోను కూర్చుని చదవవచ్చును.అన్ని సమయాలలోనూ చదవవచ్చును.

5  ఇంట్లో దేవుని గదిలో ఉదయం , సాయంత్రం రెండు వేళలా దీపం వెలిగించి ప్రార్థించవలెనా? సాయంత్రం మాత్రం దీపం వెలిగించిన సరిపోతుందా?
జ: గృహయజమానురాలు రెండువేళలా దీపం వెలిగించి పూజ చేయవలెను.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.