Sunday 31 January 2016

శంకరస్త్రోత్రాలు : లలితా పఞ్చరత్నస్తోత్రమ్


|| లలితా పఞ్చరత్నస్తోత్రమ్ ||

ప్రాతః స్మరామి లలితావదనారవిన్దం
బిమ్బాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।
ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం
మన్దస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ॥ 1 ॥

దొండపండు వంటి క్రింది పెదవి, పెద్ద ముత్యముతో శోభించుచున్న ముక్కు, చెవుల వరకూ వ్యాపించిన కన్నులు, మణికుండలములు, చిరునవ్వు, కస్తూరీ తిలకముతో ప్రకాశించు నుదురు కలిగిన లలితాదేవి ముఖారవిందమును ప్రాతఃకాలమునందు స్మరించుచున్నాను.
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాఙ్గుళీయలసదఙ్గులిపల్లవాఢ్యామ్ ।
మాణిక్యహేమవలయాఙ్గదశోభమానాం
పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీఃదధానామ్ ॥ 2॥

ఎర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వ్రేళ్ళు అను చిగురుటాకులు కలదీ, మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో  శోభించుచున్నదీ, చెరకువిల్లు - పుష్పబాణములు - అంకుశము ధరించినదీ అగు లలితాదేవి భుజములను కల్పలతను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను.
ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం
భక్తేష్టదాననిరతం భవసిన్ధుపోతమ్ ।
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్ ॥ 3॥

భక్తులకోరికలను ఎల్లప్పుడూ తీర్చునదీ, సంసార సముద్రమును దాటించు తెప్పయైనదీ, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడుచున్నదీ, పద్మము - అంకుశము - పతాకము - చక్రము అను చిహ్నములతో ప్రకాశించునదీ అగు లలితాదేవి పాదపద్మములను ప్రాతఃకాలము నందు స్మరించుచున్నాను.

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్ ।
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విశ్వేశ్వరీం నిగమవాఙ్గమనసాతిదూరామ్ ॥ 4॥

వేదాంతములచేతెలియబడు వైభవము కలదీ, కరుణచే నిర్మలమైనదీ, ప్రపంచము యొక్క సృష్టి - స్థితి - లయలకు కారణమైనదీ, విద్యలకు అధికారిణియైనదీ, వేదవచనములకూ, మనస్సులకూ అందనిదీ, పరమేశ్వరియగు లలితాభవానీ దేవిని ప్రాతఃకాలము నందు స్తుతించుచున్నాను.
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।
శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥ 5॥

ఓ లలితాదేవీ! కామేశ్వరి - కమల - మహేశ్వరి - శ్రీశాంభవి - జగజ్జనని - వాగ్దేవత - త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతఃకాలము నందు జపించుచుందును.
యః శ్లోకపఞ్చకమిదం లలితామ్బికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ।
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనన్తకీర్తిమ్ ॥ 6॥

సౌభాగ్యమును ఇచ్చునదీ, సులభమైనదీ అగు లలితాపంచరత్నమును ప్రాతఃకాలమునందు ఎవడు పఠించునో వానికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై  విద్యను, సంపదను, సుఖమును, అంతులేని కీర్తిని ప్రసాదించును.
॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదాచార్య కృతం లలితా పఞ్చరత్నస్తోత్రం సంపూర్ణమ్॥

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/01/blog-post_31.html
 

శంకరస్త్రోత్రాలు : కళ్యాణవృష్టిస్తవః


 

|| కళ్యాణవృష్టిస్తవః ||

కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమంగళదీపికాభిః |
సేవాభిరంబ తవ పాదసరోజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్ || 1 ||


కళ్యాణములను వర్షించునవీ, అమృతముతో నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించునట్టి మంగళములను చూపించునవీ అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింపబడలేదు.


ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే |
సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య ||2 ||


ఓ తల్లీ! నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనందభాష్పములతో నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతో నిండినదీ అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక.ఇది మాత్రమే నా కోరిక.


ఈశత్వనామకలుషాః కతి వా న సంతి
బ్రహ్మదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః |
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః
పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి || 3 ||

ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందునూ వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలెందరు లేరు? నీ పాదములకు ఒక్కసారి ఎవడు నమస్కరించునో ఓ జననీ! వాడే స్ఠిరమైన సిద్ధిని పొందగలడు.


లబ్ధ్వా సకృత్త్రిపురసుందరి తావకీనం
కారుణ్యకందలితకాంతిభరం కటాక్షమ్ |
కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమోహయంతి తరుణీర్భువనత్రయేఽపి || 4 ||


ఓ త్రిపురసుందరీ! కారుణ్యముతో నిండినదీ, కాంతివంతమైనదీ అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కోటి మన్మథ  సమానులై ముల్లోకములందలి యువతులను సమ్మోహపరచుచున్నారు.


హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా
మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే |
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః || 5 ||

త్రికోణము నందు నివసించు ఓ తల్లీ! త్రిపురసుందరీ! మూడుకన్నులున్నదానా! నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లోకపాలులతో క్రీడించుచున్నారు.


హంతుః పురామధిగలం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః |
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య ||6 ||


ఓ తల్లీ! అమృతముతో తడిసి చల్లనైన నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచో  త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఎంత క్రూరముగా ఉండేదో కదా!


సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రిసరసీరుహయోః ప్రణామః |
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి || 7 ||

ఓ దేవీ! నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమునూ, సభలలో వాక్పాటవమునూ కలిగించును.అంతేకాక మెరుస్తున్న కిరీటమునూ, ఉజ్జ్వలమైన తెల్లని గొడుగునూ, రెండుపక్కలా వింజామరలనూ, విశాలమైన భూమినీ (రాజ్యాధికారమును)  ఇచ్చును.


కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరంబ భవాత్కటాక్షైః |
ఆలోకయ త్రిపురసుందరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్ || 8 ||

ఓ తల్లీ! త్రిపురసుందరీ! కోరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణాసముద్రములు అగు నీ కటాక్షములతో అనాథయైన, నీ యందు భక్తికల, నీపై ఆశలు పెట్టుకున్న నన్ను చూడుము.

హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహంతి కిల పామరదైవతేషు |
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ || 9 ||

అన్యమానవులు ఇతరులైన చిన్న దేవతలపై మనస్సులనుంచి భక్తిని పెంపొందించుకొనుచున్నారు. ఓ దేవీ! నేను మనస్సుతో నిన్నే స్మరించుచున్నాను, నిన్నే నమస్కరించుచున్నాను. ఓ తల్లీ! నీవే శరణము. 

లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలోకయ త్రిపురసుందరి మాం కదాచిత్ |
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతో జనిష్యతి జనో న చ జాయతే వా || 10 ||

ఓ త్రిపురసుందరీ! నీ కటాక్షవీక్షణములకు గమ్యస్థానములు ఎన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము. నాతో సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబోడు, పుట్టుటలేదు.

హ్రీంహ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే |
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః || 11 ||

ఓ త్రిపురసుందరీ! ’హ్రీం’ ’హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించనిది ఈ లోకములో ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతో విరాజిల్లు భూదేవి, శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్ || 12 ||

పద్మముల వంటి కన్నులు కల ఓ త్రిపురసుందరీ! నీకు చేయు వందనములు సంపదలను కలిగించును,  ఇంద్రియములన్నిటికీ సంతోషమును ఇచ్చును, సామ్రాజ్యములనిచ్చును, పాపములను తొలగించును. ఓ తల్లీ! నీ నమస్కారఫలితము ఎల్లప్పుడూ నన్ను పొందుగాక.

కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య |
పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా || 13 ||

ఓ త్రిపురసుందరీ! ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము - అంకుశము - చెరుకువిల్లు - పష్పబాణములను ధరించిన నీ స్వరూపమొక్కటే నిలబడుచున్నది.

లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుంకుమపంకశోణమ్ |
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్ || 14 ||

అమ్మా! తేజోవంతమైనదీ, కుంకుమతో ఎర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికోణము యొక్క మధ్యలోనున్నదీ, అమృతముతో తడిసినదీ అగు నీ అర్థశరీరము ఎల్లప్పుడూ నా మనస్సునందు లగ్నమగుగాక.

హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి |
త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం
సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః || 15 ||

ఓ త్రిపురసుందరీ! ’ హ్రీం’కారమే నీ పేరు, నీ రూపము. అది దుర్లభమైనదని చెప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచభూతసమూదాయము బ్రహ్మ మొదలగు సమస్తజీవరాశికీ సుఖమును కలిగించుచున్నది.

హ్రీంకారత్రయసంపుటేన మహతా మంత్రేణ సందీపితం
స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మంత్రవిత్ |
తస్య క్షోణిభుజో భవంతి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః || 16 ||

ఓ తల్లీ! మూడు ’హ్రీం’కారములతో సంపుటితమైన మహామంత్రముతో వెలుగొందుచున్న ఈ స్తోత్రమును ప్రతిరోజూ నీ ముందు నిలబడి ఏ మంత్రవేత్త జపించునో అతనికి రాజులెల్లరూ వశులగుదురు. లక్ష్మి చిరస్థాయిగానుండును. నిర్మలమైన సూక్తులతో నిండిన సరస్వతి ప్రసన్నురాలగును. చిరాయువు కలుగును.

|| ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య కృతః కళ్యాణవృష్టి స్తవః సంపూర్ణః ||

Saturday 30 January 2016

శంకరస్త్రోత్రాలు : గౌరీదశకమ్

 

గౌరీదశకం

 లీలాలబ్ధస్థాపితలుప్తాఖిలలోకాం
లోకాతీతైర్యోగిభిరంతశ్చిరమృగ్యామ్
బాలాదిత్యశ్రేణిసమానద్యుతిపుంజాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే ||1||


తన లీలచే సమస్తలోకములనూ సృష్టించి కాపాడి నశింపచేయునదీ,లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ,బాలసూర్యసమూహము వంటి కాంతి మండలముకలదీ,పద్మములవంటి కన్నులుకలదీ అగు జగదమ్బయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం
నిత్యం చిత్తే నిర్వృతికాష్ఠాం కలయంతీమ్
సత్యజ్ఞానానందమయీం తాం తనురూపాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే ||2||


ప్రత్యాహారము - ధ్యానము - సమాధి అనుయోగములనాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడూ సంతోషమును కలిగించునదీ,సత్యము - జ్ఞానము - ఆనందములు స్వరూపముగా కలదీ,సూక్ష్మరూపమున్నదీ,పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబ అయిన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

చంద్రాపీడానందితమందస్మితవక్త్రాం
చంద్రాపీడాలంకృతనీలాలకశోభామ్ |
ఇంద్రోపేంద్రాద్యర్చితపాదాంబుజయుగ్మాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 3 ||


చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ,తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ,ఇంద్రుడు - విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ,పద్మముల వంటి కన్నులు కలదీ  అగు గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆదిక్షాంతామక్షరమూర్త్యా విలసంతీం
భూతే భూతే భూతకదంబప్రసవిత్రీమ్ |
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 4 ||


’అ’ కారము మొదలు ’ క్ష’ కారము వరకూ ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ,పంచమహాభూతములలో (భూమి - నీరు - గాలి - అగ్ని - ఆకాశము ) ప్రతీదానియందూ అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నిండినదీ , మెరుపువలె ప్రకాశించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబ అయిన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

మూలాధారాదుత్థితవీథ్యా విధిరంధ్రం
సౌరం చాంద్రం వ్యాప్య విహారజ్వలితాంగీమ్ |
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 5 ||


సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాధారచక్రము నుండీ బ్రహ్మరంధ్రము వరకూ సుర్య, చన్ద్ర స్ఠానములైన ’ఇడా’ ’పింగళా’ నాడుల యందు విహరించు తేజోమూర్తియైనదీ,సూక్ష్మమైన పదార్ధము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నిత్యః శుద్ధో నిష్కల ఏకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ |
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 6 ||


నిత్యుడు - శుద్ధుడు - పరిపూర్నుడు - ఒక్కడు - జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవి చేయు సృష్టి,స్ఠితి,లయలకు సాక్షి. ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్యయైనదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యాః కుక్షౌ లీనమఖండం జగదండం
భూయో భూయః ప్రాదురభూదుత్థితమేవ |
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరంతీం
గౌరీమంబామంబురుహాక్షీమమీడే || 7 ||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములూ మరల మరల పుట్టుచుండును.లీనమగుచుండును.భర్తతోకలిసి వెండికొండపై విహరించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్క్వాపి చరం చాప్యచరం చ |
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 8 ||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయూ,దారము నందు మణులవలే గౌరీదేవియందే అల్లుకుని ఉన్నది. ఆధ్యాత్మ, జ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నానాకారైః శక్తికదంబైర్భువనాని
వ్యాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా |
కళ్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే ||9 ||


గౌరీదేవి తాను ఒక్కతెగానే ఉండి శక్తివంతములైన  నానారూపములతో లోకములనన్నిటినీ  వ్యాపించి స్వేచ్ఛగా క్రీడించుచున్నది. కల్యాణస్వరూపిణి , భక్తులపాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదాంభోజధ్యానపరాణాం పురుషాణామ్ |
ఈశామీశార్ధాంగహరాం తామభిరామాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే || 10 ||

తన పాదపద్మములను ధ్యానించు మనుష్యులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ ,పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరి, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

 ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరిదశకం యః |
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తస్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి || 11||


ఎవడైతే శుద్ధమైన హృదయము కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీదశకము స్తోత్రమును పఠించునో  అతనికి వాక్సిద్ధినీ, ఉన్నతమైన సంపదనూ, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

|| ఇతి శ్రీ శంకరాచార్య విరచితం గౌరీదశకం సంపూర్ణం ||

Friday 29 January 2016

పరమాచార్యుల అమృతవాణి : సైకిలు పెడలు

పరమాచార్యుల అమృతవాణి : సైకిలు పెడలు

(పరమాచార్యులవారు చెప్పుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)

#వేదధర్మశాస్త్ర పరిపాలన సభ   @శంకరవాణి

ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.

ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు.  ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.

భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా,  భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత.

మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.

వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.

వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.

ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు.  వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.

నాగరికతా ? జంతుప్రవర్తనా ?

మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.

ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.

మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.

కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.

మోహముద్గరః 21 - 31

 

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే || 21 ||

మరల పుట్టుక మరల మరణము మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము.


 రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః
యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ || 22||

కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని, పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ, యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును.


 కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః
ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ || 23 ||

నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము.


 త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః
సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ ॥24॥

నీలో, నాలో, వేరేచోట ఉన్న పరమాత్మ ఒక్కడే.అసహనంతో నాపై వ్యర్థంగా కోపించుచున్నావు.అంతటా పరమాత్మనే చూడుము.విభేదమును విడువుము.

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్
॥25॥

శీఘ్రంగా పరమాత్మను పొందదలచినచో శత్రు - మిత్ర - పుత్ర - బంధువులపట్ల విరోధ - స్నేహములకై ప్రయత్నించక సర్వసమానభావనను పొందుము.


 కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాఽత్మానం పశ్యతి కోఽహమ్
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః || 26 ||

కామ - క్రోధ - లోభ - మోహములను వదలి నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకంలో పడి పీడింపబడెదరు.


గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్ || 27 ||

భగవద్గీత - విష్ణుసహస్రనామములను గానం చేయుము.ఎల్లప్పుడు విష్ణువుని ధ్యానించుము.మనస్సును సత్పురుష సాంగత్యమునందుంచుము.దీనజనులకు దానం చేయుము.


 సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్ ||

స్త్రీతో సుఖించవచ్చును. కానీ తరువాత రోగం వచ్చును.లోకంలో మరణమే శరణమని తెలిసినా మానవుడు పాపం చేయుట మానడు.

 అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః || 29 ||

అర్థమే(ధనము) అనర్థమని ఎల్లప్పుడూ భావించుము.నిజంగా డబ్బు వలన సుఖం లేదు.ఇది సత్యము.ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును.ఇదే అంతటా ఉన్నరీతి.


 ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారమ్
జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్ || ౩౦ ||

ప్రాణాయామము - ప్రత్యాహారము - నిత్యానిత్యవస్తువివేకము జపంతో కలిసిన సమాధిస్థితి - ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించు.


 గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాదచిరాద్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ || 31 ||

గురువుగారి పాదపద్మములపై భక్తినుంచి తొందరగా సంసారంనుండి బయటపడుము.ఇంద్రియములను - మనస్సును నియమించినచో నీ హృదయంలో ఉన్న దేవుని చూడగలవు.

॥   మోహముద్గరః సంపూర్ణః  ॥ 

మోహముద్గరః 11-20





మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్
మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11 ||

ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.


 దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః || 12 ||

పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది అయినా ఆశ విడవకున్నది.


 కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా
త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా || 13 ||

 ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు? నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి? మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే సంసారసముద్రము దాటించు నౌక.


 జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః ||14 ||

జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - కాషాయవస్త్రములు ధరించినవాడై పొట్టనింపుకొనుటకు వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడ చూడనట్లుండును.


 అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్
వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ || 15 ||

శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు.అయినా ఆశ వదులుటలేదు.


 అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః || 16 ||

ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలికాచుకొనుచూ, రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , చెట్టుకింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

 కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్
జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన || 17 ||

గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.


 సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః
సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 18 ||

గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట, దేనినీ స్వీకరించకపోవుట, భోగముననుభవించకపోవుట అను వైరాగ్యము ఎవడికి సుఖమివ్వదు?


 యోగరతో వాభోగరతోవా సంగరతో వా సంగవీహినః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ || 19 ||

 యోగమును ఆచరించువాడుకానీ - సుఖములననుభవించువాడుకానీ, బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ, ఎవడిమనస్సు పరబ్రహ్మయందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.


 భగవద్ గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా || 20 |

కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగాజలం త్రాగి, ఒక్కసారైనా విష్ణువును పూజించినవానిని యముడేమి చేయగలడు? 

Thursday 28 January 2016

మోహముద్గరః 1-10




భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥

గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము).

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||

ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము.

నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 ||

యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము.

నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||

తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకొనుము.

యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||

ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు.శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.

యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే || 6 ||

శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.

బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || 7 ||

బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.

కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||

నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||

సత్పురుషసాంగత్యము వలన భవబంధములూ తొలగును.బంధములు తొలగినచో మోహము నశించును.మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును.స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.

వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||

వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?

త్యాగరాజ కీర్తన - వినాయకుని వలెను బ్రోవవే



1. వినాయకుని వలెను బ్రోవవే

మధ్యమావతి – ఆది

పల్లవి:
వినాయకుని వలెను బ్రోవవే, నిను వినా వేల్పు లెవరమ్మ?
॥వినాయకుని॥

అను పల్లవి:
అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని
॥వినాయకుని॥
చరణము(లు):
నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవతలు
రాయడిని జెందరాదు దయ జూడరాదా కాంచీపురాది నాయకి
॥వినాయకుని॥

పితామహుఁడు జనహితార్థమై నిన్ను తా తెలియ వేడ తాళిమిగల
యవతార మెత్తె యికను తామసము సేయ తాళజాలము నతార్తి హారిణి
॥వినాయకుని॥

పురాన దయచే గిరాలు మూకుకి రాజేసి బ్రోచిన రాజధరి
త్యాగరాజుని హృదయ సరోజ మేలిన మురారి సోదరి పరాశక్తి నను
॥వినాయకుని॥

భావార్థవివరణ
కాంచీపురమునందు వెలసియున్న శ్రీకామాక్షీదేవిని గూర్చి ఈ కీర్తనయందు ప్రార్థించినారు.నీ కుమారుడయిన వినాయకుని కాపాడిన రీతిని నన్ను రక్షించుము (సుజనాఘ మోచని-) సజ్జనుల పాపములను హరించుదానా! అనాథరక్షకి! నీచమానవులకు నీవు వరములనివ్వగా, (రాములై-) నీయందు అనురాగము కలవారయి ఉండగా భూసురాది దేవతలు అందరూ, నరాధములవలన(రాయిడిని-) రాపిడిని, ఒత్తిడిని పొందవలసినదేనా?శంకరీ! కాంచీపురాధి నాయకీ! జననీ! దయచూడుము.

(పితామహుడు-) బ్రహ్మ ప్రార్థనపై పరదేవత కామాక్షీ రూపమున అవతరించినట్లు సూచితమగుచున్నది.నతులయినవారి ఆర్తిని హరించునట్టి ఓ జననీ! నీ దయ (మూకునికి రాజేసి-) మాకు ఉండునట్లుగా వరములిచ్చి కాపాడుము(రాజధరి-) చంద్రుని ధరించినదాన! (మురారిసోదరి-) మురారి సోదరివయి ఉన్నందున పరాశక్తీ! త్యాగరాజుయొక్క హృదయపద్మమును రక్షించునట్టి (పురాణి-) అనాది స్వరూపిణీ! నీకన్నా గొప్ప దేవతలు లేరమ్మా నన్ను నీకుమారుని(వినాయకుని) వలె కాపాడుము.





కంఠస్థం చేయదగిన శ్లోకాలు

 శ్లోకం - 1

వేలాతిలంఘ్యకరుణే విభుధేంద్రవంద్యే
లీలావినిర్మిత చరాచర హృన్నివాసే,
మాలాకిరీటమణికుండల మండితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్.

  హద్దులేని దయకలతల్లీ! దేవేంద్రునిచే నమస్కరింపబడే దేవీ! లీలగా నిర్మించిన చరాచర జగములలోని వారి హృదయములందు నివసించుదానవు. మాలికలూ, కిరీటమూ, మణికుండలములతో అలంకరింపబడిన తనువు కలదానవు. ఓ బాలాంబికా! నా యందు నీ కృపాకటాక్షము ఉంచుము.

 శ్లోకం - 2

 అగ్రతః పృష్ఠతః చైవ
పార్ష్వతశ్చ మహాబలౌ
ఆకర్ణపూర్ణ ధన్వానౌ
రక్షేతాం రామలక్ష్మణౌ


ముందు వెనుక ఇరుప్రక్కల తోడుగా నిలచి చెవుల వరకు వింటినారిని లాగి విల్లంబులని ఎక్కుపెట్టిన మహాబలులు రామలక్ష్మణులు (నన్ను) రక్షింతురుగాక.

మంచిమాటలు

 సూక్తి - 1

దశనం వసనం యస్య సమలం రూక్ష మస్తకం
వికృతౌ గ్రాస వాసౌ చ న యామి తస్య మందిరమ్

దంతములూ, ధరించిన వస్త్రమూ ఎవరికి మలినంగా ఉంటాయో ఎవరి తల కోమలంగా కాక బిరుసుగా అట్టలు కట్టి ఉంటుందో, తినే తిండీ నివసించే నివాసమూ ఎవరికి శుభ్రంగా నియమబద్ధంగా ఉండవో వారింటికి లక్ష్మి ప్రవేశించదు.


 సూక్తి - 2

కాళిదాసు రఘువంశంలో ఇట్లా చెప్పినాడు,

"జ్ఞానేమౌనం, క్షమాశక్త్యత్యాగేశ్లాఘా విపర్యయి:"
 
జ్ఞానం ఉన్నా మౌనంగా వుండటం,తనకు తెలుసునని ప్రకటించకుండా వుండటం,అపకారం చేసిన వారికి ప్రతీకారం చేయడానికి శక్తివున్నాక్షమాగుణం అలవఱచుకోవటం,మనం దానం చేసినపుడు గొప్పలు చెప్పుకోకుండా వుండటంఇవీ సజ్జనుల లక్షణములు.
(కాంచి కామకోటిపిఠాధిపతులు జగద్గురు శ్రీశంకరాచార్య శ్రీశ్రీశ్రీచన్ర్దశేఖరేన్ర్దసరస్వతీ శ్రీచరణులు.)

శివానందలహరీ : 16-20

 

శివానందలహరీ - శ్లోకం -16

విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః || 16 ||


సదాశివా! నాకేల విచారము ? బ్రహ్మదేవుడు భూమిపై ప్రజలకు దీనత్వమును (లలాటముపై) వ్రాసినాడు. (ఆ కారణముగా నేను దీనుడగుటచేత) దీనులను కాపాడు నీ కటాక్షము నిర్మలమైన కృపతో స్వయముగా నన్ను రక్షించుచున్నది. బ్రహ్మదేవుని నాల్గు శిరములను నీవు రక్షించుము. ఆయన దీర్ఘాయువగుగాక.
(బ్రహ్మదేవుడు దీనత్వమును వ్రాయుటచేతనే జనులకు శివుని కటాక్షమునకు పాత్రత కలిగినది కనుక అతనిని రక్షింపుమని వినతి).


శివానందలహరీ - శ్లోకం -17

ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః || 17 ||


ప్రభో! నా పుణ్యముచేతనో నీ కరుణచేతనో నీవు నాపై ప్రసన్నుడవైననూ, స్వామీ! నీ నిర్మల పాదపద్మములను ఎలా చూడగలను ? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతలసమూహము తమ రత్నకిరీటములతో నన్ను అడ్డగించుచున్నది.

శివానందలహరీ - శ్లోకం -18

త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా || 18 ||


ఓ శివా! లోకంలో నీవొక్కడవే మోక్షమునిచ్చువాడవు. విష్ణ్వాది దేవతలు నీవనుగ్రహించిన పదవులననుభవించుచూ (ఇంకనూ ఉత్తమ పదవులకై) నిన్ను కొలుచుచున్నారు. భక్తులపై నీకెంత దయ (అపరిమితము). నా ఆశ ఎంత (ఇంత అని చెప్పలేను).  నా అహంభావమునుబాపి సంపూర్ణకటాక్షముతో ఎప్పుడు నన్ను రక్షించెదవు ?

శివానందలహరీ - శ్లోకం -19

దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే
దురన్తే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ || 19 ||


ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను (అలా వ్రాసిన) బ్రహ్మదేవునియందు వాత్సల్యముచేత, తొలగించుటలేదు కాబోలు. నీవు (అలా) భక్తవత్సలుడవైనప్పుడు నిన్ను భజించి మేమూ కృతార్థులమవుతునాము కదా!

-- వేరొక అర్థము

ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను ఎందుకు తొలగించవు ? సహాయంచేయమని ఎవరినడుగను ? నిన్ను భజించి (ప్రీతి కలిగించి) మేమూ కృతార్థులమవుతున్నాము కదా!

శివానందలహరీ - శ్లోకం -20

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో || 20 ||


ఓ కపాలధారీ, సర్వవ్యాపకా, శివా, ఆదిభిక్షూ, నా దగ్గర ఒక కోతి ఉంది. అది, మోహమనే అడవిలో చరించుచున్నది, యువతుల స్తనములనే పర్వతములపై క్రీడించుచున్నది. ఆశా శాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులిడుతున్నది. అత్యంత చపలమైన నా మనస్సనే ఈ కోతిని భక్తి (అనే త్రాడు) తో కట్టివేసి నీ వశం చేసుకొనుము.

(నా చంచల చిత్తమునకు త్వదేక శరణమైన భక్తిననుగ్రహింపుమని భావము).

శివానందలహరీ : 11-15


శివానందలహరీ - శ్లోకం - 11

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11 ||


ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.

శివానందలహరీ - శ్లోకం -12

గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే
స్థితం చేద్యోగోసౌ  స చ పరమయోగీ స చ సుఖీ || 12 ||


ఓ శంకరా! మనుజుడు, గుహలో కానీ, ఇంటిలో కానీ, బయటనెచ్చటో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటియందు కానీ, పంచాగ్నిమధ్యమందు కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏమి లాభము? ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు స్థిరముగానుండునో అతడే గొప్పయోగి మరియూ అతడే పరమానందము కలవాడు అగును.

శివానందలహరీ - శ్లోకం -13

అసారే సంసారే నిజభజనదూరేఽజడ ధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ |
మదన్యః కో దీన స్తవ కృపణరక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే || 13 ||


ఓ పశుపతీ ! నీ సేవకు దూరమైన నిస్సారమైన ఈ సంసారములో గ్రుడ్డివాడనై భ్రమించునాకు మిక్కిలికరుణతో జ్ఞానమిచ్చి బ్రోవవయ్యా!. నాకన్నా దీనుడు  నీకు ఎవరున్నారు ? ముల్లోకాలకూ నీవే దీనరక్షకుడవు, శరణువేడదగినవాడవు.

శివానందలహరీ - శ్లోకం -14

ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః |
త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః || 14 ||


ఓ పశుపతీ! నీవు సమర్థుడవు, దీనులకు ముఖ్యబంధువువు కదా. నేను ఆ దీనులలో మొట్టమొదటివాడను. ఇంక మన ఇద్దరి బంధుత్వము గురించి  వేరే చెప్పనక్కరలేదు కదా. ఓ శివా! నా సమస్త అపరాధములనూ నీవు క్షమించుము. నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించుము. ఇదేకదా బంధుమర్యాద (బంధువులతో మెలగవలసిన తీరు).


శివానందలహరీ - శ్లోకం -15

ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యాన విముఖాం
దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్|| 15 ||


ఓ పశుపతీ! నీకు నా పై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనుకాడునదీ, దురాశలతో నిండినదీ అయిన నా తలరాతను ఏల తుడిచివేయవు ? అందుకు సమర్థుడవు కానిచో (కాను అంటావేమో)  ఏ ప్రయత్నమూ లేకుండా చేతిగోరుకొనతో దృఢమైన బ్రహ్మ శిరస్సును ఎలా పెకలించావు ?


ఆనందలహరీ : 16-20


 
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 16

వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూః భుజగనివహో భూషణవిధిః |
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపోః
యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా || 16 ||


అమ్మా!  మన్మథశత్రువగు శివుని (సంపద) గురించి అందరికీ తెలిసినదే. ఆయన వాహనము ముసలి ఎద్దు. ఆహారము హాలాహలము. వస్త్రము దిక్కులు. క్రీడాస్థలము స్మశానము. ఆభరణములు పాములు. ( ఇలాంటి శివుడు ఈ జగత్తుకి ఈశ్వరుడు ఎలా అయ్యాడు ?) ఆయన యొక్క ఐశ్వర్యము(ఈశ్వరత్వము) ఓ జననీ! నీ సౌభాగ్యమహిమయే.

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 17

అశేషబ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే || 17 ||


అమ్మా!  పశుపతి అయిన శివుడు సహజముగా అశేష బ్రహ్మాండములనూ ప్రళయంతో లయం చేసే స్వభావం ఉన్నవాడు,  స్మశానంలో ఉండేవాడు, బూడిద పూసుకునే వాడు. అలాంటి వాడు అఖిల జగత్తుపైనా కరుణతో హాలాహలాన్ని కంఠంలో ధరించాడు. ఓ కళ్యాణీ, ఈ కరుణ చూపడం నీ సాంగత్యఫలమే అని నేను తలచుచున్నాను.

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం -18

త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసి వాసేన గిరిశః॥18॥

అమ్మా శైలపుత్రీ! సర్వోత్కృష్టమయిన నీ సౌందర్యమును చూచి మిక్కిలి భయముతో గంగ జలమైపోయెను. అంతట ఈశ్వరుడు ఆ గంగాదేవి ముఖకమలమును చూచి,ఆమె దీనావస్థకు జాలిపడి,తన శిరసున నివాసమిచ్చి,ప్రత్యేక ప్రతిష్ఠను కలిగించుచున్నాడు.

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 19

విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్॥19


హే భగవతీ! అధికమైన చందనద్రవముతో,కస్తూరితో,కుంకుమపువ్వుతో కలిసిన నీ అభ్యంగజలమును(తలంటి పోసుకొను నీరు) మరియు రాలుచున్న నీ పాదధూళిని తన చేతులతో సంగ్రహించి బ్రహ్మదేవుడు దేవలోకసుందరీమణులను(అప్సరసలను) సృష్టించుచున్నాడు తల్లీ!
(అంబిక సౌందర్యాధిదేవత,ఆమె సౌందర్యము సర్వాధిక్యమని సూచన)

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం -20

వసన్తే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాళిసుభగే
సఖీభిః ఖేలన్తీం మలయపవనాందోళితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి॥20॥


తల్లీ! ఆనందకరమైన వసంతకాలంలో, అన్నివైపులా లతలు ఉన్నది, వికసించిన బహువిధములైన పద్మములు కలది, కలహంసల బారులతో సుందరమైనది మరియు మలయమారుతముచే మెల్లగా కదులు నీరు కలది అగు సరస్సులో చెలికత్తెలతో జలకములాడుచున్న నిన్ను ధ్యానించు వారికి జ్వరపీడ దూరమగును.

                                  
                                             ఇతి శ్రీశంకరాచార్య కృత ఆనందలహరీ స్తోత్రం
                                                                     🌸🌸🌸                              

ఆనందలహరీ : 11-15


శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 11

మహాన్తం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 11 ||


అమ్మా ఉమాదేవీ! నీ పాదపద్మములపై గొప్ప విశ్వాసము కలవాడినై నేను ఈ లోకంలో  అన్య దేవతలను ఆశ్రయించలేదు. అయినా నీవు నాపై కరుణ చూపకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ ! నాకెవరు దిక్కు ?

త్యాగరాజులవారు కూడా ’వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా!’ అని కామాక్షీ అమ్మవారిని ప్రార్థించారు.  శంకరులు ఈ శ్లోకంలో ’వినాయకుని తల్లీ నాకింకెవరు దిక్కు?’ అని అడుగుతున్నారు. ఎందుకు వినాయకుని అమ్మకు గుర్తుచేస్తున్నారు ?

వినాయకుని ’హేరంబుడు’ అంటారు. అంటే ఎప్పుడూ శివునివద్దనే ఉండేవాడని. అందుచేత వినాయకుడంటే అమ్మవారికి మక్కువ అని పెద్దల మాట.

నాకు వినాయకుని ’లంబోదర’ అని సంబోధించడంలో ఒక సంకేతం కనిపిస్తోంది. వినాయకచవితి కథలో వినాయకుని ఉదరం భగ్నమైనప్పుడు అమ్మవారు పట్టుబట్టి మరలా జీవం పోయించింది. అంత కరుణనూ నాపై కూడా చూపమని శంకరులు, త్యాగరాజులు అడుగుతున్నారని నా అభిప్రాయం.

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 12

అయస్స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిళితమ్ |
తథా తత్తత్పాపైరతిమలిననన్తర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ || 12 ||


పరశువేది స్పర్శతో ఇనుము బంగారమవుతున్నది. వీధికాలువల నీరు గంగాప్రవాహముతో కలిసి శుచి అవుతున్నది. అలాగే
ఆయా పాపములతో అతి మలినమైన నా మనస్సు నీపై భక్తితో కలసినచో ఎట్లు నిర్మలము కాదు ?

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 13

త్వదన్యస్మాదిచ్చావిషయఫలలాభే న నియమ
స్త్వమజ్ఞానామిచ్చాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివముచితమీశాని కురు తత్ || 13 ||


నీ కంటే ఇతరులైన దేవతల వలన కోరినఫలము లభిస్తుందని నియమము (ఆంగ్లములో చెప్పాలంటే , గ్యారంటీ) లేదు. మరి నీవో, అజ్ఞులకుకూడా కోరినదానికన్నా అధికముగా ఇచ్చుటలో సమర్థురాలవని బ్రహ్మదేవుడు మొదలగువారు చెప్పారు. నా మనస్సు రాత్రింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నది. ఓ ఈశ్వరుని పత్నీ! ఏది తగినదో అది చేయుము.

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 14

స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చశధరకళాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి || 14 ||


ముల్లోకములకూ మహారాజయిన పరమేశ్వరుని గృహిణి అగు ఓ పరమేశ్వరీ! రమణీయమైన నీ సౌధములో కాంతులీను నానా రత్నములు పొదగబడినవీ, స్ఫటికమయమైనవీ అయిన గోడలయందు నీ ఆకారము ప్రతిబింబించుచున్నది. దాని శిఖరము పై చంద్రకళ ప్రకాశించుచున్నది. ఆ భవనములో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు సపరివారముగా ఉన్నారు. ఆ భవనము ఎంతో గొప్పగా ఉన్నది.


శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 15

నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధనికరః |
మహేశః ప్రాణేశః తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా || 15 ||


అమ్మా! నీ సౌభాగ్యమేమని చెప్పను ? నీ నివాసము కైలాసము. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు నిన్ను స్తుతిచేయువారు (వంది మాగధులు). ఈ ముల్లోకాలూ నీ కుటుంబము. సిద్ధులన్నీ నీకు అంజలిఘటించుచున్నాయి. మహేశ్వరుడు నీ ప్రాణేశుడు. ఓ పర్వతరాజపుత్రీ పార్వతీ! నీ సౌభాగ్యానికి సమానమైనది వేరొకటి లేదు .

ఆనందలహరీ : 6-10


 

శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 6

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా || 6 ||


(ఇక్కడ అమ్మవారిని కల్పలతతో పోలుస్తున్నారు.ఈ లత మామూలు లత కాదు కల్పలత అంటే అడిగినవన్నీ ఇస్తుంది.)
ఈ కల్పలత హిమవత్పర్వతమునందు పుట్టింది, అందమైన చేతులు అనే చిగురుటాకులు కలది, ముత్యములనే పుష్పములున్నది,  ముంగురులనే తుమ్మెదలు వాలినది, శివుడనే మ్రోడుని పెనవేసుకొన్నది(స్థాణువు-శివుడు,మ్రోడు), స్తనములనే ఫలములతో వంగినది, శాస్త్రవాక్కులనే మకరందం కలిగినది, సర్వరోగములనూ పోగొట్టునది(భవరోగ నివారిణి), కదులుచున్నది అగు పార్వతీదేవి అనే జ్ఞానానందలతిక విలసిల్లుచున్నది.
 
శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 7

సపర్ణా మాకీర్ణాం కతిపయగుణై స్సాదరమిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్ || 7 ||


(పరమేశ్వరుని వివాహమాడుటకు ఆకులనుకూడా తినకుండా తపస్సు చేసినందున పార్వతీదేవికి అపర్ణ అని పేరు. అపర్ణ అనగా ఆకులు లేనిది అని. పార్వతీదేవి ఈ శ్లోకములో ఆకులులేని తీగగా చెప్పబడుతున్నది)

ఆకులు కలిగిన తీగెలను (ఇతర దేవతలను), కొన్నిగుణములు మాత్రమేగలవైననూ, ఇతరులు ఆశ్రయించుచున్నారు. నాకు మాత్రం ఈ విధంగా అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ ఆకులులేని తీగెనే (అపర్ణ) ఆశ్రయించాలి. ఆ తీగె చుట్టుకున్న మాత్రాన పాత మ్రోడు (శివుడు - స్థాణుః) కూడా మోక్షఫలములిచ్చుచున్నది.

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 8

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజనని
త్వమర్థానాం మూలం ధనద సమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషి || 8 ||


సమస్త వేదములను కన్నతల్లీ! నీవే ధర్మములు విధించుచున్నావు. కుబేరుడు నీ పాదకమలములకు మ్రొక్కెడువాడే. సమస్త సంపదలకూ నీవే మూలము. తల్లీ, నీవు మన్మధుని జయించినదానవు, కోరికలకూ నీవే మూలము. పరబ్రహ్మ పట్టపురాణివి నీవు, సత్పురుషుల ముక్తికి కారణమూ నీవే.
(చతుర్విధ పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనొసగునది జగన్మాత )

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 9

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస
స్త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః || 9 ||


అమ్మా! చపలచిత్తుడనైన నాకు నీపై భక్తి కుదురుటలేదు. నీవు శ్రీమతివి (పెద్ద మనసున్నదానివి, మనం పెద్దమనసు చేసుకుని అంటాం కదా) నాపై దయచూపాలి. చాతకపక్షి నోటిలో మేఘుడు మధురమైన నీటిని వర్షించినట్లే నీవూ నాపై దయావర్షం కురిపించాలి. నా మనస్సు ఎందుకు నీపై నిలుచుటలేదని మధనపడుచున్నాను. (నీవే దారి చూపాలని వినతి).

చాతకపక్షి ఇష్టాఇష్టాలతో నిమిత్తంలేక మేఘుడు తన ధర్మం ప్రకారం మధురజలాలు ఆ పక్షిపై ఎలావర్షిస్తున్నాడో, నా భక్తిశ్రద్ధలతో నిమిత్తంలేకనే నువ్వు (నీ దయాధర్మం ప్రకారం) నీ దయ నాపై కురిపించు తల్లీ అని భావన.

శంకరులు సౌందర్యలహరిలో ’దృశా ద్రాఘీయస్యా’ శ్లోకంలో ఇదేభావం కనపరిచారు. ’వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః’ చంద్రుడు భవనాలపై అరణ్యాలపై ఒకేలా వెన్నెల కురిపించినట్లు, ఈ దీనుడిపై దయచూపమని అక్కడ వినతి.

’కావు కావమని నే మొరబెట్టితే కరుగదేమి మది’ అని త్యాగరాజులవారు
’దేవీ బ్రోవ సమయమిదే, అతివేగమే వచ్చి’ అని శ్యామశాస్త్రుల్ల వారు దెబ్బలాడారు. అందరూ దెబ్బలాటలు శంకరులవద్దే నేర్చుకున్నట్లుంది.

 శంకరాచార్యుల ఆనందలహరీ - శ్లోకం - 10

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీ పరికరైః || 10 ||


గొప్పచరిత్రగల తల్లీ! నిన్ను శరణు అన్న నాపై నీకు ఉపేక్ష తగదు. నీ దయాదృష్టిని నాపై వేగముగా ప్రసరింపచేయి.  కోరుకున్నది వెంటనే ఇవ్వకపోతే సామాన్యలతలకన్నా కల్పలతకు విశేషమేమున్నది ?

శివానందలహరీ : 21-25

 

 శివానందలహరీ - శ్లోకం -21

ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 ||


 ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద నీవు నివసించుటకు ఒక కుటీరము ఉన్నది. అది ధైర్యమనెడి స్తంభము ఆధారముగా, సద్గుణములనే తాళ్ళతో గట్టిగా కట్టబడి ఉన్నది. ఆ కుటీరము విచిత్రముగా పద్మాకారములో నున్నది. దానిలో అటునిటు తిరుగవచ్చు (విశాలమైనది). అది నిర్మలమూ, అనుదినము సన్మార్గవర్తీ అయిన నా హృదయమనే కుటీరము. నీవు అమ్మతో సహా ఈ నా హృదయకుటీరములో ప్రవేశించి నివసింపుము.

(శంకరులు సద్భక్తుల నడత ఎలా ఉండాలో చూపుతున్నారు)

 శివానందలహరీ - శ్లోకం -22

ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||

 

దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము.


శివానందలహరీ - శ్లోకం -23

కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో || 23 ||

 
శంకరా, మహాదేవా, నేను నీ పూజలు చేస్తాను. వెంటనే నాకు మోక్షమునిమ్ము. అలాకాకుండా పూజకు ఫలముగా నన్ను బ్రహ్మగానో, విష్ణువుగానో చేశావే అనుకో, మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసగా ఆకాశంలోనూ, వరాహముగా భూమిలోనూ వెతుకుచూ, ప్రభూ, నీవు కనపడక, ఆ భాధను నేనెలా భరించగలను ?

 శివానందలహరీ - శ్లోకం -24

కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై-
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్థాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥24॥


ఓ దేవా! కైలాసము నందు బంగారముతోనూ మరియు మణులతోనూ నిర్మించిన సౌధంలో ప్రమథగణాలతో కలసి నీ ఎదురుగా నిలబడి,తలపై అంజలి మొక్కుచూ " ఓ ప్రభూ! సాంబా! స్వామీ! పరమశివా! రక్షించు" అని పలుకుచూ అనేక బ్రహ్మాయుర్దాయములను క్షణమువలే సుఖంగా ఎప్పుడు గడిపెదనో కదా!




Saturday 2 January 2016

సంధ్యావందనం : జగద్గురువులతో సంభాషణ



యాత్రలుచేయుచున్న ఒక విద్యాధికారి జగద్గురువులను ఒకసారి కలిసి ఇలా అడిగాడు :

నా వృత్తిరీత్యా చిన్నపిల్లలతో కలిసి ఉండాలి. వీరిలో ఎక్కువమంది బ్రాహ్మణులు. ఈ విద్యార్థులలో సంధ్యోపాసనచేసేవారు కూడా దానిని ఒక తంతులా చేస్తారు అని గమనించాను. జగద్గురువులు ఈ విషయమై నాకు అలాంటివారికి చెప్పడానికి ఏమైనా విలువైన అంశాలు చెప్పగోర్తాను.
నీవు కేవలం ఉద్యోగపరిధికి లోబడకుండా నీ అవకాశాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నావని తెలిసి సంతోషంగా ఉంది. విద్యావేత్తలూ, అధికారులూ, ఉపాధ్యాయులూ విద్యార్థులజీవితంలోని చాలా ముఖ్యదశలో వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని గ్రహిస్తే మంచిది. నా ఉద్దేశ్యములో విద్యార్థులు నిర్దేశించబడిన పాఠ్యపుస్తకాలు చదివి ఆధ్యాత్మిక పురోగతిని వదలివేస్తే దానికి వీరే బాధ్యులు.
నేను ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటాను. విద్యార్థులకు సలహాఇచ్చే అవకాశాన్ని వదలుకోను. అందుకనే జగద్గురువులను కొన్ని ఆచరణమీయమైన సలహాలు అడిగాను.
ఈ సలహాలు నువ్వు చెప్పదల్చుకున్న విద్యార్థులకు ఉపయోగపడకపోయినా, నీకు ఉపయోగపడతాయి.
అవును, ఖచ్చితంగా.
కాబట్టి, ఇప్పుడు విద్యార్థులను మర్చిపోయి, నీకు ఉపయోగపడే విషయాలు అడుగు.
నాకు తోచే మొట్టమొదటి ప్రశ్న - "సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు ? "
దానిని మనం పరిశీలించేముందు నీకు సంధ్యోపాసన అంటే సాధారణంగా ఏమి అర్థమయ్యిందో చెప్పు.
సంధ్యోపాసన అంటే ఉదయించే, అస్తమించే, మధ్యాహ్న సూర్యుని ఉపాసించటం.
నిజమే. కూలంకషంగా సూర్యోపాసన అని చెప్తున్నావా ?
అవును
నువ్వు సంధ్య అంటే సూర్యోపాసన అంటున్నావు. నువ్వే సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు అని అడుగుతున్నావు. అనవసరమైన ప్రశ్న అనిపించట్లేదా ?
అలా అంటే అనవసరమైన ప్రశ్న అనిపిస్తుంది. కానీ నా అసలు ప్రశ్న "ఈ ఉపాసించబడే సూర్యుడు ఏది ? " అని
నువ్వు సాధారణంగా సూర్యుడంటే అర్థం ఏమని అనుకుంటున్నావు ?
ఆకాశంలో వెలిగే నక్షత్రం అని.
అయితే ఆ ఆకాశంలో వెలిగే నక్షత్రమే ఉపాసించబడుతోంది.
కానీ ఆ నక్షత్రం, సైన్సు ప్రకారం జీవరహితమైనది, ఎప్పుడూ తగలబడుతూ ఉండేది, మనలాంటి తెలివైన జీవులచే ఉపాసించబడేంత విలువ లేనిది. మన ప్రార్థనలను వినలేదు, బదులు చెప్పలేదు. మన పూర్వీకులు ఒక మండే నక్షత్రానికి మన ప్రార్థనలు చెయ్యాలని చెప్పేంత మూర్ఖులు కారు.
అవును. మన పూర్వీకులు అంత మూర్ఖులు కారు.
అయితే వాళ్ళు సూర్యునిలో ఏం చూసి మనలను సూర్యుని ఉపాసించమన్నారు ?
నువ్వు ఇప్పుడే జడపదార్థాలకు ప్రార్థనచేయడాన్ని తర్కం ద్వారా సమర్థించలేమని చెప్పావు.
అవును.
అయితే ప్రార్థించదగిన పదార్థము యొక్క లక్షణాలు ఏమై ఉండవచ్చు ?
ప్రాథమికంగా అది జడమై ఉండరాదు. తెలివితేటలు కలిగి ఉండాలి.
రెండో లక్షణం ?
అది మన ప్రార్థనలను వినగలిగినదై, వాటికి బదులుచెప్పగలిగిన శక్తికలిగి ఉండాలి.
నిజమే. మన పూర్వీకులు మూర్ఖులు కారని అయినా సూర్యుని ప్రార్థించారంటే, వారి ఉద్దేశ్యంలో సూర్యుడంటే ఒక ఎప్పుడూ తగలబడుతూ ఉండే జడ పదార్థం కాదన్నమాట.
అవును. వారు దాని తెలివితేటలను, మన ప్ర్రార్థన వినగలిగిన శక్తి, మనకు సహాయంచేయగలిగిన శక్తులను సిద్ధాంతీకరించి ఉంటారు.
నువ్వు "మన" అన్నప్పుడు, ఇప్పుడు జీవిస్తూ చేతులెత్తి సూర్యుని ప్రార్థించేవారే కాక, అసంఖ్యాకమైన గత, భవిష్యత్తు తరాలను కూడా కలిపే అంటున్నావు కదా ?
అవును.
కాబట్టి మనం సూర్యుడు అని ఏ పదార్థాన్ని ప్రార్థిస్తున్నామో దాని తెలివితేటలూ శక్తిసామర్థ్యాలూ కాలానికీ దూరానికీ అతీతం అయ్యుండాలి కదా ?
అవును అలాగే అయ్యుండాలి.


నీ ’సంధ్యోపాసనద్వారా ఉపాసించబడే దేవత ఎవరు ?’ అన్న ప్రశ్నకు జవాబు దొరికిందా ? అది ఒక మేధస్సు కలిగి సర్వసాక్షి అయి, జనులు పార్థనలు విని బదులుచెప్పగల  సర్వశక్తిమంతమైన పదార్థము.

జగద్గురువులు ఆ నక్షత్రములో నివాసముండే ఒక దేవుడు అంటున్నారా ?
అవును. అక్కడ నివాసమే కాదు, ఆ నక్షత్రమే తన శరీరమైన వాడు.
జగద్గురువులు మనం మన భౌతికశరీరాలలో జీవిస్తున్నట్లు ఆ దేవుడు ఆ నక్షత్రములో జీవిస్తున్నాడంటారా ?
అవును.
అతడు మనలాంటివాడే అయితే ఏవిధంగా అతడికి అంత మేధస్సు, జనులు పార్థనలు విని బదులుచెప్పగల శక్తి వచ్చాయి ?
అతడి గతజన్మలో చేసిన ఉపాసన, కర్మల ఫలితంగా ఆ స్థానం లభించింది.
జగద్గురువులు అతడు ఒకప్పుడు మనలాంటి వాడేనని, అతని ప్రవర్తన ద్వారా స్థానం సంపాదించాడనీ అంటున్నారా ?
అవును
అయితే అతడు నాకంటే భిన్నమైన జీవుడు కాదు. అలాంటప్పుడు ఎంత గొప్పవాడైనప్పటికీ ఒక జీవునికి వేరొక జీవుడు ఎందుకు సాష్టాంగాలు చెయ్యాలి ?
నీ పుత్రుడైనా, విద్యార్థి అయినా నిన్ను ఎందుకు గౌరవించాలి ? అలాగే నీ ఉన్నతాధికారులను నువ్వెందుకు గౌరవించాలి ? మీరందరూ జీవులే కదా ?
నిజమే. మేము ఉన్నతాధికారులను గౌరవించడానికి కారణం , వారు కావాలనుకుంటే మాకు సహాయమూ చేయగలరు, ఆపదనూ కొనితేగలరు.
అది తక్కువస్థాయి ఆలోచన. సరే, అలా ఆలోచించినా, సూర్యుడు తను తలచుకుంటే మనకు సహాయమూ చేయగలడు, ఆపదనూ కొనితేగలడు కాబట్టి మనము సూర్యుని ఉపాసించాలి.
అవును
నీ ఉన్నతాధికారుల వలేనే,  అతడూ జీవుడైనప్పటికీ, ప్రార్థిస్తే సహాయం చేస్తాడు, నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా ఆపద కలగజేయగలడు. కాబట్టి, నీ మంచికోరి, నీవు అతడిని ఉపాసించి సంతోషపెట్టవలెను.
కానీ నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లయితే నేను నా ఉన్నతాధికారులను సంతోషపెట్టనక్కరలేదు, భయపడనక్కరలేదు.
అవును
నేను అలా ఉంటే నా ఉన్నతాధికారులను ప్రసన్నంచేసుకోనక్కరలేదు.
అవును, అక్కరలేదు.
అలాగే, నేను శాస్త్రానుసారంగా నడచుకొంటే, వేరే ఏ ఇతర జీవునీ , అతడు ఎంత మహిమగలిగినప్పటికీ, ప్రసన్నంచేసుకోనక్కరలేదు.
అవును.
అయితే, నేను సూర్యుని ఉపాసించడం మానివేయవచ్చు కదా ?
మానివేయవచ్చు. అలాంటి ఉపాసనను శాస్త్రము విధించితే తప్ప.
అలా ఎలాగ ?
ఒక నిజాయితీ,  క్రమశిక్షణగల ఉద్యోగి తన బాధ్యతలను నిర్వహించేటప్పుడు తన పై అధికారి ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోనక్కరలేదు. కానీ బాధ్యతలను సరిగాచేయాలి అనుకోవడంలోనే  తనకూ, తన పై అధికారికీ కూడా ఉన్నతాధికారి యొక్క ఇష్టాయిష్టాలను/ఆదేశాలను దృష్టిలో ఉంచినట్లే.  ఆ ఉన్నతాధికారితో వ్యక్తిగత సంబంధం లేకపోయినా - అతడిని రాజు అను, ప్రభుత్వమను - ఆ శక్తిని దృష్టిలో ఉంచుకోవలసినదే.  ఆ శక్తి, ఉద్యోగి సేవలను గుర్తించి బహుమానం ఇవ్వటమో, లేదా సరిగా పనిచేయలేదని దండించడమో చేయగలదు. తననూ తన పై అధికారినీ కూడా పాలించగలదు. కాబట్టి, ఆ శక్తి, ఉద్యోగిని తన పై అధికారితో ఒక నిర్దిష్టపద్ధతిలో ప్రవర్తించమని ఆదేశిస్తే, ఉద్యోగి ఆ అదేశాన్ని తిరస్కరించలేడు. అలా తిరస్కరిస్తే వారిద్దరి - పై అధికారీ, ఉన్నత శక్తీ, ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
అవును.
అలాగే నిన్నూ , సూర్యుడినీ కూడా పరిపాలించే ఒక శక్తి, నిన్ను సూర్యుని ఒక పద్ధతిలో ఉపాసించమంటే , ఆ ఆదేశాన్ని అలక్ష్యం చేయరాదు. చేస్తే సూర్యునియొక్క, ఆ శక్తియొక్క ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుంది.
అవును. కానీ అలాంటప్పుడు నేను సూర్యుడికి సాష్టాంగపడినప్పటికీ, నేను నిజానికి ఆ ఉన్నత శక్తిని ఉపాసిస్తున్నట్లు. అవునా ?
అంటే ?
అలాంటి సూర్యునికంటే ఉన్నత శక్తిని నేను తెలిసికొనగలిగితే , మనం సూర్యునికోసం చేసే పూజలన్నీ ఆ ఉన్నతశక్తికే చెందుతాయా ?
అవును.
కానీ జగద్గురువులు మనం సూర్యునే ఉపాసిస్తున్నాం అన్నారు ?
అవును. ఆ ఉన్నతశక్తిని తెలిసికొనలేనివారికి అది నిజమే. తెలుసుకొన్నవారికి అతడే నిజమైన ఉపాస్య దైవం. అతడిని హిరణ్యగర్భుడు అంటారు. సూరునికే కాక అందరు జీవులకీ ఆయన ప్రాణశక్తి. ఈ నక్షత్రాలకేకాక మొత్తం విశ్వమంతా అతడి శరీరం. అన్ని పదార్థాలకూ అతడే ఆత్మ.
అయితే, మనం మన శరీరాలను ’నేను’ అనుకుంటున్నట్లు, ఈ విశ్వాన్ని ఆయన ’నేను’ అనుకుంటాడా ?
అవును
అలాంటప్పుడు ఆయనకూ నాకూ భేదం ’నేను’ అనే భావన ఉందా లేదా అని కాక , ఆ భావం ఎంత విస్తారంగా ఉంది అనే కదా. నాకు ఆ భావం స్వల్పం. ఆయనకి విస్తారం.
అవును.
అయితే ’నేను’ అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకూడా జీవుడేనా ?
అవును. ఆయన ’మొదట పుట్టినవాడు’.
అయితే నాలాగే ఈ ఉన్నతశక్తి కూడా జీవుడయితే, నేను సూర్యుని గూర్చి (మరో జీవుని ఎందుకు ఉపాసించాలి) అడిగిన ప్రశ్న ఇక్కడా వర్తిస్తుంది కదా.
నువ్వు ఎవరిని ఉపాసించాలనుకుంటున్నావు ?
ఒక జీవుడు కానటువంటి సర్వశ్రేష్ఠ శక్తిని.
అయితే సంధ్య ద్వారా అలాంటి సర్వశ్రేష్ఠ శక్తిని ఉపాసిస్తున్నాము. అతనిని మనం ఈశ్వరుడు, అంతర్యామి అంటాము.
కానీ నేను ’ఈశ్వరత్వము’ అంటే సాపేక్షమని, ఈ జగత్తుకు ఈశ్వరుడని (పాలకుడని) విన్నాను.
అవును.
అయితే ఈ జగత్తుకు సంబంధములేకుండా అతని ఈశ్వరత్వము లేదు. అతడికి వేరే ఏ విషయముతోనూ సంబంధము లేకుండా ఒక స్థితి/ఉనికి ఉండాలి.
అవును. నీవు నిజమే చెప్తున్నావు. ఆ సంబంధము లేని స్థితిని బ్రహ్మము అంటాము.
అలా అయితే, నిజమైన ఉపాస్య దైవము సాపేక్షమైన ఈశ్వరుడు కాక ఈ బ్రహ్మము అన్నమాట.
అవును. సంధ్యోపాసన ద్వారా నిజానికి ఈ నిర్గుణ బ్రహ్మమునే ఆరాధిస్తున్నాము.
నేను జగద్గురువులను సరిగా అర్థంచేసుకోలేకపోతున్నాను. మొదట మీరు ఈ నక్షత్రమే సంధ్యకు ఉపాస్యదైవం అన్నారు. నేను, అది కేవల జడపదార్థమన్నప్పుడు సూర్యుడు ఉపాస్యదైవం అన్నారు. నేను, సూర్యుడూ నాలాంటి జీవుడే అన్నప్పుడు, విశ్వాత్మ అయిన హిరణ్యగర్భుడు ఉపాస్యదైవం అన్నారు. ఆయన యొక్క " నేను అన్న భావం " ఎంత విస్తారమైనప్పటికీ అతడూ కూడా జీవుడే అని నేనన్నప్పుడు , తమరు, ఈ విశ్వానికి నాధుడైన ఈశ్వరుడు ఉపాస్యదైవం అన్నారు. చివరగా ఈశ్వరుడూ సాపేక్షమే అన్నప్పుడు మీరు ఉపాస్యదైవం బ్రహ్మము అన్నారు.
అవును అలాగే అన్నాను.
కానీ ఈ మాటలన్నీ ఎలా సమర్థించుకోవాలి ?
ఇందులో కష్టం ఏముంది ?
ఉపాస్యదైవం ఒక్క పదార్థమేకదా. ఒకేసారి అది నక్షత్రమూ, సూర్యుడూ, హిరణ్యగర్భుడూ, ఈశ్వరుడూ, బ్రహ్మమూ ఎలా అవుతుంది ?
నేను అది కాని ఇది కాని అని చెప్పలేదు.
జగద్గురువులు ఉపాస్య పదార్థం - నక్షత్రమూ, సూర్యుడూ, హిరణ్యగర్భుడూ, ఈశ్వరుడూ, బ్రహ్మమూ కలిపిన పదార్థమంటున్నారా ?
నేను అలాకూడా చెప్పలేదు.
మరి నన్ను మీ మాటలను ఎలా అర్థం చేసుకోమంటారు ?
నేను ఉపాస్య దైవము సూర్యుడని ఎప్పుడు చెప్పాను ?
నేను ఒక మండే జడపదార్థము ఉపాసనార్హము కాలేదన్నప్పుడు.
దానికి ముందు ఆ జడపదార్థమే ఉపాస్య దైవము అనికూడా అన్నాను.
అవును
నేను ఆ జడపదార్థము లేకపోతే సూర్యుడు అని చెప్పలేదు. ఆత్మ / ప్రాణశక్తి అవగాహనలేనివారికి ఆ నక్షత్రమే ఉపాస్యము. జడపదార్థము ఉపాస్యముగా అంగీకరించనివానికి సూర్యుడు ఉపాస్య దైవము అని అన్నాను.  ఉపాసన ఒక్కటే, దాని స్వభావము ఉపాసించేవానిని బట్టి మారుతుంది. దేవతల ఉపాసనను ప్రశ్నించే భక్తులకు ఉపాస్యము ఇంకా మెరుగుపడుతుంది. ఆ ఉపాస్యమును హిరణ్యగర్భుడంటాము. ఈ ప్రతిపాదనకూడా సంతృప్తి పెట్టలేని వారికోసం మనం వారు నిజానికి ఈ జగత్తుకు అధిపతి అయిన ఈశ్వరుని ఉపాసిస్తున్నారని చెప్తాము. భక్తులు ఈ ఆధిపత్యం కూడా నిజ స్వభావానికి కొరత అని అనుకున్నప్పుడు నిజమైన ఉపాస్యము అనంత బ్రహ్మము అని చెప్తాము. ఇందులో కష్టం ఏముంది ?
ఉపాసించేవారి మానసిక పరిణతి, మేధస్సును పరిగణనలోకి తీసుకోకుండా ఉపాస్య పదార్థము ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేమని జగద్గురువుల అభిప్రాయమా ?
ఉపాసించేవారిని వదలివేస్తే ఉపాస్యము ఎలా ఉంటుంది ? ఉపాస్య పదార్థ స్వభావము ఉపాసించేవారి స్వభావముపై ఆధారపడి ఉంటుంది.
ఎలా ?
నన్నే ఉదాహరణగా తీసుకో. మీరందరూ నాకు నమస్కరిస్తారు. మీచేత నమస్కరించబడే వస్తువు, రమారమి నేనే అయినా, మీ అందరికీ వేరువేరుగా ఉంటుంది. సామాన్యులు నాకు నమస్కరిస్తారు, నా చుట్టూ తళతళలాడే వస్తువులు చూడాలనుకుంటారు. వారి గౌరవమూ దృష్టీ ఆ సామగ్రిపైనే కానీ నేనుకాదు. ఆ వ్యక్తులు అలాంటి సామగ్రికలవారెవరికైనా నమస్కరిస్తారు. కాబట్టి వారి నమస్కారం నాకు కాక, ఆ సామగ్రికి చెందుతుంది. మరికొందరు నా స్థానానికిగాని నేనున్న (సన్యాస)ఆశ్రమానికిగాని నమస్కరిస్తారు. వారు ఇలాంటి స్థానములో ఉన్న/రాబోయే వారికి, ఇలాంటి ఆశ్రమములో ఉన్నవారెవరికైనా నమస్కరిస్తారు. వారి గౌరవము నాకుగాక ఈ స్థానానికిగాని ఆశ్రమానికిగాని చెందుతుంది. ఇంకొందరు స్థానమూ ఆశ్రమమూ పట్టించుకోక నా ఈ భౌతిక కాయానికి నమస్కరిస్తారు. మరికొందరు నా శరీరాన్నీ పట్టించుకోరు. నా శుద్ధమనస్సు, వ్యక్తిత్వం వల్లనో లేకపోతే నా మేధస్సు, విద్య వల్లనో, లేక నా ఆధ్యాత్మిక ఉన్నతి వల్లనో వారు నాకు నమస్కరిస్తారు. నిజానికి చాలా తక్కువమంది నాలోనూ, మీ అందరిలోనూ అంతర్లీనంగా ఉన్న దివ్యతేజస్సు కు నమస్కరిస్తారు.
నిజమే, జగద్గురువులవద్దకు వచ్చే భక్తులందరి మానసిక పరిణతీ ఒకేలా ఉంటుందని చెప్పలేము.
అవును. కానీ సాధారణంగా వీరందరూ - వారి గౌరవం ఈ సామగ్రికైనా, స్థానానికైనా, ఆశ్రమానికైనా, శరీరానికైనా, మనస్సుకైనా, మేధస్సుకైనా, ఆ తేజస్సుకైనా - నాకు సాష్టాంగం చేస్తారు.  వీరిలో కొందరు తెలిసినవాళ్ళని వదిలేస్తే, ఎవరు ఎవరికి సాష్టాంగం చేస్తున్నరో చెప్పగలవా ?
అవును, ఈ ప్రశ్నకు జవాబు చాలా కష్టమే.
అలాగే ఉపాసనలకు కూడా. బాహ్యంగా చూస్తే ఈ సామగ్రికి నమస్కారం చేసేవాడికీ, నాలోని తేజస్సుకు నమస్కారం చేసేవాడికీ పెద్ద తేడా చెప్పలేము. అలాగే  బాహ్యంగా గుడ్డి నమ్మకంతో ప్రకాశించే సూర్యుని ఉపాసించే భక్తునికీ ఆ సూర్యుని అనంత పరబ్రహ్మానికీ చిహ్నంగా ఉపాసించేవారికీ తేడా చెప్పలేము. సంధ్యోపాసన యొక్క నిజమైన ఉపాస్యదైవము ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఇలాగే చెప్పగలం.
నేను ఇప్పుడు సామాన్యమైన సూర్యోపాసనలో ఆధ్యాత్మిక పురోగతికి విభిన్నదశలున్నాయని తెలుసుకున్నాను.
అంతేకాదు. ఇంకాలోతుగా ఆలోచిస్తే కర్మ, భక్తి, జ్ఞానమార్గాలు మూడూ నిత్యపూజలో పొందుపరుచబడ్డాయని తెలుసుకుంటావు, అది వేరే సంగతి. సంధ్యోపాసన సామాన్యమైనది అనిపించచ్చు కానీ ఆధ్యాత్మిక పురోగతి సహాయానికి సరిపోతుంది. ఇప్పుడే మెదలుపెట్టిన వారికి ఎంత ఉపయోగమో, ఉన్నతస్థాయివారికీ అంతే ఉపయోగం. కాబట్టి దాన్ని తక్కువచేయటం , అశ్రధ్ధచేయటం కన్నా మూర్ఖత్వం లేదు.
(శుభం)

శివానందలహరీ : 6-10

 
శ్రీ శివాభ్యాం నమః
శివానందలహరీ - శ్లోకం - 6

ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః  || 6 ||


కుండగానీ , మట్టిముద్దగానీ , పరమాణువుగానీ , పొగగానీ , నిప్పుగానీ , పర్వతముగానీ , వస్త్రముగానీ , దారముగానీ  ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు . అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభం కలిగించుకొనక , శంభుని యొక్క పాదపద్మములను సేవించి , శీఘ్రముగా శివసాయుజ్యమును పొందుము.
(తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అటుకాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం)

శివానందలహరీ - శ్లోకం - 7

మనస్తే పాదాబ్జే నివసతు వచస్త్సోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ |
తవధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః || 7 ||


ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ , నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ , నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ , నా యొక్క కన్నులు నీ దివ్యమంగళవిగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక . అటులైనచో ఇంకమీద నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఇచ్చగించవు . కావున అట్లు అనుగ్రహింపుమని భావము.

శివానందలహరీ - శ్లోకం - 8

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || 8 ||


ఓ పశుపతీ ! దేవదేవుడవైన నిన్ను మూఢులు హృదయమునందు తలచక, ముత్యపుచిప్పలను వెండియనియూ, గాజురాళ్ళను మణులనియూ, పిండినీళ్ళను పాలనియూ, ఎండమావులను నీళ్ళనియూ భ్రమించునట్లుగా నీకంటే ఇతరులైనట్టి వారిని, దేవులనే భ్రాంతిచేత, సేవించుచున్నారు.

శివానందలహరీ - శ్లోకం - 9

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః |
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో! || 9 ||


మనుష్యుడు తెలివితక్కువవాడై పుష్పములకొరకు లోతైన చెరువు లందు దిగుచున్నాడు, జనులు లేని భయంకరమైన అరణ్యములందునూ, విస్తీర్ణమైన పర్వతములందు తిరుగుచున్నాడు. కానీ ఓ పార్వతీపతీ! మనస్సనెడి పద్మము ఒక్కటే నీ పాదములయందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చన్న విషయాన్ని, ఈ జడులైన మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారే, ఆశ్చర్యంగాఉంది.

శివానందలహరీ - శ్లోకం - 10

నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||


మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.

శివానందలహరీ : 1-5


 
 
శ్రీ శివాభ్యాం నమః

శివానందలహరీ - శ్లోకం - 1

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 ||


కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.

శివానందలహరీ - శ్లోకం - 2

గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||


మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా  ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.
(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)


శివానందలహరీ - శ్లోకం - 3
 

త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే || 3 ||


మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను .

శివానందలహరీ - శ్లోకం - 4

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరిబ్రహ్మాదీనామపి  నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ || 4 ||


ఏదో కొంచెము ఫలమిచ్చెడు దేవతలెందరో కలరు. కలలోనైనను ఆ దేవతలను భజించుటగానీ ,ఆ దేవతలు కలుగచేయు ఫలమునుగానీ ఆశించను . మంగళస్వరూపుడవగు ఓ శంకరా! ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేరియున్న విష్ణువుకిగానీ , బ్రహ్మకుగానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని మిమ్ము పదేపదే వేడుకొనుచున్నాను .

శివానందలహరీ - శ్లోకం - 5

స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయవిభో || 5 ||


స్మృతులయందుగానీ , శాస్త్రములయందుగానీ , వైద్యమునందుగానీ , శకునములు చెప్పుటయందుగానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందుగానీ , సంగీతము పాడి రంజింపజేయుటయందుగానీ , పురాణములు చెప్పుటయందుగానీ , మంత్రశాస్త్రమందుగానీ , స్తోత్రములు చేయుటయందుగానీ , నాట్యము చేయుటయందుగానీ , హాస్యములు చెప్పి నవ్వించుటయందుగానీ  నేర్పులేనివాడను . ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును ? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు . వేదప్రసిద్ధుడవూ , సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా ! నే నెవ్వడినో నాకేతెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము .

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.