పరమాచార్యుల అమృతవాణి : గాయత్రి ఆవశ్యకత
(జగద్గురుబోధలనుండి)
'గాయంతం త్రాయతే యస్మాద్గాయత్రీ త్యభిధీయతే'
తన్ను ఎవరైతే గానం చేస్తున్నారో వారిని గాయత్రి రక్షిస్తుందట. గానం చేయడమంటే ప్రీతితోనూ, ప్రేమతోనూ, భయ భక్తులతోనూ ఉచ్చారణ చేయడమే. 'గాయత్రీ ఛందసాం మాతా' అని వేదం అంటుంది. ఛందస్సు అంటే వేదం. వేద మంత్రాలకు గాయత్రి మాతృస్థానంలో ఉంటున్నదన్న విషయం వేదమే వక్కాణిస్తున్నది. మంత్రశక్తి తగ్గిపోనట్లు దేహాన్ని శుద్దిగా వుంచుకోవడం శాస్త్రప్రకారం చేసే కార్యాలలో ముఖ్యమైనపని వేదం చెప్పుతున్నది.
మంత్రశక్తి అనే ఆగ్నిని మనం రక్షిస్తూ వచ్చినామంటే అది మనలను రక్షిస్తూ ప్రజలందరికీ క్షేమకారకమౌతుంది. ఎవరయినా కష్టకాలంలో వచ్చి ప్రార్థిస్తే వారి కష్టాన్ని నివారించే శక్తి మనకు ఉండవలెకదా. 'నీ వెంతో నేనూ అంతే. నీ కెంతశక్తి ఉన్నదో నాకూ అంతశక్తియే ఉన్నది.' అని బదులు చెప్పినామంటే ప్రయోజనమేమి? ఇప్పుడు మంత్రశక్తి అనే అగ్ని దాదాపు ఆరిపోయి ఉన్నది. నివురుగప్పిన నిప్పువలె ఏదో ఒక మూలకొంత మిగిలి ఉన్నది. దానిని మనం ప్రవృద్ధం చేయాలి. ఆ అగ్ని శిఖయేగా గాయత్రి.
ఈ గాయత్రి పరంపరగా వస్తున్నది. మూడు తరాలుగా గాయత్రి వదలిపెట్టబడితే నాల్గవతరంవాడు బ్రాహ్మణుడు కాడు. అట్టి వారున్నవీధి అగ్రహారమూకాదు. అది కుటుంబీకుల వీధి మాత్రమే. అట్లే మూడతరాలలో యజ్ఞం చేయకపోతే నాలుగో తరంవాడు దుర్ర్బాహ్మణుడు. మరల వాడు బ్రాహ్మణుడు కావాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మూడు తరాలలో గాయత్రిని వదిలితే నాలుగోతరంవాడు బ్రాహ్మణుడుకాడు. బ్రహ్మబంధువౌతాడు. అట్లే క్షత్రియుడు క్షత్రియ బంధువునూ, వైశ్యుడు వైశ్యబంధువున్నూ ఔతారు. అందుచే గాయత్రి అనే అగ్ని శిఖను ప్రవృద్ధం చేయవలసిన విధి మనకున్నది. కనీసం ఆదివారమైన సహస్రగాయత్రీజపం చేయాలి. కన్న చోటులలో కనబడినదంతా తినకుండా దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కొక్క వేళలోపూ, కనీసం పదిమార్లైన గాయత్రిని జపించాలి. మూడు సంధ్యలలోనూ లోకం శాంతంగానూ, మనస్సు ప్రశాంతంగానూ ఉంటుంది. త్రికాలాలలోనూ శాంతంగా గాయత్రీ, సావిత్రీ, సరస్వతి అనే మూడు మూర్తులను ధ్యానించాలి. ఉదయం విష్ణు ప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మ ప్రధానమైనది. సాయంత్రం శివ ప్రధానమైనది. అందుచే ఉదయం విష్ణు స్వరూపిణిగానూ, మధ్యాహ్నం బ్రహ్మ స్వరూపిణిగానూ,సాయంత్రం శివ స్వరూపిణిగానూ, గాయత్రిని ధ్యానించాలి. ఈ మూడు వెరసి సమిష్టిగా గాయత్రి, వ్యష్టి గాయత్రి కూడా కద్దు.
గాయత్రిలో సకలవేదముల మంత్రశక్తి అణగిఉన్నది. అన్ని మంత్రాలకున్నూ శక్తినిచ్చేది అది. దానిని జపిస్తేనే కాని ఇతర మంత్రజపముకు శక్తి ఉండదు. 'హిప్నాటిజమ్' వల్ల కొన్ని కొన్ని కార్యాలను సాధిస్తూ ఉన్నారు. ఆశలను అణచి జన్మసాఫల్యమిచ్చే ''హిప్నాటిజమ్'' గాయత్రీ మంత్రం. లౌకిక కార్యాలను తగ్గించుకొని, దేహన్ని శుభ్రంగా ఉంచుకొని గాయత్రీ మంత్రశక్తిని మనం వృద్ధిచేసుకోవాలి.
సంధ్యావందనంలో అర్ఘ్యమూ, గాయత్రీ ప్రధానమైనవి, తక్కినవన్ని అంగాలు. ఆశక్తితో ఉన్నపుడు ఆర్ఘ్యం వదలి పదిమార్లైన గాయత్రి జపం చేయాలి. ప్రధానమైనవి ఈ రెండేకదా! ఇవిమాత్రం చాలదా? తక్కినవెందుకు అని అనుకొంటే కాలక్రమేణ వీనికీ లోపం రావచ్చు. ఆపత్కాలంలో సైతం గాయత్రిని వదలక చేస్తుండాలి. భారత యుద్ధంలో నీరు దొరకకపోతే కాలం తప్పకుండా ధూళితో అర్ఘ్యం వదలినట్లు చెప్పబడినది. కాలత్రయాలలోనూ అర్ఘ్యం ఇవ్వాలి. జన్మలో ఒక్కమారైనా గంగాస్నానమూ, సేతు దర్శనమూ చేయాలి. అంగపుష్కలంగా సంధ్యావందనం చేస్తూఉంటే ప్రధానమైన అర్ఘ్యమూ, గాయత్రీ అయినా మిగులుతవి.
జ్వరం వచ్చినదంటే ఇంట్లో వేరెవ్వరయినా జ్వరగ్రస్తునికోసం సంధ్యావందనం చేసి తీర్ధాన్ని అతనినోటిలో పోయాలి. కాని ఈ కాలంలో మనకు అనుదిన జ్వరం వచ్చినట్లు కనిపిస్తున్నది. జ్వరనివారణకు ఔషధసేవన మెట్లు ముఖ్యమో ఆత్మర్ధంగా గాయత్రికూడా అట్లే ప్రధానమైనది. ఒక విధంగా ఔషధంకంటే గాయత్రియే ముఖ్యం. ఆయుఃపర్యంతమూ సంధ్యావందనానికిలోపం వుండరాదు. గాయత్రిని మాతృరూపంగా ఉపాసించాలి. భగవంతుడు భక్తులను వివిధ రూపాలలో వచ్చి అనుగ్రహిస్తున్నా, అందరికంటె ప్రేమ అధికంగా చూపేగుణం ఒక్క తల్లికే చెల్లింది. తల్లివద్ద బిడ్డలకు ఏ విధమైన భీతి ఉండదు. కనుక భగవంతుడు మాతృరూపంలో వచ్చి అనుగ్రహించడం మరీ విశేషం.
పురుషులకు గాయత్రి ఉన్నది. మరి స్త్రీలమాట ఏమిటి? పురుషుడు గాయత్రిని సక్రమంగా అనుష్ఠిస్తూ వచ్చినామంటే అది స్త్రీలకున్నూ క్షేమకరమవుతుంది. అంతేకాక సర్వులకున్నూ క్షేమకరమవుతుంది.
ఎన్నో విధాలైన మంత్రాలు వాడుకలోఉన్నవి. 'వానిని జపిస్తే ఇదిఫలం; అందుచేత జపిస్తున్నాను' అనికూడా చెప్పుకొంటాము. కాని గాయత్రీ మంత్రానికి ఫలం చిత్తశుద్ధి. మిగతా మంత్రాలు ఏవేవో ఫలాలనిచ్చి అటు తర్వాత చిత్తశుద్ధిని ఇస్తవి. గాయత్రికి అట్లుకాక చిత్తశుద్ధియే ఫలం.
'త్రిభ్య ఏవతు వేదేభ్యః పాదం, పాద మదూదుహమ్'
- మనుస్మృతి.
గాయత్రి మూడు వేదాలనుండి సంగ్రహించినది కనుక, మూడు వేదాల వారికిన్నీ అనుకూలించేది. అథర్వ వేదానికి మాత్రం వేరు గాయత్రి ఉన్నది. ఆ వేదమును అధ్యయనం చేయాలంటే వేరే ఉపనయనం చేసికొని వేరే గాయత్రి ఉపదేశం పొందాలి. అట్లే అథర్వవేది ఇతర వేదాలు అధ్యయనం చేయాలంటే, మరల ఉపనయనం చేసుకోవాలి.
ఈ కాలంలో కూడా ప్రాతస్సంధ్య, సాయంసంధ్య అందరూ సకాలంలో తప్పకుండా చేయవచ్చు. శీఘ్రంగా ఆఫీసుకు పోవలసినవారు గౌణకాలంలో ప్రాతస్సంధ్య చేయవచ్చు. మధ్యాహ్నికార్ఘ్యంసాయంకాలమందైనా ఈయాలి. జ్వర బాధలో ఉన్నవాడు గంజిని, మందును, పొరుగువానిని అడిగినట్లే 'నాకోసం' సంధ్యచేయ్యి అని ఎవరినైనా అడిగివాని వల్ల తీర్థం పుచ్చుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఈ నియమాలన్నీ, శారీరక శుద్ధికోసం ఏర్పడినవి. దేహం శుద్ధిగా ఉంటేనేకాని మంత్రం సిద్ధించదు. మంత్రసిద్ధి కల్గితే మనకేకాక లోకానికంతటికీ క్షేమకరంగా ఉంటుంది. కనుక మంత్రశక్తి ఆరిపోకుండా చక్కగా వృద్ధికావాలని భగవత్కృప కోసం మన మందరమూ ప్రార్ధించాలి.