Tuesday 1 March 2016

పరమాచార్యుల అమృతవాణి : సాంబమూర్తి





పరమాచార్యుల అమృతవాణి : సాంబమూర్తి
(జగద్గురుబోధలనుండి)


సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తేకదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం? అన్న ప్రశ్నకు జవాబుగా ఆచార్యులవారు దశల్లోకి అనే స్తుతిలో సాంబపరబ్రహ్మను స్తోత్రం చేశారు.

సాంబమూర్తి ఏవిధంగా ఉంటాడు? ఆయనకు శిఖ ఉన్నదా? లేక వ్యుప్తకేశుడా? 'ఆకాశ శ్చికురాయతే' శివాష్టోత్తర నామావళిలో 'వ్యోమకేశాయ నమః' అని ఒక నామమున్నది. వ్యోమ మనగా ఆకాశము చికురములుఅనగా కేశములు. ఆకాశమే ఆయన చికురములు. (జటాజూటము) ఆయన ధరించిన వస్త్ర మెలాఉన్నది. తెల్లనిదా? ఎఱ్ఱనిదా? వానిలో జరిగ ఉన్నదా? 'దశదిశా భోగో దుకూలాయతే' పదిదిక్కులే ఆయనకు వస్త్రం. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, ఆగ్నేయం వాయవ్యం నైరుతి ఈశాన్యం- ఊర్ధ్వం అథోభాగం అనే పదిదిక్కులే ఆయన ధరించిన దువ్వలువ. 'శీతాంశుః ప్రసవాయతే'- చల్లని కిరణములుగల చంద్రుడే ఆయన శిఖలోని పూవు. శీతాంశుడు ఆయనకు ప్రసవం.

ఆయన కేశపాశమో వినీలాకాశము. వస్త్రమో దశదిశలు. ఆభరణమో చంద్రుడు. ఆయన స్వరూప మెట్టిది? ''స్థిరతరానందః స్వరూపాయతే''- స్థిరమైన ఆనందమే ఆయన స్వరూపం.

ఉదయాస్తమానమూ మనము 'నేను, నేను' అని చెప్పుకొని తిరుగుతున్నాముకదా? ఈనేను ఎవరు? దేహమా? మనస్సా? ప్రాణమా? జీవుడా? ''ఆనందో బ్రహ్మ''ఆనంద స్వరూపమే సాంబపరమేశ్వరుడు. మనకంతా ఆనందం వస్తూపోతూ వుండే విషయం. ఆయన ఆనందం అట్టిదికాదు. అది స్థిరం. మన ఆనందంవలె ఒక రోజువుండి మరొకరోజు పోయే ఆనందంకాదు!

ఆశ్వీజము కార్తీకము- ఈ నెలలలో సూర్యుడు మందంగా ప్రకాశిస్తూ వుంటాడు. ఎండకాస్తూ ఉన్నప్పుడే మేఘంవచ్చి సూర్యుణ్ణి కప్పేస్తుంది. కార్తీకమాసంలోని సూర్యునివలె మన ఆనందం ఉంటున్నది. అట్లా కాక, ఈశ్వరస్వరూపం హృదయాలలో స్థిరంగా ఉండాలంటే, మనం ఆనందం వచ్చీ పోయే ఆనందంగా ఉండరాదు. ఆశకు లొంగిపోయే ఆనందం కాక, ఆశాతీతమైన ఆనందంగా ఉండాలి. కాసింతజలం ఉద్ధరిణలో తీసుకొని, గంగ అని ఎట్లా భావన చేస్తామో అట్లే మన హృదయాలలో అప్పుడప్పుడూ స్ఫురించే ఆనందాన్ని గుర్తించి ఈశ్వరుని ఆనందం ఎట్లా ఉండగలదో మనం భావన చేయాలి. అచల ప్రతిష్ఠంగా ఏ ఆనందము ఉన్నదో అదే సాంబపరమేశ్వరుని స్వరూపం స్థిరతరానందఃస్వరూపాయతే'.

ఇన్ని చెప్పుకొన్నాము. మరి వారి చిరునామా ఏమి?

'వేదాంతో నిలయాయతే' వేదశీరములుఉపనిషత్తులు. అట్టి ఉపనిషత్తులే వేదాంతమే- ఆయనకు వాసస్థానం.

ఎక్కడో వేదాంతంలోనూ, నాదాంతంగానూ గోచరించే ఆసామి మనకెట్లా కనబడుతాడు? ఏమైనా గిరాకీచేసే ఆసామిమా అతడు? అని అంటే- అయ్యా! అతడేమీ అంతటి దుర్దర్శుడు కాదు- 'సువినయోయస్యస్వభావాయతే'- ఆయనది చాల వినయమైన స్వభావం- అందఱికీ కనిపించేటట్లు, శీతలవట వృక్షచ్ఛాయలో స్ఫురిత ముగ్ధముఖారవిందంతో దక్షిణామూర్తియై శాంతంగా ఆనందంగా కూర్చుని దర్శనమిస్తున్నాడు. చిదంబరంలో- చిత్సభలో ఆనందతాండవ మూర్తిగ- (లీలాతాండవపండితః) ఆనందతాండవం చేస్తూంటాడు. అతనిని చూడటం చాల సులభమైన పని. అని ఆచార్యులవారు అంటున్నారు.

ఆయనకు కొంచెం స్తోత్రంచేస్తే చాలు. ఒక్క నమస్కారం పెట్టితే సంతోష పరవశుడై అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు. అందులకే వేదములో రుద్రనమకములో- నమో నమో- అన్న పదప్రయోగం విస్తారంగా ఉన్నది. 'ఆశుతోష ఉమాపతిః' ఈయన సంతోషించడానికి మనం చాలాకాలం చేతులుకట్టుకొని నిలుచోవలసిన పనిలేదు. ఈయన ఆనందోన్మత్తుడు; ఆశుతోషుడు, వినయమూర్తి. 'సువినయో యస్య స్వభావాయతే'-

'పరం బ్రహ్మ, పరం బ్రహ్మ' అని అంటామే- ఆ పరం బ్రహ్మ ఎవరు? అంబతో కూడిన సాంబపరమేశ్వరుడే- పరంబ్రహ్మ, సృష్టి స్థితి లయములకు కారణంగా ఉంటూ వున్న ఈశ్వరతత్త్వం సాంబుడే! ఆ సాంబమూర్తిని ధ్యానిస్తే హృదయం రసప్లావితమై, స్థిరతరానందంతో ఊగిసలాడుతుంది. ఆచార్యులవారు దశశ్లోకిలో -

తస్మిన్‌ మే హృదయం సుఖేన రమతాం సాంబే పర బ్రహ్మణి.

సాంబమూర్తిని గూర్చి తమ ఆనందాన్ని వివరించారు. మనంగూడ నిరంతరం ఆ సాంబమూర్తియందే హృదయాలను లగ్నంచేసి సుఖంగా వర్థిల్లుదాం.

ఆకాశ శ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే -
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే |
వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్‌ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి|| 


 దశశ్లోకీ స్తోత్రం, తాత్పర్యంతో సహా - http://jagadguru-vaibhavam.blogspot.com/2016/02/blog-post_29.html

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.