Sunday 6 March 2016

శంకరస్తోత్రాలు : శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్



॥ श्री शंकराचार्य कृतं शिवपञ्चाक्षरनक्षत्रमालास्तोत्रम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రమ్ ॥


శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ
ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ ।
నామశేషితానమద్భవాన్ధవే నమః శివాయ
పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ 1॥

శ్రీమంతమైన ఆత్మకలవాడు , సద్గుణసముద్రుడు , తనకాంతి లేశముచే సూర్యుని అవహేళన చేయువాడు , భక్తుల సంసార దుఃఖములను పోగొట్టువాడు , జ్ఞానులకు బంధువైనవాడు  అగు శివునికి నమస్కారము.

కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ ।
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ 2॥

యముని చూచి భయపడు మార్కండేయుని రక్షించినవాడవు , దుష్టుడైన దక్షప్రజాపతి నుదుటిని శూలముచే భేదించినవాడవు , అన్నిటికీ  మూలకారణమైనవాడవు , మృత్యువుకే మృత్యువైనవాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ
దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ ।
సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ
అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ॥ 3॥

భక్తులకు ఇష్టమైనవాటిని ముఖ్యముగా ప్రసాదించువాడు , దుష్టరాక్షస వంశములనే వెదురు బొంగులను తగులబెట్టు అగ్నిహోత్రుడు , సృష్టికి కారణమైనవాడు , ధర్మమునకు ఆనకట్ట వంటివాడు , భూమి - వాయువు - అగ్ని - జలము - ఆకాశము - సూర్యుడు- చంద్రుడు - జీవుడు అను ఎనిమిది రూపములున్నవాడు , జెండాపై వృషభ చిహ్నము ధరించినవాడు అగు శివునకు నమస్కారము.

ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ
పాపహారిదివ్యసిన్ధుమస్త తే నమః శివాయ ।
పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ ॥ 4॥

ఆపదలనే కొండలను పగులగొట్టు టంకాయుధమును చేతిలో పట్టుకొన్నవాడవు , పాపమును పోగొట్టు గంగానదిని తలపై మోయుచున్నవాడవు , పాపమును నశింపచేయువాడవు , అందరిచే నమస్కరింపబడువాడవు , శాపదోషములను ఖండించుటలో శ్రేష్ఠుడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ
హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ ।
నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ
కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ॥ 5 ॥

ఆకాశమే కేశములుగా కలవాడవు , దివ్యమంగళ స్వరూపుడవు , మేరుపర్వతమును( త్రిపురాసురసంహారమునందు) విల్లుగా చేసుకొన్నవాడవు , నీ నామమును పలికినంత మాత్రమునే పాపములన్నిటినీ దహించి వేయువాడవు , కోరికలతో నిన్ను కొలుచు వారికి దొరకనివాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ
జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ ।
బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ
జింహకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ॥ 6 ॥

బ్రహ్మకపాలములను మాలగా ధరించినవాడవు , పాములను కుండలములుగా అలంకరించుకొన్నవాడవు , బ్రహ్మదేవునకు వేదములను బోధించినవాడవు , యముని శరీరమును కాలితో తన్నిన వాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ
సామగానజాయమానశర్మణే నమః శివాయ ।
హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ
సామజాసురాఙ్గలబ్ధచర్మణే నమః శివాయ ॥ 7 ॥

మన్మథుని  సంహరించినవాడు , పుణ్యకర్ముడు , సామవేదగానము విని ఆనందించువాడు , బంగారు కాంతితో తళతళలాడుచున్న కవచమును ధరించినవాడు , ఏనుగు చర్మమును కట్టుకున్నవాడు అగు శివునకు నమస్కారము.

జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ
చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ ।
మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ
సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ ॥ 8 ॥

జన్మ - మరణము మొదలగు ఘోరదుఃఖములను పోగొట్టువాడు , చిన్మయస్వరూపుడు , నాకోరికలను తీర్చువాడు , సజ్జనుల మనస్సులందుండువాడు , మన్మథుని శత్రువు అగు శివునకు నమస్కారము.

యక్షరాజబన్ధవే దయాలవే నమః శివాయ
దక్షపాణిశోభికాఞ్చనాలవే నమః శివాయ ।
పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ
అక్షిఫాల వేదపూతతాలవే నమః శివాయ ॥ 9 ॥

కుబేరుని బంధువు , దయామయుడు , కుడిచేతిలో బంగారు కుండికను ధరించినవాడు , విష్ణుమూర్తి హృదయములో నివసించువాడు , నుదుటియందు మూడవకన్ను కలవాడు , వేదపఠనముచే పవిత్రమైన దవడలు కలవాడు అగు శివునికి నమస్కారము.

దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ ।
దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ
ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ ॥ 10 ॥

కుడిచేతిలో అగ్ని కలవాడు , నిత్యమైన ఆత్మస్వరూపుడు , ఇంద్రునిచే నమస్కరింపబడువాడు , ధర్మదీక్ష కలవారిపై తన తేజస్సును ప్రసరింపచేయువాడు , వృషభవాహనుడు , మంచివారికి గతియైనవాడు అగు శివునకు నమస్కారము.

రాజతాచలేన్ద్రసానువాసినే నమః శివాయ
రాజమాననిత్యమన్దహాసినే నమః శివాయ ।
రాజకోరకావతంసభాసినే నమః శివాయ
రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ ॥ 11 ॥

వెండికొండపై నివసించువాడు , ఎల్లప్పుడు చిరునవ్వుతో విరాజిల్లువాడు , తలపై చంద్రుని ధరించినవాడు , కుబేరుని మిత్రుడు అగు శివునకు నమస్కారము.

దీనమానవాళికామధేనవే నమః శివాయ
సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ ।
స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ
దానవాన్ధకారచణ్డభానవే నమః శివాయ ॥ 12 ॥

దీనులైన మానవుల పాలిట కామధేనువు , పుష్పబాణుడైన మన్మథుని దహించినవాడు , తనపై అనురాగము కల భక్తుల పాలిట బంగారుకొండ అయినవాడు , రాక్షసులచే చీకటిని నాశనం చేయు సూర్యుడు అగు శివునకు నమస్కారము.

సర్వమఙ్గలాకుచాగ్రశాయినే నమః శివాయ
సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ ।
పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ
సర్వమన్మనోజభఙ్గదాయినే నమః శివాయ ॥ 13 ॥

పార్వతీదేవి వక్షఃస్థలముపై నిద్రించువాడు , దేవతలనందరినీ మించినవాడు , రాక్షసులను నశింపచేయువాడు , అందరినీ వశపరచుకొను మన్మథుని సంహరించినవాడు అగు శివునకు నమస్కారము.

స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ
మాకరన్దసారవర్షిభాషిణే నమః శివాయ ।
ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ
నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ ॥ 14 ॥

కొంచము భక్తికలవారినైననూ పోషించువాడు , తేనెలొలుకు మధురమైన మాటలు కలవాడు , ఒక్క మారేడు దళముతో పూజించిననూ సంతోషించువాడు , అనేక జన్మల పాపములను పోగొట్టువాడు అగు శివునకు నమస్కారము.

సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ
పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ ।
దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ
శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ ॥ 15 ॥

సర్వజీవులను రక్షించుటే స్వభావముగా కలవాడు , పార్వతీ ప్రియుడు , భక్తులను పాలించువాడు , గర్వించిన రాక్షససైన్యములను సంహరించువాడు , చంద్రుని ధరించినవాడు , కపాలమును పట్టుకొన్నవాడు అగు శివునికి నమస్కారము.

పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ
దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ ।
మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ
స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ ॥ 16 ॥

ఓ పార్వతీ ప్రియుడా! శివా! నీకు నమస్కారము . నన్ను కాపాడుము . వెండికొండపై నివశించువాడా! శివా! నాకు వరమివ్వుము . ఋషుల స్త్రీలను మోహింపచేసినవాడా! భక్తులకు ప్రసన్నుడవై కోరికలు తీర్చు నీకు నమస్కారము.

మఙ్గలప్రదాయ గోతురఙ్గ తే నమః శివాయ
గఙ్గయా తరఙ్గితోత్తమాఙ్గ తే నమః శివాయ ।
సఙ్గరప్రవృత్తవైరిభఙ్గ తే నమః శివాయ
అఙ్గజారయే కరేకురఙ్గ తే నమః శివాయ ॥ 17 ॥

వృషభవాహనుడవు , తలపై గంగను మోయుచున్నవాడవు , యుద్ధము నందు శత్రువులను సంహరించినవాడవు , మన్మథుని శత్రువు అగు ఓ శివా! మంగళకరుడవైన నీకు నమస్కారము.

ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ
ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ ।
దేహకాన్తిధూతరౌప్యధాతవే నమః శివాయ
గేహదుఃఖపుఞ్జధూమకేతవే నమః శివాయ ॥ 18 ॥

కోరిన కోర్కెలు తీర్చువాడు , యాగములను చేయువారిని రక్షించువాడు , వృషభధ్వజుడు , వెండికొండకంటే ఎక్కువగా ప్రకాశించు శరీరము కలవాడు , ఇంటికి సంబంధించిన దుఃఖములను తగులబెట్టువాడు అగు శివునకు నమస్కారము.

త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ
దక్షసప్తతన్తునాశదక్ష తే నమః శివాయ ।
ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ
రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ ॥ 19 ॥

మూడు కన్నులు కలవాడవు , దీనులను దయతో చూచువాడవు , దక్షుని యాగమును నాశనం చేసిన వాడవు , చంద్రుడు - సూర్యుడు - అగ్ని కన్నులుగా కలవాడవు , శరణు పొందినంతనే రక్షించువాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

న్యఙ్కుపాణయే శివఙ్కరాయ తే నమః శివాయ
సఙ్కటాబ్ధితీర్ణకిఙ్కరాయ తే నమః శివాయ ।
కఙ్కభీషితాభయఙ్కరాయ తే నమః శివాయ
పఙ్కజాననాయ శఙ్కరాయ తే నమః శివాయ ॥ 20 ॥

జింకను చేతిలో ధరించినవాడు , శుభమును కల్గించువాడు , దుఃఖసముద్రము నుండి భక్తులను కడతేర్చువాడు , అజ్ఞాన పీడితులను రక్షించువాడు , పద్మము వంటి ముఖము కలవాడు , మంగళమయుడు అగు శివునకు నమస్కారము.

కర్మపాశనాశ నీలకణ్ఠ తే నమః శివాయ
శర్మదాయ నర్యభస్మకణ్ఠ తే నమః శివాయ ।
నిర్మమర్షిసేవితోపకణ్ఠ తే నమః శివాయ
కుర్మహే నతీర్నమద్వికుణ్ఠ తే నమః శివాయ ॥ 21॥

కర్మబంధములను తెంచువాడవు , నల్లని కంఠము కలవాడవు , సుఖప్రదుడవు , భస్మపూసుకున్నవాడవు , మమకారము విడిచిన మహర్షుల సేవలందుకొనువాడవు , విష్ణుమూర్తిచే నమస్కరింపబడువాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ
శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ ।
ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ
కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ ॥ 22॥

లోకములకు అధిపతి , విష్ణుమూర్తిచే నమస్కరింపబడువాడు , సదాచారముకలవారి హృదయములందు సంచరించువాడు , ఇంద్రుని కోరికలు తీర్చి సంతోషపెట్టువాడు , కష్టములు నాశనంచేయువాడు , లోకములను జయించినవాడు అగు శివునకు నమస్కారము.

అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ
సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ ।
స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ
విప్రడిమ్భదర్శితార్ద్రభావ తే నమః శివాయ ॥ 23॥

తెలుసుకోలేని దివ్యప్రభావము కలవాడవు , భక్తులను రక్షించు స్వభావము కలవాడవు , స్వయంప్రకాశుడవు , అనంతమైన మహిమలు కలవాడవు , ఉపమన్యు అను బాలునిపై దయ చూపించినవాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము.

సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ
భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ ।
పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ
తవకాఙ్ఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ ॥ 24॥

ఓ శివా! సేవకుడైన నన్ను అనుగ్రహింపుము . నీకు నమస్కారము . భక్తి ద్వారా నీ అనుగ్రహం లభించును. అగ్నియే మూడవ కన్నుగా కలవాడవు , దేవతలచే పూజింపబడువాడవు , నీపాదభక్తులకు ఆనందమును ఇచ్చు వాడవు అగు నీకు నమస్కారము.

భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ
శక్తికల్పితప్రపఞ్చభాగినే నమః శివాయ ।
భక్తసఙ్కటాపహారయోగినే నమః శివాయ
యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ ॥ 25॥

భుక్తి - ముక్తి - దివ్యసుఖములు ఇచ్చువాడు , తన శక్తిచే సృష్టించిన ప్రపంచమునకు ఆధారమైనవాడు , భక్తుల కష్టములను తొలగించువాడు , యోగుల పరిశుద్ధ హృదయములందు నివశించువాడు అగు శివునకు నమస్కారము.

అన్తకాన్తకాయ పాపహారిణే నమః శివాయ
శాన్తమాయదన్తిచర్మధారిణే నమః శివాయ ।
సన్తతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ
జన్తుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ ॥ 26॥

యముని కూడా అంతమొందించువాడు , పాపమును తొలగించువాడు , మాయలు శాంతించిన గజాసురుని చర్మమును ధరించినవాడు , ఆశ్రితుల దుఃఖమును ఎల్లప్పుడు పోగొట్టువాడు , ప్రాణులకు నిత్యసుఖమునిచ్చువాడు అగు శివునకు నమస్కారము.

శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరిఞ్చితుణ్డమాలినే నమః శివాయ ।
లీలినే విశేషరుణ్డమాలినే నమః శివాయ
శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ ॥ 27॥

శూలమును - కపాలమును - బ్రహ్మకపాలమాలను - వీరభక్తుల తలలమాలను ధరించినవాడు , రక్షకుడు , లీలలు చేయువాడు , మంచిస్వభావము కలవాడు , పుణ్యముతో విరాజిల్లుచున్నవాడు అగు శివునకు నమస్కారము.

శివపఞ్చాక్షరముద్రాం చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ ।
నక్షత్రమాలికామిహ దధదుపకణ్ఠం నరో భవేత్సోమః ॥ 28॥

ఈ శివపంచాక్షరనక్షత్రమాలాస్తోత్రమందలి శ్లోకములన్నిటిలో నాలుగు పాదములయందు చివరన శివపంచాక్షరమంత్రము ఏర్పరచబడినది . దీనిని కంఠమునందు ధరించినవాడు శివసారూప్యమును పొందును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.