పరమాచార్యుల అమృతవాణి : అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ
(జగద్గురుబోధలనుండి)
అంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.
యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,
తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,
ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.
అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టంవస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు. ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.
అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.
సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.
అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూశివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.
మహేశ్వరేవా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని,
నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే.
'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటేఅన్న తీర్మానమె నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.
దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభమైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.
అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం
ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,
ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ కాలమాత్మ
ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.
''శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.
దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు.
ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు.
No comments:
Post a Comment