Showing posts with label అమ్మ. Show all posts
Showing posts with label అమ్మ. Show all posts

Saturday, 16 December 2017

గోదా అమ్మవారి ప్రార్థన



గోదా అమ్మవారి ప్రార్థన

నీలాతుంగస్తనగిరితటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః


నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరులపై నిద్రించు కృష్ణుని, ఉపనిషత్తుల సారమైన పరతంత్రత పాఠం చెప్పుటకు నిద్రలేపినట్టిదీ, తాను ధరించి వదలిన పూలచెండులతో కృష్ణుని బలవంతముగ బంధించి సంతోషించునట్టిదీ అగు ఆ గోదాదేవి కి మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.

అన్నవయల్ పుదువై ఆణ్డాళరఙ్గఱ్క
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
పాడి క్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడికొడుత్తాళై చ్చొల్.


హంసలు తిరుగుతున్న పంటపొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళు శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అను పేరు గల ఈ పాశురములను మధురమగు గానముతో పాడి సమర్పించినది. ఇది వాఙ్గ్మాలిక. అట్లే పూమాలికను తాను ధరించి అర్పించినది. ఓ మనసా! ఆ ఆండాళును స్మరించుము.

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై
పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ
వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాతమ్
నాంగడవా వణ్ణమే నల్‍గు.


పూమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారుతీగా! పూర్వము జరిగిన ఆ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ములనుద్ధరింపజాలిన ఓ దివ్య కంకణధారిణీ! "వేంకటాచలపతికి నన్ను ప్రియురాలుగా సమకూర్చుము" అని నీవు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడ అతిక్రమింపజాలనట్లు అనుగ్రహించుము.

(తమిళ అనువాదము శ్రీ భాష్యం అప్పలాచార్యుల గ్రంథంనుండి)

Sunday, 17 September 2017

శివుడు మిమ్ము రక్షించుగాక



కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం
మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్
పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలం
క్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః


రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా, ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా, కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున చొరగా, వాసుకి కోపముతో చూచుచుండగా,  శివుడు (కోపముతో) కాలితో అదుముటచేత రావణుడు పాతాళమునకు పోవుచుండగా, (రావణునిపై) కోపించినవాడయ్యునూ పార్వతిచేత భయమువలన గట్టిగా ఆలింగనము చేసికోబడ్డవాడై ఆనందించిన శివుడు మిమ్ము రక్షించుగాక.

గౌరి మీకు మంగళముకలిగించుగాక.



ధూమవ్యాకులదృష్టి రిన్దుకిరణైరాహ్లాదితాక్షీ పునః
పశ్యన్తీ వరముత్సుకా నతముఖీ భూయోప్రియా బ్రహ్మణః
సేర్ష్యా పాదనఖేన్దుదర్పణగతే గఙ్గాం దధానే శివే
స్పర్శాదుత్పులకా కరగ్రహవిధౌ గౌరీ శివా యాస్తు వః


పార్వతీ పరమేశ్వరుల వివాహమందు వివాహాగ్నియొక్క పొగ వలన అమ్మవారి కళ్ళు వ్యాకులత చెందగా శివుని శిరసునందున్న బాలచంద్రుడు తన కిరణములతో అమ్మవారి కళ్ళకు ఆహ్లాదము కలిగించెనట. అమ్మవారు మరల శివుని చూచుటకు ప్రయత్నింపగా ఆ ప్రయత్నమును బ్రహ్మ గమనించెనని ఎరిగి సిగ్గుమొగ్గయై తలవంచుకొని కూర్చొనెనట. చంద్రునివలె ప్రకాశించునదీ అద్దమువలెనున్నదీ అగు తన కాలిగోటియందు ప్రతిఫలించిన శివుని చూచుతూ, గంగనూ చూచి కించిత్తు ఈర్ష్యనందెనట. ఇంతలో పాణీగ్రహణమునందలి శివుని స్పర్శచేత పులకింతనొందెనట. అట్టి గౌరీదేవి మీకు మంగళము కలిగించుగాక.

Saturday, 2 September 2017

శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్



|| శంకరస్తోత్రాలు : భ్రమరామ్బాష్టకమ్ ||

చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాచన్ద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరఞ్జితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 1||


చంచలములు - ఎర్రనివి - దయతో నిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగా ధరించినది, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచమునంతటినీ సంరక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగపువ్వు వంటి ముక్కు చివరన ముత్యమును అలంకరించుకున్నది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కస్తూరీతిలకాఞ్చితేన్దువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రావమిక్షచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాఙ్గతరఙ్గితైరధికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2||


కస్తూరీ తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము - సున్నము - వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షములద్వార వర్షించు కృపారసములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్ |
రాజీవాయతమన్దమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 3||


మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులుకలది, బ్రహ్మ మొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామరరేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడా శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాఞ్చితపాదుకాఞ్చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 4||


నక్షత్రములవలే ప్రకాశించు ఆరు అక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్య అయినది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చక్రములలోనుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించునది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితాత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గన్ధర్వకన్యాదృతామ్ |
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 5||


విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రమునందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యమునిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమన్తభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 6||


అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీలతలలపైనున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని సంహరించినది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమేధినీం సుమవతాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనపుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 7||


ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునులు చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్ములకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారియందు ప్రసన్నమైన హృదయము కలది, ఒడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలమునందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 8||


కర్పూరము - అగరు - కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్నివిధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలమునందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలంకృతామ్ |
గఙ్గాగౌత్మగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 9||


స్తుతించువారిని రక్షించునది, జెండాపై గరుడ చిహ్నము కలది, ఆకాశమునందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము - అక్షతలతో అలంకరింపబడినది, గంగ - గౌతమమహర్షి - గర్గుడు మొదలైన వారిచే స్తుతింపబడు పాదములు కలది, గోవు - గౌతమి - గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ భ్రమరామ్బాష్టకం సమ్పూర్ణమ్ ||

http://jagadguru-vaibhavam.blogspot.in/2017/09/blog-post_59.html
 

Friday, 1 September 2017

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శ్రీ మహాగణాధిపతయే నమః



పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 7వ శ్లోకం : అమ్మవారి రూప వర్ణన

శంకరులు అమ్మవారి రూపము వర్ణించుచున్నారు.

క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥


తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.

ఈ భూమిలో అమ్మవారిని దక్షిణాన కన్యాకుమారినుండి, ఉత్తరాన కాశ్మీరంలో క్షీరభవానీ వరకూ వివిధరూపాలలో ఆరాధిస్తారు. కానీ శ్రీవిద్యాతంత్రంలో చెప్పబడిన లలితా త్రిపురసుందరి లక్షణములు, ఆయుధములు ఒక్క కాంచీపుర కామాక్షికి మాత్రమే ఉన్నాయి. భూమి అంతటినీ ఒక దేవత అనుకుంటే, ఆ భూదేవియొక్క నాభిస్థానము కాంచీపురము.

క్వణత్-కాంచీదామా - సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ.  అమ్మవారు నడుస్తూంటే కాలి అందెలేకాక వడ్డాణపు చిరుమువ్వలూ సవ్వడిచేస్తాయి. పరిక్షీణామధ్యే - అమ్మవారి నడుము చాలా సన్ననిది. పరిణతశరత్చన్ద్రవదనా - శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ.  శరత్కాలవాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. అమ్మవారి ముఖము, శరత్తులోని పున్నమిచంద్రుని వంటి కాంతి విరజిమ్ముతూ ఉంటుందని శంకరులు సూచిస్తున్నారు. అమ్మవారి వదనం అనుగ్రహం అనే వెన్నెల కురిపిస్తుంది.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - అమ్మవ్రారు తన చేతులలో విల్లు, అంబులు, పాశం, అంకుశములు ధరిస్తుంది. ఇవి శ్రీవిద్యాధిదేవత యొక్క ముఖ్య లక్షణాలు. ఈ దేవతను లలితా మహా త్రిపురసుందరి అని, కామేశ్వరి అను పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి పై రెండు చేతులలో పాశము, అంకుశము, క్రింది రెండు చేతులలో విల్లు, అమ్ములు ఉంటాయి. విల్లమ్ములు మన్మథుని వలెనే చెరకువిల్లు, పుష్పబాణములు.

రాగము, ద్వేషము - వీటిగురించి లోతుగా ఆలోచిస్తే ప్రాపంచిక జీవనం అంతా కామక్రోధములనబడే ఈ రాగ ద్వేషములతో నిండి ఉందని తెలుసుకుంటాము. ఈ రెండూ అమ్మవారి మాయాలీలలో భాగాలు. ఆవిడ అనుగ్రహలీలలో అవి మాయమయిపోతాయి. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం వీటిని అదుపులో ఉంచగలం. రాగస్వరూపపాశాఢ్యా - కోరిక అను పాశము కలది. క్రోధాకారాంకుశోజ్జ్వలా - కోపము అను అంకుశముతో మెరియునది. ఈ రెండు పేర్లూ లలితా సహస్రంలో ఉన్నాయి.  అమ్మవారి పాశం కామము/కోరికకు సంకేతం. పాశములాగా కామము మనను కట్టేస్తుంది. అలాగే అంకుశం క్రోధమునకు సంకేతం. కోపము మనను చీల్చి రెచ్చగొడుతుంది. పాశాంకుశములు ఒక ఏనుగుని అదుపులో ఉంచినట్టు, కామక్రోధములను అదుపులో ఉంచుతాయి, అంటే ఈ కామక్రోధముల జన్మస్థానమైన మనస్సును అదుపులో ఉంచుతుంది.

మరోలా చెప్పాలంటే  అమ్మవారు మనపై వాత్సల్యంచూపి, ఆమె చేతిలో ఉన్న పాశంలో మనలను కట్టివేసి, మనను కట్టివేస్తున్న ఇతర పాశాలకు దూరంచేస్తుంది. మనకు బంధములు లేని బంధము ఇస్తుంది. అలాగే ఆమె తన కోపమును మన క్రోధముపై చూపి, తన అంకుశముతో మన క్రోధమును చీల్చి, అణచివేసి ప్రశాంతతనిస్తుంది.

మనం కోరికను అమ్మవారితో అనుబంధంగానూ, కోపమును మన కోపముపై కోపముగానూ మార్చుకుంటే అమ్మవారి పాశాంకుశాలు మనను బంధవిముక్తులను చేస్తాయి.

లలితా సహస్రంలో పాశాంకుశాల తరువాతి రెండు నామములు  అమ్మవారి చేతుల్లోని విల్లమ్ములపై ఉన్నాయి. మనోరూపేక్షుకోదండా - మనస్సురూపమైన చెరకువిల్లు ధరించునది, పంచతన్మాత్రసాయకా - అయిదు తన్మాత్రలకు సంకేతమైన బాణములు కలిగినదీ.

మన్మథుడిచేతిలో విల్లమ్ములు ఏంచేస్తాయో తెలిసినదే. అమ్మవారి చేతుల్లో అవి ఏంచేస్తాయి ? విల్లు మన మనస్సులను మోక్షమునందు కోరిక కలిగినవాటిలా చేస్తుంది. అయిదు బాణములూ కూడా అంతే. అవి మన ఇంద్రియాల శక్తులను అమ్మవారివైపు తిప్పి శుచిగా చేస్తాయి.  ఇవి మనలో అమ్మవారిని స్తుతించే పాటలను వినాలనీ, ఆమె పాదపద్మములను తాకాలనీ, ఆమె స్వరూపాన్ని చూడాలనీ, అమ్మవారి పాదప్రక్షాళన చేసిన జలం అనే అమృతపు రుచి చూడాలని, అమ్మవారి నిర్మాల్యపుష్పములను సేకరించి వాటి దివ్యసుగంధపరిమళములను ఆఘ్రూణించవలెననీ, ఇలాంటి కోరికలు కలిగేలా చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారి పుష్పబాణములు మన ఇంద్రియలౌల్యాలను నిర్మూలిస్తాయి. ఆమె చెరకువిల్లు మన మనస్సును లయంచేస్తుంది. అది జరిగినప్పుడు మనకు జ్ఞానము, మోక్షము లభిస్తాయి. మనకి ఇంకేంకావాలి ?

ఇలా పవిత్రమయిన అయిదు ఇంద్రియాలూ, మనస్సూ కలిపి ఆరు కరణములు. తుమ్మెద తన ఆరు చరణములతో పద్మముపై వ్రాలినట్లు మనము ఈ ఆరు కరణములనూ అమ్మవారి పాదపద్మములపై లయంచేయాలి.

అమ్మవారు జ్ఞాన సామ్రాజ్యపు మహారాజ్ఞి. తాను మోక్షప్రదాయిని అని సూచించడానికి ఆమె కామక్రోధాలు నాశనంచేసి జ్ఞానం కలిగించు ఆయుధాలైన పాశాంకుశాలు రెండు చేతులతో ధరించింది. తాను మనస్సును, ఇంద్రియాలను తొలగించివేస్తుందని సూచించుటకు ఆమె విల్లమ్ములు ధరించింది.

శంకరులు ఈ శ్లోకంలో మొదట అమ్మవారి రూపం - నాల్గుచేతులు, వడ్డాణము ధరించిన సన్నని నడుము, శరత్కాలపౌర్ణమినాటి జాబిల్లినిపోలిన మోము - వర్ణించారు. ఈ భౌతికరూపవర్ణన తరువాత శంకరులు అమ్మ తత్త్వపు సారాంశాన్ని చెప్పుతున్నారు - పురమథితురాహోపురుషికా -  త్రిపురాసురసంహారి యెక్క అహంకార స్వరూపము అనే అర్థం వస్తుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే, శివుని యొక్క ’నేను’ అనే భావస్వరూపమే అమ్మవారు అని అర్థమవుతుంది. పరబ్రహ్మము యొక్క చిచ్ఛక్తి యే అమ్మవారు. జ్ఞానాంబ.

ఈ శ్లోకములో శంకరులు ఎంతో అందంగా వర్ణించిన అమ్మవారిని మన అంతర్నేత్రముతో చూడడము మన పని.

శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్




|| శంకరస్తోత్రాలు : మాయాపఞ్చకమ్ ||

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 1||


పోలిక లేనివాడను, నిత్యుడను, అంశలేనివాడను, అఖండమైనవాడను, జ్ఞానస్వరూపుడను, భేదములన్నీ లేనివాడను అగు నాయందు జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదమును ఏర్పరచు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

శ్రుతిశతనిగమాన్తశోధకానప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నానఘటితఘటనాపటీయసీ మాయా || 2||


వందలాది వేదవచనములతోనూ మరియు వేదాంతోపదేశములతోనూ పరిశుద్ధమైన వారిని కూడా అహహ! ధనాదులను చూపించి, వెంటనే కలుషితమొనర్చి, పశువులుగా మార్చు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాన్తం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 3||

సచ్చిదానందము, అఖండము మరియు అద్వితీయమగు ఆత్మను ఆకాశము, అగ్ని మొదలైన పంచభూతములచే నిర్మించబడిన సంసారసాగరంలో పడవేసి పూర్తిగా భ్రమింపచేయుచున్న మాయ అఘటితఘటనా సమర్థమైనది.

అపగతగుణవర్ణజాతిభేదే సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం త్వఘటితఘటనాపటీయసీ మాయా || 4||


గుణముల, వర్ణముల మరియు జాతుల భేదము లేని సుఖ చైతన్యస్వరూపమైన ఆత్మలో బ్రాహ్మణుడు మొదలైన అహంకారమును, పుత్రులు - భార్య - ఇల్లు మొదలైన మోహమును పెంపొందించు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

విధిహరిహరవిభేదమప్యఖణ్డే బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావానఘటితఘటనాపటీయసీ మాయా || 5||


అఖండమైన పరమాత్మలో బ్రహ్మ - విష్ణు - మహేశ్వర భేదములను కల్పించి పండితులను కూడా హరి - హర విభేదము కలవారిగా చేసి భ్రమింపచేయు మాయ అఘటితఘటనా సమర్థమైనది.

|| ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మాయాపఞ్చకమ్ సమ్పూర్ణమ్ ||

Thursday, 31 August 2017

శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్



|| శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్ ||

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చిన్తామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే || 1 ||


శ్రీవిద్యాస్వరూపిణివి, శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడుదానవు, శ్రీనాథుడు మొదలగు గురువుల(విష్ణు-బ్రహ్మ-మహేశ్వరులు)స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండుదానవు, లక్ష్మీ-సరస్వతీ-పార్వతులచే నమస్కరించబడు పాదపద్మములు కలదానవు, శివుని భార్యవు, మంగళస్వరూపిణివి, మధ్యాహ్నసమయమునందు మలయధ్వజ మహారాజుకు కుమార్తెగా అవతరించినదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌలివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే || 2 ||


శ్రీచక్రమునందుండు దానవు, స్థిరమైనదానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడుదానవు, దీనులకు వరములిచ్చెడిదానవు, భక్తులకు అభయమొసంగుదానవు, స్తనభారము కలదానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచే తెలియబడుదానవు, మెరుపు వంటి శరీరము కలదానవు, తల్లివి, అమృతముతో ఆర్ర్దమైన హృదయము కలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

కోటీరాఙ్గదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బహారాఞ్చితే |
శిఞ్జన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనామ్బికే || 3||


కిరీటము - కంకణములు - రత్నకుండలములు అలంకరించుకున్నదానవు, ధనుస్సు - బాణము పట్టుకున్నదానవు, చక్రవాక పక్షులవంటి రెండు స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్నదానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదములు కలదానవు, నా దారిద్ర్యమను సర్పమును సంహరించు గరుడపక్షివంటిదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశచాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే |
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునినుతే మాం పాహి మీనామ్బికే || 4 ||


బ్రహ్మ - విష్ణు -మహేశ్వరులచే స్తుతింపబడుదానవు, బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివులను పంచప్రేతల ఆసనమును అధిష్ఠించినదానవు, పాశము - అంకుశము - ధనుస్సు - బాణము ధరించినదానవు, తలపై బాలచంద్రుని అలంకరించుకున్నదానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన కన్నులు కలదానవు, కోట్లాది బాలసూర్యుల వలే ప్రకాశించుచున్నదానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు, మునులచే ప్రార్థింపబడుదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

గన్ధర్వామరయక్షపన్నగనుతే గఙ్గాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే || 5 ||


గంధర్వులు, దేవతలు, యక్షులు మరియూ సర్పములచేత స్తుతించబడుదానవు. శివునిచే ఆలింగనము చేసికొనబడినదానవు. నిన్ను స్తుతించువారను రక్షించుదానవు. గరుడునిపై కూర్చున్నదానవు. కమలమునందు పుట్టినదానవు. నల్లనిదానవు. స్థిరమైనదానవు. ఆకాశమును అతిక్రమించినదానవు. దుష్టులనే కొయ్యలను తగులపెట్టు అగ్నిజ్వాలవు. కోట్లాదుసూర్యులవలె వెలుగొందుదానవు. మంత్రములచే ఆరాధించబడు దేవతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

నాదే నారదతుమ్బురాద్యవినుతే నాదాన్తనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనామ్బికే || 6 ||


నాదస్వరూపిణివి, నారదతుంబురాదులచే స్తుతించబడుదానవు, నాదముచివరనుండు అనునాదస్వరూపిణివి, నిత్యమైనదానవు, నల్లని లతవంటి శరీరముగలదానవు, సాటిలేనిదానవు, ధాన్యపుగింజ యొక్క మొన వలే సూక్ష్మమైనదానవు, మనోహరమైనదానవు, కామకళాస్వరూపిణివి, కదంబ (కడిమి చెట్ల) వనమునందుండుదానవు.  కామేశ్వరుని ఒడిలో కూర్చున్నదానవు. నా జ్ఞానస్వరూపిణివి, నా కోర్కెలుతీర్చు కల్పలతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే |
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనామ్బికే || 7||


వీణానాదము వినుచూ మూసిన అరమోడ్పుకన్నులుకలదానవు. కొంచెముగా జారిన కొప్పుగలదానవు. తాంబూలముచే ఎఱ్ఱనైన చిగురుటాకులవంటి పెదవికలదానవు. తాటంకములూ, హారములూ ధరించినదానవు. నల్లనిదానవు. చంద్రకళను శిరోభూషణంగా ధరించినదానవు. నొసటన కస్తూరీతిలకం ధరించినదానవు. పరిపూర్ణురాలవు. పూర్ణచంద్రునివలె అందమయిన ముఖముకలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరఞ్జనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనామ్బికే || 8 ||


శబ్దబ్రహ్మస్వరూపిణివి. చరాచరజగత్స్వరూపిణివి. జ్యోతిర్మయివి, వాఙ్గ్మయివి. నిత్యానందరూపిణివి, నిరంజనస్వరూపిణివి. ’తత్’, ’త్వం’ అను శబ్దములకు అర్థమయినదానవు. జ్ఞానమూర్తివి, తత్త్వములకి అతీతమైనదానవు. శ్రేష్ఠమైనవాటికంటే శ్రేష్ఠమైనదానవు. మాయాస్వరూపిణివి, లక్ష్మీస్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివస్వరూపురాలవూ అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీస్తోత్రం సంపూర్ణమ్ ||

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

 
శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు.

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాః
వసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥

అమ్మా! హిమాద్రితనయా! పార్వతీ! విల్లా, పూలవిల్లు. ఆ వింటికి తుమ్మెదలబారు నారి. అయిదే బాణములు, అవికూడా పుష్పబాణములు. మలయమారుత పవనము రథము, వసంతుడు సహాయకుడు. అయినప్పటికీ మన్మథుడొక్కడే, అమ్మా! నీ క్రీగంటి చూపు వల్ల చెప్పలేనంత కృపను పొంది, ఈ జగత్తంతటనూ జయించుచున్నాడు.

ఏమాత్రమూ బలం లేని ఆయుధములతో, శరీరమే లేని మన్మథుడు ప్రపంచమంతా జయిస్తున్నాడు. అతడికి అలాంటి శక్తి ఎవరు ఇస్తున్నారు ? అది అమ్మవారి క్రీగంటిచూపు. ఇదే ఈ శ్లోకముయొక్క సారాంశము.
మన్మథుడు ఒకప్పుడు అతిలోకసౌందర్యవంతుడు. తన సొంతశక్తిపై నమ్మకంతో అహంకరించి, ఈశ్వరునిచేతిలో భస్మమైనాడు. అమ్మవారు దయతో మరలా జీవితాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని ఈయలేదు. కేవలం తనభార్య రతీదేవికి మాత్రం కనపడే వరం ఇచ్చింది. అలాగే ఇటువంటి బలహీనమైన ఆయుధాలనూ ఇచ్చింది. వీటితో మన్మథుడు విజయం సాధించినా, అతడు వినయుడై ఆ విజయం తన స్వప్రతిభకాదనీ, అమ్మవారి కరుణ అనీ తలచుతునే ఉంటాడు. ఈశ్వరునిచేత తన శరీరమేకాక, గర్వముకూడా నశింపబడింది.

కాముని అమ్మవారు విజేతగా చేయటంతో మన కథ ఆగకూడదు. మనమూ కాముని గెలవాలి. ఈశ్వరుడు మన్మథుని దగ్ధంచేసినప్పుడు అమ్మవారు ఆయనలో ఉండి బలాన్నిచ్చినదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకూ కాముని గెలవటానికి ఆమె అనుగ్రహం కావాలి.

సగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనుగ్రహవర్షం కురిపించటము, మాయ యొక్క కృత్యము. దానికి ఒక్కక్షణము అమ్మవారి క్రీగంటిచూపు చాలు.

Tuesday, 29 August 2017

శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)




శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)

శ్రీ మహాగణాధిపతయే నమః

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1॥


అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

ఈ సృష్టిలోని ప్రతీ కదలికకూ అమ్మవారి శక్తి కారణమనీ, ఆమెకు నమస్కరించాలన్నా, స్తుతిచేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలనీ, ఆ అనుగ్రహం గతజన్మలపుణ్యఫలమనీ శంకరులు అంటున్నారు.

ఈ ప్రపంచమునకు పరమేశ్వరుని స్పందన ద్వారా కారణమవుతున్నది అమ్మవారు. జీవుడు ఈ మాయా ప్రపంచమునుండి విడివడి శివైక్యం చెందుటకుకూడా అమ్మవారే కారకురాలు. అట్టి శివైక్యం చెందుటకు అమ్మ కటాక్షంకోసం ప్రార్థించాలి. ఇది శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా మనకు చేసిన ఉపదేశం.



తనీయాంసం పాంసుం తవ చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ॥ 2॥

అమ్మా! నీ పాదపద్మమునుండి అతి చిన్న ధూళికణమును సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను సుందరముగా నిర్మించుచున్నాడు. విష్ణువు దానినే తన వేయితలలతో ఎలాగో (శ్రమతో) మ్రోయుచున్నాడు. హరుడు దానిని చక్కగా మెదిపి భస్మధారణ చేయుచున్నాడు.

పై శ్లోకముతో కలిపి చదివినప్పుడు - త్రిమూర్తులు అమ్మవారిని ఆరాధించి, తత్ఫలముగా అమ్మవారి కరుణతో సృష్టి, స్థితి, లయములను  నిర్వహించ సమర్థులవుతున్నారని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్రపాదధూళి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని ఎన్నోవిధాలుగా ప్రసాదిస్తుందని శంకరులు అంటున్నారు.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥

(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి - భవతీ)

సూర్యుడు చీకట్లు తొలగించి వెలుగునిచ్చినట్లు, అమ్మవారి పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను సారవంతంచేయునట్టి చైతన్యమనే పూలగుత్తులనుండి వచ్చు తేనె ప్రవాహము. దరిద్రులకు సకలసంపదలను ఇచ్చునట్టి చింతామణుల మాల. (హిరణ్యాక్షునిచేత సముద్రములో దాచబడిన భూమిని వెలికితీసినట్టుల) సంసారసాగరమున మునిగియున్నవారలను ఉద్ధరించునట్టి ఆదివరాహరూపములోని శ్రీ మహావిష్ణుని కోఱ.

లౌకికులకు ప్రజ్ఞ, సంపదలనూ, సాధకులకు జ్ఞానమోక్షములనూ అమ్మవారు అనుగ్రహిస్తుందని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్ర పాదపద్మములను శంకరులు స్తుతించుచున్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥


సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ! నీకన్నా ఇతరులైన దేవతలు తమ తమ చేతులతో అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరద, అభయ ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, కోరినదానికన్నను ఎక్కువగా ఫలములనిచ్చుటకు నీ పాదములే సమర్థములైనవి.

'వాంఛాసమధికం' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము.
---------
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


http://jagadguru-vaibhavam.blogspot.in/2017/08/1-5.html

Saturday, 26 August 2017

పరమాచార్యుల అమృతవాణి : కామాక్షి చరణ ప్రభావము




పరమాచార్యుల అమృతవాణి :  కామాక్షి చరణ ప్రభావము
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన భారతదేశము పరమ పవిత్రమైన దేశము, ఇది కర్మభూమి ఇతర దేశములన్నీ భోగ భూములు. శాస్త్రముల ప్రకారము ఇది అన్వర్థము, అనుభవములో కూడా ఒక్క భారతదేశములో మాత్రమే ఈనాటికి కూడా వైదిక కర్మానుష్టానము జరుగుచున్నది. ఇక్కడ ఏడు ముక్తి ప్రదములైన క్షేత్రము లున్నట్లు సంప్రదాయముగా చెప్పుకుంటున్నారు.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా,
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః


కాంచీ అంటే మధ్యభాగము, లేక ఓఢ్యాణము, అని అర్థము, స్త్రీలు ఓఢ్యాణమును (వడ్డాణమును) శరీర మధ్యభాగములోనే ధరిస్తారుగదా! కాంచీదేనికి మధ్య భాగము? ఒకప్పుడు మన వైదికమతము సింహళము, ఇండోనేషియా మొదలైన అనేక దేశములలో వ్యాపించి ఉండేది. విశాలమైన వైదిక మతావలంబులు నివసించే భూభాగానికి ఆనాడు కాంచీనగరము మధ్యభాగమున ఉండేది. కాంచీ వంటి నగరము మరొకటి లేదు. ఆ ఊరిలో 108 శివాలయములున్నవి. ఇవిగాక విశిష్ణ్వాలయములు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఉన్నవి. ప్రతివీధిలోను ఒక దేవాలయ మున్నది. గుడిలేని వీధిలేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయములో ఉత్సవము జరుగుతూనే ఉంటుంది. అట్టి కాంచీపుర మధ్య భాగములో కామాక్షీ దేవి ఆలయమున్నది.

ఏ గుడిలో ఏ ఉత్సవము జరిగినా వరద రాజస్వామి రథోత్సవము, ఏకామ్రనాథ స్వామి రథో త్సవము జరిగినా, ఆ ఉత్సవము వచ్చి కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణము చేసి వెళ్లవలసినదే. ఒకప్పుడు స్వదేవాలయ ప్రదక్షిణము మానివేసి కూడా కామాక్షీ దేవి ప్రదక్షిణము చేస్తారు. రథోత్సవములో, తంత్రశాస్త్రవేత్తల పరిభాషలలో కాంచీనగరము అమ్మవారి ఉద్యానపీఠస్థానము. సామాన్యముగా అన్ని గుడులలోను అమ్మవారికి నాలుగు చేతులు, ఆ చేతులలో 1. వరదముద్ర, 2.అభయముద్ర, 3. పాశము, 4. అంకుశము ఉంటవి. పాశము అనే ఆయుధము మనలో ఆశాపాశములను తొలగించి, మనసుకున్న చంచలత్వము పోగొట్టుతుంది. అంకుశము - మన అహంకారమును నశింపచేస్తుంది. అభయముద్ర కష్టములలోనున్న వారికి భీతిలేకుండా చేయగా, వరదముద్ర కోరిన వరముల నిస్తుంది. కొన్ని గ్రామములలో అమ్మవారికి రెండు చేతులే ఉండి, వరదాభయముద్ర లుండును. కామాక్షీ దేవి కూడా చతుర్భుజయే, 1. కుడివైపు క్రిందిచేతులో పంచ (పుష్ప) బాణములు, 2. కుడివైపుపై చేతిలో పాశము. 3. ఎడమవైపు క్రిందిచేతిలో ధనుస్సు, 4. ఎడమ వైపు పైచేతిలో అంకుశము ఉన్నవి. వరదాభయ ముద్రలు లేవు. కామాక్షి అమ్మవారికి వరదాభయముద్రలు లేకుండుట చూచి శంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అమ్మా! నీకన్నా ఇతరులైన దేవతలు అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరధాభయము ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, వరముల నిచ్చుటకు నీపాదములే సమర్థములైనవి.

''వాంఛా'' ''సమధికం'' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని భావము, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము, అమ్మవారి చతుర్భుజములలోని ఆయుధములను లలితా సహస్రనామములో వివరించి చెప్పారు. అమ్మవారి మూర్తిలో ఒక్కొక్క భాగమును ధ్యానముచేస్తే, ఒక్కొక్క సిద్ధివస్తుంది. పంచబాణములను ధ్యానముచేస్తే ఆశాపాశము విడి పోతుంది. దేవతామూర్తుల విగ్రహములలో, వాహనములలో, ఆయుధములో, ముద్రలలో తంత్రశాస్త్ర సంకేతము లిమిడి ఉన్నవి. మిగిలిన క్షేత్రములు రామకృష్ణాదుల వలన పవిత్రము లైనవి. కాంచీనగరము అమ్మవారి చరణములవలన మోక్ష క్షేత్రమైనది.

Saturday, 6 May 2017

రామాయణప్రభ : సీతమ్మకు మహాసాధ్వి అనసూయ ఉపదేశం



రామాయణప్రభ : సీతమ్మకు మహాసాధ్వి అనసూయ ఉపదేశం
(అయోధ్యకాండాతర్గతం)

అమ్మా! భర్త నగరమునందున్నను ఉండనిమ్ము. అడవిలోనైనను ఉండనిమ్ము. మంచివాడే కానిమ్ము, పాపాత్ముడేకానిమ్ము, భర్తని ప్రేమతో ఆదరించెడి స్త్రీ ఉత్తమలోకములను పొందును.చెడునడవడి కలవాడైనను, స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడైనను, ధనహీనుడైనను, ధర్మబద్ధమగు స్వభావము కల స్త్రీలకు భర్తయే పరదైవము. ఆలోచించి చూడగా భర్తకంటే గొప్ప బంధువు లేడని నేను భావించుచుందును. భర్తను ప్రేమించి ఆరాధించుటకంటే యోగ్యమగు తపస్సు వేరొకటి లేదు. సత్ప్రవర్తన లేని స్త్రీలు మంచి చెడులను గుర్తించలేరు. వారి కోరికలు తీర్చుకొనుటయే వారికి ప్రధానము. భర్తలను నియమించెడి వారలైయుందురు. పురుషులను కాంక్షించుచుందురు. అట్టివారు అపకీర్తిని పొందుదురు. ధర్మమునుండి దిగజారుదురు. చేయకూడని పనులను చేయుటకు అలవాటు పడిన అట్టి స్త్రీలు వినాశమునందుదురు. గుణవంతులైన స్త్రీలు ధర్మాచరణము చేసిన వారలై స్వర్గము నందు విహరింతురు. కావున నీవు భర్తకు సహధర్మచారిణివై అనుసరించి ఉండి కీర్తిని పొందుము. ధర్మమును ఆర్జించుకొనుము. పతివ్రతలు ఆచరించెడి మార్గమును అనుసరించి ఉత్తమ పతివ్రతవై ఉండుము. భర్త చేసెడి ధర్మములలో తోడు నీడగ ఉండి కీర్తిని , ధర్మమును పొందుము.

Friday, 25 November 2016

పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం




పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి


"పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే! నమస్తే జగదేక మాతః" అని శ్యామలా దండకం. ఈ చెరకు వింటి యొక్కయూ పుష్పబాణాలయొక్కయూ సూక్ష్మతత్త్వం లలితాసహస్రంలో "మనోరూపేక్షుకోదండాపంచ తన్మాత్ర సాయకా" అని చెప్పబడ్డది.

చెరకు తీపి. మనస్సున్నూ తీపే. లోకంలోని జనులందరి సమష్టి మనస్సూ ఆమె చేతిలో వున్న చెరకు విల్లు. చెవి, మేనూ, కన్నూ, నాలుకా, ముక్కూ, అనుభవించే విషయాలే తన్మాత్రలు. ఆ తన్మాత్రలనే, పూవుటమ్ములుగా తనచేతిలో పెట్టుకొన్నది. మన కామ నిరోధానికి మనో నిరోధానికి ఆమె కారణం అవుతూంది. ఆమె అనుగ్రహం మాత్రం వుండాలి. మూకకవి తరచు దీనిని గూర్చి ''మీ కటాక్షం శివునే మోహపెడుతోంది, కాని జనుల మోహాన్ని మాత్రం శిధిలం చేస్తుంది.'' అని చెపుతూ వుంటాడు.

కేవలం జ్ఞానమయుడైన ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపజేసే శివకామసుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహ నివృత్తి చేస్తోంది. ఇదే ఆమె విశేషం. మూకకవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం వుంటేనే మనకు చిత్తంలో అవికారం సమదృష్టీ. నిర్మోహస్థితీ కలుగుతుంది.

ఆమె అనుగ్రహం వుంటే ఎంత కామం కలిగించే వస్తువులైనా మనలను చలింప చేయలేవు. ఎట్టి విభూతియైనా లోభపెట్టలేదు. అరిషడ్వర్గములు అంతరించి చిత్తశుద్ధి కలగాలంటే దేవిని ధ్యానించాలి. "అమ్మా దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా వుండేటట్లు నాచిత్తాన్ని పరిశుద్ధంచెయ్యి" అని నిత్యమూ వేడుకోవాలి. ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది. అదియే ఆమె చరణారవిందాలు ఆశ్రయించినందువల్ల కలిగే ఫలం. మనస్సులో లోపమున్నదంటే చిత్తశుద్ధి లేదన్నమాట.

ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం. చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూపధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి. శంకరుల సౌందర్య లహరీ ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయీబవలూ జగన్మాతృ స్మరణముచే దోషనివృత్తి చేసికొని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూనిణికి అర్పించడమే.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/11/blog-post_52.html
 

Thursday, 29 September 2016

పరమాచార్యుల అమృతవాణి :జగన్మాత ఉపాసనాఫలము




పరమాచార్యుల అమృతవాణి :జగన్మాత ఉపాసనాఫలము
(జగద్గురుబోధలనుండి)


సౌందర్యలహరిలో చిట్టచివరిశ్లోకానికిముందటిశ్లోకంలో శాక్తోపాసకులు ఉపాసనా ఫలితముగా ఏయే ప్రయోజనాలు పొందుతారో ఆయాప్రయోజనాలను శ్రీమత్‌ శంకర భగవత్పాదులు విశదీకరించారు.

శైశవంలో ఆకలివేసినప్పడూ దడపుట్టినప్పుడూ మనం మన శరీర ధారణకు కారణమైన కన్నతల్లి ఒడిలో చేరి ఆక్రందనం చేసి పాలు క్రోలి పెరిగి పెద్దలమైనాము. బిడ్డ కొంచెం ఏడిస్తే చాలు. తల్లితన పనులన్నీ ఒకవంకకునెట్టి తన శిశువును గమనిస్తుంది. శిశువులు తల్లిని నోరార 'అమ్మా' అని పిలిచేటట్లు లేగదూడలుకూడా తమ తల్లులను అంబా అని సంబోధిస్తవి. 'మేస్తూవున్న గడ్డి వదిలిపెట్టి దూడదగ్గరకు వేగముతో పరిగెత్తే గోమాత హృదయానికే ఆయేడ్పులోని కలత తెలుసు.' అంబా రవము నుండియే అమ్మ అనే మాట పుట్టివుండాలి. అంబాఅని ఆక్రందించే లేగదూడలవలె మనంకూడా ఆబ్రహ్మ కీటజననియైన అంబిక మ్రోల మొరపెట్టుకుంటే ఆలోకమాత అనుగ్రహానికి పాత్రులము కాగలమని గ్రంథాంతంలో ఆచార్యులవారు గ్రంథ ఫలశ్రుతిగా కాక అంబికాచరణ దాన ఫల శ్రుతిగానే చెప్పారు.

సరస్వత్యా లక్ష్యా విధి హరి సవత్నో విహరతే 
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేతి వపుషా, 
చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః 
పరానందాభిఖ్యం రనయతి రనం త్వద్‌భజనవాన్‌. 

భక్తవత్సలవు నీవు. నీ భక్తులు నిన్ను ఏం కోరినా యిస్తావు. నీవో, లక్ష్మి ఒక చేత్తోనూ వాణి ఒక చేత్తోనూ వింజామరలు వీస్తుండగా కొలువుతీరుస్తావు. లక్ష్మీసరస్వతులు నీకు దాసికలై వింజామరలతో సేవ చేస్తుండగా నీ కతివత్సలుడైన నీభక్తునికి సైతం వారు సేవ చేయరా ఏమి? పరిపూర్ణతకు లక్ష్మీకటాక్షం తప్పనిసరి. ఆ లక్ష్మీ పురుషోత్తమునిధామం వైకుంఠం వదలి నీపాదాలముందే పడిగాపులు కాస్తూంది. అంతటితో ఆగక నీభక్తునికి సైతం పరిచర్యచేయడానికి సమకట్టుతూంది. అపుడు నీభక్తుణ్ణి చూస్తే పురుషోత్తమునికి అసూయ కలుగుతూంది.

ఎవరైనాసరే లక్ష్మీకటాక్షాన్నే మొదట కోర్తారు. తన బిడ్డ తెలివితక్కువతనం తల్లికి తెలుసుగనుక లక్ష్మీకటాక్షాన్నే మొట్ట మొదట అనుగ్రహిస్తే అజ్ఞానవశాన ధనం దుర్వ్యయం చేసేసి పాపాలు మూటకట్టకుంటాడని అతనికి మొదట సరస్వతీ ప్రసన్నత అనుగ్రహించి, తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించే వివేకం ఇస్తుంది శ్రీమాత.

'స మేంద్రో మేథయా స్పృణోతు తతో మేశ్రియ మావహ' అని తైత్తిరీయం మొదట మేధ తరువాత శ్రీ ప్రసాదం. దీనికి ఆచార్యులవారు భాష్యం వ్రాస్తూ 'ఏవమాదీని కుర్వాణా శ్రీర్యా తాం తతో మేధా సాహిశ్రీ రనర్థాయేవేతి' మేధలేని వానికి డబ్బిస్తే అనర్థమే కలుగుతుందట. డబ్బెందుకు? పుణ్యము సంపాదించటానికి బుద్ధి లేని వానికి డబ్బిస్తే వాడు పాపాలభైరవు డవుతాడు. అట్టిచోట అర్థానికి అర్థం అనర్థమే- ''అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ స్సత్యమ్‌'' అని భజగోవిందంలో భగవత్పాదులే బోధించారు.

సర్వోత్పాదకశక్తి పరాశక్తి. ఆమె కటాక్షమాత్రం చేత భక్తునికి ఎక్కడలేని తెలివీ పుట్టుకొని వస్తుంది. అతని మనస్సనే ఆకాశంలో మెరుపుతీగవలె అపూర్వములైన సత్యాలు హఠాత్తుగా మెరుస్తాయి. మంచిపనులు చేయడం అతనికి అలవాటవుతుంది. అతడెప్పుడూ ఇహానికీ, పరానికీ ఉపయోగించే కార్యాలనే ఎల్లప్పుడూ చేస్తుంటాడు. జగన్మాత యెడల ఏకాంతభక్తి నెరపినవానినాలుకమీద పలుకుల వెలది కాలి గజ్జలమోతలు వినిపిస్తయ్‌. అట్టి భక్తునియెడల సరస్వతికి గల మక్కువను చూచి బ్రహ్మగారికే కలవరం పుడుతుందిట.

ఐశ్వర్యానికి ఏమిటి ప్రయోజనం? అది మొదట తన అనుభవానికి రావాలి. పరహితకోసం చేసే దానధర్మాలకు కూడిరావాలి. పాపికి ఐశ్వర్యంపడితే అది అతనికి కోపమోహ కారణమవడమేకాక లోకానికి కష్టకారణంకూడా అవుతుంది. 

డబ్బుమాట యెత్తితే అందరికీ కొరతే. అందరికీ ధనవాంఛే. ఒకనికెంతధనమున్నా బ్యాంకిలో ఎంత నిలువచేసినా అతన్ని అడిగిచూడండి. మీరేమిటో అనుకుంటున్నారు! నాదంతా పైవేషమే. నాచేతిలో నయాపైసా లేదు అని చెపుతాడు. 'ఫలానా ఆయన డబ్బుకలవాడు' అని ఎవరైనా చెపితే ఆ ఆసామికి ఆ చెప్పినవాడిమీద ఎక్కడలేని కోపం వస్తుంది. తమకు ఎంతధనమున్నా అదిఅల్పమనే అందరీభావన. మరింత సిరిపట్టకూడదా అని ఆగర్భ శ్రీమంతులుకూడా ఎదురుచూస్తుంటారు. ఇదిలోకంతీరు. అందుచేతనే భక్తుని చూచి 'నీకు డబ్బుకావాలా నాయనా? కావలిస్తే మొదట మేథావంతుడవు, వివేకివి కా. అప్పుడుకాని నీకిచ్చే అర్థం సార్థకం' అని అమ్మ బుద్ధి చెప్పుతుంది.

నిజానికి దారిద్ర్యం అంటే ఏమి? నేను దరిద్రుడను అని చెప్పుకోడమే తృప్తికలవాడు నిత్యసంతోషి. 'నేనుదరిద్రుణ్ణి' 'నేనుదరిద్రుణ్ణి' అని సొద వెళ్ళబోసుకుంటే ఒక్కనయాసైసా యిచ్చే పుణ్యాత్ముణ్ణి చూపండి. 'అంతో ఇంతో దేవుడిచ్చాడు' అని తలపోస్తే సంతోషంగానైనా బ్రతకవచ్చు.

సరి, వేదశాస్త్ర పరిజ్ఞానం, వివిధ భాషా కోవిదత్వం ఐశ్వర్యం వివేకం అన్నీ ఉన్నవి. అయినా ఏదోకొరత వున్నది. అదేమి?

విద్యాధనాలుంటే చాలదు. అందచందాలు మీద ఇచ్ఛ పరుగులెత్తుతుంది. చూచేవాళ్ళకు కొట్టవచ్చినట్లుండే తేజస్సు కావాలని కోరిక వూరుతుంది. అంబికానుగ్రహంవున్న ఉపాసకునకు అదిన్నీ చేకూరుతుంది. అందంలో వధిపొందిన వాడు అంగలేనివాడు. 'కోటిమన్మథ విగ్రహమ్‌' అని ఈశ్వరాదుల వర్ణనం అనంగుని మించిన అందగాడు మరొకడులేడు. అతని శ్రీమతి రతి మహాసౌందర్యవతి. మగనికి తగిన మగువ. ఓ అమ్మా! నిన్ను థ్యానించేవాడు రతీదేవి పాతివ్రత్యానికి శైథిల్యం కలుగజేసి అందచందాలతో అలరారుతాడట.

చదువూ డబ్బూ అందమూ ఇవి అన్నీవున్నా ఆయుర్దాయం లేకపోతే నిష్ప్రయోజనం. అంబికా కటాక్ష మున్న సాధకుడు దీర్ఘాయుష్మంతుడౌతాట్ట.

మంచిది. అన్నీ అమరినవి. తతః కిమ్‌ - తరువాత? ఈ అనుభవానికి పిదప ఈప్రశ్న వైరాగ్యానికి బీజం. మనకు వైరాగ్యం గనుక సొంతంగానే కలిగితే అది క్షణకాలం ఉంటుందో. ఉండదో, అమ్మ దయచే కలిగితే ఆ వైరాగ్యం మేకు పాతినట్లే.

అక్కరలేని విషయాలమీద ప్రేమ మనలను బాధిస్తూంది. బంధిస్తూంది. ఈ పాశాలు వున్నంతవరకూ మనం పశువులం. భగవానుడు పశుపతి. డబ్బు, మనస్సు, అందము, ఆయుస్సు అనే పాశాలతో ఆయన మనలను బంధించివున్నాడు. ఎన్నడు నిర్వేదపూర్వకమైన వైరాగ్యం కలుగుతుందో ఆనాడు మన పాశాలు జారి పశుత్వంపోయి పరబ్రహ్మలమై కూర్చుంటాము. శుద్ధప్రకాశచేతనవస్తువే ఆత్మ. మనము పాశవిముక్తులమైతే పరమానందం మన సొమ్ము. అంబిక మనకిచ్చే అంతిమ ఫలం అదే.

పురుషార్థాలను ప్రసాదించేది పరమేశ్వరి. గోమాత కడకు వెళ్ళే లేగలవలె శ్రీమాత చరణారవిందములను చేరితే గాని ఐహికవిషయానుభవము పిదప మనకు ఆముష్మికమగు కైవల్యానందం దొరకదు.

Monday, 25 July 2016

శంకరస్తోత్రాలు : ఆనందలహరీ



శంకరస్తోత్రాలు : ఆనందలహరీ
(ఇదివరలో ఈ బ్లాగులో  విడివిడిగా ఉన్న ఈ స్తోత్రభాగాలను ఒకటిగా అందిస్తున్నాము)

భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతిః
తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః || 1 ||

      
ఓ భవానీ ! ప్రజలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలుగు ముఖములతోనూ , త్రిపురాసురుని మర్దించిన ఈశ్వరుడు ఐదు ముఖములతోనూ , దేవసేనానాయకుడగు సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖములతోనూ , ఆదిశేషువు వేయి ముఖములతోనూ నిన్ను స్తుతించలేనిచో ఇతరులు ఎవరు నిన్ను స్తుతించగలరు తల్లీ ? నీవే చెప్పు .

ఘృతక్షీర ద్రాక్షా మధుమధురిమా కైరపిపదై
ర్విశిష్యా నాఖ్యేయా భవతి రసనామాత్ర విషయః |
తథాతే సౌన్దర్యం పరమశివ దృఙ్మాత్ర విషయః
కథంకారం బ్రూమః సకల నిగమాగోచర పదే || 2 ||


నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనె వీటి మాధుర్యము మాటలతో వర్ణించనలవికానిది . ఆ మాధుర్యము నాలుకకు మాత్రమే తెలియును. అదే రీతిగా అమ్మా ! నీ సౌందర్యం వర్ణించి చెప్పడానికి సకలవేదాలకూ శక్తి చాలదు తల్లీ, అది పరమశివుని కన్నులకు మాత్రమే ఎరుకగానీ,  మాబోటివారు వర్ణించగలమా తల్లీ  !

ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్ || 3 ||


నోటి యందు తాంబూలంతో, కళ్ళకు కాటుకతో, నొసటన కాశ్మీరతిలకంతో, నడుము నందు కాంతులీను వడ్డాణముతో, మెడలో ముత్యాల హారాలతో, బంగారు చీరతో ప్రకాశిస్తున్న హిమవత్పర్వతరాజపుత్రిక అయిన గౌరిని నేను సదా సేవించుచున్నాను .

విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటీ
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా |
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే || 4 ||


ఓ శంభుని సతీ! కంఠమునుంచీ కల్పవృక్ష కుసుమాలమాలలు వ్రేలాడుతుండగా శోభిల్లు వక్షస్థలముతోనూ, మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్న కుండలములతోనూ, కొంచెము ముందుకు వంగినటువంటి శరీరముతోనూ(భక్తులను అనుగ్రహించుటకు ముందుకు వంగిందిట), ఆడ ఏనుగు వంటి అందమైన నడకతోనూ, పద్మముల వంటి  కన్నులతోనూ శోభిల్లు తల్లీ! నీకు విజయమగుగాక.

నవీనార్క భ్రాజిన్మణి కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిత నయనాంగీకృత శివా |
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ || 5 ||


ఓ అపర్ణా! అప్పుడే ఉదయించిన బాలభానుడిలాగా దేదీప్యమానంగా ప్రకాశించే సువర్ణ మణిమయాది సర్వాభరణాలతో సర్వాంగభూషితవూ, ఆడలేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు కలదానవూ, పరమశివుని పతిగా స్వీకరించినదానవూ, మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవూ, పసిడి పీతాంబరం ధరించినదానవూ, మువ్వలపట్టీలతో కళకళలాడుతూ పరిపూర్ణురాలివైన నీవు నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించెదవుగాక.

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా || 6 ||


(ఇక్కడ అమ్మవారిని కల్పలతతో పోలుస్తున్నారు.ఈ లత మామూలు లత కాదు కల్పలత అంటే అడిగినవన్నీ ఇస్తుంది.)
ఈ కల్పలత హిమవత్పర్వతమునందు పుట్టింది, అందమైన చేతులు అనే చిగురుటాకులు కలది, ముత్యములనే పుష్పములున్నది,  ముంగురులనే తుమ్మెదలు వాలినది, శివుడనే మ్రోడుని పెనవేసుకొన్నది(స్థాణువు-శివుడు,మ్రోడు), స్తనములనే ఫలములతో వంగినది, శాస్త్రవాక్కులనే మకరందం కలిగినది, సర్వరోగములనూ పోగొట్టునది(భవరోగ నివారిణి), కదులుచున్నది అగు పార్వతీదేవి అనే జ్ఞానానందలతిక విలసిల్లుచున్నది.

సపర్ణా మాకీర్ణాం కతిపయగుణై స్సాదరమిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్ || 7 ||


(పరమేశ్వరుని వివాహమాడుటకు ఆకులనుకూడా తినకుండా తపస్సు చేసినందున పార్వతీదేవికి అపర్ణ అని పేరు. అపర్ణ అనగా ఆకులు లేనిది అని. పార్వతీదేవి ఈ శ్లోకములో ఆకులులేని తీగగా చెప్పబడుతున్నది)

ఆకులు కలిగిన తీగెలను (ఇతర దేవతలను), కొన్నిగుణములు మాత్రమేగలవైననూ, ఇతరులు ఆశ్రయించుచున్నారు. నాకు మాత్రం ఈ విధంగా అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ ఆకులులేని తీగెనే (అపర్ణ) ఆశ్రయించాలి. ఆ తీగె చుట్టుకున్న మాత్రాన పాత మ్రోడు (శివుడు - స్థాణుః) కూడా మోక్షఫలములిచ్చుచున్నది.

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజనని
త్వమర్థానాం మూలం ధనద సమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషి || 8 ||


సమస్త వేదములను కన్నతల్లీ! నీవే ధర్మములు విధించుచున్నావు. కుబేరుడు నీ పాదకమలములకు మ్రొక్కెడువాడే. సమస్త సంపదలకూ నీవే మూలము. తల్లీ, నీవు మన్మధుని జయించినదానవు, కోరికలకూ నీవే మూలము. పరబ్రహ్మ పట్టపురాణివి నీవు, సత్పురుషుల ముక్తికి కారణమూ నీవే.
(చతుర్విధ పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనొసగునది జగన్మాత )

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస
స్త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః || 9 ||


అమ్మా! చపలచిత్తుడనైన నాకు నీపై భక్తి కుదురుటలేదు. నీవు శ్రీమతివి (పెద్ద మనసున్నదానివి, మనం పెద్దమనసు చేసుకుని అంటాం కదా) నాపై దయచూపాలి. చాతకపక్షి నోటిలో మేఘుడు మధురమైన నీటిని వర్షించినట్లే నీవూ నాపై దయావర్షం కురిపించాలి. నా మనస్సు ఎందుకు నీపై నిలుచుటలేదని మధనపడుచున్నాను. (నీవే దారి చూపాలని వినతి).

చాతకపక్షి ఇష్టాఇష్టాలతో నిమిత్తంలేక మేఘుడు తన ధర్మం ప్రకారం మధురజలాలు ఆ పక్షిపై ఎలావర్షిస్తున్నాడో, నా భక్తిశ్రద్ధలతో నిమిత్తంలేకనే నువ్వు (నీ దయాధర్మం ప్రకారం) నీ దయ నాపై కురిపించు తల్లీ అని భావన.

శంకరులు సౌందర్యలహరిలో ’దృశా ద్రాఘీయస్యా’ శ్లోకంలో ఇదేభావం కనపరిచారు. ’వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః’ చంద్రుడు భవనాలపై అరణ్యాలపై ఒకేలా వెన్నెల కురిపించినట్లు, ఈ దీనుడిపై దయచూపమని అక్కడ వినతి.

’కావు కావమని నే మొరబెట్టితే కరుగదేమి మది’ అని త్యాగరాజులవారు
’దేవీ బ్రోవ సమయమిదే, అతివేగమే వచ్చి’ అని శ్యామశాస్త్రుల్ల వారు దెబ్బలాడారు. అందరూ దెబ్బలాటలు శంకరులవద్దే నేర్చుకున్నట్లుంది.

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీ పరికరైః || 10 ||


గొప్పచరిత్రగల తల్లీ! నిన్ను శరణు అన్న నాపై నీకు ఉపేక్ష తగదు. నీ దయాదృష్టిని నాపై వేగముగా ప్రసరింపచేయి.  కోరుకున్నది వెంటనే ఇవ్వకపోతే సామాన్యలతలకన్నా కల్పలతకు విశేషమేమున్నది ? 

మహాన్తం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 11 ||


అమ్మా ఉమాదేవీ! నీ పాదపద్మములపై గొప్ప విశ్వాసము కలవాడినై నేను ఈ లోకంలో  అన్య దేవతలను ఆశ్రయించలేదు. అయినా నీవు నాపై కరుణ చూపకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ ! నాకెవరు దిక్కు ?

త్యాగరాజులవారు కూడా ’వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా!’ అని కామాక్షీ అమ్మవారిని ప్రార్థించారు.  శంకరులు ఈ శ్లోకంలో ’వినాయకుని తల్లీ నాకింకెవరు దిక్కు?’ అని అడుగుతున్నారు. ఎందుకు వినాయకుని అమ్మకు గుర్తుచేస్తున్నారు ?

వినాయకుని ’హేరంబుడు’ అంటారు. అంటే ఎప్పుడూ శివునివద్దనే ఉండేవాడని. అందుచేత వినాయకుడంటే అమ్మవారికి మక్కువ అని పెద్దల మాట.

నాకు వినాయకుని ’లంబోదర’ అని సంబోధించడంలో ఒక సంకేతం కనిపిస్తోంది. వినాయకచవితి కథలో వినాయకుని ఉదరం భగ్నమైనప్పుడు అమ్మవారు పట్టుబట్టి మరలా జీవం పోయించింది. అంత కరుణనూ నాపై కూడా చూపమని శంకరులు, త్యాగరాజులు అడుగుతున్నారని నా అభిప్రాయం.

అయస్స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిళితమ్ |
తథా తత్తత్పాపైరతిమలిననన్తర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ || 12 ||


పరశువేది స్పర్శతో ఇనుము బంగారమవుతున్నది. వీధికాలువల నీరు గంగాప్రవాహముతో కలిసి శుచి అవుతున్నది. అలాగే ఆయా పాపములతో అతి మలినమైన నా మనస్సు నీపై భక్తితో కలసినచో ఎట్లు నిర్మలము కాదు ?

త్వదన్యస్మాదిచ్చావిషయఫలలాభే న నియమ
స్త్వమజ్ఞానామిచ్చాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివముచితమీశాని కురు తత్ || 13 ||


నీ కంటే ఇతరులైన దేవతల వలన కోరినఫలము లభిస్తుందని నియమము (ఆంగ్లములో చెప్పాలంటే , గ్యారంటీ) లేదు. మరి నీవో, అజ్ఞులకుకూడా కోరినదానికన్నా అధికముగా ఇచ్చుటలో సమర్థురాలవని బ్రహ్మదేవుడు మొదలగువారు చెప్పారు. నా మనస్సు రాత్రింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నది. ఓ ఈశ్వరుని పత్నీ! ఏది తగినదో అది చేయుము.

స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చశధరకళాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి || 14 ||


ముల్లోకములకూ మహారాజయిన పరమేశ్వరుని గృహిణి అగు ఓ పరమేశ్వరీ! రమణీయమైన నీ సౌధములో కాంతులీను నానా రత్నములు పొదగబడినవీ, స్ఫటికమయమైనవీ అయిన గోడలయందు నీ ఆకారము ప్రతిబింబించుచున్నది. దాని శిఖరము పై చంద్రకళ ప్రకాశించుచున్నది. ఆ భవనములో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు సపరివారముగా ఉన్నారు. ఆ భవనము ఎంతో గొప్పగా ఉన్నది.

నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధనికరః |
మహేశః ప్రాణేశః తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా || 15 ||


అమ్మా! నీ సౌభాగ్యమేమని చెప్పను ? నీ నివాసము కైలాసము. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు నిన్ను స్తుతిచేయువారు (వంది మాగధులు). ఈ ముల్లోకాలూ నీ కుటుంబము. సిద్ధులన్నీ నీకు అంజలిఘటించుచున్నాయి. మహేశ్వరుడు నీ ప్రాణేశుడు. ఓ పర్వతరాజపుత్రీ పార్వతీ! నీ సౌభాగ్యానికి సమానమైనది వేరొకటి లేదు .

వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూః భుజగనివహో భూషణవిధిః |
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపోః
యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా || 16 ||


అమ్మా!  మన్మథశత్రువగు శివుని (సంపద) గురించి అందరికీ తెలిసినదే. ఆయన వాహనము ముసలి ఎద్దు. ఆహారము హాలాహలము. వస్త్రము దిక్కులు. క్రీడాస్థలము స్మశానము. ఆభరణములు పాములు. ( ఇలాంటి శివుడు ఈ జగత్తుకి ఈశ్వరుడు ఎలా అయ్యాడు ?) ఆయన యొక్క ఐశ్వర్యము(ఈశ్వరత్వము) ఓ జననీ! నీ సౌభాగ్యమహిమయే.

అశేషబ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే || 17 ||


అమ్మా!  పశుపతి అయిన శివుడు సహజముగా అశేష బ్రహ్మాండములనూ ప్రళయంతో లయం చేసే స్వభావం ఉన్నవాడు,  స్మశానంలో ఉండేవాడు, బూడిద పూసుకునే వాడు. అలాంటి వాడు అఖిల జగత్తుపైనా కరుణతో హాలాహలాన్ని కంఠంలో ధరించాడు. ఓ కళ్యాణీ, ఈ కరుణ చూపడం నీ సాంగత్యఫలమే అని నేను తలచుచున్నాను.

త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసి వాసేన గిరిశః॥18॥
అమ్మా శైలపుత్రీ! సర్వోత్కృష్టమయిన నీ సౌందర్యమును చూచి మిక్కిలి భయముతో గంగ జలమైపోయెను. అంతట ఈశ్వరుడు ఆ గంగాదేవి ముఖకమలమును చూచి,ఆమె దీనావస్థకు జాలిపడి,తన శిరసున నివాసమిచ్చి,ప్రత్యేక ప్రతిష్ఠను కలిగించుచున్నాడు.

 విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్॥19


హే భగవతీ! అధికమైన చందనద్రవముతో,కస్తూరితో,కుంకుమపువ్వుతో కలిసిన నీ అభ్యంగజలమును(తలంటి పోసుకొను నీరు) మరియు రాలుచున్న నీ పాదధూళిని తన చేతులతో సంగ్రహించి బ్రహ్మదేవుడు దేవలోకసుందరీమణులను(అప్సరసలను) సృష్టించుచున్నాడు తల్లీ!
(అంబిక సౌందర్యాధిదేవత,ఆమె సౌందర్యము సర్వాధిక్యమని సూచన)


వసన్తే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాళిసుభగే
సఖీభిః ఖేలన్తీం మలయపవనాందోళితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి॥20॥


తల్లీ! ఆనందకరమైన వసంతకాలంలో, అన్నివైపులా లతలు ఉన్నది, వికసించిన బహువిధములైన పద్మములు కలది, కలహంసల బారులతో సుందరమైనది మరియు మలయమారుతముచే మెల్లగా కదులు నీరు కలది అగు సరస్సులో చెలికత్తెలతో జలకములాడుచున్న నిన్ను ధ్యానించు వారికి జ్వరపీడ దూరమగును.


॥ ఇతి శ్రీ శంకరాచార్యకృతం  ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్ ॥

Friday, 15 July 2016

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్యానం (తెలుగులో)




గురుభ్యోనమః

సౌందర్యలహరిని గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఆదిశంకరుల రచన అయిన ఈ స్తోత్రరత్నమును కొంతమంది శాక్తసంప్రదాయ గ్రంధమన్నారు. కొంతమంది వైష్ణవసంప్రదాయ గ్రంధమన్నారు. కొందరు పరిపూర్ణ భక్తిరస గ్రంథమన్నారు. ఇది తంత్రశాస్త్రగ్రంధమని అనని వారు అరుదు.
ఈ స్తోత్రమునకు అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ కాలంలోనూ అనేకమంది ప్రవచకులు సౌందర్యలహరిపై ప్రసంగించారు.

అయితే సామాన్యజనులకు అత్యంత ప్రయోజనకారిగా ఎన్నో క్లిష్టమైన విషయాలను అతి సులువుగా పామర భాషలో వివరిస్తూ కంచి పరమాచార్యులు సౌందర్యలహరిపై చేసిన వ్యాఖ్యానం మకుటాయమానమైనది. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం వలేనే, పరమాచార్యులవారి  సౌందర్యలహరి వ్యాఖ్య తరువాతి కాలంలో వచ్చిన అనేక ప్రవచనాలకు మూలము అని నిస్సంకోచంగా చెప్పవచ్చును.

దక్షిణామూర్తి ఆదిశంకరులుగా వచ్చి సౌందర్యలహరి నిబద్ధంచేస్తే, కామాక్షీదేవి పరమాచార్యులుగా వచ్చి ఆ సౌందర్యలహరికి వ్యాఖ్యను ప్రసాదించింది.

పరమాచార్యులవారు సౌందర్యలహరి శ్లోకాలను ఎంతో విస్తారంగా వ్యాఖ్యానించారు. అయితే సాధారణ జనులకు అవసరం ఉండదనుకున్న శ్లోకాలను, విషయాలనూ వదలివేశారు. ఒకచో శ్లోకాలలో కొన్ని పాదాలనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం అంతా తమిళభాషలో "దివైన్ కురత్తళ్", ఆంగ్లంలో "వాయిస్ ఆఫ్ గాడ్" పుస్తకాలలో లభ్యమవుతోంది. తెలుగులో, సుమారు ఒక దశాబ్దం క్రితం ఋషిపీఠం పత్రికవారు పరమాచార్యుల వ్యాఖ్యానాన్ని సంగ్రహంగా ప్రచురించారు. ఈ తెలుగుసేత ఇప్పుడు లభ్యంకావట్లేదు.

ఈరోజు మొదలు పరమాచార్యుల వ్యాఖ్యకు తెలుగు అనువాదం, కొంతమేరకు సంగ్రహంగా, ఈ బ్లాగ్లో / ఫేస్‍బుక్ పేజీలో ఉంచటానికి ప్రయత్నిస్తున్నాము.

అనేకమంది తెలుగువారైన అమ్మవారి భక్తులకు ఈ వ్యాఖ్యానం అందుటకు, మమ్ము పనిముట్లుగా వాడుకోమని అమ్మవారికి మా ప్రార్థన.

జయ జయ శంకర హర హర శంకర.

Tuesday, 29 March 2016

పరమాచార్యుల అమృతవాణి : గౌరీపూజ ఎందుకు చేయాలి ?


పరమాచార్యుల అమృతవాణి : గౌరీపూజ ఎందుకు చేయాలి ?
(జగద్గురుబోధల నుండి)

ఆంధ్రదేశంలోనూ, ఉత్తరదేశంలోనూ వివాహకాలంలో గౌరీపూజచేసే అలవాటొకటి చాలాకాలంనుంచీ వస్తున్నది. రుక్మిణీదేవి కృష్ణునే వివాహంచేసుకోవాలని సంకల్పించుకొని తనకోరిక నెరవేరడంకోసం గౌరీపూజచేసి కృష్ణుని భర్తగా పొందినట్లు భాగవతంలో మనం చదువుతున్నాం.

అయితే రుక్మిణీదేవి ఏ సరస్వతినో, లక్ష్మినో ఆరాధించక అందుకు అంబికనే ఎందుకు ఎన్నుకొంది? అవివాహితలైన కన్యలు పెండ్లికాగానే పాతివ్రత్యం పరిపాలించాలంటే, అన్నివిషయాలలోనూ భర్తకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎంతో చిత్తదార్ఢ్యం ఉంటేకాని అది జరిగేమాట కాదు. పతీత్వపాతివ్రత్యాల ఆకృతియే అంబిక. ఆమె దక్షునకు కూతురైనపుడు తన తండ్రి భర్తను దూషించినాడన్న కారణంచేత శరీరమే త్యాగంచేసింది. పార్వతిగా పుట్టినపిదపకూడా ఆపరమేశ్వరునే పెళ్లాడాలని ఉగ్రతపం చేసింది. తాను అనుకొన్న కార్యం సాధించింది.

లక్ష్మీదేవి పతివ్రతగా ఉన్నదంటే అందు పెద్దవిశేషమేమీ లేదు. అందమూ, చందమూ, అలంకారమూ, ఐశ్వర్యమూ ఉన్న మహాప్రభువు మహావిష్ణువు. అట్టివాడు భర్త అయితే ఎవతె అయినా పతివ్రతయే అయిపోతుంది. మాధవుని తీరు ఒకటి, మహాదేవుని తీరు మరొకటి. ఈయన ఉనికి వల్ల కాట్లో, పాములు మెడలో, కపాలం చేతిలో, ఇట్లా ఈయనది ఘోరమైన స్వరూపం.
యాతే రుద్ర శివాతనూ రఘోరాపాపకాశినీ,
అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 
(రుద్రము)

ఈమహాఘోరస్వరూపాన్ని భర్తగా వరించి, పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తూ, భర్తను తండ్రి దూషించినాడన్న కారణంగా శరీరత్యాగంచేసి, మరల అతనికై తపస్సుచేసి, అతనినే పెళ్ళిచేసుకొన్న పరమసతి సర్వమంగళను ఆరాధిస్తే పాతివ్రత్యమూ లభిస్తుంది, ఆమె అనుగ్రహమూ స్థిరంగా ఉంటుంది. స్త్రీకి పాతివ్రత్యం ఎంత ముఖ్యమో, పురుషులకు గురుభక్తి అంత ముఖ్యం.
ఓంకార పంజరశుకీ ముపనిష దుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపినమయూరీ మార్యా మంతర్విభావయేగౌరీం

దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం.

అని కాళిదాస మహాకవి అంబికాస్తవం చేశాడు. అందులో ఆచార్యస్వరూపము సాక్షాదంబికయే అని వ్రాశాడు.

అవటుతటఘటితచూలీం తాడితపలాశ తాటంకాం,
వీణావాదనవేలా కంపిత శిరసం నమామి మాతంగీమ్‌||

అనేది ఆయన వ్రాసినదే మరొకశ్లోకం. తాళీపలాశం అనగా తాటాకు. మాతంగికి తాటాకులే తాటంకాలట. అందుచేతనే గౌరీపూజలో నల్లపూసలూ, తాటాకు ఈనాటికిన్నీ వినియుక్తమవుతున్నవి. అందుచేత పెండ్లి చేసుకొనే కన్నెపడుచులు నిత్యకల్యాణంగా ఆనందంగా ఉండాలని కోరుకొనేటట్లయితే సర్వమంగళను ఆరాధించవలె.

అంబికను ఆరాధించేవారికి గురుభక్తీ పతిభక్తీ సులభము లయిపోతవి. రుక్మిణీదేవి గౌరీపూజ చేయడంకూడా అందుకోసమే. అంబిక తాటంకములను కాళిదాసు వర్ణించినట్లే శంకర భగవత్పాదులవారున్నూ వర్ణించినారు.
పురా రాతే రంతః పురమసి తత స్త్వ చ్చరణయో
స్సపర్యా మర్యాదా తరళ కరణానామ సులభా,
తథాహ్యేతే నీతా శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం
తవ ద్వారోపాస్త స్థితిభి రణిమాద్యాఖిరమరాః 
(సౌందర్యలహరి)

శ్రీచక్రము మహామేరు స్వరూపమైనది. అందు పలు ఆవరణ లున్నవి. ప్రతి ఆవరణకున్నూ అధిదేవత లున్నారు. బిందుస్థానమే పరాశక్తి. అది అన్నిటికంటె ముఖ్యమైనది. తక్కినవన్నీ చిన్న చిన్న శక్తిస్వరూపాలు. అంబిక ఉండే చింతామణి గృహంలో నవావరణ లున్నవి (తొమ్మిది ఆవరణలు). ఇవి ఒకదానికొకటి కోటియోజనాలదూరంలో ఉన్నవి. కడపటి ద్వారం అణిమాది అష్టసిద్ధులకై ఏర్పడినది. ఆద్వారానికిన్నీ అంబిక ఉన్న స్థానానికిన్నీ ఎంతో దూరము అయినప్పటికిన్నీ ద్వారోపాంతంలో నిలబడేసరికి ఆణిమాదిశక్తుల అనుగ్రహం చేత ఐశ్వర్యం లభిస్తుంది.

ఇంద్రాదిదేవతలు ఈతొమ్మిదవ ఆవరణనే దాటలేదు. అక్కడకు వచ్చేసరికి వాళ్లు అష్టవిభూతిశక్తుల అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళకు పరదేవతను చూడగల ఇంద్రియ నిగ్రహం లేదు. అసలు సనకాది యోగివర్యులకే లేదు. అంతఃపురంలోకి వెళ్ళవలెనంటే ఎంత ఇంద్రియనిగ్రహం ఉండాలి?

అట్టి అనుత్తరమైన శక్తి అంబికది. ఆమెయొక్క పరిపూర్ణచైతన్యము ముందు కలికాలపు జనులు ఆగలేరనియే, ఆచార్యులవారు జంబుకేశ్వరక్షేత్రానికి వెళ్ళినపుడు, అఖిలాండేశ్వరిని ప్రార్థించి, ఆమె శక్తిని ఆకర్షించి, రత్నమయమైన శ్రీచక్రాన్ని ఒక కర్ణంలోనూ, పంచాక్షరీయంత్రాన్ని మరొక కర్ణంలోనూ తాటంకాలుగా ప్రతిష్ఠచేసి ఆమెను సౌమ్య స్వరూపిణిగా చేశారు.

ఇంత మహిమ పరమేశ్వరునికి సిద్ధించిందంటే, దానికి మూలం నీ తాటంకమహిమే కదా అంటూ అఖిలాండేశ్వరి తాటంకాలను స్మరిస్తూ ఆచార్యులవారు ఈక్రిందిశ్లోకాన్ని సౌందర్యలహరిలో వ్రాసినారు.
సుధామప్యాస్యాద్యా ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధిశత మశాద్యా దివిషదః,
కరాళం యత్వేక్షళం కబళిత వతః కాలకలనా
నశం భో స్తన్మూలం జనని తాటంక మహిమా||

తమకు జరామరణాలుండరాదని అమృతం త్రాగారు. కాని ప్రళయకాలంలో వాళ్ళుకూడా విపత్తుపొందుతున్నారు. భయగ్రస్తులవుతున్నారు. కాని హాలాహలాన్ని మింగికూచున్న పరమేశ్వరుడుమాత్రం చెక్కుచెదరకఉన్నాడు. విషం తిని విశ్వేశ్వరుడు ఏ అభిప్రాయమూలేక సురక్షితంగా ఉంటే, అమృతపానం చేసిన అమరులు దిక్కులేక చస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, నీ తాటంకమహిమే అని ఆచార్యుల వారన్నారు.
యాతే రుద్ర శివాతనూః శివా విశ్వాహ భేషజీ,
శివా రుద్రస్య భేషజీ తథానో మృడజీవసే 
(రుద్రము)

'పరమేశ్వరా నీవు పుట్టినావు సరే నీకు మందు ఎవరిస్తున్నారు? రెండురకాలయిన శరీరాలున్నాయి నీకు. అందులో ఒకటి ఘోరమైనది. మరొకటి మంగళకరమైనది. ఘోర స్వరూపము నీది. పరమమంగళస్వరూపముతో విలసిల్లుతున్న దేహమున్నదే అది అంబికది. ఈవిశ్వానికంతా ఆ విశ్వేశ్వరి ఔషధప్రాయంగా ఉన్నది. ఆమె కటాక్షముంటే చాలు. అకాలమృత్యువనే మాట ఆ చుట్టుప్రక్కల ఎక్కడా వినబడదు. నీకున్నూ ఆమెయే భేషజియై, వైద్యం చేస్తున్నది కాబోలు. పరమమంగళకరమైన ఆమె శరీరం నిన్ను అంటిపెట్టుకొని ఉండటం వల్లనే జీవిస్తున్నావు'.
శివః శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి,
అత స్త్యా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి. 
(సౌందర్యలహరి)

శివుడు శక్తితో కలిస్తేనే జగన్నిర్మాణశక్తి కల్గినవాడవుతాడు. లేకపోతే ఆయనకు కదలటానికి కూడా సత్తువ ఉండదు. పరాశక్తి పరమేశ్వరునికే మూలశక్తిగా ఉన్నది. అటువంటి అంబికను ఆరాధించాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? భర్తయొక్క ఘోరస్వరూపంవల్ల అంబికా పాతివ్రత్యం మరింత ప్రకటితమవుతున్నది. అందుచే ఆమెను ఆరాధించేవారికి ప్రాతివ్రత్యమూ, మంగళమూ, దృఢచిత్తమూ సులభంగా లభిస్తవి.

Monday, 28 March 2016

శంకరవాణి : త్రిపురసుందరీ ధ్యాన శ్లోకం





సకుఙ్కుమవిలేపనామలకచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥
కుంకుమతో కలిసిన విలేపనమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ, చిరునవ్వులతో కలసిన కన్నులు కలదీ, పుష్పబాణమును - చెరకువింటినీ - పాశాంకుశములనూ ధరించినదీ, అశేషజనులను మోహింపచేయునదీ, ఎర్రని పూలదండలను - ఆభరణములను - వస్త్రములను ధరించినదీ, జపాపుష్పమువలే ప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించెదను.

Tuesday, 15 March 2016

ముద్దుస్వామిదీక్షితులకృతి : అన్నపూర్ణే విశాలాక్షీ








అన్నపూర్ణే విశాలాక్షీ

సామ/ఆది

పల్లవి:
అన్నపూర్ణే విశాలాక్షి అఖిలభువనసాక్షి కటాక్షి

ఉన్నతగర్తతీరవిహారిణి ఓఙ్కారిణి దురితాదినివారిణి

మధ్యమకాలసాహిత్యం:
పన్నగాభరణ రాఙ్ఞీ పురాణి పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి

చరణము:
పాయసాన్నపూరిత మాణిక్యపాత్ర హేమదర్వీ విధృతకరే
కాయజాది రక్షణ నిపుణతరే కాఞ్చనమయ భూషణామ్బరధరే

మధ్యమకాలసాహిత్యం:
తోయజాసనాది సేవితపరే తుమ్బురు నార్స్దాది నుతవరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపదశోభిత గురుగుహసాదరే

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.