Showing posts with label వ్రత కథలు. Show all posts
Showing posts with label వ్రత కథలు. Show all posts

Thursday, 24 March 2016

స్త్రీలవ్రతకథలు - కుంకుమగౌరి నోము కథ

                              
                                కుంకుమగౌరి నోము కథ

ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో బాలవితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయి అగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమికావలెను?  అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండునట్లు  చేయమని ప్రార్థించెను. అప్పుడాలోక జనని" ఓయీ బ్రాహ్మణోత్తమా!  నీ కుమార్తె పూర్వ జన్మమున  కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది , ఇప్పుడు ఆమెచేత ఆ నోము నోయించినచో ఆ కష్టము సంభవించదని " చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి ఆమెచే నోము నోయించి తరవాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉండెను.

ఉద్యాపన:  
పదమూడు భరిణెలనిండా కుంకుమ పోసి , నల్లపూసలు , లక్కజోళ్ళు , దక్షిణ తాంబూలములు పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయనము ఇవ్వవలెను.

స్త్రీలవ్రతకథలు - గడపగౌరి నోము కథ


 
                                        గడపగౌరి నోము కథ

గడపగౌరి నోము నోచిన పడతికి గడుపరానంతటి గండములుండవు , గౌరీశంకరుల కరుణకు కొదవుండదు. బడయగ లేనట్టి భాగ్యము లుండవు.అని పఠించి అక్షతలు ధరించవలెను.

విధానము:
 ఒక సంవత్సరము పొడుగునా ప్రతిదినము ఉదయము వేళ ఒక ఇంటి  గడపకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టవలెను , తరువాత ఉద్యాపనము చేయవలెను.

ఉద్యాపన:
పై విధముగా ఒక ఏడాది చేసిన పిమ్మట ఒక పళ్ళెములో  పదమూడు జతల గారెలు , ఒక క్రొత్తచీర , ఒక రవికెల గుడ్డ , మంగళసూత్రాలు , రూపు , మట్టెలు , పసుపు , కుంకుమ ఉంచి దక్షిణ తాంబూలములతో  ఒక  ముత్తైదువుకు  వాయనము ఇవ్వవలెను.

Sunday, 20 March 2016

స్త్రీలవ్రతకథలు - కల్యాణగౌరి నోము కథ

                                  కల్యాణగౌరి నోము కథ

కల్యాణ గౌరి నోము నోచిన కలికికి కలుగును , భాగ్యాలు , కలకాల సుఖములు , అనుకొని అక్షతలు వేసుకొనవలెను. ప్రతిరోజు ఒక ముత్తైదువునకు తలదువ్వి్ , బొట్టుపెట్టి పంపవలెను. అట్లు ఒక ఏడు చేసిన తర్వాత ఉద్యాపనము చేసుకొనవలెను.

  ఉద్యాపన:
 
 ఒక పళ్లెములో మట్టెలు, మంగళసూత్రములు, కుంకుమ,పసుపు,గంధము అక్షతలు,పన్నీరు,అత్తరు పూలదండలు,కొత్తకోక,రవికెలగుడ్డపెట్టి పెండ్లిపీటల మధ్యనుండి లేచిన పెండ్లికూతురునకు వాయనము నొసంగవలెను, కథ తప్పినను వ్రతము తప్పరాదు, భక్తి  తప్పకుండిన యెడల ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - వెలగలగౌరి నోము కథ

                                    వెలగలగౌరి నోము కథ

శ్లో: వెలగ వెలగ యనరాదు వెలగపండు తినగరాదు
        వెలగనీడ నిలువరాదు వెలగను వేల చూపరాదు

ఉద్యాపన:

పై మాటలనుకొని అక్షతలు వేసుకొనవలయును. ముచ్చికలతో ఉన్న పదమూడు జతల వెలగకాయలను తెచ్చి పదముగ్గురు పుణ్యస్త్రీలకు లక్కజోళ్ళు , నల్లపూసలు , దక్షిణ, తాంబూలములను పెట్టి వాయన మీయవలెను. కథ లోపమైననూ వ్రత లోపము ఉండరాదు.

స్త్రీలవ్రతకథలు - లక్షపసుపు నోము కథ

                                   
                                      లక్షపసుపు నోము కథ

శ్లో:  లక్ష పసుపు నోము పట్టవే తల్లి!
         లక్షణముగ సౌభాగ్యమందవే తల్లి!
          అక్షయ సౌభాగ్యమందవేతల్లి!
           లక్షలవేలేండ్లుగా రాణించవేతల్లి!    
అని అనుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపనము చేసుకోవలెను.

 ఉద్యాపన:
నడుము విరగకుండ నున్న లక్షపసుపు కొమ్ములను ఏరుకొని వాటిని ఇంటిదగ్గర పంచిపెట్టవలెను.దోసెడుకు తక్కువ కాకుండా పంచిపెట్టవలెను. వాటితోబాటు తోచినంత కుంకుమ కూడా ఇవ్వవలెను. ఈ కుంకుమను ముందుగా లక్ష్మికో, గౌరికో పూజ చేసి తరువాత పంచిపెట్టవలెను.

Friday, 18 March 2016

స్త్రీలవ్రతకథలు : ఉదయకుంకుమ నోము కథ



ఉదయకుంకుమ నోము కథ

( వివిధ ప్రాచీన/నూతన వ్రతకథల పుస్తకాలనుండి)

ఉదయకుంకుమ నోము పట్టిన ఉవిదయున్న పట్టణమున వెదకినను వెధవలేదు.

విధానము:

ప్రతిరోజూ ఉదయమే శుచియై 2-3 వీధుల చొప్పున ఒక సంవత్సరము పాటు గ్రామంలోని కన్యలకూ , ముత్తైదువులకూ అందరికీ కుంకం బొట్లు పెట్టాలి.అనంతరం సంవత్సరం తరువాత ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపన:

ఒక ముత్తైదువునకు తెల్లవారకుండా తలంటి నీళ్ళుపోసి తానునూ తలంటుకుని నీళ్ళుపోసుకుని చీర , రవికలగుడ్డయు ఆ ముత్తైదువునకు ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టి కుంకుమ భరిణి , దక్షిణ , తాంబూలము లొసంగి ఉద్యాపన చేసికొనవలెను. కథ తప్పిననూ వ్రతము తప్పదు . భక్తి ఉన్న ఎడల ఫలము తప్పదు.

స్త్రీలవ్రతకథలు - గాజుల గౌరి కథ



                                        గాజుల గౌరి కథ  
                                 
ఒక బ్రాహ్మణుని కోడలు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెను చూచి అంతా చిటపటలాడుచుండేవారు. అత్త , మామ , మగడు , ఆడపడచులు , తోటికోడళ్ళు అందరూ ఆమెను చూసి చిటపటలాడుచుండెరివారు. అప్పుడు ఆ చిన్నది విచారిచుచూ అడవిలోకిపోయి తిరుగుచుండెను. అంతట పార్వతీపరమేశ్వరులు భూమిపాలించుటకు వచ్చి , ఆ చిన్నదాన్ని చూచి ఏమి? అలా విచారించుచూ తిరుగుచున్నావు అని అడిగిరి. అందుకు ఆమె ఇరుగు పొరుగు అత్తామామా మగడు నన్ను చూస్తే కోపంగా ఉంటారు . అందుచేత అందరికీ కోపము అయితే ఎట్లు బ్రతకనని ఇలా తిరుగుచున్నానని చెప్పెను. అలా కాదమ్మా ! నీవు గాజుల గౌరి నోము పట్టి ఉల్లంఘన చేసినావు . ఆకారణమున నిన్ను చూచిన అందరికీ కోపముగానున్నది. నీవు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారము ఆమె ఇంటికి వెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగా ఉద్యాపన చేసికోగా అప్పటినుండి ఆమె అందరికీ ఇష్టముకలదయ్యెను.

ఉద్యాపన:

ఒక ముత్తైదువును తీసుకుని వచ్చి ఆమెకు ఇష్టమైన గాజులు తొడిగించి , తలంటి నీళ్ళుపోసి , చీర రవికలగుడ్డ ఇచ్చి పిండివంటలతో భోజనము పెట్టవలెను. భక్తి తప్పినా ఫలము తప్పదు. కథ లోపమైననూ వ్రతలోపము కాకూడదు.

స్త్రీల వ్రత కథలు - పసుపు గౌరి నోము కథ



 
పసుపు గౌరి నోము కథ

నూరు పసుపు తోడ నోచిన కాంతకు నూఱు వేలేండ్లు అయిదవతనము. కొట్టు పసుపు నోచిన కాంతకు కోటివేలయేండ్లు అయిదవతనము. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకుని ఏడాది అయిన తరువాత ఉద్యాపన చేయవలెను.

ఉద్యాపన: 
 

మానెడుసోలెడు పసుపు వెదురు పెట్టెలో పోసి రవికలగుడ్డ , దక్షిణ , తాంబూలము , నల్లపూసలు , లక్కజోళ్ళు , కుంకుమ కలిపి ఒక ముత్తయిదువుకి వాయనమీయవలెను. కథ లోపమైన వ్రతలోపము ఉండరాదు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.