Sunday 31 July 2016

కామేశ్వరీ కామేశ్వరులు : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-8




కామేశ్వరీ కామేశ్వరులు
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-8

మంత్రశాస్త్ర ప్రావీణ్యులకూ, సిద్ధులకూ, భక్తిమార్గం ద్వారా పండినవాళ్ళకూ అమ్మవారు అయిదుగురు దేవతలపై కూర్చుని సాక్షాత్కరిస్తుంది. రాజరికం ఉట్టిపడుతుండగా రాజరాజేశ్వరిగా కనిపిస్తుంది. ఆమె ఆసనం ఏంటి ? బ్రహ్మ, విష్ణు,  రుద్ర మహేశ్వరులు ఆ ఆసనమునకు నాలుగు కాళ్ళు. ఈ నాలుగు కాళ్ళనూ కలిపే పీఠం సదాశివుడు.

పంచకృత్యములూ నిర్వర్తించే బ్రహ్మాదులు ఆసనంగా కలిగిన అమ్మవారు - ఆ సంపూర్ణ బ్రహ్మ-శక్తి - కామేశ్వరి గా పిలువబడుతుంది. ఆమె యొక్క ఈ రూపంలో ఆమె భర్త , పరబ్రహ్మము, కామేశ్వరునిగా పిలువబడతాడు.

జగత్తులోని అన్ని కార్యకలాపములకూ ఆమెదే బాధ్యత అయినప్పుడు, ఆమెకు కామేశ్వరుడనే పేరుతో ఒక భర్త ఎందుకు ఉండాలి ?

అన్నీ ఆమెయే అయినప్పటికీ, ఆమె అనేక రూపములలో ఒకటి అయిన శ్రీవిద్యగా ఉన్నప్పుడు, ఆమె ప్రధాన లక్షణం మాతృత్వం. పిల్లవాడు తల్లిని ప్రేమతో పట్టుకుని వ్రేలాడినట్లు, ఆమెను మనం భక్తితో ప్రేమించాలి. ఆమె మహాశక్తి అయినప్పట్టికీ ఈ రూపంలో ఆమె శక్తి కాక సౌందర్యమూ, లావణ్యమూ ప్రధానముగా వ్యక్తమవుతుంది. అందుకనే "శ్రీమాతా" అని ఆమెకు లలితా సహస్ర నామములలో మొదటిపేరు. ఆమె మనను సృష్టి చేస్తుంది, రక్షిస్తుంది, జన్మల మధ్యలో సంహరించి విశ్రాంతినిస్తుంది. మాయతెరతో లీలావినోదం చేస్తుంది. చివరికి, తల్లిగా, ముక్తిని ప్రసాదించి తనలో కలిపివేసుకుంటుంది.  ఆమె తల్లిగా ఉన్నప్పుడు, తండ్రిగా ఎవరైనా ఉండాలి కదా. తండ్రి లేకుండా తల్లి ... జగన్మాతను మనం వేరువిధంగా అనుకోగలమా ? ఆమెయే బాలాదేవి, ఆమెయే కన్యాకుమారి, కానీ అది వేరే సంగతి. అలాగే దుర్గ రూపంలో వచ్చి ఆసురీశక్తులను నశింపజేసినప్పుడూనూ. (ఇప్పుడు మనం చెప్పుకుంటున్న) అమ్మవారు తల్లి, శ్రీమాత. కాబట్టి ఆమెకోసం ఒక తండ్రి కావాలి. అందుకనే మనకు కామేశ్వరుడు (కామేశ్వరి కోసం) భర్త గా ఉన్నాడు. అందుకనే, ప్రపంచధర్మాన్ని అనుసరించి, అతనికి ఉన్నత స్థానం ఇవ్వబడింది.  లలితా త్రిశతి కామేశ్వరుడి భార్యగా అమ్మవారికి 15 నామములు చెబుతుంది.

ఆమె, రాజరాజేశ్వరి, లలిత, త్రిపురసుందరి మొదలైన పేర్లతో పిలువబడినప్పటికీ కామేశ్వరి అనే పేరుకు ఒక విశిష్టత ఉంది. శైవ సాంప్రదాయంలో శివుడు శక్తితో కలసిఉన్నట్లు ఎలా చెప్పబడతాడో, శాక్త సంప్రదాయములోనూ, శ్రీవిద్యా తంత్రములోనూ, ఆమె, శక్తి, తన భర్త అయిన శివునితో కలసి ఉన్నట్లు చెప్పబడుతుంది. అవిభాజ్యమూ, సంపూర్ణమూ అయిన బ్రహ్మ-శక్తి యొక్క భర్త ఎవరు కాగలరు ? బ్రహ్మ-శక్తి తప్ప వేరొకటి లేనప్పుడు ఎవరు భర్త కాగలరు ? ఈ ప్రశ్న విషయమై మీరు కొంత ఆలోచిస్తే, నిశ్చల నిర్గుణ బ్రహ్మము, తన శక్తిని అంతర్లీనంగా ఉంచి ఆ శక్తికన్నా వేరుగా అగుపించే శివుడే ఆమెకు భర్త కాగలడని తెలుస్తుంది. అంటే, పంచకృత్యములకూ బాధ్యురాలైన భార్య ద్వారా తన శక్తిని శివుడు ప్రకటిస్తున్నాడని అర్థం. తన శక్తిని నేరుగా ప్రదర్శించకపోయినా, నిష్క్రియాపరత్వం వహించినా, శివుడు,  తన శక్తి బహిర్గతం చేయాలని (కార్యనిర్వహణ చేయాలని) కాంక్షిస్తున్నాడనీ తెలుస్తుంది.

తైత్తరీయ ఉపనిషత్తు ఈ విధంగా చెబుతుంది " ఆ ఏకైక బ్రహ్మము అనేకములు అవవలెనని కోరుకున్నది". నిశ్చల బ్రహ్మము, క్రియాశీలి అయిన బ్రహ్మముగా మారినప్పుడు, అలా క్రియాశీలంగా అవాలనే కోరిక ఉండి ఉండాలి కదా ? "అకామయత" "కోరుకున్నది" అనే పదం ఉపనిషత్తులోనిదే. జ్ఞానశక్తి అంతర్లీనంగా ఉన్న బ్రహ్మము లేదా శివము , ఆ శక్తిని - "బ్రహ్మ-శివ-శక్తిని" - ప్రకటించి, జగద్వ్యాపారం నిర్వహించాలని కోరుకున్నది. దీనిని "ఇచ్చాశక్తి" అంటారు.  పంచకృత్యములను నిర్వహించే శక్తి "క్రియాశక్తి". సరే. మనం ప్రస్తుత విషయానికి వద్దాము. బ్రహ్మము తనంతట తను బహిర్ముఖమైనప్పుడు మొదట తనకు కోరిక పుడుతుంది. ఉపనిషత్తు దానిని "కామము" అంటుంది. ఈ పదానికి అసహ్యకరమైన అర్థమేమీ లేదు. "స్వచ్చమైన కాంక్ష" అని ఇక్కడ అర్థము. (శారీరకవాంఛలతో సంబంధములేని కోరిక). బ్రహ్మమునుండి, సంపూర్ణమైన బ్రహ్మ-శక్తినుండి తొలుత కామము ఉద్భవించింది,  బ్రహ్మమునుండి పుట్టి, దాని కన్నా భిన్నంగా ఉన్న తొలి వస్తువు అది. ఈ కామమే అతడి భార్య అయినది. తండ్రి, తల్లి ఏకమై ప్రజలకు జన్మనిచ్చినట్లు, ఈ జగత్తు నడిపే లీలావినోదం అంతా జడబ్రహ్మమైన శివుడు, ఇచ్చాశక్తులు ఏకమవడము యొక్క ఫలము, పంచకృత్యములు కూడా అంతే. కాబట్టి వీరిద్దరూ భార్యాభర్తలయ్యారు. అమ్మవారు ఆయన కామము యొక్క స్వరూపము కాబట్టి ఆమె కామేశ్వరి అయ్యింది.

అది (కామేశ్వరి) మెదటి పేరు. పరబ్రహ్మమునుండి తొలుత ఉద్భవించినది "కామము" కాబట్టి, తదనుసరించి వచ్చిన పేరు "కామేశ్వరి" అనునది బ్రహ్మ-శక్తి యొక్క ముఖ్యమైన నామము అయ్యిఉండాలి. కోరిక ఉన్నవాడు కామేశ్వరుడు. పరబ్రహ్మము కోరిక ప్రకటించడం తప్ప వేరొకటి చేయలేదు. ఈ కోరికను క్రియారూపంగా మార్చి పంచకృత్యములనే జగత్క్రీడ నిర్వహించడం, పూర్తిగా శక్తిదే. విక్టోరియా, ఎలిజబెత్తుల వలె కామేశ్వరికి సార్వభౌమాధికారం ఉంది. శక్తి అన్ని భువనాలనూ, జీవరాశినీ, దేవతలనూ పాలిస్తుంది. పాలించే ప్రభువు యొక్క భార్యను మనం "రాణి" అని వ్యవహరించలేము. రాణి తను పాలించగలిగి ఉండాలి. లలితా సహస్ర నామములలో తొలిపేరైన "శ్రీమాతా" (మనం ఆప్యాయంగా తల్లి అనుకుంటాం), తరువాతి రెండు నామములూ సామ్రాజ్ఞియై అన్ని భువనములపై ఆధిపత్యం ఉన్న ఆ దేవి జగత్సార్వభౌమత్వాన్ని సూచిస్తాయి. ఆ నామములు - "శ్రీమహారాజ్ఞీ" మరియూ "శ్రీమత్సింహాసనేశ్వరీ".

అమ్మవారు సింహాసనమునధిష్టించడము అనేది ఒక అంశము. కానీ రాజులూ, రాణులూ అందరూ సింహాసనముపై కూర్చుంటారు కదా. నేను మీకు ఇదివరలో చెప్పినట్లు, గమనించవలసిన అంశమేమంటే - అమ్మవారికి ’పంచబ్రహ్మాసనమనే’ విశేష సింహాసనము ఉన్నది. ఆమె దానిపై కామేశ్వరిగా కూర్చుంటుందనీ, ఒక్కత్తెయే కాక కామేశ్వరునితో సహా కూర్చుంటుందనీ కూడా మీకు చెప్పాను. ఆమె ఆ పంచబ్రహ్మాసనము మీద కామేశ్వరుని అంకము (తొడ) పై కూర్చుంటుంది. కాబట్టి అతడూ ఆమెకు ఆసనమే అవుతాడు.

పరబ్రహ్మమునుండి జగల్లీలావినోదం నడుపుటకు తొలుత కామము జనించింది. కాబట్టి ఆదిదంపతులకు కామేశ్వరీ కామేశ్వరులనే నామములు ఇవ్వబడ్డాయి.

అమ్మవారిని లలితాంబ అంటాము. ఆయనను లలితేశ్వరుడని వ్యవహరించము. లలిత అంటే సున్నితత్వం, సౌకుమార్యం, మృదుత్వం. స్త్రీత్వం వహించి ఆమె అలా ఉండవచ్చు. ఆయన కాదు. అలాగే ఆమె రాజరాజేశ్వరి అని పిలువబడినా ఆయనకు రాజరాజేశ్వరుడనే పేరు లేదు. తంజావూరులో రాజరాజేశ్వరం ఉన్నది, కానీ ఆ పేరు ఆ దేవాలయం నిర్మించిన రాజు పేరు (రాజరాజచోళుడు) నుండి వచ్చింది. ఆ దేవాలయమును దేవుని పేరుననుసరించి బృహదీశ్వరాలయమని పిలుస్తారు. ఆమె మహారాజ్ఞి, జగత్తును పాలించటానికి ఏకైక అధికారి కాబట్టి రాజరాజేశ్వరితో జతకట్టడానికి రాజరాజేశ్వరుడు లేడు. విక్టోరియా రాణి భర్త ఆల్బర్ట్ వలె, ఎలిజబెత్ -2 రాణి భర్త ఫిలిప్ వలె మహారాజ్ఞి భర్త ఉంటారు. ఈ పోలిక కూడా సరికాదు. విక్టోరియా రాణి, లేదా ప్రస్తుత రాణి ఎలిజబెత్ , పార్లమెంటుకు జవాబుదారీ. రాజరాజేశ్వరి సర్వస్వతంత్ర సార్వభౌమ శక్తి.

అమ్మవారు పాలకురాలు. మహారాజ్ఞి. అందుకే ఆమెను రాజరాజేశ్వరి అని పిలుస్తారు. ఆమె భర్తకు పాలనాధికారం లేదు. కాబట్టి ఆయనను రాజరాజేశ్వరుడనలేము. అమ్మవారికి త్రిపురసుందరి అనే నామము ఉన్నది. మీతో చెప్పినట్లు ఈ త్రిపురసుందరియే సౌందర్యలహరియందలి విషయము. త్రిపురసుందరితో జతకట్టడానికి త్రిపురసుందరుడు లేడు. త్రిపురసుందరి యొక్క సౌందర్యం సర్వశ్రేష్ఠము. ముల్లోకాలలోనూ ఆమె వంటి సౌందర్యం వేరెవరకూ లేదు. శివుని అందం ఆమెతో పోల్చదగినది కాదు. కాబట్టి ఆయనను త్రిపురసుందరుడు అని అనరు. ఆమె సౌందర్యం సర్వశ్రేష్ఠము అన్న తరువాత ఆ మాటయే ఆయనకూ ఎలా చెప్పగలము ? ఎంత అందగాడైనా సరే, ఆమె తరువాతయే. కాబట్టి ఆయన త్రిపురసుందరుడు కాదు.

ఒండొరులపై వాంఛ జనించటానికి, ఇద్దరు కావాలి. కాబట్టి మనకు అందమైన జంట కామేశ్వరీకామేశ్వరులు ఉన్నారు. ఆమె, పరబ్రహ్మము యెక్క సంపూర్ణ శక్తియై, పరబ్రహ్మము ప్రకటించిన కామమునకు సంబంధించినది కావున కామేశ్వరి అని పిలువబడుతూ, తన భర్త అయిన కామేశ్వరునితో కలసి పంచబ్రహ్మాసనముపై కూర్చుని, జగన్నాటకమనే తన లీలను నడుపుతోంది.

(సశేషం)

Saturday 30 July 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వృధా కార్యకలాపాలు వదలిపెట్టడం



రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  వృధా కార్యకలాపాలు వదలిపెట్టడం
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

నాశ్రేయసి రతో విద్వా న్న విరుద్ధకథారుచిః |
ఉత్తరోత్తర యుక్తౌ చ వక్తా వాచస్పతి ర్యథా ||


(అయోధ్యాకాండ తొలి సర్గ)

శ్రీరాముడు మంచి జ్ఞానము కలవాడు అగుట చేత ప్రయోజనకారులు కాని వ్యర్థ కర్మలయందు ప్రవర్తించెడివాడు కాదు. క్షత్రియులు వినోదముకై సాగించెడి జూదము మొదలైనవి కూడ శ్రీరామునకు రుచించెడివి కావు. శ్రీరాముడు విరుద్ధ కథలయందు రుచి కలవాడు కాదు. తనకు శ్రేయస్సు కలిగించనివి, ధర్మమునకు విరుద్ధములైనవి అగు ప్రసంగములు చేయుటయందు అతనికి రుచి ఉండెడిది కాదు.  సరసముగ తన తోడివారితో హాస్య ప్రసంగములు చేయలేకపోవుట అతని  అసామర్థ్యమువలన కాదు. ధర్మవిరుద్ధములని, శ్రేయస్కరములు కావని వానియందు ప్రవర్తించెడివాడు కాదు. లోకములో గాని, వైదికులతోగాని ధర్మబద్ధ్మగు ప్రసంగము చేయునప్పుడు వారు చేసెడి వాదములకు ప్రతివాదముచేయుటలో బృహస్పతి వంటి నేర్పుకలవాడు.

శంకరస్తోత్రాలు : సుబ్రహ్మణ్యభుజంగం



శంకరస్తోత్రాలు : సుబ్రహ్మణ్యభుజంగం

సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధానే
విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః ॥ 1 ॥


ఎల్లప్పుడూ బాలరూపములో ఉన్ననూ కొండలవంటి విఘ్నములను పగలగొట్టునదీ, పెద్ద ఏనుగుముఖము కలదైననూ సింహముచేత గౌరవింపదగినదీ, బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే అన్వేషింపబడునదీ, ’గణేశ’ అను పేరుగలదీ అగు ఒక మంగళమూర్తి నాకు సంపద కలిగించుగాక.

నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖా న్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్‌ ॥ 2 ॥


నేను శబ్దమునెరుగను. అర్థమునెరుగను, పద్యమునెరుగను, గద్యమునెరుగను. ఆరు ముఖములుగల చిద్రూపము ఒక్కటే నా హృదయమునందు ప్రకాశించుచున్నది. నోటినుండి చిత్రముగా మాటలు వెలువడుతున్నవి.

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్‌|
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజేలోకపాలమ్‌॥ 3 ॥


మయూర వాహనుడూ, వేదాంత మహావాక్యములలో నిగూఢముగా నున్నవాదూ, మనోహరమైన దేహముగలవాదూ, మహాత్ములమనస్సులందు నివసించువాడూ, బ్రాహ్మణులదు ఆరాధింపదగినవాడూ, వేదములభావమైనవాడూ, ఈశ్వరుని తనయుడూ, లోకపాలకుడూ అయిన సుబ్రహ్మణ్యుని సేవించుచున్నాను.

యదా సన్నిధానం గతామానవా మే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ |
ఇతి వ్యంజయ న్సిన్ధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్‌ ॥ 4 ॥


"మానవులు ఎప్పుడు నావద్దకు వచ్చిరో అప్పుడే సంసారసాగరమును దాటిపోయిరి" అని తెలియబరచుచూ సాగరతీరమందున్న పవిత్రుడైన పరాశక్తి పుత్రుడను స్తుతించుచున్నాను.

యథాబ్ధే స్తరంగాలయం యాన్తితుంగా
స్తథైవాపద స్సన్నిధౌ సేవతాంమే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయన్తం
సదా భావయే హృత్సరోజే గుహం తమ్‌ ॥ 5 ॥


"ఎగసిపడు సముద్ర తరంగములు (ఒడ్డున ఉన్న) నన్ను చేరి ప్రశాంతమగునట్లుగా (లయమగునట్లుగా) నా వద్దకు వచ్చి సేవించువారి ఆపదలు నశించిపోవును" అని చెప్పుచున్నట్లుగా మానవులకు సముద్ర తరంగములను చూపుచున్న గుహుని నా హృదయపద్మము నందు సదా భావించెదను.

గిరౌ మన్నివాసే నరా యేఽథిరూఢా
స్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః |
ఇతీవ బ్రువన్‌ గంధశైలాధిరూఢః
స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు ॥ 6 ॥


"నేను నివసించు కొండపై నెక్కిన మానవులు వెండికొండపై (కైలాసము) నెక్కినట్లే" అని చెప్పుచున్నట్లుగా గంధమాదన శైలమునధిష్టించిన ఆ షణ్ముఖదేవుడు ఎల్లప్పుడూ నాకు సంతోషమునిచ్చుగాక.

మహాంభోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతమ్‌ ॥ 7 ॥


మహా సముద్రతీరమందున్నదీ, మహా పాపములు హరించునదీ, మునీంద్రులకు అనుకూలమైనదీ అగు గంధమాదన పర్వతము నందలి గుహలో నివసించుచూ తన తేజస్సుతో ప్రకాశించుచూ జనులబాధలను తొలగించుచున్న గుహుని ఆశ్రయించెదను.

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్క తుల్యప్రకాశం
సదా భావయే కార్తికేయం సురేశమ్‌ ॥ 8 ॥


మానవులకోర్కెలు తీర్చు స్వర్ణభవనములో మాణిక్యములచే నిర్మించబడిన పూలపాన్పుపై వేయి సూర్యులకాంతి తో ప్రకాశించుచున్న దేవప్రభువగు కార్తికేయుని ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను.

రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే |
మనష్షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే ॥ 9 ॥


ఓ స్కందుడా! హంసల కూతలవలె ధ్వనించు అందెలు కలదీ, అందమైనదీ, మిక్కిలి ఎఱ్ఱనిదీ, మనోహరలావణ్యామృతముతో నిండిన నీ పాదపద్మమునందు సంసారబాధలతో తపించుచున్న నా మనస్సు అనే తుమ్మెద ఆనందించుగాక.

సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్‌ !
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద తే దీప్యమానామ్‌ ॥ 10 ॥


ఓ స్కందుడా! బంగారు కాంతి కల దివ్య వస్త్రములను ధరించినదీ, మ్రోగుచున్న చిరుమువ్వలు పొదిగిన మొలత్రాటితో శోభిల్లచున్నదీ, బంగారు పట్టాతో మెరయుచున్నదీ అగు నీ నడుమును ధ్యానించుచున్నాను.

పులిందేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్‌ |
నమస్యామ్యహం తారకారే తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్‌ ॥ 11 ॥


ఓ తారకాసుర సంహారీ! కిరాతకన్య అగు వల్లీదేవి ఉన్న స్తనములవలన ఆలింగనముచే కుంకుమతో ఎఱ్ఱనైనదీ,  తన భక్తులను రక్షించుటలో సర్వదా అనురాగము కలదీ అగు నీ వక్షస్థలమును నేను నమస్కరించుచున్నాను.

విధౌక్లృప్తదణ్డాన్‌ స్వలీలాధృతాణ్డాన్‌
నిరస్తేభశుభ్డాన్‌ ద్విషత్కాలదణ్డాన్‌
హతేంద్రారిషణ్డాన్‌ జగత్రాణశౌణ్డాన్‌
సదాతే ప్రచణ్డాన్‌ శ్రయే బాహుదణ్డాన్‌ ॥ 12 ॥


విధిని కూడా దందించునవీ, బ్రహ్మాండమును మ్రోయుచున్నవీ, ఏనుగుల తొండములకంటే బలమైనవీ, శత్రువులకు యమదండములైనవీ, రాక్షసులను సంహరించునవీ, లోకములను రక్షించునవీ, ప్రచండములైనవీ, అయిన నీ బాహుదండములను నేను ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
స్సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్‌ |
సదా పూర్ణబింబాః కలంకై శ్చ హీనా
స్తదా త్వన్ముఖానాం బృవే స్కందసామ్యమ్‌ ॥ 13 ॥


శరత్కాలమందలి ఆరు చంద్రబింబములు ఎల్లప్పుడూ అంతటా ప్రకాశించుచూ, పూర్ణబింబములై. కళంకము లేనివి అయినచో, ఓ స్కందుడా, నీ ముఖములతో సమానమని చెప్పెదను.

స్ఫురన్మన్దహాసైః సహంసానిచఞ్చ
త్కటాక్షావలీ భృఙ్గ సఙ్ఘోజ్వలాని |
సుథాస్యన్ది బిమ్బాధరాణీశ సూనో
తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి ॥ 14 ॥


ఓ ఈశ్వరుని కుమారుడా!  చిరునవ్వులు అనే హంసలూ, చంచలమైన కటాక్షములు (క్రీగంటిచూపులు) అను తుమ్మెదలూ, అమృతము స్రవించు దొండపండువంటి పెదవులూ కల నీ ఆరు ముఖపద్మములను దర్శించుకొనుచున్నాను.

విశాలేషు కర్ణాన్తదీర్ఘేష్వజస్రం
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు |
మయీషత్కటాక్ష స్సకృత్పాతితశ్చే
ద్భవేత్తే దయాశీల కానామహానిః ॥ 15 ॥


ఓ దయాశీలుడా! విశాలమైనవీ, ఆకర్ణాంతములూ, ఎల్ల్ప్పుడూ దయనొలికించుచున్నవీ అయిన నీ పన్నెండు కన్నులలోని కటాక్షము,  ఒక్కసారి , కొంచెముగా నాపై ప్రసరింపజేసినచో, నీ కేమి నష్టము ?

సుతాఙ్గోద్భవో మేఽసి జీవేతి షడ్ధా
జపన్మన్త్ర మీశో ముదా జిఘ్రతే యాన్‌ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః ॥ 16 ॥


ఓ జగన్నాథా!  " ఓ కుమారా, నీవు నా శరీరమునుండి పుట్టితివి, ’చిరంజీవ’ " అని ఆరుసార్లు మంత్రమును చదువుతూ శివుడు ఆఘ్రూణించునవీ, ప్రపంచభారమును మ్రోయునవీ, కిరీటములతో ప్రకాశించునవీ అగు నీ ఆరు శిరస్సులకు నమస్కారము.

స్ఫురద్రత్న కేయూర హారాభిరామ
శ్చల త్కుణ్డల శ్రీలస ద్గణ్డభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారేస్తనూజః ॥ 17 ॥


కాంతివంతమైన రత్నకంకణములతో, హారములతో అందముగా ఉన్నవాడూ, చలించుచున్న కుండలముల కాంతి ప్రసరించుచున్న చెక్కిళ్ళు కలవాడూ, నడుమునందు పట్టువస్త్రమూ, చేతిలో మనోహరమైన శక్తి (ఆయుధము) కలవాడూ అగు శివుని కుమారుడు నా ఎదుట ఉండుగాక.

ఇహాయాహి వత్సేతి హస్తా న్ప్రసార్యా
హ్వయత్యాదరా చ్ఛఙ్కరే మాతురఙ్కాత్‌ |
సముత్పాత్య తాతం శ్రయన్తం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజేబాలమూర్తిమ్‌ ॥ 18 ॥


"వత్సా! ఇటురమ్ము" అని శంకరుడు చేతులుసాచి ప్రేమతో పిలువగా అమ్మ ఒడినుండి దూకి తండ్రినిచేరి శివునిచే కౌగలింపబడిన బాలస్వరూపుడగు కుమారస్వామిని సేవించుచున్నాను.

కుమారేశసూనో ! గుహస్కన్దసేనా
పతే శక్తిపాణే మయూరాథిరూఢ |
పులన్దాత్మజాకన్త భక్తార్తిహారిన్‌
ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్‌ ॥ 19 ॥


కుమారస్వామీ!  ఈశ్వరపుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! చేతిలో శక్తిని ధరించినవాడా! నెమలినెక్కినవాడా! వల్లీ నాథా! భక్తుల ఆర్తిని తొలగించువాడా! ప్రభో! తారకాసుర సంహారీ! నీవు నన్నెప్పుడూ రక్షించుము.

ప్రశాన్తేన్ద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాలో భవాగ్రే గుహత్వమ్‌ ॥ 20 ॥


ఇంద్రియములు పనిచేయక, చైతన్యము నశించి, చేష్టలుడిగి, నోటినుండి కఫము కారుచూ, భయముతో శరీరము వణకుచుండగా, దిక్కులేక నేను మరణమునకు సిద్ధమైనప్పుడు, దయామయుడవైన ఓ గుహుడా!  నా యెదుట నుండుము.

కృతాన్తస్య దూతేషు చణ్డేషుకోపా
ద్ధహచ్ఛిన్ధిభిన్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మాభై రితిత్వం
పురశ్శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్‌ ॥ 21 ॥


ప్రచండులైన యమదూతలు కోపముతో "కాల్చుము, నరకుము, పగులగొట్టుము" అని బెదిరించుచుండగా, భయములేదని ఓదార్చుచూ, నెమలినెక్కి, శక్తిని ధరించి, శీఘ్రముగా నా ఎదుటకు రమ్ము.

ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారం |
నవక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్దే
నకార్యాన్తకాలే మనాగ ప్యుపేక్షా ॥ 22 ॥


ఓ ప్రభో! అనేక పర్యాయములు నీ కాళ్ళపై పడి నమస్కరించి బ్రతిమాలుకుని ప్రార్థించుచున్నాను. మరణము దరిజేరినప్పుడు నేను మాట్లాడలేను. ఓ కృపాసముద్రుడా! నా మరణకాలమున నీవు కొంచెముకూడ ఉపేక్షజేయకుము.

సహస్రాణ్డ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్రశ్చ దైత్యః |
మమాన్త ర్హృదిస్థం మనః క్లేశ మేకం
నహంసి ప్రభో ! కిఙ్కరోమి క్వయామి ॥ 23 ॥


ఓ ప్రభో! వేలాది బ్రహ్మాండములను కబళించిన శూరుడు, తారకుడు, సింహవక్త్రుడు అను రాక్షసులు నీచే చంపబడ్డారు. నా హృదయమునందున్న ఒక్క మానసిక క్లేశమును నీవు నశింపజేయవు. నేనేమిజేయుదును ? ఎచటకు పోయెదను ?

అహం సర్వదా దుఃఖభారావసన్నో
భవాన్దీనబన్ధు స్త్వదన్యం నయాచే |
భవద్భక్తిరోధం సదాక్లప్త బాధం
మమార్తిం ద్రుతం నాశయోమాసుత త్వమ్‌ ॥ 24 ॥


ఓ ఉమాసుతుడా! నేను ఎల్లప్పుడూ దుఃఖభారముచే కృశించిపోవుతున్నాను. నీవు దీనబాంధవుడవు. నీకంటే ఇతరులను నేను యాచించను. నీపై భక్తిని అడ్డుకుంటూ, సదా బాధపెట్టుచున్న నా మనోవ్యధను నశింపజేయుము.

అపస్మార కుష్ఠక్షయార్శః ప్రసేహ
జ్వరో న్మాద గుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్ప్రభూతిం
విలోక్యక్షణాత్తారకారే ! ద్రవంతే ॥ 25 ॥

ఓ తారకాసుర సంహారీ! అపస్మారము, కుష్ఠము, క్షయ, మూలవ్యాధి, మేహము, జ్వరము, పిచ్చి, గుల్మము మొదలైన మహారోగములు, సమస్త పిశాచములు, నీ పాద ప్రభావమునుచూచి క్షణములో పారిపోవుచున్నవి.

దృశిస్కన్దమూర్తి శ్శ్రుతౌ స్కన్దకీర్తి
ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సన్తు లీనా మమాశేషభావాః ॥ 26 ॥


నా దృష్టియందు స్కందుని దివ్యమూర్తి, చెవులయందు స్కందుని కీర్తి, నోటియందు ఎల్లప్పుడూ పవిత్రమైన ఆయన చరిత్ర, చేతులయందు ఆయన సేవ ఉన్నవై, శరీరము ఆయనకు  దాసియై నా ఆలోచనలన్నీ ఆ గుహునియందు లీనమగుగాక.

మునీనా ముతాహో నృణాం భక్తిభాజా
మభీష్ఠప్రదా స్సన్తి సర్వత్ర దేవాః |
నృణా మన్త్యజానామపి స్వార్ధదానే
గుహా ద్దేవమన్యం నజానే నజానే ॥ 27 ॥


మునులకు, భక్తులకు కోరినకోర్కెలు తీర్చు దేవతలు అంతటా ఉన్నరు. అల్పజాతులవారికి కూడ కోరినవి ఇచ్చు దేవుడు గుహుని కన్న వేరొకని నేనెరుంగను, నేనెరుంగను.

కలత్రం సుతాబన్ధువర్గః పశుర్వా
నరోవాఽథ నారీ గృహే యే మదీయాః |
యజన్తో నమన్త స్త్సువన్తో భవంతం
స్మరన్త శ్చ తే సన్తు సర్వేకుమార ॥ 28 ॥


భార్య, పుత్రులు, బంధువులు, పశువులు, పురుషుడు, స్త్రీ, నావారు ఎవరైతే ఇంటియందున్నరో వారందరూ, నిన్ను పూజించువారుగానూ, నమస్కరించువారుగానూ, స్తుతించువారుగానూ, స్మరించువారుగానూ ఉండుగాక.

మృగాపక్షిణోదంశకాయే చ దుష్టా
స్తథావ్యాధయో బాధకా యే మదఙ్గే |
భవ చ్ఛక్తితీక్ష్నాగ్రభిన్నా స్సుదూరే
వినశ్యన్తు తే చూర్ణిత క్రౌఞ్చశైల ॥ 29 ॥


క్రౌంచ పర్వతమును పిండిచేసినవాడా! నా శరీరమును హింసించు మృగములు, పక్షులు, కాటువేయు ప్రాణులు, బాధించు వ్యాధులు మొదలైనవన్నీ నీ శక్తి ఆయుధపు పదునైన మొనచే దూరమునందే నశించుగాక.

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే నకిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవా న్లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ ॥ 30 ॥


ఓ దేవసేనాపతీ! తల్లితండ్రులు తమ పుత్రుని అపరాధమును మన్నింపరా ? నేను చిన్న బాలుడను. నీవి లోకములకే తండ్రివి. ఓ మహేశా! నా అపరాధములను క్షమించుము.

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమ శ్చాగతుభ్యం నమః కుక్కుటాయ |
నమ స్సింధవే సింధుదేశాయ తుభ్యం
పున స్కందమూర్తే నమస్తే నమోస్తు ॥ 31 ॥


నీ నెమలికి, నీ శక్తి ఆయుధమునకు, నీ మేకపోతునకు, నీ కోడిపుంజునకు నమస్కారము. నీ సముద్రమునకు, సముద్ర తీరమునకు నమస్కారము. ఓ స్కందుడా! నీకు మరల మరల నమస్కారము.

జయానన్ద భూమన్‌ జయాపార ధామన్‌
జయామోఘకీర్తే జయానన్దమూర్తే |
జయానన్దసింధో జయాశేషబన్ధో
జయ త్వం సదా ముక్తిదానేశ సూనో ॥ 32 ॥


ఆనందముతో నిండినవాడా! అపారమైన తేజస్సుగలవాడా! అమోఘమైన కీర్తి కలవాడా! సంతోషస్వరూపుడా, ఆనంద సముద్రుడా, అందరికీ బంధువైనవాడా, ముక్తినిచ్చు ఈశ్వర పుత్రుడా, నీకు జయము జయము.

భుజంగాఖ్య వృత్తేన క్లృప్తస్తవం యః
పఠే ద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |
సపుత్రా న్కలత్రం ధనం దీర్ఘమాయు
ర్లభేత్‌ స్కందసాయుజ్య మంతే నరః సః ॥ 33 ॥


భుజంగవృత్తమునందు రచింపబడిన ఈస్తోత్రమును ఎవరైతే భక్తికలవాడై గుహునికి నమస్కరించి పఠించునో, అతడు పుత్రులను, భార్యను, ధనమును, దీర్ఘాయువును పొంది చివరిగా స్కంద సాయుజ్యమును పొందును.


 ॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం సుబ్రహ్మణ్యభుజంగం సమ్పూర్ణమ్ ॥

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/07/blog-post_2.html

Friday 29 July 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ



రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  స్వధర్మాచరణ
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే |
మన్యతే పరయా కీర్త్యా మత్స్వర్గఫలం తతః ||


(అయోధ్యాకాండ తొలి సర్గ)

రాముడు ఇక్ష్వాకు వంశమునకు తగిన దయ, శరణాగతరక్షణము మున్నగు ధర్మములను ఆచరించుటలో పూనికగల బుద్ధి గలవాడు. క్షత్రియధర్మమును గౌరవముతో పాలించువాడు. ధర్మమునకు, సత్పురుష్లకు, ఆపద కలిగినప్పుడు, దానిని ఎదిరించి తొలగించుట దుష్టులను, అధర్మమును నిగ్రహించుట ప్రజాపాలకుడగు క్షత్రియునకు స్వధర్మము. దానిని ఆయన గౌరవముతో పాలించువాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయి ఉండియూ దానిని ప్రదర్శించుట కంటే తాను పుట్టిన కులమగు ఇక్ష్వాకువంశపు ధర్మము  ఆచరించుటయే గొప్ప అని భావించువాడు. అట్లు తన ధర్మమును తాను ఆచరించుట వలన ఈ లోకములో కీర్తియు, శరీర పతనానంతరము స్వర్గము లభించునని అతని విశ్వాసము. అందుకే స్వధర్మాచరణనకే ప్రాధాన్యమునిచ్చేవాడు.

Tuesday 26 July 2016

శంకరస్తోత్రాలు : దక్షిణామూర్తిస్తోత్రం



 శంకరస్తోత్రాలు : దక్షిణామూర్తిస్తోత్రం

ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే ।
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్ ॥ 1 ॥


ఉపాసకులకు ఉపాసింపదగినది , మర్రిచెట్టు క్రింద నివసించునది , జ్ఞానరూపమైనది అగు తేజస్సు దయామయమైన తన రూపముతో నా హృదయము నందు వెలుగొందుగాక.

అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే ।
మౌనేన మన్దస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదన్తమ్ ॥ 2 ॥

క్షీణించని దయ కలవాడై మర్రిచెట్టు క్రింద కూర్చుని చిరునవ్వులొలుకు మౌనముతో మహర్షుల అజ్ఞానాంధకారమును పారద్రోలుచున్న ఆది గురువును దర్శించితిని.

విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనామ్ ।
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధమ్ ॥ 3॥

అనంతములైన అజ్ఞానములను తొలగించు జ్ఞానముద్రతో దక్షిణామూర్తి మునుల యొక్క మోహమును పోగొట్టి దయతో ’"తత్త్వమసి" అని బోధించుచున్నాడు.

అపారకారుణ్యసుధాతరఙ్గైరపాఙ్గపాతైరవలోకయన్తమ్ ।
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణామ్ ॥ 4॥

కఠోరసంసారమనే మండుటెండలో తపించుచున్న మునులను అంతులేని కరుణామృత తరంగములైన కటాక్షములతో సేదతీర్చుచున్నవాడు , గురువులకే గురువైనవాడు అగు దక్షిణామూర్తిని నేను నమస్కరించుచున్నాను.

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః ।
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాన్తమపాకరోతు ॥ 5 ॥

  మర్రిచెట్టు క్రింద నివసించు దక్షిణామూర్తి కరుణతో దరిచేరినవాడై నాకు ఇప్పుడే ఓంకారరూపమైన విద్యనుపదేశించి అజ్ఞానాంధకారమును తొలగించుగాక.

కలాభిరిన్దోరివ కల్పితాఙ్గం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ ।
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతమ్ ॥ 6 ॥

చంద్రకళలతో నిత్మించినట్లున్న శరీరము కలవాడు , ముత్యాలరాశులతో చేయబడినట్లున్న ఆకారము కలవాడు. అనాదియైన అజ్ఞానాంధకారమును తొలగించువాడు అగు అద్వితీయుడైన గురువును చూచుచుంటిని.

స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టమ్ ।
అపస్మృతేరాహితపాదమఙ్గే ప్రణౌమి దేవం ప్రణిధానవన్తమ్ ॥ 7 ॥

తన కుడిమోకాలుపై ఎడమకాలునుంచినవాడు , పాదమధ్యమున యోగపట్టము కలవాడు , ధ్యానసమయమునందు తొడపైకి జారిన పాదము కలవాడు , ధ్యాననిమగ్నుడగు దక్షిణామూర్తిని నమస్కరించుచున్నాను.

తత్త్వార్థమన్తేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే ।
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసమ్ ॥ 8 ॥

యువకుడైననూ , ఏ దక్షిణామూర్తి తన వద్దకు చేరిన మునులకు తత్త్వమును ఉపదేశించుటకు సమర్థుడో , ఆశ్చర్యకరములైన గుణములు కల అట్టి ఆచార్యుని నా పూర్వపుణ్యములచే నమస్కరించుచున్నాను.

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః ।
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు ॥ 9॥


ఒక చేతితో జ్ఞానముద్రను , వేరొక చేతితో గొడ్డలిని , ఇంకొక చేతితో లేడిని ధరించి నాల్గవచేతిని మోకాలుపై నుంచిన ఆచార్యచూడామణియగు దక్షిణామూర్తి నా ఎదుట ప్రత్యక్షమగుగాక.

ఆలేపవన్తం మదనాఙ్గభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవన్తమ్ ।
ఆలోకయే కఞ్చన దేశికేన్ద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిమ్ ॥ 10 ॥


మన్మథుని దహించిన బూడిదను పూసుకున్నవాడు ,పెద్దపులి తోలు కట్టుకున్నవాడు , అజ్ఞాన సముద్రమును శుష్కింపచేయు బడబాగ్ని వంటి వాడు అగు గురువర్యుని దర్శించుకొనుచున్నాను.


చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్ ।
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదమ్ ॥ 11॥

అందమైన చిరునవ్వు కలవాడవు , చంద్రకళను తలపై ధరించినవాడవు , వీణను పట్టుకున్నవాడవు , జటాజూటము కలవాడవు , నాదముననుభవించుచూ ఆనందించుచున్నవాడవు అగు నిన్ను కొందరు యోగులు ఉపాసించుచున్నారు.

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః ।
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాన్త్యై ॥ 12॥

శుకుడు మొదలగు మునులు ఆశలను వీడి మమకారమును వదిలి ఉపాశించుచున్న దక్షిణామూర్తి స్వరూపుడైన పరమేశ్వరుని , అజ్ఞానమనే మహాదుఃఖము నశించుటకై ధ్యానించుచున్నాను.

కాన్త్యా నిన్దితకున్దకన్దలవపుర్న్యగ్రోధమూలే వస న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః ।
మోహధ్వాన్తవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా ॥ 13॥

తెల్లని మల్లె పువ్వుల కంటే అధికమైన కాంతితో ప్రకాశించు శరీరము కలవాడు , మర్రిచెట్టుక్రింద ఉన్నవాడు , కరుణాసముద్రుడు , తన చూపులచే మునులను ఆదరించుచున్నవాడు , ఉపదేశముచే మునుల యొక్క అజ్ఞానాంధకారమును భేదించుచున్నవాడు అగు దక్షిణామూర్తి జ్ఞానముద్రను ధరించిన తనచేతితో నాకు "తత్త్వమసి" అను మహావాక్యార్థమును బోధించుగాక.

అగౌరగాత్రైరలలాటనేత్రైరశాన్తవేషైరభుజఙ్గభూషైః ।
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః ॥ 14॥

 తెల్లని శరీరము లేనివారు , నుదుటి యందు మూడవ కన్ను లేనివారు , శాంతమైన వేషము లేనివారు , సర్పాభరణములు లేనివారు , నిద్రను జయించలేనివారు , కామ పరిపూర్ణత లేనివారు(దక్షిణామూర్తి కంటే ఇతరులు) అగు దేవతలతో మాకు పనిలేదు.

దైవతాని కతి సన్తి చావనౌ నైవ తాని మనసో మతాని మే ।
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్ ॥ 15॥

భూమిపై ఎంతమంది దేవతలు లేరు? వారు నామనస్సుకు నచ్చినవారు కారు. మందమతులను సైతం అనుగ్రహించు దీక్షకలవాడు , దక్షిణదిక్కువైపు ఉన్న ముఖము కలవాడు అగు దక్షిణామూర్తియే దైవము.

ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే ।
జగదీన్ద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే ॥ 16॥


ఆనందస్వరూపుడు, తలపై బాలచంద్రుని ధరించినవాడు , భస్మపూసుకున్న సుందర శరీరము కలవాడు , ప్రపంచమనే ఇంద్రజాలమును ప్రదర్శించుటలో సమర్థుడు , మర్రిచెట్టుక్రింద ఉన్నవాడు అగు తేజోమూర్తికి నమస్కారము.


వ్యాలమ్బినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ ।
పశ్యఁల్లలాటేన ముఖేన్దునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ ॥ 17॥

ఓ దక్షిణామూర్తీ! చుట్టూ వ్రేలాడుచున్న జడలతో , ఒక్క చంద్రకళతో , మూడవ కంటితో , చంద్రుని వంటి ముఖముతో , నీవు పుణ్యాత్ముల హృదయమునందు ప్రకాశించుచున్నావు.

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేన్దుభావం ప్రకటీకరోషి ।
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచన్ద్రకాన్తః ॥ 18 ॥

 ఓ దక్షిణామూర్తీ! నిన్ను ఉపాసించువారికి పార్వతితో కలిసి పూర్ణచంద్రుని వలే కనబడుచున్నావు. కనుకనే నా మనస్సనే చంద్రకాంతశిల నీ దర్శన మాత్రముననే నేడు ద్రవించుచున్నది.

యస్తే ప్రసన్నామనుసన్దధానో మూర్తిం ముదా ముగ్ధశశాఙ్కమౌలేః ।
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామన్తే చ వేదాన్తమహారహస్యమ్ ॥ 19॥

 ఓ దేవా! తలపై బాలచంద్రుని ధరించిన నీ ప్రసన్నమూర్తిని సంతోషముతో ధ్యానించువారికి ఐశ్వర్యము , దీర్ఘాయువు , జ్ఞానము లభించి చివరగా వేదాంతరహస్యము సిద్ధించును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దక్షిణామూర్తిస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Monday 25 July 2016

శంకరస్తోత్రాలు : భజగోవిందం (మోహముద్గరః)



శంకరస్తోత్రాలు : భజగోవిందం (మోహముద్గరః)
(ఇదివరలో విడివిడిగా ఈ బ్లాగులో ఉన్న ఈ స్తోత్రభాగాలను ఒకటిగా అందిస్తున్నాము)

భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥


గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము).

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||


ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము.

నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 ||


యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము.

నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||


తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకొనుము.

యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||


ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు.శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.

యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే || 6 ||


శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.

బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || 7 ||


బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.

కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||


నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||


సత్పురుషసాంగత్యము వలన భవబంధములూ తొలగును.బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును.స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.

వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||


వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?

మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్
మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11 ||


ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును. మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః || 12 ||


పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది అయినా ఆశ విడవకున్నది.

కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా
త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా || 13 ||


ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు? నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి? మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే సంసారసముద్రము దాటించు నౌక.

జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః ||14 ||


జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - కాషాయవస్త్రములు ధరించినవాడై పొట్టనింపుకొనుటకు వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడ చూడనట్లుండును.

అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్
వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ || 15 ||


శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు.అయినా ఆశ వదులుటలేదు.

అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః || 16 ||


ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలికాచుకొనుచూ, రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , చెట్టుకింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్
జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన || 17 ||


గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.

సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః
సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః || 18 ||


గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట, దేనినీ స్వీకరించకపోవుట, భోగముననుభవించకపోవుట అను వైరాగ్యము ఎవడికి సుఖమివ్వదు?

యోగరతో వాభోగరతోవా సంగరతో వా సంగవీహినః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ || 19 ||


యోగమును ఆచరించువాడుకానీ - సుఖములననుభవించువాడుకానీ, బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ, ఎవడిమనస్సు పరబ్రహ్మయందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.

భగవద్ గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా || 20 |


కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగాజలం త్రాగి, ఒక్కసారైనా విష్ణువును పూజించినవానిని యముడేమి చేయగలడు?

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే || 21 ||


మరల పుట్టుక మరల మరణము మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము.

రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః
యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ || 22||


కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని, పాపపుణ్యములంటని కర్మలనాచరించుచూ, యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును.

కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః
ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ || 23 ||


నీవెవరు?నేనెవరు? ఎక్కడినుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము.

త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః
సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్ ॥24॥

నీలో, నాలో, వేరేచోట ఉన్న పరమాత్మ ఒక్కడే.అసహనంతో నాపై వ్యర్థంగా కోపించుచున్నావు.అంతటా పరమాత్మనే చూడుము.విభేదమును విడువుము.

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహసంధౌ
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్ ॥25॥


శీఘ్రంగా పరమాత్మను పొందదలచినచో శత్రు - మిత్ర - పుత్ర - బంధువులపట్ల విరోధ - స్నేహములకై ప్రయత్నించక సర్వసమానభావనను పొందుము.

కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాఽత్మానం పశ్యతి కోఽహమ్
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః || 26 ||


కామ - క్రోధ - లోభ - మోహములను వదలి నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకంలో పడి పీడింపబడెదరు.

గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్ || 27 ||

భగవద్గీత - విష్ణుసహస్రనామములను గానం చేయుము.ఎల్లప్పుడు విష్ణువుని ధ్యానించుము.మనస్సును సత్పురుష సాంగత్యమునందుంచుము.దీనజనులకు దానం చేయుము.

సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధంత శరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్ ||


స్త్రీతో సుఖించవచ్చును. కానీ తరువాత రోగం వచ్చును.లోకంలో మరణమే శరణమని తెలిసినా మానవుడు పాపం చేయుట మానడు.

అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యమ్
పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః || 29 ||


అర్థమే(ధనము) అనర్థమని ఎల్లప్పుడూ భావించుము.నిజంగా డబ్బు వలన సుఖం లేదు.ఇది సత్యము. ధనవంతుడు పుత్రుని నుండి కూడా భయపడును.ఇదే అంతటా ఉన్నరీతి.

ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారమ్
జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్ || 30 ||


ప్రాణాయామము - ప్రత్యాహారము - నిత్యానిత్యవస్తువివేకము జపంతో కలిసిన సమాధిస్థితి - ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించు.

గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాదచిరాద్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్ || 31 ||


గురువుగారి పాదపద్మములపై భక్తినుంచి తొందరగా సంసారంనుండి బయటపడుము.ఇంద్రియములను - మనస్సును నియమించినచో నీ హృదయంలో ఉన్న దేవుని చూడగలవు.

॥ ఇతి శ్రీ శంకరాచార్యకృతం మోహముద్గరస్తోత్రం సంపూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : ఆనందలహరీ



శంకరస్తోత్రాలు : ఆనందలహరీ
(ఇదివరలో ఈ బ్లాగులో  విడివిడిగా ఉన్న ఈ స్తోత్రభాగాలను ఒకటిగా అందిస్తున్నాము)

భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతిః
తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః || 1 ||

      
ఓ భవానీ ! ప్రజలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలుగు ముఖములతోనూ , త్రిపురాసురుని మర్దించిన ఈశ్వరుడు ఐదు ముఖములతోనూ , దేవసేనానాయకుడగు సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖములతోనూ , ఆదిశేషువు వేయి ముఖములతోనూ నిన్ను స్తుతించలేనిచో ఇతరులు ఎవరు నిన్ను స్తుతించగలరు తల్లీ ? నీవే చెప్పు .

ఘృతక్షీర ద్రాక్షా మధుమధురిమా కైరపిపదై
ర్విశిష్యా నాఖ్యేయా భవతి రసనామాత్ర విషయః |
తథాతే సౌన్దర్యం పరమశివ దృఙ్మాత్ర విషయః
కథంకారం బ్రూమః సకల నిగమాగోచర పదే || 2 ||


నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనె వీటి మాధుర్యము మాటలతో వర్ణించనలవికానిది . ఆ మాధుర్యము నాలుకకు మాత్రమే తెలియును. అదే రీతిగా అమ్మా ! నీ సౌందర్యం వర్ణించి చెప్పడానికి సకలవేదాలకూ శక్తి చాలదు తల్లీ, అది పరమశివుని కన్నులకు మాత్రమే ఎరుకగానీ,  మాబోటివారు వర్ణించగలమా తల్లీ  !

ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్ || 3 ||


నోటి యందు తాంబూలంతో, కళ్ళకు కాటుకతో, నొసటన కాశ్మీరతిలకంతో, నడుము నందు కాంతులీను వడ్డాణముతో, మెడలో ముత్యాల హారాలతో, బంగారు చీరతో ప్రకాశిస్తున్న హిమవత్పర్వతరాజపుత్రిక అయిన గౌరిని నేను సదా సేవించుచున్నాను .

విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటీ
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా |
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే || 4 ||


ఓ శంభుని సతీ! కంఠమునుంచీ కల్పవృక్ష కుసుమాలమాలలు వ్రేలాడుతుండగా శోభిల్లు వక్షస్థలముతోనూ, మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్న కుండలములతోనూ, కొంచెము ముందుకు వంగినటువంటి శరీరముతోనూ(భక్తులను అనుగ్రహించుటకు ముందుకు వంగిందిట), ఆడ ఏనుగు వంటి అందమైన నడకతోనూ, పద్మముల వంటి  కన్నులతోనూ శోభిల్లు తల్లీ! నీకు విజయమగుగాక.

నవీనార్క భ్రాజిన్మణి కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిత నయనాంగీకృత శివా |
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ || 5 ||


ఓ అపర్ణా! అప్పుడే ఉదయించిన బాలభానుడిలాగా దేదీప్యమానంగా ప్రకాశించే సువర్ణ మణిమయాది సర్వాభరణాలతో సర్వాంగభూషితవూ, ఆడలేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు కలదానవూ, పరమశివుని పతిగా స్వీకరించినదానవూ, మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవూ, పసిడి పీతాంబరం ధరించినదానవూ, మువ్వలపట్టీలతో కళకళలాడుతూ పరిపూర్ణురాలివైన నీవు నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించెదవుగాక.

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా || 6 ||


(ఇక్కడ అమ్మవారిని కల్పలతతో పోలుస్తున్నారు.ఈ లత మామూలు లత కాదు కల్పలత అంటే అడిగినవన్నీ ఇస్తుంది.)
ఈ కల్పలత హిమవత్పర్వతమునందు పుట్టింది, అందమైన చేతులు అనే చిగురుటాకులు కలది, ముత్యములనే పుష్పములున్నది,  ముంగురులనే తుమ్మెదలు వాలినది, శివుడనే మ్రోడుని పెనవేసుకొన్నది(స్థాణువు-శివుడు,మ్రోడు), స్తనములనే ఫలములతో వంగినది, శాస్త్రవాక్కులనే మకరందం కలిగినది, సర్వరోగములనూ పోగొట్టునది(భవరోగ నివారిణి), కదులుచున్నది అగు పార్వతీదేవి అనే జ్ఞానానందలతిక విలసిల్లుచున్నది.

సపర్ణా మాకీర్ణాం కతిపయగుణై స్సాదరమిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్ || 7 ||


(పరమేశ్వరుని వివాహమాడుటకు ఆకులనుకూడా తినకుండా తపస్సు చేసినందున పార్వతీదేవికి అపర్ణ అని పేరు. అపర్ణ అనగా ఆకులు లేనిది అని. పార్వతీదేవి ఈ శ్లోకములో ఆకులులేని తీగగా చెప్పబడుతున్నది)

ఆకులు కలిగిన తీగెలను (ఇతర దేవతలను), కొన్నిగుణములు మాత్రమేగలవైననూ, ఇతరులు ఆశ్రయించుచున్నారు. నాకు మాత్రం ఈ విధంగా అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ ఆకులులేని తీగెనే (అపర్ణ) ఆశ్రయించాలి. ఆ తీగె చుట్టుకున్న మాత్రాన పాత మ్రోడు (శివుడు - స్థాణుః) కూడా మోక్షఫలములిచ్చుచున్నది.

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజనని
త్వమర్థానాం మూలం ధనద సమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషి || 8 ||


సమస్త వేదములను కన్నతల్లీ! నీవే ధర్మములు విధించుచున్నావు. కుబేరుడు నీ పాదకమలములకు మ్రొక్కెడువాడే. సమస్త సంపదలకూ నీవే మూలము. తల్లీ, నీవు మన్మధుని జయించినదానవు, కోరికలకూ నీవే మూలము. పరబ్రహ్మ పట్టపురాణివి నీవు, సత్పురుషుల ముక్తికి కారణమూ నీవే.
(చతుర్విధ పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనొసగునది జగన్మాత )

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస
స్త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః || 9 ||


అమ్మా! చపలచిత్తుడనైన నాకు నీపై భక్తి కుదురుటలేదు. నీవు శ్రీమతివి (పెద్ద మనసున్నదానివి, మనం పెద్దమనసు చేసుకుని అంటాం కదా) నాపై దయచూపాలి. చాతకపక్షి నోటిలో మేఘుడు మధురమైన నీటిని వర్షించినట్లే నీవూ నాపై దయావర్షం కురిపించాలి. నా మనస్సు ఎందుకు నీపై నిలుచుటలేదని మధనపడుచున్నాను. (నీవే దారి చూపాలని వినతి).

చాతకపక్షి ఇష్టాఇష్టాలతో నిమిత్తంలేక మేఘుడు తన ధర్మం ప్రకారం మధురజలాలు ఆ పక్షిపై ఎలావర్షిస్తున్నాడో, నా భక్తిశ్రద్ధలతో నిమిత్తంలేకనే నువ్వు (నీ దయాధర్మం ప్రకారం) నీ దయ నాపై కురిపించు తల్లీ అని భావన.

శంకరులు సౌందర్యలహరిలో ’దృశా ద్రాఘీయస్యా’ శ్లోకంలో ఇదేభావం కనపరిచారు. ’వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః’ చంద్రుడు భవనాలపై అరణ్యాలపై ఒకేలా వెన్నెల కురిపించినట్లు, ఈ దీనుడిపై దయచూపమని అక్కడ వినతి.

’కావు కావమని నే మొరబెట్టితే కరుగదేమి మది’ అని త్యాగరాజులవారు
’దేవీ బ్రోవ సమయమిదే, అతివేగమే వచ్చి’ అని శ్యామశాస్త్రుల్ల వారు దెబ్బలాడారు. అందరూ దెబ్బలాటలు శంకరులవద్దే నేర్చుకున్నట్లుంది.

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీ పరికరైః || 10 ||


గొప్పచరిత్రగల తల్లీ! నిన్ను శరణు అన్న నాపై నీకు ఉపేక్ష తగదు. నీ దయాదృష్టిని నాపై వేగముగా ప్రసరింపచేయి.  కోరుకున్నది వెంటనే ఇవ్వకపోతే సామాన్యలతలకన్నా కల్పలతకు విశేషమేమున్నది ? 

మహాన్తం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 11 ||


అమ్మా ఉమాదేవీ! నీ పాదపద్మములపై గొప్ప విశ్వాసము కలవాడినై నేను ఈ లోకంలో  అన్య దేవతలను ఆశ్రయించలేదు. అయినా నీవు నాపై కరుణ చూపకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ ! నాకెవరు దిక్కు ?

త్యాగరాజులవారు కూడా ’వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా!’ అని కామాక్షీ అమ్మవారిని ప్రార్థించారు.  శంకరులు ఈ శ్లోకంలో ’వినాయకుని తల్లీ నాకింకెవరు దిక్కు?’ అని అడుగుతున్నారు. ఎందుకు వినాయకుని అమ్మకు గుర్తుచేస్తున్నారు ?

వినాయకుని ’హేరంబుడు’ అంటారు. అంటే ఎప్పుడూ శివునివద్దనే ఉండేవాడని. అందుచేత వినాయకుడంటే అమ్మవారికి మక్కువ అని పెద్దల మాట.

నాకు వినాయకుని ’లంబోదర’ అని సంబోధించడంలో ఒక సంకేతం కనిపిస్తోంది. వినాయకచవితి కథలో వినాయకుని ఉదరం భగ్నమైనప్పుడు అమ్మవారు పట్టుబట్టి మరలా జీవం పోయించింది. అంత కరుణనూ నాపై కూడా చూపమని శంకరులు, త్యాగరాజులు అడుగుతున్నారని నా అభిప్రాయం.

అయస్స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిళితమ్ |
తథా తత్తత్పాపైరతిమలిననన్తర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ || 12 ||


పరశువేది స్పర్శతో ఇనుము బంగారమవుతున్నది. వీధికాలువల నీరు గంగాప్రవాహముతో కలిసి శుచి అవుతున్నది. అలాగే ఆయా పాపములతో అతి మలినమైన నా మనస్సు నీపై భక్తితో కలసినచో ఎట్లు నిర్మలము కాదు ?

త్వదన్యస్మాదిచ్చావిషయఫలలాభే న నియమ
స్త్వమజ్ఞానామిచ్చాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివముచితమీశాని కురు తత్ || 13 ||


నీ కంటే ఇతరులైన దేవతల వలన కోరినఫలము లభిస్తుందని నియమము (ఆంగ్లములో చెప్పాలంటే , గ్యారంటీ) లేదు. మరి నీవో, అజ్ఞులకుకూడా కోరినదానికన్నా అధికముగా ఇచ్చుటలో సమర్థురాలవని బ్రహ్మదేవుడు మొదలగువారు చెప్పారు. నా మనస్సు రాత్రింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నది. ఓ ఈశ్వరుని పత్నీ! ఏది తగినదో అది చేయుము.

స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చశధరకళాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి || 14 ||


ముల్లోకములకూ మహారాజయిన పరమేశ్వరుని గృహిణి అగు ఓ పరమేశ్వరీ! రమణీయమైన నీ సౌధములో కాంతులీను నానా రత్నములు పొదగబడినవీ, స్ఫటికమయమైనవీ అయిన గోడలయందు నీ ఆకారము ప్రతిబింబించుచున్నది. దాని శిఖరము పై చంద్రకళ ప్రకాశించుచున్నది. ఆ భవనములో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు సపరివారముగా ఉన్నారు. ఆ భవనము ఎంతో గొప్పగా ఉన్నది.

నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధనికరః |
మహేశః ప్రాణేశః తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా || 15 ||


అమ్మా! నీ సౌభాగ్యమేమని చెప్పను ? నీ నివాసము కైలాసము. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు నిన్ను స్తుతిచేయువారు (వంది మాగధులు). ఈ ముల్లోకాలూ నీ కుటుంబము. సిద్ధులన్నీ నీకు అంజలిఘటించుచున్నాయి. మహేశ్వరుడు నీ ప్రాణేశుడు. ఓ పర్వతరాజపుత్రీ పార్వతీ! నీ సౌభాగ్యానికి సమానమైనది వేరొకటి లేదు .

వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూః భుజగనివహో భూషణవిధిః |
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపోః
యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా || 16 ||


అమ్మా!  మన్మథశత్రువగు శివుని (సంపద) గురించి అందరికీ తెలిసినదే. ఆయన వాహనము ముసలి ఎద్దు. ఆహారము హాలాహలము. వస్త్రము దిక్కులు. క్రీడాస్థలము స్మశానము. ఆభరణములు పాములు. ( ఇలాంటి శివుడు ఈ జగత్తుకి ఈశ్వరుడు ఎలా అయ్యాడు ?) ఆయన యొక్క ఐశ్వర్యము(ఈశ్వరత్వము) ఓ జననీ! నీ సౌభాగ్యమహిమయే.

అశేషబ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే || 17 ||


అమ్మా!  పశుపతి అయిన శివుడు సహజముగా అశేష బ్రహ్మాండములనూ ప్రళయంతో లయం చేసే స్వభావం ఉన్నవాడు,  స్మశానంలో ఉండేవాడు, బూడిద పూసుకునే వాడు. అలాంటి వాడు అఖిల జగత్తుపైనా కరుణతో హాలాహలాన్ని కంఠంలో ధరించాడు. ఓ కళ్యాణీ, ఈ కరుణ చూపడం నీ సాంగత్యఫలమే అని నేను తలచుచున్నాను.

త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసి వాసేన గిరిశః॥18॥
అమ్మా శైలపుత్రీ! సర్వోత్కృష్టమయిన నీ సౌందర్యమును చూచి మిక్కిలి భయముతో గంగ జలమైపోయెను. అంతట ఈశ్వరుడు ఆ గంగాదేవి ముఖకమలమును చూచి,ఆమె దీనావస్థకు జాలిపడి,తన శిరసున నివాసమిచ్చి,ప్రత్యేక ప్రతిష్ఠను కలిగించుచున్నాడు.

 విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్॥19


హే భగవతీ! అధికమైన చందనద్రవముతో,కస్తూరితో,కుంకుమపువ్వుతో కలిసిన నీ అభ్యంగజలమును(తలంటి పోసుకొను నీరు) మరియు రాలుచున్న నీ పాదధూళిని తన చేతులతో సంగ్రహించి బ్రహ్మదేవుడు దేవలోకసుందరీమణులను(అప్సరసలను) సృష్టించుచున్నాడు తల్లీ!
(అంబిక సౌందర్యాధిదేవత,ఆమె సౌందర్యము సర్వాధిక్యమని సూచన)


వసన్తే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాళిసుభగే
సఖీభిః ఖేలన్తీం మలయపవనాందోళితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి॥20॥


తల్లీ! ఆనందకరమైన వసంతకాలంలో, అన్నివైపులా లతలు ఉన్నది, వికసించిన బహువిధములైన పద్మములు కలది, కలహంసల బారులతో సుందరమైనది మరియు మలయమారుతముచే మెల్లగా కదులు నీరు కలది అగు సరస్సులో చెలికత్తెలతో జలకములాడుచున్న నిన్ను ధ్యానించు వారికి జ్వరపీడ దూరమగును.


॥ ఇతి శ్రీ శంకరాచార్యకృతం  ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : గుర్వష్టకం




శంకరస్తోత్రాలు : గుర్వష్టకం

శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||



అందమైన శరీరము , సుందరియగు భార్య , గొప్ప కీర్తి , మేరుపర్వతము(బంగారుకొండ)తో సమానమైన ధనము ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||


భార్య , ధనము , పుత్రులు , పౌత్రులు , ఇల్లు , బంధువులు మొదలైనవన్నీ ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||


ఆరు అంగములతో కూడిన వేదములు , శాస్త్రములు , గద్య-పద్యములు , రచించగల కవితాశక్తి ముఖమునందున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||


విదేశములలో సన్మానము లభించినది , స్వదేశమున కీర్తి ఏర్పడినది , సదాచార సంపన్నుడు నాకంటే వేరొకడు లేడు. అయినా గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

క్షమామండలే భూపభూపాలబృందైః
సదా సేవితం యస్య పాదారవిందమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||


భూమండలమునందలి రాజులందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడైననూ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||


నేను చేయు దానముల ప్రభావము వలన కీర్తి ఎల్లెడల వ్యాపించినది. గురువు అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు నాచేతికి వచ్చినవి. కానీ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||


భోగమునందు-యోగమునందు-గుర్రాలు మొదలైన వాటి యందు-స్త్రీలయందు-ధనమునందు కోరిక లేదు. గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||


 అరణ్య నివాసమునందు కానీ, స్వగృహనివాసమునందు కానీ, ఏ కార్యమునందు కానీ నా మనస్సు లేదు, అమూల్యమైన దానిని అది కోరుచున్నది. గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?

గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||


  సన్యాసి-రాజు-బ్రహ్మచారి-గృహస్థుడు వీరిలో ఎవడైననూ ఈ గుర్వష్టకమును పఠించినచో పుణ్యాత్ముడగును. గురువు చేయు ఉపదేశములందు మనస్సు లగ్నము చేయువాడు పరబ్రహ్మరూపమైన వాంఛితార్థమును పొందును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం గుర్వష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : ప్రాతః స్మరణ స్తోత్రమ్


శంకరస్తోత్రాలు : ప్రాతః స్మరణ స్తోత్రమ్

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కలతమహం న చ భూతసంఘః || 1 ||



సచ్చిదానందరూపము , మహాయోగులకు శరణ్యము , మోక్షమునిచ్చునదీ  అగు ప్రకాశవంతమైన ఆత్మతత్త్వమును  ప్రాతఃకాలమునందు నామదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము , జాగరణ , సుషుప్తి అనువాటిని తెలుసుకొనుచున్నదో , నిత్యమూ , భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మ నేనే. నేను పంచభూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ || 2 ||


మనస్సునకు , మాటలకు అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలము నందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు ’"నేతి" "నేతి"(ఇది కాదు , ఇది కాదు)అను వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో , జనన మరణములు లేని ఆ దేవ దేవునే అన్నిటి కంటే గొప్పవాడుగా పండితులు చెప్పిరి.


ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై || 3 ||


అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణస్వరూపుడు , సనాతనుడు , అగు పురుషోత్తముని ప్రాతఃకాలము నందు నమస్కరించుచున్నాను. అనంతస్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనబడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||


మూడులోకములను అలంకరించునవి , పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవడైతే ప్రాతఃకాలము నందు పఠించునో వాడు మోక్షమును పొందును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం ప్రాతఃస్మరణ స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : శ్రీగణేశభుజఙ్గమ్


॥ శ్రీగణేశభుజఙ్గమ్ ॥

రణత్-క్షుద్రఘణ్టానినాదాభిరామం
చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్ ।
లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం తమీడే ॥1॥

మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుణ్డదణ్డోల్లసద్బీజపూరమ్ ।
గలద్దర్పసౌగన్ధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥

ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


ప్రకాశజ్జపారక్తరన్తప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।
ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥

జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చన్ద్రరేఖావిభూషమ్ ।
విభూషైకభూశం భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥

విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు , ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


ఉదఞ్చద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।
మరుత్సున్దరీచామరైః సేవ్యమానం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥

  పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


స్ఫురన్నిష్ఠురాలోలపిఙ్గాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్ ।
కలాబిన్దుగం గీయతే యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥

ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.


యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానన్దమాకారశూన్యమ్ ।
పరం పరమోఙ్కారమాన్మాయగర్భం ।
వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥

ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసారసముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.


చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।
నమోఽనన్తలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥

జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము . ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.


ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।
గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥

ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీగణేశభుజఙ్గమ్ సమ్పూర్ణమ్ ॥

Sunday 24 July 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7


రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  7
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |
దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః ||


(అయోధ్యాకాండ తొలి సర్గ)


రాముడు ఎవరికి అయినను దుఃఖము కలిగిననాడు చూచి ఓర్వలేనివాడు అనగా దయగలవాడు. క్రోధమును తన వశమందు ఉంచుకొనినవాడు. కోపమునకు లొంగి ఒడలు తెలియక అనరాని మాటలు ఆడుట , చేయరాని పనులు చేయుట చేసెడివాడుకాడు. వేదాధ్యయనము చేయువారిని , వేదార్థములను ఎరింగినవారిని ఎంతో గౌరవముతో పూజించెడివాడు. అందరియెడ దయకలిగినవాడే అయినను దీనుల యెడ చాలా దయచూపువాడు. దీనులు ఎచట అయినను కనిపించిన వారికి ఏదో విధముగా సాయము చేయనిదే కదలి పోయెడివాడుకాదు. సామాన్య మానవ ధర్మములగు సత్యము , అహింస మొదలగు వానిని పాలించి ఆత్మ స్వరూపము ఎరింగి పరమాత్మను పొందుటకు మానవుడు ఈ శరీరముతో చేయవలసిన విశేష ధర్మములను ఎరింగినవాడు. నియమము కలవాడు. ఆడినమాట తప్పకుండుట ఆతనికి నియమము. ఎంత ఆపద వచ్చినను దానికి కట్టుబడి ఉండెడివాడు.

Saturday 23 July 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : చెడు వర్జించడం



రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు :  చెడు వర్జించడం
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

న చానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః |
అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే ||


(అయోధ్యాకాండ తొలి సర్గ)

రాముడు ప్రశంశలలో నైననూ అనృతమైన (అబద్ధములు) ప్రసంగములు లేనివాడు. కల్పితములైన ఇతివృత్తములుగల కావ్యములను చూచి, విని, ఆనందించువాడు కాడు. అట్టివానిని చూచుట మనస్సున చాంచల్యము కలిగించును కనుక అవిచూచుట మంచిదికాదని పెద్దలు అసత్కావ్యములను వదలవలెనని చెప్పిరి. దానిని ఎరింగినవాడగుటచే సమాజమునకు అభ్యుదయమును కలిగించునవి, ఆత్మోన్నతిని కలిగించునవి అగు కావ్యములనే వినెడివాడు, చదివెడివాడు, చూచెడివాడు. కల్పితమైన కథలలో చమత్కారము అధికముగా ఉండి, హృదయము ఆవర్జింపవలెనని అశ్లీలములగు సన్నివేశములు చోటుచేసికొనును. కనుక వాటినిచూడరాదని ఎరింగి మానెడివాడు. 

శీలవృద్ధులనూ, జ్ఞానవృద్ధులనూ, వయోవృద్ధులనూ తానే ఎదురేగి పూజించెడివాడు.

పండితులూ, పామరులూ అనుభేదములేక ప్రజలందరూ శ్రీరామునిపై ప్రేమ కలిగిఉండెడివారు. దానికి కారణము ఆతడు తన నడువడిచే మాటచే చేతచే ప్రజలందరనూ అలరించెడువాడు అగుటయే.

పంచకృత్య పరాయణా : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-7

 

పంచకృత్య పరాయణా
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-7

త్రిమూర్తులకు ఆచార్యులు ఇచ్చిన పేర్లు  - "హరి-హర-విరించి".  వీరు మువ్వురూ అమ్మను ఆరాధిస్తున్నారని ఆచార్యులు అంటున్నారు. అలా అనడానికి ముందు "శివుడు నీతో కలసి ఉన్నప్పుడే స్పందిచగలడు - జగద్వ్యాపారం నిర్వహించగలడు" అంటున్నారు. అయితే త్రిమూర్తులలో ఒకరైన "హరుడు", మొదటి పాదంలో చెప్పిన "శివుడు" వేరు-వేరా ?

కాస్సేపు అందరూ ఒక్కటే అనే మాటని ప్రక్కన పెట్టండి. ఆ అద్వైత సిద్ధాంతానికి ఇక్కడ చోటు లేదు. కాబట్టే కదా ఈ స్తోత్రం రచన జరిగింది ? ప్రతీ ఒక్కరూ బాహ్యంగా వేరు, అంతరంగా ఒక్కటే అన్న స్థితిలో హరుడు, శివుడు వేరు వేరు.

"హర" అంటే "లయం చేసేవాడు", "నాశనం చేసేవాడు". "అపహరణ", "సంహరణ" అనే పదాల్లో ఈ శబ్దం వస్తుంది. "అపహర", "సంహర" అనే రూపంలోకి మారుతుంది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు, రుద్రుడు లయకారుడు. హరుడంటే రుద్రుడు, లయకారుడు.

ఒకే పరమాత్మ మూడు పనులు చేయటానికి ముగ్గురు దేవతలుగా విభజింపబడుతుంది. ఈ మూడు క్రియలు చేయటానికి కావలసిన శక్తి, పరమాత్మ యొక్క మూలశక్తి నుండి వస్తుంది. ఆ మూలశక్తియే అమ్మవారు. ఆవిడ, పరమాత్మ అని పిలువబడే పరబ్రహ్మము యొక్క శక్తి. "నీ (అమ్మవారి) నుండి త్రిమూర్తులు మాత్రమే కాక ఈగలూ, చీమలతో సహా అన్ని జీవములూ శక్తిని పొందుతున్నాయి. అన్ని జడ పదార్థములలోనూ అంతర్లీనంగా ఉన్న శక్తి నీవే (అమ్మవారే)".

పరబ్రహ్మముయొక్క శక్తి పరబ్రహ్మమే అయి ఉండాలి. ఏ వస్తువైనా దాని శక్తి వలనే గుర్తింపు పొందుతోంది. శక్తిహీనమైతే ఉపయోగం లేకుండా అయిపోతోంది. ఒక మోటారుకారుకి 10 హార్సుపవరు ఇంజను ఉందంటే అర్థమేంటి ? ఒక కారుయొక్క హార్సుపవరే దాన్ని కారుగా చేస్తుంది. ఆ శక్తి క్షీణించిపోతే, అది పేరుకే కారు.  ఒక మోటారుకారు చెయ్యవలసిన పని అది చెయ్యగలదా ? బానెట్టులో చెయ్యిపెట్టి ఇంజనులో తడిమితే నీకు ఏమీ కాదు. నీకు షాకు కొట్టదు. ఒక వ్యక్తి తన శక్తి వల్లనే వ్యక్తి అవుతున్నాడు. అందుకని మనం పరబ్రహ్మ-శక్తి అని అంటున్నది ఆ పరబ్రహ్మమే. కానీ ఎవరైనా సరే ఏమీ చెయ్యకుండా , తన శక్తి చూపకుండా, ఉండవచ్చు. "శివం" అంటే మనం "ఎటువంటి బాహ్య కదలికాలేని నిశ్చల పరబ్రహ్మము" - అని అర్థం చేసుకోవాలి.

అటువంటి స్థితిలోనున్న శివం నుండి మనం జీవులుగా, మనసు బహిర్ముఖత్వంచెంది, ఇంద్రియాలు బాహ్యవస్తువులపై ఆసక్తితో ఆవిర్భవించాము. మన నిజ స్థితిని ఎప్పుడు తెలుసుకుంటాము ? ఎప్పుడు మాయనుండి విముక్తి చెంది, ప్రాపంచిక బంధాలనుండి విడివడతాము ? "ఎప్పుడయితే మనం శివంలో లీనమైపోతామో అప్పుడు" అనేది ఈ ప్రశ్నల సమాధానం. ఈ విముక్తి ద్వారా మనం పొందే మోక్షం, ప్రశాంతత కాబట్టి, మనం లీనమైపోయిన శివం కూడా ప్రశాంతముగా తన శక్తిని వ్యక్తంచేయకుండా ఉండి ఉండాలి. అందుకనే మనం క్రియారహితంగా జడంగా ఉన్న పదార్థమని పరబ్రహ్మము గురించి అంటాము. ఓ మూల ఉలుకూపలుకూ లేకుండా కూర్చున్న పిచ్చివాడిని చూసి మనం "వీడు బ్రహ్మపదార్థం లా ఉన్నాడని" అంటాము కదా ?

ఈ విధంగా మనం చూసినట్లయితే, ఒకరు లేక మరొకరు లేనప్పటికీ, శివుడు పరబ్రహ్మమనీ, అమ్మవారు పరబ్రహ్మ-శక్తి అనీ విడి విడిగా భావించవచ్చు.

ఇప్పుడు మనం, సృష్టి, స్థితి, లయలనే మూడు కార్యములకు మరో రెండు కలపాలి.  శివం యొక్క ప్రశాంతమైన స్థితి నుండి, మనం స్వస్వరూపం తెలియకుండా అయ్యాము కదా. ఇది బ్రహ్మ-శక్తి ద్వారానే జరిగింది. ఆమె మన స్వస్థితిని మరుగునపెట్టి మనలో అజ్ఞానం కల్పించి మాయా ప్రపంచంలో త్రోసివేసింది. చాలమంది గొప్పవారు ఈ మాయ నుండి తప్పించుకున్నారు, విడుదల అయ్యారు. వారు శివము తెలుసుకోగలిగిన స్వస్థితిని, నిరంతర ప్రశాంతత అయిన మోక్షమును, చేరుకున్నారు. దీనిద్వారా పరాశక్తి - బ్రహ్మశక్తి -  తన కరుణతో మనకు ముక్తినిచ్చే పని చేస్తున్నదని మనకు తెలుస్తోంది.  కాబట్టి సృష్టి, స్థితి, లయలకు మరో రెండు క్రియలు కలిశాయి. మొదటిది - మన స్వస్వరూప జ్ఞానమును మాయాశక్తితో మననుండి కప్పిపుచ్చడం. రెండవది - మాయనుండి విముక్తినివ్వడం - అంటే పరబ్రహ్మముతో మనను ఏకం చెయ్యడం.

ఈ పైన చెప్పిన రెండు పనులనూ "తిరోధానము", "అనుగ్రహము" అని అంటాము. మొదటిదాన్ని తిరోభవము అని కూడా అంటాము. "తిరస్" అనే ధాతువుకు "మరుగుపరచు", "తెరవేయు", "దాచిపెట్టు" అని అర్థాలు. వస్తువులు మాయమైపోయే తిరస్కరిణీ విద్య గురించి మీరు వినే ఉంటారు. తెర వేస్తే వస్తువు మరుగున పడిపోతుంది కదా.  మాయ అనే తెరవేసి మన స్వస్వరూపాన్ని మరుగుపరచి, మనను ఈ ప్రపంచంలో ఉంచడం పరాశక్తి పని. దీనిని తిరోధానము అని అంటారు. తెరతీసి విముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. పరాశక్తి సృష్టి, స్థితి, లయలకు బ్రహ్మ, విష్ణు, రుద్రులను ఎలా నియమించిందో, అలాగే, ఈశ్వరుడిని (మహేశ్వరుడని కూడా అంటారు) తిరోధానమునకు నియమించింది. మెదటి మూడు కార్యములూ మాయ పరిధి లోకి వస్తాయి. ఈ మాయా జగత్తు వ్యవహారమంతా ఈశ్వరుని చేతుల్లో ఉంది. మాయను తొలగించి మోక్ష అనుగ్రహాన్ని ప్రసాదించడం సదాశివుని పని.

ఈ అయిదు పనులనూ పంచకృత్యములు అని అంటారు. ఇవి శైవ సాంప్రదాయములైన "శైవ సిద్ధాంతము" వంటి వాటిలోనూ ఉన్నాయి.  శైవములో పంచకృత్యములనూ పరమశివుడు చేస్తాడు. నటరాజు నృత్యమును " పంచకృత్య-పరమానంద-తాండవం" అని అంటారు. శాక్త సంప్రదాయంలో పంచకృత్యాలూ అమ్మవారి పని. లలితా సహస్రనామములలో అమ్మవారిని "పంచకృత్యపరాయణా" అని పిలుస్తారు.

అమ్మవారు ముఖ్యఅధికారిణిగా మిగిలిన అధికారులను నియమిస్తుంది. (సౌందర్యలహరి) శాక్త సంప్రదాయ స్తోత్రం కాబట్టి అలా అన్నారు అనుకోకూడదు. నిష్పక్షపాతంగా చూస్తే పంచకృత్యములకూ అమ్మవారు ముఖ్యఅధికారిణి అవడం సముచితమని తెలుస్తుంది.  ఎందుకని ? ఒక "కృత్యము" లేదా "కార్యం" అంటే చెయ్యవలసిన పని - శక్తిని ఉపయోగించవలసినదే. శక్తి అంటే అమ్మవారే కదా. శైవ సంప్రదాయంలో కూడా "శక్తి తో కూడిన శివుడు" అనే ఉన్నది. అంటే శివుని భార్యను శక్తి అంటారనీ, శివుడు శక్తితో కలసి ఉన్నాడనీనూ. సౌందర్యలహరిలో చెప్పబడ్డ విషయాలకూ, అద్వైత సిద్ధాంతమునకూ అత్యంత సామీప్యం ఉన్న కాశ్మీరు శైవంలో అత్యున్నత స్థాయి పరమాత్మను "శివ-శక్తి" అని అంటారు. కాబట్టి ఈ పంచకృత్యములనూ అమ్మవారికి అంటే పరాశక్తికి అప్పజెప్పడం సముచితమైనదే.  అలాగే పంచకృత్యములంటే నిశ్చలసమాధిస్థితి అనుభవం గురించి మాట్లాడటం కాదు.

అమ్మవారు పంచకృత్యములనూ అయిదుగురు వేర్వేరు దేవతలద్వారా చేస్తున్నదంటే ఆమె వారికంటే గొప్పదనే. ఈ అయిదుగురూ సర్వశక్తిమంతమైన పరబ్రహ్మమునుండి వచ్చినవారే కదా ? అన్నిటికన్న అతీతమైన శక్తి అని అర్థం.

ఈ శక్తి యొక్క మూలమే మన స్తోత్ర విషయం. సుందరి. ఆమెయే అన్ని క్రియలకూ ఆధారమైన శక్తి.  ఆమెయే ఈ అయిదుగురు దేవతల ఇల్లాలు.  నిజానికి మోక్షప్రదాత అయిన సదాశివునికన్నా ఆమెయే గొప్పది. ఆయన (సదాశివుడు) జ్ఞానస్వరూపమై ఉన్నప్పుడు - నిష్క్రియాపరత్వం వహించి ఉంటాడు. ఆ స్థితిలో ఆయన కంటే గొప్పవారూ లేరు, తక్కువ వారూ లేరు. కానీ ఆయన జ్ఞానప్రదానమనే కార్యం నిర్వహిస్తున్నప్పుడు, ఆయనను ఆ పని చేసేలా చేయగలిగిన శక్తి, ఆయన కన్నా గొప్పదై ఉండాలి.


(సశేషం)

Friday 22 July 2016

రామాయణం ఎందుకోసం చదవాలి ? ఎన్నిసార్లు చదవాలి ?



రామాయణం ఎందుకోసం చదవాలి ? ఎన్నిసార్లు చదవాలి ?
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) 

రామాయణాన్ని అధ్యయనం చేయడం వేదంలో ఉన్న రహస్యాన్ని తెలిసికోవడమే. మానవుడి బాహ్యవర్తనాన్ని , ఆంతర జ్ఞానాన్ని విశదంగా అవగాహన చేసుకోవడమే. శ్రీరామాయణాధ్యయనము వేదాధ్యయనము, మానవ జీవితాధ్యయనము.

 అందుచే రామాయణాన్ని ఒకసారి కవితాదృష్టితో చదవాలి. రెందవసారి పాత్ర స్వరూప నిరూపణముచేస్తూ చదవాలి. మరొకసారి నైతిక, ధార్మిక ప్రవర్తన తెలియటానికి చదవాలి. మరొకసారి రహస్యమైన ఉపనిషదర్థములను స్పష్టముగా అవగాహన చేసుకో డానికి చదవాలి.

ఏమీ తెలియకపోయిననూ కేవలం ఉచ్చరించిన మాత్రము చేతనే మన మనసులో ఉన్న రజస్తమస్సులను తగ్గించి సత్వగుణాన్ని పెంపొందించి మంచి నడువడిని కలిగించే శక్తి రామాయణంలో శబ్దానికే ఉంది. అదే మంత్ర శక్తి.

Thursday 21 July 2016

సౌందర్యలహరిలో భక్తిమార్గము : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-6



సౌందర్యలహరిలో భక్తిమార్గము
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-6

భక్తి జ్ఞానమార్గములలో ఏ మార్గము అవలంబించినప్పటికీ, ఆ మార్గములో నిజాయితీగా లీనమవాలి.  పరిపక్వత ఇంకా రానప్పుడు మార్గమునుండి ప్రక్కదోవ పట్టి తదేక ధ్యాసను కోల్పోరాదు.

ఓ మాతృమూర్తి తన బక్కపలుచని పిల్లడికి చేదుమందు ఇస్తూ అది తియ్యగా ఉంటుందని చెప్పినదనుకోండి. అది అబద్ధమా ? కాదు, ఆమె సత్యమే చెబుతోంది. విరేచనాలతో బాధపడుతున్న మరో పిల్లడు మైసూరుపాకు తినాలనుకున్నప్పుడు, తల్లి అది చేదుపదార్థమని చెప్పి తినడం మానిపించిందనుకోండి. ఆమె ఇప్పుడూ సత్యమే చెబుతోందా లేదా ?  ఏది సత్యము ?  సత్యనిర్ధారణ జరిగేటప్పుడు, "ఇతరులకు మంచి చేయాలి" అనే విషయం ప్రమాణం.  కానీ కొందరికి ఉపయోగమైనది మరికొందరికి హాని కలిగించేది అవవచ్చు. అంటే సత్యవస్తువు ఎవరికీ హాని కలిగించనిది అయి ఉండాలి. స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలకు చోటు ఉండకూడదు. ఎవరి మంచి కోరి బోధ జరుగుతోందో, ఆ బోధను ఆ ప్రజలు ఇష్టమైనదిగా అంగీకరించాలి. (బోధ అలా ఉండాలి), కష్టంలేకుండానే ఆ బోధను అనుసరించగలగాలి. 

ఈ ఉద్దేశ్యం - సదుద్దేశ్యం - తో, ఒక మార్గమునకు మరొక మార్గముకన్నా ఉన్నతస్థానమునిచ్చారు. అంటే రెండవ మార్గము విలువలేనిది అని కాదు.  ఒక మార్గము ఉపదేశించబడిన వ్యక్తి,  ఆ మార్గము తనకొరకు నిర్దేశింపబడినదని, తనకు సరిపోయినదనీ తెలుసుకున్నప్పుడు, ఉత్సాహంతో, మనస్సు లగ్నంచేయగలడు. అలాగే రెండవ మార్గము తక్కువచేసి చూపడంద్వారా ఒక మార్గంలోని వ్యక్తి తరచూ మార్గాలుమారుస్తూ తద్వారా గందరగోళానికి గురికాకుండా ఉండగలడు.

ఇది దృష్టిలో ఉంచుకునే ఆచార్యులు, తాను అద్వైతిగా తిరస్కరించే భక్తిని, మనను పట్టుకోమంటున్నారు. తాను అద్వైతము మాట్లాడుతూ మాయగా తిరస్కరించునది, భక్తిమార్గము అవసరములేనివారికోసమే. భక్తుడవాలంటే, భగవంతుడికన్నా కొంచెమయినా వేరుభావం ఉండాలి. అద్వైతములో ఆ ’వేరు’ అను భావముకు చోటులేదు. అంతా ఏకత్వమే. ఈ (అద్వైత) మార్గంలో వెళ్ళేవారికి మనం అనుకునే భక్తి అవసరం లేదు. వారికోసం ఆచార్యులు "స్వస్వరూపానుసంధానము" భక్తి అంటారు. కానీ అలాంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు.

మరి మనబోటి అధికసంఖ్యాకుల సంగతి ఏమిటి ? ఉచితానుచిత విచక్షణ లేకుండా, మనస్సు, ఇంద్రియాలు ఎటు లాక్కెడితే అటు వెడుతూ, మనను సంతోషపెట్టేదే ఉచితమైనదని భావిస్తూ తప్పులు చేస్తున్నాము.  (ఇలాంటి మనకి) బ్రహ్మాది దేవతలను కూడా నడిపించే దేవత శక్తి అనీ, ఈ పరాశక్తి పరబ్రహ్మమును కూడా స్పందింపజేయగలదని మనకి నేర్పినప్పుడు, తప్పులు, చెడు చేయటానికి వెనుకాడతాం, వినయంతోనూ, భక్తితోనూ, నిర్భయంగా ఉండటం అలవాటు అవుతుంది.

నిశ్చల పరబ్రహ్మమైన శివమే సత్యము. దానికి తప్పు, ఒప్పులు లేవు. ఉచితమూ అనుచితమూ లేవు అలాగే పుణ్యమూ పాపమూ లేవు. మనం చూసేదంతా మాయ. సత్యము (శివం) నకు వేరొకదానితో సంబంధం లేదు. అది అనుగ్రహించదు, శిక్షించదు.

ఇలా మనం అద్వైతపరంగా మాట్లాడామనుకోండి. మనం దీనికి విపరీతవ్యాఖ్యానంచేసి, మనకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అనుమతి, స్వతంత్రత ఉన్నట్లు, మన మనస్సుకు నచ్చినట్లు నడుస్తాము. అందుకే ఆచార్యులు తమ స్తోత్రం తొలిశ్లోకం లోనే మన అహం తొలగించుకోవాలని ఉద్బోధిస్తున్నారు. క్రియారహితమైన నిర్గుణ పరబ్రహ్మమును స్పందింపచేయగలదీ,  బ్రహ్మవిష్ణురుద్రులచే ఆరాధింపబడునదీ అయిన గొప్పశక్తి అమ్మవారు అని నొక్కిచెప్పుతున్నారు. "హరిహరవిరిచ్ఞ్యాధిభిరపి ఆరాధ్యాం" అంటున్నారు ఆచార్యులు. అమ్మవారికి సాష్టాంగం చేయాలనీ, స్తోత్రంచేయాలనీ ఆలోచించటానికి కూడా మనకు శక్తిలేదు. ఆమెను ప్రార్థించాలన్నా, స్తోత్రం చేయాలన్నా ఆమె కరుణ కావలసినదే. ఆ కరుణకోసం మనం ధార్మికజీవనం సాగించాలి. మనం భక్తితో, నీతిమంతంగా జీవించాలి. తొలిశ్లోకంలో ఈ విషయము అంతర్లీనంగా చెప్పబడింది.

(సశేషం)
తరువాతి భాగం : పంచకృత్య పరాయణా

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట




రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : వినయము, మాటాడుట
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)

బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియంవదః |
వీర్యవాన్నచ వీర్యేణ మహతా స్వేన విస్మితః ||


(అయోధ్యాకాండ తొలి సర్గ)

రాముడు ప్రశస్తమైన బుద్ధి కలవాడు. లోకులందరూ ఎట్లు సుఖముగా ఉందురా అని సర్వదా ఆలోచించెడివాడు. అట్టివాడు బుద్ధిమంతుడు. శ్రీరాముడు మధురభాషి. మాటాడినప్పుడు ఎదుటివారి చెవులకు వినవలెనని అనిపించునట్లు , మనసునకు వెగటు కలుగనట్లు మాటాడువాడు. శ్రీరాముడు పూర్వభాషి , గొప్పవాడు. తక్కువవాడు అని ఆతనికి తెలియదు. ఎవరు తన వద్దకు వచ్చిననూ వారిని తానే ముందుగా పలకరించి మాటాడెడివాడుట. ఆతడు ప్రియంవదుడు. మనసుకు నచ్చునట్లు మాటాడెడివాడు. ఏమియూ చేతకానివారు అట్లు ఉందురని అనుకుందురేమో? కాని రాముడు వీర్యము కలవాడు. అనగా ఎంతటి మనసును చెడకొట్టు సన్నివేశములోనైననూ చెదరని మనసు కలవాడు. ఆతని పరాక్రమమును చూసి ఎంతటి గొప్పవారు అయిననూ కలత చెందెడివారు. ఇట్టి శక్తి చాలామందికి ఉండును. కాని అట్టి శక్తి కలుగగనే గర్వము కలుగును. దానిచే ఇతరులను తక్కువగా చూడవలెనని అనిపించును. కాని రాముడు తాను ఎంత శక్తిమంతుడు అయిననూ గర్వపడెడివాడు కాదుట. వినయము తరుగక , చెదరక ఉండెడివాడు. శక్తితోబాటు గర్వము కలుగుట మానవుని క్రిందకు దిగజార్చును.

Tuesday 19 July 2016

భక్తి మార్గము, జ్ఞాన మార్గము : పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-5



భక్తి మార్గము, జ్ఞాన మార్గము
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-5

"ఈ జగత్తంతా మిధ్య , నిర్గుణనిశ్చల పరబ్రహ్మమైన శివమే ఏకైక సత్యము, తక్కినదంతా మాయ", ఇదీ ఆచార్యుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును ఆచార్యులు తమ వాదనల ద్వారా, రచనలద్వారా వ్యాఖ్యానముల ద్వారా బోధించారు. తమ లక్ష్యము - నిర్గుణనిశ్చల పరబ్రహ్మము. "బ్రహ్మమును స్పందింపచేసే శక్తి" అను భావనను వారు తీవ్రంగా వ్యతిరేకించి దానిని మాయగా త్రోసిపుచ్చారు.  కానీ ఈ స్త్రోత్రంలో వారు శక్తిని " నీవులేక శివుడు జగద్వ్యాపారమెలా సాగించగలడు ?" అని శ్లాఘిస్తున్నారు. శివుని స్పందింపజేసి అమ్మవారు ఈ జగత్తు నడవటానికి కారణమవుతున్నదనీ ఎంతో ఆనందంగా చెబుతున్నారు. "ఇదంతా నీ పనే తల్లీ" అంటున్నారు.

ఒక మనిషి ఇలా రెండు విధాలుగా మాట్లాడవచ్చునా ? ఏది సత్యం ? ఒకటి సత్యమైతే రెండవది అసత్యమా ? ఆచార్యులు ఇలా రెండు నాల్కలతో రెండు మాటలు మాట్లాడి ఉండవచ్చునా?

నిజానికి రెండూ సత్యమునే తెలియజేస్తున్నాయి.

అలా ఎలాగ సాధ్యమవుతుంది ? పరస్పర విరుద్ధముగా నున్న ప్రతిపాదనలు రెండూ సత్యములెలా అవుతాయి ?

తార్కికంగా రెండూ సత్యములు కాలేవు. కానీ సత్యము యొక్క లక్షణాలు ఎప్పుడూ తర్కముద్వారా నిరూపించలేము. ఆచార్యులు మనుష్యులను జ్ఞానమార్గములో వెళ్ళగలిగినవారు, భక్తిమార్గములో వెళ్ళేవారు అనే రెండు తరగతులుగా విభజిస్తున్నారు. - జ్ఞానమార్గములో వెళ్ళగలిగినవారికి తమ అద్వైత గ్రంథములద్వారా బోధిస్తున్నారు. భక్తిమార్గపరుల ఆధ్యాత్మిక ఉన్నతికోసం సౌందర్యలహరి వంటి స్తోత్రాలను రచించారు. పరిపక్వత చెంది, జగత్తుకు మూలవస్తువు తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నవారిని బహురూపమైన ఈ జగత్తును తిరస్కరించమని చెబుతున్నారు. అలాగే శరీరాన్నీ, ఇంద్రియాలనూ, ఒకే వస్తువునుండి సుఖదుఃఖాలను పొందే మనస్సునూ తిరస్కరించి చైతన్యరహితమైన మూలపదార్థములో లయమవమని బోధిస్తున్నారు. ఇది జ్ఞానమార్గము.

ఈ ప్రాపంచిక విషయాలను వెంటనే వదలివేయలేని వారూ, జ్ఞానమార్గముగుండా వెళ్ళుటకు కావలసిన పరిపక్వత లేనివారూ ఉంటారు. ఆచార్యులవారు అటువంటి వారికి భక్తిమార్గముచూపుతున్నారు, అలా చూపుతూనే ఆ మార్గము లో వారు పరిపక్వత చెందే విధంగా తీర్చిదిద్దుతున్నారు.  కేవలం ఈ క్షణంలో ప్రాపంచిక సుఖాలను, విషయాలనూ వదలివేయలేని కారణంచేత, అటువంటి వారు, సత్యవస్తువైన బ్రహ్మమును మరచిపోయి, ఇంద్రియభోగాలు, సుఖదుఃఖాల వలయంలో చిక్కుకుపోకూడదని ఆచార్యుల ఆరాటం. వారందరికీ ఆచార్యులు "ఆ సత్యవస్తువైన నిశ్చల బ్రహ్మమే శక్తితో కలసిన ఈశ్వరునిగా ఆవిర్భవించి ఈ జగత్తును పాలిస్తోంది" అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ ఈశ్వరుని లీలగా చూడమనీ, తమ మనస్సునూ ఇంద్రియాలనూ  ఈశ్వర ధ్యానంలోనూ, పూజలోనూ, ఈశ్వరుని లీలలు వినుటలోనూ, స్తుతించుటలోనూ మమేకం చేయమని ఉద్బోధిస్తున్నారు. ఇలా సగుణబ్రహ్మమైన ఈశ్వరుని మనస్సు, ఇంద్రియాలతో పట్టుకున్నట్లైతే, భగవంతుడి కరుణతో ఈ విషయవాసనలు త్యజించగలిగి, నిర్గుణ నిశ్చల బ్రహ్మమును చేరుటకు కావలసిన పరిపక్వత పొందుతారు.

ఒక బక్కపలచని, ఎముకలగూడులాంటి బిడ్డడు అన్నం తిననని మారాం చేస్తున్నాడనుకోండి. వాళ్ళ తల్లి ఏం చేస్తుంది ? మంచి మాటలూ కథలూ చెబుతూ, పెరట్లోకి తీసుకువెళ్ళి చెట్టుకొమ్మపై కాకిని చూపుతూ కొంచెం పెద్దపెద్ద ముద్దలు పెడుతుంది. ఆ తల్లికి అజీర్తితో బాధపడే మరో బిడ్డడు ఉన్నాడనుకోండి. ఆమె ఇంకొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఆ పిల్లవానికి కావలసిన ఆహారం పెడుతుంది.  మనం ఆ తల్లికి నిజాయితీ లేదనీ, పిల్లలను వేరువేరుగా చూస్తోందనీ అనగలమా ?

(సశేషం)

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : సజ్జన సాంగత్యము




రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : సజ్జన సాంగత్యము
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) 


శీలవృద్ధైర్జ్ఞానవృద్ధై ర్వయోవృద్ధైశ్చ సజ్జనైః |
కథయ న్నాస్తవై నిత్య మస్త్రయోగ్యాంతరేష్వపి ||

(అయోధ్యాకాండ తొలి సర్గ) 


శ్రీరాముడు పెద్దలతో సహవాసము చేయుటలో చాలా ఆసక్తి చూపెడువాడు. పెద్దరికము మూడు రకములుగా ఉండును.

1. కొందరు శీలముచే అనగా స్వభావముచే పెద్దవారు.
2. కొందరు జ్ఞానముచే పెద్దవారు.
3. కొందరు వయసుచే పెద్దవారు.

మంచి నడువడి గలవారు , స్వభావము గలవారు శీలవృద్ధులు. వారితో కలిసి నడువడిని గూర్చి సూక్ష్మమైన విషయములను వారు చెప్పుచుండగా తెలిసికొనుచుండెడివాడు. తాను చెప్పుచుండెడివాడు. కొందరు భగవద్విషయమున జ్ఞానము కలిగి వేదాంత చర్చలు చేసెడివారు. వారితో కలిసి భగవంతుడి గూర్చి , వానిని పొందెడి ఉపాయమును గూర్చి , ఆత్మ స్వరూపమును గూర్చిచర్చించుచుండెడివాడు. కొందరు జ్ఞానము లేకపోయిననూ , నడవడి తెలియకపోయిననూ మంచివారు అంటే లోకమునకు హితమైన మనసు , మాట , స్వభావము కలవారు అట్టివారు సజ్జనులు. అట్టివారితో నున్నచో సహజముగా మంచితనము అలవడును. జ్ఞానము లేకపోయిననూ , నడువడి లేకపోయినను వయసుతో పెద్దలై మంచివారైన వారితో కూడా రాముడు ప్రసంగించుచుండెడివాడట. అట్టివారు లభించినపుడు తనకు అవకాశము లేదనిగాని , తాను అస్త్రాభ్యాసము చేయుచున్నాను కనుక విఘ్నము కలుగునని గాని ఆలోచించెడివాడుకాదట.

అట్టివారి సాంగత్యము లభించుటయే మహాభాగ్యము అని , అస్త్రవిద్యను నేర్చుకొనుటకు తగినట్టి సమయములో మధ్య వారు వచ్చినను సమయము లేదనక తన అభ్యాసమునకు విఘ్నమని భావించక వారితో మంచివిషయములను చర్చించుచుండెడివాడట. ఎన్నో చదివి నేర్చుకొనవలసిన విషయములను సత్పురుషుల సహవాసముచే నేర్చుకొనవచ్చును. అందుకే సజ్జన సాంగత్యము మానవునకు ప్రధానము.

పరమాచార్యుల అమృతవాణి : గోవింద భగవత్పాదాచార్యులు : శంకరాచార్యుల గురుపరంపర



పరమాచార్యుల అమృతవాణి : గోవింద భగవత్పాదాచార్యులు
శంకరాచార్యుల గురుపరంపర
(జగద్గురుబోధలనుండి)

శ్రీ శంకరాచార్య గురు పరంపరలో ఈ గోవింద భగవత్‌ పాదాచార్యులవారి స్తుతి ఒకటి ఉన్నది.

హరి తల్ప హరాంఘ్రి నూపురక్ష్మా ధర సౌమిత్రి బలా త్రి పుత్త్రజన్మా|
జయతా దు ప రే వ మాత్త ధామా జయ గోవిందముని స్స చంద్ర నామా||


గోవిందముని అనగా గోవింద భగవత్‌ పాదులు. 'చంద్రనామా' అనునది పూర్వాశ్రమంలో చంద్రశర్మ అనే పేరు. వారు ఆదిశేషుని అవతారం. హరికి తల్పముగా పరమశివునకు నూపురముగానూ ఉండెడి సత్తా కలవారు. పైగా భూమిని తల మీద మోస్తూ ఉంటారు. క్షమ అనే పదమునుండి క్ష్మా అనే పదం వచ్చింది. క్షమ అంటే ఓరిమి. భూమికి ఓర్మి ఎక్కువ. దానిని ఎంతయినా తవ్వు, ఏమైన చెయ్‌ అది ఏమీ అనకుండా సహిస్తుంది. దానిని మోసేవారికి ఇంకా ఎంత ఎక్కువ ఓర్మి ఉండాలో ఆలోచించండి. ఆయననే సౌమిత్రి, అంటే లక్ష్మణుడు, బలరాముడు, అత్రి పుత్రుడైన పతంజలీ, ఆయనయే చంద్రశర్మ.

నర్మదానదీ తీరంలో ఉన్న చంద్రశర్మ చెట్టుదిగి ఆకుల మూటతో కొంతదూరం వెళ్ళేడు. అతనికి చాలారోజుల నుండి కడుపు తిండి కంటికి కూర్కు లేవు. అందుచే చాలా అలసి ఉన్నాడు. అతడు తన చేతిలోఉన్న ఆకులమూటను తలక్రింద పెట్టుకొని ఒకచోట నిద్రించాడు. ఆ సమీపంలో ఒక గొఱ్ఱ ఆకలములు తింటూ ఉన్నది. అది చంద్రశర్మ తలక్రింద బొత్తిగా ఉన్న ఆకులను చూచి అచటకు చేరి కొన్ని ఆకులు తినివేసింది. అది తినగా మిగిలిన భాగమే నేడున్న మహాభాష్యము. అది తినివేసిన భాగమును అజభక్షితభాష్య మని పిలుస్తారు. చంద్రశర్మ నిద్రనుండి లేచి భాష్యములో కొంత భాగము అజభక్షత మైనందుకు చింతించి మిగిలిన భాగమును చేతబట్టుకొని ఉజ్జయినీ నగరానికి చేరుకొన్నారు.

ఉజ్జయినికి చేరినంతనే చంద్రశర్మను మఠం నిద్ర ఆవహించింది. అతడిచ్చట ఒక వైశ్యుని యింటి అరుగుపై మేను వాల్చాడు. గాఢ నిద్రలో మునిగేడు. అతడు మెలుకవ అన్నది లేక నిద్రిస్తూ ఉన్నాడు.

ఆ వైశ్యుని కొక కూమార్తె ఉన్నది. ఆమె కన్య. తెలివి కలది. ఆమె తమ అరుగుపై ఒడలు తెలియక నిద్రిస్తూఉన్న చంద్రశర్మను చూచింది. కొంతసేపటికి లేస్తాడనుకొన్నది. కాని చంద్రశర్మ లేవలేదు. ఆమె అతనిని మేలుకొలుపుటకు యత్నించింది. కాని చంద్రశర్మకు మెలకువ రాలేదు. ఇతడెవరో తేజస్వి. కాని చాలా కాలంగా ఏ కారణంచేతనో నిద్రాహారములు లేక యీనాడిట్లు నిద్రిస్తున్నాడను కొన్న దామె. అతని ప్రాణములు నెటులైన కాపాడవలెనని ఆ వైశ్యకన్య నిశ్చయించుకొన్నది. కాని ఎలా కాపాడవలెను?

ఆనాడామె పెరుగన్నమును గలిపితెచ్చి యాతనిదేహమునిండా పూసినది. అన్నసారము కొంచెము కొంచెముగా రోమకూపములద్వారా శరీరమున బ్రవేశించ నారంభించినది. ఆమె మరునాడును అటులేచేసినది. కొన్నిదినములిట్లు చేయగా చంద్రశర్మ నూనెలేక క్షీణించుచున్న ద్వీపజ్వాల నూనె పోసినంతనే జ్వలింప నారంభించినట్లు మేల్కొన్నాడు. మెలుకవ రాగానే చంద్రశర్మ మొదట తన ఆకులమూట భద్రంగా ఉన్నదా లేదా అని చూచుకొన్నాడు. అది భద్రంగానే ఉన్నది. అతడా ఆకులను చేతబట్టుకొని మరల బయలుదేరాడు.

గృహయజమాని అయిన వైశ్యుడిది చూచాడు. అతడు చంద్రశర్మ మార్గానికి అడ్డువెళ్ళి-అయ్యా! ఇదేమి? మీరిట్ల వెడలిపోతున్నారు. నాకూతురు కన్య. కడంటిన మీ ప్రాణాలను ఆమె కాపాడింది. ఆమె మీ తేజమును జూచి మనస్సులో మిమ్ము పతిగా వరించి ఎంతయో సేవచేసి మిమ్ము బ్రతికించింది. అందుచే మీరామెను పెండ్లాడక యిట్లు పోవుట ధర్మముకాదు. రండు! ఆమెను పరిణయమాడుడు అని ప్రార్ధించేడు.

అది విని చంద్రశర్మ ఇదేమి! నేను ఉపదేశము పొందుట పెండ్లియాడుటకా? అని తలచుకొని ఆర్యా! మీ కుమారై చేసిన ఉపకారము దొడ్డది. ఆమెకు భగవానుడు మేలుచేయునుగాక! నేనామెను పెండ్లియాడుట జరుగదు. నాకసలు పెండ్లియం దిచ్ఛ లేదు. నన్ను పోనియ్యండి అని ప్రార్థించేడు.

కాని వైశ్యుడు దాని కంగీకరింపలేదు. అతడు చంద్రశర్మతో-అయ్యా! మీ మాటలు ధర్మబద్ధంగా లేవు. నాకూతురు చేసిన ఇంత సేవను ఒక్క ఆశీర్వచనంతో ప్రక్కకు నెట్టి వేస్తున్నారు. ధర్మాధర్మాలను రాజకదా నిర్ణయిస్తాడు. మీరూ నేనూ రాజునొద్దకు పోదాము. అయన చెప్పినట్లు చేద్దాము-అన్నాడు.

చంద్రశర్మ అంగీకరించాడు. వైశ్యడు, చంద్రశర్మ రాజుయొక్క కొలువులో అడుగుపెట్టేరు. రాజు సింహాసనం మీద కూర్చుండి వీరి రాకను గమనిస్తున్నాడు. ఆయనకు చంద్రశర్మ వయోరూపాలు ఆశ్చర్యానందాలను కలిగించేయి. చంద్రశర్మ తేజస్సుకు రాజు ముగ్ధుడైపోయాడు. ఆయనకును ఒక పెండ్లోడు వచ్చిన కన్య ఉన్నది రాజు మనస్సులో ఈ వర్చస్వి తన కల్లుడైతే! అన్న భావం మెదలింది.

అందుచే ఆయన వైశ్యుని వివాదం ఆలకించకుండానే చంద్రశర్మను జూచి అయ్యా! మీరెవరు? మీకు వివాహమైనదా? నా కూతురును మీరు పెండ్లాడాలి! మీకు అంగీకారమేనా? కాని యీ వివాహాన్ని ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా? అని ప్రశ్నిస్తూ చంద్రశర్మ సమాధానానికి ఎదురుచూడకుండా ఒక సేవకుణ్ణి పిలిచి-పోయి మంత్రిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

ఇది చూచి చంద్రశర్మ, వైశ్యుడు నోటమాట లేక నిలువబడ్డారు. రాజాజ్ఞ విన్నంతనే మంత్రి కొలువులోకి వచ్చేడు. ఆ మంత్రి సూక్ష్మబుద్ధి. కొలువులో నిలువబడి ఉన్న యువకుడై తేజస్వియైన చంద్రశర్మను చూడగానే రాజాజ్ఞలోని ఆంతర్యం అవగతం చేసికొన్నాడు. చంద్రశర్మ తేజోమయ రూపానికి ఆతడుకూడ ముగ్ధుడై-తమ రాజ్యానికి ఇది భాగ్యవంతమైనకాలం అనుకొన్నాడు.

ఆయన విషయం అంతా వివరంగా తెలిసికొని చంద్రశర్మ బ్రాహ్మణుడు కనుక తొలుత బ్రాహ్మణకన్యను పెండ్లాడి పిదప క్షత్రియ వైశ్యకన్యలను క్రమంగా పెండ్లాడవచ్చును, ఇది ధర్మశాస్త్రములంగీకరించిన విషయమే-అని చెప్పేడు.

చంద్రశర్మ ఏంచేస్తాడు! ఒక్క వైశ్యకన్యను వదల్చుకొనడానికి చేసినయత్నం ముగ్గురు కన్యలను పెండ్లాడడానికి దారితీసింది. అతడు తన ముగ్గురు భార్యలకు పుత్రోత్పత్తి అయినంతనే తనదారిని తాను పోతానన్నాడు. రాజు దాని కంగీకరించాడు. క్షత్రియ వైశ్యకన్యలు సిద్ధంగానే ఉన్నారు. ఉత్తమకులంలో పుట్టిన బ్రాహ్మణకన్యను వెదకడం వారికి కష్టంకాలేదు. చంద్రశర్మ ముగ్గురు కన్యలనూ పెండ్లాడేడు. కొంతకాలానికి చంద్రశర్మకు ముగ్గురు భార్యలయందు ముగ్గురు పుత్రులుదయించారు. వెంటనే చంద్రశర్మ బయలుదేరేడు. అతని అన్వేషణం అంతా తనకు వ్యాకరణం, నేర్పిన గురువును గూర్చి. తన గురువు బదరికాశ్రమంలో సన్యాసియై ఉన్నాడని తెలిసికొని చంద్రశర్మ నెమ్మదిగా పయనించి ఆయన వద్దకు చేరుకొన్నాడు. గురువుననకు నమస్కరించి చంద్రశర్మ తనకుకూడ సన్యాసం అనుగ్రహింపవలసినదని ప్రార్థించాడు. ఆయన శిష్యుని యోగ్యత గుర్తించి అనుగ్రహించారు. సన్యాసం స్వీకరించిన చంద్రశర్మ గోవింద భగవత్పాదాచార్య నామంతో ప్రసిద్ధులయ్యేరు. శ్రీ శుకులకు పిమ్మట వచ్చిన ఆచార్యులకు పరివ్రాజకులన్న పేరు ఏర్పడ్డది.

గోవింద భగత్పాదులవారు గురు సన్నిధానంలో బదరికాశ్రమంలో ఉన్న సమయంలోనే శ్రీ శుకులతో వారికి తండ్రియు గురువునైన వ్యాసులు అచటికి వచ్చేరు. శ్రీ శుకులను వ్యాసులను దర్శించి గోవిందభగవత్పాదులు తాము ధన్యుల మయినామని భావించేరు. గోవింద భగవత్పాదులను చూచి వ్యాసులు-ఓయీ! 'బ్రహ్మసూత్రములను' నేను కూర్చేను. వానికి భాష్యం వ్రాయాలి. ఆ భాష్యం వ్రాయడానికి ఈశ్వరుడే భూమి మీద అవతరిస్తాడు. అలా అవతరించి ఆయన సన్యాసం పుచ్చుకొంటారు. లోకంలోని సంప్రదాయాన్ని నిలువ బెట్టడానికి ఈశ్యరావతారమైనప్పటికి వారికి గురువు అవసరం. అందుచే నీవు నర్మదా తీరంలోఉన్న రావిచెట్టుక్రింద నివసిస్తూ వారి రాకకై నిరీక్షించు. ఆయనరాగానే ఆయనకు ఉపదేశం చెయ్యి. ఇది నీవు చేయవలసిన పని'-అన్నారు.

శ్రీశుకులు, వ్యాసులు, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు బదరికాశ్రమంలో సమావిష్టులై చేసిన నిర్ణయమిది.

ఆ నిర్ణయాన్ని అనుసరించి గోవిందభగవత్పాదులవారు నర్మదాతీరానికి బయలుదేరేరు.

ఈ గోవిందభగవత్పాదులకు పూర్వాశ్రమంలో ఏగురువులు వ్యాకరణ శాస్త్రము బోధించారో ఉత్తరాశ్రమంలో వారే యతిధర్మాన్ని అనుగ్రహించారు. అట్లే ఆయన పూర్వాశ్రమంలో ఏవక్షంక్రింద విద్యాగ్రహణం చేశారో ఉత్తరాశ్రమంలో ఆ వృక్షం క్రిందనే నివసిస్తూ శిష్యుని రాకకై ఎదురుచూడసాగేరు.

గోవింద దేశిక ముపాస్య చిరాయ భక్త్యా
తస్మిన్‌ స్థితే నిజమహిమ్ని విదేహముక్త్యా
అద్వైతభాష్య ముపకల్ప్య దిశోవిజత్య
కాంచీపురే స్థితి మవాప సశంకరార్యః


చేయవలసిన పనులన్నీ చేసిన మీదట శంకరాచార్యులవారు కంచిలోనే నివశించి నట్లు పతంజలి చరిత్ర చెపుతోంది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.