Friday 25 November 2016

పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం




పరమాచార్యుల అమృతవాణి :‌ అమ్మవారి అనుగ్రహంతో‌ చిత్తశుద్ధి పొందటం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి


"పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే! నమస్తే జగదేక మాతః" అని శ్యామలా దండకం. ఈ చెరకు వింటి యొక్కయూ పుష్పబాణాలయొక్కయూ సూక్ష్మతత్త్వం లలితాసహస్రంలో "మనోరూపేక్షుకోదండాపంచ తన్మాత్ర సాయకా" అని చెప్పబడ్డది.

చెరకు తీపి. మనస్సున్నూ తీపే. లోకంలోని జనులందరి సమష్టి మనస్సూ ఆమె చేతిలో వున్న చెరకు విల్లు. చెవి, మేనూ, కన్నూ, నాలుకా, ముక్కూ, అనుభవించే విషయాలే తన్మాత్రలు. ఆ తన్మాత్రలనే, పూవుటమ్ములుగా తనచేతిలో పెట్టుకొన్నది. మన కామ నిరోధానికి మనో నిరోధానికి ఆమె కారణం అవుతూంది. ఆమె అనుగ్రహం మాత్రం వుండాలి. మూకకవి తరచు దీనిని గూర్చి ''మీ కటాక్షం శివునే మోహపెడుతోంది, కాని జనుల మోహాన్ని మాత్రం శిధిలం చేస్తుంది.'' అని చెపుతూ వుంటాడు.

కేవలం జ్ఞానమయుడైన ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపజేసే శివకామసుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహ నివృత్తి చేస్తోంది. ఇదే ఆమె విశేషం. మూకకవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం వుంటేనే మనకు చిత్తంలో అవికారం సమదృష్టీ. నిర్మోహస్థితీ కలుగుతుంది.

ఆమె అనుగ్రహం వుంటే ఎంత కామం కలిగించే వస్తువులైనా మనలను చలింప చేయలేవు. ఎట్టి విభూతియైనా లోభపెట్టలేదు. అరిషడ్వర్గములు అంతరించి చిత్తశుద్ధి కలగాలంటే దేవిని ధ్యానించాలి. "అమ్మా దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా వుండేటట్లు నాచిత్తాన్ని పరిశుద్ధంచెయ్యి" అని నిత్యమూ వేడుకోవాలి. ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది. అదియే ఆమె చరణారవిందాలు ఆశ్రయించినందువల్ల కలిగే ఫలం. మనస్సులో లోపమున్నదంటే చిత్తశుద్ధి లేదన్నమాట.

ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం. చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూపధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి. శంకరుల సౌందర్య లహరీ ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయీబవలూ జగన్మాతృ స్మరణముచే దోషనివృత్తి చేసికొని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూనిణికి అర్పించడమే.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/11/blog-post_52.html
 

పరమాచార్యుల అమృతవాణి :‌ భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?


పరమాచార్యుల అమృతవాణి :‌ భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?
(జగద్గురు బోధలనుండి)

#వేదధర్మశాస్త్ర పరిపాలనసభ  @శంకరవాణి


దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. ఆకలివేస్తే దానితో అన్నం తింటాం. ఎండవానలనుండి కాపాడుకోవటానికి నీడ కావాలి. జంతువులకువలెకాక మనకు మానం అనేది ఒకటి ఉన్నది. కదా! అట్టి మానం కాపాడుకోవడంకోసం వస్త్రం కావాలి. అన్నమూ, వస్త్రమూ, ఇల్లూ ఈమూడూ ఒకత్రిపుటి. దీనిని సంపాదించుకోవడంకోసం ఒక ఉద్యోగం, ముందటిమూడూ అక్కరలేకపోతే మానవుడు పని యేమీ చేయవలసిన అవసరం వుండదు.

ఈమూడిటినీ వదలిపెట్టిన మనుజుడు పని యేమీ చేయకుండా వున్నాడని తెలుస్తున్నది. ఇప్పుడు కూడా అటువంటి జ్ఞానులు ఒకరిద్దరు వుండవచ్చు. కాని అది మనకు తెలియదు. ఒక పని చేయడం గాని దానివల్ల కలుగ వలసిన ఫలితం గాని వారి కేమీలేదు. ఏదైనా ఒక పని చేశాడంటే అతడు జ్ఞాని కాడు అని అర్థం.

అన్నం కోసం, ఇంటి కోసం, బట్టకోసం, మనం సతతం యత్నించి సతతమై పోతూ ఉంటాం. సదా దుఃఖరహితులమై ఆనందంగా వుండాలంటే మనము చేసే ప్రతిపనీ ఈశ్వరార్పణం చేయాలి.ఈశ్వరానుగ్రహమే దొరికితే ఇక పనితో పనిలేదు. ఆనందంగా వుండవచ్చు. ఈశ్వరానుగ్రహం దొరకనంతవరకూ ఈ మూడూ కావాలంటే కావాలి. తల వెంట్రుకలన్ని పనులు బరువు నెత్తిమీది నుండి జారిపోదు. పనులను చక్కగానూ చిత్తశుద్ధితోనూ ధర్మానుసారముగానూ చేయవలె నంటే ఈశ్వరునియెడల భక్తి తప్పదు. అందుచేత భక్తినిమాత్రం అవలంబిస్తామంటే ప్రయోజనంలేదు.పనిచేయటం అవసరమే.

ఒక ఆసామి దగ్గర ఇద్దరు సేవకులు వున్నారని అనుకుందాం. వారిలో ఒకడు ఆ ఆసామిని యెప్పుడూ ముఖస్తుతి చేస్తూ ఉంటాడు. మరియొకడు ఆసామికి ప్రేమ లేకపోయినా తానుమాత్రం ఆ ఆసామిని ప్రేమిస్తూంటాడు. ఆసామి మూర్ఖుడైతే తన్నెప్పుడూ స్తోత్రం చేసే సేవకుని ప్రేమిస్తుంటాడు. అతడు బుద్ధిమంతుడైతే ఎప్పుడూ పని చేసే వానిని గాని స్తోత్రము చేసే వానిని గాని ప్రేమించడు. 'ఇది ఆసామి పని ఇది తన పని' అని భేదబుద్ధి లేకుండా భక్తితో 'ఇది అంతా ఈశ్వరుని పని' అని కొరత యేమీ లేకుండా ఏ పని బడితే ఆ పని ప్రీతితో చేసే వానియందు ఆ ఆసామి ఎక్కువ వాత్సల్యం వుంచుతాడు. ఈశ్వరుడు కూడా అట్టి ఆసామే. సర్వజ్ఞుడైన అట్టి ఆసామిని స్తోత్రం మాత్రంచేసి తనివి నొందింప లేము. అతని ఆజ్ఞ శిరసావహింపక ఊరకే స్తోత్రం చేసినంత మాత్రాన అతడు సంతోషించి అనుగ్రహించడు. ఆయనకు కావలసిందేదీ లేదు. దానివల్ల ఆయనకు గౌరవమూలేదు అగౌరవమూలేదు. అట్లాగే మన కర్మల వల్ల గూడా ఆయనకు కావలసిన దేదీ లేదు. విహితమైన కర్మాచరణం మన చిత్త శుద్ధి కోసమే.

స్నానం, సంధ్యా, జపము, హోమము, దేవపూజ అనేవి నిత్యకర్మలు. ఈ ఆరింటినీ, తప్పకుండా చేయాలని పెద్దలు చెపుతారు. ఈ ఆరింటిలోనే అన్నీ అడగి వున్నవి. ఈ కర్మల చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది- షట్‌ కర్మాణి దినే దినే. స్నానం యెలా చేయాలో శాస్త్రంలో చెప్పబడి వుంది. అలా చేస్తేనే ఆత్మశుద్ధి. సబ్బుతో ఒళ్ళుతోముకుంటే దేహం మాత్రం శుద్ధమవుతుంది. స్నానసమయంలో చెప్పవలసిన మంత్రాలుకొన్నిఉన్నవి. మంత్రమనేమాట తెలియకపోయినా రామా! కృష్ణా! అని స్మరిస్తూనైనా స్నానంచేయాలి.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/11/blog-post_25.html


Monday 21 November 2016

శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ : 86 - 100


శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (86 - 100)

పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥


శంకరులు, పూజాద్రవ్యములున్ననూ పూజచేయుట కష్టమే‌ అని అంటున్నారు. దిగంతాలు వ్యాపించియున్న స్థాణుస్వరూపమును భావన ఎటుల చేసేది ?

ఉమాపతీ ! పూజాద్రవ్యములన్నియూ విశేషముగా సమకూర్చబడినవి. కానీ పూజ ఎట్లు చేయుదును ? దుర్లభమైన హంస వరాహ రూపములు నేను పొందలేను. కాబట్టి నాకు నీ‌ శిరస్సు, పాదపద్మములు తెలియవు. ప్రభో! ఆ రూపములు ధరించిన బ్రహ్మ, విష్ణువుల చేతనే యదార్థము తెలిసికొనబడలేదు. (వారూ‌ తెలిసుకొనలేకపోయారు). నేనెంత ?
జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదామ్బుజభక్తిమేవ దేహి ॥ 87 ॥


శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి యెద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక భక్తిమాత్రమే కోరదగిన వస్తువు అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

యదా కృతాంభోనిధిసేతుబన్ధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః ।
భవాని తే లఙ్ఘితపద్మసంభవః
తదా శివార్చాస్తవభావనక్షమః ॥ 88 ॥


శివార్చన, స్తుతి, ధ్యానము సాధారణవిషయములు కావని శంకరులు ఉగ్గడిస్తున్నారు.

ఓ‌ శివా! ఎప్పుడు నేను - సముద్రమునకు సేతువుగట్టినవాడనూ (శ్రీరాముని వంటి వాడను), అఱచేతితో‌ పర్వతరాజమును అణచినవాడను (అగస్త్యుడు వింధ్యాచలమును అణచెను, అటువంటివాడను), బ్రహ్మనుమించినవాడనూ అవుతానో‌ అపుడు నేను నిను పూజించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు సమర్థుడనవుతాను.
నతిభిర్నుతిభిస్త్వమీశపూజా-
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥


శంకరులు శివుడు భోళాశంకరుడని, భక్తసులభుడని ఈ శ్లోకములో‌ చూపుతున్నారు.

ఈశ్వరా! నీవు నమస్కారములచేతనూ, స్తుతిచేతనూ, పూజావిధులచేతనూ, ధ్యాన సమాధులచేతనూ సంతోషించుటలేదు. నీకు (పూజ)‌ధనుస్సుతోనా , రోకలితోనా, రాళ్లతోనా ?‌ నీకు ఏది ప్రీతియో‌ చెప్పుము, అటులనే చేసెదను.

అర్జునుడు ధనుస్సుతోనూ, రాళ్లతోనూ‌ ఇతర రీతులనవలంబించి శివునితో‌ పోరాడెను. కానీ‌ శివుడు ప్రసన్నుడాయెను, పాశుపతము ఉపదేశించెను. శివభక్తులు (నాయనార్లు) శివుని రోకటితోనూ, రాళ్లతోనూ కొట్టితిరనీ, వారిని శివుడనుగ్రహించెననీ‌ గాధ.

సాధారణ (బాహ్య పటాటోపాల) సాత్వికపూజా విధానములు భక్తి పండనిచో శివుని మెప్పించలేవు. భక్తి పండిన చోట శివుడు సర్వదా ప్రసన్నుడనీ‌ శంకరుల ఉపదేశము.

వచసా చరితం వదామి శంభో-
రహముద్యోగవిధాసు తేఽప్రసక్తః ।
మనసా కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥


శంభో! నేను శాస్త్రవిధిన నిన్ను పూజించుట తెలియనివాడను. నోటితో నీ చరిత్ర పలుకుతాను. మనస్సులో ఈశ్వరుని స్వరూపము ధ్యానించుతాను. సదాశివుని శిరస్సుతో‌ నమస్కరించుతాను.

త్రికరణశుద్ధిగా శివుని సేవించుట ముఖ్యమని శంకరుల ఉపదేశము.

ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీ-
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।
సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం
భావే ముక్తేర్భాజనం రాజమౌళే  ॥ 91 ॥


చంద్రశేఖరా! నీ‌ అనుగ్రహము వలన అనాదిగా నా హృదయమందున్న అజ్ఞానము నాశనమాయెను. హృద్యమైన (అందమైన, మనోహరమైన) జ్ఞానము హృదయమున ఉన్నది. అనుదినమూ శ్రీకరమూ, మోక్షప్రదమూ అగు నీ‌ పాదపద్మములను నేను మనస్సున ధ్యానించుచున్నాను.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, మనస్సుద్వారా చేయవలసిన శివపాదపద్మ ధ్యానము ఉపదేశిస్తున్నారు.

దూరీకృతాని దురితాని దురక్షరాణి
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి ।
సారం త్వదీయచరితం నితరాం పిబన్తం
గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః  ॥92 ॥

గౌరీనాథా! పాపములు, చెడు అక్షరములతో‌ కూడినవి, దౌర్భాగ్యము-దుఃఖము-దురహంకారము కలవీ అగు చెడు వాక్కులు తొలగిపోయినవి (విడచిపెట్టితిని). వేదసారమైన నీ‌ చరిత్రమును నిత్యమూ పానము చేయుచున్న నన్ను ఈ జన్మలో‌ నీ‌ కటాక్షములతో ఉద్ధరింపుము.

శంకరులు త్రికరశుద్ధిగా శివుని సేవించమంటూ, వాక్కుద్వారా చేయవలసిన శివకథా పఠనము ఉపదేశిస్తున్నారు.

సోమకలాధరమౌళౌ
కోమలఘనకన్ధరే మహామహసి ।
స్వామిని గిరిజానాథే
మామకహృదయం నిరన్తరం రమతామ్  ॥93 ॥


శివుని సాకారధ్యానం శంకరులు ఉపదేశిస్తున్నారు.

శిరస్సున చంద్రకళ ధరించినవాడూ, కోమలమైన నల్లమబ్బువంటి కంఠము కలవాడూ, గొప్ప తేజోరూపుడూ, ప్రభువూ అగు గిరిజానాథునియందు నా హృదయము ఎల్లప్పుడూ రమించుగాక.

సా రసనా తే నయనే
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।
యా యే యౌ యో భర్గం
వదతీక్షేతే సదార్చతః స్మరతి  ॥ 94 ॥


శివుని గురించి పలికెడి నాలుకయే‌ నాలుక. శివుని దర్శించు కన్నులే‌ కన్నులు. శివుని అర్చించు కరములే‌ కరములు. శివుని ఎల్లప్పుడూ‌ స్మరించువాడే కృతకృత్యుడు (ధన్యుడు).

ప్రహ్లాదుడు "కమలాక్షునర్చించు కరములు కరములు" అన్నటులే. త్యాగరాజులవారు "ఎన్నగ మనసుకు రాని" అన్నటులే. భగవత్ప్రసాదిత శరీరమూ, ఇంద్రియములచే భగవత్సంబంధిత కార్యములు చేయించుటయే వాటికి కృతకృత్యత.

అతిమృదులౌ మమ చరణా-
వతికఠినం తే మనో భవానీశ ।
ఇతి విచికిత్సాం సంత్యజ
శివ కథమాసీద్గిరౌ తథా వేశః  ॥ 95 ॥


పార్వతీపతీ! " నాపాదములు అతి కోమలములు, నీ‌ మనస్సు అతి కఠినము" అనే సంశయమును విడిచిపెట్టు. శివా! అలా అయితే, పర్వతమందు ఎట్లు సంచరించినావు ?
పర్వతమందు సంచరించు నీ పాదములు నా మనస్సు కఠినమైననూ అందు సంచరించగలవు కాబట్టి శీఘ్రమే‌ నా మనస్సు నందు నీ‌ పాదపద్మములను ఉంచమని శంకరుల ప్రార్థన.

ధైర్యాఙ్కుశేన నిభృతం
రభసాదాకృష్య భక్తిశృఙ్ఖలయా ।
పురహర చరణాలానే
హృదయమదేభం బధాన చిద్యన్త్రైః ॥ 96 ॥


మదపుటేనుగును అదుపులోకి ఎలా తెచ్చుకుంటాము ?‌ అంకుశంతో  కదలకుండా చెయ్యాలి. గొలుసుతో‌ బలంగా లాగి, పనిముట్ల సహాయముతో, గట్టి స్థంభానికి కట్టి వేయాలి. మనస్సు మదించిన ఏనుగు వంటిది. దానిని అదుపులోకి తెచ్చుకుని కట్టివేయుట ఎట్లు ? శంకరుల ఉపదేశం -

భగవద్వాక్యములు, శాస్త్రవాక్యముల వలన వచ్చిన ధైర్యము అను అంకుశము వలన కదలకుండా చేయబడిన మనస్సు అనే‌ యేనుగును - భక్తి అనే గొలుసుచేత బలముగా లాగి - ఈ‌శ్వరలీలావిశేషముల పరిజ్ఞానములు అను పనిముట్లతో‌ - త్రిపురాసురసంహారి పాదములనే స్తంభమునకు - కట్టివేయుము.

ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా
మదవానేష మనః కరీ గరీయాన్ ।
పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా
పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ॥ 97 ॥


భక్తితో మనస్సును బంధించమని శంకరులు మరలా ఉపదేశిస్తున్నారు.

మనస్సనే‌ ఈ‌ బలిష్ఠమైన మదపుటేనుగు అడ్డులేక అంతటనూ తిరుగుతున్నది. దృఢమైన ఈ యేనుగును భక్తి త్రాటితో యుక్తిగా బంధించి బ్రహ్మపదమును (పరమేశ్వరుని పాదమును) చేర్చుము.

సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ॥ 98 ॥

శంకరులు తమ కవితాకన్యకను శివునికి అర్పిస్తున్నారు.

గౌరీవల్లభా! కల్యాణి అయిన నా కవితాకన్యకను నీవు స్వీకరింపుము. ఈమె సర్వాలంకారములు కలది, సరళమైన పదములు కలది, మంచి నడవడిక కలది, మంచి వర్ణము కలది, బుద్ధిమంతులచే పొగడబడునది, సరసగుణములున్నది, సులక్షణములు కలది, ప్రకాశించు ఆభరణములు కలది, వినయము కలది, స్పష్టమైన అర్థరేఖ కలది.

ఈ శుభ కన్యకా లక్షణములు, శంకరుల కవితాకన్యకకూ‌ వర్తించునట్లు కావ్యాలంకారం.

ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలధే
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।
హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ
కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోఽసి పురతః ॥ 99 ॥


పరమశివా! కరుణాసముద్రుడా! ఇది నీకు తగునా ? నీ‌ పాదపద్మములు, శిరస్సు చూచుటకై హరి, బ్రహ్మలు జంతురూపములు ధరించి భూమిలోనూ‌ ఆకసములోనూ సంచరించి శ్రమచెందిరి. ప్రభూ! శంభో! నాకు ఎలా అగుపించెదవో చెప్పుము.

శివుడు భక్తపరాధీనుడు కాబట్టి విష్ణుబ్రహ్మలకూ కన్పడని తన స్వరూపం భక్తులకు దర్శనము చేయునని ఉపదేశం.

స్తోత్రేణాలమహం ప్రవచ్మి న మృషా దేవా విరిఞ్చాదయః
స్తుత్యానాం గణనాప్రసఙ్గసమయే త్వామగ్రగణ్యం విదుః ।
మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ-
ద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః ॥ 100 ॥


శంభో! స్తోత్రము చాలు. నేనబద్ధము చెప్పను. బ్రహ్మాదిదేవతలు, స్తుతించతగినవారిని లెక్కించునప్పుడు నీవు అగ్రగణ్యుడవని తెలిసికొనుచున్నారు. మహాత్మ్యములో గొప్పవారిని గూర్చి విచారించునప్పుడు , వారు తుచ్ఛధాన్యపుపొట్టు రాశి వలె ఎగురబట్టబడుతున్నారు. నీ భక్తులు నిన్ను సర్వోన్నత ఫలముగా తెలుసుకొనుచున్నారు.

Thursday 17 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 - 85



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 - 85

కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।
కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్స ముక్తః ఖలు ॥ 81 ॥


శంకరులు జీవన్ముక్తులు అనగా ఎవ్వరో‌ చెప్పుచున్నారు.

ఉమామహేశ్వరా! కొంచెము సేపు నీ‌ పాదపద్మములను పూజించుటలోనూ, కొంచెము సేపు నీకు నమస్కారములు చేయుటలోనూ, కొంచెము సేపు నీ‌ధ్యానము లోనూ, సమాధిలోనూ, కొంచెము సేపు నీ‌ కథలను వినుటలోనూ, కొంచెము సేపు నీ‌ దర్శనములలోనూ, కొంచెము సేపు నిన్ను స్తుతించుటలోనూ, ఈ‌ విధముగా సంతోషముగా నీకు మనస్సర్పించిన స్థితిని చేరినవాడు జీవన్ముక్తుడు.

శంకరులు ఈ శ్లోకముద్వారా మనస్సును బాహ్యవిషయములపై నిలుపక నిరంతర భగద్విషయ నిమగ్నము అవవలెనని ఉపదేశిస్తున్నారు. కేవలం ఒకే విషయముపై మనస్సు నిశ్చలముగా ఉండుట దుస్సాధ్యము కాబట్టి, జపధ్యానాది బహువిధ భగవత్సంబంధ కర్మలను ఆచరించవలెనని ఉపదేశిస్తున్నారు.

ఉమామహేశ అనే సంబోధన ద్వారా ఇరువురినీ‌ సేవించాలని సూచితము.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదఙ్గవహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదాన్యోఽధికః ॥ 82 ॥


పార్వతీ‌పతీ! హరి (త్రిపురాసురసంహారమున) నీకు బాణము అయినాడు. వృషభరూపములో‌ నీకు వాహనము అయినాడు. నారాయణియై అర్థశరీరముతో‌ నీకు భార్య అయినాడు. నీ‌ పాద దర్శనమునకై వృషభరూపము దాల్చినాడు. నీకు మిత్రుడు అయినాడు. నీ తాండవవేళ మృదంగము వాయించువాడు అయినాడు. నీ పాదములయందు తన నేత్రమును సమర్పించినాడు (శివుని సహస్రకమలపూజలో‌ ఒక కమలము తక్కువ అవగా, విష్ణువు తన కంటినే పూవుగా సమర్పించినాడని పురాణగాధ). నీ‌ శరీరమందు ఒక భాగముగానే‌ వర్తించినాడు. అందుచేతనే పూజ్యులచేతకూడా పూజింపబడినవాడు అయినాడు. కానిచో, వానికంటే శ్రేష్ఠుడు ఎవరున్నాడు ?
శివుని అమితముగా సేవించుట చేతనే విష్ణువుకు సర్వపూజ్యత్వం లభించిందని భావం.

జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృతరూపం సామ్బమీశం భజన్తే
య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభన్తే ॥ 83 ॥


జనన మరణములు కల దేవతలను పూజించుటచే‌ కొంచెము కూడ సుఖము కలుగదు. ఈ‌ విషయములో‌ సందేహము లేదు. పుట్టుట, గిట్టుట లేనివాడూ, అమ్మవారితో కలసి ఉన్నవాడు అయిన పరమేశ్వరుని ఎవ్వరు ఈ‌ లోకముననే పూజించెదరో వారు ధన్యులు, మోక్షమును పొందెదరు.


శివ తవ పరిచర్యాసన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకలభువనబన్ధో సచ్చిదానన్దసిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ॥ 84 ॥


శివా! సకల లోక బంధువా! సచ్చిదానంద సముద్రుడా! భవా! గౌరీదేవితో‌ కలసి నీవు దయతో నా హృదయగృహంలో ఎప్పటికీ నివసింపుము. మీకు సపర్యలు చేయుటకై గుణవంతురాలగు నా బుద్ధి కన్యను ఇచ్చెదను.

శివ (మంగళము, సౌభాగ్యము), భవ (ఉత్పాదకత్వం), సకలభువనబంధు, సచ్చిదానందసింధు, సదయ - ఈ‌ శబ్దములతో‌ శంకరులు తమ బుద్ధి కన్య యొక్క వరుని (శివుని) గుణములను చూపుతున్నారు.


జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ॥ 85 ॥

శివుడు క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషమును నేరేడుపండువలే తినినవాడు. ఆ మథనంలో‌ ఉద్భవించిన చంద్రుని శిరముపై పువ్వువలె ధరించినవాడు. పాతాళలోకమునందుండు సర్పములు ఆయనకు భూషణములు. అడవిఏనుగు చర్మము ఆయన ధరించే వస్త్రము. శివునికి తగిన పరిచర్యలు పూజలో తాము చేయలేమని శంకరులంటున్నారు.

చంద్రశేఖరా! నీకు ఆహారము, పుష్పము, ఆభరణము, వస్త్రములతో‌ కూడిన పూజను నేను ఏ విధముగా చేయగలను ? నేను సముద్రమథనము చేయుటకు సమర్థుడను కాను. కాబట్టి కాలకూటవిషము ఆహారముగానూ, చంద్రుని కుసుమముగానూ‌ ఈయలేను. పాతాళమును భేదించలేను. కాబట్టి సర్పములు ఆభరణముగా తేలేను. అడవిలో‌ మృగములను వేటాడుటకు బోయవాడను కాదు. కాబట్టి గజచర్మము ఆభరణముగా సమర్పించలేను. ఏమి చేయను ?

భావనామాత్రసంతుష్టాయై నమోనమః - సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః...

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 76 - 80


శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 76 - 80

భక్తిర్మహేశపదపుష్కరమావసన్తీ
కాదమ్బినీవ కురుతే పరితోషవర్షమ్ ।
సమ్పూరితో భవతి యస్య మనస్తటాక-
స్తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాఽన్యత్ ॥ 76 ॥


ఎవరి జన్మ సఫలము ? శంకరులేంచెబుతున్నారో‌ చూడండి.

భక్తి మేఘము పరమేశ్వరుని చరణాకాశమును ఆశ్రయించి ఆనందవర్షము కురిపించుచున్నది. (ఆ వర్షానికి)‌ ఎవ్వని మనో‌తటాకము (మనస్సనే చెరువు)‌ నిండిపోతుందో‌ వాని జన్మము అనే‌ పైరు మొత్తము సఫలము. ఇతర జన్మములు సఫలములు కావు.

భగవంతుని పాదములపై భక్తి చేతనే ఆనందప్రాప్తి తద్వారా జన్మ సాఫల్యమూ‌ సాధ్యమని శంకరుల ఉపదేశము.


బుద్ధిఃస్థిరా భవితుమీశ్వరపాదపద్మ-
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరన్తీ ।
సద్భావనాస్మరణదర్శనకీర్తనాది
సంమోహితేవ శివమన్త్రజపేన విన్తే ॥ 77 ॥


శంకరులు భగవద్భక్తుల లక్షణములు వివరిస్తున్నారు.

పరమేశ్వరా! నా బుద్ధి నీ‌ పాదపద్మమందు ఆసక్తి ఉన్నదై , భర్త యెడబాటు కలిగిన భార్యవలే , స్థిమిత పడుటకు సదా ధ్యానము చేయుచూ, శివమంత్రజపముతో‌ మోహముపొందినదై (బాహ్య ప్రపంచమునకు చెందిన విషయముల) భావన, స్మరణ, చూపు, సంభాషణ పొందుటలేదు.

భక్తి పారవశ్యమువలన భగవంతుని విడివడి ఉండలేకుండుట. భగవద్విరహము. భగవంతునిపై పిచ్చి ప్రేమ.


సదుపచారవిధిష్వనుబోధితాం
సవినయాం సహృదయం సదుపాశ్రితామ్ ।
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ ॥ 78 ॥


ప్రభూ! పూజావిధానములయందు బాగుగా శిక్షణ పొందినదీ, వినయ సంపన్నురాలూ, మంచి మనస్సును ఆశ్రయించి ఉన్నదీ అయిన నా బుద్ధిని నూతన వధువువలె, సద్గుణములను ఉపదేశించి ఉద్ధరింపుము.

నిత్యం యోగిమనః సరోజదలసఞ్చారక్షమస్త్వత్క్రమః
శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షఃకవాటక్షతిః ।
అత్యన్తం మృదులం త్వదఙ్ఘ్రియుగలం హా మే మనశ్చిన్తయ-
త్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే ॥ 79 ॥


శంకరులు శంభుని పాదస్పర్శకై ప్రార్థిస్తున్నారు.

శంభో! నీ‌ పద విన్యాసము అనునిత్యమూ యోగుల మనస్సులనే‌ తామరపూల రేకుల యందు సంచరించునది. ఆ పాదముతో‌ కఠోరమైన వాకిలి వంటి యముని వక్షము ఎలా తన్నబడినది ? అయ్యో! అత్యంత మృదులైన నీ‌ పాదయుగళము గూర్చి నా మనస్సు చింతించుచున్నది. నీ‌ పాదయుగళమును ఈ‌ నేత్రములకు కనుపించునట్లు చేయుము. నేను చేతితో నొప్పి పోవునట్లు ఒత్తెదను.


ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి మ-
ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః ।
నోచేద్దివ్యగృహాన్తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ॥ 80 ॥


శంభో! "ఈ మనుష్యుడు జన్మించెదడు. వీని మనస్సు కఠినము, అందు నేను సంచరించవలెను" అని భావించి, నా మనస్సున ఉండి నన్ను రక్షించుటకొరకై నీవు నీ‌ సుతిమెత్తని పాదములు (కఠినమైన)‌ కొండపై ఉంచుట ముందుగానే అభ్యసించినావు. అటు కానిచో‌ దివ్య భవనములు, పూపాన్పులు, యజ్ఞవేదికలు ఎన్నో‌ ఉండగా, శిలలపై నీకు తాండవము ఎందుకు ?


Tuesday 15 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 71 - 75

ఆరూఢభక్తిగుణకుఞ్చితభావచాప
యుక్తైః శివస్మరణబాణగణైరమోఘైః ।
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీన్ద్రః
సానన్దమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్ ॥ 71 ॥


రాజు తన చాపమునుండి బాణపరంపర వర్షించి శత్రువులని నిర్జించి రాజ్యలక్ష్మిని పొందుతాడు. మనుష్యులు, తమ పాపములు అనే శత్రువులను జయించి మోక్షలక్ష్మిని పొందుట ఎలా సాధ్యమో శంకరులు చూపుతున్నారు.

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, పరిపక్వత పొందిన భక్తి అనే అల్లెత్రాటితో‌ వంచబడిన మనస్సు అనే‌ వింటికి కూర్చబడినవీ, అమోఘములూ (వ్యర్థము కానివి) అయిన శివస్మరణము అనే‌ బాణ సమూహములతో‌ పాపములనెడి శత్రువులను నిశ్శేషముగా జయించి, విజయుడై ఆనందముతో‌ మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందుతాడు.

భక్తితో మనస్సును బంధించి నిరంతర శివనామస్మరణ చేయుట ద్వారా పాపరాశి ధ్వంసము చేసుకొని శివసాయుజ్యము పొందవచ్చునని శంకరుల ఉపదేశము.

ధ్యానాఞ్జనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభిరీశ్వరనామమన్త్రైః ।
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి
యే పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః ॥ 72 ॥


భూగర్భములో‌ కొన్ని నిధులు దాగి ఉంటాయి. ఆ నిధులను కొన్ని శక్తులు ఆశ్రయించి ఉంటాయి. సర్పములు వాటిని చుట్టుకొని ఉంటాయి. అలాంటి నిధులను అంజనము (ఒకానొక కాటుక) ద్వారా ఎక్కడ ఉన్నాయో తెలుసుకొంటారు. ఆ నిధిని ఆశ్రయించి ఉండు శక్తులకు బలులు సమర్పించుట ద్వారా ప్రసన్నం చేసుకొని, అచ్చోట భూమిని త్రవ్వి ఆ నిధిని పొందుతారు.

శంకరులు శివపాదపద్మమే‌ భక్తులు పొందదగిన నిధి అంటూ అది పొందు విధానం ఉపదేశిస్తున్నారు.

శివా! నీ ధ్యానమనే అంజనముతో‌ బాగుగా చూచి, నీ నామములు, మంత్రములనే ఉత్తమబలులతో‌ అజ్ఞానమనే భూమిని భేదించి, దేవతలచే‌ ఆశ్రయించబడునదీ, సర్పాభరణము కలదీ‌ అయిన నీ‌ పాదపద్మమును ఈ‌జన్మలో పొందుతున్నవారు కృతార్థులు.

భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ-
భూదార ఏవ కిమతః సుమతే లభస్వ ।
కేదారమాకలితముక్తిమహౌషధీనాం
పాదారవిన్దభజనం పరమేశ్వరస్య ॥ 73 ॥


విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి,భూదేవి భార్యలుగా కలవాడు. అలాంటి విష్ణువు ఏమి కోరుకుంటాడు ?‌ విష్ణువు కూడా సేవించు శివ పాదపద్మములను మనలనూ సేవించమని శంకరులు ఉపదేశిస్తున్నారు.

శ్రీ మహాలక్ష్మి,భూదేవి దేవేరులైన విష్ణువే ఏమి కోరి వరాహరూపము ధరించెను ? (ఈశ్వర పాదారవింద దర్శనాపేక్షచే). కాబట్టి, ఓ బుద్ధిమంతుడా, నీవునూ (వివిధములు గా చెప్పబడే) మోక్షములు అనే ఓషధులు పండు పొలము అయిన పరమేశ్వర పాదారవిందముల సేవను పొందుము.

జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

ఆశాపాశక్లేశదుర్వాసనాది-
భేదోద్యుక్తైర్దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ॥ 74 ॥


నా మనస్సులో‌ పరమేశ్వరపాదారవిందము ఎల్లప్పుడూ ఉండుగాక అని శంకరులు కోరుతూ, అపుడేమగునో‌ అన్యాపదేశంగా చెప్పుతున్నారు.

నా మనస్సు నందు ఆశాపాశములూ, క్లేశములూ, దుర్వాసనలూ (చెడు సంస్కారములు)‌ ఉన్నాయి. సాంబసదాశివుని పాదారవిన్దము నా మనస్సు యొక్క ఈ‌లక్షణాలు పోగొట్టి, దివ్యములూ, విస్తారములూ‌ అయిన పరిమళముల(సుసంస్కారములు) చేత నిండినదానిగా చేయుగాక.

పద్మములు సుగంధములు వెదజల్లి, చెడు వాసనలు దూరం చేయునట్లు, పరమేశ్వరుని పాదపద్మములు చెడు సంస్కారములను దూరం చేయునని భావము.

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము - ఇవి పంచక్లేశములు.

కల్యాణినాం సరసచిత్రగతిం సవేగం
సర్వేఙ్గితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్ ।
చేతస్తురఙ్గమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ॥75 ॥


శంకరులు మనస్సును ఉత్తమాశ్వముతో‌ పోలుస్తూ, సమస్తలోకములకూ‌ ప్రభువైన పరమేశ్వరుడను వృషభవాహనము బదులు ఈ‌ అశ్వమును యెక్కి సంచరింపమంటున్నారు. భక్తి నిండియున్న మనస్సుకూ‌ ఉత్తమాశ్వమునకూ‌ పోలిక ఎలా చెప్పారో చూడండి. చెప్పబడిన ప్రతీ లక్షణమూ అశ్వమునకూ, భక్తిపూరిత మనస్సునకూ‌ వర్తిస్తుంది.

వృషభవాహనుడా! మన్మధుని శత్రువా! జగదాధీశుడా! కల్యాణ లక్షణములు కలదీ, యజమానుడియందు అనురాగముకలిగి చిత్ర గతులలో‌ పోగలదీ, మిగుల వేగముకలదీ, అందరి అభిప్రాయము తెలిసికొనగలదీ, దోషములు లేనట్టిదీ, స్థిరలక్షణములు కలిగినదీ‌ అయిన నా మనస్సనే అశ్వమునెక్కి సంచరింపుము.

సదా నా మనస్సునందు ఉండమని భావము.







Thursday 10 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 66 - 70



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 66 - 70

క్రీడార్థం సృజసి ప్రపఞ్చమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ॥ 66 ॥


శంభో! ఈ సమస్త ప్రపంచమునూ‌ ఆట వస్తువుగా సృష్టించుకొనుచున్నావు. జనులందరూ నీ‌ క్రీడామృగములే. నాచేత చేయబడే కర్మ అంతా నీ‌ ప్రీతి కోసమే చెయ్యబడుచున్నది. నా చేష్టలన్నీ‌ నీ‌ వినోదమునకే కదా! ఓ‌ పశుపతీ ! అందుచేత నన్ను రక్షించడము నీ‌ కర్తవ్యము.

బహువిధపరితోషబాష్పపూర-
స్ఫుటపులకాఙ్కితచారుభోగభూమిమ్ ।
చిరపదఫలకాంక్షిసేవ్యమానాం
పరమసదాశివభావనాం ప్రపద్యే ॥ 67 ॥

శంకరులు భగవద్భావన ఎలా ఉండాలో‌ మనకు నేర్పుతున్నారు.

అనేక విధములయిన ఆనందభాష్పముల ప్రవాహము గల రోమాంచితములు అనుభవించెడు మనోహర ప్రదేశమూ, మోక్షముకోరువారు కాంక్షించెడునట్టిదీ, సర్వోత్కృష్టమైనదీ అయిన సదాశివభావనను శరణువేడుతున్నాను.

పరమేశ్వరభావన నుండి ఆనందభాష్పములు కలుగును. శరీరము రోమాంచితమౌను. మోక్షమును కోరువారు ఈ‌ భావనను ఆశ్రయించెదరు. మనలనూ‌ పరమేశ్వరుని భావన ను ఆశ్రయించమని శంకరుల ఉపదేశము.

అమితముదమృతం ముహుర్దుహన్తీం
విమలభవత్పదగోష్ఠమావసన్తీమ్ ।
సదయ పశుపతే సుపుణ్యపాకాం
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్ ॥ 68 ॥


శంకరులు, పూర్వజన్మల పుణ్యవశాత్తూ‌ మనకు కలిగిన భక్తి ని కాపాడుకోవలెననీ, అందులకు కూడా శివుని ఆశ్రయించమనీ‌ ఉపదేశిస్తున్నారు.

పశుపతీ! అమితమైన సంతోషామృతమును మరల మరల ఇచ్చునదీ, నిర్మలమైన నీ‌ పాదపద్మములనే గోశాలయందు ఉండునదీ, (గత జన్మల)‌ పుణ్యఫలమూ అయిన నా భక్తి గోవును దయతో కాపాడుము.


జడతా పశుతా కలఙ్కితా
కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ ।
అస్తి యది రాజమౌలే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ॥ 69 ॥


శివుడు భక్తవశంకరుడనీ, భోళాశంకరుడనీ, భక్తసులభుడనీ, భక్తులదోషములు ఎంచని ఆర్తత్రాణ పరాయణుడనీ‌ శంకరులు ఉద్బోధిస్తున్నారు. ఎలాంటి పాపులైనప్పట్టికీ‌ శివాశ్రయముచే‌ తరించగలరని అభయమిచ్చుచున్నారు.

పరమేశ్వరా! నాకు జడత్వము, పశుత్వమూ, కళంకమూ, కుటిలత్వమూ లేవు. ఓ‌ చంద్రశేఖరా! ఒకవేళ ఈ గుణాలు నాకు ఉండి ఉంటే, నీ‌కు ఆభరణమయ్యేవాడను కానూ ?

జడత్వము (జలత్వము), పశుత్వము, కళంకమూ, వంకరనడత - ఇవి చంద్రుని లక్షణములు. అలాంటి చంద్రునే‌ శిరోభూషణముగా ధరించిన చంద్రశేఖరుడు మనకు కూడా ఆశ్రయమియ్యగలడని అన్వయము.

జడత్వము (జలత్వము)‌ గల గంగనూ, పశుత్వము గల లేడినీ, కళంకము గల చంద్రునీ, కుటిలచరత్వముగల సర్పమునూ‌ ఆభరణములుగా ధరించిన చంద్రశేఖరుడు మనకు కూడా ఆశ్రయమియ్యగలడని మరొక అన్వయము.

అరహసి రహసి స్వతన్త్రబుద్ధ్యా
వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః ।
అగణితఫలదాయకః ప్రభుర్మే
జగదధికో హృది రాజశేఖరోఽస్తి ॥ 70 ॥


శివపూజనము చాలా సులువైనదనీ, ఫలితము లెక్కపెట్టలేనంతదనీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

బహిఃప్రదేశమునందు గాని, మనస్సునందు గాని చనువుతో‌ పూజచేయుటకు సులభుడూ, ప్రసన్నమూర్తీ, అసంఖ్యాకమైనన్ని ఫలములను ఇచ్చువాడూ, జగత్తుకు అతీతుడూ, ఈశ్వరుడూ అయిన చంద్రశేఖరుడు నా హృదయములో‌ ఉన్నాడు.

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 61 - 65



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 61 - 65

అఙ్కోలం నిజబీజసన్తతిరయస్కాన్తోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సిన్ధు స్సరిద్వల్లభమ్ ।
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిన్దద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ॥61॥

శంకరులు భక్తి అంటే‌ ఏమిటో నిర్వచిస్తున్నారు.

అంకోలచెట్టు విత్తనములు రాలి పడి మరల చెట్టును చేరినట్లు, సూది అయస్కాంతమును అంటుకున్నట్లు, పతివ్రత తన పెనిమిటిని అంటిపెట్టుకుని ఉన్నట్లు, లత చెట్టును పెనవేసుకుని ఉన్నట్లు, నదులు సముద్రుడిని చేరినట్లు, మనస్సు పశుపతి పాదారవిందములను పొంది, ఎల్లప్పుడూ అక్కడే ఉండుటను భక్తి అందురు.

ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం
వాచా శఙ్ఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా-
పర్యఙ్కే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥62॥

తల్లి బిడ్డడిని కాపాడినట్లు భక్తి భక్తుడిని సర్వవిధములుగానూ‌ కాపాడుతుంది అని శంకరులు ఉపదేశిస్తున్నారు.

ఓ‌ దేవా! భక్తి తల్లి, భక్తుడనే శిశువును ఆనందాశ్రువులచే ఒడలు పులకింపజేస్తుంది. నిర్మలత్వము (అనెడు వస్త్రము)చే కప్పుతుంది, మాటలనే శంఖపు ముఖమున ఉన్న నీ‌కథలనే‌ అమృతముతో‌ కడుపునింపుతుంది. రుద్రాక్షల చేతనూ, భస్మముచేతనూ శరీరమును రక్షిస్తుంది. నీ‌ భావన అనే పాన్పుపై పడుకోబెట్టి శిశువును కాపాడుతుంది.


మార్గావర్తితపాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే ।
కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥63॥


శంకరులు భక్తి ఎంత గొప్పదో‌ ఉపదేశిస్తున్నారు. ఈ‌ శ్లోకం భక్తకన్నప్ప యొక్క శివభక్తి విశిష్ఠతకు తార్కాణం.

దారులుతిరిగి (అరిగిపోయిన) చెప్పు పశుపతి శరీరం (శివలింగం) తుడుచు కూర్చె అయినది. పుక్కిలినీటితో‌ తడపుట త్రిపురాసురసంహారికి దివ్యాభిషేకం అయినది. కొంచెం తిని ఎంగిలిచేసిన మాంసపుముక్క, నైవేద్యము అయినది. ఆటవికుడు భక్తశ్రేష్ఠుడయినాడు. ఓహో! భక్తి చేయలేనిది ఏమున్నది ?


వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మారసంమర్దనం
భూభృత్పర్యటనం నమస్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।
కర్మేదం మృదులస్య తావకపదద్వన్ద్వస్య గౌరీపతే
మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాఙ్గీకురు ॥64॥

గతశ్లోకములలో‌ భక్తి అనగా మనస్సు శివపాదపద్మములను వదలక పట్టుకొనుట అన్న శంకరులు, ఆ పాదపద్మములు తన మనస్సులో‌ ఉంచమని శంభుని కోరుకుంటున్నారు.

పార్వతీ‌వల్లభా! యమునిఱొమ్ము తన్నవలెను. అతికఠోర అపస్మార అసురుని అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నీకు నమస్కరించుచున్న దేవతల కిరీటముల రాపిడి ఓర్చుకోవలెను. నీ పాదములు అతి కోమలములు (అవి ఈ కఠినకార్యములు ఎలా చెయ్యగలవు ? ). శంభో! ఎల్లప్పుడూ నా చిత్తమనే మణిపాదుకలను నీపాదములకు తొడిగికొని విహరించుటకు అంగీకరింపుము.

## గౌరీపతే -- కిం వోచతే‌ అని పాఠభేదమున్నది


వక్షస్తాడనశఙ్కయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వలరత్నదీపకలికానీరాజనం కుర్వతే ।
దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ॥65॥


శంకరులు, శివభక్తుని మృత్యువు చేరదనీ, దేవతలు సైతం నమస్కరించెదరనీ, మోక్షము లభిస్తుందనీ‌ ఉపదేశిస్తున్నారు.

ఓ‌ భవానీ‌పతీ! ఎవని మనస్సు నీ‌ పాదపద్మములను భజించుచున్నదో, వానిని చూచి యముడు (నీవు)‌ఱొమ్మును తన్నెదవనే భయముతో‌ పారిపోవుచున్నాడు. వానికి దేవతలు తమకిరీటములనున్న రత్నములనే దీపములతో నీరాజనములిచ్చుచున్నారు. ముక్తికాంత వానిని గాఢాలింగనము చేయుచున్నది. వానికి దుర్లభమైనది ఏమున్నది ?

Thursday 3 November 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 56 - 60



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 56 - 60

నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీశ్రేయసే
సత్యాయాదికుటుమ్బినే మునిమనః ప్రత్యక్షచిన్మూర్తయే ।
మాయాసృష్టజగత్త్రయాయ సకలామ్నాయాన్తసంచారిణే
సాయంతాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 56 ॥


నిత్యుడునూ, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడూ (సత్త్వ-రజ-స్తమో గుణములు కలవాడూ), త్రిపురాసురులను  (స్థూల సూక్ష్మ కారణ దేహములను) జయించినవాడూ, కాత్యాయనీమనోహరుడూ, సత్యస్వరూపుడూ (కాలాతీతుడూ), ప్రప్రథమ సంసారీ, మునిమనస్సులకు గోచరమగు చిత్స్వరూపుడూ, ముల్లోకములనూ మాయచే సృజించినవాడూ, వేదాన్తవేద్యుడూ, ప్రదోషతాండవముతో ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే నమస్కారము.

నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో ।
మజ్జన్మాన్తరపుణ్యపాకబలతస్త్వం శర్వ సర్వాన్తర-
స్తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షనీయోఽస్మ్యహమ్ ॥ 57 ॥


ప్రభూ! ప్రతిదినమూ, నా పొట్ట పోషించుకొనుటకు వ్యర్థముగా ధనాశతో‌ అందరివద్దకూ‌ తిరుగుతున్నాను. నిను సేవించుట తెలియకున్నాను. సర్వాంతర్యామివైన నీవు నా పూర్వజన్మల పుణ్యము ఫలించిన కారణముగానే నాయందు ఉన్నావు. ఓ‌ పశుపతీ! (ప్రపంచమునను పాలించేవాడా!)‌, ఓ‌ శర్వుడా! (పాపధ్వంసకుడా!) ఈ కారణముచేతనైనా నేను నీచే రక్షింపదగువాడను.

ఏకో వారిజబాన్ధవః క్షితినభో వ్యాప్తం తమోమణ్డలం
భిత్వా లోచనగోచరోఽపి భవతి త్వం కోటిసూర్యప్రభః ।
వేద్యః కిన్న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమ-
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ॥ 58 ॥


ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమ్యాకాశములు వ్యాపించిన చీకట్లు తొలగించి నేత్రములకు అగుపిస్తున్నాడు. మరి నీవో, కోటిసూర్యప్రకాశవంతుడవు, తెలుసుకొనదగినవాడవు. అయిననూ‌ నాకు కనుపించుటలేదు. నా (అజ్ఞాన) అంధకారము ఎంతదో కదా! కనుక ఆ (అజ్ఞాన) అంధకారము అంతయునూ‌ తొలగించి, ప్రత్యక్షమై అనుగ్రహింపుము.

హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలామ్బుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా ।
చేతో వాఞ్ఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ॥ 59 ॥


ఓ‌ పశుపతీ! హంస తామరకొలనును ఎలా కోరుకుంటుందో, చాతక పక్షి నల్లమబ్బును ఎలా కోరుకుంటుందో, చక్రవాకము సూర్యుని ఎలా కోరుకుంటుందో, చకోరపక్షి చంద్రుని ఎలా కోరుకుంటుందో, ప్రభూ! గౌరీ రమణా! అలాగ  నా మనసు జ్ఞానమార్గముచే వెదుకబడునదీ, మోక్షసుఖమునిచ్చునదీ అయిన నీ‌ పాదారవిందయుగళమును వాంఛించుచున్నది.

రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్ ।
దీపం సన్తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదామ్భోరుహమ్ ॥ 60॥


ఓ మనసా! నీటిలో‌ కొట్టుకుపోవువాడు ఒడ్డును ఎలా చేరుకుంటాడో, మార్గాయాసముతో‌ బాటసారి చెట్టునీడను ఎలా చేరుకుంటాడో, వర్షముచే భయపడువాడు గట్టి ఇంటిని ఎలా చేరుకుంటాడో, (ఆకొన్న) అతిథి గృహస్థును ఎలా చేరుకుంటాడో, దీనుడు ధార్మికుడైన ప్రభువును ఎలా చేరుకుంటాడో, చీకటిలో‌ చిక్కుకున్నవాడు దీపమును ఎలా చేరుకుంటాడో, చలిలో వణకువాడు అగ్నిని ఎలా చేరుకుంటాడో, అలాగ నీవునూ‌ సమస్తభయములనూ పోగొట్టి సుఖమునిచ్చు శంభుని పాదపద్మమును ఆశ్రయించుము.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.