Saturday 6 August 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 36 - 40



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 36 - 40

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుమ్భే సామ్బ తవాఙ్ఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।
సత్వం మన్త్రముదీరయన్నిజశరీరాగారశుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ॥ 36॥

సాంబశివా! భక్తుడనైన నేను నా మనోభీష్టమైన కళ్యాణము (శుభము, మంగళము) పొందుటకు, ఈ శరీరమనే గృహము శుద్ధి కొరకై నా మనస్సనే కలశమును భక్తి అనే దారముతో చుట్టి, సంతోషము అనే ఉదకముతో నింపి, ప్రసన్నమైన ఈ కలశమునందు నీ పాదములనే చిగురుటాకులను, జ్ఞానమను నారికేళమును ఉంచి, శివమంత్రమును ఉచ్చరించుచూ పుణ్యాహవాచనము చేయుచున్నాను.
ఆమ్నాయామ్బుధిమాదరేణ సుమనస్సంఘాః సముద్యన్మనో
మన్థానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।
సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ॥ 37॥

మంచిమనస్సుకలవారు (దేవతలు, పండితులు) సకలగుణసంపత్తిగల మనస్సును కవ్వముగా చేసి దృఢభక్తి అనే త్రాటితో కట్టి, వేదసముద్రమును ఆసక్తితో మథించుటద్వారా కల్పవృక్షము, కామధేనువు, చింతామణులకు సమానమైనవాడూ (కోరినకోర్కెలు తీర్చువాడూ), బుద్ధిమంతులకు ప్రియమైన నిత్యానందమను అమృతస్వరూపుడూ, మోక్షలక్ష్మీస్వరూపుడూ, ఉమా సహితుడూ అయిన శివుని పొందుచున్నారు.

ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః ।
చేతః పుష్కరలక్షితో భవతి చేదానన్దపాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృమ్భతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38॥

కొండంత పూర్వపుణ్యము వలన దర్శనమగు అమృతస్వరూపుడు, ప్రసన్నుడు, మంగళమూర్తి, సద్గణములచే సేవించబడువాడు, లేడిని ధరించినవాడు, పూర్ణుడు, అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు, ఉమా సహితుడూ అయిన శివుడు మనోఆకాశములో అగుపించెనా, ఆనందసముద్రము ఉప్పొంగును. మంచిమనస్సుకలవారికి (సత్పురుషులకు) వృత్తి (ఆ ఆనందంలో రమించటం) అప్పుడు మొదలవుతుంది.

ధర్మో మే చతురఙ్ఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।
జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ॥ 39॥

మోక్షాధిపతి, సర్వపూజ్యుడు అగు రాజశ్రేష్ఠుడు (చంద్రశేఖరుడు) నా మనోకమలమనే నగరమునందుండగా, ధర్మము నాలుగు పాదములతోనూ బాగా నడుచుచున్నది. పాపము నశించుచున్నది. కామము, క్రోధము, మదము మొదలగునవి తొలగిపోతున్నవి. కాలము సుఖమయమవుతున్నది. జ్ఞానానందమనే గొప్ప ఔషధము బాగుగా ఫలించుచున్నది.
ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై-
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశిదివ్యామృతైః ।
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ॥ 40॥

భగవంతుడా, విశ్వేశ్వరా! బుద్ధి అను యంత్రముద్వారా, వాక్కులనే కుండలతో, కవిత్వములను పిల్లకాలువల వరసల గుండా, నా హృదయమను పొలములోకి తీసుకురాబడిన సదాశివుని చరిత్రమను అమృతసముద్రపు జలముల వల్ల భక్తి అనే పంట బాగుగా విస్తరిస్తోంది. ! నీ భక్తుడనైన నాకు కరువు వల్ల భయం ఎక్కడిది ?

Wednesday 3 August 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 31 - 35



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 31 - 35

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే న గిళితం నోద్గీర్ణమేవ త్వయా ॥ 31 ॥

ఓ పశుపతీ! నీ కుక్షిలోనూ వెలుపలా ఉన్న సకల చరాచరప్రాణులను రక్షించుటకొరకు, సకల దేవతలూ పారిపోవుచుండగా నిలుపుటకు భయంకరమైనదీ గొప్పఅగ్నిజ్వాలలతో నున్నదీ అగు కాలకూటవిషమును కంఠమున నుంచుకొన్నావు. మ్రింగలేదు, కక్కలేదు. నీ పరోపకారత్వమునకు ఈ ఒక్కటీ (నిదర్శనం) చాలదూ ?

జ్వాలోగ్రః సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్ ।
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ॥ 32 ॥

ఓ శంభో ! మహోగ్ర జ్వాలలతో, సమస్థదేవతలకు భయంకలిగించున్న ఆ విషం నీచే ఎలా చూడబడినది ? చేతిలో ఉంచబడ్డది. అదేమైనా మిగులపండిన నేరేడుపండా ? నాలుకయందు ఉంచబడ్డది. అదేమైనా మందుబిళ్ళా ? కంఠములో భరించబడ్డది. ఇదేమైనా ఇంద్రనీలమణి ఆభరణమా ? మహాత్మా! చెప్పవయ్యా!

నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ॥ 33॥

ఓ స్వామీ! అస్థిరులైన దేవతలను ప్రయాసకోర్చి సేవించిననూ ఏమి లభించును ? ఒక్కసారి చేయు నీ సేవకానీ, నమస్కారముకానీ, స్తోత్రముకానీ, పూజకానీ, స్మరణ కానీ, కథాశ్రవణముకానీ, దర్శనముకానీ మాబోటివారికి చాలవూ ? ఇంతకుమించి ముక్తి ఏముండును ? ఎక్కడనుండి కలుగును ? ఇంతకంటే కోరుకోవలసినది ఏమున్నది ?

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ-
ద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపఞ్చం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్దసాన్ద్రో భవాన్ ॥ 34॥

ఓ పశుపతీ! నీ సాహసమేమని చెప్పము ? నీ ధైర్యం ఎవరికి ఉన్నది ? నీవంటి స్థితి ఇతరులు ఎలా పొందెదరు ? దేవతలు పడిపోవుచుండగా, మునిగణము భయపడుచుండగా, ప్రపంచము లయమగుచుండగా, చూచుచూ, నిర్భయుడవై, ఆనందఘనుడవై ఒక్కడివే విహరించెదవు.

యోగక్షేమధురంధరస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాన్తరవ్యాపినః ।
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరఙ్గ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ॥ 35 ॥

యోగక్షేమములభారము వహించువాడవు, సకలశ్రేయస్సులనూ ఇచ్చువాడవు, ఇహపరమార్గములను ఉపదేశించువాడవు, బాహ్యమునందునా, లోపలా వ్యాపించినవాడవు, సర్వజ్ఞుడవు, దయాకరుడవు, నీ విషయమై నేను తెలుసుకొనవలసినది ఏమున్నది ? ఓ శంభో ! నీవే నాకు అత్యంత ఆత్మీయుడవని మనస్సున అనుదినమూ స్మరించుచున్నాను.

Tuesday 2 August 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 25 - 30



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 25 - 30

స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ॥ 25 ॥


బ్రహ్మాది దేవతలు స్తుతించుచుండగా, మహర్షులు జయ జయ ధ్వానములు పలుకుచుండగా, ప్రమథగణములు ఆడుచుండగా, చేతులలో లేడినీ, ఖండపరశువునూ ధరించి, ఉమాదేవి ఆలింగనము చేసికొని యుండగా, మదించిన నంది మూపురముపై కూర్చుని ఉన్న నీలకంఠుడవూ, త్రినేత్రుడవూ అయిన నిన్ను ఎపుడు చూతునో కదా!

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాఙ్ఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమళాన్
అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ॥ 26 ॥


ఓ గిరిశ! నిన్ను చూచి, నీ దివ్యమంగళకరములైన పాదపద్మములను నా చేతులలోకి తీసుకొని, శిరమున ధరించి, కళ్ళకద్దుకొని, వక్షస్థలముపై ఉంచుకొని, కావలించుకొని, వికసితపద్మములనుబోలు పరిమళములను ఆఘ్రాణించుచూ, బ్రహ్మాదులకైనా లభించని ఆనందమును హృదయములో ఎప్పుడు అనుభవింతునో కదా!

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥ 27 ॥


ఓ గిరిశా! బంగారు కొండ నీ చేతిలో ఉంది (మేరుపర్వతము త్రిపురాసురసంహారములో శివునికి విల్లయినది). నీ సమీపమునందే ధనాధిపతి కుబేరుడున్నాడు. నీ ఇంటియందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు. సమస్తశుభములూ నీ పాదయుగళముయందు ఉన్నాయి. నేను నీకు ఏమి ఈయగలను ? నా మనస్సే నీదగుగాక.

సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్ ॥ 28 ॥


ఓ సాంబశివా, భవానీపతే, నిను పూజించునప్పుడు నాకు సారూప్యమోక్షము (శివునితో సమమైన రూపముగల ముక్తి), శివా, మహాదేవా అని సంకీర్తన చేయునప్పుడు నాకు సామీప్యమోక్షమూ (ఎల్లపుడు శివుని చెంతన ఉండగల ముక్తి), గొప్ప శివభక్తిపరుల సాంగత్యములోనూ, వారితో సంభాషణలతోనూ సాలోక్యమోక్షమూ (శివలోకప్రాప్తి అను ముక్తి), చరచరాత్మకమైన నీ ఆకారమును ధ్యానించునప్పుడు సాయుజ్యమోక్షమూ (శివైక్యం అను ముక్తి), నాకు సిద్ధించినది. ఓ స్వామీ నేను కృతార్థుడను.

(ఈ నాల్గువిధముల మోక్షములూ సాధారణముగా దేహానంతరము లభించును. కానీ శివభక్తిపరులకు ఈ లోకమునందే సిద్ధించునని ఆచార్యులు చెప్పుచున్నారు)


త్వత్పాదామ్బుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ॥ 29 ॥


ఓ ప్రభూ, నీ పాదపద్మములను పూజించుచున్నాను. ప్రతిరోజూ పరమాత్ముడవైన నిన్నే ధ్యానించుచున్నాను. ఈశ్వరుడవైన నిన్నే శరణుజొచ్చుచున్నాను. వాక్కుద్వారా నిన్నే యాచించుచున్నాను. శంభో! దేవతలు కూడా చిరకాలంగా ప్రార్థించు నీ కరుణారసదృష్టి నాపై ఉంచవయ్యా. ఓ లోకగురూ! నా మనస్సుకు ఆనందదాయకమైన ఉపదేశం చెయ్యి.

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాఞ్చనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దుచూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ॥ 30 ॥


ఓ చంద్రశేఖరా! ఓ పశుపతీ! సర్వవ్యాపకా! నీకు వస్త్రోపచారము చేయుటకు సూర్యుని వలే వేయిచేతులుండవలెను, నీకు పుష్పోపచారము చేయవలెనన్న విష్ణువు వలే సర్వవ్యాపకుడై ఉండవలెను, నీకు గంధోపచారము చేయుటయందు వాయుదేవుని వలే గంధవాహుడై ఉండవలెను, వంట చేసి నీకు హవిస్సు సమర్పించుటకు అగ్ని ముఖాధ్యక్షుడై ఉండవలెను, నీకు అర్ఘ్యపాత్రము సమర్పించుట కొరకు బ్రహ్మ వలే ఆగర్భశ్రీమంతుడై ఉండవలెను. వీరిలో ఏ ఒక్కరినీ నేను కానపుడు నీకు ఉపచారము చేయుట నా తరమా స్వామీ!

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.