॥ श्री शंकराचार्य कृतं कालभैरवाष्टकम्॥
॥ శ్రీ శంకరాచార్య కృతం కాలభైరవాష్టకమ్ ॥
దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ ।
నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 1 ॥
ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు , పామును యజ్ఞోపవీతముగా దాల్చినవాడు , తలపై చంద్రుని అలంకరించుకున్నవాడు , దయచూపించువాడు , నారదుడు మొదలైన యోగులచే నమస్కరింపబడువాడు , దిగంబరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ ।
కాలకాలమమ్బుజాక్షమస్తశూన్యమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 2 ॥
కోటిసూర్యులవలే ప్రజ్వలించువాడు , సంసారసముద్రమును దాటించువాడు , ఉత్తముడు , నీలకంఠుడు , కోరికలు తీర్చువాడు , మూడుకన్నులు కలవాడు , యమునికేయముడైనవాడు , పద్మమువంటి కన్నులు కలవాడు , నాశము లేనివాడు , స్థిరమైనవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 3 ॥
శూలము - టంకము - పాశము - దండము అను ఆయుధములను చేతులలో ధరించినవాడు , అన్నిటికీ ఆదికారణమైనవాడు , నల్లని శరీరము కలవాడు , ఆదిదేవుడు , నాశము లేనివాడు , దోషములంటనివాడు , భయంకరమైన పరాక్రమము కలవాడు , సమర్థుడు , విచిత్రమైన తాండవమును ఇష్టపడువాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరమ్ సమస్తలోకవిగ్రహమ్ ।
నిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 4 ॥
భుక్తి - ముక్తులనిచ్చువాడు , ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు , భక్తవత్సలుడు , స్థిరమైనవాడు , సమస్త ప్రపంచమునూ నిగ్రహించువాడు , నడుమునందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంటలు ధరించినవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణకేశపాశశోభితాఙ్గనిర్మలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 5 ॥
ధర్మమును రక్షించువాడు , అధర్మమును నాశనం చేయువాడు , కర్మపాశములను విడిపించువాడు , సుఖమునిచ్చువాడు , అంతటా వ్యాపించినవాడు , బంగారు వన్నెకల కేశపాశములతో శోభిల్లు నిర్మలశరీరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్ ।
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 6 ॥
అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు , నిత్యుడు , అద్వితీయుడు , ఇష్టదైవము , నిరంజనుడు , యముని అహంకారమును నాశనం చేసినవాడు , భయంకరమైన కోరలు ఆభరణములుగా కలవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ ।
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 7 ॥
అట్టహాసముతో బ్రహ్మాండమును బద్దలు చేయువాడు , చూపుతో పాపములను తొలగించువాడు , ఉగ్రముగా శాసించువాడు , అష్టసిద్ధులను ప్రసాదించువాడు , కపాలమాల ధరించినవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే ॥ 8 ॥
భూతనాయకుడు , విశాలమైన కీర్తి కలిగించువాడు , కాశీలో నివసించువారి పుణ్యపాపములను శోధించువాడు , సర్వవ్యాపి , నీతిమార్గపండితుడు , పురాతనుడు , ప్రపంచరక్షకుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ।
శోకమోహలోభదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రిసన్నిధిం ధ్రువమ్ ॥ 9 ||
మనోహరమైనది , జ్ఞానమును- ముక్తిని కలిగించునది , అనేక పుణ్యములను పెంపొందించునది , శోకము - మోహము - దీనత్వము - కోపము - పాపములను నశింపచేయునది అగు కాలభైరవాష్టకము పఠించువారు నిశ్చయంగా కాలభైరవ పాదసన్నిధిని చేరెదరు.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం కాలభైరవాష్టకం సమ్పూర్ణమ్॥