Friday, 18 March 2016

పరమాచార్యుల అమృతవాణి : జీవితలక్ష్యం




పరమాచార్యుల అమృతవాణి : జీవితలక్ష్యం
(జగద్గురుబోధలనుండి)

#వేదధర్మశాస్త్ర పరిపాలన సభ @శంకరవాణి

సృష్టిలో పశుపక్షికీటకాదులు ఉన్నాయి. మానవుల మనపడే మనమూ ఉన్నాం. వీనితో మనలను పోల్చిచూచుకొంటే భగవంతుడు మనకు కొన్ని విలక్షణములైన శక్తులను ప్రసాదించి ఉన్నాడని తెలుస్తున్నది. మనకు యోచన ఉన్నది. వివేచనున్నది. వాగింద్రియమున్నది. జగద్రహస్యాలనుశోధించగల, భేదించగల శక్తి ఒక్క మానవవర్గానికే ఉంది. నానావిధాలైన వస్తువులను యంత్రసహాయంతో నిర్మించగల నేర్పు మనదే. కాని పశు పక్షి క్రిమి కీటకాదుల గమనిస్తే వాని జీవితాలలో ఇంత వైవిధ్యం కనుపించదు.

ఏ గుహలలోనో, గుళ్ళలోనే, తొఱ్ఱలలోనో, బొరియలలోనో అవి సంతోషంగా వాసంచేస్తూ ఉంటవి. తినడం పెరగటం కాలంతీరితే నశించడం ఇదీ వాని జీవితం. మనవలె అనుక్షణ భయోద్వేగాలతో అవి బాధపడవు. వానికి కామక్రోధాలున్నవి. కాని నిలకడలేదు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటవి. కాని భీతి మానవునిమాత్రం వడలక వెన్నాడుతూనే ఉంటుంది. మానవుని పీడించే ఈ భీతులలో కొన్ని నిజమై ఉండవచ్చు, కానీ ఎక్కువపాలు వాస్తవదూరములై ఊహా ప్రపంచానికి సంబంధించినవై ఉంటవి. కామం, క్రోధం, మాత్సర్యం, దుఃఖం, బాధ ఇవన్నీ కలిసి మనతో సాధారణంగా సహయోగంచేస్తూ ఉంటవి. ఐతే మనం పరిశీలించిచూస్తే, దైవసృష్టిలో ప్రతి ఒక్కదానికీ ప్రయోజన మనేదొకటి ఉంటూ ఉంటుంది. కొన్ని పుష్పాలు రాత్రులందే వికసిస్తాయి. అట్లు వికసించేవి తెల్లగా ఉంటాయి. రాత్రి కనపడేరంగు తెలుపేగదు అందుచే తుమ్మెదలు వానిని సులభంగా పసికట్టగలుగుతవి. అట్లే మనకు ఇన్నిశక్తు లిచ్చినాడుకదా వీని ప్రయోజనమేమి? తినడం, తిరగడం, పెరగడం, పైన నిద్రపోవడం. ఇవే ఈశ్వరుడి ఉద్దేశమయితే ఈశక్తులన్నీ మనకు అనవసరంగా ఆయన ఎందుకిస్తాడు. పరమేశ్వరుడు మనకు ఈ వివిధ క్రియా సామర్థ్యం దేనికి ప్రసాదించాడో వాని ప్రయోజనమేమిటో మనం తెలుసుకోవాలి. ఈపరిశీలననే వేదాంత విచార మంటారు. ఇటువంటి వైజ్ఞానిక విచారం జీవితలక్ష్యానికి దారితీస్తుంది. ఋషులు, యోగులు, మహాత్ములు అందరూ విచారించి జీవితలక్ష్యం జన్మరాహిత్యమే అన్న ఒకే ఒక నిశ్చయానికి వచ్చారు. ఒక గోడకు పదిఅడుగుల దూరంలో నిలుచుని పిల్లలు బంతి ఆటలు ఆడుతుంటారు. బంతి గోడకు ఎంత వేగంతో కొట్టితే, అంతవేగంతో ఆ బంతి బాలుని వద్దకువస్తూ ఉంటుంది. గోడకువేసి బంతిని కొట్టుతూ ఉంటే అది మరల మరల తిరిగి వస్తూనేఉంటుంది. అదేరీతిని జీవితంలో మనం సంకల్పాలుచేస్తూ ఉంటాము. అందులోనుంచి కర్మ ఉత్పన్న మౌతుంది. పునః సంకల్పం, పునః కర్మ. ఇట్లు కార్య కారణాలు పౌనఃపున్యంగా కల్గుతూనూ ఉంటవి. మనం వేళకు అడ్డుకోకపోతే, దీనిని అదుపులో ఉంచుకోకపోతే ఈ కార్యకారణచక్రం గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః' బంధ మోక్షాలకు కారణం మనస్సే అన్నారు. అందుచే మనోనిరోథాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సత్యభాషణం, సత్కర్మ, సదాలోచన చేస్తూ త్రికరణముల శుద్ధికై పాటుపడాలి. కామక్రోధాలు జయించాలి. భయదుఃఖాలకు లొంగిపోరాదు. ఈ గుణాలు అలవడడానికి సత్సాంగత్యము చేయాలి. మహాత్ములు నిర్దేశించిన మార్గాలలో నడుస్తూ, దురాలోచనలు దూరంచేసి సతతమూ సత్పదార్థాన్ని చింతిస్తూ సకల శ్రేయానికిన్నీ మూలకారణమైన జగన్మాత, సర్వమంగళను ధ్యానంచేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎవడు చేస్తాడో అతడు జీవించి ఉన్నప్పుడే ముక్తుడై పునరావృత్తి రాహిత్యాన్నీ, మోక్షానంగాన్నీ పొందుతాడు.

శక్నోతీ హైవ యస్పోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌,
కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీనరః


ఎవడు ఈ జీవితమందే శరీరత్యాగానికి ముందే కామ క్రోధ కారణంగా పుట్టిన వికారాలను సహిస్తున్నాడో అతడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనందాన్ని అనుభవిస్తున్నాడు. మరణానికి ముందు మనం ఏలాగుంటామో, మరణించిన తరువాత గూడా అలాగే ఉంటాము. ఇహజీవితంలోనే కామక్రోధాలను అణచి శాంతానందాలను చూచి ఉండకపోతే మరణానంతరం మనం దానిని చూడగల్గుతామనడం కల్ల. అందుకే కృష్ణ పరమాత్మ 'ఇహైమ' అన్న పదప్రయోగం చేస్తూ అంతటితో ఆగక ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌' అని వ్యాఖ్యానమూ చేసినారు. ఐతే ప్రశ్న వేస్తారు. జీవితంలో మాకు వృత్తులున్నాయి. ఉద్యోగాలున్నాయి. మాకు ఎన్నో పనులు ఉన్నాయి. మేము సాధారణ జనులం. ఇంతాచేస్తే కాని మా బాధ్యతలు తీరవు. మీరేమోధ్యానం చేయమంటారు. దానికి కావలసినశక్తి కాలమూఏది? అని అంటారు. జీవనానికి కావలసినవృత్తిని వదలమనలేదు. జీవనవృత్తిని అవలంబిస్తున్నా, జీవితలక్ష్యాన్ని మరువకూడదనే చెప్పడం. త్రికరణశుద్ధికోసం సతతమూ పాటుపడుతూ ఆ జగన్మాత అనుగ్రహంకోసం ప్రార్ధిస్తూ ఉంటేనేకాని, కామక్రోధాలు మనలను వదలిపోవు. నర్తకి తలపై ఒక చిన్న కుండను ఉంచుకొని ఆట ఆడుతూ ఉంటుంది. లయ సంగీత, తాళ, గతులకు అనుగుణంగా పాద విన్యాసం చేస్తున్నా ఏ ఒక్క క్షణమూ తన తలమీద కుంభాన్ని మాత్రం మరువకుండా కాపాడుకుంటూనే ఉంటుంది. అట్లేమనంకూడా అనుదిన కార్యక్రమంలో మునిగి తేలుతున్నా జీవితలక్ష్యాన్ని మాత్రం ఏనాటికీ ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది.

పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియం నజహాతి యోగి,
సంగీత తాఖ లయ నృత్త వశంగతోపి మౌళిస్ధ కుంభ పరిరక్షణ ధీర్నటీవ.


ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.