॥ श्री शंकराचार्य कृतं त्रिपुरसुन्दर्यष्टकम् ॥
॥ శ్రీ శంకరాచార్య కృతం త్రిపురసున్దర్యష్టకమ్ ॥
కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజిత భూధరాం సురనితమ్బినీసేవితామ్ ।
నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౧॥
కదంబవృక్షముల(కడిమిచెట్లు) వనమందు నివసించునదీ , మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు(ఆనందింపచేయు) మేఘమాలయైనదీ, పర్వతములకంటే ఎత్తైన నితంబము కలదీ, దేవతా స్త్రీలచేసేవింపబడునదీ , తామరలవంటి కన్నులు కలదీ , తొలకరి మబ్బువలే నల్లనైనదీ, మూడు కన్నులుకల పరమేశ్వరునికి ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.
కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 2॥
కదంబవనమందు నివసించునదీ, బంగారు వీణను ధరించునదీ, అమూల్యమైన మణిహారములను అలంకరించునదీ, ముఖము నందు వారుణీ ( ఉత్తమమైన మద్యము) పరిమళము కలదీ , అత్యధికమైన దయను కురిపించునదీ, గోరోచనము పూసుకున్నదీ, మూడు కన్నులు కల పరమేశ్వరునికి ఇల్లాలు అయినదీ అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.
కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ 3॥
కదంబవనములోనున్న ఇంటిలో నివసించునదీ, వక్షోజములపై పుష్పమాలనలంకరించుకున్నదీ, పర్వతములవలే ఎత్తైన స్తనములు కలదీ, అధికమైన కృపాసముద్రమునకు తీరము వంటిదీ, మద్యముచే ఎర్రనైన చెంపలు కలదీ, మధుర సంగీతమును గానము చేయుచున్నదీ, వర్ణించనలవి కానిదీ, మేఘమువలే నల్లనైనదీ అగు ఒక లీలచే మనము రక్షించబడుచున్నాము.
కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 4॥
కదంబవనమధ్యమునందున్నదీ, బంగారు మండపము నందు కొలువు తీర్చునదీ, మూలాధారము - స్వాధిష్ఠానము - మణిపూరము - అనాహతము - విశుద్ధము - ఆజ్ఞ అనే ఆరుచక్రములందు నివసించునదీ, ఎల్లప్పుడు యోగసిద్ధులకు మెరుపుతీగవలే దర్శనమిచ్చునదీ, జపాపుష్పము (మంకెనపువ్వు) వంటి శరీరకాంతి కలదీ , శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించినదీ, మూడుకన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.
కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ 5॥
వక్షస్థలము నందు వీణ కలదీ , వంకరయైన కేశములతో అలంకరింపబడినదీ, సహస్రార పద్మమునందు నివసించునదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానముచే ఎర్రనైన కన్నులు కలదీ, మన్మథుని జయించిన శివుని కూడ మోహింపచేయునదీ, మతంగ మహర్షికి కుమార్తెగా అవతరించినదీ, మధురముగా మాట్లాడునదీ అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.
స్మరప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలాం ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ 6॥
ప్రథమరజస్వలయై ఆరక్తబిందువులు అంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మద్యపాత్రను పట్టుకున్నదీ, మద్యపానముచే ఎర్రనై కదులుచున్న కన్నులు కలదీ, ఉన్నతమైన స్తనములు కలదీ, జారుచున్న జడముడి కలదీ, శ్యామల(నల్లనిది) యైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.
సకుఙ్కుమవిలేపనామలకచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ 7॥
కుంకుమతో కలిసిన విలేపనమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ, చిరునవ్వులతో కలసిన కన్నులు కలదీ, పుష్పబాణమును - చెరకువింటినీ - పాశాంకుశములనూ ధరించినదీ, అశేషజనులను మోహింపచేయునదీ, ఎర్రని పూలదండలను - ఆభరణములను - వస్త్రములను ధరించినదీ, జపాపుష్పమువలే ప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించెదను.
పురన్దరపురన్ధ్రికాం చికురబన్ధసైరన్ధ్రికాం
పితామహపతివ్రతాం పటపటీర చర్చారతామ్ ।
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్ ॥ 8॥
ఇంద్రుని భార్యయగు శచీదేవిచే కేశాలంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంథము పూయబడినదీ, విష్ణుపత్నియగు లక్ష్మిచే అలంకరింపబడినదీ, దేవతాస్త్రీలు చెలికత్తెలుగా కలది అగు జగన్మాతను సేవించుచున్నాను.
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం త్రిపురసున్దర్యష్టకం సమ్పూర్ణమ్ ॥