పరమాచార్యుల అమృతవాణి : బ్రాహ్మణులకు ఎందుకు ఎక్కువ నిబంధనలు ?
(జగద్గురుబోధలనుండి)'దేహో దేవాలయః ప్రోక్తో జీవః ప్రోక్త సృనాతనః' దేహమే ఒక దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం. ఆలయంలో భగవంతుడున్నాడు. కనుక అచటికి అశుద్ధిగా పోవటంకాని, అశుద్ధ వస్తువులైన పొగచుట్టలు, మాంసము వగైరాలతో వెళ్ళటంకాని నిషేధించబడింది. ఆశౌచ కాలంలో ఆలయాలకు వెళ్ళరాదని అగమశాస్త్రాలు సైతం ఆదేశిస్తున్నవి.
దేహాన్ని మనం దేవాలయంగా పరిగణిస్తే ఆలయాలను ఎట్లు పరిశుద్దంగా ఉంచడానికి ప్రయత్నిస్తామో, అదే దేహాన్ని శుద్ధంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. దాని కడకు అశుద్ధ పదార్థాలను చేరనీయరాదు. అశుద్ధ పదార్థ సేవనంవల్ల దేహంలో వున్న మంత్రశక్తి చెడిపోతుంది. మనం ఇంటిని కూడా శుద్ధంగా ఉంచుకోవడానికి పాటుపడతాము. కాని శుద్ధి విషయంలో దేవాలయాలకున్న కఠోర నియమాలు ఇండ్లకు లేవు.
కొన్ని దేహాలు దేవాలయాలను పోలివున్నవి. వానిలో ముఖ్యంగా బ్రాహ్మణుని దేహానికి వేదమంత్రాల చైతన్య శక్తిని రక్షించవలసినవిధి ఉంది. అందుచే బ్రాహ్మణుని దేహానికి పారిశుద్ధ్యావశ్యకత మరింత ఎక్కువ. అశుద్ధ పదార్థాలు అంటకుండా దేహాన్ని శుద్ధిగా ఉంచుకొని, మంత్రశక్తి రక్షించుకొంటూ, తన్మూలంగా లోక సంగ్రహార్థం పాటుపడవలసినవిధి బ్రాహ్మణునిది. తన దేహాన్ని దేవాలయంవలె చూచుకోవడం కొరకే బ్రాహ్మణునకు అనేక నిబంధనలు ఏర్పరచారు. 'అందరూ చేస్తున్నారు కదా, ఆ కార్యాలను మనం కూడా ఏలచేయరాదు? అందరూ శారీరకంగా సంతోషాన్ని అనుభవిస్తున్నారుకదా మనమూ వారివలె ఎందుకనుభవించరాదు?' అనే అలోచనలు బ్రాహ్మణునికి తగవు. సంతోషానుభవం కోసంకాదు బ్రాహ్మణుని శరీరం ఏర్పడి ఉండటం. అది వేదరక్షణకై ఏర్పడ్డది. ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించి ఉపనయనం చేసుకోవడమూ దానికొరకే. దేహం దేవాలయంవలె ఉన్నదా అని జాగ్రత్తగా చూచుకొంటూ ఆచారయుక్తమైన జీవనం గడుపుతూ, అందరి సౌఖ్యాలకోసం పాటుపడుతూ ఉండడం బ్రాహ్మణుని విధి.
'అందరూ ఉద్యోగాలుచేస్తూ ఆయా యీ వ్యాపారాలు అవలంబిస్తూ ధనార్జన చేస్తున్నారుకదా, మనమూ ఆ విధంగా ఎందుకు చేయరాదు?' అని బ్రాహ్మణుడు తలంచకూడదు. అమితంగా ధనాన్ని కూడబెడదామన్న ఉద్దేశంతో బ్రాహ్మణుడు అనాచారమార్గాలలో చొరబడరాదు. ఆచార అనుష్ఠానాలను పాటించడానికి వీలులేని దేశాలలో వాసంచేస్తూ ధనార్జన చేయడం బ్రాహ్మణునికి విహితమైన పనికాదు. తన మంత్రశక్తి కాపాడుకొంటూ, తదితరములూ తరువాతవే.
మంత్రశక్తి అనే ఆగ్నిని మనం రక్షిస్తూ వచ్చినామంటే అది మనలను రక్షిస్తూ ప్రజలందరికీ క్షేమకారకమౌతుంది. ఎవరయినా కష్టకాలంలో వచ్చి ప్రార్థిస్తే వారి కష్టాన్ని నివారించే శక్తి మనకు ఉండవలెకదా. 'నీ వెంతో నేనూ అంతే. నీ కెంతశక్తి ఉన్నదో నాకూ అంతశక్తియే ఉన్నది.' అని బదులు చెప్పినామంటే ప్రయోజనమేమి? ఇప్పుడు మంత్రశక్తి అనే అగ్ని దాదాపు ఆరిపోయి ఉన్నది. నివురుగప్పిన నిప్పువలె ఏదో ఒక మూలకొంత మిగిలి ఉన్నది. దానిని మనం ప్రవృద్ధం చేయాలి. ఆ అగ్ని శిఖయేగా గాయత్రి.