Monday 29 February 2016

శంకరస్తోత్రాలు : దేవ్యపరాధక్షమాపణస్తోత్రమ్



॥ श्री शंकराचार्य कृतं देव्यपराधक्षमापणस्तोत्रम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం దేవ్యపరాధక్షమాపణస్తోత్రమ్ ॥

న మన్త్రం నో యన్త్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః ।
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ ॥ 1॥

అమ్మా! నాకు నీ మంత్రమూ తెలియదు. యంత్రమూ తెలియదు. అయ్యో! నిన్ను స్తుతించడం కూడా తెలియదు. నిన్ను ఆవాహన చేయుట తెలియదు. నిన్ను ధ్యానం చేయటం తెలియదు. నీ గాధలు చెప్పడమూ తెలియదు. నీ ముద్రలు తెలియదు, నీకోసం విలపించటమూ తెలియదు. కానీ అమ్మా! నీ అనుసరణ క్లేశములు పోగొట్టుతుందని మాత్రం తెలుసు.

విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా
విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ ।
తదేతత్ క్షన్తవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 2॥

అమ్మా! విధి విధానాలు తెలియకపోవటం చేత, ధనం లేకపోవటం చేత, నా బద్ధకం చేత, నీ పాద పద్మములు సేవించుటలో లోపము జరిగింది.  అమ్మా! సర్వమంగళా, జగద్రక్షకీ, నీకు ఈ తప్పులన్నీ మన్నించదగినవే.  చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సన్తి సరలాః
పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః ।
మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 3॥

అమ్మా! భూమిలో నీ పుత్రులు సాధుజనులైనవారు చాలామంది ఉన్నారు. కానీ వారందరి మధ్యలో నిలకడలేని వాడను నేనొకడను ఉన్నాను. అమ్మా! సర్వమంగళా! కాబట్టి నన్ను నీవు వదలివేయటం తగదు. చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.


జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా ।
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 4 ॥

అమ్మా! జగన్మాతా! నేను నీ పాద పద్మములనెన్నడూ సేవించలేదు. నీకు బోలెడంత ధనమూ నివ్వలేదు. కానీ అమ్మా! నీవు మాత్రం నాపై నిరుపమానమైన మాతృవాత్సల్యం చూపించావు. చెడ్డ బిడ్డ ఉండవచ్చేమో గానీ చెడ్ద తల్లి ఉండదు కదా.

పరిత్యక్తా దేవా వివిధవిధసేవాకులతయా
మయా పఞ్చా శీతేరధికమపనీతే తు వయసి ।
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా
నిరాలమ్బో లమ్బోదరజనని కం యామి శరణమ్ ॥ 5 ॥

దేవతల పూజా విధి విధానాలు ఏవీ చేయని నాకు 85 సంవత్సరాలు గడచిపోయాయి. ఇప్పుడు కూడా నాకు నీ కృప కలుగకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ, నాకు దిక్కెవరు ?

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాతఙ్కో రఙ్కో విహరతి చిరం కోటికనకైః ।
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జననీయం జపవిధౌ ॥ 6 ॥

అమ్మా! ఛండాలుడు (కుక్క మాంసభక్షకుడు), తేనెలూరు తియ్యని మాటలతో మాటకారి అవుతాడు. దరిద్రుడు కోటి కనక రాశితో చిరకాలం అడ్దులేకుండా విహరిస్తాడు. అమ్మా! అపర్ణా! నీకై చేసే ప్రార్థన ఎవరి చెవిలోనైనా పడిన ఫలం ఇది. ఇక నీకై జపం చేసిన ఫలం జనులకు తెలియుట సాధ్యమా ?

చితాభస్మాలేపో గరలమశనం దిక్పటధరో
జటాధారీ కణ్ఠే భుజగపతిహారీ పశుపతిః ।
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవాని త్వత్పాణిగ్రహణపరిపాటీఫలమిదమ్ ॥ 7 ॥

అమ్మా! శంకరుడెలాంటి వాడు ? ఒడలంతా చితాభస్మం అలదుకునేవాడు, విషము ఆహారమైనవాడు, దిగంబరుడు, జడలుకట్టిన జుట్టు ఉన్నవాడు, కంఠంలో పాములని ధరించేవాడు, పశుపతి, కపాలం భిక్షాపాత్రగా కలవాడు, భూతాలకి అధిపతి. మరి ఇలాంటి వాడు ఈ జగత్తంతటికీ ఈశ్వరుడు అని ప్రార్థించబడుతున్నాడంటే, భవానీ! అది నీ పాణిగ్రహణ ఫలమేనమ్మా!

న మోక్షస్యాకాంక్షా భవవిభవవాఞ్ఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః ।
అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః ॥ 8 ॥

అమ్మా!  చంద్ర వదనా ! నాకు మోక్షం పొందాలనే కోరిక లేదు. అనంత ఐశ్వర్యం కావాలనీ లేదు. ప్రాపంచిక విజ్ఞానమూ వద్దు.  సుఖాలు మళ్లీ అనుభవించాలనీ లేదు. కాబట్టి అమ్మా! నిన్ను కోరుకుంటున్నాను. నా జీవితాన్ని "మృడానీ రుద్రాణీ శివ శివ భవానీ" అని నీ నామజపం చేసుకునేలా అనుగ్రహించు.  

నారాధితాసి విధినా వివిధోపచారైః
కిం రుక్షచిన్తనపరైర్న కృతం వచోభిః ।
శ్యామే త్వమేవ యది కిఞ్చన మయ్యనాథే
ధత్సే కృపాముచితమమ్బ పరం తవైవ ॥ 9 ॥

అమ్మా! నిన్ను శాస్త్రోక్తంగా వివిధ ఉపచారాలతో పూజింపలేదు. (నేను) చేయని చెడు తలపు, మాట్లాడని చెడు మాట లేదు. కానీ ఓ నల్లని తల్లీ!  నీవు ఈ అనాధ యందు కృప చూపు  అమ్మా! నీకసాధ్యమైనది ఏదీ లేదు.

ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశి ।
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః క్షుధాతృషార్తా జననీం స్మరన్తి ॥ 10 ॥

 అమ్మా! కరుణా సముద్రా! దుర్గా! ఆపదలయందు నిన్ను స్మరిస్తున్నాను. నన్ను తప్పుగా భావించకమ్మా! ఆకలిదప్పులుగొన్న పిల్లలు తల్లిని స్మరిస్తారు కదా!

జగదమ్బ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి ।
అపరాధపరమ్పరాపరం న హి మాతా సముపేక్షతే సుతమ్ ॥ 11 ॥

జగన్మాతా! నా ఈ అపరాధపరంపర ఉన్నప్పటికీ నీకు నాపై పరిపూర్ణమైన కరుణ ఉంటే, అందులో విచిత్రం ఏమున్నది ? తల్లి బిడ్డను వదలి వేయదు.

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి ।
ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు ॥ 12 ॥ 

అమ్మా! నాతో సమానమైన పతితుడు వేరొకడు లేడు.  పాపములు ధ్వంసంచేయటంలో నీకు సరిజోడు లేరు. మహాదేవీ! ఇది దృష్టిలో ఉంచుకుని, (నను బ్రోచుటకు) ఏది యోగ్యమో అది చేయి.


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దేవ్యపరాధక్షమాపణస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈ స్తోత్రం ఆదిశంకరకృతమూ అనే విషయంలో కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయి

శంకరస్తోత్రాలు : దశశ్లోకీస్తుతిః (శివస్తుతి)



॥ श्री शंकराचार्य कृतः दशश्लोकीस्तुतिः ॥

॥ శ్రీ శంకరాచార్య కృతః దశశ్లోకీస్తుతిః ॥

సామ్బో నః కులదైవతం పశుపతే సామ్బ త్వదీయా వయం
సామ్బం స్తౌమి సురాసురోరగగణాః సామ్బేన సన్తారితాః ।
సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజే
సామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥ 1 ॥

సాంబుడే (జగదంబయగు పార్వతితో కూడిన శివుడు) మా కులదైవము . జీవులను పాలించు ఓ సాంబా! మేము నీవారిమే. సాంబునే స్తుతించుచున్నాను. దేవ - రాక్షస - సర్పగణములు సాంబుని చేతనే తరింపచేయబడినవి. నేను సాంబునకు నమస్కరించుచున్నాను.సాంబుని కంటే ఇతరుని పూజించను. నేను సాంబుని భక్తుడను. పరమాత్మయగు సాంబునియందే నాకు అనురాగము.


విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం
యం శమ్భుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః ।
స్వస్వస్థాననియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత-
స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 2॥

విష్ణుమూర్తి మొదలగు దేవతలు స్వయంగా త్రిపురాసురుని సంహరించుటకు సమర్థులు కాలేకపోయిరి. వారు  " ఓ భగవంతుడా! మేము దాసులము . నీవే మాకు ప్రభువు". అని ఈశ్వరుని వేడుకొనిరి. అంతట శివుడు వారిని వారి వారి స్థానములలో నియమింపగా దేవతలు ప్రశాంత మనస్కు లైతిరి. అటువంటి పరమాత్మయగు సాంబుని యందు నా హృదయము సుఖముగా రమించుగాక.


క్షోణీ యస్య రథో రథాఙ్గయుగలం చన్ద్రార్కబిమ్బద్వయం
కోదణ్డః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారథిః ।
తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజఙ్గాధిప-
స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 3॥

( త్రిపురాసురుని సంహరించునపుడు ) ఏ శివునకు భూమి రథముగానూ , సూర్యచంద్రులు రెండు రథచక్రములుగానూ , మేరు పర్వతము ధనుస్సుగానూ , విష్ణుమూర్తి బాణముగానూ , బ్రహ్మదేవుడు సారథిగానూ , సముద్రము అమ్ములపొదిగానూ , వేదములు అశ్వములుగానూ , సర్పరాజైన వాసుకి వింటి త్రాడుగానూ  అయ్యెనో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


యేనాపాదితమఙ్గజాఙ్గభసితం దివ్యాఙ్గరాగైః సమం
యేన స్వీకృతమబ్జసమ్భవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ ।
యేనాఙ్గీకృతమచ్యుతస్య నయనం పూజారవిన్దైః సమం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 4॥

ఏ శివుడు , మన్మథుని శరీరము దహించగా మిగిలిన బూడిదను దివ్యమైన అంగరాగము ( శరీరముపై పూసుకొను సుగంధద్రవ్యము) తో సమానముగా పూసుకొనుచున్నాడో , బ్రహ్మకపాలమును బంగారు పాత్రలతో సమానంగా స్వీకరించుచున్నాడో, విష్ణుమూర్తి నేత్రమును పూజా పద్మముతో సమానంగా అంగీకరించుచున్నాడో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


గోవిన్దాదధికం న దైవతమితి ప్రోచ్చార్య హస్తావుభా-
వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః ।
యస్య స్తమ్భితపాణిరానతికృతా నన్దీశ్వరేణాభవ-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 5 ॥

" గోవిందుని కంటే గొప్పదేవుడు లేడు " అని బిగ్గరగా పలికి, చేతులెత్తి నమస్కరించి వ్యాసమహర్షి పిమ్మట శివుని వద్దకు వెళ్ళెను. అపుడు శివుని ఆజ్ఞను  పాలించు నందీశ్వరుడు వ్యాసుని చేతులను స్తంభింపచేసెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నాహృదయము సుఖముగా రమించుగాక.


ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానన్దః స్వరూపాయతే ।
వేదాన్తో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 6॥

ఏ శివునకు ఆకాశము జటాజూటముగానూ , పదిదిక్కులు తెల్లని వస్త్రముగానూ , చంద్రుడు తలపై పుష్పముగానూ , మిక్కిలి స్థిరమైన ఆనందము స్వరూపముగానూ , వేదాంతము నివాసస్థానముగానూ , మంచి వినయము స్వభావముగానూ అగుచున్నదో అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


విష్ణుర్యస్య సహస్రనామనియమాదమ్భోరుహాణ్యర్చయ-
న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే ।
సమ్పూజ్యాసురసంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 7 ॥

విష్ణుమూర్తి పద్మములతో శివునకు సహస్రనామార్చన చేయుచూ, ఆపూజలో ఒక పద్మము తక్కువకాగా తామరవంటి తన నేత్రమునే శివుని పాదపద్మములపై సమర్పించి, చక్కగా పూజించి, రాక్షస సంహారము చేయుచూ మూడు లోకములకూ పాలకుడయ్యెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదామ్బుజాదర్శనే
చక్రే యో దయయా సమస్తజగతాం నాథం శిరోదర్శనే ।
మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంసస్వరూపం విధిం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 8 ॥

వరాహరూపము ధరించి , శివుని పాదపద్మములను దర్శించలేక , సత్యము పలికిన విష్ణుమూర్తిని పరమేశ్వరుడు దయతో సమస్త జగత్తులకు పాలకునిగా చేసెను. హంసరూపము ధరించి శివుని తలను చూడలేక , అబద్ధమాడిన బ్రహ్మదేవుని ఎప్పుడూ పూజించుటకు తగనివానిగా చేసెను. అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


యస్యాసన్ధరణీజలాగ్నిపవనవ్యోమార్కచన్ద్రాదయో
విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే ।
ఓఙ్కారార్థవివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 9 ॥

భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము - సూర్యుడు - చంద్రుడు - మానవుడు అనునవి శివుని యొక్క ఎనిమిది స్వరూపములు. వీటికంటే వేరైనది ఏదీ లేదు. ఓంకారముయొక్క అర్థమును వివరించు వేదము నాలుగవవానిగా శివుడినే తెలుపుచున్నది. ( ’ ఓం’ అనుదానిలో అ - ఉ - మ అను మూడు వర్ణములు మరియు నాదము ఉన్నవి. వాటిలో ’అ’ కారము బ్రహ్మ , ’ ఉ’ కారము విష్ణువు, ’ మ ’ కారము రుద్రుడు. కాగా నాలుగవదైన నాదము శివుని స్వరూపము.) అటువంటి పరమాత్మయగు సాంబునియందు నా హృదయము సుఖముగా రమించుగాక.


విష్ణుబ్రహ్మసురాధిపప్రభృతయః సర్వేఽపి దేవా యదా
సమ్భూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరమ్ ।
తానార్తాఞ్శరణాగతానితి సురాన్యోఽరక్షదర్ధక్షణా-
త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ॥ 10 ॥

విష్ణుమూర్తి - బ్రహ్మ - దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ క్షీరసాగరము నుండి పుట్టిన హాలాహలమును చూచి భయపడినప్పుడు, దుఃఖితులై శరణుజొచ్చిన ఆదేవతలను అర్థక్షణములో రక్షించిన పరమాత్మయగు సాంబుని యందు నా హృదయము సుఖముగా రమించుగాక.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దశశ్లోకీస్తుతిః  సమ్పూర్ణః ॥

Saturday 27 February 2016

శంకరస్తోత్రాలు : దక్షిణామూర్త్యష్టకమ్

 


































॥ श्री शंकराचार्य कृतं  दक्षिणामूर्त्यष्टकम् ॥        

॥ శ్రీ శంకరాచార్య కృతం దక్షిణామూర్త్యష్టకమ్ ॥

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 1 ॥

నిద్రించువాడు  తన ఊహాత్మకమైన దృశ్యమునే కలలో చూచుచూ , మేల్కొన్న పిదప అదంతయూ నిజము కాదని , తనయందే ఉన్నదని తెలిసుకొనునట్లుగా ఏ పరబ్రహ్మ తనయందే ఇమిడి ఉన్న ప్రపంచమును అద్దములో కనబడు దృశ్యము వలే తన మాయాశక్తిచే వెలుపల చూచుచూ జ్ఞానోదయమైన పిదప అదంతయూ తానే అని తెలుసుకొనునో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


బీజస్యాన్తరివాఙ్కురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృమ్భయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 2 ॥

విత్తనములోని మొలకవలే సృష్టికి ముందు ప్రపంచమంతయూ జాతి - గుణ - క్రియల బేధము లేనిదిగా ఉండెను. పిదప సృష్టి సమయమున పరమాత్ముని మాయాశక్తిచే వివిధ దేశములు  - వివిధ కాలములు ఏర్పడినవి. గారడి వాని వలే ఈ ప్రపంచమును నిర్మించుచూ మహాయోగివలే తనకిష్టమైనట్లు మార్చుచున్న గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవామ్భోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 3 ॥

సత్యస్వరూపుడైన ఏ పరమాత్మస్వరూపము ప్రాపంచికవస్తువులందు కనబడుచున్నదో , ఏ పరమాత్మ " తత్త్వమసి" మొదలగు వేదవాక్యములచే తన భక్తులకు బోధించుచున్నాడో , ఏ పరమాత్మ సాక్షాత్కారము వలన సంసార సాగరమునందు పునర్జన్మ కలుగదో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పన్దతే ।
జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 4 ॥

అనేకములైన చిల్లులుగల కుండయందలి దీపపుకాంతి బయటకు ప్రసరించునట్లుగా ఏ పరమాత్మయొక్క జ్ఞానము కన్నులు మొదలగు ఇంద్రియముల ద్వారా బయటకు వెలువడుచున్నదో , ప్రకాశించుచున్న ఏపరమాత్మని తెలుసుకొని  ఈ ప్రపంచమంతయూ అనుసరించి ప్రకాశించుచున్నదో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


దేహం ప్రాణమపీన్ద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాన్ధజడోపమాస్త్వహమితి భ్రాన్తా భృశం వాదినః ।
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 5 ॥

స్త్రీలు - బాలురు - గ్రుడ్డివారు - మూర్ఖులతో సమానులైన ఇతరమతముల  వారు శరీరము - ప్రాణములు - చంచలమైన బుద్ధి - శూన్యము అనువాటిని ఆత్మగా భావించుచున్నారు. మాయాశక్తిచే ఏర్పడు అజ్ఞానమును తొలగించు గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


రాహుగ్రస్తదివాకరేన్దుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 6 ॥

రాహువుచే కబళించబడు సూర్యచంద్రులవలే ఏ పురుషుడు మాయాశక్తి ఆవరించుటవలన  సత్తామాత్రుడై ఇంద్రియములను ఉపసంహరించుకొని అజ్ఞానమను గాఢనిద్రను పొందునో , మెలకువ కలుగగా పూర్వము నిద్రపోయితినని తెలుసుకొనునో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యన్తః స్ఫురన్తం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 7 ॥

బాల్యము మొదలైనవి - మెలకువ మొదలైనవి అగు అన్ని దశలు వచ్చి పోవుచుండగా వాటిననుసరించి ’ నేను’ అని ఎల్లప్పుడు లోపల ప్రకాశించుచున్న ఆత్మస్వరూపమును మంగళకరమైన జ్ఞానముద్రచే తన భక్తులకు బోధించు గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసమ్బన్ధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 8 ॥

కలయందు - మెలకువయందు మాయాశక్తిచే భ్రాంతినిపొంది విశ్వరూపుడైన తననే కార్యము - కారణముగాను , సేవకుడు - యజమాని గాను , శిష్యుడు - గురువుగాను , తండ్రి - పుత్రుడుగాను ఇంకా అనేక బేధములతో చూచుచున్న గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


భూరమ్భాంస్యనలోఽనిలోఽమ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ॥ 9 ॥

భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశము - సూర్యుడు - చంద్రుడు - పురుషుడు అని ఎనిమిది రూపాలుగా ఈ చరాచర ప్రపంచమంతయూ నిండి వెలుగొందుచున్నవాడు , సర్వవ్యాపియైన తనకంటే ఇతరమైనదేదీలేదని , విమర్శకులకు తెలియబరచువాడు అగు గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సఙ్కీర్తనాత్ ।
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః 
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ ॥ 10 ॥

ఈ దక్షిణామూర్తి స్తోత్రమునందు అంతటా వ్యాపించిన ఆత్మ ఒక్కటే అని నిరూపించబడినది. ఈ స్తోత్రమును వినుటవలన  -అర్థమును తెలుసుకొనుటవలన - ధ్యానించుటవలన - చదువుటవలన - పరమాత్మ సాక్షాత్కారము కలుగును. అష్టైశ్వర్యములు లభించును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం దక్షిణామూర్త్యష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : శారదాభుజఙ్గప్రయాతాష్టకమ్



॥ श्री शंकराचार्य कृतं शारदाभुजङ्गप्रयाताष्टकम्॥

॥ శ్రీ శంకరాచార్య కృతం శారదాభుజఙ్గప్రయాతాష్టకమ్ ॥

సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుమ్భాం
ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలమ్బామ్ ।
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబిమ్బాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 1 ॥

కుంభముల వంటిక్కు చక్కటి స్తనములు కలది , అమృతంతో నిండిన కుంభమును పట్టుకొన్నది , చంద్రబింబము వంటి అందమైన ముఖము కలది , వరములను ప్రసాదించు పెదవులు కలది అగు నా తల్లి అయిన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


కటాక్షే దయార్ద్రో కరే జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ ।
పురస్త్రీం వినిద్రాం పురస్తుఙ్గభద్రాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 2 ॥


కటాక్షమునందు దయ , చేతిలో జ్ఞానముద్ర కలిగి అరవై నాలుగు కళలలో ఆరితేరినది , ఆభరణములతో మంగళకరముగా నున్నది , పురములను రక్షించు స్త్రీయై మెలకువగా ఉండునది మరియు అధికమైన శుభములను ముందుగానే కలిగించునది అగు నా తల్లి అయిన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


లలామాఙ్కఫాలాం లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ ।
కరే త్వక్షమాలాం కనత్ప్రత్నలోలాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 3 ॥

తిలకం దిద్దిన నుదురు కలది , శ్రావ్యమైన గానమునందు ఆసక్తి కలది , తన భక్తులను రక్షించుటే ప్రధానంగా కలది , కీర్తికి మరియు శోభకు స్థానమైన చెంపలు కలది , చేతిలో జపమాలను పట్టుకొన్నది , తళుక్కుమను రత్నమాలలను ధరించినది అగు నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


సుసీమన్తవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ ।
సుధామన్థరాస్యాం ముదా చిన్త్యవేణీం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 4 ॥

అందమైన పాపట తీసిన జడను వేసుకొన్నది , ఆడలేళ్ళ కన్నుల కంటే సుందరమైన కన్నులు కలది , చిలకపలుకులున్నది , ఇంద్రునిచే నమస్కరింపబడునది , అమృతమయమైన ముఖము కలది ,  సంతోషముతో ధ్యానించదగిన అనేకరూపములున్నది  అగు నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


సుశాన్తాం సుదేహాం దృగన్తే కచాన్తాం
లసత్సల్లతాఙ్గీమనన్తామచిన్త్యామ్ ।
స్మరేత్తాపసైః సఙ్గపూర్వస్థితాం తాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 5 ॥

మంచి శాంతము కలది , అందమైన దేహము కలది , జుట్టు కొసలవంటి కంటి చివరలు కలది , మెరుపుతీగ వంటి శరీరమున్నది , అనంతమైనది , ఊహించుటకు శక్యముకానిది , సృష్టి కంటే ముందుగానే ఉన్నట్లు మునులచే స్మరింపబడుచున్నది అగు నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


కురఙ్గే తురఙ్గే మృగేన్ద్రే ఖగేన్ద్రే
మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ ।
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 6 ॥

లేడిపై , గుర్రముపై , సింహముపై , గరుడునిపై , హంసపై , ఏనుగుపై , ఎద్దుపై  అధిరోహించి మహానవమి రోజున సామవేదస్వరూపిణిగా ప్రకాశించు నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


జ్వలత్కాన్తివహ్నిం జగన్మోహనాఙ్గీం
భజే మానసామ్భోజసుభ్రాన్తభృఙ్గీమ్ ।
నిజస్తోత్రసఙ్గీతనృత్యప్రభాఙ్గీమ్
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 7 ॥

అగ్నిజ్వాల వంటి కాంతి కలది , జగన్మోహనాంగియైనది , భక్తుల మనస్సనే పద్మముపై తిరుగు ఆడతుమ్మెదయైనది , తనస్తోత్రములందు , సంగీతమునందు  మరియు నృత్యమునందు  ఆసక్తి కల నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.


భవామ్భోజనేత్రాజసమ్పూజ్యమానాం
లసన్మన్దహాసప్రభావక్త్రచిహ్నామ్ ।
చలచ్చఞ్చలాచారూతాటఙ్కకర్ణో
భజే శారదామ్బామజస్రం మదమ్బామ్ ॥ 8 ॥

శివునిచే , విష్ణువుచే మరియు బ్రహ్మచే పూజింపబడునది , ముఖంపై చిరున్నవ్వుల కాంతి కలది , చంచలమైన మెరుపువలే ప్రకాశించు చెవి కమ్మలు ధరించినది అగు నా తల్లియైన శారదాంబను ఎల్లప్పుడు సేవించుచున్నాను.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శారదాభుజఙ్గప్రయాతాష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : జగన్నాథాష్టకమ్


श्री शंकराचार्य कृतं जगन्नाथाष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకమ్ ॥

కదాచిత్కాలిన్దీ తటవిపిన సఙ్గీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశమ్భుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 1 ॥

ఒకొక్కప్పుడు కాళిందీనది ఒడ్డునందలి వనములలో వేణుగానం చేయుచూ సంతోషముతో గోపికల ముఖ పద్మములలోని మధురిమను ఆస్వాదించువాడు, లక్ష్మి  - ఈశ్వరుడు - బ్రహ్మ - దేవేంద్రుడు - వినాయకుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు అగు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.


భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపిఞ్ఛం కటితటే
దుకూలం నేత్రాన్తే సహచరకటాక్షం విదధత్ ।
సదా శ్రీమద్బృన్దావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 2 ॥

ఎడమచేతిలో వేణువును , తలపై నెమలిపింఛమును , నడుము నందు పట్టువస్త్రమును , కళ్ళచివర మిత్రులపై కటాక్షమును కలిగి ఉండి ఎల్లప్పుడు అందమైన బృందావనమునందు ఆటలాడు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.


మహామ్భోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాన్తస్సహజబలభద్రేణ బలినా ।
సుభద్రామధ్యస్థస్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 3 ॥

సముద్రతీరంలో , బంగారు కాంతి - నల్లని శిఖరం కల భవనంలో , సోదరులైన సుభద్రా బలరాముల మధ్య కూర్చుని దేవతలందరిచే పూజింపబడు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.


కృపాపారావారాస్సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమస్సురదమలపద్మోద్భవముఖైః ।
సురేన్ద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 4 ॥

దయాసముద్రుడు , కారుమబ్బుల వరసవలే సుందరుడు , లక్ష్మి - సరస్వతి - సూర్యుడు - అగ్ని - బ్రహ్మదేవుడు మొదలైన దేవతలచే పూజింపబడువాడు , ఉపనిషత్తులచే కొనియాడబడువాడు అగు జగన్నాథస్వామి నాకళ్ళకు కనబడుగాక.


రథారూఢో గచ్ఛన్ పథి మిలితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః ।
దయాసిన్ధుర్బన్ధుస్సకలజగతాం సిన్ధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 5 ॥

రథమెక్కి ఊరేగుచూ దారిలో కలసిన బ్రాహ్మణులు చేయు స్తోత్రములలోని ప్రతిపదమును విని దయచూపించు కరుణాసముద్రుడు , సకల జగద్బాంధవుడు అగు జగన్నాథస్వామి లక్ష్మితో కలిసి నాకళ్ళకు కనబడుగాక.


పరబ్రహ్మాపీడః కువలయదలోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనన్తశిరసి ।
రసానన్దో రాధాసరసవపురాలిఙ్గనసఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 6 ॥

పరబ్రహ్మ స్వరూపుడు , కలువరేకులవలే  వికసించిన నేత్రములు కలవాడు , నీలాద్రిపై నివసించువాడు , అనంతుడనే సర్పరాజు శిరస్సుపై కాలుపెట్టినవాడు , ఆనందమయుడు , రాధను కౌగిలించుకొని సుఖించువాడు అగు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.


న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ ।
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 7 ॥

నాకు రాజ్యము - బంగారము - భోగము - ఐశ్వర్యము  వద్దు. జనులందరూ ఇష్టపడే అందమైన స్త్రీని నేను కోరను. ఎల్లప్పుడు పరమేశ్వరునిచే స్తుతించబడు జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.


హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే ।
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ॥ 8 ॥

ఓ దేవరాజా! నీవు నిస్సారమైన సంసారమును తొందరగా హరించుము. ఓ యాదవపతీ!  నా పాపములరాశిని పోగొట్టుము. దీనుడను , అనాథుడను , బండవలే నిశ్చలంగా పడి ఉన్న నన్ను రక్షించుటకై జగన్నాథస్వామి నా కళ్ళకు కనబడుగాక.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం జగన్నాథాష్టకం సమ్పూర్ణమ్ ॥

వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : తీర్థప్రాశస్త్యం





వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : తీర్థప్రాశస్త్యం
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు
భాగ్యనగరమునందు ఫిబ్రవరి 21, 2016 నాడు వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు 

Friday 26 February 2016

శంకరస్తోత్రాలు : శివనామావళ్యష్టకమ్





॥ श्री शंकराचार्य कृतं शिवनामावळ्यष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం శివనామావళ్యష్టకమ్ ॥

హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శమ్భో ।
భూతేశ భీతభయసూదన మామనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 1 ॥

ఓ చంద్రుడు తలపై నున్న ఈశ్వరుడా! మన్మథుని సంహరించినవాడా! చేతిలో శూలము ధరించినవాడా! శాశ్వతుడా! కైలాసముపై నుండువాడా! పార్వతీ పతీ! మహేశుడా! శంభో! భూతనాథుడా! భయపడువారి భయములను పోగొట్టువాడా! అనాథుడనైన నన్ను సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప ।
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 2 ॥

ఓ పార్వతీ హృదయ వల్లభుడా!  చంద్రమౌళీ! భూతనాథుడా! ప్రమథగణములకు నాయకుడా!  మేరుపర్వతమును విల్లుగా చేసుకున్నవాడా!  ఓ వామదేవుడా!  భవుడా! రుద్రుడా! పినాకపాణీ! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ ।
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 3 ॥

ఓ నల్లని కంఠము కలవాడా! జెండాపై ఎద్దు గుర్తు కలవాడా! అయిదు ముఖములున్న వాడా!  లోకేశ్వరుడా! సర్పములను కంకణములుగా ధరించినవాడా! ప్రమథగణములకు నాయకుడా!  ఈశ్వరుడా!  బరువైన జటలు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ!    జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


హే విశ్వనాథ శివ శఙ్కర  దేవదేవ
గఙ్గాధర ప్రమథనాయక నన్దికేశ ।
బాణేశ్వరాన్ధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 4 ॥

ఓ విశ్వనాథుడా! శివుడా! శంకరుడా! దేవతలకే దేవుడైనవాడా! గంగను ధరించినవాడా! ప్రమథగణములకు నాయకుడా!  నందీశ్వరుని ఏలెడువాడా!  బాణాసురుని కాపాడినవాడా!  అంధకుడను రాక్షసుని సంహరించినవాడా!  హరుడా!  లోకనాథుడా! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము.


వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ ।
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 5 ॥

వారాణసీ పట్టణమును ఏలువాడా!  మణికర్ణికా ఘట్టమును పాలించువాడా! వీరేశుడా! దక్షుని యజ్ఞమును నాశనం చేసినవాడా!  అంతటా వ్యాపించినవాడా! ప్రమథగణములకు నాయకుడా! అన్నీ తెలిసినవాడా!  అందరి హృదయములందు నివసించువాడా!  ప్రభూ! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాలో
హే వ్యోమకేశ శితికణ్ఠ గణాధినాథ ।
భస్మాఙ్గరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 6 ॥

శ్రీమంతుడగు మహేశ్వరా!  కృపకలవాడా!  దయామయా! ఆకాశమే జుట్టుగా కలవాడా! నల్లని కంఠము కలవాడా! ప్రమథగణములకు నాయకుడా!  భస్మను పూసుకొన్నవాడా!  మానవుల కపాలములను మాలగా ధరించినవాడా!  ఓ జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుఞ్జయ త్రీనయన త్రిజగన్నివాస ।
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 7 ॥

కైలాస పర్వతము నందు నివసించువాడా! ధర్మస్వరూపుడైన జగద్రక్షకుడా! మృత్యువును జయించినవాడా!  మూడు కన్నులు కలవాడా!  మూడు లోకములందు నివసించువాడా! నారాయణునకు ఇష్టుడైనవాడా! గర్వమును పోగొట్టువాడా! శక్తి  స్వరూపిణి అగు పార్వతికి నాథుడా!  ఓ జగదీశుడా! సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ ।
హే విశ్వనాథ కరుణామయ దీనబన్ధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ 8॥

విశ్వము నేలెడివాడా! సమస్త ప్రపంచములకు పుట్టుక మొదలగు దుఃఖములను నశింపచేయువాడా! విశ్వస్వరూపుడా! విశ్వమునకు అంతరాత్మయైనవాడా!  మూడు లోకములందు  అధిక గుణములున్న ఒక్కడైన ఈశ్వరుడా! ఓ విశ్వనాథుడా!  కరుణామయుడా!  దీనులకు బంధువైనవాడా! జగదీశుడా!  సంసార దుఃఖారణ్యము నుండి రక్షించుము.


గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ
పఞ్చాననాయ శరణాగతకల్పకాయ ।
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ॥ 9 ॥

పార్వతీ విలాసములకు నివాసమైనవాడు, మహేశ్వరుడు,  అయిదు ముఖములున్నవాడు, శరణు పొందినవారి కోరికలు తీర్చు కల్పవృక్షము ,  సర్వరూపుడు, సమస్త ప్రపంచములను పాలించువాడు, దారిద్ర్య దుఃఖమును తగులబెట్టువాడు  అగు ఆ పరమేశ్వరునకు నమస్కారము.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శివనామావళ్యష్టకం సమ్పూర్ణమ్ ॥

జగద్గురువుల అనుగ్రహభాషణములు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు : 2015 కొవ్వూరు



జగద్గురువుల అనుగ్రహభాషణములు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు : 2015 కొవ్వూరు


జగద్గురువుల అనుగ్రహభాషణములు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు : 2015. ఒంగోలు




2015. ఒంగోలు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు



జగద్గురువుల అనుగ్రహభాషణములు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు : 2015. పొంపడి



జగద్గురువుల అనుగ్రహభాషణములు :  పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు



వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : సంధ్యా వందనం, వివాహ మంత్రార్థాలు





వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు  :  సంధ్యా వందనం, వివాహ మంత్రార్థాలు
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు మరియు బ్రహ్మశ్రీ ముల్లైవాసల్ R  కృష్ణమూర్తి శాస్త్రి గారు
భాగ్యనగరమునందు జనవరి 26, 2016 నాడు వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు 

జగద్గురువుల అనుగ్రహభాషణములు : పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు : 2016 : కుంభకోణం




జగద్గురువుల అనుగ్రహభాషణములు :  పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు

కుంభకోణమునందు ఫిబ్రవరి 12, 2016 నాడు పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామివారు  అనుగ్రహించిన భాషణము


Wednesday 24 February 2016

శంకరస్తోత్రాలు : పాణ్డురఙ్గాష్టకమ్



॥ श्री शंकराचार्य कृतं पाण्डुरङ्गाष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం పాణ్డురఙ్గాష్టకమ్ ॥

మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుణ్డరీకాయ దాతుం మునీన్ద్రైః ।
సమాగత్య నిష్ఠన్తమానన్దకన్దం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 1॥

భీమరథీ నది ఒడ్డునందలి మహాయోగపీఠమునందు పుండరీకుడను భక్తునకు వరమిచ్చుటకై మునీంద్రులతో కలసి వచ్చి నిలుచున్నవాడు, ఆనందమునకు మూలమైనవాడు, పరబ్రహ్మలక్షణములున్నవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


తటిద్వాససం నీలమేఘావభాసం
రమామన్దిరం సున్దరం చిత్ప్రకాశమ్ ।
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 2॥

మెరుపువలే ప్రకాశించు వస్త్రములు ధరించినవాడు, నల్లని మబ్బువలే విరాజిల్లుచున్నవాడు, లక్ష్మికి నివాసమైనవాడు, సుందరుడు, జ్ఞానజ్యోతియైనవాడు, శ్రేష్ఠుడు, పీఠంపై సమానంగా పాదములుంచినవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితమ్బః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ ।
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 3॥

’ నా భక్తులకు సంసారసముద్రపు లోతు ఇంతే’  అని చూపుచున్నట్లుగా రెండు చేతులతో మొలను పట్టుకొన్నవాడు, బ్రహ్మదేవుడు నివసించుటకై బొడ్డులో పద్మమును ధరించినవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


స్ఫురత్కౌస్తుభాలఙ్కృతం కణ్ఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ ।
శివం శాన్తమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 4॥

కంఠముపై ప్రకాశించు కౌస్తుభమణిచే అలంకరింపబడినవాడు, లక్ష్మిచే సేవింపబడు భుజకీర్తులు కలవాడు, శ్రీనివాసుడు, మంగళకరుడు, శాంతస్వరూపుడు, స్తుతింపదగినవాడు, ఉత్తముడు, లోకపాలకుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


శరచ్చన్ద్రబిమ్బాననం చారుహాసం
లసత్కుణ్డలాక్రాన్తగణ్డస్థలాన్తమ్ ।
జపారాగబిమ్బాధరం కఽజనేత్రం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ 5॥

శరదృతువునందలి చంద్రబింబము వంటి ముఖము కలవాడు, అందమైన నవ్వు కలవాడు, ప్రకాశించు కుండలములాక్రమించిన చెంపలు కలవాడు, మంకెనపువ్వు వలే ఎఱ్ఱనైన క్రిందిపెదవి కలవాడు, పద్మనేత్రుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


కిరీటోజ్వలత్సర్వదిక్ప్రాన్తభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః ।
త్రిభఙ్గాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్॥ 6॥

కిరీటకాంతులచే సర్వదిక్కులనూ ప్రకాశింపచేయుచున్నవాడు, దేవతలచే అమూల్యములైన దివ్యరత్నములతో పూజింపబడినవాడు, మూడు వంపులుకల శరీరంకలవాడు, నెమలి పింఛముల మాలను తలపై అలంకరించుకున్నవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


విభుం వేణునాదం చరన్తం దురన్తం
స్వయం లీలయా గోపవేషం దధానమ్ ।
గవాం బృన్దకానన్దదం చారుహాసం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 7॥

అంతటా వ్యాపించినవాడు, వేణునాదం చేయువాడు, సంచరించుచున్నవాడు, నాశనం లేనివాడు, స్వయంగా గోపాల వేషమును ధరించినవాడు, పశువుల మందలకు ఆనందమునిచ్చువాడు, అందమైన నవ్వు కలవాడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


అజం రుక్మిణీప్రాణసఞ్జీవనం తం
పరం ధామ కైవల్యమేకం తురీయమ్ ।
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలిఙ్గం భజే పాణ్డురఙ్గమ్ ॥ 8॥

పుట్టుకలేనివాడు, రుక్మిణీ ప్రాణప్రియుడు, పరంధాముడు, కైవల్యమూర్తి, అద్వితీయుడు, సత్త్వరజస్తమోగుణములంటనివాడు, ప్రసన్నుడు, భక్తుల బాధలను నశింపచేయువాడు, దేవదేవుడు, పరబ్రహ్మ లక్షణములు కలవాడు అగు పాండురంగని సేవించుచున్నాను.


స్తవం పాణ్డురఙ్గస్య వై పుణ్యదం యే
పఠన్త్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ ।
భవామ్భోనిధిం తే వితీర్త్వాన్తకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువన్తి ॥9

భక్తితో , నిశ్చలమనస్సుతో ఎవరైతే పుణ్యకరమైన ఈ పాండురంగస్తోత్రమును పఠించెదరో వారు సంసార సముద్రమును దాటి అంతకాలమునందు శాశ్వతమైన విష్ణులోకమును చేరెదరు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం పాణ్డురఙ్గాష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : భవాన్యష్టకమ్


 ॥ श्री शंकराचार्य कृतं भवान्यष्टकं ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం భవాన్యష్టకం ॥

న తాతో న మాతా న బన్ధుర్న దాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా ।
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 1॥

ఓ భవానీ! తల్లీ! నాకు తల్లిగాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియూ లేదు. కేవలము నీవొక్కతవే నాకు దిక్కు, నాకు దిక్కు.


భవాబ్ధావపారే మహాదుఃఖభీరు
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః ।
కుసంసారపాశప్రబద్ధః సదాహం 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 2॥

అమ్మా! భవానీ! కామాంధుడనై, లుబ్ధుడనై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, తట్టుకొనలేని దుఃఖముతో మిక్కిలి భయగ్రస్తుడనై, అవ్వలియొడ్డులేని సంసారసాగరమున పడిపోయితిని. తల్లీ నీవేతప్ప నాకెవరుదిక్కు లేరు. నీవొక్కతివేదిక్కు.


న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తన్త్రం న చ స్తోత్రమన్త్రమ్ ।
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 3॥

ఓ భవానీమాత! దానము - ధ్యానము- మంత్రము - యంత్రము - పూజ - పునస్కారము - న్యాసము - యోగము - ఏదియునూ తెలియదు. నీవేతప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవేదిక్కు.


న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ ।
న జానామి భక్తిం వ్రతం వాపి మాతః
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 4॥

అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు, తీర్థసేవ లేదు, మోక్షోపాయము తెలియదు, జన్మరాహిత్యము తెలియదు, భక్తి మార్గము తెలియదు, ఏ వ్రతములూ నోములూ తెలియవు, తల్లీ నీవే దిక్కు నీవేదిక్కు.


కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః ।
కుదృష్టిః కువాక్యప్రబన్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 5॥

తల్లీ నేనెట్టివాడననుకొనుచుంటివి. దుష్కర్మాచరణము - దుస్సాంగత్యము - దుర్బుద్ధులు - దుష్టసేవకజనము - కులాచారహీనత్వము - దురాచార తత్పరత - దురాలోచనలు - దుర్వాక్యములు  ఇవి నా లక్షణములు. అందుచేత నన్నుద్ధరించుటకు నీవు తప్ప వేరే దిక్కు లేదు, లేదు.


ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ ।
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 6॥

ఓ సర్వశరణ్యా! బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు - ఇంకెందరెందరో దేవతలు ఉన్నారు. ఒక్కర్ని గురించి కూడ నేను ఎఱుగను. నాకు తెలియదు. నీవే దిక్కు తల్లీ, నీవే దిక్కు.


వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రుమధ్యే ।
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 7॥

ఓ మాత! ఏదైన వివాదమున గాని - విషాదమునగాని - ప్రమాదమునగాని - ప్రవాసమునగాని - నీటిలోగాని - నిప్పులోగాని - కొండలమీదగాని - అడవులలోగాని - శత్రువులమధ్యగాని - ఎక్కడైనాసరే నన్ను నీవే రక్షింపవలయునమ్మా! నాకు నీవే దిక్కు అమ్మా. నీవే దిక్కు.


అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః ।
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 8॥

ఓయమ్మా! నేను దరిద్రుడను. ముసలితనము - రోగములు - జాడ్యములు - నన్నాక్రమించియున్నవి. మహావిపత్సముద్రమున మునిగి యున్నాను. సర్వవిధముల కష్ట, నష్టములపాలై వున్నాను. కావున నీవే నన్ను ఉద్ధరింపవలయును. నాకు  నీవే దిక్కు . నీవే దిక్కు.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం భవాన్యష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : శ్రీహనుమత్ పఞ్చరత్న స్తోత్రమ్

 

॥ श्री शंकराचार्य कृतं श्रीहनुमत् पञ्चरत्न स्तोत्रं  ॥

|| శ్రీ శంకరాచార్య కృతం శ్రీహనుమత్ పఞ్చరత్న స్తోత్రం  ||

॥ శ్రీహనుమత్ పఞ్చరత్నమ్ ॥

వీతాఖిలవిషయేచ్ఛం జాతానన్దాశ్ర పులకమత్యచ్ఛమ్ ।
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ ॥ 1 ॥

సర్వేంద్రియ విషయ వాంఛలను విడచినవాడును, ఆనందముచే కలిగిన ఆనందభాష్పములను రోమాంచమును కలవాడును, మిక్కిలి నిర్మలుడును, రామదూతలలో మొదటివాడును - మనోహరుడును అగు వాయుపుత్రుని ఇప్పుడే మనస్సున తలచెదను.


తరుణారుణ ముఖకమలం కరుణారసపూరపూరితాపాఙ్గమ్ ।
సన్జీవనమాశాసే మఞ్జులమహిమానమఞ్జనాభాగ్యమ్ ॥ 2॥

నవవికసితమై యెఱ్ఱనైన పద్మమువంటి ముఖము కలవాడును, దయారస ప్రవాహముతో నింపబడిన కటాక్షములు కలవాడును, మనోహరమైన మహిమగలవాడును అగు అంజనా కుమారుని నాకెల్లవేళల సంజీవనముగా (చక్కని జీవము కల్గించువానిగ) ఎంచుచున్నాను.



శమ్బరవైరిశరాతిగమమ్బుజదలవిపులలోచనోదారమ్ ।
కమ్బుగలమనిలదిష్టమ్ బిమ్బజ్వలితోష్ఠమేకమవలమ్బే ॥ 3॥

మన్మథబాణములను అతిక్రమించినవాడును, తామర రేకులవలె విశాలమైన లోచనములతో నుదారుడుగా కన్పడువాడును, శంఖమువంటి కంఠముకలవాడును, దొండపండు వలె ప్రదీప్తమైన యధరోష్ఠము కలవాడును, వాయుదేవునికి పూర్వపుణ్య ఫలముగా కలవాడును అగు నొక్కదేవుని (ఆంజనేయుని) ఆశ్రయించుచున్నాను.


దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః ।
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ॥ 4॥

సీతాదేవి దుఃఖమును తొలగించి శ్రీరాముని వైభవ విశేషము నెల్లచోచాటి రావణునికీర్తిని నశింపజేసి యున్న యా హనుమంతుని దివ్యరూపము నా యెదుట ప్రత్యక్షమగుగాక.


వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ ।
దీనజనావనదీక్షం పవన తపః పాకపుఞ్జమద్రాక్షమ్ ॥ 5॥

వానర సమూహములకెల్ల ప్రభువును, రాక్షసకుల సమూహములనెడు కలువలకు సూర్యకిరణము వంటివాడును(కలువలకు సూర్యునకు విరోధము) దీనజనులను రక్షించుదీక్ష కలవాడును, వాయుదేవుని పున్నెముల పంటరాశియును నైన యాంజనేయుని జూడ గంటిని.


 ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పఞ్చరత్నాఖ్యమ్ ।
 చిరమిహనిఖిలాన్ భోగాన్ భుఙ్క్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ॥ 6॥ 

పంచరత్నమను పేరుగల ఈ హనుమత్ స్తోత్రము నెవడు పఠించునో వాడు చిరకాలము ఈలోకమున భోగముల ననుభవించి తుదకు ఆంజనేయునివలె  శ్రీరామభక్తుడు కాగలడు.

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీహనుమత్ పఞ్చరత్న స్తోత్రం సమ్పూర్ణమ్ ||

Tuesday 23 February 2016

శంకరస్తోత్రాలు : అచ్యుతాష్టకమ్

 

॥ श्री शंकराचार्य कृतं अच्युताष्टकम् ॥

॥ శ్రీ శంకరాచార్య కృతం అచ్యుతాష్టకమ్ ॥

అచ్యుతం కేశవం రామనారాయణం  కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికావల్లభం  జానకీనాయకం రామచన్ద్రం భజే ॥ 1 ॥

ప్రళయముననూ నాశములేనివాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైవాడు, యోగిహృదయానందకరుడు, ప్రళయాంతమున కూడ నశించక సముద్రముపై శయనించు జ్ఞానస్వరూపుడు, సచ్చిదానందరూపుడు, శమము దమము మొదలైన సాధనములచే కల్గెడి ఉదారబుద్ధిచేత తెలియదగినవాడు, సర్వాంతర్యామియై భక్తచిత్తములను పాపములను హరించువాడు, లక్ష్మీధరుడు, సర్వవిద్యాపతి, గోపికావల్లభుడు, రామావతారమెత్తి జానకీభర్తయై రంజిలినవాడు అట్టి స్వామిని సేవింతును.


అచ్యుతం కేశవం సత్యభామాధవం  మాధవం శ్రీధరం రాధికారాధితమ్ ।
ఇన్దిరామన్దిరం చేతసా సున్దరం  దేవకీనన్దనం నన్దనం సన్దధే ॥ 2 ॥

జననమరణాది వికృతి లేనివాడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మధువను యోగవిద్యచే తెలియదగినవాడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, శ్రీలక్ష్మీదేవికి నివాసమైనవాడు, మాటలకందని మనస్సుందరుడు, సర్వానందకరమైన మనస్సువాడు, అట్టి దేవకీదేవి హృదయమునకు ఆనందము కల్గించునట్టి యా స్వామిని ధ్యానింతును.


విష్ణవే జిష్ణవే శఙ్ఖినే చక్రిణే  రుక్మినీరాగిణే జానకీజానయే ।
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే  కంసవిధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥

సర్వవ్యాపకుడవు, జయశీలుడవు, అహంకారమనెడి శంఖమును చేతబట్టి యూదువాడవు, సర్వప్రాణుల మనస్తత్వచక్రమును త్రిప్పువాడవు, కృష్ణావతారమున రుక్మిణిని, రామావతారమున సీతాదేవిని అలరించినవాడవు, గోపికా హృదయవర్తివై వారిచే పూజలందుకొన్నవాడవు, కంససంహారకుడవు, మురళీ నాదము చేయుచు ఆత్మానంద స్వరూపుడవై  విలసిల్లుచుండు నట్టి ఓ స్వామీ! నీకు నమస్కారము.


కృష్ణ గోవిన్ద హే రామ నారాయణ  శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానన్త హే మాధవాధోక్షజ  ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥

ఓ కృష్ణా! నీవు హల(నాగలి) రూపముతో భూమిని దున్ని సస్యవంతము చేయుచున్నావు. లేదా భక్త హృదయ భూములను దున్ని సంసార దుష్టబీజములను సమూలముగా నాశము చేయుచున్నావు. అందుకే కృష్ణుడవనిపించుకున్నావు. అవతారములెత్తి గో భూరక్షణ చేసినాడవు. కావున గోవిందుడవైతివి. యోగి హృదయములను రంజించువాడవై రాముడవైతివి. సర్వజ్ఞాననివాసమై నారాయణుడవైతివి. సర్వమునందు వసించుదేవుడవు. నీవన్నిటను కూడ జయము గొనువాడవు. ఓటమిలేదు. నాశములేనివాడవు. నీకు తుదిలేదు. మౌనవ్రతాదులచేత సాధ్యుడవు. ఎప్పుడును ఊర్థ్వ రూపుడవే. సంసార ధర్మములకు కట్టుబడి క్రిందికి జారనివాడవు. ద్వారకయందున్నను - మరెక్కడున్నను భక్తులను రక్షించువాడవు. కనుకనే ద్రౌపదిని రక్షించితివి.


రాక్షసక్షోభితః సీతయా శోభితో  దణ్డకారణ్యభూపుణ్యతాకారణః ।
లక్ష్మణేనాన్వితో వానరైః సేవితోఽగస్త్యసమ్పూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥

స్వామీ! భూభారము తగ్గింప నెంచి రాముడుగా అవతరించితివి. సీతాలక్ష్మణ సమన్వితుండవై నీ పాదములచే దండకారణ్య భూమిని పవిత్రము చేయుచు దుష్టరాక్షస సంహారము చేయుచు అగస్త్యాది ఋషీశ్వరులచే పూజింపబడుచు, సీతాపహరణ మొనర్చిన రావణాది రాక్షసులనెల్ల వానరసేనా సమేతుడవై తుదముట్టించి సీతాసమేతుడవై లోకమును పాలించితివి గదా! అట్టి ఓ రాఘవా నన్ను కాపాడుము.


ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం  కేశిహా కంసహృద్వంశికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో  బాలగోపాలకః పాతు మామ్ సర్వదా ॥ 6 ॥

ఓ దేవా! కృష్ణావతారమునెత్తితివి. బాల గోపాలుడవుగా ఉన్నప్పుడే పూతనా రాక్షసిని చంపితివి. కాళీయుని చంపి యమునానదిని నిరుపద్రవముగా చేసితివి. ధేనుకాసురుని, కేశిరాక్షసుని  - ఇట్లెందరినో దుష్టులను చంపితివి. చివరకు మేనమామయైననూ పరమదుష్టుడైన కంసుని చంపితివి. ఇట్లు లోకకల్యాణ కార్యములు చేయుచు మురళీనాదముతో సకలప్రాణికోటి హృదయములను పులకింపచేయునట్టి ఓ కృష్ణా నన్ను పాలింపుము.


విద్యుదుద్ధయోతవానప్రస్ఫురద్వాససం  ప్రావృడమ్భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం  లోహితాఙ్ఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7 ॥

ఓ ప్రభూ! ఏమి అందమయ్యా! నల్లని మబ్బువలె మెరిసిపోవు శరీరము - అట్టి శరీరమున మెరుపుతీగ విధమున తళతళలాడు బంగారు పట్టుపుట్టము. వక్షఃస్థలమున తులసిమాల, తామరరేకులవలె అందములై విశాలములైన కన్నులు, ఎఱ్ఱగా చిగురుటాకులవలె జగన్మోహనములైన పాదములు ఇట్టి సుందరమూర్తిని సర్వదా సేవింతును.


కుఞ్చితైః కున్తలైర్భ్రాజమానాననం  రత్నమౌలిం లసత్ కుణ్డలం గణ్డయోః ।
హారకేయూరకం కఙ్కణప్రోజ్జ్వలం  కిఙ్కిణీమఞ్జులం శ్యామలం తం భజే ॥ 8 ॥

నీ రూపము ఎంత చూచిననూ తనివి తీరదయ్యా, వంపులు తిరిగిన ముంగురులతో చూడముచ్చటయైన ముఖము, శిరమున కుచ్చుముడి, చెక్కిళ్ళపై కాంతులుచిమ్ము కర్ణ కుండలములు , మెడలో హారములు, భుజములందు కేయూరములు, ముంజేతులయందు కంకణములు, మొలకు చిరుగంటల మొలత్రాడు. ఈ దివ్య సుందరరూపుని నిన్ను ఎల్లప్పుడును సేవింతును.


అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సున్దరం కర్తృ విశ్వమ్భరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ ॥ 9 ॥

స్రగ్విణీవృత్తములతో నుత్తమ వర్తనములతో సుందరమైనదియు, తెలిసికొనదగిన విశ్వంభరుని తత్త్వము గలదియు, కోరికలు తీర్చునదియునైన ఈ అచ్యుతాష్టకమును ఏ పురుషుడు భక్తితో ప్రతిదినమును కోరి పఠించునో వానికి ఆ హరి వెంటనే వశమును పొందిన వాడగుచుండును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం అచ్యుతాష్టకం సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : శ్రీకృష్ణాష్టకమ్

 

॥ श्री शंकराचार्य कृतं श्रीकृष्णाष्टकम् ॥

|| శ్రీ శంకరాచార్య కృతం శ్రీకృష్ణాష్టకమ్ ||

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహన్తాబ్జనయనః ।
గదీ శఙ్ఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 1 ॥

లక్ష్మీదేవితో కూడియున్నవాడు, సర్వవ్యాపకుడు, స్థావర జంగమాత్మకమైన ప్రపంచమునకెల్ల  జనకుడు, వేదములచేతనే తెలియందగినవాడు, సమస్త బుద్ధి ప్రకృతులకును సాక్షీభూతుడు, శుద్ధుడు, పాపములను హరించువాడు, రాక్షసులను సంహరించువాడు, తామరపూవులవంటి కన్నులు కలవాడు, శంఖచక్రగదాద్యాయుధములతో నుండువాడు, నిర్మలమైన వనమాలకలవాడు, స్థిరమైన ప్రకాశము కలవాడు, శరణుజొచ్చినవారిని రక్షించు స్వభావము కలవాడు, సర్వలోకేశ్వరుడు అయిన కృష్ణభగవానుడు నాకు ప్రత్యక్షమగుగాక.


యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా ।
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 2 ॥

ఆకాశము, నీరు మొదలగు ఈసమస్త జగమూ కృష్ణుని వలననే పుట్టినది. మధురాక్షసాంతకుడైన ఆ శ్రీహరియే సృష్ట్యనంతరకాలమున ఈ సకల జగమును తన ఆనందకళతో రక్షించును. ప్రళయకాలమున తామసకళతో తనయందే సర్వజగమును లీనము కావించుకొనుచున్నాడు. శరణాగత రక్షకుడైనట్టి ఆ జగత్ ప్రభువు నా కన్నులకు గోచరమగుగాక.


అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ ।
యమీడ్యం పశ్యన్తి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 3 ॥

ప్రజ్ఞావంతులు మొదట ప్రాణాయామమొనరించి యమము నియమము మొదలగు సాధనములతో చిత్తమును నిరోధించి, అట్లు నిర్మలమైన ఆ చిత్తమును పూర్తిగా హృదయమునకు దెచ్చుకొని ఏ మహనీయుని చూచుచున్నారో అట్టి జగత్ప్రభువు శరణత్రాణ తత్పరుడు కృష్ణుడు నా కన్నుల కనపడుగాక.


పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ ।
నియన్తారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 4 ॥

" ఈ భూమియందవతరించి యిందుండి యీ  పృథివిని రక్షించుచున్నాడు. కాని ఆ పృథివికి తన్ను సంరక్షించుచున్న యా పరమేశ్వరుని గూర్చి తెలియదు.  తెలిసికొను శక్తి లేదు. అతడే సర్వలోకప్రభువు. పరమ పుణ్యమూర్తి. సర్వశాసనుడు. మునులు, దేవతలు అందరూ ఆతనినే ధ్యానింతురు. ఆయనే మోక్షమిచ్చువాడు. "  అని వేదము ఆదికాలమున నుతించిన యా లోకేశ్వరుడు శరణత్రాత కృష్ణుడు నా నేత్రమార్గమున గోచరించుగాక.


మహేన్ద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతన్త్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే ।
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 5 ॥

ఇంద్రాది దేవసంఘము ఎవరిని జయించిననూ ఆ పరమేశ్వరుని బలముతోనే. ఆ పరమేశ్వరుని అనుగ్రహము లేనిదే లోకమున నెవ్వడునూ ఏ విషయముననూ స్వతంత్రుడుగా వ్యవహరించలేడు. దేనినీ తన శక్తితో సాధింపలేడు. అందుచేతనే ఎప్పుడైనా రాక్షసాది విజయము సాధించితినని ఇంద్రుడు గర్వించినచో వెంటనే యాతని గర్వమడగగొట్టుచున్నాడు. అట్టి శరణన్నవారినేలు లోకేశ్వరుడు నాకుకన్పడుగాక.


వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా ।
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 6 ॥

ఆ పరమేశ్వరుని ధ్యానింపనివానికి పంది, కుక్క, మొదలగు పశు జన్మలు కలుగును. ఆ దేవదేవుని గూర్చి తెలిసికొనలేనిచో జనన మరణ భయములు తప్పవు. ఆ శ్రీహరిని స్మరింపకున్న వందలకొలది క్రిమికీటక జన్మములను పొందుచునుండవలసినదే. కనుక సర్వలోకరక్షకుడైన యా కృష్ణభగవానుడు నా కన్నులకు గోచరమగుగాక.


నరాతఙ్కోట్టఙ్కః శరణశరణో భ్రాన్తిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః ।
స్వయమ్భూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 7 ॥

శ్రీకృష్ణుడు తన భక్తుల యిడుములకు ఉలియైనవాడు. (నాశకుడు) రక్షకులకును రక్షకుడు. మోహమును పోగొట్టువాడు. మేఘమువలె నీలమైన విగ్రహము కలవాడు. సుందరుడు. గోపబాలురకు ప్రియమిత్రుడు. అర్జునునికి స్నేహితుడు తానే సర్వభూతములయుత్పత్తికిని కారణమైనవాడు. కాని తన యుత్పత్తికి మాత్ర మెవ్వరును కారణముకాదు. ఆయన స్వయంభువు. యోగ్యమైన నడవడిగలవారికి మేలు సేయువాడు. అట్టి యా శరణాగత రక్షకుడైన జగత్ప్రభువు నాకు కనపడుగాక.


యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః ।
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః ॥ 8 ॥

లోకక్షోభకు కారణమైన ధర్మనాశము గలిగినపుడెల్ల జన్మమే లేనివాడయ్యును, ఆ స్వామి శరీరధారియై జన్మించి ధర్మసేతువును ధృడమొనరించుచు సజ్జన సంరక్షణము సేయుచుండును. అందుచేతనే వేదములచేత నుతింపబడు ఆ పుణ్యమూర్తి గొల్లపల్లెయందు గోపబాలురతో సమానుడై మెలగెను. అట్టి యా సాధురక్షకుడు లోకేశ్వరుడు కృష్ణుడు నా కన్నులకు తోచునుగాక.


ఇతి హరిరఖిలాత్మారాధితః శఙ్కరేణ
శ్రుతివిశదగుణోఽసౌ మాతృత్మోక్షార్థమాద్యః ।
యతివరనికటే శ్రీయుక్త ఆవిర్బభూవ
స్వగుణవృత ఉదారః శణ్ఖచక్రాఞ్జహస్తః ॥ 9 ॥

శ్రీశంకరాచార్యులవారిచేత ఈవిధముగా ధ్యానింపబడినవాడై సర్వాత్మస్వరూపుడును, వేదములయందు స్పష్టములైయున్న గుణములు కలవాడును, ఆద్యుడును అయిన శ్రీహరి శ్రీశంకరులయెదుట మాతృమోక్షార్థమై లక్ష్మీసమేతుడై స్వీయములైన మహోత్తమ గుణములతో కూడినవాడై, మహోదారుడై, శంఖచక్ర పద్మాదులుగల హస్తములు కలవాడై ప్రత్యక్షమయ్యెను.


|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీకృష్ణాష్టకమ్ సమ్పూర్ణమ్ ||

Saturday 13 February 2016

పుణ్యతిథులు : మాఘ శుక్ల అష్టమి - భీష్మాష్టమి


మాఘ శుక్ల అష్టమి - భీష్మాష్టమి

భీష్మాష్టమి నాడు తర్పణము చేసినట్లైతే సంవత్సరకాలములో చేసిన పాపములన్నీ నాశనమౌతాయని చెప్పబడినది.

తర్పణము ఈ క్రింది మంత్రముతో ఇవ్వవలెను -

వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే
భీష్మశ్శాంత నవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
అభిరర్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్.


అపసవ్యముగా తర్పణమిచ్చి ఆచమనముచేసి సవ్యముగా అర్ఘ్యమీయవలెను.

వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే


ఈ తర్పణం జీవపితృకులుకూడా చేయవచ్చును. (అయితే అపసవ్యం మాత్రం బ్రహ్మయజ్ఞములో పితృతర్పణము వలె చెయవలెనని తోస్తోంది).

పుణ్యతిథులు : రథసప్తమీ

 


రథసప్తమీ

ఈ పుణ్యదినమున అరుణోదయమందు స్నానము చేయవలెను.  ఈ క్రింది మంత్రముతో స్నానమాచరించవలెను. తలపై జిల్లేడు ఆకులుగాని, రేగు ఆకులు కాని, చిక్కుడుఆకులుకాని పెట్టుకుని స్నానమాచరించడం సంప్రదాయం.

యదా జన్మకృతం పాపం  మయా జన్మజన్మసు 
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ  ||
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః  ||
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ||

(క్లుప్తంగా అర్థం : అనేక జన్మలలో చేసిన పాపము, శోక, రోగ రూపములైన పాపము,  తెలిసి తెలియక చేసినది, ఈ సప్తమి నాటి స్నానము హరింపునని)

ఈ శ్లోకముతో అర్ఘ్యమునీయవలెను.

సప్తసప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన 
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||

ఆవుపేడ పిడకలు కాల్చి క్షీరాన్నమువండి సూర్యునికి నివేదన చేయాలి. జిల్లేడు పూవులతో సూర్యుని పూజించాలి.

రథసప్తమినాడు ఆదిత్యహృదయం పారాయణ విశేషఫలములొసగుతుంది.  ఆకసంలో సూర్యరూపుడైన ఈశ్వరునికై రుద్రపారాయణము చేయవచ్చునని కొందరి అభిప్రాయం.

రథసప్తమినాడు నూతన వ్రతములు సంకల్పించుటకు మంచిరోజు.

Monday 8 February 2016

శంకరస్తోత్రాలు : వేదసారశివస్తోత్రమ్




॥ श्री शंकराचार्य कृतं वेदसारशिवस्तोत्रम्॥

|| శ్రీ శంకరాచార్య కృతం వేదసారశివస్తోత్రమ్||

పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేన్ద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ ।
జటాజూటమధ్యే స్ఫురద్గాఙ్గవారిం
మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ ॥ 1 ॥

సమస్త ప్రాణులకూ ప్రభువు, పాపనాశకుడు, పరమేశ్వరుడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, ప్రార్ధించదగినవాడు, జటాజూటమునందు గంగనుమోయుచున్నవాడు, మన్మథుని సంహరించినవాడు అగు మహాదేవుని ఒక్కనినే స్మరించుచున్నాను.


మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఙ్గభూషమ్ ।
విరూపాక్షమిన్ద్వర్కవహ్నిత్రినేత్రం
సదానన్దమీడే ప్రభుం పఞ్చవక్త్రమ్ ॥ 2 ॥

మహేశ్వరుడు,  దేవతలను కూడా శాసించువాడు, రాక్షసులను సంహరించువాడు, అంతటా వ్యాపించినవాడు, ప్రపంచమును పాలించువాడు, విభూతితో దేహమునలంకరించుకున్నవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని అను మూడు నేత్రములు కలవాడు, సదానందరూపుడు, పంచముఖములున్నవాడు అగు పరమశివుని స్తుతించుచున్నాను.


గిరీశం గణేశం గలే నీలవర్ణం
గవేన్ద్రాధిరూఢం గుణాతీతరూపమ్ ।
భవం భాస్వరం భస్మనా భూషితాఙ్గం
భవానీకళత్రం భజే పఞ్చవక్త్రమ్ ॥ 3 ॥

కైలాసముపైనున్నవాడు, ప్రమథ్గణములకధిపతి, కంఠమునందు నీలవర్ణమున్నవాడు, నందివాహనుడు, సత్వరజస్తమోగుణములకతీతుడు, ప్రకాశించువాడు, భస్మచే అలంకరించబడిన శరీరము కలవాడు, భవానీపతి, పంచముఖుడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.


శివాకాన్త శమ్భో శశాఙ్కార్ధమౌలే
మహేశాన శూలిఞ్జటాజూటధారిన్ ।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప ॥ 4 ॥

ఓ పార్వతీపతీ! శంభో! చంద్రమౌళీ! మహేశ్వరా! శూలమును ధరించినవాడా! జటాజూటమున్నవాడా! నీవొక్కడివే ప్రపంచమంతా వ్యాపించిన విశ్వరూపుడవు. ఓ ప్రభూ! పరిపూర్ణరూపుడా! ప్రసన్నుడవగుము.


పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోఙ్కారవేద్యమ్ ।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ ॥ 5 ॥

పరమాత్మ, ఒక్కడు, ప్రపంచము ఏర్పడుటకు మూలకారణుడు, కోరికలు లేనివాడు, ఆకారములేనివాడు, ఓంకారముచే తెలియబడువాడు, ప్రపంచము యొక్క సృష్టి,స్థితి,లయలకు ఆధారమైనవాడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.


న భూమిర్నం చాపో న వహ్నిర్న వాయు
ర్న చాకాశమాస్తే న తన్ద్రా న నిద్రా ।
న చోష్ణం న శీతం న దేశో న వేషో
న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే ॥ 6 ॥

భూమి - నీరు - నిప్పు - గాలి - ఆకాశము కానివాడు, ఆలస్యము  - నిద్ర - వేడి - చలి -దేశము - వేషము లేనివాడు, ఆకారము లేనివాడైనా త్రిమూర్తి స్వరూపుడు అగు పరమేశ్వరుని స్తుతించుచున్నాను.


అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానామ్ ।
తురీయం తమఃపారమాద్యన్తహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ ॥ 7 ॥

పుట్టుకలేనివాడు, శాశ్వతుడు, కారణములకే కారణమైనవాడు, శుభకరుడు, కైవల్యస్వరూపుడు, ప్రకాశించు సూర్యుడు, చంద్రుడు మొదలగు వారిని కూడా ప్రకాశింపచేయువాడు, సత్త్వరజస్తమో గుణములకు అతీతుడుగా నాలుగవస్వరూపుడు, అజ్ఞానాంధకారమునకు అవతలనున్నవాడు, ఆది అంతము లేనివాడు, పరమపవిత్రుడు, భేదములేనివాడు అగు పరమేశ్వరుని శరణుపొందుచుచున్నాను.


నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానన్దమూర్తే ।
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ॥ 8 ॥

అంతటా వ్యాపించి ఉన్నవాడా! విశ్వస్వరూపుడా! చిదానందాకారుడా! తపస్సు యోగములద్వారా పొందదగినవాడా! వేదవిజ్ఞానముచే తెలుసుకొనదగినవాడా! నీకు నమస్కారము.


ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవ శమ్భో మహేశ త్రినేత్ర ।
శివాకాన్త శాన్త స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః ॥ 9 ॥

ప్రభూ! శూలపాణీ! అంతటా వ్యాపించినవాడా! విశ్వనాథా! మహాదేవా! శంభో! మహేశా! ముక్కంటీ! పార్వతీవల్లభా! శాంతస్వరూపుడా! మన్మథుని జయించినవాడా! త్రిపురాసురుని సంహరించినవాడా! నీకంటే వేరొకడు ప్రార్ధించదగినవాడు, లెక్కించదగినవాడు లేడు.


శమ్భో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ ।
కాశీపతే కరుణయా జగదేతదేక
స్త్వంహంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి ॥ 10 ॥

శంభో! మహేశా! కరుణామయుడా! శూలపాణీ! గౌరీపతీ! పశుపతీ! ప్రాణులబంధములను పోగొట్టువాడా! కాశీపతీ! నీవొక్కడివే కరుణతో ఈ ప్రపంచమును నాశనము చేయుచున్నావు, పాలించుచున్నావు, సృష్టించుచున్నావు, నీవు మహేశ్వరుడవు.


త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లిఙ్గాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ ॥ 11 ॥

ఓ దేవా! శంకరా! మన్మథుని జయించినవాడా! నీ నుండే ప్రపంచము పుట్టుచున్నది. ఓ సుఖదాతా! విశ్వనాథా! నీ యందే ప్రపంచము నిలుచుచున్నది. ఓ ఈశ్వరా! హరా! ప్రపంచస్వరూపుడా! లింగరూపుడవైన నీయందే ఈ ప్రపంచము లీనమగుచున్నది.


|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం వేదసారశివస్తోత్రం సమ్పూర్ణమ్ ||

Friday 5 February 2016

శంకరస్తోత్రాలు : లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రమ్

 

॥ श्री शंकराचार्य कृतं लक्ष्मीनृसिंह पञ्चरत्न स्तोत्रं  ॥

|| శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం  ||

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబిమ్బాలఙ్కృతిధృతికుశలో బిమ్బాలఙ్కృతిమాతనుతే ।
చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 1॥

ఓ హృదయమా! నీ ప్రభువైన జీవాత్మకు ప్రియము కోరినచో ఎల్లప్పుడు నరసింహుని పూజింపుము. ప్రతిబింబము(జీవాత్మ)ను అలంకరించదలచినవాడు, బింబము(పరమాత్మ) ను అలంకరించును.
మనస్సనే ఓ తుమ్మెదా! నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. లక్శ్మీనరసింహుని పాదపద్మమకరందమును ఆస్వాదించుము.


శుక్త్తౌ రజతప్రతిభా జాతా కతకాద్యర్థసమర్థా చే
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ ।
చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 2॥

వెండివలే తళతళలాడు ముత్యపుచిప్ప ఆభరణములు చేయుటకు పనికిరానట్లే దుఃఖమయమైన సంసారము ఆనందమునివ్వదు.
మనస్సనే ఓ తుమ్మెదా! నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. లక్ష్మీనరసింహుని పాదపద్మమకరందమును ఆస్వాదించుము.


ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గన్ధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ ।
చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 3॥

ఆకారము సమానముగా ఉన్నందున బూరుగు పువ్వును చూచి మెట్టతామరపువ్వని భ్రమపడితివి. పరిమళము, మకరందము లేని నిస్సారమైన బూరుగుపువ్వుపై వృథాగా తిరుగుచున్నావు.
మనస్సనే ఓ తుమ్మెదా! నిస్సారమైన  సంసారమనే  మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు.లక్ష్మీనరసింహుని పాదపద్మమకరందమును ఆస్వాదించుము.


స్రక్చన్దనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గన్ధఫలీసదృశా నను తేమీ భోగానన్తరదుఃఖకృతః స్యుః ।
చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 4॥

పూలదండలు - చందనం - స్త్రీలు మొదలైనవి సుఖమునిచ్చుననే భ్రమతో తిరుగుచున్నావు. సంపంగి పూలు తుమ్మెదలకు హాని చేయునట్లుగా ఇవన్నీ అనుభవించిన పిదప దుఃఖమును కలిగించును.
మనస్సనే ఓ తుమ్మెదా! నిస్సారమైన  సంసారమనే  మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు.లక్ష్మీనరసింహుని పాదపద్మమకరందమును ఆస్వాదించుము.


తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి।
చేతోభృఙ్గ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరన్దమ్ ॥ 5॥

ఎల్లప్పుడూ సుఖమును కోరుచున్నచో నీకు హితమైన మాటను చెప్పెదను  వినుము. కలలో కనబడినదంతా అసత్యమైనట్లే  మెలకువలో కనబడునది కూడా అసత్యమేయని తెలుసుకో.
మనస్సనే ఓ తుమ్మెదా! నిస్సారమైన  సంసారమనే  మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు.లక్ష్మీనరసింహుని పాదపద్మమకరందమును ఆస్వాదించుము.

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం లక్ష్మీనృసింహ పఞ్చరత్న స్తోత్రం సమ్పూర్ణమ్ ||

Thursday 4 February 2016

శంకరస్తోత్రాలు : ఉమామహేశ్వరస్తోత్రమ్

 

॥ श्री शंकराचार्य कृतं उमामहेश्वरस्तोत्रम् ॥

|| శ్రీ శంకరాచార్య కృతం ఉమామహేశ్వరస్తోత్రమ్  ||

నమః శివాభ్యాం నవయౌవనాభ్యామ్
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।
నగేన్ద్రకన్యావృషకేతనాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 1॥

మంగళమూర్తులు, నవయౌవనవంతులు, పరస్పరము గాఢంగా పెనవేసుకున్న శరీరములు  కలవారు,  హిమవంతుని కమార్తె - జెండాపై వృషభ చిహ్నము కలవారు అగు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యామ్
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 2॥

మంగళమూర్తులు, సరసస్వరూపులు, భక్తులు కోరువరములనిచ్చువారు, నారాయణునిచేత పూజింపబడు పాదుకలు కలవారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం వృషవాహనాభ్యామ్
విరిఞ్చివిష్ణ్విన్ద్రసుపూజితాభ్యామ్ ।
విభూతిపాటీరవిలేపనాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 3॥

మంగళమూర్తులు, జెండాపై ఎద్దు చిహ్నము కలవారు, బ్రహ్మ - విష్ణువు - ఇంద్రుడు మొదలగు వారిచే పూజింపబడువారు, విభూతి - చందనము పూసుకున్నవారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యామ్
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ ।
జమ్భారిముఖ్యైరభివన్దితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 4॥

మంగళమూర్తులు, జగత్తును పాలించువారు, ప్రపంచమునకు ప్రభువులు, విజయస్వరూపులు, ఇంద్రుడు మొదలగు దేవతలచే పూజింపబడువారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం పరమౌషధాభ్యామ్
పఞ్చాక్షరీ పఞ్జరరఞ్జితాభ్యామ్ ।
ప్రపఞ్చసృష్టిస్థితి సంహృతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 5॥

మంగళమూర్తులు, సర్వరోగములనూ పోగొట్టు ఔషధములు, పంచాక్షరీ మంత్రమను పంజరము నందు విరాజిల్లుచున్నవారు, ప్రపంచము యొక్క  సృష్టి - స్థితి - లయలకు కారణమైనవారు అగు పార్వతీ పరమేస్వరులకు నమస్కారము.


నమః శివాభ్యామతిసున్దరాభ్యామ్
అత్యన్తమాసక్తహృదమ్బుజాభ్యామ్ ।
అశేషలోకైకహితఙ్కరాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 6॥

మంగళమూర్తులు, అతి సుందరులు, మిక్కిలిగా పెనవేసుకున్న హృదయములు కలవారు, సమస్త లోకములకు మంచి చేయువారు అగు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం కలినాశనాభ్యామ్
కఙ్కాలకల్యాణవపుర్ధరాభ్యామ్ ।
కైలాసశైలస్థితదేవతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 7॥

మంగళమూర్తులు, కలికాల దోషములను నాశనం చేయువారు, ఎముకలనొకరు, శుభకరమగు దేహము నొకరు ధరించినవారు, కైలాసపర్వతమునందున్న దేవతలు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యామశుభాపహాభ్యామ్
అశేషలోకైకవిశేషితాభ్యామ్ ।
అకుణ్ఠితాభ్యామ్ స్మృతిసమ్భృతాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 8॥

మంగళమూర్తులు, అశుభములను పోగొట్టువారు, సమస్తలోకములందూ ఒకేఒక  గొప్పవారుగా ప్రశంసించబడువారు, ఆటంకములు లేనివారు, స్మృతిస్వరూపులు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం రథవాహనాభ్యామ్
రవీన్దువైశ్వానరలోచనాభ్యామ్ ।
రాకాశశాఙ్కాభముఖామ్బుజాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 9॥

మంగళమూర్తులు, రథవాహనమునందున్నవారు, సూర్యుడు - చంద్రుడు - అగ్ని కన్నులుగా కలవారు, పున్నమి చంద్రుడు వంటి ముఖ పద్మములున్నవారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం జటిలన్ధరభ్యామ్
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ ।
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 10॥

మంగళమూర్తులు, జటలు ధరించినవారు, ముసలితనము -  మరణము లేనివారు, విష్ణువు - బ్రహ్మలచే పూజింపబడువారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.



నమః శివాభ్యాం విషమేక్షణాభ్యామ్
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ ।
శోభావతీ శాన్తవతీశ్వరాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 11॥

మంగళమూర్తులు, మూడుకన్నులు కలవారు, మారేడు దళముల దండ - మల్లెపూల దండలను ధరించువారు, శోభావతీ -శాంతవతీశ్వరులను పేర్లు కలవారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


నమః శివాభ్యాం పశుపాలకాభ్యామ్
జగత్రయీరక్షణ బద్ధహృద్భ్యామ్ ।
సమస్త దేవాసురపూజితాభ్యామ్
నమో నమః శఙ్కరపార్వతీభ్యామ్ ॥ 12 ॥

మంగళమూర్తులు, ప్రాణులను పాలించువారు, మూడులోకములను రక్షించుటలో బద్ధచిత్తులైనవారు, సమస్తదేవతలచే - రాక్షసులచే పూజింపబడువారు అగు పార్వతీపరమేశ్వరులకు నమస్కారము.


స్తోత్రం త్రిసన్ధ్యం శివపార్వతీభ్యామ్
భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః ।
స సర్వసౌభాగ్య ఫలాని భుఙ్క్తే
శతాయురాన్తే శివలోకమేతి ॥ 13 ॥

పన్నెండుశ్లోకములు కల ఈస్తోత్రమును పార్వతీపరమేశ్వరుల కొరకై ఎవడు మూడు కాలములందు భక్తితో పఠించునో వాడు సర్వసౌభాగ్యములను అనుభవించును. నూరేళ్ళు జీవించి పిదప శివలోకమును చేరును.

|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం ఉమామహేశ్వరస్తోత్రం సమ్పూర్ణమ్ ||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.