Showing posts with label జయేంద్ర సరస్వతీ స్వామి. Show all posts
Showing posts with label జయేంద్ర సరస్వతీ స్వామి. Show all posts

Saturday, 11 June 2016

శ్రీ జయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 7

1 పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు సాయంత్రం సంధ్యావందనం చేయుటకు ముందు స్నానం చేయటం అవసరమా?
జ:  స్నానం చేయనవసరము లేదు. శుభ్రమైన వేరే బట్టలు కట్టుకుని సంధ్యావందనం చేయవచ్చును.

2  పరిషేచనం చేసిన తరువాత మధ్యలో లేవవచ్చునా? అందుకు ఏదైనా పరిహారం ఉన్నదా?
జ:  అలా లేవకూడదు. పరిహారం ఉండదు. ఆవిధంగా మధ్యలో లేస్తే ఆ ఆకు వదిలివేసి వేరే ఆకులో భోజనము చేయవలెను.

3 సంధ్యావందనమే కాకుండా మధ్యాహ్నికము కూడా చెయ్యవలెనా?
జ:  అవశ్యం చేయవలెను.

4 నిర్ణీత కాలములో సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఇవ్వవలెనా?
జ: నియమంగా సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఈయనవసరము లేదు. ఆచమనము, ప్రాణాయామము చేసి మొదట ప్రణవ వ్యాహృతి , తరువాత గాయత్రి , ఆతరువాత ప్రణవ వ్యాహృతి జపించవలెను.

5 సాయంత్రం అర్ఘ్యప్రదానం భూమి మీద చేయవలెనా? జలములో చేయవలెనా?
జ:  రెండూ చేయవచ్చును. నేలమీద కూర్చుంటే నేలమీద , నీటిలో నిలబడి ఉంటే నీటిలోనూ అర్ఘ్యప్రదానం చేయవలెను.

శ్రీ జయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 6


 
 శ్రీ జయేంద్రవాణి: ప్రశ్నోత్తరములు : 6

1. తులసిపూజ చేయు విధానమును తెలియగోరుచున్నాను?
జ: తులసి మొక్కలో ముందు నీరు పోయవలెను. తరువాత కుంకుమ పెట్టి పుష్పము సమర్పించవలెను. తరువాత పాలు , పళ్ళు నైవేద్యము పెట్టి కర్పూరము వెలిగించి హారతి ఇవ్వవలెను. పిమ్మట మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించవలెను.తులసి మన్నును ప్రసాదముగా నుదుట పెట్టుకొనవలెను. " తులసి పూజా విధానం" అనే పుస్తకం దొరుకుతుంది.

2. కొన్ని రోజులలో తులసి కోయకూడదు అంటారు. ఏ ఏ రోజులలో కోయకూడదు ? శ్రాద్ధము ఆరోజువస్తే కోయవచ్చునా ?
జ: శుక్రవారము, ఆదివారము, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి వంటిరోజులలో తులసి కోయకూడదు అన్నది సాధారణ నియతి. శ్రాద్ధము ఏరోజు వచ్చినా తులసి కోయవచ్చును.

3. తులసిపూజను పురుషులు చేయవచ్చునా ?
జ: బాగా చేయవచ్చును.

4. పూజగదిలో సుద్దతో ముగ్గులు వేయవచ్చునా ?
జ: ఇంట్లో, ఇతరగదులలో సుద్దతో ముగ్గులు పెట్టవచ్చును. కానీ పూజగదిలో మాత్రం బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయవలెను.

5. బియ్యపుపిండితో ముగ్గు వేయటంలో ఏమైనా అంతరార్థం నిండి ఉన్నదా ?
జ : బియ్యపుపిండి తో ముగ్గు పెట్టిన ఇంట్లో శుభం జరుగుతుంది. ముగ్గు మంగళ చిహ్నం.

Friday, 10 June 2016

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 5

1  జపము చెయ్యటానికి తగిన మాలలు ఏవి?
జ: రుద్రాక్షమాల , ముత్యాలమాల , పగడాలమాల , స్ఫటికమాల , శంఖుపూసలమాల , వెండిపూసలమాల , వేపగింజలమాల , తామరపూసలమాల.

2  నిమ్మకాయ డిప్పలో దీపం వెలిగించవచ్చునా?
జ: దుర్గా అమ్మవారి సన్నిధిలో రాహుకాలం ముందు వెలిగిస్తే మేలు జరుగును.


3  ఇంట్లో పావురములను పెంచవచ్చునా?
జ: ఇంట్లో పావురములను పెంచకూడదు. కాని దేవాలయములలోను , ఇతర బహిరంగ స్థలములలోనూ ఉన్న పెంపుడు పావురములకు ధాన్యపు గింజలు ఆహారముగా వేయవచ్చును.

4  పూజకు సంబంధించిన స్తోత్రములనన్నింటినీ పూజగదిలో కూర్చునే చదవవలెనా? లేక ఇంట్లో ఇతర గదులలో కూర్చుని కూడా చదువవచ్చునా?
జ: దేవుని ప్రార్థనా స్తోత్రములను ఇంట్లో శుభ్రముగా వున్న అన్ని గదులలోను కూర్చుని చదవవచ్చును.అన్ని సమయాలలోనూ చదవవచ్చును.

5  ఇంట్లో దేవుని గదిలో ఉదయం , సాయంత్రం రెండు వేళలా దీపం వెలిగించి ప్రార్థించవలెనా? సాయంత్రం మాత్రం దీపం వెలిగించిన సరిపోతుందా?
జ: గృహయజమానురాలు రెండువేళలా దీపం వెలిగించి పూజ చేయవలెను.

Wednesday, 20 April 2016

జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?



జయేంద్రవాణి : సత్సాంగత్యం ఎందుకు అవసరము ?
(జగద్గురువులు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతీ సంయమీంద్రుల అనుగ్రహభాషణములనుండి)

ఒకానొకప్పుడు ధర్మపుత్రుడు, దుర్యోధనుడు కలిసి ఒక చోటకు వెళ్లారు. మామూలుగ వారిద్దరూ కలిసి బయటకు వెళ్లటం జరిగేది కాదు. వారు జ్ఞాతులైన, బాల్యం నుండి వారి మధ్య సఖ్యత లేని కారణంగా వారు చాల అరుదుగా కలిసి సంచరించే వారు. కాని ప్రపంచంలోని పలుప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారో పరిశీలిద్దామని వారిరువురు కలిసి వెళ్లటానికి నిశ్చయించుకున్నారు.

ఒక రోజున ధర్మపుత్రుడు, దుర్యోధనుడు ఒక నగరాన్ని చూట్టానికి వెళ్లారు. ధర్మపుత్రుడు ప్రతి దాంట్లోను మంచిని మాత్రమే చూడగల్గితే, దుర్యోధనుడు వానిలోని చెడును మాత్రమే దర్శించ గల్గుతున్నాడు. ఒకే విషయం ఒకరికి మంచిగా తోస్తే అదే విషయం రెండవ వానికి చెడుగా కన్పిస్తుంది. ఇది ఎలా సంభవం? ఇచ్చట సమస్య వ్యక్తి తాను పరిశీలించిన పూర్తి విషయంపై ఏర్పడే మానసికధోరణి మాత్రమే. వస్తుదోషం అంటూ ఏమీ ఉండదు.

వారు అలా వెళుతుండగా మాంసవిక్రయం కొరకు జంతువధ చేస్తున్న ఒక కసాయి వాడు వారిద్దరకు కనిపిస్తాడు. తన జీవనోపాధి కొరకై జంతువులను వధిస్తున్నాడు గనుక కసాయి వానిని ధర్మపుత్రుడు చెడ్డవాణ్ణిగా తలంచాడు. కసాయివాడు చేసేపని అక్రమమైనది గనుక అతడు చెడ్డవాడేనని దుర్యోధనుడు కూడ అంగీకరించాడు. వారిరువురు ఈ విషయంపై ఏకాభిప్రాయం కల్గియుండటం చాల అరుదైన సంఘటనే. జంతు హింస పాపమని యిరువురు విశ్వసించారు. ఇరువురు కసాయివాడు చెడ్డవాడనే అభిప్రాయాన్ని సమర్థించారు.

కొంత సేపయిన తర్వాత ఆ కసాయివాడు ఆ మాంసంలో కొంత భాగాన్ని తన దుకాణం బయట కుక్కలకు ఆహారం గాను, మరి కొంత భాగాన్ని మాంసాహారులైన పక్షులకు ఆహారంగాను వేయటం వారు గమనించారు. అలా చేసిన తర్వాతనే కసాయివాడు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదిజూచి ధర్మపుత్రుని హృదయం స్పందించింది. నిస్సందేహంగా ఇతడు తన జీవనోపాధికై జంతువధ చేస్తున్నాడు. ఐనా కొంత మాంసాన్ని జంతువులకు, పక్షులకు ఆహారంగా యిచ్చి తన ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాతనే తన వ్యాపారాన్ని ఆరంభిస్తున్నాడు. మనం మన భోజనానికి ఉపక్రమించే ముందు చుట్టుప్రక్కల అతిధులెవరైనా ఉన్నారేమో నని చూచి వారికి భోజనం పెట్టిన తర్వాతనే మనం భుజించాలి. ఇలాంటి ధర్మం మరొక చోట చూడం. ఇది మనదేశంలో మాత్రమే చూడగలం. ఇది ధర్మాన్ని గురించిన అతని అవగాహన.

ప్రతిదినం మనం కూడ చాల జీవరాసుల్ని చంపుతాం. బెండకాయ, దోసకాయ, వంకాయ, పొట్లకాయ మొదలైన కూరగాయల్ని తరుగుతాం. వీటన్నిటిలోనూ ప్రాణం ఉంది. మనం తినే బియ్యం కూడ ప్రాణం గలదే. ఐనా మనం భుజిస్తాం. కొంత మంది సపోటా పండు తింటారు. కాని మరికొందరు దాని రంగునకు ఇష్టపడక దాన్ని తినటానికి ఆసక్తి చూపరు. కనుక ఒక వస్తువు పట్ల వ్యక్తి కనబరచే మానసిక వైఖరి మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అందుచే ప్రతివాడు తన చిత్తప్రవృత్తిని బట్టి పనులను చేస్తాడు. విషయాలను పరికిస్తాడు. కసాయివాడు పాపకార్యమైన జంతువధను చేస్తున్నప్పటికి కొంత మాంసాన్ని ఇతర ప్రాణికోటికి ఆహారంగా యిచ్చికాని తన వ్యాపారాన్ని ప్రారంభించటం లేదు. ఐతే వ్యాపార మంటేనే మోసాలు, అబద్ధాలు అప్రమాణాలు మొదలైన అన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడాల్సి ఉంటుంది. ఐనా కసాయివాడు తన వ్యాపారాన్ని ఆరంభించక ముందే ఒక ధర్మమైన పనిని చేసేవాడు. అప్పుడు ధర్మపుత్రుడు ఆలోచించ ప్రారంభించాడు. ''మొదట కసాయివాడు చాల చెడ్డవాడని నిర్ధారించాను. కాని అతనిలో కూడ మంచితనం ఉందని ఇప్పుడు అభిప్రాయపడుతున్నాను.'' దాన్ని గురించి పదేపదే ఆలోచించి తనలో ఇట్లా అనుకున్నాడు ''నేను ఇన్నాళ్లూ దుర్యోధనునితో కలిసి ప్రయాణిస్తున్నాను. కనుక అతని వాసనా బలం నాలో ప్రవేశించింది. నా ధర్మ నిర్ణయంలో పొరపాటు మొదట జరిగిందంటే దానికి కారణం అతని సాహచర్యమే.''

కాబట్టి సాహచర్యమే ఈ తేడాలకు కారణ భూతమౌతుంది. ఇచ్చట దృష్టిదోషం తప్ప వస్తుదోషం ఏమీ లేదు. అనగా వస్తువులో ఏ లోపం లేదు. లోపమల్లా మన దృష్టిలోనే. మనకు సత్సాంగత్యం, దేవాలయాలకు పోవుట, భగవంతుని కొలుచుట, మతపరమైన ప్రవచనాలు వినుట మొదలైన సత్కాలక్షేపాలు సమకూరితే ప్రతిది మనకు మంచిగా కన్పిస్తుంది. ప్రజలందరు మన దృష్టిలో సత్పురుషు లౌతారు. కనీసం అలాంటి సమయాల్లో నైనా మనకు మంచి భావాలు కల్గుతాయి, మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి, మంచిగా ప్రవర్తిస్తాం. ఇతర సమయాల్లో మనం చెడుగా ప్రవర్తించవచ్చు, చెడ్డ వారం కావచ్చు. సత్పురుషులెప్పుడూ ప్రతి విషయాన్ని సమదృష్టితో సరియైన స్థితిలో చూస్తారు. సాహచర్యం మారినా, పరిసరాలు చెడినా, విలువలు నిర్ణయాలు తారుమారౌతాయి. ఇది చాలమంది సాధారణ వ్యక్తులలో సంభవిస్తుంది.

రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు ఏ పరిసరాలలో నున్న వారు చెడ్డవారే. పరిసరాల ప్రభావం వారిపై ఏ విధంగాను పడదు. కాని మన విషయంలో దోషం మన బాహ్య చర్మం పైనే ఉంటుంది. మన రక్తంలోకి అది చొరబడలేదు. రక్తం పరిశుద్ధంగా ఉన్నంత వరకు, సత్సాంగత్యంలో మనం గడిపినంత వరకు ప్రతి విషయంలోను మనం మంచినే చూస్తాము. మన వివేకం, బుద్ధి కూడ మంచి స్థితిలో ఉంటాయి. పరిసరాలు, సహచర్యం చెడుగా పరిణమించి నప్పుడే మనం చెడుగా మారుతాం.

మనం మన సంస్కృతిని, మతాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే చాలు మంచి వారమౌతాం. దుష్ట వాతావరణమున్నా అది దానంతట అదే అదృశ్యమౌతుంది. ఒక వేళ వున్నా కొంతకాలం వుండి వెంటనే రహిత మౌతుంది.

కనుక పరిసరాల్ని మెరుగు పరచుకునే ప్రయత్నం మనం చేయాలి. మనకు మన మతం, మన ధర్మాలు, చేయవలసిన విధులు వున్నాయని గుర్తుంచుకోవాలి. మన ఆచార వ్యవహారాలతో బాటు మన సంప్రదాయాలను, సంస్కృతిని కూడ మనం కాపాడుకోవాలి.

ప్రాథమిక మత సిద్ధాంతాలను అవగాహన చేసికొని సగుణోపాసన ద్వారా భగవదారాధన చేయటమే మన కనీస కర్తవ్యం. మనం సత్సాంగత్యాన్ని, పుణ్యపురుషుల సహచర్యాన్ని సమ కూర్చుకొని స్వధర్మాల్ని నిర్వర్తిస్తూ మంచి పరిసరాల్ని సృష్టించుకోవాలి. అడ్డంకుల భయాన్ని గాని, నిస్పృహని గాని దరిచేరనీయ నవసరం లేదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మనగల్గటానికై మన ప్రాచీనమైన, గొప్పదైన మతాన్ని పుష్టికరం కావించుచూ, దాని పునరుజ్జీవనానికై మనలో ప్రతివాడు తనవంతు కృషి చేయాలి.

Monday, 28 March 2016

శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత



శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత
(జయేంద్రవాణి నుండి)

భగవన్నామస్మరణ సత్ఫలితాల్ని సమకూరుస్తుంది. విశేషంగా రామనామ స్మరణ వ్యక్తికి అమితప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది. మనస్సు దోష భూయిష్ట మైనప్పుడు రామనామజపంచేస్తే అది దోషరహితమై స్వచ్ఛతను చేకూర్చుకుంటుంది.

వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే తులసీదాసు దాన్ని హిందీలోకి అనువదించాడు. ఈ ఇరువురు మహాత్ములయొక్క జీవితచరిత్రలు రామనామంయొక్క ఉత్కృష్టతను వివరంగా ఉల్లేఖిస్తాయి. వాల్మీకి జీవితాన్ని పరిశీలిస్తే ఒకవ్యక్తి యొక్క జీవితాన్ని రామనామం ఏవిధంగా తారుమారు చేసి ఉన్నతగమ్యాలకు చేర్చగలదో మన మెరుగగలం. బందిపోటు దొంగగా జీవితాన్ని ఆరంభించిన ఒక బోయవాడు రామనామ జపఫలితంగా మహర్షి స్థాయికి ఎదిగాడు.

వాల్మీకి అడవిలోకి వచ్చిన జనుల సొత్తును దోపిడిచేసి జీవించేవాడు. ఒక రోజున సప్తర్షులు అడవికి వెళ్లారు. వాల్మీకి వారినికూడ సమీపించి వారి వస్తువులను కూడ బలవంతంగా తీసికోటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు మహర్షులు అతనితో ''ఇతరులను బాధించి వారి వస్తువులను తీసికొని వారికి ఇబ్బంది కల్గచేస్తున్నావు.'' అనగానే వాల్మీకి దానికి సమాధానంగా ''నేను పెద్దకుటుంబీకుడను. నాకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతరబంధువులు వున్నారు. వారి పోషణ బాధ్యత నాదే. వారందరి ఆకలి తీర్చటానికి నేనిలా ప్రజలను హింసించి వారి సొత్తును తీసికొనవలసినదే.'' అన్నాడు. అప్పుడు వారు ''నీవు వారందరికి ఆహారం సమకూర్చవలసినదే. కాని నీవు అవలంబిస్తున్న మార్గం చాల తప్పిదమైంది, పాపసమన్వితమైంది. నీవు చేసే పాపకార్యం యొక్క ఫలితం నీవనుభవించాల్సిందే గాని నీవల్ల పోషింపబడుతున్న నీకుటుంబీకులు ఒక్కరుకూడ నీపాపంలో పాలుపంచుకోరు. దోపిడీ అనే పాపకార్యాన్ని చేసి నీకుటుంబాన్ని పోషించే ఉద్యమం మంచిదికాదు. కనుక ఇకనుండి యీ పాపకృత్యాల్ని విరమించు.'' అని మహర్షులన్నారు. అప్పుడు వాల్మీకి ''నేను ఈ విధమైన దోపిడి చాలకాలం నుండి చేస్తున్నాను. ఈ పరిస్థితినుండి నాకు బయటపడే మార్గం ఏమిటి ?'' అని అడిగాడు. దానికి మహర్షులు వాల్మీకితో ''నీవు ఈ రోజునుండి రామనామజపం చేయటం ఆరంభించు. నీ వింతవరకు చేసిన పాపాలన్నిటికి దానివలన నిష్కృతి కలుగుతుంది.'' అన్నారు. ఆ విధంగా మహర్షులవలన ఉపదేశం పొందిన వాల్మీకి అడవిలోకి వెళ్లి దోపిడి చేయటం పూర్తిగా విరమించాడు. అందుకు బదులు అతడొక ఏకాంతప్రదేశంలో కూర్చొని నిష్ఠతో రామనామజపం అన్నివేళల చేయటం ఆరంభించాడు. అతడలా ఒకేచోట ఆసీనుడై ఎంతకాలం రామనామజపం చేశాడో కాని, అతని శరీరంపై చీమలపుట్ట పెరిగి అతన్ని పూర్తిగా మరుగుపరచింది. అతడాపుట్టనుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షిగా పిలవబడ్డాడు. వల్మీకం అనగా చీమలపుట్ట. దాని నుండి వెలువడి నందువలన ఆయనకు వాల్మీకియని నామధేయం సార్థకమైంది.

రామనామ జపం ద్వారా సాధించిన రామానుగ్రహంవల్ల బందిపోటుదొంగ జ్ఞానియై మహర్షిగా పరిణమించాడు. అతని పూర్వపు పాపాలన్నీ ప్రక్షాళితమైనాయి.

నిశ్చయంగా ఈ అధునాతన కాలంలో చదువును, వ్రాయను నేర్చిన మనం వాల్మీకి కంటే చాల తెలివైనవారమే. కాబట్టి మనం రామనామ జపంలో కొంతకాలాన్ని వెచ్చిస్తే మన సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. సామాన్యుడైన వాల్మీకి యొక్క పాపాలు రామనామ జపంచేత ప్రక్షాళింపబడినప్పుడు, మన పాపాలకు కూడ నిశ్చయంగా నిష్కృతి లభిస్తుంది.

మన జీవితాల్ని ప్రకాశవంతం చేసికొనుటకు వాల్మీకి మార్గాన్ని నిర్దేశించాడు. ప్రతివ్యక్తి రామనామం జపాన్ని కొన్ని వేళల్లోనైనా చేస్తే అతనికి రామచంద్రుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.

తర్వాత, త్యాగబ్రహ్మ, రామదాసు, సమర్థరామదాసు, తులసీదాసు మొదలైన మహాత్ముల జీవితాలు ఆదర్శప్రాయంగా మనముందున్నాయి. వారిదైనందిన జీవితాలు ప్రతినిత్యం రామనామం చుట్టూ పరిభ్రమించాయి. ఈ రామనామం ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించేశక్తి కల్గివుంది.

పిల్లలకు బాల్యం నుండే రామనామం వ్రాసే సదభ్యాసాన్ని అలవరచాల్సిన అవసరం వుందని నిరూపించే కారణాల్లో ఇదికూడ ఒకటి. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఈ అభ్యాసాన్ని అలవరచుకుంటే వారి కష్టాలు ఉపశమిస్తాయి. వారి జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లుతాయి. కనుక అందరూ రామభక్తిని అభ్యసించి రామనామం వ్రాస్తూ సుఖింతురు గాక.

రామాయణ ప్రవచనాల్ని వినాలి. రామనామం జపించాలి; రామచంద్రుడు అమలుచేసి చూపిన ధర్మాల్ని పాటించాలి. ఇవి సవ్యంగా నిర్వర్తిస్తే మనకు సిద్ధించే ప్రయోజనాలు అనంతం.

రాముని యొక్క మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని, స్నేహశీలతను, శరణాగతవాత్సల్యాన్ని - ఈ సద్గుణాలన్నింటిని మనం చిత్తశుద్ధితో అనుకరించాలి. రాముడు తనయొక్క అవతార జీవితంలో ఈ ధర్మాలనన్నింటిని దృష్టాంతీకరించాడు. రామకథ వినటంలో విశేషంలేదు. అంత మాత్రం చేత మోక్షం సిద్ధించదు. అందులో రాముడు అవలంబించిన ధర్మాల్ని మనంకూడా మనజీవితంలో అమలు చేయగల్గితేనే మన దుఃఖాలు ఉపశమించి మనకు మానసికశాంతి చేకూరుతుంది. రామచంద్రమూర్తి ధర్మాన్ని అనేక మార్గాల్లో అవలంబించి మన జీవితాలకు ఒక ఆదర్శమూర్తియై మనముందు నిలిచాడు.

రాముని నామం కూడ విశేష ప్రాముఖ్యం గలది. ప్రజలను సౌఖ్యానందాలతో రమింపచేయువాడు గనుక రాముడైనాడని లోగడ చెప్పుకున్నాం. గణేశుడు కూడ మనకు సుఖాల్ని ప్రసాదించే దేవతే. ఐతే రాముని విషయంలో ఆయనపేరులోనే 'సౌఖ్యప్రదాత' అనే అర్థం ఇమిడివుంది.

దేవతల్లో గూడ ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైన కోర్కెలను తీరుస్తుంది. గణేశుడు మనకు సంభవించే విఘ్నాలను నివృత్తి చేస్తాడు. శివుడు మోక్షాన్ని, లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తారు. అలాగే రాముడు శాశ్వత సుఖాన్ని మనకు ప్రసాదించే ప్రత్యేక శక్తికలవాడు.

మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఏ కార్యాన్ని నిర్వహించినా మన అంతిమ లక్ష్యం సౌఖ్యమే.

అర్థరహితమైన ఈ మాయాప్రపంచంలో అర్థసహితమైనది రామనామమే. ప్రతి విషయానికి సారాంశం రామనామం. మిగతా విషయాలన్నీ నిష్ర్పయోజనాలే. రామనామ ఉచ్చారణతో దుఃఖోపశమనం, సుఖాగమనం ఏకకాలంలో జరుగుతాయి.

కనుక కుటుంబ సభ్యులందరు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తిచేసికొని అందరూ ప్రార్థనామందిరంలో సమావేశమై రామవిగ్రహం ముందు కొద్దినిముషములపాటైన రామనామ జపం లేక భజన చేసిన తర్వాతనే వారివారి లౌకిక వృత్తుల్లోకి ప్రవేశించాలి. అప్పుడే మన పనులన్నీ శీఘ్రంగా ఫలిస్తాయి.

సమయమున్నవారు ఉదయం, సాయంత్రం కూడ రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసికొని రామనామ జపం చేయగల్గిన మంచిదే. లేనిచో ఎవరింట్లో వారు రామనామ జపంచేసి సుఖశాంతుల్ని పొందవచ్చు.

రామచంద్రుని అనుగ్రహం మన అందరిపై ప్రసరించు గాక !

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.