(జగద్గురుబోధల నుండి)
మనము శివాలయాలకు వెళ్ళి చూస్తే సాధారణంగా గర్భగృహానికి పశ్చిమభాగంలో లింగోద్భవమూర్తి స్వరూపాన్ని దర్శించవచ్చు. ప్రదక్షిణంచేస్తూ వెళితే దక్షిణ భాగంలో దక్షిణామూర్తి స్వరూపప్రతిష్ఠ ఉంటుంది. లింగోద్భవమూర్తిపరమేశ్వరస్వరూపం. ఆస్వరూపం దీర్ఘవృత్తంగా అనగా అండాకారంగా మలచబడి పాదశీర్షాల వివరం తెలియకుండా ఇతరవిషయాలు లింగానికి అంతర్భావంగా ఉన్నట్లు కనపడితుంది.
పరమేశ్వరుని అరవైనాలుగు స్వరూపాలలో లింగోద్భవమూర్తి ఒకటి. ఈ అరవైనాల్గు స్వరూపాలలో వృషభారూఢుడు, అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, నటరాజు, భైరవమూర్తి, దక్షిణామూర్తి, సోమశేఖరమూర్తి, భిక్షాటనమూర్తి, ఊర్థ్వనటుడు, జలంధరాసుర, సంహారకుడు, కాలసంహారకుడు - అనేవి కొన్ని. లింగోద్భవమూర్తికి ఎగువభాగంలో ఒక హంస, దిగువభాగంలో ఒక వరాహమూర్తీ ఉంటుంది. మనం అనుదినం చేసే రుద్రాభిషేకంలోని ధ్యానశ్లోకం ఈ క్రిందిది.
ఆపాతాళ నభఃస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకం జపన్
ధ్యాయేదీప్సిత సిద్థయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివమ్.
పాతాళలోకంనుండి ఆకాశపర్యంతము వ్యాపించి ప్రకాశిస్తున్న స్ఫటికలింగాన్ని అభిషేకిస్తున్నాను - అని దీనిభావం. స్ఫటికలింగం నిర్లిప్తమైనది. శుద్ధమైనది. నైసర్గికంగాగాని ఔపాథికంగాకాని అది పరిణామం చెందుతుంటుంది. అది గుణదోషరహితమైనది. జ్ఞానమెట్లు నిరంజనమో, పరిశుద్ధమో స్ఫటికమూ అట్లే పరిశుద్ధమైనది. పచ్చని ఆకును దానిమీద ఉంచితే అది పచ్చగానూ, ఎఱ్ఱ పూవుతో అలంకరిస్తే ఎర్రగాను కనపడుతుంది. స్వతహాగా అది నిర్వికారమైనది. నిర్వికార పరబ్రహ్మము, మన మనోభావాలను అనుసరించి మారుతుంది. అనుటకు స్ఫటికలింగ మొక దృష్టాంతం. అది నిర్గుణ పరమాత్మకు చిహ్నం.
స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, సహస్రార కమలములోని చంద్రకళను జ్యోతిస్వరూపాన్ని ధ్యానించేవారికి చంద్రకళనుండి అమృతం స్రవించి ఆనందమిస్తున్నది. ఈసమస్త ప్రపంచమున్నూ ఆనందజ్యోతి స్వరూపమైన ఒక లింగమే. దానిని చల్లచేసినామంటే లోకమున్నూ చల్లనౌతుంది. రుద్రాభిషేకానికిముందు ఈ శ్లోకం చెప్పి మరీ ధ్యానించాలి.
ఈ బ్రహ్మాండమే ఒక శివలింగమనీ, అభిషేక కాలంలో అట్లు ధ్యానిస్తూ అభిషేకం చేయాలనీ, శ్రీరుద్రం నిర్థేశిస్తున్నది. మంచీ, చెడ్డా అన్నీ భగవత్స్వరూపంగా భావించవలెననే రుద్రం చెప్పుతున్నది. అతి మధురమును, శీతలమునూ అయిన చంద్రమండలాన్ని, నిదానంగా ఉచ్చారణచేస్తూ రుద్రాధ్యయనం చేస్తూ లింగాన్ని అభిషేకించాలి.
లింగానికి ఆద్యంతాలులేవు. మనం ఏరీతిగా స్ఫటికాన్ని చూస్తున్నామో, ఆ రీతిగానే అది మనకు కనబడుతుంది. భగవంతుడున్నూ మనం ఏ విధంగా ప్రార్ధిస్తున్నామో ఆ విధంగానే మనలను అనుగ్రహిస్తున్నాడు. మన మనస్సునకు ఒక ఆకృతి అవలంబంలేక ప్రతీకం ఉంటేనేకాని ఆనందం కలగటంలేదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలోకూడా క్షేమవార్త వినటం ఒకరకం, సమక్షంలో దర్శించటం మరొక రకం. ప్రత్యక్షమైతేనే ఆనందం కలుగుతున్నది. భగవద్విషయంలోకూడా ఒక మూర్తి ద్వారా లభించే అనుగ్రహమే సంతోషదాయకంగా ఉంటున్నది.
ఆద్యందరహితంగా పరమేశ్వరమూర్తి జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు.
అపాతాళ నభస్ధలాంత భువన బ్రహ్మాండంగా వ్యాపించియున్న ఆ జ్యోతి స్వరూపాన్ని చంద్రమౌళీశ్వరుని స్ఫాటికలింగ రూపంగా మనం ధ్యానిస్తే వారి అనుగ్రహంకల్గి మనకు ఆనందం కల్గుతుంది.
No comments:
Post a Comment