Tuesday 1 March 2016

పరమాచార్యుల అమృతవాణి : శివరాత్రి




పరమాచార్యుల అమృతవాణి : శివరాత్రి
(జగద్గురుబోధలనుండి)


'శివం' అనే పదానికి మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు ఇటువంటి అర్థాలు ఉన్నాయి. సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడే పరమ మంగళ స్వరూపి. అందుచేతనే పరమేశ్వరునకు 'శివః'అనిపేరు. ఆ పరమేశ్వరుడు అన్ని చోట్లను పరిపూర్ణంగా ఉండేవాడు. అన్ని చోట్లా అన్నీ ఎఱిగినవాడు. అతడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అతనికి ఒకరూపం లేదు. సాధారణంగా ప్రాణులకు అందులోనూ మానవులకు దృగ్గోచరం కావడానికి ఆ పరమేశ్వరుడే సాంబమూర్తి రూపంగా అంబికతో కూడుకొన్న పరమేశ్వరుడుగా ఆవిర్భవించేడు.

ఆరూపం కేవల జ్ఞానస్వరూపమైప పరిపూర్ణమైన పరమాత్ముడు, స్వరూపం అంబికా సహితమైన పరమేశ్వరుడు. ఈ అరూపమైన పరిపూర్ణ స్వరూపానికిన్ని దృగ్గోచరమైన తల్లి దండ్రుల సముదాయమైన అర్థనారీశ్వరుడైన యీపరమేశ్వరునకున్ను, మధ్యలో ఒకరూపం ఉంది. దానికి అరూప రూప మని పేరు అదే శివలింగం. జ్యోతిర్మయలింగం. కంటికి అగుపడాలంటే జ్యోతిస్సే ఉండాలి. పెద్ద జ్యోతిస్సు మొట్ట మొదట నేత్రాన్ని ఆకరిస్తుంది. అందుచేత కేవలం జ్యోతిర్మయి మహాలింగంగా మొట్టమొదట ఆవిర్భవించేడు పరమేశ్వరుడు. ఆ లింగస్వరూపంలో నుండి సాక్షాత్తూ సాంబపరమేశ్వరుడు సరూపంగా ఆవిర్భవించాడు. ఈమూడింటిలో మధ్యలో ఉండే స్థానానికి శివలింగ మని పేరు. అది ఆవిర్భవించిన సమయం అర్థరాత్రం. అర్థరాత్రంలో ఆవిర్భవించినపుడే జ్యోతిస్సుకు ఎక్కువ ప్రకాశం ఉంటుంది. రాత్రివేళ మహాప్రకాశమైన జ్యోతిస్సై దేవతలకు, సిద్ధులకు, మహరులకు దర్శనం యిచ్చేడు. అందుచేతను 'అరూపమైన శివుడు జ్యోతీరూపంగా లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కావడం చేతను, శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. అది అర్ధరాత్రి పండ్రెండు గంటలకు అపుడు సర్వక్షేత్రముల యందు అందరూ నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగదర్శనం చేస్తారు.

మనదేశంలో ప్రతిసంవత్సరం రాత్రిలో కలిగిన ముఖ్యపుణ్యకాలాలు రెండు, ఒకటి జన్మాష్టమి, (శ్రీ కృష్ణాష్టమి) తరువాతిది శివరాత్రి. జన్మాష్టమి శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి, శివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి, రెండూ అర్ధరాత్రంలోనే, సంవత్సరంలో చెరిసగంలో ఈ రెండు పుణ్యకాలాలూ ఏర్పడ్డాయి. జన్మాష్టమి నుండి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుందని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. 180 రోజులు అంటే సరిగా 360 డిగ్రీలలో సగం.

అచట దేవకీగర్భంలో కృష్ణపరమాత్మ ఆవిర్భవించిన క్షణంలోనే యోగమాయ దుర్గాదేవి గోకులంలో ఆవిర్భవించింది. దుర్గయొక్క అభిన్నస్వరూపమే కృష్ణుడని తంత్రశాస్త్రంలో చెప్పబడింది. వారిద్దరూ జన్మాష్టమినాడు ఆవిర్భవించారు. అయితే గర్భంలోనుండి ఆవిర్భవించేరు. ఇది శివరాత్రినాడు గర్భం లేకుండా మహాకాశంలోనే ఒక జ్యోతిర్మయలింగంగా ఆవిర్భవించింది.

మనం రోజూ ఈశ్వరునకు అభిషేకం చేసే సమయంలో ముందుగా ఒక శ్లోకం చదువుతాం. అందులో పరమేశ్వరుని పరిమాణం నిర్వచింపబడ్డది. లింగరూపికాక పరిపూర్ణ పరబ్రహ్మానికి పరిమాణం లేదు. ఈ లింగరూపి యైన పరమేశ్వరుని పరిమాణం- 'ఆపాతాళ నభస్థలాంత భువనం' పాతాళలోకం మొదలు ఆకాశంవరకూ ఉండే సమస్తమైన భువనమూ అయి ఉన్నది. ఈ పరిమాణాన్ని అనగా పాతాళం మొదలు ఆకాశం వరకూ ఉన్న సమస్త భువనాన్ని ఒక లింగాకారంగా ధ్యానం చేయాలి ''ఆపాతాళ సభస్థలాంత భువన బ్రహ్మాండం అవిస్పురత్‌'' బ్రహ్మాండమే- లింగంకూడా. ఒక అండం రూపంగానే, ఒక కోడిగుడ్డు మోస్తరుగానే లింగం ఉంటుంది - బ్రహ్మ-అండమని దానికి అర్ధం. ఆబ్రహ్మాండరూపంగా ఉంటుంది మహాలింగం, దానికి సరిహద్దు- ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్‌ జ్యోతి స్పాటికలింగం, అది కేవలం శుద్ధస్ఫటిక లింగం, అయితే జ్యోతిర్మయమైనది. దాని ''మౌళి'' అంటే శిరస్సు, నభస్థలంలో అక్కడ శిరస్థలంలో చంద్రమండలం, మోస్తరుగా అమృతం ఘనీభావమైంది. చంద్రమండలానికి దృష్టాంతం ప్రకాశం, శైతల్యం - రెండూ కావాలి. మనకు సూర్యుడు ప్రకాశం ఇస్తాడు. అయితే, తాపమూ ఇస్తాడు. అందుచేత ప్రకాశమిస్తూ శీతలంగా అమృతకిరణంగా ఉండవలసి ఉంది. అటువంటి పరమేశ్వరునియొక్క శిరస్సులో కేవలం అమృతధార శిరస్సునుంచి పరిపూర్ణంగా పరమేశ్వరుని మహాలింగాన్ని అభిషేకం చేస్తుంది, ఆ విధంగా మనం ధ్యానం చేసినపుడు బ్రహ్మాండంలో వుండే సర్వభువనాలకు కూడ. శీతలత్వం కలిగి చల్లబడుతుంది. సర్వప్రాణులు చల్లబడుతాయి. ఇప్పుడు ఎవరైనా మనం లౌకికంగా కూడా ఒకవిందు చేసినట్లయితే '' వారిపేర పానమో, ఆహారమో చేస్తామని'' వారు భావన చేసుకుంటారు. అలాగే అభిషేకం కూడా, సర్వ ప్రపంచంలో వుండే బ్రహ్మాండమంతా చల్లబదేటటువంటిది. ప్రపంచం పరమేశ్వరస్వరూపమే నని భావించినపుడు సర్వ ప్రజలకే కాక, సర్వ ప్రాణులకూ శాంతమొస్తుంది. శైత్యమొస్తుంది. దుఃఖనివృత్తి అవుతుంది. అందుచేత శివలింగధ్యానం అభిషేకం చేసినపుడు అవి ఆపరమేశ్వరుడికే! ''అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియశ్శివ'' అంటాం. అనేక విష్ణ్వాలయాల్లో ఆమూలవిరాట్టుకు అభిషేకాలు సంవత్సరంలో ఏదో కొన్ని దినాలే చేస్తున్నాం. పరమేశ్వరునికి రోజు రోజూ ఎప్పుడూ కూడా అనవరతంగా ఒక ''ధారాపాత్ర'' ను పెట్టి ఆహోరాత్రం పరమేశ్వరునికి అభిషేకాలు చేస్తున్నాం. ఆ అభిషేకం చేసినపుడు ఈ బ్రహ్మండంమే శివలింగం. అన్నీ శివలింగస్వరూపాలే. దాని ఆకాశంలో చంద్రమండలం వున్నది. ఆ చంద్రమండలమే అమృతఘనీ భావం అక్కణ్ణుంచి అమృతం స్రవించి ఈపరమేశ్వర లింగం కడదాక పూర్తిగా తడిసినప్పుడు ప్రపంచమంతా కూడా చల్లబడుతుందనే భావనతో అభిషేకం చేయమని చెప్పబడింది.

ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పురత్‌ |
జ్యోతి స్పాటిక లింగ మౌళి విలసత్‌ పూర్ణేందు వాతామృతైః ||


''అస్తోకాప్లుత మేకం'' ఒక్కడు తప్ప రెండోవాడు లేడన్నమాట- అన్నీ అతడే ''ఈశ మనిశం రుద్రాను వాకాన్‌ జపన్‌'' -రుద్రానువాకం, సమకచమకం అంటున్నారే, ఆనమకంలో అన్నీ వస్తువులు పరమేశ్వర స్వరూపమని చెప్పడం మించి వేరేమీ లేదు. ప్రపంచంలో ఏవైనా సరే, మంచీ చెడ్డ అన్నీ పరమేశ్వర స్వరూపమే, అని నమకంలో చెప్పబడుతుంది.

''రుద్రానువాకాన్‌ జపన్‌ ధ్యాయేత్‌, ఈప్సిత సిద్ధయే, అదృత పదం విప్రోఽభిషించే చ్ఛివం'' సాక్షాత్‌ శివునికి అభిషేకం చేయవలసిందనే భావం. శివరాత్రినాడు మొట్టమొదట అరూపమైన ప్రపంచం, ప్రపంచసృష్టి అయిన తర్వాత, అంటే ప్రాణి సృష్టి అయినతర్వాత వాళ్లకు అనుగ్రహానికి, వాళ్ళహృదయం చల్లబడటానికి అరూపమయిన పరమేశ్వరుడు రూపరూపంగా, లింగరూపంగా -లింగం అంటే దానికి ముక్కూకళ్లూ ఏవీ లేవు. అయితే అరూపం గూడా కాదు, ఏదో ఒకరూపం ఉంది- ఆవిర్భవించాడు. కళ్ళూముక్కులు వచ్చేసమయంలో అది పార్వతీ పరమేశ్వరులు, ఉమాసహాయుడైన పరమేశ్వరుడు. తల్లీ, తండ్రీగానూ, బిడ్డలకు రెండు రూపాలగానూ ఉండి అనుగ్రహం చేయవలసిఉంది. అందుకోసరం ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మమే రెండురూపాలు గ్రహించి మనకు అనుగ్రహం చేస్తున్నాడు. ఆ మధ్య ''అవస్థ''కే శివలింగమని పేరు, ఆ శివలింగం రాత్రిలో ప్రకాశం - జ్యోతిస్సు ఎక్కువ ఇస్తుంది. శివరాత్రి నాడు మొట్టమొదటగా ఆ పరమేశ్వరుడు జ్యోతిర్మయుడుగా ఆవిర్భవించాడు. అంచేత ప్రపంచంలో ఎవరైనాసరే, మన పూర్వులు ఈ భావమును ఎరిగినవారు, ఆ అలవాటునే ఈనాటికీ తీసుకు వస్తున్నారు. ఈ శివరాత్రినాడు ఈ శ్రీశైలంలో దేశమంతాకూడా భగవంతుని దర్శనం దొరుకుతుందా అని ఎంతో ఆతురతతో లక్షల కొలది ప్రజలు రావటం ఇవ్వాళ చూచాను. పరమానందంగా వుంది. ఈ శ్రీశైలంలో ఈ సంవత్సరం నేను వచ్చి దర్శనం చేసే భాగ్యంనాకు దొరికింది.

హరనమః పార్వతీపతయే హరహరమహాదేవ !

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.