శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ (1 - 30)



శంకరస్తోత్రాలు :‌ శివానన్దలహరీ ( 1 - 30)

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్ || 1 ||


కళలస్వరూపులునూ (శ్రీవిద్యాస్వరూపులు, సకలవిద్యాస్వరూపులు),  సిగలపై చన్ద్రకళలను ధరించినవారునూ (కాలాతీతులునూ), ఒకరినొకరు తపస్సుద్వారా పొందిన వారునూ, భక్తులకు ఫలములిచ్చువారునూ, త్రిభువనములకూ మంగళదాయకులునూ, హృదయమునందు ధ్యానములో మరలమరల గోచరించువారునూ, ఆత్మానందానుభవముతో స్ఫురించు రూపముకలవారునూ అయిన పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు.

గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ |
దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ || 2 ||


మహాదేవ శంభో! నీ చరితామృతము నుండి మొదలై, నా బుద్ధి అను కాల్వలద్వారా  ప్రవహిస్తూ, నా పాపములనూ, నా చావు-పుట్టుకల చక్రమునూ(సంసారభ్రమణం) తొలగించివేస్తూ, నా మనస్సనే మడుగును చేరి నిలిచిన శివానందలహరికి (పరమేశ్వరుని లీలలు వినుటచే కలిగిన ఆనంద ప్రవాహము) జయమగు గాక.
(శివలీలలను తెలిసుకొనుట ద్వారా పాపనాశనమూ, తాపనాశనమూ సాధించవచ్చునని శంకరాచార్యుల ఉపదేశం)


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివ మతివిడంబం హృది భజే || 3 ||


మూడు వేదములద్వారా తెలిసికొన దగిన వాడును , మిక్కిలి మనోహరమయిన ఆకారము కలవాడును , త్రిపురములనూ(త్రిపురాసురులను) సంహరించినవాడును , సృష్టికి పూర్వమేఉన్నవాడును , మూడుకన్నులు కలవాడును , గొప్ప జటాజూటము కలవాడును, గొప్ప ఉదారస్వభావం కలవాడును, కదులుచున్నసర్పములను ఆభరణములుగా ధరించినటువంటివాడును, లేడిని ధరించినవాడునూ , దేవతలకే దేవుడయిన మహాదేవుడునూ , సకల జీవులకూ పతి అయినవాడును , జ్ఞానమునకు ఆధారమయినవాడును , అనుకరింపశక్యము కానివాడును , నాయందు దయ కలవాడును అయిన పార్వతీ సమేతుడయిన శివుని హృదయమునందు ధ్యానించుచున్నాను .

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరిబ్రహ్మాదీనామపి  నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ || 4 ||


ఏదో కొంచెము ఫలమిచ్చెడు దేవతలెందరో కలరు. కలలోనైనను ఆ దేవతలను భజించుటగానీ ,ఆ దేవతలు కలుగచేయు ఫలమునుగానీ ఆశించను . మంగళస్వరూపుడవగు ఓ శంకరా! ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేరియున్న విష్ణువుకిగానీ , బ్రహ్మకుగానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని మిమ్ము పదేపదే వేడుకొనుచున్నాను .

స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయవిభో || 5 ||


స్మృతులయందుగానీ , శాస్త్రములయందుగానీ , వైద్యమునందుగానీ , శకునములు చెప్పుటయందుగానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందుగానీ , సంగీతము పాడి రంజింపజేయుటయందుగానీ , పురాణములు చెప్పుటయందుగానీ , మంత్రశాస్త్రమందుగానీ , స్తోత్రములు చేయుటయందుగానీ , నాట్యము చేయుటయందుగానీ , హాస్యములు చెప్పి నవ్వించుటయందుగానీ  నేర్పులేనివాడను . ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును ? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు . వేదప్రసిద్ధుడవూ , సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా ! నే నెవ్వడినో నాకేతెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము .

ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః  || 6 ||


కుండగానీ , మట్టిముద్దగానీ , పరమాణువుగానీ , పొగగానీ , నిప్పుగానీ , పర్వతముగానీ , వస్త్రముగానీ , దారముగానీ  ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు . అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభం కలిగించుకొనక , శంభుని యొక్క పాదపద్మములను సేవించి , శీఘ్రముగా శివసాయుజ్యమును పొందుము.
(తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అటుకాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం)

మనస్తే పాదాబ్జే నివసతు వచస్త్సోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ |
తవధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః || 7 ||


ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ , నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ , నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ , నా యొక్క కన్నులు నీ దివ్యమంగళవిగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక . అటులైనచో ఇంకమీద నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఇచ్చగించవు . కావున అట్లు అనుగ్రహింపుమని భావము.

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || 8 ||


ఓ పశుపతీ ! దేవదేవుడవైన నిన్ను మూఢులు హృదయమునందు తలచక, ముత్యపుచిప్పలను వెండియనియూ, గాజురాళ్ళను మణులనియూ, పిండినీళ్ళను పాలనియూ, ఎండమావులను నీళ్ళనియూ భ్రమించునట్లుగా నీకంటే ఇతరులైనట్టి వారిని, దేవులనే భ్రాంతిచేత, సేవించుచున్నారు.

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతిః |
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో! || 9 ||


మనుష్యుడు తెలివితక్కువవాడై పుష్పములకొరకు లోతైన చెరువు లందు దిగుచున్నాడు, జనులు లేని భయంకరమైన అరణ్యములందునూ, విస్తీర్ణమైన పర్వతములందు తిరుగుచున్నాడు. కానీ ఓ పార్వతీపతీ! మనస్సనెడి పద్మము ఒక్కటే నీ పాదములయందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చన్న విషయాన్ని, ఈ జడులైన మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారే, ఆశ్చర్యంగాఉంది.

నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ |
సదా త్వత్పాదాబ్జస్మరణపరమానందలహరీ
విహారాసక్తం చేద్ధృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||


మనుష్యుడుగాగానీ, దేవుడుగాగానీ, పర్వతముగాగానీ, అడవిగాగానీ, మృగముగాగానీ, దోమగాగానీ, పశువుగాగానీ, పురుగుగాగానీ, పక్షులుమొదలగువానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుటయందు ఆసక్తి కలిగిఉన్నచో ఇంక ఏ జన్మ వచ్చినా బాధ లేదు.

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే!
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి || 11 ||


ఓ శివా! మానవుడు, బ్రహ్మచారియైననూ, గృహస్థైననూ, సన్యాసియైననూ, జటాధారియైననూ, మరి ఇంక ఎట్టివాడైనా కానిమ్ము దానిచేత (ఆయా ఆశ్రమముల చేత) ఏమి అగును? కానీ ఓ పశుపతీ! ఎవని హృదయపద్మము నీవశమగునో, నీవు అతనివాడివై అతని సంసార భారమును మోసెదవు.

గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే
స్థితం చేద్యోగోసౌ  స చ పరమయోగీ స చ సుఖీ || 12 ||


ఓ శంకరా! మనుజుడు, గుహలో కానీ, ఇంటిలో కానీ, బయటనెచ్చటో కానీ, అడవిలో కానీ, పర్వత శిఖరముపై కానీ, నీటియందు కానీ, పంచాగ్నిమధ్యమందు కానీ నివసించుగాక. ఎక్కడున్నా ఏమి లాభము? ఎవడి మనస్సు ఎల్లప్పుడూ నీ పాదపద్మములయందు స్థిరముగానుండునో అతడే గొప్పయోగి మరియూ అతడే పరమానందము కలవాడు అగును.


అసారే సంసారే నిజభజనదూరేఽజడ ధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ |
మదన్యః కో దీన స్తవ కృపణరక్షాతినిపుణః
త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే || 13 ||


ఓ పశుపతీ ! నీ సేవకు దూరమైన నిస్సారమైన ఈ సంసారములో గ్రుడ్డివాడనై భ్రమించునాకు మిక్కిలికరుణతో జ్ఞానమిచ్చి బ్రోవవయ్యా!. నాకన్నా దీనుడు  నీకు ఎవరున్నారు ? ముల్లోకాలకూ నీవే దీనరక్షకుడవు, శరణువేడదగినవాడవు.


ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః |
త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధుసరణిః || 14 ||


ఓ పశుపతీ! నీవు సమర్థుడవు, దీనులకు ముఖ్యబంధువువు కదా. నేను ఆ దీనులలో మొట్టమొదటివాడను. ఇంక మన ఇద్దరి బంధుత్వము గురించి  వేరే చెప్పనక్కరలేదు కదా. ఓ శివా! నా సమస్త అపరాధములనూ నీవు క్షమించుము. నన్ను ప్రయత్నపూర్వకముగా రక్షించుము. ఇదేకదా బంధుమర్యాద (బంధువులతో మెలగవలసిన తీరు).


ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యాన విముఖాం
దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్|| 15 ||


ఓ పశుపతీ! నీకు నా పై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనుకాడునదీ, దురాశలతో నిండినదీ అయిన నా తలరాతను ఏల తుడిచివేయవు ? అందుకు సమర్థుడవు కానిచో (కాను అంటావేమో)  ఏ ప్రయత్నమూ లేకుండా చేతిగోరుకొనతో దృఢమైన బ్రహ్మ శిరస్సును ఎలా పెకలించావు ?

విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః || 16 ||


సదాశివా! నాకేల విచారము ? బ్రహ్మదేవుడు భూమిపై ప్రజలకు దీనత్వమును (లలాటముపై) వ్రాసినాడు. (ఆ కారణముగా నేను దీనుడగుటచేత) దీనులను కాపాడు నీ కటాక్షము నిర్మలమైన కృపతో స్వయముగా నన్ను రక్షించుచున్నది. బ్రహ్మదేవుని నాల్గు శిరములను నీవు రక్షించుము. ఆయన దీర్ఘాయువగుగాక.
(బ్రహ్మదేవుడు దీనత్వమును వ్రాయుటచేతనే జనులకు శివుని కటాక్షమునకు పాత్రత కలిగినది కనుక అతనిని రక్షింపుమని వినతి).


ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళమ్ |
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః || 17 ||


ప్రభో! నా పుణ్యముచేతనో నీ కరుణచేతనో నీవు నాపై ప్రసన్నుడవైననూ, స్వామీ! నీ నిర్మల పాదపద్మములను ఎలా చూడగలను ? నీకు నమస్కరించుటకై తొందరపడు దేవతలసమూహము తమ రత్నకిరీటములతో నన్ను అడ్డగించుచున్నది.

త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా || 18 ||


ఓ శివా! లోకంలో నీవొక్కడవే మోక్షమునిచ్చువాడవు. విష్ణ్వాది దేవతలు నీవనుగ్రహించిన పదవులననుభవించుచూ (ఇంకనూ ఉత్తమ పదవులకై) నిన్ను కొలుచుచున్నారు. భక్తులపై నీకెంత దయ (అపరిమితము). నా ఆశ ఎంత (ఇంత అని చెప్పలేను).  నా అహంభావమునుబాపి సంపూర్ణకటాక్షముతో ఎప్పుడు నన్ను రక్షించెదవు ?

దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే
దురన్తే సంసారే దురితనిలయే దుఃఖజనకే |
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ || 19 ||


ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను (అలా వ్రాసిన) బ్రహ్మదేవునియందు వాత్సల్యముచేత, తొలగించుటలేదు కాబోలు. నీవు (అలా) భక్తవత్సలుడవైనప్పుడు నిన్ను భజించి మేమూ కృతార్థులమవుతునాము కదా!

-- వేరొక అర్థము

ఓ శివా! దురాశాభూయిష్ఠమైనది, దుష్ట అధికారుల/ప్రభువుల ముంగిళ్ళలో పడిగాపులు కాయునట్లు చేయునది, పాపమయమైనది, దుఃఖకారణమైనది, మంచి ముగింపులేనిది అయిన ఈ సంసారములో నా బాధలను ఎందుకు తొలగించవు ? సహాయంచేయమని ఎవరినడుగను ? నిన్ను భజించి (ప్రీతి కలిగించి) మేమూ కృతార్థులమవుతున్నాము కదా!

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో || 20 ||


ఓ కపాలధారీ, సర్వవ్యాపకా, శివా, ఆదిభిక్షూ, నా దగ్గర ఒక కోతి ఉంది. అది, మోహమనే అడవిలో చరించుచున్నది, యువతుల స్తనములనే పర్వతములపై క్రీడించుచున్నది. ఆశా శాఖలపై దూకుతున్నది. అటునిటు వేగముగా పరుగులిడుతున్నది. అత్యంత చపలమైన నా మనస్సనే ఈ కోతిని భక్తి (అనే త్రాడు) తో కట్టివేసి నీ వశం చేసుకొనుము.

(నా చంచల చిత్తమునకు త్వదేక శరణమైన భక్తిననుగ్రహింపుమని భావము).
 
ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితాం |
స్మరారే మచ్చేతః స్పుటపటకుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || 21 ||


 ప్రభూ, మన్మథసంహారీ, సర్వవ్యాపకా, శివగణములచే సేవించబడువాడా, నా వద్ద నీవు నివసించుటకు ఒక కుటీరము ఉన్నది. అది ధైర్యమనెడి స్తంభము ఆధారముగా, సద్గుణములనే తాళ్ళతో గట్టిగా కట్టబడి ఉన్నది. ఆ కుటీరము విచిత్రముగా పద్మాకారములో నున్నది. దానిలో అటునిటు తిరుగవచ్చు (విశాలమైనది). అది నిర్మలమూ, అనుదినము సన్మార్గవర్తీ అయిన నా హృదయమనే కుటీరము. నీవు అమ్మతో సహా ఈ నా హృదయకుటీరములో ప్రవేశించి నివసింపుము.

(శంకరులు సద్భక్తుల నడత ఎలా ఉండాలో చూపుతున్నారు)

ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||

 

దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము.


కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా
మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో || 23 ||

 
శంకరా, మహాదేవా, నేను నీ పూజలు చేస్తాను. వెంటనే నాకు మోక్షమునిమ్ము. అలాకాకుండా పూజకు ఫలముగా నన్ను బ్రహ్మగానో, విష్ణువుగానో చేశావే అనుకో, మళ్ళీ నిన్ను చూడడం కోసం హంసగా ఆకాశంలోనూ, వరాహముగా భూమిలోనూ వెతుకుచూ, ప్రభూ, నీవు కనపడక, ఆ భాధను నేనెలా భరించగలను ?

కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై-
ర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్థాంజలిపుటః
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః॥24॥


ఓ దేవా! కైలాసము నందు బంగారముతోనూ మరియు మణులతోనూ నిర్మించిన సౌధంలో ప్రమథగణాలతో కలసి నీ ఎదురుగా నిలబడి,తలపై అంజలి మొక్కుచూ " ఓ ప్రభూ! సాంబా! స్వామీ! పరమశివా! రక్షించు" అని పలుకుచూ అనేక బ్రహ్మాయుర్దాయములను క్షణమువలే సుఖంగా ఎప్పుడు గడిపెదనో కదా!



స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ॥ 25 ॥


బ్రహ్మాది దేవతలు స్తుతించుచుండగా, మహర్షులు జయ జయ ధ్వానములు పలుకుచుండగా, ప్రమథగణములు ఆడుచుండగా, చేతులలో లేడినీ, ఖండపరశువునూ ధరించి, ఉమాదేవి ఆలింగనము చేసికొని యుండగా, మదించిన నంది మూపురముపై కూర్చుని ఉన్న నీలకంఠుడవూ, త్రినేత్రుడవూ అయిన నిన్ను ఎపుడు చూతునో కదా!

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాఙ్ఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమళాన్
అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే ॥ 26 ॥


ఓ గిరిశ! నిన్ను చూచి, నీ దివ్యమంగళకరములైన పాదపద్మములను నా చేతులలోకి తీసుకొని, శిరమున ధరించి, కళ్ళకద్దుకొని, వక్షస్థలముపై ఉంచుకొని, కావలించుకొని, వికసితపద్మములనుబోలు పరిమళములను ఆఘ్రాణించుచూ, బ్రహ్మాదులకైనా లభించని ఆనందమును హృదయములో ఎప్పుడు అనుభవింతునో కదా!

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥ 27 ॥


ఓ గిరిశా! బంగారు కొండ నీ చేతిలో ఉంది (మేరుపర్వతము త్రిపురాసురసంహారములో శివునికి విల్లయినది). నీ సమీపమునందే ధనాధిపతి కుబేరుడున్నాడు. నీ ఇంటియందే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఉన్నాయి. నీ శిరస్సునందు చంద్రుడు ఉన్నాడు. సమస్తశుభములూ నీ పాదయుగళముయందు ఉన్నాయి. నేను నీకు ఏమి ఈయగలను ? నా మనస్సే నీదగుగాక.

సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్ ॥ 28 ॥


ఓ సాంబశివా, భవానీపతే, నిను పూజించునప్పుడు నాకు సారూప్యమోక్షము (శివునితో సమమైన రూపముగల ముక్తి), శివా, మహాదేవా అని సంకీర్తన చేయునప్పుడు నాకు సామీప్యమోక్షమూ (ఎల్లపుడు శివుని చెంతన ఉండగల ముక్తి), గొప్ప శివభక్తిపరుల సాంగత్యములోనూ, వారితో సంభాషణలతోనూ సాలోక్యమోక్షమూ (శివలోకప్రాప్తి అను ముక్తి), చరచరాత్మకమైన నీ ఆకారమును ధ్యానించునప్పుడు సాయుజ్యమోక్షమూ (శివైక్యం అను ముక్తి), నాకు సిద్ధించినది. ఓ స్వామీ నేను కృతార్థుడను.

(ఈ నాల్గువిధముల మోక్షములూ సాధారణముగా దేహానంతరము లభించును. కానీ శివభక్తిపరులకు ఈ లోకమునందే సిద్ధించునని ఆచార్యులు చెప్పుచున్నారు)

త్వత్పాదామ్బుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ॥ 29 ॥


ఓ ప్రభూ, నీ పాదపద్మములను పూజించుచున్నాను. ప్రతిరోజూ పరమాత్ముడవైన నిన్నే ధ్యానించుచున్నాను. ఈశ్వరుడవైన నిన్నే శరణుజొచ్చుచున్నాను. వాక్కుద్వారా నిన్నే యాచించుచున్నాను. శంభో! దేవతలు కూడా చిరకాలంగా ప్రార్థించు నీ కరుణారసదృష్టి నాపై ఉంచవయ్యా. ఓ లోకగురూ! నా మనస్సుకు ఆనందదాయకమైన ఉపదేశం చెయ్యి.

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాఞ్చనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దుచూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ॥ 30 ॥


ఓ చంద్రశేఖరా! ఓ పశుపతీ! సర్వవ్యాపకా! నీకు వస్త్రోపచారము చేయుటకు సూర్యుని వలే వేయిచేతులుండవలెను, నీకు పుష్పోపచారము చేయవలెనన్న విష్ణువు వలే సర్వవ్యాపకుడై ఉండవలెను, నీకు గంధోపచారము చేయుటయందు వాయుదేవుని వలే గంధవాహుడై ఉండవలెను, వంట చేసి నీకు హవిస్సు సమర్పించుటకు అగ్ని ముఖాధ్యక్షుడై ఉండవలెను, నీకు అర్ఘ్యపాత్రము సమర్పించుట కొరకు బ్రహ్మ వలే ఆగర్భశ్రీమంతుడై ఉండవలెను. వీరిలో ఏ ఒక్కరినీ నేను కానపుడు నీకు ఉపచారము చేయుట నా తరమా స్వామీ!
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.