Tuesday 1 March 2016

పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు



పరమాచార్యుల అమృతవాణి : శివుని చిహ్నములు
(జగద్గురుబోధలనుండి)


మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును మన హస్తాలతో బిల్వదళాలతో అలంకరించాలి.

రుద్రాక్షవృక్షాలు నేపాళంలోనూ, జావా బలిదీవులలోనూ ఉంటున్నవి. నడుమ తొఱ్ఱగలిగిన పండు సృష్టిలో ఇది ఒక్కటే, ఒకమూలగాగ్రువ్వబడటం తక్క రుద్రాక్షలకు వేరే ప్రయోజనమున్నట్టు కనిపించదు. సృష్టికర్త ఉద్దేశమూ అదేనేమో. బత్తాయిబలిస్తే అందు వివిధముఖాలున్న తొనలున్నట్లు రుద్రాక్షలకూ ముఖాలున్నాయి. ఏకాదశముఖాల తోడి రుద్రాక్షలను శివభక్తులు ధరిస్తారు. ఆరు ముఖాలున్న రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని (షణ్ముఖుడు) భక్తులు ధరిస్తారు. ఏకముఖ రుద్రాక్షమున్నూ కలదు. కాని దొరకడం కష్టం. దాని వెల అత్యధికం.

పంచాక్షరీ మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. 'నమశ్శివాయ' అనే ఆమంత్రంలోశివశబ్దం దాని జున్ను. పాపపరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.

గోవు మనకు చాలా పవిత్రమైనది, ఏ మృగపు పురీషమయినా సరే; కంపుకొడుతూ దుర్గంధభూయిష్ఠంగా ఉంటుంది. ఒక్క గోసంబంధమైనది మాత్రం అలాఉండదు. గోమయానికి వాసన లేకపోవడమేకాదు. అది ఎక్కడైనా దుర్గంధం ఉంటే దానిని పోగొట్టుతుంది. పూర్వులు తమ ఇండ్లను గోమయాలం కృతం చేయడానికి ఇదే కారణం. గోమయంతో చేసిన విభూతి కూడా చాలా పవిత్రమైనది.

ఈ బాహ్యచిహ్నాలూ - ఈ శివచిహ్నాలు అంతశ్శుద్ధినీ కలిగిస్తవి. అందుచే అనుష్ఠానాలను విధ్యుక్తంగా చేయడం, శివనామాన్ని జపించడం, శివస్వరూపానుసంధానం చేయడం మనకు ముఖ్యధర్మం. ఇట్లు చేసినామంటే ఈశ్వరప్రసాదంవల్ల మన శ్రేయస్సేకాక జగత్‌ సౌఖ్యమూ సిద్ధిస్తుంది. సైనికులున్నారు. వాళ్లకు ప్రత్యేకమైన దుస్తులుంటాయి. కవాతు, శిక్షణలతో పాటు ఈదుస్తులూ వారి కొక వీరోచితమైన భావాన్నీ ఉద్రేకాన్నీ కలిగిస్తవి. అట్లే మనం ఈ బాహ్యశివచిహ్నాలను ధరించడంవల్ల మన శివభక్తీని పెంపొందించుకొంటాము. చిత్తవిక్షేపాన్ని తొలగించడానికి ఎన్నో మార్గాలున్నది. యోగశాస్త్రము 'వీతరాగ విషయం వా చిత్తం. అని చెప్పుతున్నది. ప్రాణాయామమూ ఈ ధారణకు ఒక మార్గమే. ఏదన్నా సంతోషవార్త వింటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని క్షణాలు కట్టుబడతై. దుఃఖవార్తలు విన్నప్పుడూ ఇంతే. ఆ క్షణంలో మన మనస్సు నిర్వికల్పంగా ఉంటుంది. దీనివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకీ, మనస్సుకూ ఒక సంబంధం ఉండదని మనం సులభంగ గుర్తించవచ్చు. అందుచే ''ఈ బాహ్యచిహ్నాలవల్ల సంస్కారాలవల్ల ఏమి ప్రయోజన ముంటుంది?'' అని మనం అనుకోరాదు. అవి అతంశ్శుద్ధికి సాధకాలు అవుతవి. మన మందరమూ ఈ అతంశ్శుద్ధికి పాటుపడి ఈశ్వరప్రణిధానం చేయాలి. ఇది మనకు కర్తవ్యం.

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.