Monday 28 March 2016

శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత



శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత
(జయేంద్రవాణి నుండి)

భగవన్నామస్మరణ సత్ఫలితాల్ని సమకూరుస్తుంది. విశేషంగా రామనామ స్మరణ వ్యక్తికి అమితప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది. మనస్సు దోష భూయిష్ట మైనప్పుడు రామనామజపంచేస్తే అది దోషరహితమై స్వచ్ఛతను చేకూర్చుకుంటుంది.

వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే తులసీదాసు దాన్ని హిందీలోకి అనువదించాడు. ఈ ఇరువురు మహాత్ములయొక్క జీవితచరిత్రలు రామనామంయొక్క ఉత్కృష్టతను వివరంగా ఉల్లేఖిస్తాయి. వాల్మీకి జీవితాన్ని పరిశీలిస్తే ఒకవ్యక్తి యొక్క జీవితాన్ని రామనామం ఏవిధంగా తారుమారు చేసి ఉన్నతగమ్యాలకు చేర్చగలదో మన మెరుగగలం. బందిపోటు దొంగగా జీవితాన్ని ఆరంభించిన ఒక బోయవాడు రామనామ జపఫలితంగా మహర్షి స్థాయికి ఎదిగాడు.

వాల్మీకి అడవిలోకి వచ్చిన జనుల సొత్తును దోపిడిచేసి జీవించేవాడు. ఒక రోజున సప్తర్షులు అడవికి వెళ్లారు. వాల్మీకి వారినికూడ సమీపించి వారి వస్తువులను కూడ బలవంతంగా తీసికోటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు మహర్షులు అతనితో ''ఇతరులను బాధించి వారి వస్తువులను తీసికొని వారికి ఇబ్బంది కల్గచేస్తున్నావు.'' అనగానే వాల్మీకి దానికి సమాధానంగా ''నేను పెద్దకుటుంబీకుడను. నాకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతరబంధువులు వున్నారు. వారి పోషణ బాధ్యత నాదే. వారందరి ఆకలి తీర్చటానికి నేనిలా ప్రజలను హింసించి వారి సొత్తును తీసికొనవలసినదే.'' అన్నాడు. అప్పుడు వారు ''నీవు వారందరికి ఆహారం సమకూర్చవలసినదే. కాని నీవు అవలంబిస్తున్న మార్గం చాల తప్పిదమైంది, పాపసమన్వితమైంది. నీవు చేసే పాపకార్యం యొక్క ఫలితం నీవనుభవించాల్సిందే గాని నీవల్ల పోషింపబడుతున్న నీకుటుంబీకులు ఒక్కరుకూడ నీపాపంలో పాలుపంచుకోరు. దోపిడీ అనే పాపకార్యాన్ని చేసి నీకుటుంబాన్ని పోషించే ఉద్యమం మంచిదికాదు. కనుక ఇకనుండి యీ పాపకృత్యాల్ని విరమించు.'' అని మహర్షులన్నారు. అప్పుడు వాల్మీకి ''నేను ఈ విధమైన దోపిడి చాలకాలం నుండి చేస్తున్నాను. ఈ పరిస్థితినుండి నాకు బయటపడే మార్గం ఏమిటి ?'' అని అడిగాడు. దానికి మహర్షులు వాల్మీకితో ''నీవు ఈ రోజునుండి రామనామజపం చేయటం ఆరంభించు. నీ వింతవరకు చేసిన పాపాలన్నిటికి దానివలన నిష్కృతి కలుగుతుంది.'' అన్నారు. ఆ విధంగా మహర్షులవలన ఉపదేశం పొందిన వాల్మీకి అడవిలోకి వెళ్లి దోపిడి చేయటం పూర్తిగా విరమించాడు. అందుకు బదులు అతడొక ఏకాంతప్రదేశంలో కూర్చొని నిష్ఠతో రామనామజపం అన్నివేళల చేయటం ఆరంభించాడు. అతడలా ఒకేచోట ఆసీనుడై ఎంతకాలం రామనామజపం చేశాడో కాని, అతని శరీరంపై చీమలపుట్ట పెరిగి అతన్ని పూర్తిగా మరుగుపరచింది. అతడాపుట్టనుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షిగా పిలవబడ్డాడు. వల్మీకం అనగా చీమలపుట్ట. దాని నుండి వెలువడి నందువలన ఆయనకు వాల్మీకియని నామధేయం సార్థకమైంది.

రామనామ జపం ద్వారా సాధించిన రామానుగ్రహంవల్ల బందిపోటుదొంగ జ్ఞానియై మహర్షిగా పరిణమించాడు. అతని పూర్వపు పాపాలన్నీ ప్రక్షాళితమైనాయి.

నిశ్చయంగా ఈ అధునాతన కాలంలో చదువును, వ్రాయను నేర్చిన మనం వాల్మీకి కంటే చాల తెలివైనవారమే. కాబట్టి మనం రామనామ జపంలో కొంతకాలాన్ని వెచ్చిస్తే మన సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. సామాన్యుడైన వాల్మీకి యొక్క పాపాలు రామనామ జపంచేత ప్రక్షాళింపబడినప్పుడు, మన పాపాలకు కూడ నిశ్చయంగా నిష్కృతి లభిస్తుంది.

మన జీవితాల్ని ప్రకాశవంతం చేసికొనుటకు వాల్మీకి మార్గాన్ని నిర్దేశించాడు. ప్రతివ్యక్తి రామనామం జపాన్ని కొన్ని వేళల్లోనైనా చేస్తే అతనికి రామచంద్రుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.

తర్వాత, త్యాగబ్రహ్మ, రామదాసు, సమర్థరామదాసు, తులసీదాసు మొదలైన మహాత్ముల జీవితాలు ఆదర్శప్రాయంగా మనముందున్నాయి. వారిదైనందిన జీవితాలు ప్రతినిత్యం రామనామం చుట్టూ పరిభ్రమించాయి. ఈ రామనామం ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించేశక్తి కల్గివుంది.

పిల్లలకు బాల్యం నుండే రామనామం వ్రాసే సదభ్యాసాన్ని అలవరచాల్సిన అవసరం వుందని నిరూపించే కారణాల్లో ఇదికూడ ఒకటి. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఈ అభ్యాసాన్ని అలవరచుకుంటే వారి కష్టాలు ఉపశమిస్తాయి. వారి జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లుతాయి. కనుక అందరూ రామభక్తిని అభ్యసించి రామనామం వ్రాస్తూ సుఖింతురు గాక.

రామాయణ ప్రవచనాల్ని వినాలి. రామనామం జపించాలి; రామచంద్రుడు అమలుచేసి చూపిన ధర్మాల్ని పాటించాలి. ఇవి సవ్యంగా నిర్వర్తిస్తే మనకు సిద్ధించే ప్రయోజనాలు అనంతం.

రాముని యొక్క మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని, స్నేహశీలతను, శరణాగతవాత్సల్యాన్ని - ఈ సద్గుణాలన్నింటిని మనం చిత్తశుద్ధితో అనుకరించాలి. రాముడు తనయొక్క అవతార జీవితంలో ఈ ధర్మాలనన్నింటిని దృష్టాంతీకరించాడు. రామకథ వినటంలో విశేషంలేదు. అంత మాత్రం చేత మోక్షం సిద్ధించదు. అందులో రాముడు అవలంబించిన ధర్మాల్ని మనంకూడా మనజీవితంలో అమలు చేయగల్గితేనే మన దుఃఖాలు ఉపశమించి మనకు మానసికశాంతి చేకూరుతుంది. రామచంద్రమూర్తి ధర్మాన్ని అనేక మార్గాల్లో అవలంబించి మన జీవితాలకు ఒక ఆదర్శమూర్తియై మనముందు నిలిచాడు.

రాముని నామం కూడ విశేష ప్రాముఖ్యం గలది. ప్రజలను సౌఖ్యానందాలతో రమింపచేయువాడు గనుక రాముడైనాడని లోగడ చెప్పుకున్నాం. గణేశుడు కూడ మనకు సుఖాల్ని ప్రసాదించే దేవతే. ఐతే రాముని విషయంలో ఆయనపేరులోనే 'సౌఖ్యప్రదాత' అనే అర్థం ఇమిడివుంది.

దేవతల్లో గూడ ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైన కోర్కెలను తీరుస్తుంది. గణేశుడు మనకు సంభవించే విఘ్నాలను నివృత్తి చేస్తాడు. శివుడు మోక్షాన్ని, లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తారు. అలాగే రాముడు శాశ్వత సుఖాన్ని మనకు ప్రసాదించే ప్రత్యేక శక్తికలవాడు.

మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఏ కార్యాన్ని నిర్వహించినా మన అంతిమ లక్ష్యం సౌఖ్యమే.

అర్థరహితమైన ఈ మాయాప్రపంచంలో అర్థసహితమైనది రామనామమే. ప్రతి విషయానికి సారాంశం రామనామం. మిగతా విషయాలన్నీ నిష్ర్పయోజనాలే. రామనామ ఉచ్చారణతో దుఃఖోపశమనం, సుఖాగమనం ఏకకాలంలో జరుగుతాయి.

కనుక కుటుంబ సభ్యులందరు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తిచేసికొని అందరూ ప్రార్థనామందిరంలో సమావేశమై రామవిగ్రహం ముందు కొద్దినిముషములపాటైన రామనామ జపం లేక భజన చేసిన తర్వాతనే వారివారి లౌకిక వృత్తుల్లోకి ప్రవేశించాలి. అప్పుడే మన పనులన్నీ శీఘ్రంగా ఫలిస్తాయి.

సమయమున్నవారు ఉదయం, సాయంత్రం కూడ రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసికొని రామనామ జపం చేయగల్గిన మంచిదే. లేనిచో ఎవరింట్లో వారు రామనామ జపంచేసి సుఖశాంతుల్ని పొందవచ్చు.

రామచంద్రుని అనుగ్రహం మన అందరిపై ప్రసరించు గాక !

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.