Thursday 31 August 2017

శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్



|| శంకరస్తోత్రాలు : మీనాక్షీస్తోత్రమ్ ||

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చిన్తామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే || 1 ||


శ్రీవిద్యాస్వరూపిణివి, శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడుదానవు, శ్రీనాథుడు మొదలగు గురువుల(విష్ణు-బ్రహ్మ-మహేశ్వరులు)స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండుదానవు, లక్ష్మీ-సరస్వతీ-పార్వతులచే నమస్కరించబడు పాదపద్మములు కలదానవు, శివుని భార్యవు, మంగళస్వరూపిణివి, మధ్యాహ్నసమయమునందు మలయధ్వజ మహారాజుకు కుమార్తెగా అవతరించినదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌలివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే || 2 ||


శ్రీచక్రమునందుండు దానవు, స్థిరమైనదానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడుదానవు, దీనులకు వరములిచ్చెడిదానవు, భక్తులకు అభయమొసంగుదానవు, స్తనభారము కలదానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచే తెలియబడుదానవు, మెరుపు వంటి శరీరము కలదానవు, తల్లివి, అమృతముతో ఆర్ర్దమైన హృదయము కలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

కోటీరాఙ్గదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బహారాఞ్చితే |
శిఞ్జన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనామ్బికే || 3||


కిరీటము - కంకణములు - రత్నకుండలములు అలంకరించుకున్నదానవు, ధనుస్సు - బాణము పట్టుకున్నదానవు, చక్రవాక పక్షులవంటి రెండు స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్నదానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదములు కలదానవు, నా దారిద్ర్యమను సర్పమును సంహరించు గరుడపక్షివంటిదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశచాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే |
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునినుతే మాం పాహి మీనామ్బికే || 4 ||


బ్రహ్మ - విష్ణు -మహేశ్వరులచే స్తుతింపబడుదానవు, బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివులను పంచప్రేతల ఆసనమును అధిష్ఠించినదానవు, పాశము - అంకుశము - ధనుస్సు - బాణము ధరించినదానవు, తలపై బాలచంద్రుని అలంకరించుకున్నదానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన కన్నులు కలదానవు, కోట్లాది బాలసూర్యుల వలే ప్రకాశించుచున్నదానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు, మునులచే ప్రార్థింపబడుదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

గన్ధర్వామరయక్షపన్నగనుతే గఙ్గాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే || 5 ||


గంధర్వులు, దేవతలు, యక్షులు మరియూ సర్పములచేత స్తుతించబడుదానవు. శివునిచే ఆలింగనము చేసికొనబడినదానవు. నిన్ను స్తుతించువారను రక్షించుదానవు. గరుడునిపై కూర్చున్నదానవు. కమలమునందు పుట్టినదానవు. నల్లనిదానవు. స్థిరమైనదానవు. ఆకాశమును అతిక్రమించినదానవు. దుష్టులనే కొయ్యలను తగులపెట్టు అగ్నిజ్వాలవు. కోట్లాదుసూర్యులవలె వెలుగొందుదానవు. మంత్రములచే ఆరాధించబడు దేవతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

నాదే నారదతుమ్బురాద్యవినుతే నాదాన్తనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనామ్బికే || 6 ||


నాదస్వరూపిణివి, నారదతుంబురాదులచే స్తుతించబడుదానవు, నాదముచివరనుండు అనునాదస్వరూపిణివి, నిత్యమైనదానవు, నల్లని లతవంటి శరీరముగలదానవు, సాటిలేనిదానవు, ధాన్యపుగింజ యొక్క మొన వలే సూక్ష్మమైనదానవు, మనోహరమైనదానవు, కామకళాస్వరూపిణివి, కదంబ (కడిమి చెట్ల) వనమునందుండుదానవు.  కామేశ్వరుని ఒడిలో కూర్చున్నదానవు. నా జ్ఞానస్వరూపిణివి, నా కోర్కెలుతీర్చు కల్పలతవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే |
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనామ్బికే || 7||


వీణానాదము వినుచూ మూసిన అరమోడ్పుకన్నులుకలదానవు. కొంచెముగా జారిన కొప్పుగలదానవు. తాంబూలముచే ఎఱ్ఱనైన చిగురుటాకులవంటి పెదవికలదానవు. తాటంకములూ, హారములూ ధరించినదానవు. నల్లనిదానవు. చంద్రకళను శిరోభూషణంగా ధరించినదానవు. నొసటన కస్తూరీతిలకం ధరించినదానవు. పరిపూర్ణురాలవు. పూర్ణచంద్రునివలె అందమయిన ముఖముకలదానవు అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరఞ్జనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనామ్బికే || 8 ||


శబ్దబ్రహ్మస్వరూపిణివి. చరాచరజగత్స్వరూపిణివి. జ్యోతిర్మయివి, వాఙ్గ్మయివి. నిత్యానందరూపిణివి, నిరంజనస్వరూపిణివి. ’తత్’, ’త్వం’ అను శబ్దములకు అర్థమయినదానవు. జ్ఞానమూర్తివి, తత్త్వములకి అతీతమైనదానవు. శ్రేష్ఠమైనవాటికంటే శ్రేష్ఠమైనదానవు. మాయాస్వరూపిణివి, లక్ష్మీస్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివస్వరూపురాలవూ అగు మీనాక్షీ! నన్ను కాపాడుము.

|| ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీస్తోత్రం సంపూర్ణమ్ ||

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : అమ్మవారి క్రీగంటిచూపుమహిమ (6)

 
శంకరులు అమ్మవారి క్రీగంటిచూపుమహిమను వర్ణించుచున్నారు.

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చవిశిఖాః
వసన్తః సామన్తో మలయమరుదాయోధనరథః ।
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే ॥ 6॥

అమ్మా! హిమాద్రితనయా! పార్వతీ! విల్లా, పూలవిల్లు. ఆ వింటికి తుమ్మెదలబారు నారి. అయిదే బాణములు, అవికూడా పుష్పబాణములు. మలయమారుత పవనము రథము, వసంతుడు సహాయకుడు. అయినప్పటికీ మన్మథుడొక్కడే, అమ్మా! నీ క్రీగంటి చూపు వల్ల చెప్పలేనంత కృపను పొంది, ఈ జగత్తంతటనూ జయించుచున్నాడు.

ఏమాత్రమూ బలం లేని ఆయుధములతో, శరీరమే లేని మన్మథుడు ప్రపంచమంతా జయిస్తున్నాడు. అతడికి అలాంటి శక్తి ఎవరు ఇస్తున్నారు ? అది అమ్మవారి క్రీగంటిచూపు. ఇదే ఈ శ్లోకముయొక్క సారాంశము.
మన్మథుడు ఒకప్పుడు అతిలోకసౌందర్యవంతుడు. తన సొంతశక్తిపై నమ్మకంతో అహంకరించి, ఈశ్వరునిచేతిలో భస్మమైనాడు. అమ్మవారు దయతో మరలా జీవితాన్ని ఇచ్చింది. కానీ శరీరాన్ని ఈయలేదు. కేవలం తనభార్య రతీదేవికి మాత్రం కనపడే వరం ఇచ్చింది. అలాగే ఇటువంటి బలహీనమైన ఆయుధాలనూ ఇచ్చింది. వీటితో మన్మథుడు విజయం సాధించినా, అతడు వినయుడై ఆ విజయం తన స్వప్రతిభకాదనీ, అమ్మవారి కరుణ అనీ తలచుతునే ఉంటాడు. ఈశ్వరునిచేత తన శరీరమేకాక, గర్వముకూడా నశింపబడింది.

కాముని అమ్మవారు విజేతగా చేయటంతో మన కథ ఆగకూడదు. మనమూ కాముని గెలవాలి. ఈశ్వరుడు మన్మథుని దగ్ధంచేసినప్పుడు అమ్మవారు ఆయనలో ఉండి బలాన్నిచ్చినదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మనకూ కాముని గెలవటానికి ఆమె అనుగ్రహం కావాలి.

సగుణాత్మకమైన ఈ ప్రపంచంలో ఇలాంటి అనుగ్రహవర్షం కురిపించటము, మాయ యొక్క కృత్యము. దానికి ఒక్కక్షణము అమ్మవారి క్రీగంటిచూపు చాలు.

Wednesday 30 August 2017

శంకరస్తోత్రాలు : మనీషాపంచకం




శంకరస్తోత్రాలు : మనీషాపంచకం
పరమాచార్యులవ్యాఖ్యానంతో

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృమ్భతే
యా బ్రహ్మాదిపిపీలికాన్తతనుషు ప్రోతా జగత్సాక్షిణీ ।
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 1॥


జాగ్రదవస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తి అవస్థలలో ఏ చైతన్యము స్పష్టంగా వెలుగొందునో, ఏది బ్రహ్మమొదలుకొని చీమ వరకు అన్ని శరీరములలో వ్యాపించి జగత్సాక్షిగానున్నదో అదే నేను. కనబడు పదార్థము కాను. అని దృఢమైన జ్ఞానము ఎవనికి కలదో అతడు చండాలుడో లేక బ్రాహ్మణుడో అయిననూ అతడే గురువని నా అభిప్రాయము.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్ ।
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాణ్డాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ ॥ 2॥


బ్రహ్మ నేనే. ఈ ప్రపంచమంతా చైతన్యముతో వ్యాపించియున్నది. ఇదంతా సత్త్వరజస్తమోగుణాత్మకమైన అజ్ఞానంద్వారా నాచే కల్పించబడినది. అని ఎవడి మతి సుఖతరమైన, నిత్యమైన మరియు నిర్మలమైన పరబ్రహ్మయందు దృఢంగా ఉండునో అతడు చండాలుడైననూ లేక బ్రాహ్మణుడైననూ నాకు గురువే అని నా అభిప్రాయము.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరన్తరం విమృశతా నిర్వ్యాజశాన్తాత్మనా ।
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ ॥ 3॥


ఈ ప్రపంచమంతా నశించునదే అని గురు వాక్యముచే నిశ్చయించుకొని, నిత్యమైన బ్రహ్మగురించి నిరంతరం ఆలోచిస్తూ , ప్రశాంతచిత్తుడనై, చేసిన మరియు చేయబోవు పాపమును జ్ఞానరూపమైన అగ్నిలో దహించేనేను, నా శరీరమును ప్రారబ్ధమనుభవించుటకై సమర్పించితినని అనుకొనుచున్నాను.

యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యన్తః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాన్తి స్వతోఽచేతనాః ।
తాం భాస్యైః పిహితార్కమణ్డలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ ॥ 4॥


ఏదైతే మృగములచే నరులచే మరియు దేవతలచే "నేను" అని అంతఃకరణంలో స్పష్టంగా గ్రహించబడుచున్నదో, దేని కాంతిలో హృదయము, ఇంద్రియములు మరియు అంతఃకరణము అను అచేతనములు స్వయంగా భాసించుచున్నవో, సూర్యకాంతులచే ప్రకాశించు మేఘముల ద్వారా కప్పబడిన సూర్యమండలమువలే వెలుగొందు ఆ స్ఫూర్తిని ఎల్లప్పుడు భావించుచూ ప్రశాంత చిత్తుడైన యోగియే గురువని నా భావన.

యత్సౌఖ్యామ్బుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాన్తకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః ।
యస్మిన్నిత్యసుఖామ్బుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేన్ద్రవన్దితపదో నూనం మనీషా మమ ॥ 5 ॥


ఏ సుఖసముద్రలేశమాత్రముననే ఇంద్రాదులు సంతోషించెదరో, ప్రశాంతమైన మనస్సులో ఎవనిని ఎల్లప్పుడు ధ్యానించుచూ మునులు ఆనందించెదరో, ఆ నిత్యసుఖసముద్రంలో మునిగిన బుద్ధి కలవాడు బ్రహ్మమే. బ్రహ్మవేత్తకాడు. దేవేంద్రుడు అతడి పాదములను నమస్కరించునని నా అభిప్రాయము.

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మనీషాపఞ్చకం సమ్పూర్ణమ్ ॥

పరమాచార్యులవ్యాఖ్యానం : http://jagadguru-vaibhavam.blogspot.in/2017/04/7.html

 మనీషాపంచకం, అంతరార్థం

ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.

అన్నమయా దన్నమయం, అధవాచైతన్యమేవ చైతన్యాత్‌|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి ||


బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?

విప్రోఽయం శ్వపచోఽయ మిత్యపి మహాన్‌కోఽయం విభేదభ్రమః|

అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -

విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||

అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివోఽహం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.

బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.

సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!

అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశమే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.

ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.

ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభతే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||

- మనీషా పంచకం.

'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.

ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.

ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.

జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి. జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది. ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే. చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే.

మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.

ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.

ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.

మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.

భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.

విధినిషేధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.

ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.

ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.

శంకరస్తోత్రాలు : కాశీపంచకము



॥ శంకరస్తోత్రాలు :  కాశీపఞ్చకమ్ ॥

మనోనివృత్తిః పరమోపశాన్తిః సా తీర్థవర్యా మణికర్ణికా చ ।
జ్ఞానప్రవాహా విమలాదిగఙ్గా సా కాశికాహం నిజబోధరూపా ॥ 1॥


మనస్సునకు చపలత్వమును నిరోధించి పరమ ప్రశాంతతను కలుగచేయు మణికర్ణికా ఘట్టము జ్ఞానప్రవాహరూపమైన నిర్మల గంగతో కలసి కాశీ పట్టణమునందు విరాజిల్లుచున్నది. ఆత్మజ్ఞానమును బోధించు ఆ కాశీ పట్టణము నేనే.

యస్యామిదం కల్పితమిన్ద్రజాలం చరాచరం భాతి మనోవిలాసమ్ ।
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా ॥ 2॥

ఈ చరాచర జగత్తంతయూ మనోవిలాసరూపమై ఇంద్రజాలమువలే కాశీ పట్టణమునందు కనిపించును. సచ్చిదానందమయము, పరమాత్మ స్వరూపము, ఆత్మజ్ఞాన బోధకము అగు ఆ కాశీ పట్టణము నేనే.

కోశేషు పఞ్చస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్ ।
సాక్షీ శివః సర్వగతోఽన్తరాత్మా సా కాశికాహం నిజబోధరూపా ॥ 3॥


అన్నమయము మొదలగు ఐదు కోశములందు విరాజిల్లు బుద్ధియే భవానీదేవి, ప్రతి శరీరమూ ఆమెకు నివాసము. అంతటా వ్యాపించిన సాక్షియగు శివుడు అంతరాత్మ. అట్టి ఆత్మజ్ఞానము బోధించు కాశీ పట్టణము నేనే.

కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా ।
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా ॥ 4 ॥


కాశీ పట్టణమునందు పరమాత్మ ప్రకాశించుచున్నాడని, కాశీ పట్టణము అన్నిటినీ ప్రకాశింపచేయుననీ తెలుసుకున్నవాడు కాశీ పట్టణమును పొందును.

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగఙ్గా ।
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః ।
విశ్వేశోఽయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోఽన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి ॥ 5 ॥


కాశీ క్షేత్రము శరీరము. త్రిభువన జననియైన జ్ఞానగంగ అంతటా వ్యాపించి ఉన్నది. భక్తి శ్రద్ధలే గయ. గురుచరణములు ధ్యానించుటే ప్రయాగ. సకలజనుల మనస్సాక్షియగు విశ్వేశ్వరుడే అంతరాత్మ. నాశరీరమునందే అన్నీ ఉండగా వేరే పుణ్యతీర్థమెందుకు?

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ కాశీపంచకమ్ సమ్పూర్ణమ్ ॥

శంకరస్తోత్రాలు : అద్వైత పంచకము

శంకరస్తోత్రాలు : అద్వైత పంచకము




॥ అద్వైతపఞ్చకమ్ ॥

నాహం దేహో నేన్ద్రియాణ్యన్తరఙ్గో
నాహఙ్కారః ప్రాణవర్గో న బుద్ధిః ।
దారాపత్యక్షేత్రవిత్తాదిదూరః
సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోఽహమ్ ॥ 1॥


నేను శరీరమును కాను. ఇంద్రియములు మరియు అంతరంగము కాను. అహంకారము కాను. ప్రాణసమూహము కాను. బుద్ధి కాను. భార్య, పిల్లలు, క్షేత్రము, ధనములకు దూరంగా ఉన్న సాక్షి, నిత్యుడు, ప్రత్యగాత్మ అగు శివుడను నేను.

రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జౌ యథాహిః
స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః ।
ఆప్తోక్త్యాఽహిభ్రాన్తినాశో స రజ్జు-
ర్జీవో నాహం దేశికోక్త్యా శివోఽహమ్ ॥ 2 ॥


తాడు అని తెలియనప్పుడు తాడును చూచి పాము అని అనుకొనునట్లుగా తన ఆత్మను గురించి తెలియనప్పుడు తననే జీవుడని అనుకొందురు. యథార్థము చెప్పువారి మాటలతో భ్రాంతి నశించి తాడు అని తెలిసినట్లుగా, ఆచార్యుని ఉపదేశంచే నేను జీవుడు కాను, శివుడను అని తెలియును.

ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యమ్
సత్యజ్ఞానానన్దరూపే విమోహాత్ ।
నిద్రామోహాత్స్వప్నవత్తన్న సత్యమ్
శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోఽహమ్ ॥ 3 ॥


అసత్యమైన ఈ విశ్వము సత్యజ్ఞానానందరూపుడైన ఆత్మయందు భ్రాంతి వలన కనబడుచున్నది. నిద్రలో మోహము వలన కనిపించు స్వప్నము వలే ప్రపంచము సత్యము కాదు. శుద్ధుడు, పూర్ణుడు, నిత్యుడు, ఒకడు అగు శివుడు నేనే.

నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో
దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః ।
కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం-
కారస్యైవ హ్యాత్మనో మే శివోఽహమ్ ॥ 4 ॥


నేను పుట్టలేదు. పెరగలేదు. నశించలేదు. ప్రకృతి వలన ఏర్పడు ధర్మములన్నీ ఈదేహమునకే. చిన్మయమైన ఆత్మనగు నాకు కర్తృత్వము మొదలైనవి లేవు. నేను శివుడను.

మత్తో నాన్యత్కిఞ్చిదత్రాస్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తు మాయోపక్లృప్తమ్ ।
ఆదర్శాన్తర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోఽహమ్ ॥ 5 ॥


నాకంటే వేరుగా ప్రపంచమేమీ లేదు. సత్యమైన బ్రహ్మ మాయచే ఆవరించబడి, బాహ్యవస్తువు అద్దములో కనబడుచున్నట్లుగా బ్రహ్మకంటే వేరుకాని నాయందు కనబడుచున్నది. కనుక శివుడను నేను.

॥ ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ అద్వైతపంచకమ్ సమ్పూర్ణమ్ ॥

Tuesday 29 August 2017

పరమాచార్యుల అమృతవాణి : అమ్మవారి అనుగ్రహంతో కామమును జయించటం


పరమాచార్యుల అమృతవాణి : అమ్మవారి అనుగ్రహంతో కామమును జయించటం
(సౌందర్యలహరి(5) వ్యాఖ్యా సంగ్రహం)

హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి.

బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.

మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.

మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.

నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు.

శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.

శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)




శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి (1-5)
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)

శ్రీ మహాగణాధిపతయే నమః

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1॥


అమ్మా! శివుడు శక్తితో (నీతో) కూడినప్పుడు జగన్నిర్మాణము చేయగలుగుతున్నాడు. కానిచో స్పందించుటకు కూడా అసమర్థుడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు, పుణ్యసంపదలేనివాడు నమస్కరించుట, స్తుతించుట ఎలా చేయగలడు ?

ఈ సృష్టిలోని ప్రతీ కదలికకూ అమ్మవారి శక్తి కారణమనీ, ఆమెకు నమస్కరించాలన్నా, స్తుతిచేయాలన్నా అమ్మ అనుగ్రహం ఉండాలనీ, ఆ అనుగ్రహం గతజన్మలపుణ్యఫలమనీ శంకరులు అంటున్నారు.

ఈ ప్రపంచమునకు పరమేశ్వరుని స్పందన ద్వారా కారణమవుతున్నది అమ్మవారు. జీవుడు ఈ మాయా ప్రపంచమునుండి విడివడి శివైక్యం చెందుటకుకూడా అమ్మవారే కారకురాలు. అట్టి శివైక్యం చెందుటకు అమ్మ కటాక్షంకోసం ప్రార్థించాలి. ఇది శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా మనకు చేసిన ఉపదేశం.



తనీయాంసం పాంసుం తవ చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ॥ 2॥

అమ్మా! నీ పాదపద్మమునుండి అతి చిన్న ధూళికణమును సేకరించి బ్రహ్మదేవుడు ఈ లోకాలను సుందరముగా నిర్మించుచున్నాడు. విష్ణువు దానినే తన వేయితలలతో ఎలాగో (శ్రమతో) మ్రోయుచున్నాడు. హరుడు దానిని చక్కగా మెదిపి భస్మధారణ చేయుచున్నాడు.

పై శ్లోకముతో కలిపి చదివినప్పుడు - త్రిమూర్తులు అమ్మవారిని ఆరాధించి, తత్ఫలముగా అమ్మవారి కరుణతో సృష్టి, స్థితి, లయములను  నిర్వహించ సమర్థులవుతున్నారని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్రపాదధూళి మనకు అమ్మవారి అనుగ్రహాన్ని ఎన్నోవిధాలుగా ప్రసాదిస్తుందని శంకరులు అంటున్నారు.

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥

(పాఠాంతరాలు - 1. మిహిరద్వీపనగరీ - మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ - శృతిఝరీ, 3. భవతి - భవతీ)

సూర్యుడు చీకట్లు తొలగించి వెలుగునిచ్చినట్లు, అమ్మవారి పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను సారవంతంచేయునట్టి చైతన్యమనే పూలగుత్తులనుండి వచ్చు తేనె ప్రవాహము. దరిద్రులకు సకలసంపదలను ఇచ్చునట్టి చింతామణుల మాల. (హిరణ్యాక్షునిచేత సముద్రములో దాచబడిన భూమిని వెలికితీసినట్టుల) సంసారసాగరమున మునిగియున్నవారలను ఉద్ధరించునట్టి ఆదివరాహరూపములోని శ్రీ మహావిష్ణుని కోఱ.

లౌకికులకు ప్రజ్ఞ, సంపదలనూ, సాధకులకు జ్ఞానమోక్షములనూ అమ్మవారు అనుగ్రహిస్తుందని శంకరులు అంటున్నారు.
---------
అమ్మవారి పవిత్ర పాదపద్మములను శంకరులు స్తుతించుచున్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥


సమస్తలోకములకూ దిక్కైన ఓ తల్లీ! నీకన్నా ఇతరులైన దేవతలు తమ తమ చేతులతో అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరద, అభయ ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, కోరినదానికన్నను ఎక్కువగా ఫలములనిచ్చుటకు నీ పాదములే సమర్థములైనవి.

'వాంఛాసమధికం' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము.
---------
హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥


అమ్మా!  భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు.  మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ?  దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు.  మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


http://jagadguru-vaibhavam.blogspot.in/2017/08/1-5.html

Monday 28 August 2017

శంకరస్తోత్రాలు : సాధనపంచకము (ఉపదేశ పంచకము)




|| సాధనపంచకము (ఉపదేశపంచకము) ||

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్ ।
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసన్ధీయతా-
మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥ 1॥


ప్రతిదినమూ వేదాధ్యయనమొనర్పుము ; అందు చెప్పబడిన కర్మలను ఆచరింపుము . ఈకర్మాచరణమే ఈశ్వరపూజయగుగాక ! కామ్యకర్మములను త్యజింపుము. పాపములను పోగొట్టుకొనుము. సంసారసుఖమున గల [అనిత్యత్వాది] దోషములను అనుసంధానింపుము. ఆత్మ-జ్ఞానేచ్ఛను పెంపొందించుకొనుము. శీఘ్రమే గృహమునుండి వెలువడుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ ।
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ ॥ 2॥


సజ్జనులతో కలిసిమెలిసి ఉండుము. భగవంతునియందు దృఢభక్తిని కలిగి యుండుము. శాంత్యాదిగుణముల ఉపార్జింపుము. కామ్యకర్మములను వర్జింపుము. సద్-విద్వాంసులను ఉపాసింపుము. వారి పాదుకలను ప్రతి దినమునూ సేవింపుము. బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షరబ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థింపుము.శ్రుతిశిరస్సులగు ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్ధీయతామ్ ।
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహమ్మతిరుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ ॥ 3॥


తత్త్వమస్యాది -వాక్యముల అర్థమును విచారింపుము. వేదాంత పక్షమును ఆశ్రయింపుము. కుతర్కమును వీడుము. శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినమూ భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని పరిత్యజింపుము. పెద్దలతో వాదులాడకుము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సన్తుష్యతామ్ ।
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతా-
మౌదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ ॥ 4 ॥


ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స యొనర్పుము; భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరములగు భోజనపదార్థములను యాచింపక , విధివశమున లభించినదానితో తృప్తిని బొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ మొనర్పకుము. ఔదాసీన్యమును వహింపుము. లోకులయెడల నిష్ఠురుడవు కాదగదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ ।
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ ॥ 5॥


ఏకాంతప్రదేశమున సుఖముగా కూర్చుండుము. పరబ్రహ్మమున చిత్తమును సమాధానమొనర్పుము. ఈజగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు , అది విలీనమైనట్లు పరిగణింపుము. పూర్వకర్మములను క్షయమొనర్పుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మములయందు ఆసక్తుడవు కాకుండుము. ప్రారబ్ధ భోగమును అనుభవించుచు , బ్రహ్మమున నెలకొనియుండుము.

యః శ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతా ముపేత్య
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తి ముపయాతి చితిప్రసాదాత్ || 6 ||


ఏ మానవుడు అనుదినము ఈ శ్లోకపంచకమును పఠించుచు , స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో , అతడు శీఘ్రముగనే సంసార-దావానల-తీవ్ర-ఘోర-తాపమును  చైతన్యస్వరూపుడగు ఈశ్వరుని ప్రసాదమున బోగొట్టుకొనును.

॥ ఇతి పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం సాధనపఞ్చకం సంపూర్ణం॥

Saturday 26 August 2017

పరమాచార్యుల అమృతవాణి : భక్తితో జన్మరాహిత్యం


పరమాచార్యుల అమృతవాణి :  భక్తితో జన్మరాహిత్యం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

''శివానందలహరి'' అని శంకరులు రచించిన గ్రంథం ఒకటి ఉన్నది, అందులో ''అంకోలం నిజబీజ సంతతిః'' అనే శ్లోకం ఒకటి ఉంది. దాని తాత్పర్యం ఇది - ఊడుగచెట్టు గింజలు రాత్రి రాలిపోతాయి. ఉదయమే అవి తిరిగి చెట్టును అంటుకొనిపోతాయి.

మానవుడు పగలల్లా సంసారం, వ్యాపారం చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు, అట్లా కాకుండా రాత్రి సమయంలోనైనా, ఈశ్వరధ్యానము చేయాలి. అనగా ఊడుగుగింజ చెట్టుకు అంటుకొనునట్లు మనస్సు ఈశ్వరలగ్నం కావాలి. అందుకు సమయం కూడా అనుకూల పడాలి, అనడానికి ఈ ఉదాహరణ ఉపకరిస్తుంది.

ఆ శ్లోకంలో ఇంకొక ఉదాహరణ ''అయస్కాంతోపలం సూచికా'' అంటే - సూది సూదంటురాయిని అంటుకుంటుంది, అలాగే మనమనస్సు శివుని యందు అంటుకోవాలి.

పతివ్రత భర్తను అనుగమించినట్లు జన్మాంతరాల్లో కూడ అనుబంధం అలాగే వుంటుంది. ''సాధ్వీనైజ విభుం'' అన్నమాటకు తాత్పర్యము అది. అలాటి విడివడని అనుబంధం భక్తి ఈశ్వరునితో ఏర్పడాలి, 

''లతా క్షితిరుహం'' అని ఇంకొక ఉదాహరణ. చెట్టుతో లత పెనవేసుకొని ఉంటుంది. తీగను విడదీస్తే అది చచ్చిపోతుంది. చెట్టునుమాత్రం తీగ అల్లుకొన్న గుర్తులు అలాగే ఉంటాయి. చెట్టుతో ఎడబాటునకు తీగ వాడిపోయినట్లు భగవంతునితో దూరమైనపుడు మనం కూడా బాధపడాలి. తీగతో అనుబంధం పోయినందుకు చెట్టుకూడా దుఃఖపడుతోందా అన్నట్లు ఆ తీగ అల్లుకొన్న గుర్తులు స్పష్టపరుస్తున్నాయి, అలాగే భక్తునితో ఎడబాటునకు భగవంతుడు కూడా బాధపడుతూ ఉంటాడు.

''సింధు స్సరి ద్వల్లభం'' నది సముద్రుని గురించి పోయి లీనమౌతుంది.లీనమయినతరువాత ''నది'' అనే పేరే ఉండదు. ఇది ఐదవభక్తి, భక్తుడు భగవంతునితో సర్వాత్మనా లీనమయిపోవడం జన్మరాహిత్యం. సాయుజ్యం అంటే ఇదే. ఇట్లా ఐదు రకాల భక్తి భూమికలను శంకరులవారు ఈ శ్లోకంలో వివరించారు.

''కర్తవ్యో మమకారః'' అంటే నాది అనే మమకారం అవసరమే. మమకార మనేది ఎంతవరకు ఉంటే అంతవరకు కష్టాలే, అయినా ఈశ్వరునియందు ఈలాటిమమకారం ఉంచుకొంటే దుఃఖంలేదు. లోకంలో ''నాది'' అనేది త్యాగం చేయాలి. మనకు త్యాగం అలవాటులో లేదు. కాన మమకారాన్ని త్యాగం చేయకుండా అలవాటులో లేదు. అంటారా అపుడు ఈ మమకారాన్ని పరిమితంగా పుత్ర, మిత్ర, కళత్రాదులయందు ఏవో కొన్ని చోట్లనే ఉంచి, అవి మాత్రమే నాది. నాది అనుకొనక, అది విశ్వవ్యాప్తంచేసి, ప్రపంచమంతా నాదే అనుకోవాలి. అట్టి అవధిలేని మమకారంవల్ల సంతోషం వస్తుంది. అందరు ఈశ్వరుని బిడ్డలే, అంతా ఒక్కటే అని మమకారం పెట్టుకొంటే సరిపోతుంది.

అంగడికి వెడతాము. యజమాని ఒక్కడే వుంటాడు. రకరకాల గుడ్డలను గుమాస్తాలు చూపిస్తారు. విసుగు లేకుండా వర్ణిస్తారు. చివరకు ఒక్క గుడ్డ తీసుకొంటాము. బిల్లు ఇస్తారు. బిల్లు ఇచ్చినతర్వాత, ''అయ్యా వెళ్ళండి, ఇంకా కొనేవారు వస్తున్నారు. చోటు ఇవ్వండి.'' అని అంటారు. ఆ మాదిరి మానవుడు కూడా పనిఅయేదాకా, అంటే వేదవిహిత ధర్మం ఆచరించడం కోసం, సుఖలాభంకోసం, పుత్రమిత్రాదులయందు మమకారం ఉండవచ్చు. ఆపని అయాక ఆ మమకారాన్ని ఆ ఆదరాన్ని వదులుకోవాలి. మన తల్లీ, మన ఇల్లూ, మనకుక్క అని అనుకుంటే, కుక్క చచ్చినా దుఃఖపడతావు. కాన అంతా ఈశ్వరరూపము అనుకొని తాను సాక్షిగా ఉంటే క్రమముగా మనస్సు భగవంతునియందు లగ్నమై పోతుంది. బట్టలకొట్టు యజమానికి కొట్టునకు వచ్చిన జనుల మీద, ఎంతవరకు ఆదరము ఉందో, అంతవరకే సంసారం మీద మనం ఆదరం పెట్టుకొవాలి. క్రమంగా ఈశ్వరుడు, నేను ఒక్కటే అన్న ఐదవరకం భక్తి మనకు సిద్ధిస్తుంది.

పరమాచార్యుల అమృతవాణి : కామాక్షి చరణ ప్రభావము




పరమాచార్యుల అమృతవాణి :  కామాక్షి చరణ ప్రభావము
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన భారతదేశము పరమ పవిత్రమైన దేశము, ఇది కర్మభూమి ఇతర దేశములన్నీ భోగ భూములు. శాస్త్రముల ప్రకారము ఇది అన్వర్థము, అనుభవములో కూడా ఒక్క భారతదేశములో మాత్రమే ఈనాటికి కూడా వైదిక కర్మానుష్టానము జరుగుచున్నది. ఇక్కడ ఏడు ముక్తి ప్రదములైన క్షేత్రము లున్నట్లు సంప్రదాయముగా చెప్పుకుంటున్నారు.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా,
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః


కాంచీ అంటే మధ్యభాగము, లేక ఓఢ్యాణము, అని అర్థము, స్త్రీలు ఓఢ్యాణమును (వడ్డాణమును) శరీర మధ్యభాగములోనే ధరిస్తారుగదా! కాంచీదేనికి మధ్య భాగము? ఒకప్పుడు మన వైదికమతము సింహళము, ఇండోనేషియా మొదలైన అనేక దేశములలో వ్యాపించి ఉండేది. విశాలమైన వైదిక మతావలంబులు నివసించే భూభాగానికి ఆనాడు కాంచీనగరము మధ్యభాగమున ఉండేది. కాంచీ వంటి నగరము మరొకటి లేదు. ఆ ఊరిలో 108 శివాలయములున్నవి. ఇవిగాక విశిష్ణ్వాలయములు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఉన్నవి. ప్రతివీధిలోను ఒక దేవాలయ మున్నది. గుడిలేని వీధిలేదు. ప్రతిరోజు ఏదో ఒక దేవాలయములో ఉత్సవము జరుగుతూనే ఉంటుంది. అట్టి కాంచీపుర మధ్య భాగములో కామాక్షీ దేవి ఆలయమున్నది.

ఏ గుడిలో ఏ ఉత్సవము జరిగినా వరద రాజస్వామి రథోత్సవము, ఏకామ్రనాథ స్వామి రథో త్సవము జరిగినా, ఆ ఉత్సవము వచ్చి కామాక్షీదేవి ఆలయ ప్రదక్షిణము చేసి వెళ్లవలసినదే. ఒకప్పుడు స్వదేవాలయ ప్రదక్షిణము మానివేసి కూడా కామాక్షీ దేవి ప్రదక్షిణము చేస్తారు. రథోత్సవములో, తంత్రశాస్త్రవేత్తల పరిభాషలలో కాంచీనగరము అమ్మవారి ఉద్యానపీఠస్థానము. సామాన్యముగా అన్ని గుడులలోను అమ్మవారికి నాలుగు చేతులు, ఆ చేతులలో 1. వరదముద్ర, 2.అభయముద్ర, 3. పాశము, 4. అంకుశము ఉంటవి. పాశము అనే ఆయుధము మనలో ఆశాపాశములను తొలగించి, మనసుకున్న చంచలత్వము పోగొట్టుతుంది. అంకుశము - మన అహంకారమును నశింపచేస్తుంది. అభయముద్ర కష్టములలోనున్న వారికి భీతిలేకుండా చేయగా, వరదముద్ర కోరిన వరముల నిస్తుంది. కొన్ని గ్రామములలో అమ్మవారికి రెండు చేతులే ఉండి, వరదాభయముద్ర లుండును. కామాక్షీ దేవి కూడా చతుర్భుజయే, 1. కుడివైపు క్రిందిచేతులో పంచ (పుష్ప) బాణములు, 2. కుడివైపుపై చేతిలో పాశము. 3. ఎడమవైపు క్రిందిచేతిలో ధనుస్సు, 4. ఎడమ వైపు పైచేతిలో అంకుశము ఉన్నవి. వరదాభయ ముద్రలు లేవు. కామాక్షి అమ్మవారికి వరదాభయముద్రలు లేకుండుట చూచి శంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అమ్మా! నీకన్నా ఇతరులైన దేవతలు అభయ, వరదముద్రలు ధరించి యున్నారు, నీవు మాత్రము వరధాభయము ముద్రలు ప్రకటించుట లేదు. ఎందువల్లననగా భయమునుండి రక్షించుటకు, వరముల నిచ్చుటకు నీపాదములే సమర్థములైనవి.

''వాంఛా'' ''సమధికం'' అంటే మనము కోరిన దానికన్నా అమ్మవారు ఎక్కువ ఫలమును, వరములను ఇచ్చునని భావము, అనగా మోక్షమునుగూడ యిచ్చునని భావము, అమ్మవారి చతుర్భుజములలోని ఆయుధములను లలితా సహస్రనామములో వివరించి చెప్పారు. అమ్మవారి మూర్తిలో ఒక్కొక్క భాగమును ధ్యానముచేస్తే, ఒక్కొక్క సిద్ధివస్తుంది. పంచబాణములను ధ్యానముచేస్తే ఆశాపాశము విడి పోతుంది. దేవతామూర్తుల విగ్రహములలో, వాహనములలో, ఆయుధములో, ముద్రలలో తంత్రశాస్త్ర సంకేతము లిమిడి ఉన్నవి. మిగిలిన క్షేత్రములు రామకృష్ణాదుల వలన పవిత్రము లైనవి. కాంచీనగరము అమ్మవారి చరణములవలన మోక్ష క్షేత్రమైనది.

పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం


పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం
(జగద్గురుబోధల నుండి)

@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ 'ఇది ఇంతే' అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై.

వినాయకునికి మనము టెంకాయలు కొటతాం. దీనికొక కథ ఉన్నది. విఘ్నేశ్వరుడు ఒకప్పుడు తండ్రిని పరమశివుని చూచి - 'నీ తలకాయ నాకు బలిగా ఇయ్‌' అని అడిగాడట. కార్యం అవిఘ్నంగా సాగిపోవడానికి ఈశ్వరుని తలతో తూగగల ఏదో గొప్ప వస్తువు నివ్వాలి. అందుచేతనే ముక్కంటి తలకు బదులుగా మూడుకన్నులు గల టెంకాయ కొట్టడం. అట్టి వస్తువొకటి సృష్టిలో ఉండడం గూడా ఒక ఆశ్చర్యం. 'అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా' అని వినాయకునికి కొబ్బరికాయలు కొట్టండి అనియే ఈశ్వరుడు వీనిని సృష్టించినట్లు కనబడుతుంది.

ఈ కొట్టడంలోనూ ఒక నియమం ఉన్నది. కొబ్బరికాయజుట్టు పూర్తిగా తీసివేసి కొట్టాలి. సన్యాసులు చనిపోయినపుడు కూడా ఇదే రీతిగా కొడతారు. ఆ కొట్టేటప్పుడు మూడుముక్కలు అయేటటులు కొట్టాలి. ఈ వాడుక తమిళదేశంలోనే ఎక్కువగా ఉన్నటుల కనబడుతుంది.

చాతుర్మాస్య అనేది నాలుగుపక్షాల కాలం. అనగా సన్న్యాసు లొక ఊళ్ళో రెన్నెలలు ఉండాలని విథి. ఈ యేర్పాటు వేయి సంవత్సరాలుగా ఆచారంలో ఉన్నది. నేనొక యేడు నాగపట్టణంలో చాతుర్మాస్య చేశాను. అను దినమూ దేవాలయానికి వెళ్ళడం వాడుక. సాయం సమయంలో ఒకటే జనసందడి. ఆలయానికి వెళ్లే దారిలో చిన్నకోవెల ఒకటి ఉన్నది. అది వినాయకునిది. దాని ముందెల్లప్పుడూ పిల్లల సందడే. కొబ్బరిచిప్పలు లెక్కలేనన్ని. ఒకరిమీద ఒకరు పడి గాయపడే రీతిగా పిల్లవాండ్ర సంఖ్య కూడా లెక్కకుమిక్కుటమే. కొందురు పెద్దలు ఆ పిల్లలను కసరికొట్టి 'తొలగిపొండి తొలగిపొండని' గద్దించారు. వారిలో ఒక కుఱ్ఱడు 'మమ్ములను ఏరుకోవద్దని గద్దించడానికి మీ కెవరు అధికారం ఇచ్చారు?' అని అడిగాడు. 'ఈ చిట్టి దైవానికి ఈ చిట్టిపిల్లలే సొంతం' అని అపుడు నా కనిపించింది.

ఈ దైవానికి మేను లావు, ఆకారం పర్వతం లాగా 'తొండము నేకదంతమును దోరపు బొజ్జయు' కాని ఇతడేమో బాలుడే. బిడ్డలకు పుష్టియే ఒక అందం. ఆహారపుష్టీ ఆకారపుష్టీ బిడ్డలకు ఆవశ్యకం. సన్న్యాసి ఒకడు ముక్కుబంటిగా తిని స్థూలకాయు డయితే అది అందమని అనిపించుకుంటుందా? వయసు ముదిరిన కొలదీ ఉపవాస ముండటం మంచి అలవాటులలోఒకటి. చిన్నబిడ్డలు ఉపవాస ముండటం కూడని పనులలో ఒకటి. బిడ్డలు బొద్దుగా ఉండవలెననియే ఈ శిశుదైవం చూపుతున్నట్లు తోస్తుంది.

ఇతని వాహనం ఎలుక. ఇత డెంత లావో అది అంత సన్నం. వాహనంవల్ల స్వామికి గౌరవం లేదు. స్వామివల్లనే వాహనానికి గౌరవం. కొలదిపాటి మేను కల ఎలుకకు గొప్పతనం కలగాలనే ఈయన దేహం పెంచుకొన్నాడేమో!

'అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్‌'
అనేక దంతం భక్తానా మేక దంత ముపాస్మ హే.


అనే శ్లోకం ఒకటి చాలా కాలంనుండి ఆనువాయతీగా వస్తున్నది. అగజ ఆనన పద్మ ఆర్కమ్‌-గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటివా డని అర్థం. సూర్యుని పోలిక వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది. గజాననం అహర్నిశం ఉపాస్మహే వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం.

రేయింబవళ్ళు ఉపాసన చేయడం మనదేశంలోనే సాధ్యం ప్రతివీథి కొసనూ (తమిళదేశంలో) వినాయకుని కోవెల ఉంటుంది. భక్తి లేనివారు పిడివాదం పెట్టుకొని 'నమస్కారం చేయము' అని తీరుమానం చేసికొన్న ఏ కొలదిమందియో తక్క మిగిలిన ప్రతివారూ ఆలయము ముందు నుండి వెళుతూ ఒక నమస్కారమయినా చేసి వెళతారు. కొందరు మొట్టికాయలు గూడా కాయించుకొని వెళతారు.

అనేకదం-తమ్‌-భక్తానామ్‌ అని విడదీయాలి. భక్తులను ఆయన అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.

ఒకొక ప్రాణికి ఒకొక విషయమునం దెక్కుడు ప్రీతి. చమరీమృగం తోకంటే పడిచస్తుంది. నెమలికి తన పించమే బంగారం. ఏనుగునకు దంతాలంటే ప్రాణం. దేహ మెట్లా ఉన్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు కక్కుతూ వుండేటటులుగా కాపాడుకుంటుంది. కాని గజాననుడు తన అందం చందం గౌరవం గరువం వీని అన్నిటికీ మూలాధారమైన దంతాన్ని ప్రాణప్రదమైన దాన్ని చరాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు. న్యాయం ధర్మం విద్య వీనికొరకు ఎంతటి త్యాగమయినా చేయవచ్చునని ఈయన ఈపనితో నిరూపించాడు. దైవానికి ఉపకరణం నిమిత్తమాత్ర మనిన్నీ విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం. ఇవి వ్యాపించడానికి ఉత్‌కృష్టమయిన ఎట్టి దేహావయవమునయినా త్యాగం చేయవచ్చుననిన్నీ నిరూపించడానికే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడనిన్నీ గోచరం అవుతుంది.

అవ్వైయ్యార్‌ సంగతి తమిళుల కందరికి పరిచితమే. ఆమె చెప్పిన వాక్యమొకటి యయినా తెలియని తమిళుడంటూ ఉండడు. ఆమె వ్రాసిన గ్రంథాలలో 'వినాయక అహవల్‌' అనే దొకటి. అది ఒక యోగశాస్త్రగ్రంథం. 'ధ్యాన మెట్లా చేయాలి? కుండలినీ శక్తిని సహస్రారానికి తీసికొని పోవడం ఎట్లా'? అనే అని సూక్ష్మాలయిన యోగ విషయా లెన్నో ఆ గ్రంథంలో ఆమె వివరించింది. 'అంతప్పాటి, అత్తిసూడి' అనే ఇతర గ్రంథాలను గూడా ఆమె రచించింది.

'అత్తిసూడి' అంటే పరమేశ్వరుడు. అత్తిపూవును చూడాలంకారముగా తాల్చినవాడని అర్థం. ఇది చంద్రకళవలే ఉంటుంది. శివునికి ఇంకొక పువ్వులమీద కూడా ప్రీతి ఎక్కువ. అది ఆరగ్వధం. ''ఆగ్వధే రాజవృక్ష శమ్యాక చతురంగులాః'' అని ఈపూవు పేరులు అమరం తెల్పింది. ఇవన్నీ రేలపూవు పేర్లు.

వినాయకుడు ప్రణవస్వరూపి. ఆ ప్రణవమును భ్రూమధ్యంలో ధ్యానించి అవ్వయ్యార్‌ అనుగ్రహించిన పుస్తకమే వినాయక అహవల్‌. అవ్వైయ్యార్‌ను గూర్చి ఒక కథ వున్నది.

సుందరమూర్తీ చేరరాజూ, వీరిరువురూ ఏనుగునూ గుఱ్ఱమునూ ఎక్కి కైలాసానికి వెడుతూ అవ్వై్‌య్యార్‌ను గూడా తొందరగా రమ్మనిన్నీ, వచ్చేయెడల తమతోపాటు తీసుకుపోతా మనిన్నీ అన్నారట. ఆమెయో వినాయకుని పూజామధ్యంలో ఉండి ''మీరు వెళ్ళండయ్యా! కైలాసం కంటే నాకు కరి వదనుడై ముఖ్యుడు, అని చెప్పిందట. అంతటితో వారు వెళ్ళిపోయారట. పూజానంతరం ''వారందరూ వెళ్ళిపోయారే నే నెలాగు వెళ్ళేదిరా భగవంతుడా'' అని ఆమె అనుకొన్నదట. ఆప్రార్థన ఆలకించిన వినాయకుడు ఒక్క చిటికలో వారు కైలాసం చేరేటంతలో తన తొండంతో ఆమెను కైలాసం చేర్చేడట.

ఇంకొక విషయం. ఎంత చూచినా తనివి తీరని వస్తువులు కొన్ని ఉన్నై. చంద్రుడూ, సముద్రుడూ, ఏనుగు ఈ తరగతిలోనివి. వానిని చూచిన కొద్దీ ఆనందమే. ఈ దేవతా శిశువు కూడా అదే విధం. చూచినకొద్దీ మరింత చూడ బుద్ధి పుడుతుంది. ఇది ఒక ఆనంద తత్త్వం, ఆరని ఆశాతత్త్వం.

''కేదారం వెళ్లాను గణపయ్యనుచూచాను, అటుమీద కన్యాకుమారి వెళ్లాను. అక్కడ కూడా బొజ్జగణపయ్య ప్రత్యక్షమే'' అని ఒక గణపతి భక్తుడు ఉత్సాంతో పొంగి పొరలుతూ అన్నాడు.

పశ్యేయ మేకస్య కవేః కృతిం చేత్‌
సారస్వతం కోశ మవైమి రిక్తమ్‌,
అంతః ప్రవి శ్యాయ మవేక్షితశ్చేత్‌
కోణే ప్రవిష్టా కవికోటి రేషా.

కావ్యాలు అనేకాలు. ఒక కావ్యం చదివినా అది భారతీదేవి ముక్తాభరణంవలె వుంటుంది. ఆమె బొక్కసమే డొల్ల అయిపోయిందా అని అనిపిస్తుంది. నిజంగా ఆమె బొక్కసంలోకి వెళ్ళిచూస్తే కోటికోటి కావ్యాభరణాలు వెదజల్లబడి వుంటై, వినాయకతత్త్వం కూడా ఈలాగే వుంటుంది. ఒక పంచపాత్రతో సముద్రజలం తెచ్చామని అనుకుందాం. ఏమిటిదీ అని ఎవరైనా అడిగితే సముద్రజలమని అంటాం. కాని సముద్రంలో నీళ్ళన్నీ మనం తెచ్చామా. స్వానుభవానికి గోచరించింది, మాత్రం ఏ లవలేశమో చెపుతాం.

వినాయకుడు విఘ్నవినాశకుడు. అన్ని కార్యాలకూ ఆయన పూజ మొట్టమొదట జరుగుతుంది. ఆయన అనుగ్రహబలం వుంటే అంతా అనుకూలమే వినాయకుని ప్రధానంగా ఆరాధించేవారిని గాణపతులు అని అంటారు. వినాయకుని ముందు వేయి గుంజిళ్ళకు శంకుస్థాపనం చేసింది మహావిష్ణువట ఒకప్పుడు ఆయన చక్రాయుధం యీమేనల్లుడు నోట్లో వేసుకున్నాడట పిల్లల చేతులోంచి ఏ వస్తువునూ తీసుకోటం కష్టం. గణపతి మాట సరేసరి. అతని ఏలాగైనా నవ్వించి దానిని లాగుకోవాలని మహావిష్ణువు నాలుగు చేతులతోనూ తన రెండు చెవులనూ పట్టుకొని గుంజీలు తీశాడట. ఈ విచిత్రప్రవర్తనకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. ఆనవ్వుతో చక్రంకిందపడ్డది. అప్పుడు మహావిష్ణువు నిడుదనిట్టూర్పు వదలి చక్రం అందుకుని బయటడ్డాట్ట.

లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం ఉండాలి. అందులకే త్యాగయ్య ''గిరిరాజాసుతా తనయా'' అని గానం చేశాడు. మనం గూడా ఆయన అనుగ్రహానికి పాత్రుల మయ్యేటట్లు నడచుకోవాలి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.