Showing posts with label వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ. Show all posts
Showing posts with label వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ. Show all posts

Monday, 28 August 2017

శంకరస్తోత్రాలు : సాధనపంచకము (ఉపదేశ పంచకము)




|| సాధనపంచకము (ఉపదేశపంచకము) ||

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్ ।
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసన్ధీయతా-
మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ ॥ 1॥


ప్రతిదినమూ వేదాధ్యయనమొనర్పుము ; అందు చెప్పబడిన కర్మలను ఆచరింపుము . ఈకర్మాచరణమే ఈశ్వరపూజయగుగాక ! కామ్యకర్మములను త్యజింపుము. పాపములను పోగొట్టుకొనుము. సంసారసుఖమున గల [అనిత్యత్వాది] దోషములను అనుసంధానింపుము. ఆత్మ-జ్ఞానేచ్ఛను పెంపొందించుకొనుము. శీఘ్రమే గృహమునుండి వెలువడుము.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ ।
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ ॥ 2॥


సజ్జనులతో కలిసిమెలిసి ఉండుము. భగవంతునియందు దృఢభక్తిని కలిగి యుండుము. శాంత్యాదిగుణముల ఉపార్జింపుము. కామ్యకర్మములను వర్జింపుము. సద్-విద్వాంసులను ఉపాసింపుము. వారి పాదుకలను ప్రతి దినమునూ సేవింపుము. బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షరబ్రహ్మమంత్రమగు ఓంకారమంత్రమును అర్థింపుము.శ్రుతిశిరస్సులగు ఉపనిషత్తుల వాక్యములను వినుము.

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్ధీయతామ్ ।
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహమ్మతిరుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ ॥ 3॥


తత్త్వమస్యాది -వాక్యముల అర్థమును విచారింపుము. వేదాంత పక్షమును ఆశ్రయింపుము. కుతర్కమును వీడుము. శ్రుతిసమ్మతమగు తర్కమును గ్రహింపుము. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినమూ భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున అహంబుద్ధిని పరిత్యజింపుము. పెద్దలతో వాదులాడకుము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సన్తుష్యతామ్ ।
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతా-
మౌదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ ॥ 4 ॥


ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స యొనర్పుము; భిక్షాన్నమను ఔషధమును సేవింపుము. రుచికరములగు భోజనపదార్థములను యాచింపక , విధివశమున లభించినదానితో తృప్తిని బొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగ వాక్యోచ్చారణ మొనర్పకుము. ఔదాసీన్యమును వహింపుము. లోకులయెడల నిష్ఠురుడవు కాదగదు.

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ ।
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ ॥ 5॥


ఏకాంతప్రదేశమున సుఖముగా కూర్చుండుము. పరబ్రహ్మమున చిత్తమును సమాధానమొనర్పుము. ఈజగత్తును పూర్ణబ్రహ్మముగ జూచుచు , అది విలీనమైనట్లు పరిగణింపుము. పూర్వకర్మములను క్షయమొనర్పుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మములయందు ఆసక్తుడవు కాకుండుము. ప్రారబ్ధ భోగమును అనుభవించుచు , బ్రహ్మమున నెలకొనియుండుము.

యః శ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతా ముపేత్య
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తి ముపయాతి చితిప్రసాదాత్ || 6 ||


ఏ మానవుడు అనుదినము ఈ శ్లోకపంచకమును పఠించుచు , స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో , అతడు శీఘ్రముగనే సంసార-దావానల-తీవ్ర-ఘోర-తాపమును  చైతన్యస్వరూపుడగు ఈశ్వరుని ప్రసాదమున బోగొట్టుకొనును.

॥ ఇతి పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం సాధనపఞ్చకం సంపూర్ణం॥

Friday, 25 November 2016

పరమాచార్యుల అమృతవాణి :‌ భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?


పరమాచార్యుల అమృతవాణి :‌ భక్తి ఉన్నప్పుడు సంధ్యావందనాదులు దేనికి ?
(జగద్గురు బోధలనుండి)

#వేదధర్మశాస్త్ర పరిపాలనసభ  @శంకరవాణి


దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. ఆకలివేస్తే దానితో అన్నం తింటాం. ఎండవానలనుండి కాపాడుకోవటానికి నీడ కావాలి. జంతువులకువలెకాక మనకు మానం అనేది ఒకటి ఉన్నది. కదా! అట్టి మానం కాపాడుకోవడంకోసం వస్త్రం కావాలి. అన్నమూ, వస్త్రమూ, ఇల్లూ ఈమూడూ ఒకత్రిపుటి. దీనిని సంపాదించుకోవడంకోసం ఒక ఉద్యోగం, ముందటిమూడూ అక్కరలేకపోతే మానవుడు పని యేమీ చేయవలసిన అవసరం వుండదు.

ఈమూడిటినీ వదలిపెట్టిన మనుజుడు పని యేమీ చేయకుండా వున్నాడని తెలుస్తున్నది. ఇప్పుడు కూడా అటువంటి జ్ఞానులు ఒకరిద్దరు వుండవచ్చు. కాని అది మనకు తెలియదు. ఒక పని చేయడం గాని దానివల్ల కలుగ వలసిన ఫలితం గాని వారి కేమీలేదు. ఏదైనా ఒక పని చేశాడంటే అతడు జ్ఞాని కాడు అని అర్థం.

అన్నం కోసం, ఇంటి కోసం, బట్టకోసం, మనం సతతం యత్నించి సతతమై పోతూ ఉంటాం. సదా దుఃఖరహితులమై ఆనందంగా వుండాలంటే మనము చేసే ప్రతిపనీ ఈశ్వరార్పణం చేయాలి.ఈశ్వరానుగ్రహమే దొరికితే ఇక పనితో పనిలేదు. ఆనందంగా వుండవచ్చు. ఈశ్వరానుగ్రహం దొరకనంతవరకూ ఈ మూడూ కావాలంటే కావాలి. తల వెంట్రుకలన్ని పనులు బరువు నెత్తిమీది నుండి జారిపోదు. పనులను చక్కగానూ చిత్తశుద్ధితోనూ ధర్మానుసారముగానూ చేయవలె నంటే ఈశ్వరునియెడల భక్తి తప్పదు. అందుచేత భక్తినిమాత్రం అవలంబిస్తామంటే ప్రయోజనంలేదు.పనిచేయటం అవసరమే.

ఒక ఆసామి దగ్గర ఇద్దరు సేవకులు వున్నారని అనుకుందాం. వారిలో ఒకడు ఆ ఆసామిని యెప్పుడూ ముఖస్తుతి చేస్తూ ఉంటాడు. మరియొకడు ఆసామికి ప్రేమ లేకపోయినా తానుమాత్రం ఆ ఆసామిని ప్రేమిస్తూంటాడు. ఆసామి మూర్ఖుడైతే తన్నెప్పుడూ స్తోత్రం చేసే సేవకుని ప్రేమిస్తుంటాడు. అతడు బుద్ధిమంతుడైతే ఎప్పుడూ పని చేసే వానిని గాని స్తోత్రము చేసే వానిని గాని ప్రేమించడు. 'ఇది ఆసామి పని ఇది తన పని' అని భేదబుద్ధి లేకుండా భక్తితో 'ఇది అంతా ఈశ్వరుని పని' అని కొరత యేమీ లేకుండా ఏ పని బడితే ఆ పని ప్రీతితో చేసే వానియందు ఆ ఆసామి ఎక్కువ వాత్సల్యం వుంచుతాడు. ఈశ్వరుడు కూడా అట్టి ఆసామే. సర్వజ్ఞుడైన అట్టి ఆసామిని స్తోత్రం మాత్రంచేసి తనివి నొందింప లేము. అతని ఆజ్ఞ శిరసావహింపక ఊరకే స్తోత్రం చేసినంత మాత్రాన అతడు సంతోషించి అనుగ్రహించడు. ఆయనకు కావలసిందేదీ లేదు. దానివల్ల ఆయనకు గౌరవమూలేదు అగౌరవమూలేదు. అట్లాగే మన కర్మల వల్ల గూడా ఆయనకు కావలసిన దేదీ లేదు. విహితమైన కర్మాచరణం మన చిత్త శుద్ధి కోసమే.

స్నానం, సంధ్యా, జపము, హోమము, దేవపూజ అనేవి నిత్యకర్మలు. ఈ ఆరింటినీ, తప్పకుండా చేయాలని పెద్దలు చెపుతారు. ఈ ఆరింటిలోనే అన్నీ అడగి వున్నవి. ఈ కర్మల చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది- షట్‌ కర్మాణి దినే దినే. స్నానం యెలా చేయాలో శాస్త్రంలో చెప్పబడి వుంది. అలా చేస్తేనే ఆత్మశుద్ధి. సబ్బుతో ఒళ్ళుతోముకుంటే దేహం మాత్రం శుద్ధమవుతుంది. స్నానసమయంలో చెప్పవలసిన మంత్రాలుకొన్నిఉన్నవి. మంత్రమనేమాట తెలియకపోయినా రామా! కృష్ణా! అని స్మరిస్తూనైనా స్నానంచేయాలి.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/11/blog-post_25.html


Friday, 4 March 2016

పరమాచార్యుల అమృతవాణి : మన మతానికి ప్రమాణ గ్రంథాలేమిటి ?



పరమాచార్యుల అమృతవాణి : మన మతానికి ప్రమాణ గ్రంథాలేమిటి ?
(జగద్గురుబోధలనుండి)

విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేలకొలది ఉన్నవి. పుస్తకాలెట్లా అసంఖ్యాకాలుగా వున్నవో అట్లే మతాలూ బహుళంగా వున్నవి. ఏమతస్థులకు ఆమత గ్రంథాలు అతిగొప్పగా కనపడటం సహజం. ఎవరిమతాలు వారికి పరమావధి యని తోచటం న్యాయమే. మతాన్ని కాపాడుకొంటూ, జాగ్రత్తగా తమతమ ధర్మాలను పాటిస్తూ, మతగ్రంథాలకు సిక్కులవలె ఆలయాలు సహితం నిర్మించి, మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానీకాన్ని మనం చూడకపోలేదు.

మరి, మన మతపు సంగతియేమి? మన మతగ్రంథమేమిటి? మనకేదైనా పుస్తకమున్నదా? క్రైస్తవుని మతగ్రంథమేది అని అడిగితే నిస్సందేహంగా 'బైబిలు' అనిబదులు చెపుతాడు. అదేవిధంగా మహమ్మదీయులకు మతగ్రంథం 'ఖురాను'. వేదాలుపాటించే హిందువులమగు మనకు చెప్పుకోడానికి ఒక్కపుస్తకమయినా ఉన్నట్టు కనుపించదు. శైవులకు 'తేవారం, తిరువాచికం' ఉన్నవి వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం. వారిలో భక్తిమార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం. వేదాలు వల్లించే ఘనపాఠికి వేదాలే ప్రమాణం. ఇంగ్లీషుచదివి ఏదోకొంత వైదికశ్రద్ధ ఉన్న వారికి గీతపైప్రీతి. వీరందరూ హిందువులే. కాని వీరికి ఒక్క పుస్తకమనిలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతగ్రంథం.

ఇతర మతస్థులలో లౌకికజ్ఞానం కలగడానికి ముందే, బాల్యంలోనే అంతో ఇంతో మతప్రవేశం కల్గించడానికి పాటుపడతారు. అందుచే వారికి చిన్ననాడే మత సంస్కారాలుకల్గే అవకాశం ఏర్పడుతున్నది. కాని మనదారి వేరు. మనకు శైశవంలో లౌకికవిద్య ప్రధానం; పారమార్థికం అప్రధానం. ఈభావాలతో మన జీవితాలను చక్కదిద్దుకొన్నందువల్ల కలిగిన ప్రయోజనమేమి అని అడిగితే, 'ఇతర మతాలలో జనం తగ్గినపుడల్లా మనమతంలోనుంచి వారికి కావలసినంతమందిని సరఫరాచేయడం', ఇట్లాకాక బాల్యమాది మనమూ ఇతర మతస్థులవలె మతవిషయికమైన విజ్ఞానం మన బాలబాలికలకు అందుబాటులో ఉంచకల్గితే, ఇతర మతప్రసక్తికానీ, పరమత స్వీకరణకుకానీ ఎడముండదు. కానీ, వాస్తవవిషయంచూస్తే, మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి అరవైఏళ్ళకుగాని కలగటంలేదు. మన పుస్తకాలను మనమే దూషిస్తున్నపుడు, ఇతరులు వానిని తిరస్కరిస్తున్నారే యని శోచించటం అనవసరం.

మనమతంలో చూడబోతే పుస్తకాలనుకాని, అందు చర్చించిన విషయాలకుగాని ఏ విధమైన కొరతయూ లేదు. అనుష్ఠించి, అనుభూతినొంది, ఐకాంతిక ఆనందనిష్ఠలో, ఆత్మానందంలో తేలినవారు ఒక్కరుకాదు, పలువురు. తాము తరించడమేకాక, తమ్ము దర్శించినవారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమందియో, వీరిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. అసాధారణమైన ఇట్టి అనుభూతికలవా రవతరించిన మనమతంలో ప్రమాణగ్రంథాలు లేకపోతాయా?

భావిక్షేమార్థం అనుషించేది ధర్మం. ఏ విధమైన ఆశాలేనివాడు చేసేధర్మం మోక్షకారకం. అదేధర్మం. అదేమతం. ఆధర్మాచరణకు ప్రమాణం అవసరం. వానిని చెప్పేగ్రంథాలే ధర్మప్రమాణాలు. ప్రమాణమంటే ఏమిటి? ప్రమాణమంటే సత్యం. 'ఈధర్మమే సత్యం' అని నిర్థారించేవే ధర్మ ప్రమాణాలు. ఈ ధర్మానికి పరాకాష్ఠ మోక్షం. ఆ మోక్షం ఇతరమతస్థులు చెప్పేవిధంగా పురలౌకికంగా - ఇహలోకసాధ్యం. దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి.

''అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః,
పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతా శ్చతుర్దశ.''

- మనుస్మృతి

''పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః,
వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ.''

- యాజ్ఞవల్క్య స్మృతి.

మన ప్రమాణగ్రంథాలు పదునాలుగు. సమస్తజ్ఞానమూ ఈపదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై యున్నందున వీనికి విద్యాస్థానాలని పేరు. అవి నాలుగువేదాలు. ఆరు అంగాలు. మీమాంసా, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు. సూటియైన ధర్మప్రమాణం వేదం. షడంగాలుఅనేవి-శిక్ష. వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం.

''ఆధీతి బోధాచరణ ప్రచారణౖ
ర్దశా శ్చతస్రః ప్రణయ న్ను నాధిభిః,
చతుర్దశత్వం కృతవాన్‌ కుతః స్వయం
న వేద్మి విద్యాసు చతుర్డశస్వపి.''

- నైషధం 1 సర్గ.

నలుడు చతుర్దశ విద్యలకు (పదునాలుగు విద్యలకు) చతుర్దశల (నాలుగు దశలు) ఇచ్చాడట-చదవడం, చదివినది తెలిసికోవడం, చదివినరీతి ఆచరించడం. తాను ఆచరించడమే కాక ఇతరులకుసైతం బోధించడం - ఇవి చతుర్దశలు. చతుర్థశ విద్యలకూ, చతుర్దశలు చేసినవాడు నలుడు. చతుర్దశ విద్యలకు మరొకనాలుగు చేర్చిన అష్టాదశ విద్యలగును. ఆత్మావలోకనం కలుగజేసేవి ఈవిద్యలు. అన్నీ వీనియం దణగిఉన్నవి.

Saturday, 27 February 2016

వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : తీర్థప్రాశస్త్యం





వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : తీర్థప్రాశస్త్యం
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు
భాగ్యనగరమునందు ఫిబ్రవరి 21, 2016 నాడు వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు 

Friday, 26 February 2016

వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు : సంధ్యా వందనం, వివాహ మంత్రార్థాలు





వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు  :  సంధ్యా వందనం, వివాహ మంత్రార్థాలు
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు మరియు బ్రహ్మశ్రీ ముల్లైవాసల్ R  కృష్ణమూర్తి శాస్త్రి గారు
భాగ్యనగరమునందు జనవరి 26, 2016 నాడు వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ - తెలుగు విశేష ఉపన్యాసాలు 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.