Wednesday, 23 March 2016

శంకరస్తోత్రాలు : శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్




॥ శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్॥

విశుద్ధం పరం సచ్చిదానన్దరూపమ్
గుణాధారమాధారహీనం వరేణ్యమ్ ।
మహాన్తం విభాన్తం గుహాన్తం గుణాన్తం
సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే ॥ 1 ॥

విశుద్ధుడును , మాయాతీతుడును , సత్తామాత్రుడును , సచ్చిదానందరూపుడును , గుణాధారుడును , ఆధారహీనుడును , శ్రేష్ఠుడును , అఖండముగా వెలుగుచుండువాడును , బుద్ధికి అతీతుడును , గుణములకు అంతమందుండువాడును , సుఖ స్థానమైనవాడును , స్వయంజ్యోతి రూపుడును అగు రాముని చేరుచున్నాను.

శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం
సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ ।
మహేశం కలేశం సురేశం పరేశం
నరేశం నిరీశం మహీశం ప్రపద్యే ॥ 2 ॥

మంగళకరుడును , నిత్యుడును , సజాతీయాది భేద త్రయ రహితుడును , సర్వవ్యాపకుడును , తారక నాముడును (నామ జపము చేసిన వారిని తరింపజేయువాడు) , సుఖరూపుడును , ఆనంద భిన్నమైన ఆకారము లేనివాడును , మిక్కిలి మాననీయుడును(పూజ్యుడు) , మహేశ్వరుడును , సర్వ కళలకు ప్రభువును , దేవతలకును ప్రభువగువాడును , పరమేశ్వరుడును , సర్వజనాధిపతియు , ఈ భూమికంతకూ ప్రభువగు వాడును అగు శ్రీరాముని చేరుచున్నాను.

యదావర్ణయత్కర్ణమూలేఽన్తకాలే
శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ ।
తదేకం పరం తారకబ్రహ్మరూపం
భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహమ్ ॥ 3 ॥

శివుడు కాశీలో ప్రాణుల మరణ సమయమున చెవిలో రామరామరామ అని చెప్పునట్టి ఆ ఏకైక తారక బ్రహ్మ రూపమైన రామునే ఎల్లకాలమునూ సేవింతును.

మహారత్నపీఠే శుభే కల్పమూలే
సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ ।
సదా జానకీలక్ష్మణోపేతమేకం
సదా రామచన్ద్రమ్ భజేఽహం భజేఽహమ్॥ 4 ॥

మంగళకరమైన కల్పవృక్షము మొదట సుఖముగా కూర్చుండి వేయి సూర్యులవలే ప్రకాశించుచూ నిత్యము సీతా లక్ష్మణ సమేతుడైయుండు నా రామచంద్రుని నిత్యము సేవించెదను.

క్వణద్రత్నమన్జీరపాదారవిన్దమ్
లసన్మేఖలాచారుపీతామ్బరాఢ్యమ్ ।
మహారత్నహారోల్లసత్కౌస్తుభాఙ్గం
నదచ్చఞ్చరీమఞ్జరీలోలమాలమ్ ॥ 5 ॥

లసచ్చన్ద్రికాస్మేరశోణాధరాభమ్
సముద్యత్పతఙ్గేన్దుకోటిప్రకాశమ్ ।
నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న-
స్ఫురత్కాన్తినీరాజనారాధితాన్ఘ్రిమ్ ॥ 6 ॥

పురః ప్రాఞ్జలీనాఞ్జనేయాదిభక్తాన్
స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ ।
భజేఽహం భజేఽహం సదా రామచన్ద్రం
త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే ॥ 7 ॥

శ్రీ రామచంద్రా ! నీ పద్మములవంటి పాదములు మ్రోయుచున్న రత్నపుటందెలతో ఎంత ఆకర్షకములుగా నున్నవి? కటి స్థలము తళతళలాడు మొలత్రాడుతో  బిగించిన పీతాంబరముతో ప్రకాశించుచున్నది. నీ వక్షస్థలము గొప్ప గొప్ప రత్నహారములతోనూ, కౌస్తుభమణితోనూ , పూగుత్తుల వంటి రొద చేయుచూ ముసురుచున్న తుమ్మెదలు గల పూలదండలతోనూ , దర్శనీయముగానూ ఉన్నది. నీ చిరునవ్వు వెన్నెలవలే మెరయు చున్నది.క్రింది పెదవి ఎఱ్ఱని కాంతి కలదై యొప్పుచున్నది. ఉదయించుచున్న కోటి సూర్య చంద్రుల కాంతితో వెలుగుచున్నాడవు. తలలు వంచి నమస్కరించుచున్న బ్రహ్మాది దేవతల కిరీటముల యందలి రత్నకాంతులు నీ పాదములకు నీరాజనములుగా నున్నవి . ఎదుట దోయి లొగ్గి ప్రార్థించుచూ నిలిచియున్న ఆంజనేయాది భక్తులకు మంగళకరమైన చిన్ముద్రతో (చూపుడు వ్రేలు బొటన వ్రేలు కలిపి పట్టిన ముద్ర) జ్ఞానబోధ చేయుచున్న ఓ రామా! నేనెల్లప్పుడును నిన్నే కొలుతును . నిన్ను కాక మరొకరిని తలపనే తలపను. ముమ్మాటికినీ తలపను.

యదా మత్సమీపం కృతాన్తః సమేత్య
ప్రచణ్డప్రతాపైర్భటైర్భీషయేన్మామ్ ।
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం
తదాపత్ప్రణాశం సకోదణ్డబాణమ్ ॥ 8 ॥

ఓ స్వామీ ! యముడు మహా భయంకరులైన తన దూతలచేత నన్ను పలకరింపబూనినపుడు సజ్జనుల ఆపదలుబాప బూని ధనుర్బాణములు పూనియున్న నీ దివ్య రూపమును నాకు చూపుదువుగాక.

నిజే మానసే మన్దిరే సంనిధేహి
ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ।
ససౌమిత్రిణా కైకేయీనన్దనేన
స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన ॥ 9 ॥

భరత శత్రుఘ్న లక్ష్మణులచే మిక్కిలి భక్తి శ్రద్ధలతో సేవింపబడుచున్న ఓ రామచంద్రమూర్తీ ! నా యెడల ప్రసన్నుడవై నా మనోమందిరమున నిలువుమయ్యా!

స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-
రనీకైరనేకైశ్చ రామ ప్రసీద।
నమస్తే నమోఽస్త్వీశ రామ ప్రసీద
ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ ॥ 10 ॥

నీ భక్తులలో మొదట లెక్కింపదగిన వారైన వానరాధిపతులతోను భూపతులతోను అనేకాక్షౌహిణీ సేనలతోను కూడుకొని యున్న ఓ రామచంద్రా! నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నా యెడల సుప్రసన్నుడవై తగిన విధముగా నన్ను నడిపింపుము. శాసింపుము.

త్వమేవాసి దైవం పరం మే యదేకం
సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే ।
యతోఽభూదమేయం వియద్వాయుతేజో-
జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ ॥ 11 ॥

ఏ చైతన్యము వలన ఇంతని లెక్కవేయ శక్యము కానిదియూ పంచభూతాత్మకమైనదియూనైన చరాచర జగత్తును ఓషధులును , అన్నమునూ మొదలైనవి పుట్టెనో ఆ చైతన్యము నీవే. వేఱు కాదు. అన్నిటికంటెనూ పైనున్న అద్వితీయమైన దైవమును నీవే.

నమః సచ్చిదానన్దరూపాయ తస్మై
నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ ।
నమో జానకీజీవితేశాయ తుభ్యం
నమః పుణ్డరీకాయతాక్షాయ తుభ్యమ్ ॥ 12 ॥

సచ్చిదానంద రూపుడవును తత్త్వరూపుడవు అయిన రామా! ఓ దేవదేవా! నీకు వందనము. జానకీ జీవిత నాథుడవైన రామా! పద్మములవలె విశాలమైన నయనములు కలవాడా! నీకు నమస్కారము.

నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం
నమః పుణ్యపుఞ్జైకలభ్యాయ తుభ్యమ్ ।
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే
నమః సున్దరాయేన్దిరావల్లభాయ ॥ 13 ॥

భక్తులను ప్రేమతో రక్షించునీకు వందనము. పుణ్యరాశులకు మాత్రమే దొరకునట్టి నీకు నమస్కారము. వేదముల చేత మాత్రమే తెలిసికొనదగిన ఆది పురుషుడవైన నీకు నతులు. లక్ష్మీవల్లభుడవును సుందరుడవును అగు నీకు నమస్సులు.

నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే
నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే ।
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే
నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే ॥ 14 ॥

స్వామీ యీ విశ్వమును నిర్మించువాడవు హరించువాడవును నీవే. ఈ జగత్తును అనుభవించు వాడవును దీని పరిమాణమును తెలిసికొన గలవాడవును నీవే. ఈ విశ్వమునకు నాయకుడవుగాని జయించువాడవుగాని నీవే. ఈ సర్వ జగత్తునకును నీవే తండ్రివి . నీవే తల్లివి. అట్టి నీకు పునః పునః వందనములు.

శిలాపి త్వదన్ఘ్రిక్షమాసఙ్గిరేణు-
ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ ।
నరస్త్వత్పదద్వన్ద్వసేవావిధానా-
త్సుచైతన్యమేతేతి కిం చిత్రమద్య ॥ 15 ॥

నీ పాద పద్మములనందలి భూరేణువుల అనుగ్రహము వలన రాయికూడ చైతన్యము పొందియుండగా నీ పాదపద్మారాధన వలన నరుడు చైతన్యమును పొందుననుటలో వింత ఏమి కలదు?
 
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం
నరా యే స్మరన్త్యన్వహం రామచన్ద్ర ।
భవన్తం భవాన్తం భరన్తం భజన్తో
లభన్తే కృతాన్తం న పశ్యన్త్యతోఽన్తే ॥ 16 ॥

పవిత్రమును విచిత్రమునునైన నీ చరిత్రమును నిత్యము స్మరించుచు సంసారాంతకుడవును జగద్భారమును వహించువాడవు అయిన నిన్ను సేవించు జనులు అనేక శుభములను పొందుదురు. మరణ కాలమున యముని చూడరు. అనగా పుణ్యలోకములను పొందెదరని భావము.

స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం
నరో వేద యో దేవచూడామణిం త్వామ్ ।
సదాకారమేకం చిదానన్దరూపం
మనోవాగగమ్యం పరన్ధామ రామ ॥ 17 ॥

ఓ  రామా! ఏ మానవుడు దేవతా శ్రేష్ఠుడవైన నిన్ను సద్రూపమైనదియును , చిద్రూపమైనదియును , అద్వితీయమును , ఆనందరూపమును , వాక్కునకుగాని , మనస్సునకుగాని , అందనిదియును సర్వతత్త్వాతీతమైన పరమ తేజమునుగా గ్రహించునో వాడే పుణ్యాత్ముడు. వాడే ఉత్తముడుగా గణింపదగినవాడు. అతడే నాకు శరణమంద దగినవాడు.

ప్రచణ్డప్రతాపప్రభావాభిభూత-
ప్రభూతారివీర ప్రభో రామచన్ద్ర ।
బలం తే కథం వర్ణ్యతేఽతీవ బాల్యే
యతోఽఖణ్డి చణ్డీశకోదణ్డదణ్డః ॥ 18 ॥

తీక్ష్ణమైన్ ప్రతాప ప్రభావము చేత గొప్ప గొప్ప శత్రువులను నిర్జించిన ఓ రామచంద్రప్రభూ! ఎవ్వరికిని కదల్పరాని శివధనుస్సును బాల్యముననే ముక్కలు చేసిన నీ బలమును ఎట్లు వర్ణింపగలను?

దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం
సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ ।
భవన్తం వినా రామ వీరో నరో వా
ఽసురో వాఽమరో వా జయేత్కస్త్రిలోక్యామ్ ॥ 19 ॥

ఓ రామమూర్తీ ! చుట్టును సముద్రముతో నున్న దుర్గమున అనేక రాక్షసాక్షౌహిణీ ప్రభువై యుగ్రుడైయున్న దశగ్రీవుని సపుత్త్ర మిత్రముగా నీవుగాక యీ మూడులోకములయందునూ , ఏ నరుడుగాని , అసురుడుగాని , అమరుడుగాని , చంపగలడా?

సదా రామ రామేతి రామామృతం తే
సదారామమానన్దనిష్యన్దకన్దమ్ ।
పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం
హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ ॥ 20 ॥

సజ్జనులకు సుఖకరమైనదై ఆనందరసమును ప్రవహింపచేయు దుంపయనదగు రామనామమను అమృతమును నిత్యము గ్రోలుచు , ఆనందమగ్నుడై నమ్రుడగుచు దంత కాంతు లెసగనవ్వుచు నుండెడి హనుమంతుని నిరంతరము నా మనమున కొలుతును.

సదా రామ రామేతి రామామృతమ్ తే
సదారామమానన్దనిష్యన్దకన్దమ్ ।
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-
ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ ॥ 21 ॥

ఓ రామా! నిత్యమును సజ్జనాశ్రయమైనదియును , ఆనంద ప్రవాహమునకు మూలకారణమైనదియు అయిన రామ రామ యను నీనామామృతమును ప్రతిదినమును త్రావుచున్న నాకు నీ అనుగ్రహము వలన మృత్యుభయమే లేకుండెను.

అసీతాసమేతైరకోదణ్డభూశై-
రసౌమిత్రివన్ద్యైరచణ్డప్రతాపైః ।
అలఙ్కేశకాలైరసుగ్రీవమిత్రై-
రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥ 22 ॥

సీతాసమేతమును , కోదండభూషితమును , లక్ష్మణాభివందితమును , తీవ్రప్రతాపయుతమును , రావణాంతకమును , సుగ్రీవ సఖమును , రామ సంజ్ఞితమును గాని ఇతర దైవతములతో మాకేమిపని రాముని తక్క ఇతరదైవమును సేవింపనని భావము.

అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై-
రభక్తాఞ్జనేయాదితత్త్వప్రకాశైః ।
అమన్దారమూలైరమన్దారమాలై-
రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥ 23 ॥

వీరాసనము వేయని , చిన్ముద్ర వహించని , భక్తులగు ఆంజనేయాదులకు తత్త్వప్రకాశము చేయని మందారమూల ముందుండని , మందారమాలలేని రామ సంజ్ఞితము కాని అన్య దేవతలతో మాకేమి పని ? పై లక్షణము కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.

అసిన్ధుప్రకోపైరవన్ద్యప్రతాపై-
రబన్ధుప్రయాణైరమన్దస్మితాఢ్యైః ।
అదణ్డప్రవాసైరఖణ్డప్రబోధై-
రరామభిదేయైరలమ్ దేవతైర్నః ॥ 24 ॥

సముద్రమునందు కోపము , జూపజాలని , నమస్కరింపదగిన ప్రతాపము లేని , బంధువుల యిండ్లకు వలె ప్రజల గృహములకు వెళ్ళి క్షేమము తెలిసి కొనని , మందహాస సుందరము కాని , పితృవాక్య పరిపాలనా వ్యాజమున లోకమునకు మార్గదర్శకముగా దండక ప్రవాసము సేయజాలని , అఖండ జ్ఞాన విశేషము లేని రామ సంజ్ఞితముగాని యితర దైవములతో మాకేమిపని? పై లక్షణములు కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.

హరే రామ సీతాపతే రావణారే
ఖరారే మురారేఽసురారే పరేతి ।
లపన్తం నయన్తం సదాకాలమేవ
సమాలోకయాలోకయాశేషబన్ధో ॥ 25 ॥

హరే! రామ! సీతానాయక! రావణాంతకా! ఖరహంతకా! మురాసురాంతకా! రాక్షసనాశకా! పరమపురుషా! అని ఎప్పుడును స్మరించుకొనుచు ఇట్లు కాలము గడుపు నన్ను చూడుము. ఓ జగద్బాంధవా నన్ను కరుణింపుము.

నమస్తే సుమిత్రాసుపుత్రాభివన్ద్య
నమస్తే సదా కైకయీనన్దనేడ్య ।
నమస్తే సదా వానరాధీశవన్ద్య
నమస్తే నమస్తే సదా రామచన్ద్ర ॥ 26 ॥

సుమిత్రా పుత్రునిచే నమస్కరింపబడుచుండువాడా! కైకేయీ కుమారునిచే స్తుతింపబడువాడా! వానరేంద్రునిచే అభివందితుడవగుచుండువాడా! ఓ రామచంద్రా! నీకు పునః పునః అభివందనములు.
 
ప్రసీద ప్రసీద ప్రచణ్డప్రతాప
ప్రసీద ప్రసీద ప్రచణ్డారికాల ।
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకమ్పిన్
ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ॥ 27 ॥

అతి తీక్ష్ణ్ం అయిన ప్రతాపము గల ఓ రామమూర్తీ! శత్రువులకు ఘోరమృత్యువైనవాడా! శరణాగతులను దయచూచు ఓ స్వామీ! నా యెడ గడుంగడు ప్రసన్నుడవగువయ్యా.

భుజఙ్గప్రయాతం పరం వేదసారం
ముదా రామచన్ద్రస్య భక్త్యా చ నిత్యమ్ ।
పఠన్ సన్తతం చిన్తయన్ స్వాన్తరఙ్గే
స ఏవ స్వయమ్ రామచన్ద్రః స ధన్యః ॥ 28 ॥

వేద సారమును ఉత్తమము అగు ఈ రామభుజంగ ప్రయాత స్తవరాజమును భక్తితో సంతోషముతో నిత్యమును పఠించుచూ ఈ స్తోత్రమును మనస్సునందు నిరంతరమును మననము చేయునట్టివాడు కడుంగడు ధన్యుడు. అతడు స్వయముగా శ్రీ రామచంద్ర స్వరూపుడే అగును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.