Tuesday, 29 March 2016

శంకరవాణి : శివశ్శక్త్యాయుక్తః


పరమాచార్యుల అమృతవాణి : గౌరీపూజ ఎందుకు చేయాలి ?


పరమాచార్యుల అమృతవాణి : గౌరీపూజ ఎందుకు చేయాలి ?
(జగద్గురుబోధల నుండి)

ఆంధ్రదేశంలోనూ, ఉత్తరదేశంలోనూ వివాహకాలంలో గౌరీపూజచేసే అలవాటొకటి చాలాకాలంనుంచీ వస్తున్నది. రుక్మిణీదేవి కృష్ణునే వివాహంచేసుకోవాలని సంకల్పించుకొని తనకోరిక నెరవేరడంకోసం గౌరీపూజచేసి కృష్ణుని భర్తగా పొందినట్లు భాగవతంలో మనం చదువుతున్నాం.

అయితే రుక్మిణీదేవి ఏ సరస్వతినో, లక్ష్మినో ఆరాధించక అందుకు అంబికనే ఎందుకు ఎన్నుకొంది? అవివాహితలైన కన్యలు పెండ్లికాగానే పాతివ్రత్యం పరిపాలించాలంటే, అన్నివిషయాలలోనూ భర్తకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎంతో చిత్తదార్ఢ్యం ఉంటేకాని అది జరిగేమాట కాదు. పతీత్వపాతివ్రత్యాల ఆకృతియే అంబిక. ఆమె దక్షునకు కూతురైనపుడు తన తండ్రి భర్తను దూషించినాడన్న కారణంచేత శరీరమే త్యాగంచేసింది. పార్వతిగా పుట్టినపిదపకూడా ఆపరమేశ్వరునే పెళ్లాడాలని ఉగ్రతపం చేసింది. తాను అనుకొన్న కార్యం సాధించింది.

లక్ష్మీదేవి పతివ్రతగా ఉన్నదంటే అందు పెద్దవిశేషమేమీ లేదు. అందమూ, చందమూ, అలంకారమూ, ఐశ్వర్యమూ ఉన్న మహాప్రభువు మహావిష్ణువు. అట్టివాడు భర్త అయితే ఎవతె అయినా పతివ్రతయే అయిపోతుంది. మాధవుని తీరు ఒకటి, మహాదేవుని తీరు మరొకటి. ఈయన ఉనికి వల్ల కాట్లో, పాములు మెడలో, కపాలం చేతిలో, ఇట్లా ఈయనది ఘోరమైన స్వరూపం.
యాతే రుద్ర శివాతనూ రఘోరాపాపకాశినీ,
అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 
(రుద్రము)

ఈమహాఘోరస్వరూపాన్ని భర్తగా వరించి, పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తూ, భర్తను తండ్రి దూషించినాడన్న కారణంగా శరీరత్యాగంచేసి, మరల అతనికై తపస్సుచేసి, అతనినే పెళ్ళిచేసుకొన్న పరమసతి సర్వమంగళను ఆరాధిస్తే పాతివ్రత్యమూ లభిస్తుంది, ఆమె అనుగ్రహమూ స్థిరంగా ఉంటుంది. స్త్రీకి పాతివ్రత్యం ఎంత ముఖ్యమో, పురుషులకు గురుభక్తి అంత ముఖ్యం.
ఓంకార పంజరశుకీ ముపనిష దుద్యానకేళి కలకంఠీం
ఆగమ విపినమయూరీ మార్యా మంతర్విభావయేగౌరీం

దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం.

అని కాళిదాస మహాకవి అంబికాస్తవం చేశాడు. అందులో ఆచార్యస్వరూపము సాక్షాదంబికయే అని వ్రాశాడు.

అవటుతటఘటితచూలీం తాడితపలాశ తాటంకాం,
వీణావాదనవేలా కంపిత శిరసం నమామి మాతంగీమ్‌||

అనేది ఆయన వ్రాసినదే మరొకశ్లోకం. తాళీపలాశం అనగా తాటాకు. మాతంగికి తాటాకులే తాటంకాలట. అందుచేతనే గౌరీపూజలో నల్లపూసలూ, తాటాకు ఈనాటికిన్నీ వినియుక్తమవుతున్నవి. అందుచేత పెండ్లి చేసుకొనే కన్నెపడుచులు నిత్యకల్యాణంగా ఆనందంగా ఉండాలని కోరుకొనేటట్లయితే సర్వమంగళను ఆరాధించవలె.

అంబికను ఆరాధించేవారికి గురుభక్తీ పతిభక్తీ సులభము లయిపోతవి. రుక్మిణీదేవి గౌరీపూజ చేయడంకూడా అందుకోసమే. అంబిక తాటంకములను కాళిదాసు వర్ణించినట్లే శంకర భగవత్పాదులవారున్నూ వర్ణించినారు.
పురా రాతే రంతః పురమసి తత స్త్వ చ్చరణయో
స్సపర్యా మర్యాదా తరళ కరణానామ సులభా,
తథాహ్యేతే నీతా శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం
తవ ద్వారోపాస్త స్థితిభి రణిమాద్యాఖిరమరాః 
(సౌందర్యలహరి)

శ్రీచక్రము మహామేరు స్వరూపమైనది. అందు పలు ఆవరణ లున్నవి. ప్రతి ఆవరణకున్నూ అధిదేవత లున్నారు. బిందుస్థానమే పరాశక్తి. అది అన్నిటికంటె ముఖ్యమైనది. తక్కినవన్నీ చిన్న చిన్న శక్తిస్వరూపాలు. అంబిక ఉండే చింతామణి గృహంలో నవావరణ లున్నవి (తొమ్మిది ఆవరణలు). ఇవి ఒకదానికొకటి కోటియోజనాలదూరంలో ఉన్నవి. కడపటి ద్వారం అణిమాది అష్టసిద్ధులకై ఏర్పడినది. ఆద్వారానికిన్నీ అంబిక ఉన్న స్థానానికిన్నీ ఎంతో దూరము అయినప్పటికిన్నీ ద్వారోపాంతంలో నిలబడేసరికి ఆణిమాదిశక్తుల అనుగ్రహం చేత ఐశ్వర్యం లభిస్తుంది.

ఇంద్రాదిదేవతలు ఈతొమ్మిదవ ఆవరణనే దాటలేదు. అక్కడకు వచ్చేసరికి వాళ్లు అష్టవిభూతిశక్తుల అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళకు పరదేవతను చూడగల ఇంద్రియ నిగ్రహం లేదు. అసలు సనకాది యోగివర్యులకే లేదు. అంతఃపురంలోకి వెళ్ళవలెనంటే ఎంత ఇంద్రియనిగ్రహం ఉండాలి?

అట్టి అనుత్తరమైన శక్తి అంబికది. ఆమెయొక్క పరిపూర్ణచైతన్యము ముందు కలికాలపు జనులు ఆగలేరనియే, ఆచార్యులవారు జంబుకేశ్వరక్షేత్రానికి వెళ్ళినపుడు, అఖిలాండేశ్వరిని ప్రార్థించి, ఆమె శక్తిని ఆకర్షించి, రత్నమయమైన శ్రీచక్రాన్ని ఒక కర్ణంలోనూ, పంచాక్షరీయంత్రాన్ని మరొక కర్ణంలోనూ తాటంకాలుగా ప్రతిష్ఠచేసి ఆమెను సౌమ్య స్వరూపిణిగా చేశారు.

ఇంత మహిమ పరమేశ్వరునికి సిద్ధించిందంటే, దానికి మూలం నీ తాటంకమహిమే కదా అంటూ అఖిలాండేశ్వరి తాటంకాలను స్మరిస్తూ ఆచార్యులవారు ఈక్రిందిశ్లోకాన్ని సౌందర్యలహరిలో వ్రాసినారు.
సుధామప్యాస్యాద్యా ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధిశత మశాద్యా దివిషదః,
కరాళం యత్వేక్షళం కబళిత వతః కాలకలనా
నశం భో స్తన్మూలం జనని తాటంక మహిమా||

తమకు జరామరణాలుండరాదని అమృతం త్రాగారు. కాని ప్రళయకాలంలో వాళ్ళుకూడా విపత్తుపొందుతున్నారు. భయగ్రస్తులవుతున్నారు. కాని హాలాహలాన్ని మింగికూచున్న పరమేశ్వరుడుమాత్రం చెక్కుచెదరకఉన్నాడు. విషం తిని విశ్వేశ్వరుడు ఏ అభిప్రాయమూలేక సురక్షితంగా ఉంటే, అమృతపానం చేసిన అమరులు దిక్కులేక చస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, నీ తాటంకమహిమే అని ఆచార్యుల వారన్నారు.
యాతే రుద్ర శివాతనూః శివా విశ్వాహ భేషజీ,
శివా రుద్రస్య భేషజీ తథానో మృడజీవసే 
(రుద్రము)

'పరమేశ్వరా నీవు పుట్టినావు సరే నీకు మందు ఎవరిస్తున్నారు? రెండురకాలయిన శరీరాలున్నాయి నీకు. అందులో ఒకటి ఘోరమైనది. మరొకటి మంగళకరమైనది. ఘోర స్వరూపము నీది. పరమమంగళస్వరూపముతో విలసిల్లుతున్న దేహమున్నదే అది అంబికది. ఈవిశ్వానికంతా ఆ విశ్వేశ్వరి ఔషధప్రాయంగా ఉన్నది. ఆమె కటాక్షముంటే చాలు. అకాలమృత్యువనే మాట ఆ చుట్టుప్రక్కల ఎక్కడా వినబడదు. నీకున్నూ ఆమెయే భేషజియై, వైద్యం చేస్తున్నది కాబోలు. పరమమంగళకరమైన ఆమె శరీరం నిన్ను అంటిపెట్టుకొని ఉండటం వల్లనే జీవిస్తున్నావు'.
శివః శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి,
అత స్త్యా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి. 
(సౌందర్యలహరి)

శివుడు శక్తితో కలిస్తేనే జగన్నిర్మాణశక్తి కల్గినవాడవుతాడు. లేకపోతే ఆయనకు కదలటానికి కూడా సత్తువ ఉండదు. పరాశక్తి పరమేశ్వరునికే మూలశక్తిగా ఉన్నది. అటువంటి అంబికను ఆరాధించాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? భర్తయొక్క ఘోరస్వరూపంవల్ల అంబికా పాతివ్రత్యం మరింత ప్రకటితమవుతున్నది. అందుచే ఆమెను ఆరాధించేవారికి ప్రాతివ్రత్యమూ, మంగళమూ, దృఢచిత్తమూ సులభంగా లభిస్తవి.

Monday, 28 March 2016

పరమాచార్యుల అమృతవాణి : మాతృ ధర్మము



పరమాచార్యుల అమృతవాణి : మాతృ ధర్మము
(జగద్గురువుల ఉపన్యాసాలనుండి)

కీర్తిఃశ్రీ వాక్చనారీణాం.

అని గీతలో నిభూతియోగాధ్యాయమున కలది. ఒక ఉపనిషత్తులో నొకబాలకునిచూచి ఒకఋషి 'నీవుమంచి తల్లినికలవాడవు. మంచి తండ్రినికలవాడవు, మంచి గురువు కలవాడవు- అని నాకు తోచుచున్నది' అని చెప్పినట్లున్నది. అందులో మొదట 'మాతృమాన్' అనికలదు. అనగా కుటుంబము స్త్రీల అధీనము. కాబట్టి తల్లి సద్గుణములుకలది అగుచో బిడ్డగూడా అట్టి గుణములు గలవాడేయగును- గీతల్లో చెప్పినట్లు ఏస్త్రీవద్ద మంచిగుణములు; కుటంబ నిర్వహణశక్తి; అతిథి; అభ్యాగతుల చక్కగ విచారించి ఆదరించుట యుండునో ఆకుటుంబము దినదినమభివృద్ధిగాంచును- పిదప పితృమాన్;ఆచార్యవాన్; అని కలదు.

స్త్రీమూలం జగత్సర్వం, స్త్రీమూలః సర్వధర్మః.

అనికూడా శాస్త్రములు చెప్పుచున్నవి. కాబట్టి బిడ్డలను చదువు అను మిషతో గాని మరొక కారణముతో గాని దూరదేశములకంపక పది సంవత్సరములైనను తల్లిదగ్గరనే ఉంచుటమంచిది. ఈవిషయమున తల్లులు బిడ్డల కెక్కుడు సాయమొనర్పవలెను. అందుకు సాహిత్యమత్యవసరము. ప్రభుసమ్మితము, సుహృసమ్మితము, కాంతాసమ్మితమని సాహిత్యము ముత్తెఱంగులు. ఇంతవరకు జీవుడుత్తమగతి పొందుటకు చిన్నప్పుడు తల్లి చాలా ప్రయోజనకారి అని చెప్పినాను. తల్లులంతయూ అట్టి ఘనకార్యమునకు పూనవలెను. భక్తిగా స్త్రీలంతయు భగవంతుని నామోచ్చారణమొనర్చి పిల్లలచే చేయించవలెను- అది తరించడానికి సులభమార్గము- మఱియు పిల్లలను సాధ్యమైనంతవరకు అసత్య మాడకుండునట్లు చేయవలెను-

'అశ్వమేధసహస్రాచ్చ సత్యమేవగరీయః'

వేయి అశ్వమేథయాగముల ఫలము నొకతట్టును; సత్యము నొకతట్టును పెట్టి తూచినప్పుడు యాగఫలముల 'సిబ్బి' చివ్వున పైకిపోయినదట. తండ్రి సత్యముగానుండిన అది తనకొరకే అవును. తల్లి సత్యముగా నుండినపక్షమున బిడ్డలుకూడా తరించెదరు. స్త్రీలందరును ముఖ్యముగ భగవద్భక్తిని; సత్యమును బాలులకలవాటు చేయించవలెను. అదియేవారిధర్మము-అందుకు రామాయణాది గ్రన్థముల సాధనముగ నుంచుకొనవచ్చును. స్త్రీలకింతకుమించిన దేశసేవలేదు. భగవన్నామస్మరణకు బ్రాహ్మముహూర్తము శ్రేష్ఠమైనది. కాబట్టి స్త్రీలు తెల్లవారుఝూముననేలేచి భగవంతుని స్మరించుచుండినచో బిడ్డలుకూడా కొంతకాలమునకా యలవాటే కలవారగుదురు-ప్రాచీనకాలమునందిట్టి యాచారము స్త్రీలయందధికముగ నుండెడిది- సత్యమును స్త్రీలందరును పాటించవలెను- అప్పుడు బిడ్డలు తల్లులజూచి సత్యప్రతపాలనమున కుపక్రమింతురు- అప్పుడు స్త్రీలందరును అందరకు ఆదర్శప్రాయులు కాగలరు. ఇదియే స్త్రీలధర్మము.

శంకరవాణి : త్రిపురసుందరీ ధ్యాన శ్లోకం





సకుఙ్కుమవిలేపనామలకచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥
కుంకుమతో కలిసిన విలేపనమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ, చిరునవ్వులతో కలసిన కన్నులు కలదీ, పుష్పబాణమును - చెరకువింటినీ - పాశాంకుశములనూ ధరించినదీ, అశేషజనులను మోహింపచేయునదీ, ఎర్రని పూలదండలను - ఆభరణములను - వస్త్రములను ధరించినదీ, జపాపుష్పమువలే ప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించెదను.

రామాయణప్రభ : శ్రీరామ కళ్యాణ తలంబ్రాల (ముత్యాల) వైభవం


రామాయణప్రభ : రామనామ మహిమ


శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత



శ్రీ జయేంద్ర వాణి : రామనామము యొక్క ఉత్కృష్టత
(జయేంద్రవాణి నుండి)

భగవన్నామస్మరణ సత్ఫలితాల్ని సమకూరుస్తుంది. విశేషంగా రామనామ స్మరణ వ్యక్తికి అమితప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది. అది మనోమాలిన్యాలను కడిగివేస్తుంది. మనస్సు దోష భూయిష్ట మైనప్పుడు రామనామజపంచేస్తే అది దోషరహితమై స్వచ్ఛతను చేకూర్చుకుంటుంది.

వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే తులసీదాసు దాన్ని హిందీలోకి అనువదించాడు. ఈ ఇరువురు మహాత్ములయొక్క జీవితచరిత్రలు రామనామంయొక్క ఉత్కృష్టతను వివరంగా ఉల్లేఖిస్తాయి. వాల్మీకి జీవితాన్ని పరిశీలిస్తే ఒకవ్యక్తి యొక్క జీవితాన్ని రామనామం ఏవిధంగా తారుమారు చేసి ఉన్నతగమ్యాలకు చేర్చగలదో మన మెరుగగలం. బందిపోటు దొంగగా జీవితాన్ని ఆరంభించిన ఒక బోయవాడు రామనామ జపఫలితంగా మహర్షి స్థాయికి ఎదిగాడు.

వాల్మీకి అడవిలోకి వచ్చిన జనుల సొత్తును దోపిడిచేసి జీవించేవాడు. ఒక రోజున సప్తర్షులు అడవికి వెళ్లారు. వాల్మీకి వారినికూడ సమీపించి వారి వస్తువులను కూడ బలవంతంగా తీసికోటానికి ఉద్యుక్తుడైనాడు. అప్పుడు మహర్షులు అతనితో ''ఇతరులను బాధించి వారి వస్తువులను తీసికొని వారికి ఇబ్బంది కల్గచేస్తున్నావు.'' అనగానే వాల్మీకి దానికి సమాధానంగా ''నేను పెద్దకుటుంబీకుడను. నాకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతరబంధువులు వున్నారు. వారి పోషణ బాధ్యత నాదే. వారందరి ఆకలి తీర్చటానికి నేనిలా ప్రజలను హింసించి వారి సొత్తును తీసికొనవలసినదే.'' అన్నాడు. అప్పుడు వారు ''నీవు వారందరికి ఆహారం సమకూర్చవలసినదే. కాని నీవు అవలంబిస్తున్న మార్గం చాల తప్పిదమైంది, పాపసమన్వితమైంది. నీవు చేసే పాపకార్యం యొక్క ఫలితం నీవనుభవించాల్సిందే గాని నీవల్ల పోషింపబడుతున్న నీకుటుంబీకులు ఒక్కరుకూడ నీపాపంలో పాలుపంచుకోరు. దోపిడీ అనే పాపకార్యాన్ని చేసి నీకుటుంబాన్ని పోషించే ఉద్యమం మంచిదికాదు. కనుక ఇకనుండి యీ పాపకృత్యాల్ని విరమించు.'' అని మహర్షులన్నారు. అప్పుడు వాల్మీకి ''నేను ఈ విధమైన దోపిడి చాలకాలం నుండి చేస్తున్నాను. ఈ పరిస్థితినుండి నాకు బయటపడే మార్గం ఏమిటి ?'' అని అడిగాడు. దానికి మహర్షులు వాల్మీకితో ''నీవు ఈ రోజునుండి రామనామజపం చేయటం ఆరంభించు. నీ వింతవరకు చేసిన పాపాలన్నిటికి దానివలన నిష్కృతి కలుగుతుంది.'' అన్నారు. ఆ విధంగా మహర్షులవలన ఉపదేశం పొందిన వాల్మీకి అడవిలోకి వెళ్లి దోపిడి చేయటం పూర్తిగా విరమించాడు. అందుకు బదులు అతడొక ఏకాంతప్రదేశంలో కూర్చొని నిష్ఠతో రామనామజపం అన్నివేళల చేయటం ఆరంభించాడు. అతడలా ఒకేచోట ఆసీనుడై ఎంతకాలం రామనామజపం చేశాడో కాని, అతని శరీరంపై చీమలపుట్ట పెరిగి అతన్ని పూర్తిగా మరుగుపరచింది. అతడాపుట్టనుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షిగా పిలవబడ్డాడు. వల్మీకం అనగా చీమలపుట్ట. దాని నుండి వెలువడి నందువలన ఆయనకు వాల్మీకియని నామధేయం సార్థకమైంది.

రామనామ జపం ద్వారా సాధించిన రామానుగ్రహంవల్ల బందిపోటుదొంగ జ్ఞానియై మహర్షిగా పరిణమించాడు. అతని పూర్వపు పాపాలన్నీ ప్రక్షాళితమైనాయి.

నిశ్చయంగా ఈ అధునాతన కాలంలో చదువును, వ్రాయను నేర్చిన మనం వాల్మీకి కంటే చాల తెలివైనవారమే. కాబట్టి మనం రామనామ జపంలో కొంతకాలాన్ని వెచ్చిస్తే మన సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. సామాన్యుడైన వాల్మీకి యొక్క పాపాలు రామనామ జపంచేత ప్రక్షాళింపబడినప్పుడు, మన పాపాలకు కూడ నిశ్చయంగా నిష్కృతి లభిస్తుంది.

మన జీవితాల్ని ప్రకాశవంతం చేసికొనుటకు వాల్మీకి మార్గాన్ని నిర్దేశించాడు. ప్రతివ్యక్తి రామనామం జపాన్ని కొన్ని వేళల్లోనైనా చేస్తే అతనికి రామచంద్రుని అనుగ్రహం తప్పక లభిస్తుంది.

తర్వాత, త్యాగబ్రహ్మ, రామదాసు, సమర్థరామదాసు, తులసీదాసు మొదలైన మహాత్ముల జీవితాలు ఆదర్శప్రాయంగా మనముందున్నాయి. వారిదైనందిన జీవితాలు ప్రతినిత్యం రామనామం చుట్టూ పరిభ్రమించాయి. ఈ రామనామం ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించేశక్తి కల్గివుంది.

పిల్లలకు బాల్యం నుండే రామనామం వ్రాసే సదభ్యాసాన్ని అలవరచాల్సిన అవసరం వుందని నిరూపించే కారణాల్లో ఇదికూడ ఒకటి. ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఈ అభ్యాసాన్ని అలవరచుకుంటే వారి కష్టాలు ఉపశమిస్తాయి. వారి జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లుతాయి. కనుక అందరూ రామభక్తిని అభ్యసించి రామనామం వ్రాస్తూ సుఖింతురు గాక.

రామాయణ ప్రవచనాల్ని వినాలి. రామనామం జపించాలి; రామచంద్రుడు అమలుచేసి చూపిన ధర్మాల్ని పాటించాలి. ఇవి సవ్యంగా నిర్వర్తిస్తే మనకు సిద్ధించే ప్రయోజనాలు అనంతం.

రాముని యొక్క మాతృభక్తిని, పితృభక్తిని, గురుభక్తిని, స్నేహశీలతను, శరణాగతవాత్సల్యాన్ని - ఈ సద్గుణాలన్నింటిని మనం చిత్తశుద్ధితో అనుకరించాలి. రాముడు తనయొక్క అవతార జీవితంలో ఈ ధర్మాలనన్నింటిని దృష్టాంతీకరించాడు. రామకథ వినటంలో విశేషంలేదు. అంత మాత్రం చేత మోక్షం సిద్ధించదు. అందులో రాముడు అవలంబించిన ధర్మాల్ని మనంకూడా మనజీవితంలో అమలు చేయగల్గితేనే మన దుఃఖాలు ఉపశమించి మనకు మానసికశాంతి చేకూరుతుంది. రామచంద్రమూర్తి ధర్మాన్ని అనేక మార్గాల్లో అవలంబించి మన జీవితాలకు ఒక ఆదర్శమూర్తియై మనముందు నిలిచాడు.

రాముని నామం కూడ విశేష ప్రాముఖ్యం గలది. ప్రజలను సౌఖ్యానందాలతో రమింపచేయువాడు గనుక రాముడైనాడని లోగడ చెప్పుకున్నాం. గణేశుడు కూడ మనకు సుఖాల్ని ప్రసాదించే దేవతే. ఐతే రాముని విషయంలో ఆయనపేరులోనే 'సౌఖ్యప్రదాత' అనే అర్థం ఇమిడివుంది.

దేవతల్లో గూడ ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకమైన కోర్కెలను తీరుస్తుంది. గణేశుడు మనకు సంభవించే విఘ్నాలను నివృత్తి చేస్తాడు. శివుడు మోక్షాన్ని, లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహిస్తారు. అలాగే రాముడు శాశ్వత సుఖాన్ని మనకు ప్రసాదించే ప్రత్యేక శక్తికలవాడు.

మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఏ కార్యాన్ని నిర్వహించినా మన అంతిమ లక్ష్యం సౌఖ్యమే.

అర్థరహితమైన ఈ మాయాప్రపంచంలో అర్థసహితమైనది రామనామమే. ప్రతి విషయానికి సారాంశం రామనామం. మిగతా విషయాలన్నీ నిష్ర్పయోజనాలే. రామనామ ఉచ్చారణతో దుఃఖోపశమనం, సుఖాగమనం ఏకకాలంలో జరుగుతాయి.

కనుక కుటుంబ సభ్యులందరు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తిచేసికొని అందరూ ప్రార్థనామందిరంలో సమావేశమై రామవిగ్రహం ముందు కొద్దినిముషములపాటైన రామనామ జపం లేక భజన చేసిన తర్వాతనే వారివారి లౌకిక వృత్తుల్లోకి ప్రవేశించాలి. అప్పుడే మన పనులన్నీ శీఘ్రంగా ఫలిస్తాయి.

సమయమున్నవారు ఉదయం, సాయంత్రం కూడ రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసికొని రామనామ జపం చేయగల్గిన మంచిదే. లేనిచో ఎవరింట్లో వారు రామనామ జపంచేసి సుఖశాంతుల్ని పొందవచ్చు.

రామచంద్రుని అనుగ్రహం మన అందరిపై ప్రసరించు గాక !

Thursday, 24 March 2016

ప్రసిద్ధస్త్రోత్రాలు : హనుమాన్ చాలీసా





ప్రసిద్ధస్త్రోత్రాలు : హనుమాన్ చాలీసా

శ్రీగురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారీ
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారీ ॥

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేశ వికార్ ॥

చౌపాయీ-

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహుం లోక ఉజాగర

రామ దూత అతులిత బల ధామా | అంజనిపుత్ర పవనసుత నామా

మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ

కంచన వరణ విరాజ సువేసా | కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై | కాంధే మూంజ జనేఊ సాజై

శంకర సువన కేసరీనందన | తేజ ప్రతాప మహా జగ వందన

విద్యావాన గుణీ అతిచాతుర | రామ కాజ కరివే కో ఆతుర

ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామ లఖన సీతా మన బసియా

సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా | వికట రూప ధరి లంక జరావా

భీమ రూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సవారే

లాయ సజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉర లాయే 

రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరత సమ భాయీ

సహస వదన తుమ్హరో యస గావైఁ | అస కహి శ్రీపతి కంఠ లగావైఁ

సనకాదిక బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిక్పాల జహా తే | కవి కోవిద కహి సకే కహా తే

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా | రామ మిలాయ రాజ పద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ | లీల్యో త్సాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ | జలధి లాంఘి గయే అచరజ నాహీఁ

దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ దుఆరే తుమ రఖవారే |హోత న ఆజ్ఞా బిను పైసారే

సబ సుఖ లహై తుమ్హారీ శరణా | తుమ రక్షక కాహూ కో డర నా 

ఆపన తేజ సంహారో ఆపై | తీనోఁ లోక హాంక తేఁ కాంపై

భూత పిశాచ నికట నహిఁ ఆవై | మహావీర జబ నామ సునావై

నాసై రోగ హరై సబ పీరా | జపత నిరంతర హనుమత వీరా

సంకటసే హనుమాన ఛుడావై | మన క్రమ వచన ధ్యాన జో లావై

సబ పర రామ తపస్వీ రాజా | తిన కే కాజ సకల తుమ సాజా

ఔర మనోరథ జో కోయీ లావై |తాసు అమిత జీవన ఫల పావై

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా | హై ప్రసిద్ధ జగత ఉజియారా

సాధు సంత కే తుమ రఖవారే | అసుర నికందన రామ దులారే

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా | అస వర దీన్హా జానకీ మాతా

రామ రసాయన తుమ్హరే పాసా | సదా రహో రఘుపతి కే దాసా

తుమ్హరే భజన రామ కో పావై | జన్మ జన్మ కే దుఖ బిసరావై

అంత కాల రఘుపతి పుర జాయీ | జహాఁ జన్మ హరిభక్త కహాయీ

ఔర దేవతా చిత్త న ధరయీ | హనుమత సేయి సర్వ సుఖ కరయీ

సంకట కటై మిటై సబ పీరా | జో సుమిరై హనుమత బలవీరా

జై జై జై హనుమాన గోసాయీఁ | కృపా కరో గురు దేవ కీ నాయీఁ

యహ శత వార పాఠ కర కోయీ | ఛూటహి బంది మహా సుఖ హోయీ

జో యహ పఢై హనుమాన చాలీసా | హోయ సిద్ధి సాఖీ గౌరీసా

తులసీదాస సదా హరి చేరా | కీజై నాథ హృదయ మహ డేరా

దోహా-
పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్

శంకరవాణి : సౌందర్యలహరి 35


శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 4



1  ప్రశ్న:  సౌందర్యలహరిని ప్రతిరోజూ 1008 సార్లు చదవవలసి ఉందా? లేక చదవగలిగినన్ని సార్లు మాత్రం చదివితే పరవాలేదా?
జవాబు:  ప్రతిదినమూ ఎన్నిసార్లు చదువగలిగితే అన్నిసార్లు చదవవచ్చును.

 2  ప్రశ్న:  నా వంటి విద్యార్ధినులు సౌందర్యలహరి చదవవచ్చునా?
జవాబు:  సౌందర్యలహరి స్త్రీలు , పురుషులు , పిల్లలు అందరూ చదవవచ్చును.

 3  ప్రశ్న:  వివాహం కాని ఆడపిల్లలు శ్రీ ఆంజనేయస్వామిని తాకి అర్చించవచ్చునా?
జవాబు:  ఏ దేవతా మూర్తినీ తాకి అర్చించకూడదు.


 4  ప్రశ్న:   పురుషులు దీపం వెలిగించటం , ఆర్పటం చేయవచ్చునా?
జవాబు:  పురుషులు దీపం వెలిగించవచ్చును , ఆర్పవచ్చును తప్పులేదు.


 5   ప్రశ్న:  మా కుటుంబంలో కొంత కాలంగా భార్యా భర్తల మధ్య కలహాలతో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటోది. నేను ఏ స్తోత్రం పఠిస్తే పరిస్థితి చక్కబడి భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది?
జవాబు:   సౌందర్యలహరిలో 35వ శ్లోకము పారాయణ చేయవలసి వుంది.


 మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ ।
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానన్దాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35 ॥

స్త్రీలవ్రతకథలు - కుంకుమగౌరి నోము కథ

                              
                                కుంకుమగౌరి నోము కథ

ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో బాలవితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయి అగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమికావలెను?  అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండునట్లు  చేయమని ప్రార్థించెను. అప్పుడాలోక జనని" ఓయీ బ్రాహ్మణోత్తమా!  నీ కుమార్తె పూర్వ జన్మమున  కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది , ఇప్పుడు ఆమెచేత ఆ నోము నోయించినచో ఆ కష్టము సంభవించదని " చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి ఆమెచే నోము నోయించి తరవాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉండెను.

ఉద్యాపన:  
పదమూడు భరిణెలనిండా కుంకుమ పోసి , నల్లపూసలు , లక్కజోళ్ళు , దక్షిణ తాంబూలములు పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయనము ఇవ్వవలెను.

స్త్రీలవ్రతకథలు - గడపగౌరి నోము కథ


 
                                        గడపగౌరి నోము కథ

గడపగౌరి నోము నోచిన పడతికి గడుపరానంతటి గండములుండవు , గౌరీశంకరుల కరుణకు కొదవుండదు. బడయగ లేనట్టి భాగ్యము లుండవు.అని పఠించి అక్షతలు ధరించవలెను.

విధానము:
 ఒక సంవత్సరము పొడుగునా ప్రతిదినము ఉదయము వేళ ఒక ఇంటి  గడపకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టవలెను , తరువాత ఉద్యాపనము చేయవలెను.

ఉద్యాపన:
పై విధముగా ఒక ఏడాది చేసిన పిమ్మట ఒక పళ్ళెములో  పదమూడు జతల గారెలు , ఒక క్రొత్తచీర , ఒక రవికెల గుడ్డ , మంగళసూత్రాలు , రూపు , మట్టెలు , పసుపు , కుంకుమ ఉంచి దక్షిణ తాంబూలములతో  ఒక  ముత్తైదువుకు  వాయనము ఇవ్వవలెను.

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 3


1  ప్రశ్న:  ఇంట్లో భారతం చదవకూడదు. చదివితే కలహాలు వస్తాయి. ఒకవేళ చదివినా మొదటి అధ్యాయం , చివరి అధ్యాయం మార్చి చదవవలెను , అంటున్నారు ఇది నమ్మవచ్చునా?
జవాబు:  ఇంట్లో భారతం మొదటి నుండి చివరి వరకు చదవవచ్చును.తప్పులేదు . భయపడవలసిన పనిలేదు.
 
2   ప్రశ్న:  స్త్రీలు శ్రీరుద్రం , శ్రీసూక్తం పఠించవచ్చునా?
జవాబు:   పఠించకూడదు.

3   ప్రశ్న:  మంగళవారం , శుక్రవారం  రాహుకాలం సమయంలో దేవాలయంలో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగిస్తారు కదా!  అదే విధంగా స్వంత ఇంట్లో కూడా పెట్టవచ్చునా?
జవాబు:  ఇంట్లో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగించకూడదు.


 4  ప్రశ్న:   బస్సు లేదా రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలికి చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు లలిత , గణేష్ , విష్ణు వంటి  ఏదో ఒక సహస్రనామమో , ఇతర శ్లోకాలో చెప్పవచ్చునా?
జవాబు:  భజన , నామజపం మొదలైనవి చేయవచ్చును. మిగిలినవి నియమ , నిష్ఠలతో చేయవలసి ఉంటుంది.


 5  ప్రశ్న:  భోజనం చేసేముందు దేవుడిని ప్రార్థిస్తూ ఏశ్లోకం పఠించవలెను?
జవాబు:   " అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
                      జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ "

 

Wednesday, 23 March 2016

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 2


1  ప్రశ్న:   ఏయే రోజు , ఏయే దేవతారాధనకు అనుకూలమైనదో తెలియజేయగోరతాను?
 జవాబు:   ఆదివారం - సూర్యునికి
                    సోమవారం - శివునికి
                     మంగళవారం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి
                      బుధవారం - విష్ణువునకు
                       గురువారం - నవగ్రహములకు
                       శుక్రవారం - అమ్మవారికి
                        శనివారం - శ్రీ మహా విష్ణువుకు.


  2  ప్రశ్న:   ఇంట్లో ఉండదగిన , ఇంటిని సుసంపన్నం చేయగలిగిన వస్తువులు ఏవి?
      జవాబు:  1 - కుడివైపు తిరిగి ఉన్న శంఖము
                        2- ఆవు
                         3 - ఏక ముఖ రుద్రాక్ష
                          4 - తులసి కోట

 
  3  ప్రశ్న:   అవసర కార్యం మీదో లేదా ఇతర పనుల మీదో బయటికి    వెళుతున్నప్పుడు మేము పఠించవలసిన శ్లోకము ఏమిటి?
       జవాబు:  విష్ణుసహస్రనామంలో వస్తుంది.
              " వనమాలీ గదీ శార్జ్గీశంఖీచక్రీ చ నందకీ|
                  శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు||"

 
  4  ప్రశ్న:  ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖము చూస్తే మంచిది?
       జవాబు:  ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దము , ఆవు , తల్లిదండ్రుల ముఖం   చూస్తే మంచిది. వివాహమైన పురుషులు భార్య ముఖం చూడవచ్చు.

   5  ప్రశ్న:  ఇక్కడ కొందరు జ్యోతిష్కులు " యమగండం" మంచి సమయమే అని , ఆ సమయంలో శుభకార్యాలు చేయవచ్చునని  చెపుతున్నారు సరియేనా?
      జవాబు:  రాహుకాలం , యమగండం - ఈ సమయాలలో శుభకార్యాలు చేయకూడదు , ఆరంభించనూ కూడదు.

శంకరస్తోత్రాలు : శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్




॥ శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రమ్॥

విశుద్ధం పరం సచ్చిదానన్దరూపమ్
గుణాధారమాధారహీనం వరేణ్యమ్ ।
మహాన్తం విభాన్తం గుహాన్తం గుణాన్తం
సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే ॥ 1 ॥

విశుద్ధుడును , మాయాతీతుడును , సత్తామాత్రుడును , సచ్చిదానందరూపుడును , గుణాధారుడును , ఆధారహీనుడును , శ్రేష్ఠుడును , అఖండముగా వెలుగుచుండువాడును , బుద్ధికి అతీతుడును , గుణములకు అంతమందుండువాడును , సుఖ స్థానమైనవాడును , స్వయంజ్యోతి రూపుడును అగు రాముని చేరుచున్నాను.

శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం
సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ ।
మహేశం కలేశం సురేశం పరేశం
నరేశం నిరీశం మహీశం ప్రపద్యే ॥ 2 ॥

మంగళకరుడును , నిత్యుడును , సజాతీయాది భేద త్రయ రహితుడును , సర్వవ్యాపకుడును , తారక నాముడును (నామ జపము చేసిన వారిని తరింపజేయువాడు) , సుఖరూపుడును , ఆనంద భిన్నమైన ఆకారము లేనివాడును , మిక్కిలి మాననీయుడును(పూజ్యుడు) , మహేశ్వరుడును , సర్వ కళలకు ప్రభువును , దేవతలకును ప్రభువగువాడును , పరమేశ్వరుడును , సర్వజనాధిపతియు , ఈ భూమికంతకూ ప్రభువగు వాడును అగు శ్రీరాముని చేరుచున్నాను.

యదావర్ణయత్కర్ణమూలేఽన్తకాలే
శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ ।
తదేకం పరం తారకబ్రహ్మరూపం
భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహమ్ ॥ 3 ॥

శివుడు కాశీలో ప్రాణుల మరణ సమయమున చెవిలో రామరామరామ అని చెప్పునట్టి ఆ ఏకైక తారక బ్రహ్మ రూపమైన రామునే ఎల్లకాలమునూ సేవింతును.

మహారత్నపీఠే శుభే కల్పమూలే
సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ ।
సదా జానకీలక్ష్మణోపేతమేకం
సదా రామచన్ద్రమ్ భజేఽహం భజేఽహమ్॥ 4 ॥

మంగళకరమైన కల్పవృక్షము మొదట సుఖముగా కూర్చుండి వేయి సూర్యులవలే ప్రకాశించుచూ నిత్యము సీతా లక్ష్మణ సమేతుడైయుండు నా రామచంద్రుని నిత్యము సేవించెదను.

క్వణద్రత్నమన్జీరపాదారవిన్దమ్
లసన్మేఖలాచారుపీతామ్బరాఢ్యమ్ ।
మహారత్నహారోల్లసత్కౌస్తుభాఙ్గం
నదచ్చఞ్చరీమఞ్జరీలోలమాలమ్ ॥ 5 ॥

లసచ్చన్ద్రికాస్మేరశోణాధరాభమ్
సముద్యత్పతఙ్గేన్దుకోటిప్రకాశమ్ ।
నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న-
స్ఫురత్కాన్తినీరాజనారాధితాన్ఘ్రిమ్ ॥ 6 ॥

పురః ప్రాఞ్జలీనాఞ్జనేయాదిభక్తాన్
స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ ।
భజేఽహం భజేఽహం సదా రామచన్ద్రం
త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే ॥ 7 ॥

శ్రీ రామచంద్రా ! నీ పద్మములవంటి పాదములు మ్రోయుచున్న రత్నపుటందెలతో ఎంత ఆకర్షకములుగా నున్నవి? కటి స్థలము తళతళలాడు మొలత్రాడుతో  బిగించిన పీతాంబరముతో ప్రకాశించుచున్నది. నీ వక్షస్థలము గొప్ప గొప్ప రత్నహారములతోనూ, కౌస్తుభమణితోనూ , పూగుత్తుల వంటి రొద చేయుచూ ముసురుచున్న తుమ్మెదలు గల పూలదండలతోనూ , దర్శనీయముగానూ ఉన్నది. నీ చిరునవ్వు వెన్నెలవలే మెరయు చున్నది.క్రింది పెదవి ఎఱ్ఱని కాంతి కలదై యొప్పుచున్నది. ఉదయించుచున్న కోటి సూర్య చంద్రుల కాంతితో వెలుగుచున్నాడవు. తలలు వంచి నమస్కరించుచున్న బ్రహ్మాది దేవతల కిరీటముల యందలి రత్నకాంతులు నీ పాదములకు నీరాజనములుగా నున్నవి . ఎదుట దోయి లొగ్గి ప్రార్థించుచూ నిలిచియున్న ఆంజనేయాది భక్తులకు మంగళకరమైన చిన్ముద్రతో (చూపుడు వ్రేలు బొటన వ్రేలు కలిపి పట్టిన ముద్ర) జ్ఞానబోధ చేయుచున్న ఓ రామా! నేనెల్లప్పుడును నిన్నే కొలుతును . నిన్ను కాక మరొకరిని తలపనే తలపను. ముమ్మాటికినీ తలపను.

యదా మత్సమీపం కృతాన్తః సమేత్య
ప్రచణ్డప్రతాపైర్భటైర్భీషయేన్మామ్ ।
తదావిష్కరోషి త్వదీయం స్వరూపం
తదాపత్ప్రణాశం సకోదణ్డబాణమ్ ॥ 8 ॥

ఓ స్వామీ ! యముడు మహా భయంకరులైన తన దూతలచేత నన్ను పలకరింపబూనినపుడు సజ్జనుల ఆపదలుబాప బూని ధనుర్బాణములు పూనియున్న నీ దివ్య రూపమును నాకు చూపుదువుగాక.

నిజే మానసే మన్దిరే సంనిధేహి
ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ।
ససౌమిత్రిణా కైకేయీనన్దనేన
స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన ॥ 9 ॥

భరత శత్రుఘ్న లక్ష్మణులచే మిక్కిలి భక్తి శ్రద్ధలతో సేవింపబడుచున్న ఓ రామచంద్రమూర్తీ ! నా యెడల ప్రసన్నుడవై నా మనోమందిరమున నిలువుమయ్యా!

స్వభక్తాగ్రగణ్యైః కపీశైర్మహీశై-
రనీకైరనేకైశ్చ రామ ప్రసీద।
నమస్తే నమోఽస్త్వీశ రామ ప్రసీద
ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ ॥ 10 ॥

నీ భక్తులలో మొదట లెక్కింపదగిన వారైన వానరాధిపతులతోను భూపతులతోను అనేకాక్షౌహిణీ సేనలతోను కూడుకొని యున్న ఓ రామచంద్రా! నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నా యెడల సుప్రసన్నుడవై తగిన విధముగా నన్ను నడిపింపుము. శాసింపుము.

త్వమేవాసి దైవం పరం మే యదేకం
సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే ।
యతోఽభూదమేయం వియద్వాయుతేజో-
జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ ॥ 11 ॥

ఏ చైతన్యము వలన ఇంతని లెక్కవేయ శక్యము కానిదియూ పంచభూతాత్మకమైనదియూనైన చరాచర జగత్తును ఓషధులును , అన్నమునూ మొదలైనవి పుట్టెనో ఆ చైతన్యము నీవే. వేఱు కాదు. అన్నిటికంటెనూ పైనున్న అద్వితీయమైన దైవమును నీవే.

నమః సచ్చిదానన్దరూపాయ తస్మై
నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ ।
నమో జానకీజీవితేశాయ తుభ్యం
నమః పుణ్డరీకాయతాక్షాయ తుభ్యమ్ ॥ 12 ॥

సచ్చిదానంద రూపుడవును తత్త్వరూపుడవు అయిన రామా! ఓ దేవదేవా! నీకు వందనము. జానకీ జీవిత నాథుడవైన రామా! పద్మములవలె విశాలమైన నయనములు కలవాడా! నీకు నమస్కారము.

నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం
నమః పుణ్యపుఞ్జైకలభ్యాయ తుభ్యమ్ ।
నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే
నమః సున్దరాయేన్దిరావల్లభాయ ॥ 13 ॥

భక్తులను ప్రేమతో రక్షించునీకు వందనము. పుణ్యరాశులకు మాత్రమే దొరకునట్టి నీకు నమస్కారము. వేదముల చేత మాత్రమే తెలిసికొనదగిన ఆది పురుషుడవైన నీకు నతులు. లక్ష్మీవల్లభుడవును సుందరుడవును అగు నీకు నమస్సులు.

నమో విశ్వకర్త్రే నమో విశ్వహర్త్రే
నమో విశ్వభోక్త్రే నమో విశ్వమాత్రే ।
నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే
నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే ॥ 14 ॥

స్వామీ యీ విశ్వమును నిర్మించువాడవు హరించువాడవును నీవే. ఈ జగత్తును అనుభవించు వాడవును దీని పరిమాణమును తెలిసికొన గలవాడవును నీవే. ఈ విశ్వమునకు నాయకుడవుగాని జయించువాడవుగాని నీవే. ఈ సర్వ జగత్తునకును నీవే తండ్రివి . నీవే తల్లివి. అట్టి నీకు పునః పునః వందనములు.

శిలాపి త్వదన్ఘ్రిక్షమాసఙ్గిరేణు-
ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ ।
నరస్త్వత్పదద్వన్ద్వసేవావిధానా-
త్సుచైతన్యమేతేతి కిం చిత్రమద్య ॥ 15 ॥

నీ పాద పద్మములనందలి భూరేణువుల అనుగ్రహము వలన రాయికూడ చైతన్యము పొందియుండగా నీ పాదపద్మారాధన వలన నరుడు చైతన్యమును పొందుననుటలో వింత ఏమి కలదు?
 
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం
నరా యే స్మరన్త్యన్వహం రామచన్ద్ర ।
భవన్తం భవాన్తం భరన్తం భజన్తో
లభన్తే కృతాన్తం న పశ్యన్త్యతోఽన్తే ॥ 16 ॥

పవిత్రమును విచిత్రమునునైన నీ చరిత్రమును నిత్యము స్మరించుచు సంసారాంతకుడవును జగద్భారమును వహించువాడవు అయిన నిన్ను సేవించు జనులు అనేక శుభములను పొందుదురు. మరణ కాలమున యముని చూడరు. అనగా పుణ్యలోకములను పొందెదరని భావము.

స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం
నరో వేద యో దేవచూడామణిం త్వామ్ ।
సదాకారమేకం చిదానన్దరూపం
మనోవాగగమ్యం పరన్ధామ రామ ॥ 17 ॥

ఓ  రామా! ఏ మానవుడు దేవతా శ్రేష్ఠుడవైన నిన్ను సద్రూపమైనదియును , చిద్రూపమైనదియును , అద్వితీయమును , ఆనందరూపమును , వాక్కునకుగాని , మనస్సునకుగాని , అందనిదియును సర్వతత్త్వాతీతమైన పరమ తేజమునుగా గ్రహించునో వాడే పుణ్యాత్ముడు. వాడే ఉత్తముడుగా గణింపదగినవాడు. అతడే నాకు శరణమంద దగినవాడు.

ప్రచణ్డప్రతాపప్రభావాభిభూత-
ప్రభూతారివీర ప్రభో రామచన్ద్ర ।
బలం తే కథం వర్ణ్యతేఽతీవ బాల్యే
యతోఽఖణ్డి చణ్డీశకోదణ్డదణ్డః ॥ 18 ॥

తీక్ష్ణమైన్ ప్రతాప ప్రభావము చేత గొప్ప గొప్ప శత్రువులను నిర్జించిన ఓ రామచంద్రప్రభూ! ఎవ్వరికిని కదల్పరాని శివధనుస్సును బాల్యముననే ముక్కలు చేసిన నీ బలమును ఎట్లు వర్ణింపగలను?

దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం
సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ ।
భవన్తం వినా రామ వీరో నరో వా
ఽసురో వాఽమరో వా జయేత్కస్త్రిలోక్యామ్ ॥ 19 ॥

ఓ రామమూర్తీ ! చుట్టును సముద్రముతో నున్న దుర్గమున అనేక రాక్షసాక్షౌహిణీ ప్రభువై యుగ్రుడైయున్న దశగ్రీవుని సపుత్త్ర మిత్రముగా నీవుగాక యీ మూడులోకములయందునూ , ఏ నరుడుగాని , అసురుడుగాని , అమరుడుగాని , చంపగలడా?

సదా రామ రామేతి రామామృతం తే
సదారామమానన్దనిష్యన్దకన్దమ్ ।
పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం
హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ ॥ 20 ॥

సజ్జనులకు సుఖకరమైనదై ఆనందరసమును ప్రవహింపచేయు దుంపయనదగు రామనామమను అమృతమును నిత్యము గ్రోలుచు , ఆనందమగ్నుడై నమ్రుడగుచు దంత కాంతు లెసగనవ్వుచు నుండెడి హనుమంతుని నిరంతరము నా మనమున కొలుతును.

సదా రామ రామేతి రామామృతమ్ తే
సదారామమానన్దనిష్యన్దకన్దమ్ ।
పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో-
ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ ॥ 21 ॥

ఓ రామా! నిత్యమును సజ్జనాశ్రయమైనదియును , ఆనంద ప్రవాహమునకు మూలకారణమైనదియు అయిన రామ రామ యను నీనామామృతమును ప్రతిదినమును త్రావుచున్న నాకు నీ అనుగ్రహము వలన మృత్యుభయమే లేకుండెను.

అసీతాసమేతైరకోదణ్డభూశై-
రసౌమిత్రివన్ద్యైరచణ్డప్రతాపైః ।
అలఙ్కేశకాలైరసుగ్రీవమిత్రై-
రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥ 22 ॥

సీతాసమేతమును , కోదండభూషితమును , లక్ష్మణాభివందితమును , తీవ్రప్రతాపయుతమును , రావణాంతకమును , సుగ్రీవ సఖమును , రామ సంజ్ఞితమును గాని ఇతర దైవతములతో మాకేమిపని రాముని తక్క ఇతరదైవమును సేవింపనని భావము.

అవీరాసనస్థైరచిన్ముద్రికాఢ్యై-
రభక్తాఞ్జనేయాదితత్త్వప్రకాశైః ।
అమన్దారమూలైరమన్దారమాలై-
రరామాభిధేయైరలమ్ దేవతైర్నః ॥ 23 ॥

వీరాసనము వేయని , చిన్ముద్ర వహించని , భక్తులగు ఆంజనేయాదులకు తత్త్వప్రకాశము చేయని మందారమూల ముందుండని , మందారమాలలేని రామ సంజ్ఞితము కాని అన్య దేవతలతో మాకేమి పని ? పై లక్షణము కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.

అసిన్ధుప్రకోపైరవన్ద్యప్రతాపై-
రబన్ధుప్రయాణైరమన్దస్మితాఢ్యైః ।
అదణ్డప్రవాసైరఖణ్డప్రబోధై-
రరామభిదేయైరలమ్ దేవతైర్నః ॥ 24 ॥

సముద్రమునందు కోపము , జూపజాలని , నమస్కరింపదగిన ప్రతాపము లేని , బంధువుల యిండ్లకు వలె ప్రజల గృహములకు వెళ్ళి క్షేమము తెలిసి కొనని , మందహాస సుందరము కాని , పితృవాక్య పరిపాలనా వ్యాజమున లోకమునకు మార్గదర్శకముగా దండక ప్రవాసము సేయజాలని , అఖండ జ్ఞాన విశేషము లేని రామ సంజ్ఞితముగాని యితర దైవములతో మాకేమిపని? పై లక్షణములు కలిగిన రాముడే మాకు దైవమని తాత్పర్యము.

హరే రామ సీతాపతే రావణారే
ఖరారే మురారేఽసురారే పరేతి ।
లపన్తం నయన్తం సదాకాలమేవ
సమాలోకయాలోకయాశేషబన్ధో ॥ 25 ॥

హరే! రామ! సీతానాయక! రావణాంతకా! ఖరహంతకా! మురాసురాంతకా! రాక్షసనాశకా! పరమపురుషా! అని ఎప్పుడును స్మరించుకొనుచు ఇట్లు కాలము గడుపు నన్ను చూడుము. ఓ జగద్బాంధవా నన్ను కరుణింపుము.

నమస్తే సుమిత్రాసుపుత్రాభివన్ద్య
నమస్తే సదా కైకయీనన్దనేడ్య ।
నమస్తే సదా వానరాధీశవన్ద్య
నమస్తే నమస్తే సదా రామచన్ద్ర ॥ 26 ॥

సుమిత్రా పుత్రునిచే నమస్కరింపబడుచుండువాడా! కైకేయీ కుమారునిచే స్తుతింపబడువాడా! వానరేంద్రునిచే అభివందితుడవగుచుండువాడా! ఓ రామచంద్రా! నీకు పునః పునః అభివందనములు.
 
ప్రసీద ప్రసీద ప్రచణ్డప్రతాప
ప్రసీద ప్రసీద ప్రచణ్డారికాల ।
ప్రసీద ప్రసీద ప్రపన్నానుకమ్పిన్
ప్రసీద ప్రసీద ప్రభో రామచన్ద్ర ॥ 27 ॥

అతి తీక్ష్ణ్ం అయిన ప్రతాపము గల ఓ రామమూర్తీ! శత్రువులకు ఘోరమృత్యువైనవాడా! శరణాగతులను దయచూచు ఓ స్వామీ! నా యెడ గడుంగడు ప్రసన్నుడవగువయ్యా.

భుజఙ్గప్రయాతం పరం వేదసారం
ముదా రామచన్ద్రస్య భక్త్యా చ నిత్యమ్ ।
పఠన్ సన్తతం చిన్తయన్ స్వాన్తరఙ్గే
స ఏవ స్వయమ్ రామచన్ద్రః స ధన్యః ॥ 28 ॥

వేద సారమును ఉత్తమము అగు ఈ రామభుజంగ ప్రయాత స్తవరాజమును భక్తితో సంతోషముతో నిత్యమును పఠించుచూ ఈ స్తోత్రమును మనస్సునందు నిరంతరమును మననము చేయునట్టివాడు కడుంగడు ధన్యుడు. అతడు స్వయముగా శ్రీ రామచంద్ర స్వరూపుడే అగును.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీరామభుజఙ్గప్రయాతస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

శంకరవాణి : శివపఞ్చాక్షరస్తోత్రమ్ (కేవలం స్తోత్రం)



తాత్పర్యములకై చూడండి :  http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_34.html

శంకరవాణి : జగద్గురువుల ఉపదేశాలు - 1


Tuesday, 22 March 2016

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 1



1  ప్రశ్న:   స్త్రీలు మంగళసూత్రం కట్టుకున్న త్రాడు ఎన్నాళ్ళకి ఒకసారి మార్చి కొత్తది కట్టుకొనవలెను?
వాబు:    మాంగల్యం కట్టిన పసుపు త్రాటిలో ఒక నూలు పోగు పోయినాసరే , శని , మంగళవారాలు కాకుండా మిగిలిన రోజులలో రాహుకాలం , మరణయోగం , లేకుండా మంచి సమయం చూసి క్రొత్త పసుపు త్రాడు కట్టుకొనవలెను.
( మాంగల్యం పసుపుత్రాడులో కట్టుకొనటమే విశేషము)



2   ప్రశ్న:   స్త్రీలు రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ వినాయకునికి నమస్కరించవచ్చునా?

జవాబు:    రెండు చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నట్టు భావన చేస్తూ స్త్రీలు నమస్కరించవచ్చును.


3 ప్రశ్న:  సుమంగళి స్త్రీలు చందనం పెట్టుకోవచ్చునా?
జవాబు:  నుదుట కుంకుమ పెట్టుకుని దానిపైన చిన్నగా విభూతి పెట్టుకొనవచ్చును. చందనం కంఠానికి రాసుకోవలెను.


4 ప్రశ్న:  భర్త , పిల్లల ఆరోగ్యం , కుటుంబ క్షేమం కొరకు గృహిణి వారానికి ఒక రోజు ఏ దేవతకి పూజ చేస్తే మంచిది?
 జవాబు:   శుక్రవారం అమ్మవారి పూజ చేయవలెను . దేవాలయంలో పరాశక్తి అర్చన చేయవలెను . క్షేమం కలుగుతుంది.


 5  ప్రశ్న:  కుటుంబంలో దారిద్ర్యం తీరి పిల్లలకు వివాహాలు కావడానికి నేను ఏ స్తోత్రాలు చదవాలి?
  జవాబు: మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసిన స్తోత్రం
" విదేహి దేవి కళ్యాణం విదేహి పరమం శుభం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి!"

శ్రీరామకర్ణామృతము : వామే భూమిసుతా



వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో ర్వాయ్వాదికోణేష్వపి |
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలమ్ ||
(శ్ర్రీరామకర్ణామృతం 1:28)

ఎడమవైపున సీత, ఎదురుగా హనుమంతుడు, వెనుకన లక్ష్మణుడు, ప్రక్కల భరత శతృఘ్నులు, వాయవ్యాది మూలల (దిక్కులయందు) సుగ్రీవ, విభీషణ, అంగద, జాంబవంతులు ఉండగా మధ్యమందు నల్లకలువవలె సుందరమైన కాంతికల రాముని సేవించుచున్నాను.

త్యాగరాజకృతి - సుజన జీవన సుగుణభూషణ రామ




సుజన జీవన సుగుణభూషణ రామ
కమాస్‌ - రూపకము
పల్లవి:
సుజన జీవన సుగుణభూషణ రామ ॥సు॥

అను పల్లవి:
భుజగభూషణార్చిత బుధజనావనా
అజవందిత శ్రితచందన దశతురంగ మామవ ॥సు॥

చరణము(లు):
చారునేత్ర శ్రీకళత్ర శ్రీరమ్యగాత్ర
తారకనామ సుచరిత్ర దశరథపుత్ర
తారకాధిపానన ధర్మపాలక
తారయ రఘువర నిర్మల త్యాగరాజసన్నుత ॥సు॥

త్యాగరాజకృతి - సొగసుఁ జూడఁదరమా




కన్నడ గౌళ – రూపక

పల్లవి:

సొగసుఁ జూడఁదరమా నీ సొ..

అను పల్లవి:

నిగనిగమనుచుఁ గపోలయుగముచే మెఱయు మోము సొ..

చరణము(లు):

అమరార్చిత పదయుగమో
అభయప్రద కరయుగమో
కమనీయ తనునిందిత కామ
కామరిపునుత నీ సొ..

వరబింబ సమాధరమో
వకుళ సుమంబుల యురమో
కర ధృతశర కోదండ
మరకతాంగవరమైన సొ..

చిఱునవ్వో ముంగురులో
మఱి కన్నులతేటో
వర త్యాగరాజార్చిత
వందనీయ ఇటువంటి సొ..

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.