భక్తి మార్గము, జ్ఞాన మార్గము
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-5
"ఈ జగత్తంతా మిధ్య , నిర్గుణనిశ్చల పరబ్రహ్మమైన శివమే ఏకైక సత్యము, తక్కినదంతా మాయ", ఇదీ ఆచార్యుల సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును ఆచార్యులు తమ వాదనల ద్వారా, రచనలద్వారా వ్యాఖ్యానముల ద్వారా బోధించారు. తమ లక్ష్యము - నిర్గుణనిశ్చల పరబ్రహ్మము. "బ్రహ్మమును స్పందింపచేసే శక్తి" అను భావనను వారు తీవ్రంగా వ్యతిరేకించి దానిని మాయగా త్రోసిపుచ్చారు. కానీ ఈ స్త్రోత్రంలో వారు శక్తిని " నీవులేక శివుడు జగద్వ్యాపారమెలా సాగించగలడు ?" అని శ్లాఘిస్తున్నారు. శివుని స్పందింపజేసి అమ్మవారు ఈ జగత్తు నడవటానికి కారణమవుతున్నదనీ ఎంతో ఆనందంగా చెబుతున్నారు. "ఇదంతా నీ పనే తల్లీ" అంటున్నారు.
ఒక మనిషి ఇలా రెండు విధాలుగా మాట్లాడవచ్చునా ? ఏది సత్యం ? ఒకటి సత్యమైతే రెండవది అసత్యమా ? ఆచార్యులు ఇలా రెండు నాల్కలతో రెండు మాటలు మాట్లాడి ఉండవచ్చునా?
నిజానికి రెండూ సత్యమునే తెలియజేస్తున్నాయి.
అలా ఎలాగ సాధ్యమవుతుంది ? పరస్పర విరుద్ధముగా నున్న ప్రతిపాదనలు రెండూ సత్యములెలా అవుతాయి ?
తార్కికంగా రెండూ సత్యములు కాలేవు. కానీ సత్యము యొక్క లక్షణాలు ఎప్పుడూ తర్కముద్వారా నిరూపించలేము. ఆచార్యులు మనుష్యులను జ్ఞానమార్గములో వెళ్ళగలిగినవారు, భక్తిమార్గములో వెళ్ళేవారు అనే రెండు తరగతులుగా విభజిస్తున్నారు. - జ్ఞానమార్గములో వెళ్ళగలిగినవారికి తమ అద్వైత గ్రంథములద్వారా బోధిస్తున్నారు. భక్తిమార్గపరుల ఆధ్యాత్మిక ఉన్నతికోసం సౌందర్యలహరి వంటి స్తోత్రాలను రచించారు. పరిపక్వత చెంది, జగత్తుకు మూలవస్తువు తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తున్నవారిని బహురూపమైన ఈ జగత్తును తిరస్కరించమని చెబుతున్నారు. అలాగే శరీరాన్నీ, ఇంద్రియాలనూ, ఒకే వస్తువునుండి సుఖదుఃఖాలను పొందే మనస్సునూ తిరస్కరించి చైతన్యరహితమైన మూలపదార్థములో లయమవమని బోధిస్తున్నారు. ఇది జ్ఞానమార్గము.
ఈ ప్రాపంచిక విషయాలను వెంటనే వదలివేయలేని వారూ, జ్ఞానమార్గముగుండా వెళ్ళుటకు కావలసిన పరిపక్వత లేనివారూ ఉంటారు. ఆచార్యులవారు అటువంటి వారికి భక్తిమార్గముచూపుతున్నారు, అలా చూపుతూనే ఆ మార్గము లో వారు పరిపక్వత చెందే విధంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం ఈ క్షణంలో ప్రాపంచిక సుఖాలను, విషయాలనూ వదలివేయలేని కారణంచేత, అటువంటి వారు, సత్యవస్తువైన బ్రహ్మమును మరచిపోయి, ఇంద్రియభోగాలు, సుఖదుఃఖాల వలయంలో చిక్కుకుపోకూడదని ఆచార్యుల ఆరాటం. వారందరికీ ఆచార్యులు "ఆ సత్యవస్తువైన నిశ్చల బ్రహ్మమే శక్తితో కలసిన ఈశ్వరునిగా ఆవిర్భవించి ఈ జగత్తును పాలిస్తోంది" అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ ఈశ్వరుని లీలగా చూడమనీ, తమ మనస్సునూ ఇంద్రియాలనూ ఈశ్వర ధ్యానంలోనూ, పూజలోనూ, ఈశ్వరుని లీలలు వినుటలోనూ, స్తుతించుటలోనూ మమేకం చేయమని ఉద్బోధిస్తున్నారు. ఇలా సగుణబ్రహ్మమైన ఈశ్వరుని మనస్సు, ఇంద్రియాలతో పట్టుకున్నట్లైతే, భగవంతుడి కరుణతో ఈ విషయవాసనలు త్యజించగలిగి, నిర్గుణ నిశ్చల బ్రహ్మమును చేరుటకు కావలసిన పరిపక్వత పొందుతారు.
ఒక బక్కపలచని, ఎముకలగూడులాంటి బిడ్డడు అన్నం తిననని మారాం చేస్తున్నాడనుకోండి. వాళ్ళ తల్లి ఏం చేస్తుంది ? మంచి మాటలూ కథలూ చెబుతూ, పెరట్లోకి తీసుకువెళ్ళి చెట్టుకొమ్మపై కాకిని చూపుతూ కొంచెం పెద్దపెద్ద ముద్దలు పెడుతుంది. ఆ తల్లికి అజీర్తితో బాధపడే మరో బిడ్డడు ఉన్నాడనుకోండి. ఆమె ఇంకొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఆ పిల్లవానికి కావలసిన ఆహారం పెడుతుంది. మనం ఆ తల్లికి నిజాయితీ లేదనీ, పిల్లలను వేరువేరుగా చూస్తోందనీ అనగలమా ?
(సశేషం)