రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : సజ్జన సాంగత్యము
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)
శీలవృద్ధైర్జ్ఞానవృద్ధై ర్వయోవృద్ధైశ్చ సజ్జనైః |
కథయ న్నాస్తవై నిత్య మస్త్రయోగ్యాంతరేష్వపి ||
(అయోధ్యాకాండ తొలి సర్గ)
శ్రీరాముడు పెద్దలతో సహవాసము చేయుటలో చాలా ఆసక్తి చూపెడువాడు. పెద్దరికము మూడు రకములుగా ఉండును.
1. కొందరు శీలముచే అనగా స్వభావముచే పెద్దవారు.
2. కొందరు జ్ఞానముచే పెద్దవారు.
3. కొందరు వయసుచే పెద్దవారు.
మంచి నడువడి గలవారు , స్వభావము గలవారు శీలవృద్ధులు. వారితో కలిసి నడువడిని గూర్చి సూక్ష్మమైన విషయములను వారు చెప్పుచుండగా తెలిసికొనుచుండెడివాడు. తాను చెప్పుచుండెడివాడు. కొందరు భగవద్విషయమున జ్ఞానము కలిగి వేదాంత చర్చలు చేసెడివారు. వారితో కలిసి భగవంతుడి గూర్చి , వానిని పొందెడి ఉపాయమును గూర్చి , ఆత్మ స్వరూపమును గూర్చిచర్చించుచుండెడివాడు. కొందరు జ్ఞానము లేకపోయిననూ , నడవడి తెలియకపోయిననూ మంచివారు అంటే లోకమునకు హితమైన మనసు , మాట , స్వభావము కలవారు అట్టివారు సజ్జనులు. అట్టివారితో నున్నచో సహజముగా మంచితనము అలవడును. జ్ఞానము లేకపోయిననూ , నడువడి లేకపోయినను వయసుతో పెద్దలై మంచివారైన వారితో కూడా రాముడు ప్రసంగించుచుండెడివాడట. అట్టివారు లభించినపుడు తనకు అవకాశము లేదనిగాని , తాను అస్త్రాభ్యాసము చేయుచున్నాను కనుక విఘ్నము కలుగునని గాని ఆలోచించెడివాడుకాదట.
అట్టివారి సాంగత్యము లభించుటయే మహాభాగ్యము అని , అస్త్రవిద్యను నేర్చుకొనుటకు తగినట్టి సమయములో మధ్య వారు వచ్చినను సమయము లేదనక తన అభ్యాసమునకు విఘ్నమని భావించక వారితో మంచివిషయములను చర్చించుచుండెడివాడట. ఎన్నో చదివి నేర్చుకొనవలసిన విషయములను సత్పురుషుల సహవాసముచే నేర్చుకొనవచ్చును. అందుకే సజ్జన సాంగత్యము మానవునకు ప్రధానము.