Tuesday 19 July 2016

పరమాచార్యుల అమృతవాణి : గౌడపాదులు : శంకరాచార్యుల గురుపరంపర


పరమాచార్యుల అమృతవాణి : గౌడపాదులు
శంకరాచార్యుల గురుపరంపర
(జగద్గురుబోధలనుండి)

పతంజలి ఆదిశేషుని అవతారం. వ్యాకరణ మహాభాష్యం వ్రాసింది వీరే. అత్రిపుత్రులు కాబట్టి వీరికి ఆత్రేయులనీ, తల్లి గోణిక కాబట్టి గోణికా పుత్రులనీ వ్యవహారం. వీరు యోగశాస్త్రానికి సూత్రాలను, వ్యాకరణానికి మహాభాష్యమునూ, ఉపవేదమైన ఆయుర్వేదానికి చరకమునూ వ్రాసినందువల్ల మూడు శాస్తాలకు ఆచార్యులు. చరకానికి మరో పేరు ఆత్రేయసంహిత. ఆత్రేయుడు పతంజలే. ఇలా మనోవాక్కాయ శుద్దికి ఉపయోగించే శాస్త్రాలు వీరి సృష్టి. మనోవృత్తులను నియమించి చిత్తశుద్ధి కలిగించేది యోగశాస్త్రం. వాక్కును శుద్ధ మొనరించేది వ్యాకరణ శాస్త్రం. కాయశుద్ధికి-ఉపాయాలు చెప్పేది చరకమనే ఆయుర్వేద శాస్త్రం. ఈ రీతిగా త్రికరణములను శుద్ధి చేసికోడానికి ఉపయోగించే మూడు శాస్త్రాలు ఆయన రచన.

వేయి జిహ్వలు కల ఆ పతంజలి చెప్పిన వ్యాకరణ భాష్య ప్రశస్తి విని దానిని చదువుకొనడానికి వేయిమంది శిష్యులు వచ్చారు. పతంజలి చిదంబరంలో వేగాళ్ల మంటపంలో ఉన్నారు. వేయిమందికి ఒకేమారు సందేహనివారణం చేయవలెనంటే ఒక నాలుక ఏం చాలుతుంది? అందు కోసం వారు ఆదిశేషునిరూపం తాల్చారు. అయితే శేష దృష్టి విష దృష్టి, నిట్టూర్పులు విషం కక్కుతూ వుంటై. అవి సోకితే ఎవరయినా సరే చిటికలో చిటికెడు భస్మమైపోతారు. అందువల్ల ఆయన తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టారు. తెరలోపల తామూ తెర వెలుపల శిష్యులూ పాఠం చెపుతూ వుండగా నడుమ ఎవరు లేచి పోయినా సరే వారు బ్రహ్మరాక్షసులయిపోతారని పతంజలి ఒక కట్టడి చేశారు. బొమ్మ రాకాసులు పిశాచాలలో ఒక తెగ. రాక్షసులలో బ్రహ్మరక్షస్సులు అనేవారొక తెగ. వేదాధ్యయనం చక్కగా చేసి అల్పాయుష్కులై చనిపోయిన వారు వేదస్మృతితో పిశాచాలైపోతారు. వారే బొమ్మ రాకాసులు.

ఆజ్ఞ తీసుకొనకుండా బయటికి పోయినవాడు బొమ్మరాకాసి అయిపోతాడని కట్టడి చేసి పతంజలి ఆదిశేషుడై తెరలోపల కూర్చుండి పాఠం చెప్పడానికి పూనుకొన్నాడు. ఆ శిష్యులలో ఒకనికి మాత్రం సందేహం తోచింది - 'మనమేమో వేయిమందిమి, ఒక్కడు ఈ వేయి మందికీ ఎట్లా సమాధానం చెపుతాడు?' అని ఇట్లా అతడు సందేహించి ఆజ్ఞోల్లంఘనం చేసి తెర తొలగించి చూచాడు. అట్లా చూచాడో లేదో విషదృష్టి వారందరిమీదా ప్రసరించింది. అక్కడున్న శిష్యులందరూ పిడికెడుబూడిద అయిపోయారు. బూడిద అయిపోయిన వారు తొమ్మన్నూట తొంబది తొమ్మిది మంది. ఒకడు మాత్రం ఎక్కడికో వెళ్లాడు. అతగాడు కొంచెం బండబ్బాయి. అతనికి పాఠం తిన్నగా తెలియడం లేదు. కొంతసేపు అటూ ఇటూ తిరిగి వస్తే బుద్ధి స్థిరపడి పాఠం సరిగా అర్ధం అవుతుందేమో అని అనుకొని అతడు బయటికి వెళ్లాడు. ఇక్కడ భస్మమయి పోయిన శిష్యులను చూచిన ఆదిశేషుడు మళ్లా పతంజలియై వారి దుర్మరణానికి దుఃఖిస్తూవుండగా, వెలికి వెళ్ళిన శిష్యుడు - ''గురువుగారి ఆజ్ఞ మీరి బయటికి వెళ్ళితినే, గురువేమి కోపం తెచ్చుకుంటాడో'' అని బితుకు బితుకుమంటూ వచ్చాడు. పతంజలికి అతనిని చూడగానే సంతోషం కలిగింది. బండబ్బాయి అయితే అయినాడుకాని ఒకడయినా మిగిలాడుగదా అని ఊరటచెందాడు. ఇక అతనికి పాఠం చెప్పేటంత వ్యవధి తనకు లేదు. కాబట్టి అతనిని ఎట్లాగయినా అనుగ్రహించాలని - 'నాకు తెలిసినదంతా నీకు తెలియాలి. అయినా నా ఆజ్ఞ దాఁటి నీవు ఆవలికి వెళ్ళావు. కాబట్టి బ్రహ్మరాక్షసుడ వవటం నీకు తప్పదు. కాని దాని కొక నివృత్త్యుపాయం ఉన్నది. నే నిచ్చిన విద్యను పాత్రమెరిగి నీ వెపుడుపదేశిస్తావో అపుడు నీకీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని అన్నాడు. (ఈ విషయాలన్నీ దాదాపు ఇన్నూరెండ్ల క్రితం జానకీ పరిణయం మొదలయిన గ్రంథాలు వ్రాసిన రామభద్ర దీక్షితులు అనువారు పతంజలి చరితమ్‌ అనే గ్రంథంలో వ్రాశారు) అనుగృహీతుడయిన ఈ శిష్యుడే గౌడపాదులు. ఆయన గౌడదేశం నుంచి వచ్చారు. ఆయన గురుశాపంచేత బ్రహ్మరాక్షసుడై కూచున్నాడు.

బొమ్మరాకాసి ప్రతిదినమూ ఒక బ్రాహ్మణ్ణి వేదాధ్యయనం చేసినవాణ్ణి గుటకాయ స్వాహా చేస్తూ ఉంటాడు. ఒక శాఖను అధ్యయనం చేసిన వాణ్ణి దూరంగా ఎత్తుకొని పోయి పలు తీరుల ప్రశ్నలు వేయడమూ, వాళ్ళు ప్రత్యుత్తరించలేక పోవడమూ గుటకాయ స్వాహా చేయడమూ ఇది బొమ్మ రాకాసులకు మామూలు. బొమ్మరాకాసి అయిపోయిన గౌడుడు నర్మదాతీరంలో ఒక రావిచెట్టు మీద కూచున్నాడు. ఆ చోటు పంచగౌడ దేశాలకూ పంచద్రావిడ దేశాలకు నట్టనడుమ ఉన్నది. దక్షిణమునుండి ఉత్తరానికిన్నీ ఉత్తరము నుండి దక్షిణానికిన్నీ పోయేవారికి అది దారి. ఉత్తరదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు చదవబోయే దాక్షిణాత్యులున్నూ దక్షిణదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు నేర్వపోయే ఔత్తరాహులున్నూ అనుదినమూ ఆ దారిగుండానే రాకపోకలు చేస్తూవుండేవారు. గౌడులు ఆ వచ్చిపోయేవారిని వ్యాకరణంలో ఒక ప్రశ్న అడిగేది, వారు దానికి బదులు చెప్పలేకపోయేది, ఆ పళంగా వారిని చంపి ఫలాహారం చేసేది. ఇది వాడుక ఐపోయింది.  గౌడ బ్రహ్మరాక్షసుడువైయాకరణుడు ఎవడయినా కనబడితే 'పచ' ధాతువుకు నిష్ఠలో రూపం ఏమిటి? అని ప్రశ్నించేవాడు. 'పక్తం' అని సమాధానం వచ్చేది. ఎంచేత నంటే అప్పటికింకా మహాభాష్యం అవతరించలేదు. 'పచ' అనే ధాతువుకు నిష్ఠలో వేరు రూపం కలుగుతుందని తెలియని కాలం అది. 'పక్తమ్‌' అని చెప్పగానే - 'పక్తం కాదు; పక్వమ్‌, అని ఔతుంది, నీవు కూడా పక్వమనే అని అంటూ ఆబొమ్మరాకాసి వానిని గుటుక్కున నోట్లో వేసికోనేవాడు. ఇది గౌడుల దినచర్య.

ఇట్లా ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆ తోవన వచ్చాడు. చాలా చక్కగా ఉన్నాడు. బొమ్మరాకాసి అతనిని చూడంగానే ఉప్పొంగిపోయాడు. ఎంచేత? నాటికి మంచి ఆహారం దొరికిందీ ఇంకేం తన అస్త్రం తీశాడు. అతడు మహాభాష్యం శాంతిచేయడానికి కాశ్మీరం నుంచి చిందంబరం వెళుతున్నాడు. అతన్ని నిలేసి ఆ బొమ్మరకాసి 'పచ' ధాతువుకు క్త ప్రత్యయం చేరిస్తే ఏమిటిరూపం? అని అడిగాడు. అతడు 'పక్వమ్‌' అని చెప్పాడు. గౌడునకు అపరిమితమయిన ఆనందం కలిగింది. 'ఎన్నో నాళ్ళుగా సరియయినవాడొకడయినా రాలేదు, నేటికి అట్టి వాడవు నీవు వచ్చావు, నీవు సరియయిన శిష్యుడవు. నా గురువు గారు నాకు చెప్పిన విద్యలన్నీ నీకు చెపుతాను, నీ వెక్కడికి వెళుతున్నావు' అని అడగాడు. అతడు వ్యాకరణం చదువు కోడానికి చిదంబరం పోతున్నాను' అని చెప్పినాడు. 'నాయనా' అలాగా? చిదంబరం విషయం ఎపుడో కొండెక్కింది. అచట నీవు అభ్యసింపగోరే విద్యలను నేనే నీకు చెప్పగలను, నీ విక్కడ ఉండేం' అని గౌడులన్నారు.

బ్రహ్మరాక్షసుని గురువునుగా వరించి ఎవరు నెగ్గగలరు? దయ్యాలముందు బిడ్డలా? ఎనాళ్ళా బ్రహ్మరాక్షసుడు పాఠం చెబుతాడో అన్నాళ్ళూ చెట్టుదిగరాదుగదా, నిద్రాహారాలుండవు గదా, పాఠాలు రాక్షసివేగంతో ముగించాలిగదా! ఇవన్నీ ఇలా తెలిసినన్నీ శిష్యుడు విని అన్నింటికీ తల ఒగ్గాడు.

పాఠాలు వ్రాసికొందామంటే తాటాకులూ లేవు, గంట మంతకంటే లేదు. పైగా చెట్టు చివరమెట్టు మీద పాఠశాల. చెట్టు దిగకూడదు. అంచేత ఆ శిష్యుడు తన తొడ చీరుకొని అందుండి కారే నెత్తురులో ఒక పుడక కలముగా ముంచి రావాకులమీద ఆ బొమ్మరాకాసి చెప్పేదంతా వ్రాసికోవడం సాగించాడు. ఇలా తొమ్మిది రోజులు నిద్రాహారాలు లేక గడచినవి. ఆ రావియాకులలో ఆ శిష్యుడు వ్రాసికొన్న పాఠమే మహాభాష్యం. ఆ శిష్యుని పేరు చంద్రశర్మ. ఈ కథ పతంజలి విజయం అనే పుస్తకంలో చూపబడుతుంది. పతంజలియే తన శిష్యుడయిన గౌడునికి శాపవిమోచనం చేయడానికి చంద్రశర్మగా వచ్చినటులు ఆ గ్రంథంలో చదువుతాం.

చంద్రశర్మ వ్యాకరణం పూర్తిగా అయింది. గౌడులకు శాపనివృత్తి అయింది. 'నాకిక వైరాగ్యం శరణ్యం, ఆత్మను ధ్యానించాలి. దానిని తెలుసుకోవడానికి ఉత్తముడైన గురువును అన్వేషించాలి' అని గౌడపాదులు ఆలోచించి ఆలోచించి సమకాలికులలో అట్టివారు, జన్మతోనే జీవన్ముక్తలయినవారు ఎవరా అని తఱచిచూడగా శుకాచార్యులు అని అనుకొన్నారు. శుకులు పుట్టుకతోనే ఆత్మజ్ఞాని. యత్నమే లేదు. యజ్ఞాద్యనుష్టానాలు అంతకు ముందే లేవు.

శ్రీ శుకాచార్యులవారు హిమాలయములో బదిరాకశ్రమంలో ఉన్నారని తెలిసికొన్నారు. తెలిసికొని వారి కడకు వెళ్లారు. వారి దగ్గర సన్న్యాసం పుచ్చుకొన్నారు. అపుడు వారు గౌడపాదాచార్యులు అని పేరు పడ్డారు. ఆచార్య పరంపరలో వీ రొకరు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.