పరమాచార్యుల అమృతవాణి : పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు
(జగద్గురుబోధలనుండి)
'సర్వేవేదా యత్పద మామనంతి' మనము శ్రుతుల నుండి ఒక విషయాన్ని శివభక్తి తెలిసికొంటున్నాము. అదేమిటి? ఒక వేదాలేకాక ఋషులూ, మునులూ, జ్ఞానులూ, యోగులూ, అందరూ ఏవస్తువును పొందగోరి దేనిని వెతుకుతున్నారో ఆ వస్తువేది? అది ఓంకారము. ఈ ఓంకారమును మాండూక్యము విరివిగానూ స్పష్టంగానూ చెప్పింది - 'శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా స విజ్ఞేయః' అని అనగా ఆ బ్రహ్మము శాంతమూ శివమూ. అంతేకాక అద్వయమైన విశ్వతైజపప్రాజ్ఞులకు మీదివస్తువూ అదియే; అట్టి ఆ ఆత్మ ఎరుగదగినదీ అని :
'విద్యాను శ్రుతి రుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ,
తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇత్యక్షరద్వయమ్
వేదములో యజుర్వేదము మేలుబంతి. యజుర్వేదములో నాలుగవ కాండలో రుద్రము ఉండుటవల్ల నాలుగవ ప్రశ్నముదానికి మిక్కిలి. రుద్రము మధ్య పంచాక్షరి దాని కంటె దొడ్డది. ఆ పంచాక్షరిలోనూ రెండు అక్షరము లిను మిక్కిలి. ఆ అక్షరములు శివ అనునవి. ఈ అక్షరద్వయము జీవరత్నమని శ్రీమదప్పయ్య దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో ఇట్లా చెప్పారు :
యజ్జీవరత్న మఖిలాగమ లాలనీయం
యే చ త్రినేత్ర మృడ శంకర నామధేయైః,
ఏతై రపి స్ఫుట మనన్యసమాశ్రయం తే
విఖ్యాప్యతే సకల జీవ సుఖ ప్రదత్వమ్.
అట్టి పరమమంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయగోరేవారు చేయవలసిన పని ఏమిటి? మొదటిది విభూతిథారణ. విభూతి అనగా ఐశ్వర్యం అది అగ్నిలో కాలి శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటినిండా భస్మ అలదుకుంటాడు. రెండవది రుద్రాక్షథారణ రుద్రాక్షం అంటే శివుని మూడవ కన్ను. ఇంతమంది దేవతలలో ఫాలమందు కన్ను ఉన్నవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరీజపము. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివశివ అని జపం చేయాలి. నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించటం. లక్ష్మి ఐదు చోటులలో ఎక్కువగా ఉంటుందట. మారేడు, ఆవు వెనుక తట్టు, పతివ్రతల పాపట, ఏనుగుతల పద్మము అనేవి లక్ష్మీ నివాసస్థానాలు. అందుచేత లక్ష్మీప్రదమైన మారేడుదళాలతో చేసే పూజ శివునికి అత్యంత ప్రీతి కల్గిస్తుంది. ఐదవది హృదయంలో సదా సదా శివధ్యానం పై జెప్పిన వెలుపలి పూజతో పాలులోపల శివస్వరూపానుసంథానం ఎడతెగకుండా చేయాలి అని అభిప్రాయం.
సాయంకాలం సమయాన్ని ప్రదోషం అని అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయాలలో శివస్మరణ విధిగా చెయ్యాలి. కనీసం ఐదు నిమిషాలైనా ప్రదోషసమయంలో శివస్మరణ చేస్తానని సంకల్పం చేసుకొని మానసికంగా స్మరణమూ వాచికంగా శివశబ్దోచ్చారణమూ చేస్తే ఆత్మకు శ్రేయస్సు కలుగుతుంది.
శివ అంటే మంగళం. 'శ్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం' అని అమరుడు. ప్రాయోపవేశానికి సిద్ధుడైన పరీక్షిత్తుకు శుకాచార్యులవారు భాగవతం వినిపించారు. దానిలో దక్షునికథ ఉన్నది. దక్షుడు శివద్వేషి, శివుడు మంగళస్వరూపుడు. అట్టి శివుని ద్వేషించినవానికి అమంగళం అశివం కాక మరేమి తటస్థిస్తుంది? దాక్షాయణిదక్షునిచూచి
యద్ ద్వ్యక్షరం నామ గిరే రితం నృణాం
సకృత్ర్పనంగా దఘ మాశు హన్తి తత్,
పవిత్ర కీర్తిం త మలంఘ్య శాసనం
భవా నహూద్వేష్టి శివం శివేతరంః
ఇదెక్కడి పాపం! నీవు శివుణ్ణే ద్వేషిస్తున్నావు! నీకు అశివమే ప్రాప్తించక, ఓహో, ఏం ప్రాప్తిస్తుంది?
పూర్వం ఎవరైనా సహగమనంచేస్తే వారివస్త్రాలు భద్రపరచి కొలిచేవారట. మనోనిగ్రహం ఎంతో ఎంతో లేకపోతే సహగమనం చేసే ధైర్యం కలుగదు. అట్టి నిగ్రహంతో మనోనిశ్చయం చేసుకొని సహగమనం చేసినవారు ఆత్మజ్ఞానం కలవారితో సమానమైనవారు. అందుచేతనే పూజింపదగినవారు అయ్యేవారు. అట్టి సందర్భంలో అంబిక ఈ మాటలు చెప్పింది గనుక ఇది ముమ్మాటికీ సత్యం. నిప్పుగుండంలో శరీరం త్యాగం చేసేటప్పుడు చెప్పిన మాటకంటే నిక్కమైన మాట వేరే ఏమన్నా ఉంటుందా?
పాపాన్ని వొక్కక్షణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉన్నది. దానికై అన్నిచోట్లా వెదకనక్కరలేదు. వేదాలకు జీవరత్నమూ, దేహానికి ప్రాణమూ, దేవాలయానికి మహాలింగమువలె వెలుగుచున్న శివ అనే రెండక్షరాలు పాపాన్ని పటాపంచలు చేయటానికి పరమౌషధం. మనిషి పుట్టక పుట్టి సాఫల్యం కోరేవానికి శివనామోచ్ఛారణ తప్ప వేరే ఉపాయంలేదు. పరమేశ్వరుడు మనకు నాలుక యిచ్చినందులకు ఫలం శివ శివ అని జపం చేయడమే.
అపి వా య శ్చాండాలః శివ ఇతి వచం విసృజేత్, తేన సహ సంవసేత్
అని శాస్త్రాలు చండాలునికి సైతం శివనామోచ్ఛారణం విధించినవి. సారాంశం ఏమిటంటే ఎప్పుడూ శివస్మరణం వైష్ణవ ప్రధానమైన భాగవతం శివనామ ప్రశస్తిని చెప్పటం మరొక విశేషం. ఒకానొక గొప్ప స్త్రీ ఒకానొక గొప్ప సమయంలో చెప్పిన మాటలు ఇవి.
పరమేశ్వరునికీర్తిని నోరారా వర్ణించడం చేతనూ వీనులారా వినడంచేతనూ మనము పవిత్రులము అవుతాము. అతని ఆజ్ఞ అనుల్లంఘనీయం, అతడు అంతటా నిండి ఉన్నాడు. అహంభావమున్నవారిని ఆయన శిక్షిస్తాడు. తప్పుచేసిన పిల్లలను దండించే తండ్రివలె దేవతల నాతడు దక్షయజ్ఞంలో శిక్షించాడు. సముద్రమథన కాలంలో కాలకూటం పుట్టినపుడు ఆయన దానిని గుటుక్కున మింగి వానినందరిని రక్షించాడు. ఇట్లా రక్షణ శిక్షణాలు రెండూ చేయగల దక్షుడు ఆయన. పరమేశ్వరుని ముఖాముఖిగా చూడపనిలేదు. ఆయన నామం వొకటేచాలు. పాపపరిహారానికి శివనామం కంటె సులభోపాయంలేదు. ప్రదోషంలో శివ శివ అంటే చాలు. శిష్టులు సాయంసమయమున శివనామం చెప్పడం వాడుక. ఆపరమేశ్వరుడు వేదముల కన్నింటికీ తాత్పర్యం అనదగిన ఓంకార స్వరూపమై యున్నాడు. పరమేశ్వరుడు ప్రభవ బ్రహ్మమేకాక స్వరూప బ్రహ్మము కూడాను- 'సర్వే వేదా యత్ పదమామనన్తి' వేదములన్నీ ఓంకారాన్ని చెప్పినవి. సాయంసమయంలో శివథ్యానమూ ప్రదోష సమయంలో ఈశ్వరదర్శనమూ చేయాలి. దేవతలు శివదర్శనం కోసం శివాలయానికి ప్రదోష సమయంలో వస్తారట.
సాంఖ్య సూత్రాలు ఈశ్వరుణ్ణి త్రినేత్రుడని చెప్పినవి. అతడు మహాపురుషుడని యోగసూత్రాలలో పతంజలి -
'క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః'
అని అంటాడు.
'శబ్దాదేవప్రమితః' అని బ్రహ్మసూత్రములు చెప్పినవి.
ఇట్లా శ్రుతులూ, కర్మకాండకు చెందిన రుద్రమూ, జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తులూ, సూత్రాలూ, పురాణాలూ పరమేశ్వరుని నామమాహాత్మ్యం వర్ణించినవి. ఈశాన శబ్దానికి ఏది అర్థమో అదే పరమేశ్వర స్వరూపం. శివశబ్దానికి దీర్ఘంతీస్తే శివా అని ఔతుంది. అది అంబికా నామం.
'యా తే రుద్ర శివా తనూ రఘోరాఽపాపకాశినీ,
తయా నస్తను వా శంతమయా గిరిశం తాభిచాకశీహి' - శ్రీరుద్రమ్.
'తస్యైతే తనువౌ ఘోరాన్యా శివా న్యా' - తై. సంహిత
పరమేశ్వరునికి రెండురూపాలు. పరమ మంగళమైన రూపం వొకటి. కంకాళంతోటి జుంజురు జడలతో ఉన్న రూపం వొకటి. సర్వమంగళానామం అంబికది.
'యాతే రుద్ర శివ తనూః శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే'
ఆ అంబికయే ప్రాణం. ఈ స్వరూపద్వయమే జగత్తుకు తలిదండ్రులు.
'కో బ్రాహ్మణై రుపాస్యః? గాయత్ర్యర్కాగ్ని గోచరః శంభుః'
అని ఆదిశంకరులు ప్రశ్నోత్తరమాలికలో చెప్పారు. గాయత్రి, సూర్యుడు, అగ్ని - వీనిలో ఉండేవాడు శివుడు. ఈ మూటిలోను పరమేశ్వరుని ఆరాధించవలెను.
'సౌరమండల మధ్యస్థం సాంబం సంసారభేషజం
నీలగ్రీవం విరూపాక్షం నమామి శివ మవ్యయమ్|'
అని మరొక శ్లోకం.
'యోరుద్రోగ్నౌ' అని శ్రీరుద్రం పరమేశ్వరుని అగ్ని స్వరూపాన్ని వర్ణించింది.
'శాస్త్రం శారీర మీమాంసా దేవః శ్రీ చంద్రశేఖరః
గురుః శ్రీ శంకరాచార్యః సంతు మే జన్మజన్మని||'
నేను ఎన్ని జన్మలెత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే స్వామి. శంకరాచార్యులే గురువు. ఏజన్మ యెత్తినా అన్ని అవస్థలలోను శివనామస్మరణ చేస్తే మనకు పరమశాంతి దొరుకుతుంది.