Sunday 10 July 2016

పరమాచార్యుల అమృతవాణి: సంధ్యావందనము.



పరమాచార్యుల అమృతవాణి: సంధ్యావందనము.
మందేహులను కొందఱు రాక్షసులుకలరు. వారు సూర్యుడుదయించునప్పుడెల్ల నరుదెంచి అతనికి కష్టమును కలుగ జేయుచుందురు. నియతాధ్యాయనముచేసిన ఏ బ్రాహ్మణోత్తముడు ఆ ఉషఃకాలమున భక్తిపురస్సరముగ నిశ్చలభావముతో సూర్యునకర్ఘ్యమునిచ్చునో ఆ ఉదక బిందువులు గాయత్త్రి మన్త్రబలముచే రామబాణములవలె నాకాశమునకు వెళ్ళి మందేహులనెల్ల నిగ్రహించి సూర్యుడు సుఖముగ నుదయించుట కనువగునని మన వేదమందలి కర్మకాండము బోధించుచున్నది.

'తలచుట' అనుశక్తి మానవునియందుకలదు. చెట్టు నందు కాని ఱాతినందుగానిలేదు. ఆ తలచుట అను విశేషము గలచిత్తమును మానవుడేనాడు భక్తిమార్గమున ప్రవేశపెట్టునో నాడు మనమందరమును జన్మలేనివారమగుదుము. ఆ తెలివి అను శక్తికి సూర్యమండలము ముఖ్యస్థానము. సర్వేశ్వరుడు మనకు సూర్యమండలముద్వారా తెలివినొసంగుచున్నాడు.


మన వస్తువులకు భద్రము కాలవయునన్న ప్రభుత్వము వారు పోలీసుల నిచ్చియున్నారు. మన పైరులకు నీరుకావలయునన్న ఇంజనీరింగు డిపార్టుమెంటు నిచ్చియున్నారు. పిల్లలకు విద్యకావలయునన్న ఎడ్యుకేషనల్‌ డిపార్టుమెటు నేర్పాటుచేసి యున్నారు. మనలను పాలించురాజుగారు ఏ దేశమునందో నున్నారు. ప్రజలకు కావలసిన సౌకర్యములకై నాయా డిపార్టుమెంటుల (శాఖల) నేర్పఱచి పరిపాలన జరుపుచున్నారు. ఆ విధముగనే ప్రపంచమునకంతయు చక్రవర్తియగు భగవంతుడు కొన్ని కొన్ని శాఖల నేర్పఱచి తన్మూలమున ప్రజలను కాపాడుచున్నాడు. ఆ శాఖలలో తెలివిని ప్రజల కందజేయుశాఖ సూర్యమండలమైయున్నది. అందుకనియే మనవారు సూర్యుని ప్రత్యక్ష పరమేశ్వరుడని చెప్పినారు. ఎండలేకపోయిన మన పైరులు బ్రతుకవు. చెట్లు జీవించవు. మనముకూడా బ్రతుకజాలము. అన్నిటికిని ఆదిత్యుడేమూలము. సర్వేశ్వరుడాదిత్య రూపమున లోకము ననుగ్రహించుచున్నాడు కాబట్టి మనము సర్వేశ్వరుని దర్శింపవలయునన్న అతని మూలముననే దర్శింప వలయును.


'అసావాదిత్యో బ్రహ్మా'


ఈ సూర్యుడే పరబ్రహ్మము. అతడోజోరూపుడు. సూర్యుడు 5 వేల సంవత్సరములక్రిందట పుట్టెనని క్రైస్తవులు చెప్పుచున్నారు. ప్రకృతిశాస్త్రవేత్తలు సూర్యునిశక్తి క్రమక్రమముగ తగ్గుచున్నదనుచున్నారు. కాల్పారంభముననే సూర్యుడు ద్భవించెను. అది మొదలతని శక్తి క్రమక్రమముగ హెచ్చుట కారంభించి పరిపూర్ణస్థితి నంది యంతటతో నిలచినది. అదియే మఱల క్రమముగ తగ్గిపోవుట కారంభించినది. దానినే మనవారు సంకల్పములో, 'ద్వితీయ పరార్థే' అని చెప్పుచున్నారు. అని ప్రకృతిశాస్త్రవేత్తలు చెప్పెదరు. ఆసూర్యబింబమున భౌతిక శక్తి అనగా నీటిని గ్రహించుట, వర్షమునుకురిపించుట అనుశక్తులుగలవు. మరియు చైతన్యశక్తి అనగా మేథయనుకలదు. అట్టివానిని మనముపాసించిన మనకు కూడా మేథవృద్ధియగును. ఆశక్తులంతయు రానురాను ప్రకృతిలో నరిగిపోవుచున్నవి. వానినంతయు కాలముతగ్గించుచున్నది. కాబట్టి కాలచక్రమువలన తగ్గుశక్తిని మన మేధస్సుచే మఱల నభివృద్ధిపఱచవలసినదని శాస్త్రములు చెప్పుచున్నవి. మనకది ఆత్యంత అవసరము.


దేవాసురులనగా మన మనోవృత్తులేగాని వేఱుగాదు. మనము వానిని నిగ్రహించవలెను. అప్పుడు లోకోపకారమగును. ఆసురభావములకే అసురులనిపేరు. మనమనస్సులో ప్రతిక్షణము నందనుకలుగు కోటికోటి 'ఈహ' అనగా కోరికలవలనగూడ మూలప్రకృతియగు సూర్యునిశక్తి తగ్గుచున్నది. కాబట్టి మనము దుశ్చింతలను దూరీకరించి మేథస్సుచే మూలప్రకృతికి తేజస్సు నభివృద్ధిజెంది ప్రపంచమునకెల్ల మేలు కలుగునుగాక అను సంకల్పముతో నరుణోదయముననే సూర్యున కర్ఘ్యమొసంగవలెను. మరియు మనమందఱమును మంత్రశక్తిని పభివృద్ధిపఱచుకొని సూర్యునుపాసించినయెడల అయ్యది వజ్రాయుధమై లోకము నంతయు రక్షించును.


వేయిమంది కన్నదానమొనర్చినచో నందొకడైనను యోగ్యుడుండును. ఆయొక్కనికొనర్చిన అన్నదానమువలన మనము తరించెదము. ఆ విధముగనే వేలకొలదిగనుండు మంత్రానుష్టానార్హులు అర్ఘ్యమును వదలిపెట్టుచుండిన అందొకానొక నియతవేదాధ్యయన సంపన్నుని అసాధారణశక్తిచే సూర్యునిశక్తి క్రమముగ పెరుగుట కవకాశముకలగును. ఉడుతకుడుతాభక్తి. సేతుబంధనమున శ్రీరామునకు ఉడుతకూడ సహాయమొనర్చినదట.


ఇదియే ప్రకృతి శక్తిలో మనందఱియొక్క కర్తవ్యమైయున్నది. మనమేధస్సుచే సూర్యునకు రజోగుణము నభివృద్ధి పఱచవలయును. అప్పుడు మన మనస్సుకూడా రజోగుణయుక్తమగును. మఱల దానిని తీసివైచి సత్వగుణ ప్రాప్తికొఱకు జపమొనర్చవలెను. చిత్తమును ప్రసాదగుణయుక్త ముగజేయుటకు జపమత్యవసరము. ఆ రెంటినిగనుక మనము నియమముగ నొనర్చిన మూలమునకు బలము గలగుట నిక్కువము. దాని వలన ప్రపంచమునకు క్షేమముకలుగను. మనమును సుఖమందెదము.


ప్రపంచమునందలి ప్రజలందఱకును ఒకేపని ఎప్పుడును సాధ్యముకాదు. అందుకనే మనవారు వర్ణాశ్రమ ధర్మముల నేర్పఱచి అందుకొందఱికి మాత్రమీ యాచారముల విధించిరి. ఇది లోకకల్యాణమునకు మూలము. అది ముఖ్యముగ బ్రాహ్మణులకర్తవ్యము. వారా పని యొనర్పనియెడల ప్రపంచమునకు కీడొనర్చిన వారగుదురు.


యద్వేదాన మనభ్యాసాత్‌

ఆలస్యా దన్నదోషాద్వా

మృత్యుః విప్రాఽ జిఘాంసతి.


అందుచేత బ్రాహ్మణులందఱును ఏమరుబాటులేక ఈ యాచారమును విడువక సర్వలోకాధారమును పోషించుట కర్తవ్యమైయున్నది. అందులకు అర్ఘ్యము, జపము అవసరములు అదియే లోకక్షేమము ఆదియే ఆత్మక్షేమము.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.