Thursday, 14 July 2016

పరమాచార్యుల అమృతవాణి : నమస్కారము అవసరము, విధానము



పరమాచార్యుల అమృతవాణి :  నమస్కారము అవసరము, విధానము
(జగద్గురుబోధలనుండి)

''శ్రీ భగవాన్‌ ఆదిశంకరులు శ్రీ కైలాసంనుంచి తెచ్చిన సౌందర్యలహరిలో మొదటి శ్లోకం ''శివశ్శక్త్వా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం '' అని చెప్పినారు. శివశబ్దము శంకరుని బోధిస్తుంది. అది దీర్ఘాంతమైనప్పుడు శక్తిని సూచిస్తుంది. ఈ శక్తి లేనిదే ప్రపంచములో ఏది చలించలేదు, త్రిమూర్తులు ఈ శక్తివల్లనే సృష్టి, స్థితి లయములను చేస్తున్నారు.

త్రిమూర్తులకు వారి వారి శక్తులు వారికి ప్రత్యేకంగా ఉన్నాయి. కాని మానవులకు అన్ని శక్తులు ఉన్నాయి. అంటే పరదేవత అనుగ్రహం మనకు బాగా ఉన్నది, దానిని ఆ శక్తిని సద్వినియోగ పరుస్తూ, కృతజ్ఞతగా ఏయే శక్తులుమనకున్నవో వాటిని ఆమెకు సమర్పించాలి.

దానికి ప్రతివారు కనీసం రోజూ ఉదయం లేవగానే రాత్రి నిద్రించునపుడు ఆమెను స్మరించాలి, స్తుతించాలి, నమస్కారము చేస్తూ నాకుబుద్ధి, శక్తిని, తదితరశక్తులను సార్థకంగా అనుగ్రహించమని వేడుకోవాలి.

అన్ని జన్మలలో (మానవజన్మ) ఉత్తమమైంది. కావున మానవుడు తన ప్రధానశక్తులైన వాక్కుతో దైవనామాన్ని స్మరించడం, మంచి మాటలను పలకడం. నేత్రాలతో దైవమూర్తులను, ఆలయాలను, ఆలయగోపురాలను దర్శించడం, చెవులతో మంచి మాటలు, పెద్దల ఉపదేశాలను వినడం మున్నగు వాటిద్వారా మనజీవితాన్ని సార్థకం చేసుకోవడం, భగవచ్ఛక్తి వలన వచ్చినది, శక్తియున్నది, అయిన ఈ దేహంతో భగవంతునికి నమస్కారమైనా అర్పించాలి.

నమస్కారములు: తల్లిదండ్రులకు ఒకే నమస్కారము, దేవాలయాలలో దేవునికి మూడు నమస్కారములు, సదండ సన్యాసులకు నాలుగు నమస్కారములు చేయాలి. తల్లి దండ్రులకు నమస్కారము చేయునపుడు ఏమీ కోరిక లడుగకూడదు. అవి వారే చూచుకుంటారు. త్రిగుణాత్మక స్వరూపంగా వున్న దేవునికి మనకోరికలను వెల్లడించవచ్చు. మన అదృష్టాన్ని బట్టి ఆయన అనుగ్రహించనూ వచ్చు. సన్యాసి సాక్షాత్తునారాయణ స్వరూపు లవడంచేత, కేవలం మోక్షమనే కోరికతో, వారిని కోరిక లడగకూడదు, వారు జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థలనుదాటి తురీయస్థితిలో నున్నవారు, గనుక, వారికి నాల్గు నమస్కారములు చేయాలి.

సన్యాసికి సన్యాసాశ్రమస్వీకరణ కాలంలో శిరస్సుమీద సాలగ్రామం పెట్టి. అభిషేకం చేసి నారాయణ స్మరణతో సన్యాసం ఇస్తారు. అందువల్ల మనము నమస్కారము చేసేటప్పుడు ''ఓంనమోనారాయణ'' అనాలి, వారు దానికి సమాధానంగా దానిని నారాయణ సమర్పణచేస్తూ ''నారాయణ, నారాయణ'' అని చెప్పాలి.

'మోక్షమిచ్ఛే జ్జనార్దనాత్‌'' అను సూక్తి ఇందుకు ప్రమాణము, ''ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌'' అనగా భాస్కరుని నుంచి ఆరోగ్యము పొందవచ్చు. ''శ్రియమిచ్ఛేత్‌ హుతాశనాత్‌'' అనగా అగ్ని సంపదలను కలుగజేయును. ''జ్ఞానమిచ్చే న్మహేశ్వరాత్‌'' అనగా జ్ఞానము శివుని వలన పొందవచ్చును. ఈరీతిగా ఆయాదేవతలను నమస్కరించాలి.

నమస్కారము చేయుటలో పురుషులు సాష్టాంగ నమస్కారము అనగా నుదురు. భుజములు, వక్షఃస్థలము మోకాళ్లు, పాదములు - వీటిని దండమువలె నేలకు తాకునట్లు నమస్కారము చేయవలెను. తెలుగుదేశంలో ''దండము'' పెట్టడం అనే మాటకు ఇదే తాత్పర్యము. స్త్రీలు పంచాంగ నమస్కారము చేయాలి. పంచాంగములనగా నుదురు. మోకాళ్లు పాదములు ఇవి మాత్రము నేలకు తాకునట్లు నమస్కారము చేయాలి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.