రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : 7
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)
సానుక్రోశో జితక్రోధో బ్రాహ్మణప్రతిపూజకః |
దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః ||
(అయోధ్యాకాండ తొలి సర్గ)
రాముడు ఎవరికి అయినను దుఃఖము కలిగిననాడు చూచి ఓర్వలేనివాడు అనగా దయగలవాడు. క్రోధమును తన వశమందు ఉంచుకొనినవాడు. కోపమునకు లొంగి ఒడలు తెలియక అనరాని మాటలు ఆడుట , చేయరాని పనులు చేయుట చేసెడివాడుకాడు. వేదాధ్యయనము చేయువారిని , వేదార్థములను ఎరింగినవారిని ఎంతో గౌరవముతో పూజించెడివాడు. అందరియెడ దయకలిగినవాడే అయినను దీనుల యెడ చాలా దయచూపువాడు. దీనులు ఎచట అయినను కనిపించిన వారికి ఏదో విధముగా సాయము చేయనిదే కదలి పోయెడివాడుకాదు. సామాన్య మానవ ధర్మములగు సత్యము , అహింస మొదలగు వానిని పాలించి ఆత్మ స్వరూపము ఎరింగి పరమాత్మను పొందుటకు మానవుడు ఈ శరీరముతో చేయవలసిన విశేష ధర్మములను ఎరింగినవాడు. నియమము కలవాడు. ఆడినమాట తప్పకుండుట ఆతనికి నియమము. ఎంత ఆపద వచ్చినను దానికి కట్టుబడి ఉండెడివాడు.