Sunday, 10 July 2016

పరమాచార్యుల అమృతవాణి: సంగీతసాహిత్యములద్వారా మోక్షసాధనము



పరమాచార్యుల అమృతవాణి: సంగీతసాహిత్యములద్వారా మోక్షసాధనము

(మోక్షసాధనమునకు) ఉపాయమేమి?

అందులకుపాయము యోగముతప్ప సాధనానంతరము లేదు. యోగమనగా


'యోగ శ్చిత్తవృత్తి నిరోధః'

చిత్తవృత్తి నిరోధమే యోగమని యోగసూత్రములలో నిర్వచింపబడినది. అట్టి యోగమునకు బ్రహ్మచర్యము, శ్వాసనిరోధము, ఆహారనియమము ఇవి చాలా ముఖ్యములు.

ఈ యోగము చాల కష్టము. మాకు యింకొక యోగమున్నదన్నాడు ఒక కవీశ్వరుడు. అదేమిటనగా,

అనాయతప్రాణ మసంయతాక్షం.
ఈ యోగమునకు ప్రాణాపాయమేమీ అవసరములేదు ఇంద్రియనిగ్రహమవసరము లేదు బ్రహ్మచర్యమవసరములేదు ఆహార నియమమవసరములేదు అయితే కర్తవ్యమేమి? చిత్తమును దృఢముగ అనగా తనకవిత్వమునంతయు పరమేశ్వర విషయిక మొనర్చి చిత్తమును మరొకచోటికి వెళ్ళకుండా చేసినట్లయితే అదే యోగమవుతుంది. చిత్తవృత్తినిరోధాదులవల్ల సంప్రాప్తమగు యోగము సాధ్యము ఈయోగమన్ననూ సిద్ధము. ఆ కవిత్వము శృంగార రసమునుగురించి అయినాసరే మరొక రసమునుగురించి అయినాసరే లక్ష్యము పరమాత్మునిపై నుండినచాలును. అప్పుడు యోగి సమాధికాలమునందెట్టి శాంతిని, ఆనందమును అనుభవించునో కవికూడ అట్టి శాంతినే అట్టి ఆనందమునే అనుభవించును. అందులకు కేవలము సాహిత్యమే కాక సంగీతముకూడా అవసరమే త్యాగయ్య ప్రభృతులు సంగీతసాహిత్యములవల్లనే తరించిరని చెప్పవచ్చును.

శిష్టులలో సంగీతమన అసహ్యించుకొనువారు చాల మందికలరు. గాయకులను పంక్తిబాహ్యులనినారు. వారికేమీ దానము చెయ్యగూడదన్నారు. నాటకాలు చూడగూడదన్నారు. అట్లే వైద్యులను, జ్యోతిషుకులను, కూడా పంక్తి బాహ్యుల లోచేర్చినారు. నటవిటగాయక, అని గాయకులను విటులతో లెక్కించినారు. వీరి చిత్త మెల్లప్పుడును కామపరవశమై యుండునట. అందుచేవారికి దానము చెయ్యగూడదన్నారు. కాని నేను మీ కొకస్మృతి వాక్యము చెప్పెదను.

వీణా వాదనతత్వజ్ఞః శృతిజాతివిశారదః
తాళజ్ఞశ్చా ప్రయత్నేన మోక్షమార్గం స గచ్ఛతి.


అని యజ్ఞవల్క్య స్మృతిలో నున్నది. అనగా వీణావాదనకుశలుడు. సంగీతమందలి శృతి, జాతులయందు నేర్పరి, తాళముతెలిసినవాడు వీరంతాకూడా ప్రయత్నములేకనే మోక్షమార్గమును చెందెదరు అని భావము.

విరోధపరిహారమెట్లు?
వేదములు, శిష్టులు మొదలైన వారందఱును గాయకులను నిషేధిస్తున్నారు. స్మృతిమాత్రము నటగాయకులు అప్రయత్నంగా మోక్షమార్గమున కర్హులగుచున్నది. ఈ పరస్పరవిరోధ పరిహారమెట్లు? కాళిదాస భవభూతులు నాటకముల వ్రాసినారు. వారుకూడా శిష్టులే. సంకల్ప సూర్యోదయమనే వేదాన్త నాటకముకూడా వున్నది. దానినివ్రాసినది వేదాంతదేశకులు. కొన్ని కొన్ని నాటకాలు పవిత్రములైన యజ్ఞశాలల్లో ప్రదర్శింపబడుతుండినట్లు ప్రస్తావనములలోకలదు. నాటకములను దృశ్యకావ్యమనినారు. అది ఎవరో ఒకరు ఆడితే చూడదగినదేగాని స్వయముగా చదివి ఆనందింపదగినదికాదని ఆ పేరే చెప్పుచున్నది. అది అట్లుండ మన వైదికులు నాటకముచూచిన పాపమనుచున్నారు. 

ఈ కాంతాసన్నితములగు నాటకములకు సహృత్సమ్మితమగు 'వీణావాదన తత్వజ్ఞ' అను స్మృతి ఆకరము. 'కావ్యాలాపాంశ్చ వర్జయేత్‌' అని స్మృతికూడావున్నది. నేనుమాత్రము ఇదే మోక్షాన్ని అప్రయత్నముగా లభింపజేస్తున్నదని చెప్పినాను. ఈ వాక్యము వల్ల నటులకు, గాయకులకు సంతోషము కలుగవచ్చును. 

కాని సంగీతము ఈశ్వర విషయకమని, శృంగార విషయకమనీ రెండు విధములు. అందులో మొదటిది జీవనార్థమగు సంగీతమనీ ,అది ఒక విద్య, దానిని అభ్యసింపవలె అను భావరూపమగు సంగీతము అని రెండువిధములు. అది మరలా ప్రత్యేకమొకటొకటి ఈశ్వర విషయకమని, ప్రాకృత విషయకమనీ రెండేసివిధములు-ఇప్పుడు నేను చెప్పిన రెండవభాగమందలి రెండవ విభాగరూపమగు సంగీతమునుగురించియే స్మృతి వీణావాదన తత్వజ్ఞః ఇత్యాదిగ ననువదించినది. అయితే మన మావిద్యను జీవనార్థముపయోగించక పరిమేశ్వరుని అధీనమొనర్పవలెను. అది యే మోక్షసాధనము. అదియే స్మృతికర్థము. విషయచర్చవలన ప్రణవనాదమున పరమేశ్వరుని నారాధింపవలెను అను విషయమేర్పడినది. అట్టి ప్రణవనాదమున యోగము నిలువకపోయినచో వైదిక సామవేద స్వరమున దృష్టినుంచమని చెప్పినారు. అట్లు గూడానిలువకపోయిన లౌకికసరణిలో 'వీణావాదనతత్వజ్ఞః' ఇత్యాదిగ శాస్త్రకారులు విధించినారు. కాబట్టి అట్టి దాని నెవడైతే జీవనాధారమొనర్చుకొను చున్నాడో వాడు భ్రష్టుడే, తదితరుడు ముక్తుడే.

కాబట్టి కవియగుప్రతివాడుకూడా ఏ నవలలనో ఏ శృంగార ప్రబంధములనో వ్రాయక పరమేశ్వరుని కొనియాడుచు, అతని గుణగణముల నభివర్ణించుచు అతనియందు తన్మయుడుకావలెను. ఇప్పుడు మనకుండు శరీరాత్మభావమువంటి భావము పరమేశ్వరుని యందు కలుగవలెను. అట్లు కాకపోయినచో అసత్కావ్యాలాపములు, అసంత్సంగీతము మనలను మోక్షమార్గమునకు దూరులుగ నొనర్చును.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.