Wednesday 13 July 2016

పరమాచార్యుల అమృతవాణి : నన్ను నిరాశ పరచకండి



పరమాచార్యుల అమృతవాణి : నన్ను నిరాశ పరచకండి.
(జగద్గురుబోధలనుండి)

దశావతారాలలో శ్రీ కృష్ణావతారం మాత్రమే జగద్గురు పదంతో పేర్కొనబడ్డది, 'కృష్ణం వన్దే జగద్గురుమ్‌', ఒక్క శ్రీకృష్ణు(డొక్కడే జగద్గురువు. ఆయన తరువాత ఆదిశంకరులు మాత్రమే జగద్గురువులని ప్రఖ్యాతి వహించేరు. మమ్ముగూర్చి కవితచెప్పిన కవులంతా తమశ్లోకాలలో 'జగద్గురువులు-జగద్గురువులు'అని మమ్ము ప్రశంసించేరు. వాస్తవానికి జగద్గురువులమని ప్రశంసింపబడే యోగ్యత మాయందులేదు, అయితే అందరూ జగద్గురువులు అని మమ్మెందులకు కీర్తిస్తున్నారు? అంటే ఇది పీఠమువల్ల వచ్చిన ప్రశంస, మేము ఆపీఠంలో ఉంటూ ఉన్నాము, గనుక మమ్ముకూడా లోకం జగద్గురువులు అని పిలుస్తోంది.

ఒక శాస్త్రపండితునకు ఒక కుమారు డున్నాడు. వానికి సంధ్యావందనమైనా రాదు. అయినా వానితండ్రి శాస్త్రపండితుడుగా ప్రసిద్ధుడు కదా! అందుచే శ.ష.స.లకు భేదం తెలియని వాడైనా యీకుమారుడు శాస్త్రి అనియే పిలువబడుతాడు. ఊరువిడిచి వృత్తివిడచి వాడు సైన్యంలో ప్రవేశించినా అంతా వానిని శాస్త్రి అనే పిలుస్తూ ఉంటారు. ఇది యీతడు సంపాదించుకొన్న పేరా? కాదు. తండ్రితాతలు సంపాదించినది. మమ్ములోకం జగద్గురువులు అని కీర్తించడం కూడ ఇట్టిదే. ఈ పొగడ్తలన్నీ మా విషయంలో అర్థవాదాలేకాని యథార్థాలు కావు.

శంకరులు ఎన్నో గ్రంథాలు వ్రాసేరు. వానిలో కొన్ని గ్రంథాలను గూర్చి-'ఈ గ్రంథాలు వారు వ్రాసినవి కావని, ఔనని' వాద వివాదాలు ఉన్నాయి. 'భజగోవింద శ్లోకములు' శంకర విరచితములు కావని అనే వారు కనిపించరు. వానిలో ఒక శ్లోకం!

కాతే కాన్తా కస్తే పుత్రః సంసారోఽయ మతీవ విచిత్రః |
కస్య త్వం భో కుత ఆయాతః మనసి విచిన్తయ తదిదం భ్రాతః||


అది సాధారణంగా అందఱూ ఎఱిగిన శ్లోకమే. ఒక్కశ్లోకం యొక్క అర్థాన్ని మననం చేస్తే చాలు, మన చింతలన్నీ తీరిపోతాయి. ఇందులో శంకరులు 'భ్రాతః' (సోదరా!) అంటూ ప్రతివారినీ ఎంతో ఆప్యాయతతో సంబోధించేరు. ఆయన ఏమంటున్నారు! నీ యీ ఆలుబిడ్డలు, ఈసంసారము ఇదంతా ఏమిటయ్యా? ఇదంతా విచిత్రంగా లేదా? అసలు నీ వెవరవు? ఎక్కడనుండి వచ్చేవు? ఒక్కసారి ఆలోచించవయ్యా సోదరా? అని ఉద్బోధిస్తున్నారు.

మనం యీ విషయాలు ఎన్నడైనా ఆలోచించేమా? బ్రదుకు అంతా లౌకికవ్యాపారాలలో గడుపుతున్నాం. మన జీవితానికి ప్రయోజనం ఏమిటి? ఈ ఐహికమైన ప్రపంచం శాశ్వతం కాదని; అందరికి తెలుసు. అంతా ఒకనాడు చావవలసినవారే. కాని యీ జననమరణాలనుండి తప్పించు కొనడం ఎలాగు?

ప్రపంచంలో ఎందరో ఎన్నో గొప్పపనులు చేస్తున్నారు. సముద్రంలో మైళ్ళకొలది దూరం ఈదేవారున్నారు. భూమి చుట్టూ అంతరాళంలో గిరికీలు కొట్టి వస్తున్నారు. చంద్రమండలాన్ని చేరుకొంటున్నారు. అనేకవిధాలుగా గొప్పవారైన వారెందరో ఉన్నారు. కాని మనస్సును కదలకుండా నిలుపగలవాడు ఒక్కడూ కనబడడం లేదు. ఇది అన్నిటికంటే గొప్పకార్యం. దీనిని మించిన ఘనకార్యం లేదు. మనం అంతా జగద్గురువులు ఆదేశాన్ని అనుసరించి మనస్సును నిగ్రహించడానికి యత్నించాలి. అపుడు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగగానే అంతటా ఉన్న భగవంతుడు, అందరి హృదయాలలోనూ ఉండే పరమాత్మ తనంత తాను సాక్షాత్కరిస్తారు.

అయితే మనస్సును నిలపడం ఎలా? అంతా నాదగ్గరకు వస్తూ పూవులు, పండ్లూ, కానుకలు తెస్తూ ఉంటారు. నాకు ఇవేవీ మీరు ఈయనక్కరలేదు. రోజుకు రెండు నిముషాలకాలం, కేవలం రెండు నిముషాలకాలం నాకై వినియోగించండి. ఆ రెండు నిముషాలకాలం నిశ్చలభక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. క్రమంగా మనస్సు నిశ్చలం అవుతుంది. అదే నాకు పరమప్రియమైన కానుక, మీరు రోజంతా మీమీ లౌకిక వ్యాపారాలలో ఖర్చు పెట్టుకొంటున్నారు. ఈ పేదసన్యాసికై ఒక్క రెండు నిముషాలు త్యాగం చేయలేరా! నేను కోరే వస్తువిదే! నన్ను నిరాశ పరచకండి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.