Monday, 25 July 2016

శంకరస్తోత్రాలు : ఆనందలహరీ



శంకరస్తోత్రాలు : ఆనందలహరీ
(ఇదివరలో ఈ బ్లాగులో  విడివిడిగా ఉన్న ఈ స్తోత్రభాగాలను ఒకటిగా అందిస్తున్నాము)

భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతిః
తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః || 1 ||

      
ఓ భవానీ ! ప్రజలను సృష్టించు బ్రహ్మదేవుడు నాలుగు ముఖములతోనూ , త్రిపురాసురుని మర్దించిన ఈశ్వరుడు ఐదు ముఖములతోనూ , దేవసేనానాయకుడగు సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖములతోనూ , ఆదిశేషువు వేయి ముఖములతోనూ నిన్ను స్తుతించలేనిచో ఇతరులు ఎవరు నిన్ను స్తుతించగలరు తల్లీ ? నీవే చెప్పు .

ఘృతక్షీర ద్రాక్షా మధుమధురిమా కైరపిపదై
ర్విశిష్యా నాఖ్యేయా భవతి రసనామాత్ర విషయః |
తథాతే సౌన్దర్యం పరమశివ దృఙ్మాత్ర విషయః
కథంకారం బ్రూమః సకల నిగమాగోచర పదే || 2 ||


నెయ్యి, పాలు, ద్రాక్ష, తేనె వీటి మాధుర్యము మాటలతో వర్ణించనలవికానిది . ఆ మాధుర్యము నాలుకకు మాత్రమే తెలియును. అదే రీతిగా అమ్మా ! నీ సౌందర్యం వర్ణించి చెప్పడానికి సకలవేదాలకూ శక్తి చాలదు తల్లీ, అది పరమశివుని కన్నులకు మాత్రమే ఎరుకగానీ,  మాబోటివారు వర్ణించగలమా తల్లీ  !

ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్ || 3 ||


నోటి యందు తాంబూలంతో, కళ్ళకు కాటుకతో, నొసటన కాశ్మీరతిలకంతో, నడుము నందు కాంతులీను వడ్డాణముతో, మెడలో ముత్యాల హారాలతో, బంగారు చీరతో ప్రకాశిస్తున్న హిమవత్పర్వతరాజపుత్రిక అయిన గౌరిని నేను సదా సేవించుచున్నాను .

విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటీ
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా |
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే || 4 ||


ఓ శంభుని సతీ! కంఠమునుంచీ కల్పవృక్ష కుసుమాలమాలలు వ్రేలాడుతుండగా శోభిల్లు వక్షస్థలముతోనూ, మ్రోగుతున్న వీణానాదానికి అనుగుణంగా కదులుతున్న కుండలములతోనూ, కొంచెము ముందుకు వంగినటువంటి శరీరముతోనూ(భక్తులను అనుగ్రహించుటకు ముందుకు వంగిందిట), ఆడ ఏనుగు వంటి అందమైన నడకతోనూ, పద్మముల వంటి  కన్నులతోనూ శోభిల్లు తల్లీ! నీకు విజయమగుగాక.

నవీనార్క భ్రాజిన్మణి కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిత నయనాంగీకృత శివా |
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ || 5 ||


ఓ అపర్ణా! అప్పుడే ఉదయించిన బాలభానుడిలాగా దేదీప్యమానంగా ప్రకాశించే సువర్ణ మణిమయాది సర్వాభరణాలతో సర్వాంగభూషితవూ, ఆడలేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు కలదానవూ, పరమశివుని పతిగా స్వీకరించినదానవూ, మెరుపులాంటి పచ్చని మేనికాంతి కలదానవూ, పసిడి పీతాంబరం ధరించినదానవూ, మువ్వలపట్టీలతో కళకళలాడుతూ పరిపూర్ణురాలివైన నీవు నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని ప్రసాదించెదవుగాక.

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా || 6 ||


(ఇక్కడ అమ్మవారిని కల్పలతతో పోలుస్తున్నారు.ఈ లత మామూలు లత కాదు కల్పలత అంటే అడిగినవన్నీ ఇస్తుంది.)
ఈ కల్పలత హిమవత్పర్వతమునందు పుట్టింది, అందమైన చేతులు అనే చిగురుటాకులు కలది, ముత్యములనే పుష్పములున్నది,  ముంగురులనే తుమ్మెదలు వాలినది, శివుడనే మ్రోడుని పెనవేసుకొన్నది(స్థాణువు-శివుడు,మ్రోడు), స్తనములనే ఫలములతో వంగినది, శాస్త్రవాక్కులనే మకరందం కలిగినది, సర్వరోగములనూ పోగొట్టునది(భవరోగ నివారిణి), కదులుచున్నది అగు పార్వతీదేవి అనే జ్ఞానానందలతిక విలసిల్లుచున్నది.

సపర్ణా మాకీర్ణాం కతిపయగుణై స్సాదరమిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్ || 7 ||


(పరమేశ్వరుని వివాహమాడుటకు ఆకులనుకూడా తినకుండా తపస్సు చేసినందున పార్వతీదేవికి అపర్ణ అని పేరు. అపర్ణ అనగా ఆకులు లేనిది అని. పార్వతీదేవి ఈ శ్లోకములో ఆకులులేని తీగగా చెప్పబడుతున్నది)

ఆకులు కలిగిన తీగెలను (ఇతర దేవతలను), కొన్నిగుణములు మాత్రమేగలవైననూ, ఇతరులు ఆశ్రయించుచున్నారు. నాకు మాత్రం ఈ విధంగా అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ ఆకులులేని తీగెనే (అపర్ణ) ఆశ్రయించాలి. ఆ తీగె చుట్టుకున్న మాత్రాన పాత మ్రోడు (శివుడు - స్థాణుః) కూడా మోక్షఫలములిచ్చుచున్నది.

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజనని
త్వమర్థానాం మూలం ధనద సమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషి || 8 ||


సమస్త వేదములను కన్నతల్లీ! నీవే ధర్మములు విధించుచున్నావు. కుబేరుడు నీ పాదకమలములకు మ్రొక్కెడువాడే. సమస్త సంపదలకూ నీవే మూలము. తల్లీ, నీవు మన్మధుని జయించినదానవు, కోరికలకూ నీవే మూలము. పరబ్రహ్మ పట్టపురాణివి నీవు, సత్పురుషుల ముక్తికి కారణమూ నీవే.
(చతుర్విధ పురుషార్థాలయిన ధర్మ, అర్థ, కామ, మోక్షములనొసగునది జగన్మాత )

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస
స్త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః || 9 ||


అమ్మా! చపలచిత్తుడనైన నాకు నీపై భక్తి కుదురుటలేదు. నీవు శ్రీమతివి (పెద్ద మనసున్నదానివి, మనం పెద్దమనసు చేసుకుని అంటాం కదా) నాపై దయచూపాలి. చాతకపక్షి నోటిలో మేఘుడు మధురమైన నీటిని వర్షించినట్లే నీవూ నాపై దయావర్షం కురిపించాలి. నా మనస్సు ఎందుకు నీపై నిలుచుటలేదని మధనపడుచున్నాను. (నీవే దారి చూపాలని వినతి).

చాతకపక్షి ఇష్టాఇష్టాలతో నిమిత్తంలేక మేఘుడు తన ధర్మం ప్రకారం మధురజలాలు ఆ పక్షిపై ఎలావర్షిస్తున్నాడో, నా భక్తిశ్రద్ధలతో నిమిత్తంలేకనే నువ్వు (నీ దయాధర్మం ప్రకారం) నీ దయ నాపై కురిపించు తల్లీ అని భావన.

శంకరులు సౌందర్యలహరిలో ’దృశా ద్రాఘీయస్యా’ శ్లోకంలో ఇదేభావం కనపరిచారు. ’వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః’ చంద్రుడు భవనాలపై అరణ్యాలపై ఒకేలా వెన్నెల కురిపించినట్లు, ఈ దీనుడిపై దయచూపమని అక్కడ వినతి.

’కావు కావమని నే మొరబెట్టితే కరుగదేమి మది’ అని త్యాగరాజులవారు
’దేవీ బ్రోవ సమయమిదే, అతివేగమే వచ్చి’ అని శ్యామశాస్త్రుల్ల వారు దెబ్బలాడారు. అందరూ దెబ్బలాటలు శంకరులవద్దే నేర్చుకున్నట్లుంది.

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీ పరికరైః || 10 ||


గొప్పచరిత్రగల తల్లీ! నిన్ను శరణు అన్న నాపై నీకు ఉపేక్ష తగదు. నీ దయాదృష్టిని నాపై వేగముగా ప్రసరింపచేయి.  కోరుకున్నది వెంటనే ఇవ్వకపోతే సామాన్యలతలకన్నా కల్పలతకు విశేషమేమున్నది ? 

మహాన్తం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణం || 11 ||


అమ్మా ఉమాదేవీ! నీ పాదపద్మములపై గొప్ప విశ్వాసము కలవాడినై నేను ఈ లోకంలో  అన్య దేవతలను ఆశ్రయించలేదు. అయినా నీవు నాపై కరుణ చూపకపోతే, ఓ వినాయకుని కన్నతల్లీ ! నాకెవరు దిక్కు ?

త్యాగరాజులవారు కూడా ’వినాయకుని వలెను బ్రోవవే నిన్ను వినా వేల్పులెవరమ్మా!’ అని కామాక్షీ అమ్మవారిని ప్రార్థించారు.  శంకరులు ఈ శ్లోకంలో ’వినాయకుని తల్లీ నాకింకెవరు దిక్కు?’ అని అడుగుతున్నారు. ఎందుకు వినాయకుని అమ్మకు గుర్తుచేస్తున్నారు ?

వినాయకుని ’హేరంబుడు’ అంటారు. అంటే ఎప్పుడూ శివునివద్దనే ఉండేవాడని. అందుచేత వినాయకుడంటే అమ్మవారికి మక్కువ అని పెద్దల మాట.

నాకు వినాయకుని ’లంబోదర’ అని సంబోధించడంలో ఒక సంకేతం కనిపిస్తోంది. వినాయకచవితి కథలో వినాయకుని ఉదరం భగ్నమైనప్పుడు అమ్మవారు పట్టుబట్టి మరలా జీవం పోయించింది. అంత కరుణనూ నాపై కూడా చూపమని శంకరులు, త్యాగరాజులు అడుగుతున్నారని నా అభిప్రాయం.

అయస్స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిళితమ్ |
తథా తత్తత్పాపైరతిమలిననన్తర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ || 12 ||


పరశువేది స్పర్శతో ఇనుము బంగారమవుతున్నది. వీధికాలువల నీరు గంగాప్రవాహముతో కలిసి శుచి అవుతున్నది. అలాగే ఆయా పాపములతో అతి మలినమైన నా మనస్సు నీపై భక్తితో కలసినచో ఎట్లు నిర్మలము కాదు ?

త్వదన్యస్మాదిచ్చావిషయఫలలాభే న నియమ
స్త్వమజ్ఞానామిచ్చాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివముచితమీశాని కురు తత్ || 13 ||


నీ కంటే ఇతరులైన దేవతల వలన కోరినఫలము లభిస్తుందని నియమము (ఆంగ్లములో చెప్పాలంటే , గ్యారంటీ) లేదు. మరి నీవో, అజ్ఞులకుకూడా కోరినదానికన్నా అధికముగా ఇచ్చుటలో సమర్థురాలవని బ్రహ్మదేవుడు మొదలగువారు చెప్పారు. నా మనస్సు రాత్రింబవళ్ళు నీయందే లగ్నమై ఉన్నది. ఓ ఈశ్వరుని పత్నీ! ఏది తగినదో అది చేయుము.

స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చశధరకళాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి || 14 ||


ముల్లోకములకూ మహారాజయిన పరమేశ్వరుని గృహిణి అగు ఓ పరమేశ్వరీ! రమణీయమైన నీ సౌధములో కాంతులీను నానా రత్నములు పొదగబడినవీ, స్ఫటికమయమైనవీ అయిన గోడలయందు నీ ఆకారము ప్రతిబింబించుచున్నది. దాని శిఖరము పై చంద్రకళ ప్రకాశించుచున్నది. ఆ భవనములో విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు దేవతలు సపరివారముగా ఉన్నారు. ఆ భవనము ఎంతో గొప్పగా ఉన్నది.

నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధనికరః |
మహేశః ప్రాణేశః తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా || 15 ||


అమ్మా! నీ సౌభాగ్యమేమని చెప్పను ? నీ నివాసము కైలాసము. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారు నిన్ను స్తుతిచేయువారు (వంది మాగధులు). ఈ ముల్లోకాలూ నీ కుటుంబము. సిద్ధులన్నీ నీకు అంజలిఘటించుచున్నాయి. మహేశ్వరుడు నీ ప్రాణేశుడు. ఓ పర్వతరాజపుత్రీ పార్వతీ! నీ సౌభాగ్యానికి సమానమైనది వేరొకటి లేదు .

వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూః భుజగనివహో భూషణవిధిః |
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపోః
యదేతత్ ఐశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా || 16 ||


అమ్మా!  మన్మథశత్రువగు శివుని (సంపద) గురించి అందరికీ తెలిసినదే. ఆయన వాహనము ముసలి ఎద్దు. ఆహారము హాలాహలము. వస్త్రము దిక్కులు. క్రీడాస్థలము స్మశానము. ఆభరణములు పాములు. ( ఇలాంటి శివుడు ఈ జగత్తుకి ఈశ్వరుడు ఎలా అయ్యాడు ?) ఆయన యొక్క ఐశ్వర్యము(ఈశ్వరత్వము) ఓ జననీ! నీ సౌభాగ్యమహిమయే.

అశేషబ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే || 17 ||


అమ్మా!  పశుపతి అయిన శివుడు సహజముగా అశేష బ్రహ్మాండములనూ ప్రళయంతో లయం చేసే స్వభావం ఉన్నవాడు,  స్మశానంలో ఉండేవాడు, బూడిద పూసుకునే వాడు. అలాంటి వాడు అఖిల జగత్తుపైనా కరుణతో హాలాహలాన్ని కంఠంలో ధరించాడు. ఓ కళ్యాణీ, ఈ కరుణ చూపడం నీ సాంగత్యఫలమే అని నేను తలచుచున్నాను.

త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసి వాసేన గిరిశః॥18॥
అమ్మా శైలపుత్రీ! సర్వోత్కృష్టమయిన నీ సౌందర్యమును చూచి మిక్కిలి భయముతో గంగ జలమైపోయెను. అంతట ఈశ్వరుడు ఆ గంగాదేవి ముఖకమలమును చూచి,ఆమె దీనావస్థకు జాలిపడి,తన శిరసున నివాసమిచ్చి,ప్రత్యేక ప్రతిష్ఠను కలిగించుచున్నాడు.

 విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్॥19


హే భగవతీ! అధికమైన చందనద్రవముతో,కస్తూరితో,కుంకుమపువ్వుతో కలిసిన నీ అభ్యంగజలమును(తలంటి పోసుకొను నీరు) మరియు రాలుచున్న నీ పాదధూళిని తన చేతులతో సంగ్రహించి బ్రహ్మదేవుడు దేవలోకసుందరీమణులను(అప్సరసలను) సృష్టించుచున్నాడు తల్లీ!
(అంబిక సౌందర్యాధిదేవత,ఆమె సౌందర్యము సర్వాధిక్యమని సూచన)


వసన్తే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాళిసుభగే
సఖీభిః ఖేలన్తీం మలయపవనాందోళితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి॥20॥


తల్లీ! ఆనందకరమైన వసంతకాలంలో, అన్నివైపులా లతలు ఉన్నది, వికసించిన బహువిధములైన పద్మములు కలది, కలహంసల బారులతో సుందరమైనది మరియు మలయమారుతముచే మెల్లగా కదులు నీరు కలది అగు సరస్సులో చెలికత్తెలతో జలకములాడుచున్న నిన్ను ధ్యానించు వారికి జ్వరపీడ దూరమగును.


॥ ఇతి శ్రీ శంకరాచార్యకృతం  ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.