పరమాచార్యుల అమృతవాణి : కర్మానుష్ఠానము నుండి భక్తి, అందునుండి ముక్తి
ఒకనికి వివాహ వయస్కయైన కన్య వున్నది. కొమార్తెపై అతనికి చాలా ప్రేమ. ముప్పు తిప్పలుపడి తగిన వరుణ్ణి వెదకి అతనికిచ్చి పెళ్ళిచేస్తాడు. పెళ్ళికాగానే అల్లుడు పెళ్ళికూతురిని తన ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. కన్యాదానం చేసేటప్పుడు ఆ తండ్రి హృదయం ఎట్లా ఊగిసలాడుతుందో మనం ఊహించుకోవచ్చును. కన్యకు మంచివరుడు దొరికినాడన్న సంతోషం ఒక ప్రక్క, ఇంతకాలం తన లాలన పాలనలో పెరిగి పెద్దదైన పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉందే, అని చింత ఒక ప్రక్క- అతని మనస్సు ఉద్వేగ పూరితమైపోతుంది. పదిగుమ్మములలో పడిగాపులు గాచి వరాన్వేషణ చేసినదీ ఇతడె- కష్టపడి అప్పూసొప్పూ చేసి పెళ్ళిచేసినదీ ఇతడే- ఇప్పుడు తీరా వివాహమై వెళ్ళిపోతుంటే హృదయం వికలమై కంటతడి పెట్టుకొనేదీ ఇతడే.
మోక్ష స్థితి మనకు లభించినందంటే, మనస్థితికూడా ఈ గృహస్థుని లాంటిదే అని ముముక్షువులంటారు. నిరంతరంగా, అవ్యాహతమైన భజన భక్తితో ముముక్షువు మోక్ష స్థితికి వస్తున్నాడు. కానీ అప్పుడు అతని కొక్క ధర్మసంకటమైన స్థితి ఏర్పడుతున్నది. కన్యాదాత వలెనే ఇతతూ ప్రయాసపడి భక్తిమార్గములో చెప్పబడిన అనుష్ఠానాలన్నీ చక్కగా ఆచరించి చిత్తశుద్ధి ఏర్పడి పూర్ణత్వ మొంది మొక్షస్థితికి వచ్చేసరికి ముందువెనక లాడుతున్నాడు- మోక్షం వచ్చేసరికి భగవంతుడూలేడు. భక్తుడూలేడు. కన్యను వరుని కప్పగించి కన్నీరుకార్చే తండ్రివలె ముముక్షువు బుద్ధి కన్యను భగవ దర్పణం చేసి దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖాన్ని ఒక కవి ఈ విధంగా వర్ణించాడు.
భస్మోద్ధూళన భద్ర మస్తు భవతే రుద్రాక్షమాలే శుభే
హా సోపాన పరంపరే గిరిసుతా కాంతాలయాలంకృతే |
అద్యారాథనతోషితేన విభునా యుష్మత్సపర్యాసుఖా
లోలోచ్ఛేదిని మోక్షనామని మహామోహే నిలీయామహే||
'నాభక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని అనుగ్రహించ బోతున్నాడు. ఇక మీదట నేను విభూతి పూసు కోవడం రుద్రాక్షలను ధరించడం అంటూ వుండదు. పూజ జపం, ధ్యానం మొదలైన సోపాన ప్రక్రియల అవసరం నాకు లేదు. భస్మోద్ధూళనమా! నీకు క్షేమం కలుగుగాక! ఓరుద్రాక్ష మాలా ! నీవు నేనూ ఒకరి నొకరు విడచి పోవలసినకాలం వచ్చింది. మీరు నాతో పాటు వున్నప్పుడు మీరు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్నేహితులైన మిమ్ములను వదలి మోక్షమనే మహామోహంలో మునిగిపోబోతున్నాను! అని కవి అంటున్నాడు-
మోహాన్ని పొగొట్టేదే మోక్షం. కాని మోక్షకారణ సామగ్రులైన భస్మోద్ధూళలన, రుద్రాక్షధారణ, పూజా జప ధ్యానాదికములను వదులునపుడుహృదయం వికలమై మోక్షమే ఒక మహామోహంగా కవికి కనిపిస్తున్నది.
కృష్ణకర్ణామృతం వ్రాసిన లీలాశుకులుకూడా ఇదే విధంగా ఒక శ్లోకం వ్రాశారు. భక్తి ముదిరేకొద్దీ, కర్మ సడలిపోతుందనే విషయం ఈ శ్లోకం వివరిస్తుంది.
సంధ్యావందన భద్ర నుస్తు భవతే భోః స్నాన తుభ్యం నమో
భో దేవాః పితర శ్చ తర్పణవిధౌ నాహం క్షమః క్షమ్యతాం |
యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తంసస్య కంసద్విషః
స్మారంస్మార మఘం హరామి త దలం మన్యే కి మన్యేన మే
'ఓ సంధ్యావందనమా! నీకు శుభ మగుగాక. నీవు నాకు అక్కరలేదు. స్నానమా! నీకు ఒక్క నమస్కారం. దేవతలారా! పితృదేవతలారా ! మీకు తర్పణాదికాలు విడిచే శక్తి నాకులేదు. క్షమించండి. ఎక్కడో ఒక మూల కూర్చొని యాదవకుల భూషణుడైన కంసవిద్వేషిని కృష్ణుణ్ణి స్మరించి నాపాపాలను పోగొట్టుకొంటాను. తక్కిన కర్మలతో నాకేమి పని? 'అని లీలాశుకులు అంటారు.
శాస్త్రచోదిత కర్మలను మనం విధిగా చేయవలసి వున్నది. ఇవి అవసరమా? అనవసరమా? అన్న ప్రశ్నలకు అవకాశంలేదు. అనుష్ఠాలన్నీ విధిగా మనం నిర్వర్తించ వలసినదే. ఇట్లు కర్మానుష్ఠానం చేసిన పిదప క్రమక్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి, చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు సమాహితమై, ఈశ్వరానుసంధాన పటిష్ఠ మౌతున్నది. ఇదే భక్తి. ఇది రెండవస్థితి. భక్తి ముదిరితే జ్ఞానప్రాప్తి. అది చరమస్థితి.
అందుచేత భక్తిని వదలి ముక్తికోసం మనం ప్రత్యేకంగా ప్రాకులాడవలసిన పనిలేదు. మనం చేస్తున్న భక్తియే తుదకు ముక్తియై విలసిల్లుతుంది. భక్తికోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తేచాలు. అందులకే మహానుభావు లందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ- భక్తి భిక్షను పెట్టవే- అని అమ్మవారిని ప్రార్థిస్తూ వుంటారు. ఆ భక్తి మనకు లభించిందంటే, ముక్తి కరతలామలకమే.