Monday, 18 July 2016

రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : కృతజ్ఞత


 
రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : కృతజ్ఞత
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి) 

కధంచి దుపకారేణ కృతేనైకేన తుష్యతి |
నస్మరత్యపకారాణాం శత మప్యాత్మవత్తయా ||
(అయోధ్యాకాండ తొలి సర్గ)

లోకములో కొందరికి, ఒకరికి ఉపకారము చేయు అలవాటు ఉండదు. అనుకొనకుండ వారు మరొక ప్రయోజనమునకై చేసిన పనివలననో, మాటవలనో వేరొకరికి కూడ ఉపకారము జరగవచ్చును. మనసార వారు చేయకపోయిననూ తాము అనుకొనకుండ వారి వలన ఉపకారము తనకు జరిగిననూ రాముడు ఎంతో సంతోషించెడివాడట. అట్టి ఉపకారము ఎంత అల్పమైననూ అధికముగా భావించెడివాడట. అట్టి ఉపకారము ఒక్కసారి జరిగిననూ శాశ్వతముగా దానిని గుర్తుంచుకొని మనసులో పొంగిపోవుచుండెడివాడట. వాని విషయములో కృతజ్ఞతను ప్రదర్శించుచునే ఉండెడివాడుట. ఒకరివలన తనకు అపకారము జరిగిన దానిని గుర్తించువాడుకాడట. అట్టి అపకారము ఒకటి కాదు వంద అపకారములు చేసిననూ ప్రశస్తమైన మనస్సు జ్ఞానము కలవాడు అగుటచే చేసిన అపకారములు గుర్తుండెడివికావట. కృతజ్ఞత రెండు రకములుగా ఉండునని , ఇందునిరూపించినాడు. ఒకడు చేసిన ఉపకారము ఎంత చిన్నది అయిననూ , వాడు అనుకోకుండ చేసిననూ వాని వలన జరిగినది కనుక వానిని మనసులో ఎల్లప్పుడు సంతోషించుట కృతజ్ఞత. ఒకడు అపకారములు వందలకొలదీ చేసినను కోపము లేని సాత్త్వికమైన మనసు కలిగి వానిని మరచిపోవుట కూడ రెండవరకమైన కృతజ్ఞత.

ఒకసారి అపకారము అనుకొనకుండ జరిగిన జరగవచ్చుగాని వందలకొలది అపకారములు అనుకొనకుండ జరగవు కదా! అయినను "నస్మరతి"స్మరించువాడుకాడు. కారణమేమి? మతిమరపు అనెడి దోషమా? కాదు. ఆత్మవత్తయా మంచి మనస్సు కలవాడు అగుటచేత.

ఉపకారము ఎంత చిన్నది అయినను శాశ్వతముగా గుర్తుంచుకొని ఆనందించవలెననియు, అపకారములు వంద చేసినను వానిని మరువవలెననియు మానవులకు శ్రీరాముడు తన ఆచరణలో నిరూపించాడు.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.