Monday 11 July 2016

పరమాచార్యుల అమృతవాణి : ఈశ్వరప్రీతిగా వైదికకర్మాచరణ




పరమాచార్యుల అమృతవాణి :  ఈశ్వరప్రీతిగా వైదికకర్మాచరణ
(జగద్గురుబోధలనుండి)

#వేదధర్మశాస్త్ర పరిపాలనసభ   @శంకరవాణి

ఆచార్యపాదులు ఉపదేశపంచకంలో-

'వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్‌ తే నేశస్య విధీయతా మపచితిః'

అని సెలవిచ్చారు. వైదిక కర్మలు చేయడమే ఈశ్వర పూజా? ఔను. వానిని ఈశ్వర ప్రీతికిగాను చేయాలి. వాస్తవమైన కర్మానుష్ఠానంలో భక్తీ కర్మా యీ రెండున్నూ కలిసియే ఉంటవి. వీని అన్నిటికీ అస్థిభారం పరమేశ్వరార్పణం. 'కృష్ణానుస్మరణం పరమ్‌' అని కడపట మనం చెపుతూఉంటాం. ప్రతి సంస్కారానికీ ప్రత్యేకంగా మంత్రమూ అర్థమూ చెప్పడం కానిపని. అన్నింటికీ సంకల్పమూ అంకురార్పణ అనే అంగాలుమాత్రం ఎప్పుడూ ఉంటవి. వీని అర్థం మనం తెలుసుకోవాలి.

లౌకికులకు ఈ సంకల్పవిషయాదులలో కడు అశ్రద్ద. ఉపాధ్యాయుడు, పురోహితుడు చెప్పుకోపోతున్నాడు కదా మనకేం అని మాటాడక కూచుంటారు. వానికి అర్థం తెలిసి కోవడం ఏమంత పెద్దపని కాదు. అమెరికాలో జరిగే పరీక్షలకు సెలబస్‌ అతిశ్రద్ధగాగమనించేమనకు, లేశమాత్రమయినా శ్రద్ధఅనేది వుంటే యీ విషయాలు అర్థం కాకపోవు.

'య దేవ విద్యయా కరోతి శ్రద్ధ యోపనిషదా, త దేవ వీర్యవత్తరం భవతి' అని ఛాందోగ్యం,
'య దేవ విద్య యేతి హి' అని బ్రహ్మసూత్రము.

కర్మను అర్థంచేసుకుని చేసినామంటే అది ఎక్కువఫలం కలిగిన దవుతుంది. 'వీర్యవత్తరం' అనేటపుడు తరఫ్‌ ప్రత్యయం ఉపయోగించాలి. తెలిఒకొనక చేసినా బలంకలిగిన దవుతుందని దాని కభిప్రాయమని ఆచార్యులంటున్నారు. సంస్కారాలన్నిటికిన్నీ మొదట 'పరమేశ్వర ప్రీత్యర్థమ్‌' అని సంకల్పం చేసికోవాలి, కడపట 'జనార్దనః ప్రీయతామ్‌' అని చెప్పుకోవాలి.

సంకల్పంలో దేశ కాలాలు చెప్పబడుతున్నవి.- 'మమోపాత్త సమస్త దురితక్షయద్వారా పరమేశ్వర ప్రీత్యర్థమ్‌' అని అంటున్నాము. 'నే జేసికొన్న పాపాలు పోవాలి; పరమేశ్వరప్రీతి కలగాలి' అని దాని అర్థం. ఎన్నో పాపాలు చేశాను. అవి ఎత్తరానిబరువై ఉన్నవి. వానిని పోదోలాలి. హృదయం పరమేశ్వరస్థానం. కాని అది కల్మషాలతో నిండిపోయింది. దానిని శుభ్రపరిస్తేనే కాని ఆ యీశ్వరస్వరూపం గోచరంకాదు. అది కనిపించకుండా ఇపుడు ఆభాసగా ఉన్నది. అందుచే అందలి చెత్తా చెదారమూ తీసి బయట పడవేయాలి. ఇట్లా అనుకుంటూనే చెత్తవాములు పెట్టుకోడమే పెద్దపనిగా భావిస్తున్నాము. 'దురితక్షయద్వారా' పాపంపోతే ఈశ్వరునికి ప్రీతి కలుగుతుంది.

ఇన్నికర్మలూ, దీన్ని ఉద్దేశించే చెప్పే మంత్రాలకు ఎంత అర్థమున్నా, ఈ మంత్రార్థం తెలిసికొని పరమేశ్వర ప్రీతి నుద్దేశించి చెపితేనే ప్రయోజన ముంటుంది. ఒక కార్యంలో ఏదో లోపం కలుగుతుంది. దానికి పాచితం చేసుకుంటాము. అకాలసంధ్యకు ప్రాయశ్చిత్తార్ఘ్యము ఇస్తున్నాం. ఆ ప్రాయశ్చిత్తిలోనే లోపం కల్గిందంటే ఏంచేయడం? అన్ని ప్రాయశ్చిత్తాలకున్నూ మేలైన ప్రాయశ్చిత్తం ఒకటి వున్నది. అది కృష్ణస్మరణ. మొదట పరమేశ్వర ప్రీత్యరమ్మనే సంకల్పము, కడపట 'జనార్దనః ప్రీయతాం' అన్న కృష్ణస్మరణామరువరాదు. శివవిష్ణువుల అభేదాన్ని ఈ విషయమే తెలుపుతున్నది.

పుట్టినప్పటినుండి అవసాన కాలమువరకూ మనము పరమేశ్వరస్మరణతో కర్మలను చేస్తూవుండాలి. ప్రతికర్మకూ ప్రత్యేకమైన కాలము, మంత్రము, దేవత ద్రవ్యము ఉన్నవి. వీనికి క్రమము వేర్వేరైనా అన్నటికీ పరమతాత్పర్యంగా ఉండేది పరమేశ్వరార్పణ.

జీవుడు పుట్టాక జాతకర్మచేయాలి. పదునొకండవనాడు నామకరణం. తరువాత అన్నప్రాశం. మొట్టమొడట అన్నముపెట్టే కర్మయిది. వీని నన్నిటినీ పరమేశ్వరప్రీతిగా చేయాలి. గర్భాధానంమొదలు నామకరణ పర్యంతమూఉన్న సంస్కారములు శిశువుకోసం మాతాపితలు చేసేవి. తల్లి ఔషధసేవనం చేస్తే బిడ్డకు దేహపారిశుద్ధ్యం ఏర్పడుతున్నది. అట్లే మాతాపితల చిత్తవృత్తుల ననుసరించి గర్భస్తుడైన జీవుడికి సాత్త్విక స్వభావమో, పాపాభివృద్ధియో కల్గుతున్నది అవయవసన్ని వేశం కల్గేటప్పడు తల్లిదండ్రులకు ఏగుణదోషాలు ఉంటున్నవో అవి లోన ఉన్న జీవుడికీ సంక్రమిస్తవి. మహా భావాల ననుసరించి గుణము లేర్పడుతున్నవి. ఈ కర్మలను సకాలములో చేయకుండా అన్నిటినీ కలిపి చేస్తున్నారు. వైదికులు మాత్రం క్రమంగా చేస్తున్నారు. వారికి అదే జీవనం కనుక. ఇతరులు దేనినీ గమనించడంలేదు. ఆయాకాలాలలో ఆయా మంత్రద్రవ్యయుక్తంగా ఈసంస్కారాలను ఈశ్వరార్పణంగా మనము చేయాలి. అన్నప్రాశనం తరువాత చౌలం. చౌలమనగా శిఖ ఉంచుకోవడం. సత్కర్మలకు శిఖప్రధానం కనుక చౌలముకూడా భగవదర్పితం కావాలి.

ఉపనయనమునకుముందే సంస్కృతజ్ఞానం ఉంటే ఉపనయనమంత్రాలకు అర్థంతెలుస్తుంది. పిల్లలకు చిరుతప్రాయంలోనే దైవభక్తియున్నూ ఏర్పడగలదు. కానీ మనకు ప్రస్తుతం బాల్యంలో ఆస్తిక్యముకుబదులు నాస్తికతయే ఏర్పడుతున్నది. ఉపనయనాది సంస్కారాలు జ్ఞానం వచ్చినపిదప చేసేవి. ఏసంస్కారమయినా దానికేర్పడిన కాలంలో చేయాలి అందుచే పాపపరిహారం అవుతుంది. ఈ సంస్కారాలను ఆచరించడం వల్ల శిష్టత ఏర్పడుతున్నది. దానివల్ల బుద్ధికిచురుకుతనమున్నూ కల్గుతుంది. మన పూర్వీకులు చేసిన సంస్కారఫలితమే రెండు మూడు తరాలవారికి ఆస్థిభారంగా ఉండగలదు. అది దాటి పోయినదంటే నిష్ప్రయోజన మవుతుంది. మనపూర్వీకులు సంస్కారాలను చక్కగా ఆచరించలేదన్న కొరత మనకొక వేళ కల్గినప్పటికీ మన సంతతివారికైనా అట్టికొరతలేకుండునట్లు చూచుకోవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉన్నది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.