శివుని జీవశక్తి అమ్మవారు
పరమాచార్యుల సౌందర్యలహరి వ్యాఖ్య : 1-4
బహుశః మీకు తెలియని విషయం ఒకటి చెబుతాను. "శివ" అనే పదం లోని మొట్టమొదటి అక్షరం "శి" లో "ఇ" అచ్చు ఉన్నది. "శి" అనే అక్షరం "శ" అనే హల్లునకు "ఇ" అనే అచ్చు జోడించటంతో ఏర్పడింది. ఈ "ఇ" / "ఈ" అనే అచ్చు అమ్మవారి పేరు. హల్లులన్నీ శివునివనీ, అచ్చులన్నీ అమ్మవారివనీ సాధారణ నియమం. అందులోనూ అచ్చులలో "ఇ", "ఈ" అచ్చులు సాక్షాత్తూ అమ్మవారి స్వరూపాలు. జడపరబ్రహ్మమునకు ప్రణవమనే పేరు ఉన్నట్లే , శివశక్తులకు - నిశ్చలబ్రహ్మమైన శివుడూ, క్రియాశీలి బ్రహ్మము అయిన అమ్మవార్ల కలయిక - కూడా ప్రణవం ఉన్నది. అందులో శక్తి "ఇ"కారము. అమ్మవారు ఇకారము (లేదా ఈకారము) అనుటకు వేదాలలో ఆధారం ఉన్నది. వైదిక శ్రీసూక్తములో అమ్మవారు "పద్మిని" - హృత్పద్మములోని లక్ష్మీ స్వరూపము. అందులో "నేను ఈకారమైన దానను శరణువేడుతున్నాను" అని ఉంది. "శ్రీ" అనే పదం ఈకారమేగా ?
( పరమాచార్యులు, పురుష, స్త్రీ నామములపై విస్తృతవ్యాఖ్య చేశారు. పురుషనామములు హ్రస్వాంతములుగానూ, స్త్రీనామములు దీర్ఘాంతములుగానూ ఉండుట సాధారణం)
"శివ" లోంచి ఇకారం తీసివేస్తే ఏమవుతుంది ? పురుషనామము కాబట్టి ఇకారమును అకారము చేస్తే ఏమవుతుంది. అత్యంత మంగళప్రదమైన "శివ" శబ్దము అమంగళమైన "శవ" శబ్దమౌతుంది. "శి" లోంచి "ఇ" తీసివేస్తే "శ్(అ)" అవుతుంది. అప్పుడూ "శివ", "శవ"మవదూ ? కాబట్టి ఈశ్వరునికి జీవశక్తినిచ్చేది "ఇ" అచ్చు. దాన్ని తీసివేస్తే ?
ఈ సందర్భంలో నేను మరొక విషయం గ్రహించాను. "ఈశ్వర" నామములో "ఈ" తొలి అక్షరము. వేదాన్తములో ఈశ్వరుడు క్రియాశీలుడైన సగుణబ్రహ్మము. అన్ని క్రియలూ, కృత్యములూ శక్తి బీజమైన "ఈ" అక్షరములోనుండి మొదలవుతున్నాయి. బీజము అంటే విత్తనము. ఒక చెట్టుమొత్తమూ ఒక చిన్న విత్తనములో దాగిఉండగలదో ఒక మంత్రపు శక్తి అంతా ఒక బీజము, లేదా బీజాక్షరములో నిక్షిప్తమై ఉండగలదు.
శివుడు శక్తిరహితుడైనప్పుడు శవము అని మనం అన్నప్పుడు దాని అర్థమేమిటి ? ఇంటి గృహిణి లేకపోతే గృహస్థు ఏమీ చేయలేడు. శక్తిహీనుడు. ఇదివరలో నేను తమిళభాషలో వాడుక చెప్పాను. "నీకు శక్తి ఉంటే వెళ్ళి చెయ్యి. లేకపోతే శివునిలా కూర్చో". దీని అర్థం "ఆమె" లేనప్పుడు "అతని"కి చేయటానికి ఏ పనీ లేదనీ , ఏమీ చేయలేడనీ కదా ? ఎవరైనా సరే శక్తి కోల్పోయినప్పుడు ఏమీ చేయలేనివాడు అవుతాడు. శక్తి కలియకపోతే శివుడైన బ్రహ్మము కూడా అంతే.
బ్రహ్మమునకు తన శక్తి తెలుసుకాబట్టి సృష్టి చేస్తోంది, చేయగలుగుతోంది. బ్రహ్మమునకు "శక్తి" ఉన్నదని తెలియజేసేది శక్తియే కదా ? ఈ విషయమే శ్లోకంలోని తొలిపాదంలో చెప్పబడింది. "శివుడు తన జగద్వ్యాపారమును శక్తివైన నీతో కలిసినప్పుడే చేయగలుగుతున్నాడు. లేకపోతే స్పందించనూలేడు". ఈ విషయము "న ఖలు" (అవును కదా?) అను పదాలను జోడించటం ద్వారా ఇంకా నొక్కి చెప్పబడుతోంది.
శివః శక్త్యాయుతో భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి
"స్పందితుం అపి" (కనీసం స్పందించుటకు, కదలుటకు), "కుశలః న ఖలు" ( చేయలేడు). శక్తి లేకపోతే శివుడు శవముగానే ఉండాలి.
(సశేషం)