Monday, 18 July 2016

పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు


పరమాచార్యుల అమృతవాణి : జగద్గురువులు శంకరులు
(జగద్గురుబోధలనుండి)

తమ లోకోత్తరమైన జీవితం, అపూర్వ మేధాశక్తి, అసమాన త్యాగం, అసాధారణ తపోమహిమల ద్వారా ఆది శంకరులుమరణావస్థలో ఉన్న వైదిక సంస్కృతికి క్రొత్త జీవం పోసి దానిని సుస్థిరంగా నిలబెట్టారు. షణ్మతస్థాపనాచార్యులై జగద్గురువులయ్యారు. మానవజాతికే మహోపకారం చేశారు. వారిసేవకు కృతజ్ఞత చూపేందుకు మనం ఏటేటా వారి జయంతులు జరుపుకొంటున్నాం. ఇది మన కనీసధర్మం. వారిజయంతి వైశాఖశుద్ధ పంచమినాడు వస్తుంది. ఆ రోజు శంకరుల ప్రతిమకు అష్టోత్తర శతనామావళితో బాటు అర్చనచేసి, హోమం చేస్తున్నాం. అష్టోత్తర శతనామావళితో మరో ఎనిమిది నామాలు, 'భవాయదేవాయనమః' 'శర్వాయదేవాయనమః' అన్న నామావళి కలుపుకొని మొత్తం, 116 నామాలతో జగద్గురువులను అర్చిస్తున్నాం. ఆంధ్రప్రదేశంలో నూటపదహార్లతో సన్మానం చేయడం మరి ఆచారమే కదా!

ఆది శంకరులకు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. ఆరువేల మంది ఉండేవారని ప్రతీతి. అందులో నలుగురు ప్రధానశిష్యులు. వారే పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకాచార్యులు, ఈనలుగురినీ నాలుగు ప్రధాన పీఠములలో శృంగేరీ, ద్వారక, పూరి, బదిరికాశ్రమం - నియమించారు. వీరిలో తోటకాచార్యులవారికి చిన్నతనంలో అందరికంటే తెలివితక్కువ, భగవత్పాదుల పూజకు కావలసిన సామగ్రి - బిల్వపత్రం, పూలు, పండ్లు - ఏర్పాటు చేసేపని వీరిది. ఒకరోజు కార్యవ్యగ్రులై పాఠమునకు ఆలస్యంగా వచ్చారట. పుష్పాపచయంలో ఉన్న ఆసక్తి వారికి చదువులో ఉండేది కాదు.

ఎంత ఆలస్యమైనా తోటకాచార్యులు వచ్చే వఱకు ఆచార్యపాదులు పాఠం మొదలుపెట్టేవారు కారు. అట్లా కాచుకొని వుండి చెప్పినా ఆయన మెదడుకు ఎక్కేది కాదు. ఇది చూచి ఇతర శిష్యులు తోటకాచార్యులను చులకనగా చూచేవారు విషయగ్రహణశక్తియే లేనివానికోసం ఆచార్యులవారు వేచి ఉండటం వారికంతగా రుచించేది కాదు. గురువు అంటే తిరస్కారం కాదు. ఒక ఔదాసీన్యం వాళ్ళలో అప్పుడపుడూ ఈ కారణంగా కనిపించేది.

సర్వజ్ఞులైన శంకరులు దీనిని గ్రహించారు. ఒక రోజు బిల్వపత్రం కోస్తూ ఒళ్ళు మరచి నిలుచున్న తోటకాచార్యులలో తమదివ్యశక్తిని నింపారు. అంతటితో అమాంతంగా బుద్ధి వైభవం, వాక్పటుత్వం, కావ్యరచనాశక్తీ తోటకాచార్యులవారికి కల్గింది. ఇతర శిష్యులతో బాటు ఆచార్యులవారు మందమతిఐన శిష్యునికోసం వేచి ఉన్నారు. ఇంతలో ఆ మొద్దబ్బాయి నెత్తిన పూలబుట్ట పెట్టుకొని ఆనందంతో నర్తనం చేస్తూ వచ్చాడట. గురువుగారిని చూడగానే ఆశువుగా, లయబద్ధమైన వృత్తంలో ఒక అష్టకం చదివాడట. ఈ స్తోత్రం విన్న ఇతర శిష్యులు, ఆశ్చర్యమగ్నులయ్యారు.

వారి నోట వెలువడిన శ్లోకాలకు తోటకాష్టకమని పేరు. ఈతోటకాష్టకం, గానానికీ అభినయానికీ అనుకూలంగా ఉంటుంది. ఈస్తోత్రం అర్థసౌందర్యంతో, శబ్దాలంకారాలతో. సర్వాంగసుందరంగా ఉంటుంది. భగవత్పాదుల మహిమను వర్ణిస్తూ ఈ స్తుతితో శుతిస్మృతి పురాణాది వాఙ్మయానికి నెలవైన వారి సర్వతోముఖప్రతిభను పొగడటమేకాక, కరుణావరుణాలయమైన వారి హృదయ సౌందర్యానికి కైమోడ్పునిచ్చారు. రెండుచోట్ల 'భవఏవభవాన్‌' అనియూ, 'పుంగవకేతన' అనియూ పదప్రయోగం చేసి ఆదిశంకరులు సాక్షాత్తు శివస్వరూపులని వర్ణించారు. తోటకాచార్యులు వ్రాసిన వృత్తములు ఆనాటినుంచీ తొటకవృత్తములని వ్యవహరింపబడినవి.

ఈ ఎనిమిదిశ్లోకాలూ శంకరజయంతినాడు పఠించి శిష్యులందరూ ఆచార్యులవారికి ఎనిమిది నమస్కారాలు చేయడం ఆచారమైంది. ఆదిశంకరులను జగద్గురువులని అంటున్నాం. అంటే జగత్తు కంతటికీ గురువులన్నమాట. ఈ బిరుదును ఈనాడు ఆయన స్థాపించిన ప్రతిపీఠాధిపతికి వ్యవహరిస్తున్నారు. అందరు పీఠాధిపతులూ జగద్గురువులే. ఒక జగత్తుకు ఇంతమంది జగద్గురువులా? ఇదెట్లా సమన్వయమౌతుంది? ఈనాడు ప్రపంచములో అద్వైతమతమే కాక ఎన్నో మతాలున్నాయి. ఆ మతాల వారంతా వీరిని జగద్గురువులని ఒప్పుకోవాలి గదా! ఒప్పుకోవటం లేదే? మరి జగద్గురువు అన్నమాట వెక్కిరింతగా మారటం లేదా? నిజమే. అలా అనకూడదు. వాస్తవానికి అది దూరం. ఈనాడు దేశంలో ద్వైతం, విశిష్టాద్వైతం, వీరశైవం, జైనం, క్రెస్తవం, ఇస్లాం - ఇన్ని మతాలున్నాయి. ప్రతిమతమూ తమ శ్రేష్ఠత్వం ఉగ్గడిస్తుంది. కొందరు మా మతంలో చేరితే మీరు నేరుగా స్వర్గం వెడుతారు. లేకపోతే శాశ్వత నరకమే అని అంటారు.

ఇట్లా చెప్పే వారి మతం రెండువేల ఏళ్ళకు ముందు పుట్టింది. మరి వారు చెప్పేదే నిజమైతే వీరిమతం పుట్టకముందు ప్రపంచంలో ఉన్న ప్రాణులంతా ఏమైనట్లు? అంతకుముందు. ఆ మతం లేదు కనుక స్వర్గనరకాలు లేనట్టేనా? అప్పటి మానవాళి అంతా మరణానంతరం ఏమైనట్లు? శంకరాచార్యలవారిని జగద్గురువులంటున్నాం. వారి కాలంలో అద్వైతమతం ఒక్కటేనా ఉంది? ఇతర మతాలు కూడా ఉన్నాయి కదా? వీరి జగద్గురుత్వాన్ని ఇతర మతాలు అంగీకరించాయా? లేదే? మరి వారెలా జగద్గురువులయ్యారు? నేను వారిమతంలోనే ఉంటూ, ఆచార్యులవారి జగద్గురుత్వాన్ని ప్రశ్నిస్తూ పూర్వపక్షం చేస్తున్నాను. అందులోనూ ఆమహానుభావుని జయంతి సందర్భంలో ఆయన గొప్పతనాన్ని శంకించటం అపచారం కదూ?

ఆదిశంకరులకు పూర్వం మరెవరైనా జగద్గురువులని కీర్తింపబడ్డారా?

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణంవందే జగద్గురుం||


అన్నశ్లోకం శ్రీకృష్ణపరమాత్మకూడ జగద్గురువని తెలుపుతున్నది. శ్రీకృష్ణుని కాలంలో వైదికమతం కాక మరేమీ లేవా? మత సంఘరణ అప్పుడు లేదా? త్రయూ, సాంఖ్యం, యోగం, మొదలైన మతాలుండి నట్లున్నదే? మరి శ్రీకృష్ణుడు వీనినంతా ప్రచారం చేశాడా? ఏదో ఒక మతాన్ని నమ్మి ప్రచారం చేసే జగద్గురువు ఇన్ని మతాలను ఎలా అభిమానిస్తాడు? కాగా ఇన్ని మతాలున్నపుడు ఒక్కమతానికి చెందినవాడు జగద్గురువని ఎలా అనిపించుకోగలడు? మతగురువుగా ఆయన వేదాలకూ, వేదాంతానికి ఏమి భాష్యాలు వ్రాశారు? ఏదో కౌరవ పాండవ యుద్ధానికి సారథ్యం నడపిన కృష్ణుడు జగద్గురువేమిటి? ఆచార్యుల గురుత్వమే సందేహంలో ఉన్నపుడు, ఇప్పుడు కృష్ణుడు జగద్గురుత్వమూ సంశయములోని కొచ్చింది. ఏమిదారి?

శ్రీకృష్ణుని కాలంలో యోగం, సాంఖ్యం, పాశుపతం అనే మతాలున్నాయి. అసలు మనపురాణాలలో బృహస్పతి అనే మహామేధావి ఒక నాస్తిక మతాన్ని భార్హస్పత్యమని సృష్టించి ప్రచారం చేసినాడు. ఈనాటి మెటీరియలిజం - ఆనాటి బార్హస్పత్యమే. అందులో మేటర్‌కే ప్రధానం. ఇట్లా కృష్ణునినాడు కూడా అనేక మతాలున్నాయి. శ్రీకృష్ణుడు ఆ మతాలను ప్రచారం చేయలేదు. మరి ఆయన జగద్గురువు ఎలా అయ్యాడు? ఇందుకు గీతలో చక్కని సమాధానాలు కనిపిస్తవి.

భగవద్గీత వేదోపనిషత్సారం. కఠ, ముండకోపనిషత్తులలోని వాక్యాలనే గీతలో శ్రీకృష్టుడు నిబద్ధించాడు. ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చును. కాగా మతగ్రంథకర్తగా కూడా ఆయనను పేర్కొనవచ్చును. గీత, వేదా , వేదాంత ఆగమశాస్త్ర పురాణాదులు తరచి వడగట్టిన సారమే.

అందులోనే పరమాత్మ ఏయే మతాలను ఎవరెవరు అనుసరిస్తున్నారో, వారికి ఆయామతాలలో శ్రద్ధాసక్తులనూ, విశ్వాసాన్నీ వృద్ధి పొందిస్తున్నానని కంఠోక్తి గావించారు. అసలు మతమన్న దానికి పునాది రాయి విశ్వాసం. మతమనే మాటకు అర్థమే అది. అలాంటి శ్రద్ధనూ, విశ్వాసాన్ని ఆయా మతస్థులకు శ్రీకృష్ణుడు కలిగించాడంటే, ఆయన జగద్గురువు కాకుండా ఎట్లా ఉంటాడు?

మరి శంకరభగవత్పాదుల మాట ఏమి? వారి జగద్గురుత్వం తర్కానికి నిలబడుతుందా? నేనూ ఆకోవకు చెందినవాడిని కనుక, వారి జయంతి జరుపుకొంటున్నాము కనుక, ఎలాగో కష్టపడి దానిని సమర్థించాలి!

ఆచార్యుల వారి కాలంలో అనేకమతాలున్నాయి. వారు ప్రచారం చేసింది అద్వైతం. అదికాక ఆనాడు పూర్వమీమాంస, బౌద్ధం, జైనం, చార్వాకం (బార్హస్పత్యం) పాశుపతం, శాక్తం, కాపాలికం మొదలైన వైదిక, అవైదిక మతాలుండేవి. ఐనా వారు జగద్గురువులే. ఆదిశంకరులకు షణ్మతస్థాపనాచార్య అనే బిరుదు కలదు. వారు చేసిన చమత్కారం ఒకటి ఉంది. శ్రీకృష్ణుడు మతాంతరాల ఉనికిని ప్రత్యేకంగా అంగీకరిస్తూ తాను వానికంతటికీ మూలమని నిరూపించుకొన్నారు. కాగా మన ఆచార్యులు ఒక మెట్టు పైకి వెళ్ళి. ఇతర మతములకూ తమ వైదిక అద్వైతానికీ చక్కని సమన్వయం సాధించారు. చార్వాకం' విజ్ఞానవాదం మొదలైనవానిలో ప్రతిదానిలోనూ అంతో ఇంతో అర్థం లేక పోలేదు. ఏమతానికి తగిన తర్కపాటవం, ఆమతానికి ఉండనే వుంటుంది. తర్కం అంటే బుద్ధికి ఒరిపిడి. అది త్యాజ్యంకాదు. ఒక ఆలోచన, చింతన, చర్చ జరిగేందుకు కొంత ప్రయత్నం పట్టుదల, బుద్ధివైభవం అంటూ ఉండకతప్పదు. దాని పర్యవసానం ఎలా ఉన్నా, ఆప్రయత్నం, వారిబలం దానిలోని మంచీ - పరిమితమైనా సరే - సోమరితనం కంటే మేలేకదా? దానిని మనం ఎందుకు తిరస్కరించాలి? గర్హించాలి. అంత వరకూ దానిని స్వీకరించవలసినదే కదా?

ఇట్టి వాస్తవిక దృక్పథంతో ఆదిశంకరులు, ఇతర మతాల నన్నిటినీ, ఒకనిశ్శ్రేణి (నిచ్చెన)గా గ్రహించి, క్రిందమెట్లు ఎక్కితే కానీ పై మెట్టు చేరుకొలేమనీ, భౌతిక విజ్ఞానవాదం చేసే మతాలన్నీ అద్వైతస్థితికి తీసుకొనిపోయే సోపానాలనీ, వివిధ ఉన్నతోన్నత దశలనీ, సిద్దాంతీకరించి షణ్మత స్థాపనాచార్యులయ్యారు. వారి మతానికి, శ్రుతిస్మృతి పురాణాదులు ఆధారం. దాన్నే స్మార్తం అనీ శంకరమతానుయాయులను స్మార్తులనీ అంటాం. ఇందులో సంకుచితత్వానికి తావేలేదు. ఈనాడు స్మార్తులలో నిలువు బొట్టువారు, అడ్డబొట్టువారూ, విభూతిధారులూ, అంగారతిలక ధారులూ ఉండేందుకు వీలుంది. శివకేశవులు, సూర్యుడు, శక్తి గణపతి వీరంతా స్మార్తులకు వందనీయులు. భగవత్పాదులవారు నిర్గుణోపాసనగూర్చి దర్శన గ్రంథముల వ్రాయుటేకాక, సగుణోపాసనకు ఉపయుక్తములయ్యే చక్కని స్తోత్రరత్నా లెన్నో వ్రాశారు. ఇట్లా అన్ని మతాలనూ అంతర్లీనం చేసుకొని అద్భుత ప్రాణశక్తితో వెలుగొందే విశ్వమానవమతాన్ని స్థాపించిన ఆచార్యులు జగద్గురువులగుటలో ఏవిధమైన సందేహమూ లేదు. అందుచేత శంకరభగవత్పాదుల జగద్గురుత్వం తిరుగులేనిది.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.