రామునినుండి మనం నేర్చుకోవలసిన గుణాలు : స్వధర్మాచరణ
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వదీపికా వ్యాఖ్యనుండి)
కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే |
మన్యతే పరయా కీర్త్యా మత్స్వర్గఫలం తతః ||
(అయోధ్యాకాండ తొలి సర్గ)
రాముడు ఇక్ష్వాకు వంశమునకు తగిన దయ, శరణాగతరక్షణము మున్నగు ధర్మములను ఆచరించుటలో పూనికగల బుద్ధి గలవాడు. క్షత్రియధర్మమును గౌరవముతో పాలించువాడు. ధర్మమునకు, సత్పురుష్లకు, ఆపద కలిగినప్పుడు, దానిని ఎదిరించి తొలగించుట దుష్టులను, అధర్మమును నిగ్రహించుట ప్రజాపాలకుడగు క్షత్రియునకు స్వధర్మము. దానిని ఆయన గౌరవముతో పాలించువాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అయి ఉండియూ దానిని ప్రదర్శించుట కంటే తాను పుట్టిన కులమగు ఇక్ష్వాకువంశపు ధర్మము ఆచరించుటయే గొప్ప అని భావించువాడు. అట్లు తన ధర్మమును తాను ఆచరించుట వలన ఈ లోకములో కీర్తియు, శరీర పతనానంతరము స్వర్గము లభించునని అతని విశ్వాసము. అందుకే స్వధర్మాచరణనకే ప్రాధాన్యమునిచ్చేవాడు.