Monday 18 July 2016

పరమాచార్యుల అమృతవాణి : మానవాళి మార్గదర్శి వేదవ్యాసుడు



పరమాచార్యుల అమృతవాణి : మానవాళి మార్గదర్శి వేదవ్యాసుడు
(జగద్గురుబోధలనుండి)

జయతిపరాశర సూనుః సత్యవతీహృదయనందనోవ్యానః,
యస్యాస్య కమలగళితం వాజ్మయ మమృతం జగత్పిబతి.


మన అనాదిమతానికి అస్థిభారం వేదాలు. అవి భగవన్ని శ్వాసాలని మన నమ్మకం. ''వేదోఖిలో ధర్మమూలం'' అని మనుమహర్షి చెప్పుతున్నాడు. మన పూర్వులవలె మనకు తెలివిలేదు. పైగా మనకు ఆయువు అల్పం. దీనిని తెలిసే వ్యాస భగవానులు బహువిస్తృతమైన వేదరాశిని ఒకడయినా పఠింపజాలడని నాలుగు భాగాలుగా విభజించి పైల, వైశంపాయన, జైమిని, సుమంతులను నలువురు శిష్యులకు ఇచ్చారు. ద్వాపర యుగంలో వేదోద్ధరణకై  భగవంతుడే స్వయంగా సత్యవతీ పరాశరులకు పుత్రుడై జన్మించాడు. ఈ నాలుగు భాగాలనే ఋగ్యజుస్సామాథర్వణములు అని పేర్కొంటున్నాము.

''క్షీణాయుషః క్షీణసత్వాన్‌ దుర్మేధాన్‌ వీక్ష్యకాలతః,
పరాశరాత్‌ సత్యవత్యాం అంశాంశకలయా విభుః,
అవతీర్ణో మహాభాగః వేదం చక్రే చతుర్విధమ్‌.''


అందుచేత ఏ సందర్భంలోగానీ, మనం వేదాలను మరచిపోరాదు. అధ్యయనంవదలిపెట్టరాదు. పూర్తిగా మనం అధ్యయనం జేయజాలమనియే వ్యాసభగవానులు వేద విభజన చేసింది. ఒక శాఖనైన మనం అధ్యయనం చేయాలి.

యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయ ప్రథమ ప్రశ్నములో శిష్యునికి గురువు కొన్ని ఆదేశాల నిస్తున్నాడు. భావి జీవితంలో శిష్యుడు ఏ విధంగా నడుచుకోవాలో తెలుపుతున్నాడు. 'సత్యంవద ధర్మంచర' అనునవి ఆ దేశాలలో మొదటివి.

వేదవిజ్ఞాన వ్యాప్తికోసమే ఇతిహాసపురాణాల ఉద్దేశం. 'ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌' ఈఉద్దేశంతోనే వ్యాసులు సత్యవాక్యపరిపాలన, ధర్మాచరణ చేసి, ఐహికాముష్మికఫలాలను నరుడు ఎట్లు పొందగలుగుతాడో భారత-ఇతిహాసమూలంగా వ్యక్తపరిచినారు. వేదాలలో సమాన గౌరవం కల్గినది కాబట్టియే భారతం పంచమ వేదమని ప్రశస్తినొందినది.

ఈ క్రిందిశ్లోకం వ్యాసమహరులవారికి మనం ఎట్లు ఋణపడి యున్నామో తెల్పుతుంది.

నమోస్తుతే  వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర !
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః.


మహాభారతమనే నిక్షేపంలో భగవద్గీత ఒక అమూల్యమైన రత్నం. తైత్తరీయ తృతీయ ప్రశ్నములో చెప్పబడిన బ్రహ్మవిద్గుధములనే భగవద్గీత వర్ణిస్తున్నది. మనం ఆధ్యాత్మికోన్నతిని ఎట్లు అందుకోగలమో ఈవర్ణన ఉపదేశిస్తున్నది.

భగవద్గీతమూలంగా వ్యాసులు ఫలాభిసక్తి లేక స్వకర్మానుష్ఠానం చేస్తూ చిత్తశుద్ధిని సాధించాలనీ, తమ్మాలంగా జ్ఞానం పొందలనీ ఉపదేశిస్తున్నారు. కర్మమార్గాన్నొక్కటే కాక, భక్తిమార్గాన్ని కూడా మనకు చూపుతూ-

''మన్మనా భవ మద్భక్తః ! మద్యాజీ మాం నమస్కురు''

నీమనస్సును నాపై లగ్నంచేయి, నాపైభక్తికల్గియుండు. ''నన్ను పూజిస్తూ, నాకు నమస్కరిస్తూ జీవితం గడిపినట్లయితే నన్ను పొందగల్గుతావు'' అని ఉపదేశిస్తున్నారు.

ద్వాదశాధ్యాయంలో ఈక్రింది శ్లోకమున్నది.

''అథ చిత్తం నమాధాతుం స శక్నోషి మయి స్థిరం,
అభ్యాసయోగేన తతో మాం మిచ్చాప్తు ధనంజయ.''


మన మనోదౌర్భల్యాన్ని గుర్తించి ఏన్నో సులభోపాయాలు తెలుపుతూ, క్రమంగా, సులభంగా నిశ్రేయసం ఎట్లు పొందగలమో ఆ కరుణాళువు వివరించినారు.

కలియుగంలో మనకు ఎన్నో చిక్కులు, ఎన్నో బంధాలు, మనశ్చాంచల్యం కలిగించే విషయప్రపంచం విస్తారంగా ఉన్నది. భక్తికంటే భిన్నమైన ఇతర మార్గాలను మనం ప్రొక్కడంకష్టం. భక్తిమార్గం సులభమని పురాణాలూ చెప్పుతున్నవి. 'కలే ర్తోషనిధేః రాజన్‌, అస్త్యేవైకో మహాన్గుణః, అని వ్యాసభగవానులే అంటున్నారు. భాగవత పురాణాన్ని సృష్టించి భక్తిమార్గంలో భగవత్ర్పాప్తి పొందేవిధం వారు విశదీకరించారు.

స్వధర్మంఅనుష్ఠించి మనం చిత్తశుద్ధిని సాధించాలనేదే వారి ఉపదేశం. స్వధర్మం వారివారి గుణాలపై జీవితంలో వారివారి భగవద్భక్తిని పెంపొందించుకోవాలి. భగవద్భక్తి కలుగవలెనంటే చిత్తశుద్ధి ఉండాలి. భగవద్భక్తి వృద్ధిఅయ్యేకొద్దీ భగవదనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ భగవదనుగ్రహం కలగనిదే అద్వైతజ్ఞానం సిద్ధించదు.

'ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా' అద్వైతజ్ఞానం మనం క్షుణ్ణంగా నేర్చుకొనవలెననే ఉద్దేశంచేతనే వ్యాస భగవానులు బ్రహ్మసూత్రాలు రచించింది. ఉపనిషత్సారమే బ్రహ్మసూత్రాలు. సందేహవిచ్ఛేదానికి బ్రహ్మసూత్రాలకంటే వేరుమందులేదు. వేదాంతం పఠించేవారందరూ తమ కృతజ్ఞత తెలుపడానికి ఈశ్లోకం వల్లెవేస్తూంటారు.

''బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే.
జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతే హరేః''.


ఈవిధంగా వేదవిభజన, మహాభారతరచన అందులో గీతోపదేశం, భాగవతపురాణ సృష్టి, బ్రహ్మసూత్రాలూ చేసి భగవానులు వేదవ్యాసమహరులు మనలను వారి ఋణంలో ఎల్లకాలమూ ఉండేటట్లు చేశారు. ఆయన వాజ్మయసృష్టిలో ప్రతివానికిన్నీ ఏదో ఒకటి లాభించక తప్పదు. ఉపాసనా మార్గములలో ఆయన విడిచిపెట్టింది ఏదీలేదు.

ఆయన ఒక అసమాన మార్గదర్శి. ఏకాలంలోకాని, ఏదేశంలోకాని ఆయనను పోలినవాడు ఇక జన్మించబోడు. సమస్త మానవానీకమూ అసత్తునుంచి సత్యానికీ, నమస్సులో నుండి జోతిర్మయ ప్రపంచానికీ, మృతువునుండి అమృతత్త్వానికీ ఏవిధంగా పోగలదో, ఆ బాటను చూపించినవారు వ్యాసమహర్షులు.

భారతవరంలో ముఖ్యంగా హిందువులకు ఆయన ఒక మహోన్నత హిమవత్‌ శృంగము. ఆ శిఖరంనుండి మన అనాది మతమనే జీవనదులు ధర్మ, కర్మ మార్గవైవిధ్యంతో ప్రవహిస్తుంటవి. భవతప్తులమైన మన హృదయభూములను కేదారములుగా మార్చివేయ గలుగుతవి.

అందుచేత మనం ఏశాఖకు చెందినాసరే, ఏమార్గాన్ని అవలంబించినాసరే వ్యాసమహరులవారి ఋణం మాత్రం తీర్చుకోలేము. అందుచే అనుదినమూ అయనను స్మరించవలసిన విధి మనకు ఎంతైనా వున్నది.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.